April 27, 2024

అక్షర సాక్ష్యం

రచన: రంగనాథ్

మానవత:

నీవు పెద్ద పెద్ద
చదువులు చదివావు…
నీ జ్ఞానానికి
నిన్నభినందిస్తాను….
నీవు గొప్ప గొప్ప
పదవులు సాధించావు….
నీ సాధనని
గౌరవిస్తాను…
నీవు కోటానుకోట్లు
సంపాదించావు….
నీ సమర్ధతను
మెచ్చుకుంటాను…
నీలోని మానవతను
పెంచుకుంటే….
నీకు నేను
సాష్టాంగపడతాను!!

అతి:

విడుదలైన రోజునే
సినిమా చూడాలని
హీరో అభిమానుల
తొక్కిసలాట!!
కదం తొక్కే లాఠీలు–
చితికిపోయే చిన్నారులు!

ఆ పుణ్యదినమే
దర్శించుకోవాలని
దైవభక్తుల
తొక్కిసలాట!
చెలరేగే లాఠీలు–
చిత్తయ్యే చిన్నాపెద్దా!

అభిమానుల విషయంలో మాత్రం
పిచ్చి అభిమానం పనికిరాదంటారు!!

కలిమిలేములు:
మారాజు గుండెకు అలసట తెలీదు
పేదోడి గుండెకు విశ్రాంతే వుండదు–
ఉన్నవాడి కళ్ళకు కష్టాలు కనపడవు
లేనోడికి సుఖాలు కళ్ళబడవు –
ధనవంతుడి సౌధంలో…. సుగంధం
దరిద్రుడి పరిసరాలు.. దుర్గంధం-
భవనాల్లో నిత్యం శ్రావ్యసంగీతం
గుడిసెలో నిరంతర రోదనం-
ఇంట పాలరాయి పరచుకొన్నా…
వీడవు పాదరక్షలు కుబేరులను
ముళ్ళైనా, రాళ్ళైనా ఒట్టి కాళ్ళే కుచేరులకు
నిస్సహాయ మౌనశాపం అభాగ్యులకు!
భోగాల సంగతెలావున్నా
రోగాల విషయంలో మాత్రం
ఆపన్నులకు రక్తపోటుండదు…
శరీరం కొవ్వెక్కిపోదు- మధుమేహం దరిచేరదు!
సంపన్నులకు మాత్రం ఇవ్వన్నీ వుంటూ
తిన్నది అరగదు…
పడుకుంటే నిద్రపట్టదు!!

సృష్టిధర్మం :
అతని మోహనరూపం
మృదుమధుర స్వభావం
సమ్మోహన సాహిత్యం
ఆమె హృదయంలో
ప్రేమబీజం నాటాయి!
అతని తలపులు తొలకరిలో
ఆ బీజం మొలకెత్తింది- మొగ్గ తొడిగింది
ప్రేమపుష్పంగా వికసించింది-
పసుపుతాడు ఆ ప్రేమను శాశ్వతబంధం చేసింది!

మమతలు పరిమళించగా
వలపులు పెనవేతలో
ఇరువురు ఒకటైపోగా
సృష్టిధర్మం దీవించింది-
ఆమె గర్భంలో
బీజం మొలకెత్తింది
రూపలావణ్యాలను సంతరించుకొని
అమ్మవొడికి అలంకారమయ్యింది!

భోగం – భాగ్యం :
అది పాలరాతి కట్టడం….
ఆకాశాన్నంటే సౌధం!!
ప్రాంగణం పచ్చికమయం…
ఫలపుష్ప వృక్షశోభితం!
పారిజాత వనంలో
లక్ష్మీరమణుల ఇంద్రభవనం!
లంకంత మందిరంలో
భార్య- భర్త- రెండు కుక్కలు!
ఆ యింట ‘భౌ…భౌ..’ లే తప్ప
పిల్లల కేరింతలు వినిపించవు!
డబ్బు సంపాదన – డబ్బు సంపాదన
తెల్లారితే భర్త ఉరకలు పరుగులు!
ఆ రోజో- ఏ రోజో
అతని రాక అయోమయం!
ఆ యింట లక్ష్మీ కాపురం చేస్తున్నదా?
ఆ యింటికి కాపలా కాస్తున్నదా?
భర్త వుండడు యింటిపట్టున
కన్నబిడ్డలు లేరు ముచ్చట్లు తీరగ!
భోగం ముసుగులో
‘జీవిస్తోంది ‘ లక్ష్మి- అబద్ధంగా!!

ఆ యింటి ఆవరణలో
పాకలో పనిమనిషి గంగ
చిరిగిన బట్టలు
చింకిచాపలే ఆస్తిగా!
ముప్పతిప్పలు పెట్టినా
ముద్దొచ్చే బిడ్డలు!
తిట్టినా, కొట్టినా
లాలించే పెనిమిటి!
ఆభాగ్యం భావం లేశమైనా లేకుండా
‘బ్రతుకుతోంది ‘ గంగ – ‘నిజంగా’!

‘ముసుగు భోగం ‘ తనదని
‘అసలు భాగ్యం ‘ గంగదని అర్ధమైన లక్ష్మి
‘ఇంద్రభవనం ‘ తనకు
‘సజీవ సమాధి ‘ అని ఆక్రోశించింది!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *