May 4, 2024

మహిలో మహిళ

రచన: సి.ఉమాదేవి

అంతర్జాతీయ మహిళాదినోత్సవం స్త్రీలకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజున  ప్రగతిబాటన పడుతున్న స్తీల అడుగులు ఏ దిశగా పడుతున్నాయో, లక్ష్యం దిశగా నడచి గమ్యాన్నిచేరుకుంటున్నాయో లేదోనని బేరీజు వేసుకోవడం చర్వితచర్వణమే. సంవత్సరానికి ఒక రోజు వస్తుంది, వెళ్తుంది. కాలగర్భంలో ఆ రోజు కలిసిపోతుంది. మహిళా సంక్షేమం, మహిళాభివృద్ధి ఏ మేరకు జరిగిందో వెనక్కు తిరిగి చూసుకుంటే సాధించిన ప్రగతి పలుచగా అగుపడుతుంది తప్ప అభివృద్ది గ్రాఫ్ లో పురోగతి మందగమనమే.  అయితే మనమేమి సాధించలేదా అంతా నిరాశావాదమేనా అంటే సాధించింది బహు తక్కువ అని చెప్పాల్సి వస్తుంది. ఆకాశంలో సగం అని సగర్వంగా చెప్తాం కాని ఆనవాళ్లు అస్పష్టం.

ఇప్పటికీ ఆగని బాల్యవివాహాలు, వరకట్నవేధింపులు, భ్రూణహత్యలు, అతివలపై అత్యాచారాలు, గృహహింస, ఆర్థిక అసమానతలు, లింగవివక్ష, లైంగిక హింస వంటివి మహిళలకు నిత్య సవాళ్లే. ఈ సవాళ్లను స్త్రీలే ఎదుర్కోవాలి. అంతేకాని సంఘసంస్కర్తలు, అభ్యుదయవాదులు, మహిళాహక్కుల కమిషన్  ఉన్నాయి, మనమేం చేయగలం అనుకుంటే ఎన్ని మహిళా సంవత్సరాలు జరుపుకున్నా నిరర్థకమే! కుమారీ శతకాన్ని, రుక్మిణీ కళ్యాణాన్ని చదివితే చాలనుకునే స్థితి దాటి స్త్రీల దృష్టి అంతరిక్షాన్ని అందుకుంటోంది. స్త్రీలు విద్యావంతులవుతున్నారు,ఉద్యోగాలలో ప్రవేశిస్తున్నారు. రైలు, విమానం ఏదైనా నడపగలం అంటున్నారు. వెల్లివిరుస్తున్న స్త్రీ చైతన్యం సుస్పష్టం. అయితే  సమాంతరంగా స్త్రీలపై హింస కూడా పెరుగుతోంది. కడకు విద్యావంతులైన స్త్రీలు సైతం జీవనపోరాటంలో ఓటమినెదిరించలేక  ఆత్మహత్యలనాశ్రయించడం  మనసును కలచివేస్తుంది.

ఈనాటి  మహిళ తనకంటూ ఒక గుర్తింపు వుండాలని కోరుకుంటుంది. అయితే ఇలా అనుకోవడం ఈనాడు బహిర్గతమైతే ఒకనాడు అంతర్గతమై మాట గొంతులోనే తిష్టవేసి మరిక కదలననేది. తరాలనడుమ అంతరాలు నిత్య  నూతనమే.ఈ అంతరాల ఘర్షణలో స్త్రీ సంఘర్షణే ముఖచిత్రమవుతోంది. ఆనాటి మహిళ జీవనం సమాజ నిర్దేశితం. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కట్టుబాట్లు స్త్రీ మేధను కుచింపచేయడంలో తమ వంతు పాత్రను పోషించాయి. అలా అని ఆనాటి స్త్రీ ఆలోచనాశూన్యురాలని తీర్మానించలేం. అవకాశాలను అందుకోవాలంటే  ఆలోచనలుంటే చాలదు అవకాశాన్నందుకునే స్వేచ్ఛ కావాలి. గత చరిత్రలోని స్త్రీ అధ్యాయాన్ని పరిశీలిస్తే వేళ్లమీద లెక్కింపదగినవారు మాత్రమే శక్తిస్వరూపిణిలుగా పేరుగాంచారు. రాచరిక చరిత్రలో రాణి రుద్రమదేవి, రాణి ఝాన్సీలక్ష్మీబాయి అసమాన ధైర్యవంతులు. ఇందిరాగాంధీ, సిరిమావో  బండారు నాయకే,మార్గరెట్ థాచర్, సరోజినీ నాయుడు, దుర్గబాయి దేశ్ ముఖ్ వంటివారు తమ తమ రంగాలలో విజృంభించిన మహిళాకెరటాలు. వీరే కాదు మరెందరో విశిష్ట మహిళలందించిన స్ఫూర్తి స్త్రీలను చైతన్యపరిచింది

నేటి మగువల జీవితమేమి వడ్డించిన విస్తరి కాదు, కాని నేర్చుకున్న విద్య, పెంపొందించుకున్న సామాజిక అవగాహన స్త్రీని ముందుకు నడిపిస్తోంది. ఎప్పుడైతే స్త్రీకి విద్యపై అవగాహన పెరిగిందో అప్పుడిక స్త్రీ వెనుదిరిగి చూడలేదు. లతాంగి అని పిలువబడుతూ సౌకుమార్యానికి ప్రతిరూపమే స్త్రీ అని భావించేవారి అంచనాలను తారుమారు చేస్తూ తనకు అందివచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటూ సూపర్ వుమన్ గా రూపొందుతోంది. నేటి మహిళ కష్టనష్టాలను అధిగమిస్తోంది.యుక్తితో  సమస్యలను పరిష్కరించుకుంటోంది.స్వయంశక్తితో స్వావలంబనదిశగా

పయనిస్తోంది.వేణ్ణీళ్లకు చన్నీళ్లు అని పిలువబడ్డ స్త్రీ సంపాదన ఆర్థికసమానత్వంతోపాటు స్త్రీ సమానత్వానికి తెరతీసింది. అన్నిరంగాలలో పురోగతి సాధిస్తూ ఇటు ఇంట్లో  అటు తనెంచుకున్నరంగంలో కూడా శెహబాష్ అనిపించుకోసాగింది. అయితే స్త్రీ పోషిస్తున్న ద్విపాత్రాభినయం ఢబ్బు సంపాదనను పెంచుతోంది గాని  సమయం చాలక వచ్చే ఇబ్బందులను అధిగమించలేక  ఇంటా బయట సతమతమవుతున్నారు. ఈ సమస్యలను అధిగమించగల స్త్రీల నిష్పత్తి బహు తక్కువే కధా!.ఎన్నిచట్టాలు వచ్చినా, సంస్కరణలు జరిగినా కొందరు మహిళల జీవితాలు ప్రశ్నార్థకాలే!

మరణశాసనాన్ని తమపై తామే తీర్పుగా ప్రకటించుకునే స్త్రీల కన్నీటిగాథలు, వ్యధాభరిత జీవిత కథనాలు పత్రికలలో, ఛానెళ్లలో చూస్తున్నాం.ఎందరో మహిళలు విధివంచితులై జీవిస్తున్నారనేది మనకళ్లముందు ఆవిష్కరింపబడుతున్న నిత్యజీవనచిత్రం. అవగాహన పెరిగి అవకాశం అందుకున్నవారు గళం విప్పి నిజాలను చెప్పగలుగుతున్నారు. మనసులను పారదర్శకం చేసి తమ దీనావస్థకు కారణమైన వారిని నిలదీస్తున్నారు. క్రూరజంతువులు, విషసర్పాలు సైతం తమ గొంతును జీవకారుణ్య సంఘాల ద్వారా ప్రకటిస్తున్నాయి. అటువంటప్పుడు తన సమస్యను కనీసం కుటుంబంతోనైనా చర్చించుకోలేక, ప్రాణాలమీదకు తెచ్చుకోవడం నేటి మహిళకు తగదు. తమకంటూ ఓ రోజు వుందని, గుర్తింపు దొరికిందని సంబరపడటం ఆహ్వానించదగ్గ విషయమే.కాని మహిళాదినోత్సవం నాడు స్త్రీలు సాధించిన ప్రగతి పేరిట అవార్డులకే పరిమితంకాక స్త్రీజాతిని ప్రగతిపథాన నడిపించే చైతన్యస్ఫూర్తిని అందించ గలగాలి.

ఒకనాటి పత్రికలలో స్త్రీలకు కేటాయింబడిన శీర్షికలలో కుట్లు, అల్లికలు, వంట-వార్పు, పిల్లల పెంపకంవంటి విషయాలకు అధిక ప్రాధాన్యత కనబడేది. ఈనాడు ఇవేకాక విభిన్న రంగాలలో స్త్రీల ప్రగతిని, స్త్రీల ఆరోగ్యసంబంధ విషయాలపైనా వివరణాత్మకంగా స్ఫూర్తినందించే విషయాలను చర్చిస్తున్నారు. స్త్రీ సమస్యలపట్ల మహిళాలోకం సత్వర స్పందనతో జాగృతమవుతోంది. ఎలా వచ్చింది స్త్రీలలో ఇంతటి మార్పు? గతంలో ఊహకైనా అందని విజయాలు ఈనాడు మహిళల పరమై ప్రశంసలందుకుంటున్నాయి. స్త్రీవిద్యకు ప్రోత్సాహం పెరిగింది. నేటి వనిత వ్యక్తిత్వ వికాసంలో పరిపూర్ణత్వం పొంది తన గుర్తింపును చాటుతోంది. ఆమెనందరు అబ్బురపడుతూ ఆశీర్వదించడం నేటి వేడుక. అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు సత్యవతి నడిపిన రైలుబండి స్త్రీలు ఏ సవాలునైనా స్వీకరించగలరని మరోమారు లోకానికి తెలిపింది. ఎందరో మహిళల విజయాలు మరెందరికో న్ఫూర్తినందిస్తున్నాయి. తమ జీవితాన్ని తాము శృతి చేసుకోగల శక్తిని పొందుతున్నారు. తంత్రులు తెగినా సవరించుకుని జీవన సరిగమలను లయబద్ధంగా పలికించగలుగుతున్నారు. సాహసం, ప్రయత్నం, పట్టుదల రంగరించి,ఆత్మవిశ్వాసాన్ని సానబెట్టి, కర్తవ్యపరాయణతకు అంకిత భావంతో తనను తాను అర్పించుకునే దిశగా నేటి మహిళ పదముద్రలు బలంగా పడుతున్నాయి. పిల్లలకు కౌన్సిలర్ గా, భర్తకు సలహాదారుగా నిత్యయంత్రమైన మంత్రశక్తిగా భాసిస్తోంది.అందుకే నాగరికతలో అనాగిరికతకు చోటిచ్చి, స్వేచ్ఛలో విశృంఖలతకు తావిచ్చి జీవితాన్ని ఊహల ఊయలలో గడపడంకాక సంప్రదాయాన్ని,సంస్కృతిని ఆధునికతతో మిళితం

చేసి వాస్తవంలో  నేటి మహిళ స్థిరమైన అడుగులు వేయగలగాలి . అప్పుడిక ప్రతి మహిళా పరిపూర్ణ మహిళే. ప్రతిరోజు మహిళా దినోత్సవమే.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

3 thoughts on “మహిలో మహిళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *