May 6, 2024

స్వలింగ సంపర్కం వ్యక్తిగతమైనదా లేకా దేశనైతిక విలువలకి సంబంధమా ????

రచన, సేకరణ: డా. శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి
సైంటిస్ట్ ఇన్ ఫిలడెల్ఫియా, అమెరికా.

దేశ నైతిక విలువలా.. విచిత్రం గా వున్నది కదా? క్యూరియాసిటీ ని కూడా పెంచుతున్నది తెలుసుకోవాలని. ఏదో చీకట్లో నాలుగు గోడల మధ్య జరిగే వాటికీ, దేశాల నైతిక విలువలకి ఏవిటి సంబంధం? స్వలింగ సంపర్కులకు కఠినమైన శిక్షలు విధించడం ఎంతవరకు సమంజసం? యునైటెడ్ స్టేట్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎప్పటినుండో మరుగున పడివున్న విషయం-స్వలింగ సంపర్కాలు. వీటిని ఇప్పుడు చట్టబద్దం చెయ్యడంలో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
పాయింటుకొచ్చేద్దాం. చాలా సింపుల్. ఇంకా పూర్తి అభివృద్దికి నోచుకోని దేశాలలో యాంటీ-గే లా లు (anti-gay laws) వుండడానికి కారణం ఆయా దేశాలలో ఇంకా బ్రిటిష్ కొలోనియాలిజం అవశేషాలుండిపోవడం. ప్రపంచ మొత్తం మీద దాదాపు 80 దేశాల దాకా స్వలింగ సంపర్కాలను అమోదించలేదు, అందులో భారత దేశం ఒకటి. ఈ 80 లో కొన్ని దేశాలు మౌరిటానియా, సూడాన్, సౌదీ అరేబియా, ఇరాన్, యెమన్, నైజీరియా, సోమాలియా లోని కొన్ని భాగాలలో మరణ దండనలు కూడా వున్నాయి. మొన్నటికి మొన్న భరత దేశం అతి పెద్ద డెమాక్రటిక్ దేశము స్వలింగ సంపర్కాన్ని చట్ట విరుద్దం గా ప్రకటించింది. అంతేకాదు కామన్ వెల్ట్ నేషన్స్(53) లోని 42 దేశాలు అదే పాట పాడాయి, మరి ఇవన్నీ కూడా ఒకప్పటి బ్రిటిష్ రూలింగులో బ్రతికినవే. దీని అంతటికీ కారణం విక్టోరియన్ ఇరా లోని బ్రిటిష్ లాస్ (British laws) ఆనాటి రాచరికపు మరియు బ్రిటిష్ ఇంపీరియల్ గవర్నమెంట్ నుండి పుణికి పుచ్చుకున్న ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377 స్వలింగ సంపర్కాన్ని ప్రకృతి విరుద్ధ చర్య గా ప్రకటించడమే. అందుకే దీని ఉనికి కొలోనియాల్ రూల్ కి ముందునుండి కనబడుతున్నట్లుగా నేను భావిస్తున్నాను.
గ్రేట్ బ్రిటన్ నుండి స్వేచ్చని పొంది 40 ఏళ్ళు అయ్యాక కూడా ఉగాండా స్వలింగ సంపర్కులపై శిక్షలను ఎక్కువ చేసింది. ప్రపంచం లోని సగానికి పైగా ఈ స్వలింగ సంపర్కులను నేరస్తులు గా భావించడానికి కారణం విక్టోరియన్ నైతికతకు, బ్రిటిష్ లాస్ కు తల ఒగ్గి వుండడమే. మానవ హక్కులను (human rights) కాపాడాలంటే వీటి అవశేషాలనుండి బయటపడడమే చేయగలిగినది. ఇటువంటి నేపధ్యం లో యునైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎలెక్షన్స్ కు ముందు స్వలింగ సంపర్కులకు వివాహ యోగ్యతని చట్ట బద్దం గా కలిగించింది. ఇది బ్రిటిష్ లాస్ మత్తు నుండి బయటపడిన వ్యవహారమయి వుండవచ్చు లేదా హ్యూమన్ రైట్స్ కు విలువనిచ్చి వుండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక పెద్ద సామాజిక మార్పు. కొన్ని తరాల నుండి బయటికి రాకుండా ఈ సమస్య అణచివేయబడింది. అణగారిన ఈ వర్గ పోరాటం నుండి పైకెగిసిన జెండా రెయిన్ బౌ రంగుల జెండా.. భయం లేకుండా వారి ఉనికిని చాటుకునే లీగల్ కోడ్ !!!

LGBT-flag

ఇంతింతై వటుడింతై అన్నట్లు ఒకదగ్గిర సాధించిన మార్పు అక్కడికే పరిమితం కాకపోవచ్చు. ఈ మార్పు అన్ని దేశాలకు ప్రాకి భారత దేశానికి కూడా తట్టి లేపినప్పుడు.. భారత దేశం ఎలా స్పందించగలదు? లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (Lesbiyan, gay, bisexual, transgender, LGBT) మ్యారేజెస్ ని లీగల్ చెయ్యడం అనేది ఉచితమా? అనుచితమా? ఇది అమెరికా లాంటి దేశాలకు మాత్రమే చెల్లుతుందని మీ అభిప్రాయమా? అయితే ఎందుకు? ఇదే ఇండియా లో కూడా ప్రవేశపెడితే సమాజం మీద దీని ప్రభావం ఏమిటి అని విద్యా, వైజ్ఞానిక, వ్యాపార రంగాల్లో ని ముగ్గురు ప్రముఖులను విచారించగా వారి అభిప్రాయాలను ఇలా అందించారు.

డా. భానుకాంత్ మన్నె, పి. హెచ్.డి.
యూనివర్సిటీ ఆఫ్ యూటా, అమెరికా.
Bhanukant

పూర్వకాలాలనుండి భారత దేశం వివాహాలకి, కుటుంబవ్యవస్థకి ఎనలేని ప్రాముఖ్యత నిస్తున్నది. ఈ అందమైన డ్రామాల వెనుక ఎన్నో విచారకరమైన విషయాలు అణగారిపోయి వుండిపోయాయి. కొన్ని వందలసంవత్సరాల నుండి చిన్నచూపు చూడబడుతున్న ఆ విషయమే హోమో సెక్సువాలిటీ లేదా LGBT కమ్యూనిటీ. వీళ్ళు సంఘ విద్రోహక శక్తులు కారు, అంటు వ్యాధులకు గురి అయిన వాళ్ళు కారు, ప్రకృతి విరుద్దాలు కారు ముమ్మాటికీ నిజమైన నిజాలు. జరిగిన పరిశోధనల ప్రకారం హ్యూమన్ పాప్యులేషన్ లో 5-10% మంది స్వలింగ సంపర్కులుగా ఉన్నారు. ఈ హోమో సెక్సువాలిటీ మానవ జాతి లోనే కాదు, దాదాపుగా అన్ని జీవ రాశుల్లోనూ వుంది.
వారిని వెళ్ళి ప్రశ్నిస్తే మేమిలాగ పుట్టాం, అందువల్ల మేమిలా జీవిస్తున్నాం, ఇది మేము ఎంచుకున్న జీవితమంటారు. స్ట్రైట్ రిలేషన్ల లో వున్నవారు గే లను నిందించేముందు ఒక్కటాలోచించాలి వాళ్ళకి స్ట్రైట్ ఓరియెంటేషన్ ని ఎవరైనా సెలెక్ట్ చే సి పెట్టారా? ఇది వ్యక్తిగతం. 60 సంవత్సరాల క్రితం భారత దేశం లో అంటరానితనం ప్రబలిపోయి వుండేది. దీనికి కారణం ఆ వర్గానికి ఎక్కడ హక్కులను, సౌకర్యాలను కల్పిస్తే ఆ వర్గ ప్రజలు బాగుపడి పైకొచ్చి సమాజాన్ని కంట్రోల్ లోకి తీసుకుంటారో అనే భయం. డా. అంబేడ్కర్ మొదలైన వారి కృషి వల్ల ఈనాడు వాళ్ళకి సమాన హక్కులు కల్పించబడినవి. అలాగే LGBT వాళ్ళకి కూడా సమాన హక్కులు, వివాహ యోగ్యత కల్పించి వాళ్ళని ఒక స్ట్రీం లో కి లాగి నార్మల్ లైఫ్ ని కల్పించడం ఎంతైనా అవసరం. LGBT హక్కులను వ్యతిరేకించడం వల్ల సెకండ్ క్లాస్ సిటిజెన్స్ ని పెంపొందించిన వాళ్ళమవుతాం. ప్రేమ, కమిట్ మెంట్, సహజీవనమనేది పెళ్ళికి ముఖ్యమైన పునాదులు.. కేవలం సృష్టే కాదు ముఖ్యం. అలాగనుకుంటే సంతానోత్పతి చెయ్యలేని వారు, సంతానం వద్దనుకునే వాళ్ళు పెళ్ళి వ్యవస్థలో వుండడానికి అర్హులు కారు. సంతానం లేకపోయినా వాళ్ళందరూ ప్రేమ అనో, కమిట్ మెంట్ అనో పెళ్ళి వ్యవస్థ లో వున్నప్పుడు LGBT వాళ్ళు మాత్రం ఎందుకు వుండకూడదు??
LGBT మ్యారేజెస్ ని ఎంత వ్యతిరేకిస్తే వాళ్ళు నార్మల్ గా పెళ్ళి చేసుకొన్నప్పటికీ ఆ పెళ్ళి ని మోసం చేసి చాటు గా వారికి నచ్చిన జీవితాన్ని కొనసాగిస్తారు. అదే వీళ్ళకి సాంఘిక గౌరవాన్నిచ్చేస్తే.. ఆరోగ్యకరమైన సమాజాన్ని అందిస్తారు. వ్యతిరేకత తర తరాలుగా పాతుకుపోవడానికి కారణం, దాన్ని ఒక పాపపు యాక్టివిటీ గా అన్ని మతాలు పరిగిణిచడమే ప్రజలందరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి LGBT వాళ్ళు , వాళ్ళు గానే వుంటారు, స్ట్రైట్ రిలేషన్స్ లో వున్న వాళ్ళు స్ట్రైట్ రిలేషన్స్ లోనే వుంటారు. వీళ్ళు వాళ్ళు గా, వాళ్ళు వీళ్ళు గా మారటం అనేది జరుగదు, అది కేవలం భయం.

వెంకట్ యస్. అద్దంకి
భోపాల్, ఇండియా. Venkata addanki

సృష్టి మొదలైంది మొదలు ఈ ప్రపంచం మొత్తం పునరుత్పత్తి జరుగుతూ సకల జీవరాశులు తమ ఉనికిని చాటుకుంటూ, కాలనుగుణమైన మార్పులకి తమని తము మార్చుకుంటూ జీవనగమనం సాగదీస్తున్నాయి. ప్రాకృతిక మార్పుల వల్ల ఎన్నో జంతు, పక్షి జాతులు తుడిచిపెట్టుకుపోతున్నవి. అలాగే సృష్టి వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే ముందు ముందు కి మానవ జాతి కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలున్నాయి. ఆ కోవలోనికే వచ్చేది స్వలింగ సంపర్కం. ఇది ఎన్నో ఏళ్ళనుండి ఉన్నదే, కానీ అది ఒక మానసిక వికారమే, అదుపులో పెట్టి మళ్ళీ మామూలు స్ధితికి తీసుకురాగల రోగమే. అమెరికాలాంటి పాశ్చాత్యదేశాలు తొంభైయ్యో దశకంలో ఈ మూడవ జాతి పట్ల సానుకూలంగా ఒక గుర్తింపునిచ్చి ప్రోత్సహించటంతో కావాలని పేరుకోసం తమని తాము మార్చుకున్నవాళ్ళు కూడా కోకొల్లలు. కొన్ని రకాల హార్మోన్ల తేడా వల్ల వచ్చే ఈ విపరీత భావనలకి అంతవరకూ ఉన్న న్యూనత ఒకరకమైన వింతకోరికగా మారింది. మానవతాకోణం కాస్తా అదో రకమైన మహమ్మారిగా తయారుకావడానికి దోహదపడింది. సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్ళు మొదలుపెడితే వారికోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండే అభిమానగణం వేలం వెర్రిగా ఫాలోకావడం కూడా దీనికి పునాదులు గట్టిగా పడ్డాయి.

ఇదే కోవలో ఇప్పుడు అమెరికన్ చట్టం గే మ్యారేజ్ లకి ఒప్పుకోవడం. దీని దుష్ప్రభావం సహజ మానవజీవితం పై పడడం అన్నది ఖాయం. మానవ స్వేచ్ఛ కి ప్రాధాన్యం ఇచ్చే పాశ్చాత్య దేశాలలో ఇది వచ్చే కొన్ని సంవత్సరాలలో బాగా కనపడే అవకాశాలు మెండు. ఇది కొన్ని కొత్తరోగాలనీ, కొత్త విపరీతధోరణులనీ, వైపరీత్యాలను సమాజం పై వదలడానికీ కారణం కావచ్చు. కొన్ని సార్లు బలవంతపు మార్పిడులకు పాల్పడవచ్చు. ఏది ఏమైనా ఇది మానవజాతి మనుగడకు , సహజసిద్ధమైన పునరుత్పత్తి వ్యవస్ధకు ఒక గొడ్డలి పెట్టు.

ఎప్పుడూ పాశ్చాత్యదేశాల పోకడలని అనుకరించడానికి ఉత్సాహపడే నైజం వల్ల భారతదేశం లో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందీ అన్నది ఖాయం. వాత్సాయనుడు కూడా ఈ స్వలింగ సంపర్క ధోరణులని తెలియబరచాడు. ఎప్పటినుండో అనాదిగా ఉన్నా ఇప్పటివరకూ కూడా ఈ జాతిని ఒక న్యూనతా దృష్టితోనే చూస్తున్నారు. ఇప్పటికీ ఈ విధమన చట్టాల పట్ల భారతదేశ ప్రజలు ఏవగింపునే కలిగి ఉన్నారు అన్నది నిజం. సృష్టి వ్యతిరేక ధోరణికి పాల్పడకపోవడం, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ,పటిష్టమైన వివాహవ్యవస్ధ పై ఉన్న నమ్మకం మన దేశంలో ఇటువంటి చట్టాలను వ్యతిరేకించే విధంగా తయారు చేసాయి.

ఇంటిగుట్టు ఈశ్వరుడికైనా తెలియకుండా పిల్లాడిలో ఉన్నలోపాలు గుర్తించినా లేక వివాహం అయిన తరువాత గుర్తించినా విషయం బయటకి రాకుండా ఇంట్లో మిగిలిన మగవాళ్ళచేత గుట్టుగా సంసారం చేయించి పరువుకాపాడు కొంటున్న సంసారాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చదువుల వల్ల, ఆర్ధిక స్ధితి గతుల వల్ల, ఆర్ధిక స్వాతంత్రం వల్ల కొంతమంది అమ్మాయిలు నిర్భయంగా బయటకొస్తుండడం వల్ల తెలుస్తోంది కానీ మెజారిటీ బయటకి రాకపోవడం వల్ల ఈ రకమైన సమస్య ఎంత గాఢంగా భారతావనిలో ఉంది అన్నది తెలియడం కష్టం. ఈ మధ్యనే జరిగిన ప్రియావేది ఆత్మహత్య దీనికి ఒక తార్కాణం మాత్రమే. దీని వెనుక బలమైన కారణం, సమాజం ఈ రకమైన జాతిని హర్షించకపోవడం, న్యూనతాభావంతో చూడడం, అవహేళనలకు గురిచెయ్యడం. మానవతా దృక్పధం లో ఆలోచించగలిగితే కనీసం ప్రియావేది లాంటి అమ్మాయిల జీవితాలు బలికావు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు వచ్చిన అమెరికన్ చట్టం మంచిదే అని అనిపించక మానదు. కానీ విచ్ఛలవిడి శృంగారం తెచ్చిన ఎయిడ్స్ మహమ్మారిని చూస్తూ ఈ రకమైన బాంధవ్యాలు ఏ రకమైన మహమ్మారుని తెచ్చి మనమీదకు వదులుతాయన్నదీ అతిపెద్ద ప్రశ్నే. ఏది ఏమయితేనేమి అగ్రరాజ్యం ఒక కాష్టాన్ని రగిలించింది, దీని ప్రభావం మిగతా ప్రపంచం మీద ఎలా ఉంటుంది అన్నది ఊహించే కన్నా వేచిచూడడమే మనం చెయ్యగలిగినది.

కట్టమూరి కిషోర్ కుమార్, జెనెరల్ మేనేజర్ at VISPL
పాట్నా, ఇండియాKattamuri

ముందుగా తెలుసుకోవలసిన విషయం ఎందుకు కొంతమంది స్వలింగ ఆకర్షణకు ఎందుకు గురవుతున్నారు లేదా స్వలింగ సంపర్కానికి ఎందుకు మొగ్గుచుపుతున్నారు – దీనికి ఒక వ్యక్తీ పెరిగిన పరిసరాలు గాని పెంపకం లోని లోపాలుగాని బాల్యం లోని అసాధారణ పరిస్తితులు గాని కారణం కాబోవని వైజ్ఞానికులు తెలియజేశారు – కేవలం వ్యక్తీగత హార్మోనుల అసమతౌల్యం మరియు వ్యక్తిగతంగా పెంపొందించుకునే ఇష్టాలు కారణం అయిఉండవచ్చును అని తెలుస్తోంది.
ఇక భారతదేశం విషయానికి వస్తే అతిపెద్ద సమాజమైన హిందూ సాంప్రదాయంలో ప్రాచీన కాలంలో దీనిని పూర్తిగా వ్యతిరేకించనూ లేదు అలా అని సమర్ధించనూ లేదు, చతుర్వేదాలలో ఒకటైన ఋగ్వేదములో చెప్పినట్టుగా “విక్రుతిః ఎవం ప్రక్రుతిః” అనగా విక్రుతముగా (వింతగా) కనబడేది కూడా ప్రాకృతమే లేదా ఒక కోణములో సరి అయినదే. భారతదేశములో దాదాపు 18 వ శతాబ్దము వరకు ఈ స్వలింగ సంపర్కాన్ని వింతగానో లేదా ప్రక్రుతి విరుద్దమనో భావించలేదు అటువంటి వ్యక్తులను సమాజానికి అపాయకరమని గాని నిరుపయోగమని కూడా భావించలేదు – అజంతా ఎల్లోరా లలో గల దేవాలయాలపై చెక్కబడ్డ శిల్పాలలో మనం ఈ స్వలింగ సంపర్కపు ఆనవాళ్ళను చూడవచ్చు.
కాలక్రమేణా కామశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యడం అనాగరికమన్న భావన పెరగడం తో ఆ విషయం పై విజ్ఞానత కొరవై స్వలింగ సంపర్కాన్ని, నపుంసకత్వాన్ని ఒకటే అనుకోవడం మొదలయి అదంతా తప్పు ప్రక్రుతి విరుద్దము అన్న భావన నెలకొంది. అయితే చాలావరకు నపుంసకులు లింగమార్పిడికి మొగ్గుచూపడం తో ఈ రెండిటి మధ్య గల దగ్గరి సంభందాన్ని కూడా కొట్టిపారేయ్యలేము, దిగువ తరగతి నపుంసకులు లింగమార్పిడి చేయిన్చుకోగల ఆర్ధిక స్తోమత కలిగిఉండకపోవడం భారతదేశం లో లింగమార్పిడికి సదుపాయములు అవకాశములు లేకపోవడము, కొంతవరకు ఆసక్తి లేకపోవడము వలన వారందరూ హిజ్రా ల పేరుతొ కొంత విక్రుతత్వాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. ఆ విధంగా స్వలింగ సంపర్కము అన్నది నెమ్మదిగా నపుంసకత్వముగా చలామణి అయ్యి అటువంటి హార్మోనుల అసమతౌల్యం కలిగిన వ్యక్తులు కూడా ఆ సన్నని రేఖను తెలుసుకోలేక హిజ్రాలుగా చలామణి అవుతూ ఉండడం మనం గమనించవచ్చు- ఇది పురుషుల విషయంలో ఎక్కువగా బహిర్గతమయి సమాజానికి తెలియడం జరుగుతోంది వీరినే ఇంగ్లీషులో “గే” గా వ్యవహరిస్తున్నారు – ఇలాగే స్వలింగ సంపర్కము మీద ఆసక్తి కలిగిన స్త్రీలను “లెస్బియన్” లుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ప్రాచీన భారత వాగ్జ్మయము లో ఇటువంటి లింగమార్పిడి ఆసక్తిని ప్రక్రుతిసిద్దముగా సంభవించే సహజమైన చర్య గానే పరిగణించారు దీనికి స్పష్టమైన ఉదాహరణగా మహాభారతములోని శిఖండి,బృహన్నల పాత్రలను ఉటంకించవచ్చును. అలాగే 16 వ శతాబ్దములో భారతదేశం లో మొఘలు సామ్రాజ్య స్థాపకుడైన “బాబర్” తన నిష్పక్షపాత ఆత్మకథ “బాబుర్నామా” లో తనకు ఎర్రటి పెదాలుగల కుర్రవాడిపై సంభోగపు ఆసక్తి గురించి తెలియజేశాడు
మానవజాతి ఆవిర్భావమునుంచి ప్రస్తుతమువరకు గల నాగరికతలన్నిటిలోనూ అత్యంత ప్రాచీనమైన వాగ్జ్మయము (కనీసం క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితమే చతుర్వేదాలు వ్రాయబడ్డాయని పురాతత్వ శాస్త్రజ్ఞుల అంచనా)కలిగిన భారతీయ సంస్కృతిలో ఈ స్వలింగ సంపర్కాన్ని గాని స్వలింగ వివాహాన్ని గాని తప్పుగా భావించలేదు, 18 వ శతాబ్దపు చివరి కాలంలో “లార్డ్ మెకాలే” విరచిత కొలోనియల్ శిక్షా స్మృతి’ విరివిగా అమలు కావడం దరిమిలా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా “మెకాలే మాడ్యుల్ శిక్షా స్మృతి’ కొంతవరకు ఆచరణలో ఉండడంతో ఈ స్వలింగ వివాహాలను ప్రక్రుతి విరుద్ధముగా భావించడం(IPC ఆర్టికల్ 377) జరిగింది.
అయితే ఈ స్వలింగ సహజీవనము వల్లన కలిగే దుష్పరిణామాలు ఆరోగ్య పరమైన అసమతౌల్యములు గురించి తెలియజేసి వారిని ఇటువంటి అసహజత నుంచి బయటకు తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది దానికి కావలసిన మౌలిక విద్యను ప్రోత్సహించి, మానసిక వైద్యశాస్త్రాన్ని మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలసిన భాద్యత వైద్య ఆరోగ్య శాఖల పై ఎంతో ఉంది. ముఖ్యముగా ఇటువంటి అసహజతను ఒక వైకల్యముగా మాత్రమె పరిగణించడం, సమాజానికి ఇటువంటివారు హానికారకం కాదన్న విషయం ప్రజకు తెలియజెయ్యాలి. ఏది ఏమయినప్పటికీ వివాహము లేదా సహజీవనము అన్నది ఇద్దరు వ్యక్తుల స్వేచ్చా స్వాతంత్ర్యాలకు సంభందించిన వ్యవహారము కాబట్టి – సమాజం మీద దుష్పణామాలు వుండనంత వరకూఈ స్వలింగ వివాహములను సమర్ధించవచ్చును. అర్ధనారీశ్వర తత్వానికి దైవత్వపు హోదా ఇచ్చి గౌరవించిన భారతీయ నాగరికత మీద ఈ స్వలింగ సహజీవనం చెడు ప్రభావం చూపదు అన్నది నా నమ్మకం.

3 thoughts on “స్వలింగ సంపర్కం వ్యక్తిగతమైనదా లేకా దేశనైతిక విలువలకి సంబంధమా ????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *