May 13, 2024

ఊర్మిళ

రచన: నారాయణి

టి.వి.లో రామాయణ ప్రవచనము జరుగుతోంది. అందులో ఊర్మిళాదేవి నిద్ర గురించి చెపుతున్నారు. భర్త అరణ్యవాసానికి వెళ్ళినప్పటి నుండి మళ్ళీ అయోధ్యకు చేరుకున్నంత వరకు ఊర్మిళ నిద్రపోతూనే ఉందిట. లక్ష్మణుని  నిద్ర కూడా ఆమె పుచ్చుకొని నిద్రపోయిందిట. అది విన్నాక ఒక  అనుమానము వచ్చింది. నిద్ర అయితే అలా పడుకునే ఉంది.. మరి ఆకలిదప్పికల మాటేమిటి? అది వరమా?  శాపమా?

ఇలా ఆలోచిస్తూ నిద్రపట్టకపోవడంతో ఏదైనా మంచి పుస్తకం చదవాలనుకొంది ఊర్మిళ. అలమార దగ్గరకు వెళ్ళింది. తాను చిన్నప్పటి నుండి సేకరించిన ఎన్నో మంచి మంచి పుస్తకాలు. పుస్తకం తీస్తూ టైమ్ చూసుకొంది … అమ్మో పదకొండు.. మళ్ళీ సూర్యుడితో సమానంగా నిద్ర లేవాలి. అప్పుడు మొదలవుతుంది ఆమె పరుగు. మళ్ళీ సూర్యాస్తమము వరకు ఆ పరుగు అలా కొనసాగుతూనే ఉంటుంది. అమ్మో!! నిద్ర వచ్చినా రాకపోయినా మంచం మీద చేరి కళ్ళు మూసేసుకొంటే అదే వస్తుంది. అని అనుకొని నిద్రకి ఉపక్రమించింది.

 

*******************

 

“అమ్మా! ఊర్మిళ.. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు నా హోమియోపతి మందులు అయ్యిపోయాయి, కాస్త తీసుకొని రామ్మా” అని సీతారామయ్యగారు ఆఫీస్ కి బయలుదేరుతొన్న ఊర్మిళతో అన్నారు.

“అలాగే మావయ్యా! ఇంకేవైనా తేవాలా? గుర్తు చేసుకోండి. ఏవైనా తీసుకొని రావాలంటే లంచ్ అవర్ లో నాకు ఫోన్ చెయండి ” లంచ్ బాక్స్ బాగ్ లో పెట్టుకుంటూ జవాబిచ్చింది ఊర్మిళ.

“ఇదిగో అమ్మాయ్! అలాగే వచ్చేటప్పుడు పూజకి పూలు, పళ్ళు కూడా తీసుకొని రా, రేపు అసలే ఏకాదశి. ఉపవాసం ఉండాలి ” అన్నారు రేపటి ఉపవాస నీరసాన్ని మొహంలో చూపిస్తూ జానకమ్మగారు.

ఊర్మిళ బ్యాంక్ ఉద్యోగి, ఇద్దరు పిల్లలు, అమ్మాయికి పదునాలుగేళ్ళు, అబ్బాయికి పన్నేండేళ్లు. భర్త ఉద్యోగ రీత్యా ఎక్కువగా వేరే దేశాలకి తిరుగుతూ ఉంటాడు. అత్తగారు, మావగారు, పిల్లలతో తాను మాత్రం ఇండియాలోనే ఉంటుంది. పొద్దుటే వంట చేసి పిల్లలకి బాక్స్ లో పెట్టి, అత్తగారు, మావగారికి టిఫిన్, లంచ్ చేసి హాట్ పాక్ లో పెట్టి, కాఫీ ఒక ఫ్లాస్క్ లో, టీ ఇంకో ఫ్లాస్క్ లో పోసి అన్నీ టేబుల్ మీద అమర్చి ఆఫీస్ కి బయలుదేరుతుంది.

జానకమ్మగారికి కాస్త నరాల బలహీనత. చేతులు వణుకుతూ ఉంటాయి. ఏ వస్తువుని గట్టిగా పట్టుకోలేదు. అందుకే వంట, టిఫిన్, టీలు, కాఫీలు అన్నీ చేసి టేబుల్ మీద అమర్చి  ఆఫీస్ కి వెళ్తుంది. ఎప్పుడేనా ఏదైనా కావాలంటే మాత్రం పనిమనిషిని చేయమని చెప్పి ఉంచింది.

సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఊర్మిళ పూలు, పళ్ళు కొనడానికి మార్కెట్ కి వెళ్ళింది.  కూరలు, పళ్ళు, పూలు కొన్నాక ఇంటికి వచ్చి కాస్త కాఫీ నీళ్ళు తాగి, రాత్రికి వంట పూర్తి చేసింది. అత్తగారు, మావగారు రాత్రి అన్నం తినరు. వాళ్ళకి ఇడ్లి, చెట్ని చేసి, పిల్లలకి అన్నం, కూరా, చారు చేసింది. పిల్లలు తను ఆఫిస్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి హోం వర్క్ లు చేసుకొని రెడీగా ఉంటారు. అప్పుడు వాళ్ళని సంగీతం క్లాస్ కి తీసుకెళ్తుంది.

 

**************

 

లక్ష్మి అదే ఊరిలో మ్యూజిక్ కాలేజిలో టీచర్ గా చేస్తుంది. సాయంత్రం ఇంటికి కొంత మంది పిల్లలు సంగీతానికి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కచేరీలు కూడా ఇస్తూ ఉంటుంది. ఆమెకి ఇద్దరు పిల్లలు, పెద్దదానికి పదకొండు, చిన్నదానికి ఐదు. అత్తగారికి కాళ్ళు పని చేయవు. ఆవిడ బెడ్ మీదే ఉంటుంది. ఆవిడ కోసం  పొద్దుట నుండి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండేటట్టు ఒక పని మనిషిని మాట్లాడుకుంది. అలా కాక ఇంటి పని చేసే ఇంకో పనమ్మాయిని కూడా మాట్లాడుకుంది. పొద్దుటే ఆమెకి ఆన్ లైన్ క్లాసెస్. అదే టైం లో పిల్లలని రెడీ చేయాలి. భర్త ఊరూరూ తిరిగే ఉద్యోగం.  వారానికి ఒకసారి అత్తగారిని ఫిజియో థెరిపి చేయించడానికి హాస్పటల్ కి తీసుకెళ్ళాలి. ఆ రోజు అన్నీ క్లాసెస్ కి శెలవే.   లక్ష్మికి  పెయింటింగ్ అంటే చాలా ఇష్టం కానీ అస్సలు తీరిక దొరకదు.

లక్ష్మి, ఊర్మిళ చిన్ననాటి స్నేహితులు. ఇలా ఒకే ఊరిలో ఉండటం, పిల్లలకి సంగీతానికి వేరే టీచర్ ని వెతుకోకుండా చాలా సుళువుగా లక్ష్మి దొరకడం అదృష్టంగా భావిస్తుంది ఊర్మిళ.

పిల్లల క్లాస్ అయ్యాక వాళ్ళకి స్కూల్ కి కావాల్సినవి కొని ఇంటికి వచ్చింది. టైం చూసుకొంటే ఏడు అయ్యింది. స్నానము చేసి దీపం పెట్టుకొని, అత్తగారికి, మావగారికి ఫలహారము పెట్టి పిల్లలు, తను కూడా అన్నము తినే సరికి ఎనిమిది అయ్యింది. పిల్లలు చదువుకుంటున్నారు.

అత్తగారు మావగారు వాళ్ళ రూంలో టి.వి. లో ఏదో సీరియల్ చూస్తున్నారు. ఇంతలో పక్కింటి పూర్ణిమ.

“ఊర్మిళ! మీఇంట్లో తలనొప్పి టాబ్లెట్ ఉందా? పొద్దుట నుండి తల పగిలిపోతోంది. పొద్దుట నుండి పని హడావిడిలో టాబ్లెట్ కొనుక్కోవడం అవ్వలేదు. పిల్లల్ని బయటకు పంపుద్దామంటే ఏదో ప్రాజెక్ట్ ఉందిట. వెళ్లలేమని అన్నారు ”

” ఆగు  పూర్ణ! మావగారి మందుల కిట్ లో ఉంటుంది, తీసుకొస్తా” అంటూ అత్తగారి రూమ్  కి వెళ్ళింది.

“మావయ్యగారు! మీ మందుల కిట్ లో ఉన్న తలనొప్పి టాబ్లెట్లు రెండు ఇవ్వరా? ”

” ఏమ్మా! తల నొప్పిగా ఉందా? ” అని అడిగారు మావగారు.

“అబ్బే నాకు కాదండి, పక్కింటి పూర్ణకి ” అంది ఊర్మిళ.

“ఓహో అలాగా ” అంటూ మంచం పక్కనే ఉన్న గూట్లో నుండి తీసి ఇచ్చారు సీతారామయ్యగారు.

“అమ్మా! పూర్ణా! మీ అత్తగారికి ఎలా ఉంది? ” అని అడిగింది జానకమ్మగారు.

” అలాగే ఉందండి. తిండి సరిగ్గా తినలేక పోతున్నారు. ఎండలు మొదలయ్యాయి కదా! ఇంకా బాధగా ఉంది ఆవిడకి. ఏ.సి. లో నుండి బయటకు రాలేకపోతున్నారు. ” అని చెప్పింది పూర్ణ.

పూర్ణిమ అత్తగారికి కాన్సర్, కీమో ఇప్పిస్తున్నారు. గత ఆరు నెలలుగా  ఆవిడ తోటే టైం సరిపోతోంది పూర్ణకి. ఆరునెలల క్రితం వరకు స్కూల్ లో టీచర్ గా జాబ్ చేసేది, ఎప్పుడైతే అత్తగారికి కాన్సర్ అని తెలిసిందో జాబ్ వదిలేసింది. పూర్ణ భర్త కొచ్చిన్ లో ఉద్యోగం, ప్రతీ రెండేళ్ళకోసారి ట్రాన్స్ఫర్లు. అందుకని పూర్ణ పిల్లలు, అత్తగారు, మావగారిలో ఇక్కడే ఉండిపోయింది. మావగారు లెక్చరర్ గా చేసి రిటైర్ అయ్యారు. కానీ ఇప్పటికీ రెసిడెన్షియల్ కాలేజిలో పార్ట్ టైం చెస్తున్నారు. పిల్లలు కాలేజీలో చదువుతున్నారు.

పూర్ణిమ వారానికి రెండు సార్లు అత్తగారిని డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. ఇంటి వచ్చాక ఆవిడకి ఏ టైంకి ఏ మందులు ఇవ్వాలో చూసుకోవాలి. పిల్లలకు చదువులు, వాయిలిన్ క్లాసులు.

పూర్ణిమ వెళ్ళాక తన రూం కి వెళ్తూ అక్కడే ఆగింది ఊర్మిళ.

మళ్ళీ టి.వి. లో రామయణ ప్రవచనం వస్తోంది. మళ్ళీ ఊర్మిళ తన బుర్రలోకి వచ్చింది. ఊర్మిళ పాత్ర రామాయణములో అసలు  ఏముంది? మనసులో అనుకుంటూ బయటకు  అనేసింది.

జానకమ్మ “ఊర్మిళా! ఇలా రా ” అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొన్నారు.

“ఊర్మిళ పాత్ర రామాయణములో ఏమీ లేదనా నీ అనుమానం. సీత కష్టాలు పడిందంటే కాదని అనను కానీ, ఊర్మీళ కష్టాలు పడలేదన్న నిర్ణయానికి రావద్దమ్మ.  సీతకి అడవైనా, అయోధ్య అయినా పక్కన ప్రేమించిన భర్త ఉన్నాడు. లంకలో ఉన్న ఆ పదకొండు నెలలు తప్ప, మిగిలిన వనవాసం అంతా భర్త సన్నిధిలోనే గడిపింది. కానీ ఊర్మిళ పెళ్ళి అయిన వెంటనే భర్తకి దూరంగా ఉంటూ, అతని నిద్ర తను పుచ్చుకొని అతను  రామసేవ చేయడానికి పరోక్షంగా సహకరించింది.

అంతే కాదు, ఈ రోజుల్లో అటువంటి ఎందరో ఊర్మిళలు కలరు… భర్త వేరే ఊరిలో ఉన్నప్పుడు అతని బాధ్యతలను తన నెత్తిన వేసుకొని, అతని తల్లి తండ్రిని, పిల్లలని సంరక్షించే ఈనాటి ఊర్మీళలు ఎందరో ఉన్నారు. వారి ఇష్టాయిష్టాలని నిద్రపుచ్చి ఎంతో త్యాగం చేస్తున్నారు. నీ సంగతే చూడు!! మంచి పుస్తకం చదివి నువ్వు ఎన్ని రోజులయ్యింది? లక్ష్మీ పెయింటింగ్స్ వేయడమే ఆపేసింది. పూర్ణ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసింది. ఇలా ఎన్నో నిద్రాణమైపోయాయి మీలో.

ఇటువంటి ఊర్మిళలు లేకపోతే ఏ మగాడు అతని ఉద్యోగం ఇంత ప్రశాంతంగా చేసుకొలేడు. వాళ్లు ఆ బాధ్యత పుచ్చుకొన్నందుకే ఈ రోజులలో భర్తలు వేరే ఊరిలో ఉండగలుగుతున్నారు.

ఆ ఉర్మిళ త్యాగాన్ని రామాయణంలో మరచిపోయారేమో కానీ.. నేను ఈ ఊర్మిళ త్యాగాన్ని, సేవా నిరతిని మరువలేనమ్మ” అంది జానకమ్మ.

ఊర్మిళకు మాటలు రాలేదు… అత్తగారి వైపు చూస్తూ ఉండిపోయింది.

 

5 thoughts on “ఊర్మిళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *