May 13, 2024

మలేసియా తెలుగు మహిళలు

రచన: శ్రీమతి దుర్గప్రియ

“స్త్రీ”

ఆత్మీయతలో ……………….అమ్మ

సహనంలో……………………భూదేవి

అణకువలో……………………అనసూయ

పట్టుదలలో……………………సావిత్రి

కరుణలో………………………థెరిస్సా

ప్రేరణలో……………………….మాంచాల

వీరంలో……………………….ఝాన్సీరాణి

పౌరుషంలో…………………..రాణి రుద్రమ్మ

అవసరమైతే ………………..ఆది శక్తి..

అటువంటి “స్త్రీ” శక్తికి నా అభివందనాలు.

ఏ ఇంట్లో స్త్రీ గౌరవింపబడుతుందో ఆ ఇల్లు నందనవనమవుతుంది. ఏ దేశంలో స్త్రీలు గౌరవింపబడుతున్నారో ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకనే ఒక కవి “స్త్రీ” ని గురించి ఇలా రాసాడు.

“బ్రతుకు ముల్లబాటలోన…..జతగా స్నేహితురాలవైతివి,

కన్నీళ్లు తుడిచే వేళ……….తోడబుట్టిన చెల్లలవైతివి,

జీవితం లో వెనుకబడినప్పుడు…వెన్ను తట్టిన భార్యవైతివి,

పురిటినొప్పుల బాధ తెలియని పురుషజాతికి…. తల్లివైతివి.

అని అన్నారు. “కష్టంలో ముందుండి,…సుఖంలో క్రిందుండి…విజయంలో వెనకుండి….ఎల్లప్పుడూ పక్కనుండేదే.. స్త్రీ”.

ప్రశాంతమైన, సుందరమైన, సుసంపన్నమైన మలేసియా దేశానికి మన తెలుగువారు 150 సంవత్సరాల క్రితం బ్రిటిషు పాలనలో “ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ పట్టణం, అమలాపురం, శ్రీకాకుళం” జిల్లాల నుండి  వ్యసాయ కూలీలుగా వలస వచ్చారు. వలస కూలీలుగా స్వదేశాన్ని, స్వంత ఊరిని, స్వంత వాళ్ళను, వదిలి, చంకల్లో చంటి పిల్లలతోను, సద్ది మూటలతోను, ట్రంకు పెట్టలతో ఓడలనెక్కి వచ్చి మలయ దేశంలో స్థిరపడిన  తెలుగు కుటుంబాల సంతతే నేడు మలేసియాలో నివసిస్తున్న 5లక్షల మంది తెలుగువారు.

ఆనాడు భర్తల వెంట, తండ్రులవెంట వచ్చిన  మన తెలుగు మహిళలు విద్యావంతులు కారు. శరీర కష్టం చెయ్యడం మాత్రమే తెలిసిన సామాన్య స్త్రీలు. ఉదయం లేచి మగవారితోపాటు రబ్బరు, కొబ్బరి తోటలలో [ఎస్టేట్] కూలి పనులకు వెళ్లి రాత్రి వరకు కష్టపడి పని చేసి, ఇంటికి వచ్చి వంటా వార్పులు, పిల్లల బాగోగులు చూసుకొని, వచ్చిన అతి తక్కువ ఆదాయములోనే  సగం పొదుపు చేసి ఆర్ధికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసారు. తెలుగువారు అధికంగా ఉన్న తోటలలో తెలుగుబడులకు తమ పిల్లలను పంపి తెలుగు భాషను నేర్పించారు. రాత్రి వేళలలో రామభజనలు, జానపద గీతాలు పాడుకుంటూ మలేసియాలో  మన సంస్కృతిని నిలబెట్టారు.

150 సంవత్సరాల క్రితం మలేషియాకి వచ్చిన మన తెలుగువారు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బ్రిటీష్ పాలనలో వీరు తోటపనులే కాకుండా, ‘సయాం’కు రైలుబాట వేసే పనులకు మగవారిని తీసుకొని పోగా ఆడవారు ఒంటరిగా మిగిలి పలు ఇక్కట్లుకు గురయ్యారు. విద్యుత్తు దీపాలు, వీధి దీపాలు కూడా లేని ఆ రోజులలో ఆ తోట ప్రాంతాలలో రోగాలకు గురి అవుతూ, సరైన మందులు లేక, వైద్యశాలల కోసం ఎన్నో కిలోమీటర్లు కాలినడకన చీకట్లలో, చంటి పిల్లలనెత్తుకొని నడిచి వెళ్లి, ఆ దేవుని పై భారం వేసి జీవనం సాగించారు. ఇంకనూ జపాన్ వారితో యుద్ధ సమయంలో బాంబుల దాడికి  గురవుతూ, పనులు లేక, కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేక గోనెసంచులు కట్టుకునేవారని, తినడానికి తిండి లేని సమయాలలో మహిళలు తోటలకు వెళ్లి గొంగుర, దుంపలు, ఏరుకువచ్చి అవి ఉడికించి పిల్లలకు పెట్టి వారిని కాపాడుకున్నామని ‘90 ఏళ్ల వయసున్న మరేమ్మ’గారి మాటల ద్వారా తెలిసింది. ఏడు, ఎనిమిది నెలల గర్భవతులైనా రబ్బరు తోటలలో నిచ్చేనలు ఎక్కి రబ్బరు పాలు తిసేవారని, ప్రసవం అయ్యేవరకు కూడా ఆ తోటలో పనులు చేస్తూ నొప్పులు  రాగానే అక్కడే బిడ్డను ప్రసవించేవారని, ఆవిడ చెప్పారు.

“కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును” అన్న విధంగా ఆ నాటి ఆ మహాతల్లులు ఎన్నో కష్టాలకోర్చి, ఎంతో పొదుపుగా జీవనం సాగించి, ఆర్ధికంగా నిలదొక్కుకుంటూ ఒక్కొక్క కుటుంబంలోనూ పదిమంది పిల్లలున్నా చాలా ముందుచూపుతో వారందరిని విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో వారు చూపిన పట్టుదల, కృషి, నిజంగా ప్రశంసానీయము.

వారు చదువుకోకపోయినా ముందుచూపుతో సమయానికి తగు నిర్ణయాలు తీసుకొని వారి కుటుంబాలను నిలబెట్టుకొని నేడు మలేసియాలోని తెలుగు వారందరు విద్యావంతులుగాను, డాక్టర్లుగాను, లాయర్లుగాను, ఇంజనీర్లుగాను, వ్యాపారవేత్తలుగా, ఉన్నతాధికారులుగా  ఉండే తెలుగు సమాజాన్ని రూపొందించారు. మగవారితోపాటు మలేసియా తెలుగు సంఘం ఏర్పాటు చేసి  ఎన్నో మంచి కార్యక్రమాలకు చేదోడువాదోడుగా ఉంటూ, తమ వంతు సహయం చేస్తున్నారు.

అటువంటి కష్టపడే మనస్తత్వం, ధైర్యసాహసాలు, భక్తి, పట్టుదల కలిగిన తల్లుల శిక్షణలో అంచలంచలుగా ఎదిగిన నేటి తరం నారీశిరోమణులు అన్నీ రంగాలలోను తమ సాధికారతను చాటుకుంటున్నారు.  నేడు మలేసియాలోని తెలుగు మహిళలందరూ మగవారితో సమానంగా “ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్” అన్నట్లుగా అన్నీ విద్యలు నేర్చి నేడు డాక్టర్లుగా, టీచర్లుగా, కంప్యూటర్ ఇంజనీర్లుగా, అకౌంటంట్లుగా, ఆడిటర్లుగా ఎన్నోఉద్యోగాలను భధ్యతాయుతంగా నిర్వహిస్తూ, ఇంటిని, పిల్లలను సరిదిద్దుకుంటూ వస్తున్నారు. మలేసియాలో నేడు నూటికి 70%మంది తెలుగు మహిళలు, ఉద్యోగ భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఇది నిజంగా తెలుగువారందరు గర్వించదగ్గ విషయం.

మలేసియా తెలుగు మహిళలు 150 సంవత్సరాలుగా  ఆంధ్రదేశానికి దూరంగా ఉంటున్నా, వారు ఆంధ్ర దేశం వదలి వచ్చేటప్పుడు పాటించిన అదే సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ తెలుగుదనాన్ని కాపాడుతున్నారు. నేడు మనం ఆంధ్రదేశం లో కుడివైపు పవిటలతో చీరలను కట్టుకొనే వారిని చాల అరుదుగా చూస్తాము. కాని ఇక్కడ ప్రతి తెలుగు మహిళా వారి ఊరి [అనకాపల్లి, అమలాపురం, విశాఖపట్టణం, శ్రీకాకుళం] అలవాటు ప్రకారం ఈనాటికి అలానే ధరిస్తారు. దీనిని వారు చాల గౌరవంగా భావిస్తున్నారు.

ఎన్నో మిశ్రమ విదేశీ సంస్కృతుల మధ్య జీవనం సాగిస్తున్నా నేటికి కూడా పండుగలకి మన అచ్చ తెలుగు వంటకాలైన ‘బూరెలు, అరిసెలు, పొంగడాలు, చిన్ని పోకలు, తీపి గారెలు’ వంటివే కాకుండా మినపజావ, వాముచారు, మెంతిపులుసు, వంటి ఆరోగ్యకరమైన సంప్రదాయమైన తెలుగు వంటలను నోరూరించేలా చేస్తారు. పాశ్చాత్య సంస్కృతి, పరభాషలు తెలుగువారి జీవనశైలిలో కలిసిపోయి ‘అమ్మ, నాన్న’ అని పిలవడమే మన తెలుగువారు మరిచిపోయిన ఈ రోజులలో కూడా మలేసియా తెలుగు వారు ఇంత వరకు ఆ సంస్కృతిని దరిచేరనివ్వక వారి పిల్లలతో అమ్మ, నాన్న అని పిలిపించుకుంటూ వారి ప్రతి అడుగులోనూ తెలుగుదనాన్ని చూపుతున్నారు. ఇంకనూ నేటి మహిళలు వారి అమ్మలు, అమ్మమ్మలు దగ్గర నేర్చుకున్న జానపదనాట్యాలైన   చిరతలాట, దాటుభజనలు, గొబ్బిళ్ళ ఆటవంటి నాట్యాలను వారి పిల్లలకు నేర్పడానికి ఆశక్తి చూపుతున్నారు.

మలేసియా తెలుగు మహిళలకు తెలుగు భాషపైనున్న అభిమానం అపారమైనది. ఎన్ని పనుల ఒత్తిడి లోనున్నా ఈ తెలుగు తల్లులు వారి పిల్లలను మలేసియా తెలుగు సంఘం వారు నిర్వహిస్తున్న తెలుగు తరగతులకు, తెలుగు నీతి శిబిరాలకు, పంపి తెలుగుభాషా, సంస్కృతులను నేర్చుకునేలా చేస్తున్నారు. చిన్నతనంనుండే వారి పిల్లలు అచ్చమైన తెలుగువారిగా పెరగడానికి కావలసిన అన్నీ సదుపాయాలను కలుగ జేస్తున్నారు.

అడుగడుగునా ఆత్మవిశ్వాసంతోను, అచంచలమైన కృషితోను, ధృడ సంకల్పంతోను, అన్నీ రంగాలలోను స్త్రీ సాధికారతను చాటుతూ ప్రగతి పథం వైపు నడుస్తున్న ఈ మహిళామణులు  మలేసియా తెలుగువారి చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 2000 మందికి పైగా ఒక చోట సమావేశమై ఒక మహా సభను జరుపుకుంటూ తమ భాషాభిమానాన్ని చాటుకుంటున్నారు.

‘ మగువల తెగువల’ వర్ణింప మహాకవుల వల్లనే కాలేదు, ఇంక నావల్ల ఏమవుతుంది? ఒక్క మాటమాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మలేసియా తెలుగు వారు తెలుగువారి చరిత్రలోనే తమకంటూ ఒక స్థానం కల్పించుకున్నారు. ఇంకా ఈ మహిళలందరు ‘తెలుగుతల్లి’ ముద్దు బిడ్డలని చెప్పవచ్చు. మేము ‘అబలలం’ కాదు ‘సబలల’మని సగర్వంగా నిరుపించు కుంటున్న  ఈ తెలుగు మహిళామణులకు, తెలుగుని వెలుగుబాట నడిపిస్తున్న మలేసియా నారిశిరోమణులకు

ప్రపంచములోని ప్రతీ తెలుగువారి తరుపున నేను అభినందనలు తెలియజేసు కుంటున్నాను.

“తెలుగుని పెంచుదాం,

తెలుగుని ప్రేమించుదాం,

తెలుగు దనం మనకు ధనం,

తెలుగు జాతి చరిత ఘనం.

జై తెలుగు తల్లి.

 

 

1 thought on “మలేసియా తెలుగు మహిళలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *