May 13, 2024

పవిత్ర వృక్షాలు

రచన: జే.వేణీమాధవి.

www.vedicvanas.com

సనాతన హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు ఒక ఉత్తమ జీవన విధానాన్ని ప్రతిభింబిస్తాయి.  మన పండుగలు మన ఋతువులు, వాతావరణ మార్పులు మరియు పరిసర ప్రకృతితో ముడిపడి వున్నాయి అనటం మనందరి ప్రత్యక్షానుభవం. రామాయణ భారత పురాణాల్లోని వనాల వర్ణనలు అప్పటి పుష్కలమైన వన సంపదను గురించి తెలుపుతున్నాయి. ఇప్పుడవి క్రమంగా కనుమరుగై పోతున్నాయి. ఒకప్పటి మన దేవాలయాలు పుణ్య క్షేత్రాలు కూడా అడవులు, పర్వత శిఖరాలు, నదీ తీరాలు మరియు సంఘమ తీర్ధాల వంటి విశిష్టమైన ప్రదేశాల్లో నిర్మించేవారు. అక్కడ పరిసర భౌగోళిక స్థితిగతుల ననుసరించి అయస్కాంత శక్తి కేంద్రీకృతమై వున్నట్లు అధ్యయనాల్లో కనుగొనటం జరిగింది.

ఇక మానవ నిర్మిత దేవాలయంలోని విశిష్టత, దాని యొక్క స్థల విశేషము, మంత్ర శక్తి, తంత్ర శక్తి, యంత్ర శక్తుల వల్ల చైతన్యవంతమవటం జరుగుతుంది. ఇవే కాక అక్కడి స్థల వృక్షాలు మరియు ఆయా దేవతలకు సంబంధించిన దివ్య వృక్షాల వల్ల కూడా అక్కడి చైతన్యం ఉత్తేజితమౌతుంది. ప్రతి దేవతకూ ప్రీతి పాత్రమైన పత్రాలు, పుష్పాలు, ప్రసాదాలు, వర్ణాలు, పూజా విధులు మొదలగునవి వుండటం మనకు తెలిసిన విషయమే. వారికి ఇష్టమైన పత్ర మరియు పుష్ప జాతుల వృక్షాలు ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో విరివిగా వున్నప్పుడు ఆ చుట్టు ప్రక్కల ప్రదేశ మంతా శక్తిమయమైపోతుంది. ఆ క్షేత్రంలో అడుగిడినంత మాత్రాన్నే భక్తులకు దివ్యానుభూతులు కలుగుతుంటాయి. ఇది మన ప్రాంతాల్లోని తిరుమల, శ్రీశైల, యాదగిరిగుట్ట, శ్రీకాళహస్తి, అన్నవరం, భద్రాచలం వంటి విశిష్ట క్షేత్రాల్లో ప్రత్యక్షంగా చూస్తుంటాము. దేవతలు ఏ వృక్షాలలో నివాసముంటారో పురాణాల్లోని వివిధ సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. వీటన్నింటినీ సమగ్రంగా ఒక దగ్గర కూర్చి బెంగుళూరుకు చెందిన డా||ఎల్లప్పా రెడ్డి గారు ఒక పుస్తక రూపంలో మనకందించారు. దానినే ‘పవిత్ర వృక్షాలు’ అన్న పేరిట  టి.టి.డి. వారు అనువదించి ప్రచురించడం జరిగింది. నేను వాటికి మరిన్ని విషయాలను, వివరాలనూ మొక్కల చిత్రాలతో జతపరచి మరింత మందికి అందేలా వాటిని www.vedicvanas.com అన్న పేరిట వెబ్ సైట్ లో పొందుపరచి అందరికీ అందుబాటులోకి తీసుకు రావటం జరిగింది.

నవగ్రహాల దగ్గరనుంచి సప్తర్షులు,  వివిధ దేవతలకు సంబంధించిన పత్రాలు పుష్పాలు వున్నాయి. వీటిని ఆయా దేవాలయాల్లో నాటటం సర్వ శ్రేయోదాయకం. మనము అడవుల్లోని దివ్యత్వాన్ని మన వూరిలోకి తీసుకు రాలేకపోయినా కనీసం ఆయా దేవతలకు సంబంధించిన పర్వ దినాలకు సరిపడినన్ని నాటగలిగినా విశేషమే. ఉదాహరణకు: వినాయకుడి ఆలయానికి అనుబంధంగా వినాయక నవరాత్రులలో సరిపడినన్ని ఏక వింశతి (21)  పత్రాలు, శివునికి లక్ష బిల్వార్చనకు సరిపడినన్ని బిల్వ వృక్షాలు,  విష్ణువుకి నిత్యం తులసి మాల,  తామర పుష్పాలు, అమ్మవారికి పరిమళ భరిత పుష్పాలు, హనుమంతునికి తొమలపాకులు, అరటి నిమ్మ పళ్ళు ఇలా ఒక్కొక్కరికి ఇష్టమైన పువ్వులు ఆకులను ఆ పరిసరాలలో అంటే దేవాలయ భూముల్లో స్వయంగా పెంచి తాజాగా సేకరించి ఇవ్వ గలిగిన రోజు అక్కడి దైవం మరింత ప్రసన్నుడై భక్తులను కోర్కెలను తీరుస్తాడనడంలో  ఎటు వంటి సందేహమూ లేదు. ఒక దేవాలయాన్ని నిర్మించ దలచి నప్పుడు తోటలు వనాలకు కూడా సరైన ప్రాధాన్యతను ఇవ్వడం అత్యవసరం.

ఈ విశ్వంలో మనం ఏకాకులం కాదు, ఈ భూమిపై నున్న ప్రతి వ్యక్తి ఖనిజ, జంతు, వృక్ష సామ్రాజ్యాలతోనే కాకుండా మన సౌర కుటుంబం ఇంకా నక్షత్ర సమూహాలతో అనుసంధానం చెంది వుంటామని వాస్తు, జాతక శాస్త్రాలలో చూస్తున్నాము. మరి దేవతలకి సూచించి నట్లే  మనకి సంబంధించిన వృక్షాలు కూడా వుండటం విశేషం. అవే నక్షత్ర వనం మరియు రాశి వనం. 27 నక్షాత్రాల్లో ఒక్కోదానికి ఒక్కో వృక్షం మరియు ప్రతి రాశికి ఒక్కో వృక్షం అంటే 12 వృక్షాలు సూచించబడ్డాయి. వీటిని మనకి అనువైన చోటుల్లో వేసుకొని ఆరాధించటం వల్ల భౌతిక మానసిక ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడుతుందని చెప్పబడింది. ఇవన్నీ కూడా సవివరంగా అంతర్జాలంలో పొందు పరచటం జరిగింది.

ఒక్కో వృక్షం యొక్క మరిన్ని విశిష్టతల గురించి ధారావాహికంగా దేవాదాయ ధర్మాదాయ వారి ఆధ్వర్యంలో వచ్చే ‘ఆరాధన’ అన్న మాస పత్రికలో గత నాలుగు సంవత్సరాలుగా వ్రాస్తున్నాను. అవన్నీ కూడా వేదిక్ వనాస్ (www.vedicvanas.com)  లో  లభ్యమౌతున్నాయి. నేను వేదిక్ ఎకాలజీ మీద గత దశాబ్ద కాలంగా అధ్యయనం చేస్తున్నాను.

కేవలం మన పురాణాలు దేశానికే కాక ఇతర దేశాల్లో వారి వారి గ్రంధాల్లో పొందుపరచిన దివ్య వృక్షాల గురించిన వివరాలు వున్నాయి. మనకి నక్షత్ర వనం వున్నట్లుగానే పాశ్చాత్యులకు కూడా వారు పుట్టిన తారీకు ననుసరించి పువ్వులు, చెట్లు సూచించడమైనది. బైబిలు, ఖురాన్లలోనూ వారి వారి ప్రాంతాలకి సంబంధించిన దివ్య వృక్షాలను ప్రస్తావించడం విశేషం. వారు వాటిని సంరక్షించి వాటిని ఎంతో పవిత్రతతో ఆరాధించడం గమనార్హం. నమ్మక మేదైనా ప్రకృతి, పరిసరాల విషయంలో మన పుర్వీకులందరూ దాని విశిష్టతను గుర్తించి మానవ మరియు భూ శ్రేయస్సును  కోరి, వారికనువైన పదతుల్లో రక్షించిన వైనం హర్షించి అనుసరించదగినది.

ఇలా దివ్య వనాలే కాకుండా విద్యాలయాల్లో సరస్వతీ వనం, బటర్ ఫ్లై పార్కులు, ఆరోగ్య శాలల్లో ఆయా వైద్యానికి సంబంధిత మొక్కలు,  ఆఫీసుల్లో వొత్తిడిని తగ్గించే రకాలు, ఉద్యానవనాలు తోటలు మొదలగు ఆవరణల్లో పక్షులు కీటకాలకు ఆసరానిచ్చే మొక్కలు అంటే ఎకో – ఫ్రెండ్లీగా తోటలను మలచే విధానాల గురించి సలహాలు, సూచనలు ఇవ్వడం చేస్తుంటాను. బెంగుళూరు హైదరాబాదు నగరాల్లోని పలు చోట్ల ఇటువంటి వనాలను అబివృద్ది  చేయటం జరిగింది.

ఈ విషయాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు దిన పత్రికల్లో వ్యాసాలను ఇవ్వడం జరిగింది. పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించడం చేస్తుంటాను.

కొద్దిగా అవగాహనతో మన పరిసరాలను అర్ధవంతంగా తీర్చి దిద్దుకోవటం మన చేతుల్లోనే వుంది. సమస్త జీవులకు శ్రేయస్కరమైన ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలనేదే నా ఈ చిరు ప్రయత్నం.  వృక్షం నా దైవం – ప్రకృతి నా మతం – భూమి యొక్క శ్రేయస్సే నా ధ్యేయం!

 

 

2 thoughts on “పవిత్ర వృక్షాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *