May 12, 2024

లాంతరు వెలుగులో… ఆర్టిస్ట్ సరస్వతి

unnamed

1. సరస్వతిగారు ముందుగా మీ వివరాల్లోకి వెళ్లేముందు చిన్న ప్రశ్న.. మీ చిత్రాలను గమనిస్తే మీరు ఎక్కువగా కృష్ణుడిని  చిత్రించారు. దానికి గల కారణం చెప్తారా??

జ. దశావతారాల్లో కృష్ణుడిది ఎనిమిదవ అవతారం. ఈ అవతారంలో ఆ దేవదేవుడు ఒక సామాన్యమానవుడిగా జన్మించి, యాదవుల ఇంట బాలుడై, గోపాలుడై అల్లరి చేస్తూ పెరిగాడు. ఒక చిలిపి దొంగగా, ఒక బాధ్యతగల పౌరుడిగా, తల్లిదండ్రులకు ముద్దుబిడ్డగా,  ప్రేమికుడిగా, స్నేహితుడిగా, హితుడిగా , అందరినీ ఆదుకునే సమర్ధవంతుడైన నాయకుడిలా అంటే ఒక వ్యక్తి  ఏ విధంగా ఉండాలో అలా ప్రవర్తించాడు. దేవుడు ఎక్కడో లేడు ప్రతీ మనిషిలో ఉన్నాడు అని  అన్నీ తానై నిరూపించాడు. కృష్ణావతారంలో మనిషి  మనిషికి చేసే ఏ సహాయమైనా దేవుని తత్వమేనని బోధించాడు.

2. మీ గురించి చెప్పండి.. మీ బాల్యం, చదువు, కుటుంబం…

జ. మాది మహబూబ్ నగర్ జిల్లా.  ఆమనగల్లు అనే ఊరు. పుట్టింది, పెరిగింది అక్కడే..అమ్మ జానకమ్మ, నాన్న పేరు పరంధాములు. మేము 6 మంది ఆడపిల్లలం, నేను మూడవ సంతానాన్ని. ఇంటర్ వరకు ఊర్లోనే చదువుకున్నాను. ఇంటర్లో పెళ్లి కావడంతో ఆ తర్వాత హైదరాబాదు వచ్చాను. ఇక్కడే JNTUలో BFA లో చేరాను. 2002లో నా కోర్చు పూర్తయింది. కాని చాలా గ్యాప్ తర్వాత 2010లో JNTUలో MFA పూర్తి చేసాను. మావారి పేరు పాండు. పాప పూజ..

???????????????????????????????

3. చిత్రకారుల్లో ఎక్కువగా పురుషులే ఉంఢడం గమనిస్తున్నాం. కాని మీరు ఒక మహిళగా ఈ చిత్రకళలో   మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ రంగం ఎంచుకోవడం గురించి మీ ఆలోచన, అభిప్రాయం…

జ. పురుషులకు ఉన్నంత స్వేచ్ఛ స్త్రీలకు లేదు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు అందరూ సమానమే అని చెప్పొచ్చు..

4. మీ చిత్రకళకు మీ కుటుంబం నుండి ఎటువంటి  ప్రోత్సాహం, సహకారం లభిస్తోంది. ఈ కళనే మీరు వృత్తిగా స్వీకరించారా? లేక వేరే ఉద్యోగం చేస్తున్నారా?

పెళ్లికి ముందు తల్లిదండ్రులనుండి కొంత  ప్రోత్సాహం ఉండేది. ముఖ్యంగా వాళ్లకు ఈ చిత్రకళ గురించి ఏమీ తెలియదు. వద్దని చెప్పేవాళ్లు కాదు. అవునని చెప్పేవాళ్లు కాదు. అంతా నా ఇష్టపూర్వకంగానే చేసాను. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రోత్సాహం అనేది సంపన్న కుటుంబాలలో అయితే ఒకలాగా, మధ్యతరగతి కుటుంబాలలో అయితే ఒకలాగా ఉంటుంది. మధ్యతరగతి వాళ్లకు ఈ కళ గురించి అంత అవగాహన ఉండదు. ఈ పెయింటింగ్స్ వల్ల ఎంత సంపాదిస్తారు అనే విషయం మాత్రమే వాళ్లు ఆలోచిస్తారు.  కాస్త సంపన్న కుటుంబాలలో మాత్రం కళ పట్ల మంచి ఆవగాహన, అభిమానం ఉంటాయి. చిత్రకళ యొక్క విలువ కూడా వాళ్లకు తెలుస్తుంది.  అయినా ఈ చిత్రకళ  కావాలనుకుంటే , నేర్చుకుంటే వచ్చేది కాదు.  అది దేవుడిచ్చిన వరం అని నా నమ్మకం. చిన్నతనంలో నాకు తెలియకుండానే  లక్ష్మీదేవి, వినాయకుడు మొదలైన  దేవతల బొమ్మలు వేసేదాన్ని.  పెయింటింగ్ అంటే మాత్రం చాలా ఇష్టం ఉండేది, ఇప్పటికీ ఉంది కూడా. ఆ ఇష్టమే నాకు బ్రతకడానికి దారి చూపింది.

119

5. మీ చిత్రాలు, వాటి శైలి  గురించి చెప్తారా??

ప్రారంభంలో నా చిత్రాలు ఎక్కువగా తెలంగాణ ప్రాంతపు ఆడవాళ్ల మీద , వాళ్లు చేసే పనుల మీద ఎక్కువగా కేంద్రీకరించి ఉండేవి.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆకులు,  వాటిలో కథకు సంబంధించిన విషయం మాత్రం  సరస్వతి ఆకు మీద ఉండే తెలియని ఆకారాలు (లైన్‌లు).. ఈ విధంగా చేయడానికి కారణం అయింది. కాలక్రమేణా అదే నాకు ఒక  ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకోవడానికి కారణం అయింది.

DSC00123

6. మీ చిత్రాలకు ఎటువంటి ధీమ్స్ తీసుకుంటారు. కాన్వాస్ మీద చిత్రం వేయడం ప్రారంభించేముందు మీలో జరిగే ప్రిపరేషన్ ఎలా ఉంటుంది.. ఎలాటి శోధన చేస్తారు..  ఒక పెయింటింగ్ వేయాలనుకున్న తర్వాత ఎలా వేయాలని  ఆలోచిస్తారా? మీలో కలిగిన ఆలోచనకు చిత్రరూపమిస్తారా??

జ. నాకు శ్రీకృష్ణుడంటే చాలా ప్రేమ, అభిమానం..నేను ముఖ్యంగా “ శ్రీ కృష్ణ భగవానుడు “ అనే పుస్తకం ఆధారంగా తీసుకుని, అందులోని వివిధ అంశాలను, ముఖ్యమైన సంఘటనలు మొదలైన విషయాలను క్షుణ్ణంగా ఆవగాహన చేసుకుని అప్పుడు పెయింటింగ్ మొదలెడతాను. ముందుగా కొన్ని Key Sketches వేసుకొని అందులో ఏ composition బావుంటుందో చూసుకుని దాన్ని కాన్వాస్ మీదకు తీసుకుంటాను.  Canvas, Acrylic Colors, Pen Lines వాడి పెయింటింగ్ వేస్తాను.

7. మీకంటూ ఒక ప్రత్యేక శైలిని ఎలా, ఎప్పుడు ఏర్పరుచుకున్నారు??

జ. BFA తర్వాత చాలా రోజులు Free Lands చేసాను. తర్వాత చీరల మీద Figurative Works ( Rs.5000) చేసేదాన్ని. అది చేస్తూనే పెయింటింగ్స్, డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని.

37

8. మీకు ఇష్టమైన చిత్రశైలి ఏది??

జ.మొదట నేను Telangana Tradition మీదే ఎక్కువగా చిత్రాలు వేసాను. ఆ తరువాత గొల్లలు, వాళ్ల ఆవులు కాచే విధానం, ఆవులను కాసేటప్పుడు మురళి వాయించే విధానంలోకి వెళ్లిపోయాను. ఆ తరువాత complete mythology లోకి వెళ్లిపోయాను.

36

9. మీకు నచ్చిన/ఇష్టమైన/ స్పూర్తినిచ్ఛే చిత్రకారులెవ్వరు? ఎందుకు?

జ.నిజం చెప్పాలంటే పుస్తకాలు చదివే అలవాటు పెద్దగా లేదు. నా  పరిధిలో ఉన్నంతవరకు చెప్పగలను. మొదట నేను లక్ష్మా గౌడ్ సార్ వర్క్స్  చూసాను. ఆయన వర్క్ లో లైన్ డ్రాయింగ్ (transparence) నన్ను ప్రభావితం చేసింది. ఆ తరువాత లక్ష్మణ ఏలే సార్ వర్క్ లో తెలంగాణ tradition నాకు చాలా బాగా నచ్చుతుంది. రమేష్ గొర్జాల వర్క్స్ కూడా నన్ను ప్రభావితం చేసాయి.

10. ఈ రంగంలో చిత్రకారుడికి సంపూర్ణ స్వేచ్ఛ ఉందంటారా??  ఆర్టిస్టుకు నచ్చిన చిత్రాలు, కళారాధకులకు నచ్చిన చిత్రాలు అంటూ వేర్వేరుగా ఉంటాయా???

జ. చిత్రకారులకు స్వేచ్ఛ ఎప్పుడూ ఉంటుంది. ఇక చిత్రాల విషయానికొస్తే అది ఆయా చిత్రకారుల మీద ఆధారపడి ఉంటుంది. కొందరు వాళ్లకు నచ్చింది వేస్తారు. కొందరు చిత్రకారులు వాళ్లకు నచ్చి, సమాజానికి నచ్చే విధంగా చిత్రాలను వేస్తారు. నా దృష్టిలో మాత్రం కళారాధకులకు, కళాకారులకు నచ్చినట్టు పెయింటింగ్స్ వేస్తేనే బావుంటుంది. అఫ్పుడే ఆ కళాకారుడికి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తుంది..

92

11. కొన్ని వర్ణాలు కొన్ని భావాలకు ప్రతీక అంటారు. చిత్రకళలో రంగులకు గల ప్రాముఖ్యం ఎటువంటిది?

జ. చిత్రకళకు వర్ణాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ ప్రతీ రంగుకు ఒక భావం ఉంటుంది. Figurativeలో కూడా ఒక రకంగా రంగులు(abstract)  ప్రాణంలాంటివి.. Abstract పెయింటింగ్ లో రంగులు ప్రముఖ పాత్ర వహిస్తాయి..

12. మీ చిత్రాల్లో మీకు చాలా ఇష్టమైన చిత్రం ఏది? ఎందుకంతగా నచ్చింది??

జ. నా చిత్రాలు అన్నీ నాకు నచ్చినవే. ఒక పెయింటింగ్ వేసేటప్పుడు అప్పటికి అది చాలా బాగుంది అనిపిస్తుంది. దాని తర్వాత వేసిన పెయింటింగ్ కూడా చాలా బావుంది అనిపిస్తుంది. రోజు రోజుకు వర్క్ లో improvement ఉంటుంది. ఆలోచనలు మారుతూ ఉంటాయి. డ్రాయింగ్ లో కూడా improvement ఉంటుంది. కాని ఈ  చిత్రం మాత్రం నాకు చాలా నచ్చింది..

best pic

 13. మీ వర్క్ లో మీరు మరచిపోలేని సంఘటన కాని, స్పందన కాని ఉన్నాయా?

జ. Muse Art Galleryలో  ఒకసారి నా సోలో షో జరిగినప్పుడు Shelture Display చేసాను. నా వర్క్స్ కు మంచి స్పందన వచ్చింది. గవర్నర్, వాళ్ల సతీమణి కూడా నా వర్క్స్ కు చాలా మెచ్చుకున్నారు. రాజ్ భవన్ లో పెట్టడానికి కూడా కొన్ని చిత్రాలను ఎంపిక చేసారు.  ఆ ప్రదర్శన వల్ల నాకు, నా చిత్రాలకు మంచి పేరు , గుర్తింపు వచ్చింది.

14. ఈ చిత్రకళారంగంలో మీకు నచ్చింది, నచ్చనిది ఏంటి??

జ. నచ్చింది.. పెయింటింగ్స్ వేస్తుంటే నన్ను నేను మర్చిపోతాను.  బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నాదైన లోకంలో ఉంటూ చిత్రాలు వేసుకుంటాను.   జివితంలో ఉండే కష్టాలు, బాధలు మరచిపోయి వర్క్ లో లీనం అవ్వడం వల్ల కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు.

23 14

నచ్చనిది.. దీనివల్ల రిలేషన్స్ దూరం అవుతున్నాయి. నా కళను తప్పుగా భావిస్తున్నారు, నన్ను తప్పుగా అనుకుంటున్నారు. అది మనసుకు చాలా కష్టంగా ఉంటుంది..

15. చివరిగా మీ లక్ష్యం ఏమిటి? ఇంకా ఏం చేయాలి, నేర్చుకోవాలి, సాధించాలని అనుకుంటున్నారు…

జ. లక్ష్యం అంటూ ఏమీ లేదు. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ బొమ్మలేసుకుంటూ ఉండేదాన్ని.  చిన్న వయసులోనే పెళ్లి అయిన తర్వాత అంతా చీకటిగా అనిపించింది. నా దగ్గర ఉన్న “కళ “ అనే చిన్న లాంతరు మాత్రమే ఉంది. అది పట్టుకుని ఎటువెళ్లాలో తెలీక, తేల్చుకోలేక చీకట్లో నిలుచున్నాను. నేను నిలుచున్న స్థలంలో ఒక అడుగు వేసేటంత వెలుతురు మాత్రమే ఉంది. అయినా ధైర్యం చేసి ఆ లాంతరు పట్టుకుని ఒక్కొక్క అడుగువేసుకుంటూ ఇంత దూరం ప్రయాణించాను. ఇప్పుడిప్పుడే నా దారిలో వీధి లైట్లు కనిపిస్తున్నాయి.  అందుకు కారణం చాలామంది నా దారిలో ఎదురై, నాకు తోడుగా నిలిచి, నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించారు, నడిపిస్తున్నారు.  అందుకు ప్రతీ ఒక్కరికి ( పెద్దలు, గాలరీవాళ్లు, మీడియావాళ్లు, తోటి కళాకారులు) పేరు పేరునా మనఃపూర్వక  కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..

చివరిగా నేను ఇలా చిత్రకారిణిగా అందరి గుర్తింపు, మెప్పు పొందడానికి కారకులైనవారికి మనఃఫూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను..

మొదటిసారి హైద్రాబాద్ దాటి వెళ్లి ముంబాయిలో ఓ గ్రూప్ షో చేశాను. అది ఏలే లక్ష్మణ్ సార్ నాకు కల్పించిన గొప్ప అవకాశం. మొదటిసారి విమానం చూసి, ఎక్కిన సందర్భం. అది నాకు చాలా సంతొషాన్ని ఇచ్చింది. లక్ష్మణ్ సార్ కూడా నన్ను చాలా ఎంకరేజ్  చేసారు. అందుకు ఆయనకు సదా కృతజ్ఞతలు తెల్పుకుంటాను. బాల్గము నగేష్ గౌడ్ సార్ కూడా షో విషయంలో చాలా ఎంకరేజ్ చేస్తారు.

 

చిత్రకళా ప్రపంచంలోకి రాకముందు మొదటిసారి కలిసిన వ్యక్తి అవనీరావుగారు. నాకు ఏమీ తెలియని రోజుల్లో ఆవిడే నేను ఏ దారిలో వెళ్లాలో, ఎలా వెళ్లాలో, ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలో మొదలైన సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనను ఎవరైనా  గుర్తిస్తారు. కాని నాకంటూ  ఏ స్థాయి, గుర్తింపూ  లేని రోజుల్లోనే నా ప్రతిభను గుర్తించి అవనిగారు ఎంతో ప్రోత్సహించారు. ఆమెలో నాకు నచ్చే విషయం.. ఎప్ప్పుడు కూడా నెగటివ్‌గా ఆలోచించరు. అవనిగారు నా జీవితంలో మరచిపోలేని వ్యక్తి.  తర్వాత  “అలంకృత” art gallery  నిర్వహించే ప్రశాంతిగారు కూడా నా works విషయంలో చాలా సలహలు ఇచ్చి ప్రోత్సహించేవారు. నా చిత్రాలకు మంచి గుర్తింపునిచ్చింది ఈ గాలరీ..

నా చిన్నతనంలో అంటే స్కూలులో 8 – 10వ క్లాసువరకు కుటుంబం కంటే మా స్కూలు టీచర్ సత్యనారాయణ సార్ ప్రోత్సాహం ఎక్కువగా  ఉండేది. ఆయన డ్రాయింగ్ టీచర్ కాకున్నా నాకు చాలా సహాయం చేసారు. నేను వేసిన బొమ్మలు చూసి మెచ్చుకునేవారు. తన స్నేహితుడైన యాదగిరి సార్ వద్దకు డ్రాయింగ్ నేర్చుకోవడానికి పంపించి ప్రోత్సహించారు.

కుటుంబంలో అంటే మా పెద్దక్క భారతి వల్లే జీవితంలో మంచి , చెడు అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అమ్మది వేరే ప్రపంచం అందువల్ల అక్కతో ఎక్కువ చనువుగా ఉండేదాన్ని. ఆమె ఈ మధ్యే చనిపోయింది. అమ్మ కూడా ఈ మధ్యే చనిపోయింది. ఇప్పుడు నా కళను చూసి మెచ్చుకోవడానికి, ప్రోత్సహించడానికి ఎవరూ లేరు..

నా గురించి, నా కళ గురించి కొద్ది మాటలు చెప్పగలిగే అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

8 thoughts on “లాంతరు వెలుగులో… ఆర్టిస్ట్ సరస్వతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *