May 12, 2024

నా మార్గదర్శకులు

రచన: మాలా కుమార్

mala 2

బహుశా భగవంతుడు స్త్రీ పక్షపాతేమో!అందుకే ప్రేమ, దయ, కరుణ,ఆప్యాయత అన్నీ కలబోసి , తన ప్రతినిధిగా అమ్మను సృష్టించాడు. అసలు అమ్మను అలా కాకుండా ఇంకోలా ఊహించుకోను కూడా ఊహించుకోలేము! నాకు ఊహ తెలిసింది అమ్మ సానిహిత్యంలోనే. నాకు ఎన్ని సంవత్సరాలో గుర్తులేదు, కాని బయట వరండాలో , వెన్నెల్లో అమ్మ దగ్గరగా కూర్చొని అమ్మ చెప్పే కథలు వినటం మాత్రం చాలా గుర్తుంది.. నాకు బాగా గుర్తున్న కథలు …  కర్ణుడిది, శ్రీకృష్ణదేవరాయునిది. అప్పటి నుంచే నాకు వారిద్దరూ చాలా ఇష్టం. అంత చిన్నతనంలోనే హంపీ చూడాలని చాలా కోరికగా వుండేది. కర్ణుడంటే చాలా జాలిగా వుండేది. అమ్మ కథలు చెప్పటమే కాదు, నా కోసము చందమామ, బాలమిత్ర  తెప్పించి, వాటిలోని కథలు చదివి వినిపించేది. చిన్నగా నేనే చదువుకోవటం అలవాటు చేసింది. అలా చాలా చిన్నతనము నుంచే సాహిత్యం మీద అభిలాష కలిగించింది.’ టామ్ సాయర్ ‘, ‘ హకల్బేరీఫిన్ ‘, లాంటి అనువాద నవలలు, ‘ గణపతి ‘, ‘ బారిష్టర్ పార్వతీశం ‘ ‘ బుడుగు ‘ లాంటి పుస్తకాలు నేను పదవతరగతిలోకి వచ్చేలోపే చదివాను. పదవతరగతి సెలవల్లో ఆరుద్ర రాసిన ” సమగ్ర ఆంధ్ర సాహిత్యము”  చదివాను. ఇవన్నీ నాకోసము ప్రత్యేకగంగా తెప్పించేది మా అమ్మ. చదవటమే కాదు దాని గురించి చర్చించేవాళ్ళం. పదవతరగతిలో వచ్చిన నా పుట్టినరోజుకు అమ్మ ఓ డైరీ బహుకరించింది. అందులో నాకు కలిగే అనుభవాలు, నేను విన్న చదివిన మంచి మాటలు , పుస్తకాల గురించిన అభిప్రాయాలు అన్నీ ప్రతిరోజూ వ్రాసుకునేదానిని. అవి అమ్మకు చూపించి నేను అడగగానే , కావల్సిన మార్పులు సూచించి ముందుకు వెళ్ళేందుకు వ్రాసేందుకు ప్రోత్సహించేది.. అదే నాకు  ఈ రోజు  బ్లాగ్ వ్రాయటానికి,  చిరు రచయిత్రి గా ఎదగటానికి నాకు పునాది అయ్యింది.

గత కొద్ది సంవత్సరాలుగా సమ్మర్ క్లాసెస్ అని, సెలవల్లో  వివిధ ఆక్టివిటీస్ నేర్పే తరగతులకు పిల్లలను పంపుతున్నారు. కాని దాదాపు యాభై సంవత్సరాల క్రితమే మా అమ్మ ఈ పద్దతిని పాటించింది. ప్రతి ఎండాకాలం సెలవల్లో ఏదో ఒకటి నేర్పించేది. ఆ రోజులల్లో ఆంధ్రప్రభ వారపత్రిక లో మాలతీ చెందూర్ పిల్లలకు నేర్పేందుకు రకరకాల బొమ్మల తయారీలు, కుట్లు లాంటివి వ్రాసేవారు. అవి చేసేందుకు నేను ఉత్సాహపడుతుంటే  అమ్మ నాకు కావలసినవి సమకూర్చేది. ఓ సారి సెలవల్లో దర్జీ అతనిని ఇంటికి పిలిపించి బట్టలు కుట్టటం నేర్పించింది. నాకు పెయింటింగ్ అంటే ఇష్టమని  పెయింటింగ్ క్లాస్ లకు పంపింది. నాకు ఏ ఎండాకాలం సెలవలు కూడా వృధా చేసిన గుర్తు లేదు. అదే అలవాటు ఇప్పటికీ కొత్త కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిని కలిగించింది.

నా చిన్నతనంలోనే ఓ దీపావళి కి మా నాన్నగారు మంగళహారతి లో పైసలు ఇచ్చారు. అవేమి చేయాలో తెలీలేదు. వెంటనే మా అమ్మ ఓ డబ్బులు దాచుకునే ముంతను తెచ్చి అందులో వేసింది. అలా మనీ సేవింగ్ నేర్చుకున్నాను. రేడియోలో బాలానందంనూ తప్పనిసరిగా విని , అందులోని పాటలన్నీ నేర్చుకునే దానిని . అలా నా ఇష్టాలను తెలుసుకొని, అన్ని విధాలా నన్ను ప్రొత్సహించింది అమ్మ.

ఆ రోజు నాకింకా గుర్తే. అప్పటికి నా పెళ్ళై ఇరవై రోజులైంది. అంతకు ముందు రోజే మావారు సెలవు పూర్తైందని పాటియాలా వెళ్ళిపోయారు. నేను అమ్మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నా సామానులన్నీ, నన్ను తీసుకొని అమ్మా, పిన్ని మా అత్తగారింటి కి వచ్చారు. కాసేపు కూర్చున్నాక నన్నుఅక్కడే వదిలేసి వెళ్ళారు. వాళ్ళను పంపటానికి మా అత్తగారు వాళ్ళ తో పాటు వాకిలి దాకా వెళ్ళారు. నేను ఒక్కదాన్నీ హాల్ లో నిలబడ్డాను. వాళ్ళతో బయట దాకా వెళ్ళాలో వద్దో తెలీలేదు. అప్పటివరకూ చుట్టాలతో సందడిగా వున్న ఇల్లు నిశబ్ధంగా వుంది. అ ఇరవై రోజులూ హడావిడిగా ఏమీ తెలీకుండానే గడిచిపోయాయి. ఇప్పుడు ఒక్కదాన్ని అలా బిక్కుబిక్కుమంటూ నిలబడి వుంటే భయంగా, బెదురుగా వుంది. అలా ఎంతసేపు వున్నానో తెలీదు. ఏమిటీ అట్లా నిలబడ్డావు? లోపలికి రా అంటూ మా అత్తయ్యగారు నా చేయి పట్టుకొని, నువ్వు వంటరిదానివి కావు నీకు నేనున్నాను అని చేయూతనిచ్చారు.. చకచకా పనులు చేసుకుంటూ, వచ్చేపోయేవారిని నవ్వు మొహంతో పలకరిస్తూ , ఎప్పుడూ అలసట అనేదే ఎరగకుండా ఫ్రెష్ గా వుండే  మా అత్తయ్యగారిని చూస్తే చాలా ఆశ్చర్యంగా వుండేది. అసలు ఈవిడకు కోపం వస్తుందా అనుకునేదాన్ని. పిల్లలను కూడా ఎప్పుడూ కోపం చేయటం చూడలేదు. వాళ్ళ అవసరాలు కనిపెట్టుకొని వుండేవారు. ఎవరికే సమస్య వచ్చినా చిటికెలో పరిష్కారం చెప్పేవారు.

వంట , పనులు అన్నీ ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. పెద్ద జుట్టు , మనీ సేవింగ్ మా అమ్మ నేర్పితే , మనీ మానేజ్మెంట్ మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ తెలివితేటలు చాలా అబ్బురంగా అనిపించేవి.ఎప్పటికైనా నేను ఆవిడలా వుండగలా అనుకునేదానిని. ఆవిడ నా రోల్ మోడల్.

నా జీవితము లో ఈ ఇద్దరు స్త్రీమూర్తుల పాత్ర చాలా ముఖ్యమైనది. నేను ఈ రోజు ఈ విధంగా , సంతోషముగా వున్నానంటే వీరి చలవే! నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించిన ఈ మాతృమూర్తులిద్దరికీ, ఈ మహిళాదినోత్సవ సందర్భముగా  హృదయపూర్వక పాదాభివందనాలు.

 

 

9 thoughts on “నా మార్గదర్శకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *