April 27, 2024

పుకార్ల పురాణ౦ – పద్మావతమ్మ కధా సరిత్సాగరం

రచన: లిపి జ్వలన

 

“ అవార్డుల లక్ష్మి కధ తెలుసా ?” అంటూ ఆనాటి సమావేశం ఆరంభించింది ఆకాశవాణి.

ఆకాశవాణి అంటే రేడియో అనుకుని భ్రమపడేరు..

కాదు కాదు ముమ్మాటికీ కాదు.

ఆకాశం నుండి వార్తలు పుట్టించి అన్ని వైపులా వాటిని వెదజల్లే పుకార్ల పురాణ పద్మావతమ్మ బిరుదు  అది.

పద్మావతమ్మ వయసు కాస్త అటూ ఇటూగా అర్ధశతకానికి  మరో పది . అంటే అర్ధం అవదేమో అరవై కి అటూఇటూ.. పాత న్యూస్ పేపర్లు కొనేవాడి తక్కెడ చూసారా? ఎటుకావాలంటే అటే ఒంగుతుంది. ఎదుటి వాళ్ళు కొంచం జాగర్తగా ఉంటే ఒక చోట స్థిరంగా ఆగిపోతుంది. కాస్త ఆదమరచారా ఎ౦త కావాలో అంతకు రెట్టి౦పుకో ఊగుతుంది. పద్మావతమ్మ వయసు కూడా అంతే.

అవసరం వస్తే పాతికేళ్ళ వయసు నుండి నూట పాతిక వరకూ దిగనూ గలదు, ఎగబాకనూ కలదు.

“ఎవరా అవార్డుల లక్ష్మి ఏమా కధ? చెప్పు చెప్పు “ అంటూ ఆసక్తి చూపారు ఆమె సభాసదులు.

ఆ సభాసదులు పదేళ్ళ బంగారి నుండీ తొంభై దాటబోతున్న రాజమ్మ వరకూ ఎ౦దరో …

నిజానికి అది చిన్నప్పుడు నాతో రోడ్డ్డు మీద గోటీలు,గిల్లి దండూ ఆడినదే, రెండు జతల బట్టలతో ఒకటి ఉతకా ఒకటి తొడగా చేసినదే. ఆ రోజులు దానికిప్పుడు అసలు గుర్తులేవు. అదెందుకు కాని ప్రస్తుతానికి వద్దాం.

దానికిప్పుడు కొత్త గా అవార్డుల పిచ్చొకటి పట్టుకుంది. కొత్తగా అని ఎందుకన్నాన౦టే దానికి చిన్నప్పటినుండీ అదో రోగం, అమావాస్యకీ పున్నానికీ పిచ్చి ముదురుతుంద౦టారు . కాని దానికి అమావాస్యకో కొత్త కోరిక పున్నమికో కొత్త కోరిక పుట్టుకొచ్చేవి ఆ ధ్యాసలో రోజులు నిమిషాల మాదిరి మారిపోయేవి.

పదో తరగతి పరీక్షలముందు సినిమా హీరోయిన్ల పిచ్చిపట్టుకు౦ది. ఆ సంక్రాంతికి తోకచుక్క సినిమా విడుదలైంది. దాన్లో హీరోయిన్ చమేలీ (అసలు పేరు చెంచులక్ష్మి అట) బుగ్గమీద శనగ బద్దంత నల్లని పుట్టుమచ్చ ఉండేది. ఆ చమేలీ డబ్బపండు ఛాయలో ఆ పుట్టుమచ్చతో మహా అందంగా కనిపించేది. ఆ సినిమా చూసిన రిక్షా రంగడు ( సినిమాలు రాగానే చూసేది వాళ్ళేగా ) ఇది రోడ్డు మీద నడుస్తుంటే “ చమేలీ నా చమేలీ “ అని పాడాడట.

అంతే ఇరవైనాలుగ్గంటలూ. అద్దం  ముందు కూచుని చమేలీనేనని నిర్ధారణకు వచ్చేసి వెంటనే కాటుకతో బుగ్గమీద పుట్టుమచ్చ సృష్టించుకు౦ది.

కనుము తెల్లారి అచ్చు చమేలీలా బుగ్గన పెద్ద చుక్క, రెండు జడలు, పూల పూల జాకెట్టు, పొట్టి ఓణీతో స్కూల్ కి వచ్చింది. అందరూ దానికి పిచ్చి ముదిరిందని నిర్ణయి౦చేశారు… చామన చాయకు కొంచం అటుగా ఉండే రంగు గుండ్రటి పెనంలా మొహం ఆ మొహం మీద పెద్ద మచ్చ … ఉన్న అందాన్నీ వికారం చేసుకుంది.

ఆ తరువాత మరోనెల మరో హీరోయిన్  — చదువుకునే రోజుల్లో మేమంతా అందరు హీరోయిన్లకూ సహచరులమైపోయాము.

దాని పిచ్చి అలా కొనసాగుతూనే పోయి౦ది. ఇప్పుడిక పిల్లలు పెరిగి పెద్దయి వారి వారి జీవితాల్లో బిజీగా ఉన్నాక ఖాళీగా కూచుని క్రితం ఉగాది ము౦దు టీవీ చూస్తుంటే వచ్చిందా ఆలోచన.

ఏ రోజు పేపర్ చూసినా ఏ వార్తలు చూసినా ఉగాది పురస్కారాల ప్రస్తావనే. ఉగాది కవి సమ్మేళనాలు , ఉగాది ఉగాది ఉగాది ..

అంతే వచ్చే ఏడాదికల్లా కనీసం ఓ పది ఉగాది  పురస్కాలు సంపాయించకపోయానా నా పేరు ఇంటిపేరుతో సహా మార్చేసుకు౦టానని ప్రతిన పూని౦ది. దీని మొగుడు దీని పిచ్చి భరించలేక పదేళ్ళ క్రితమే పెన్షన్ ఇచ్చే ఉద్యోగాన్ని అనారోగ్యం దొంగ సర్టిఫికేట్తో కొడుక్కి ఇప్పించి భార్యకు పెన్షన్ ఏర్పాటు చేసి సన్నాసుల్లో కలసిపోయాడు.

ఆలోచన వచ్చిందే తడవు ఆఘమేఘాలమీద పెన్షన్ మీద బాంక్ లో అప్పు తీసుకుని మార్కేట్లో ఉన్న కవితా సంపుటాలన్నీ కొనేసింది.

ఉదయం లేస్తూనే పది సంపుటాల్లో పది కవితలని౦చి  పది లైన్లు కలిపి కుట్టి కొత్త కవిత తయారు చెయ్యడం, అది  పట్టుకు పది పత్రికాఫీసులు తిరగడం మొత్తానికి అనతికాలంలోనే పేరున్న కవయిత్రి అని తనకు తనే రాసుకోడం మొదలెట్టింది. ఒకరిద్దరు చిన్న కారు సంస్థలకు విరాలాలిచ్చి అవార్డులు ఇప్పి౦చుకు౦ది. అయితే అంతటితో ఆ దాహం తీరలేదు. తీరదు కూడా … ఇల్లు అమ్మి పుస్తకాలు .. ఒక ఏడాదిలో పది కథాసంపుటాలు ఒక ఇరవై నవలలు రాసి ముద్రించుకుంది.

ఇప్పుదావిడకు మిగిలినవి ఆ పుస్తకాలు , మేమెంతో చెక్కముక్కలే.

ఎవరైనా కనిపిస్తే చాలు ఇదిగో ఈ చీర ఇస్తాను ఒక అవార్డ్ ఇస్తావా అని అడుగుతూ ఉంటుంది

పాపం అవార్డ్ లక్ష్మి . అంటే కాదు నాలా వీధికొకరు పుట్టాలని శపించింది కూడా

 

 

 

2 thoughts on “పుకార్ల పురాణ౦ – పద్మావతమ్మ కధా సరిత్సాగరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *