May 1, 2024

అక్షర సాక్ష్యం – రంగనాథ్ కవితలు

రచన: రంగనాథ్

1. (అ) సమర్ధత

సముద్ర జలాలను
జయించిన మానవుడు
తాగునీరందరికీ
చేర్చలేకున్నాడు-
విద్యుత్తు నుత్పత్తి
చేయగలిగినవాడు
గ్రామాలన్నిటికీ
తేలేకున్నాడు-
సకల విద్యలలో ఆరితేరినవాడైనా
సమంగా అందరికీ
అందివ్వకున్నాడు
వైద్యరంగాన అసాధ్యాలను
సాధించినవాడు
ఆరోగ్యపరంగా అందరికీ
అందకున్నాడు-
వైజ్ఞానికంగా ఎంతో
ఎగబాకిన మానవుడు
నైతికంగా నేడు
దిగజారుతున్నాడు!

2. స్థితిగతులు

పాతికేళ్ళ క్రితం – రామయ్యకి
రోజుకొక్క పూటే- నోట్లోకి
నాలుగు వేళ్లు పోయేవి……
పాపం – పేదరికం !

ఇప్పుడతను రామయ్యగారు….
కోటీశ్వరుడైపోయాడు-
ఇప్పుడా ఒక్కపూటైనా
నోట్లోకి నాలుగువేళ్లు
పోవడం లేదట—-
అనారోగ్యమేమో అనుకొన్నాను !

అతని వేళ్ల దురదృష్టానికి బాధపడుతూ
అతని కుడి చేతి వేళ్ళ వైపు
జాలిగా చూశాను—
పది తులాలకు తగ్గని కండబలంతో
వేలికొక పసిడిదేవుడు చుట్టుకొని వున్నాడు!

అరెరె…. ఎడం చేతి వేళ్లకు కూడా !
ఇక నోట్లోకి వేళ్లా? ఎలా?
అయ్యోపాపం… ఐశ్వర్యం!!!

3. పంచభూతాల సంతానం

పంచభూతాలు ప్రేమగా
పెంచుకున్నదే ప్రాణికోటి!
ఇప్పుడా పంచభూతాల బెంగంతా
మనుష్యజాతి తీరుతెన్నుల పైనే!
స్వార్ధపరులై మానవులు దానవులైపోతుంటే
పుడమి తల్లి హృదయం అగ్నిపర్వతమై బద్దలైపోతోంది!
తండ్రి భానుడు – రోజురోజుకి ఉగ్రుడౌతున్నాడు!
మేనమామ చంద్రుడు – ముఖం చాటేస్తున్నాడు!
మరో మేనమామ వాయువు-
అప్పుడప్పుడూ వచ్చి బుద్ధి చెప్తున్నాడు!
పెద్దతల్లి గంగమ్మ-
మనుషుల మనసుల్ని సునామీలా వచ్చి
కడిగేయజూస్తోంది….
తానే వర్షమై తిరిగొచ్చి దీవించిపోతోంది!
మానులు మొక్కలు కొత్తచిగుళ్ళు తొడుగుతున్నాయి….
మనుషులు మాత్రం బండబారిపోతున్నారు!
సాక్షీభూతమై ఆకాశం-
నిస్సహాయంగా ఆక్రోశిస్తోంది….
చుట్టాలైన చుక్కలు- హేళాగా నవ్వుకుంటున్నాయి!!!!

4. యవ్వన వేగం

ప్రేమంటే మోజులేని దెందరికి?
అసలు ప్రేమంటే ఏమిటో తెలిసింది ఎందరికి??
రోజ్ రోజ్ రోజంటూ గులాబీ నందించి
లవ్ లవ్ లవ్వంటూ ‘ ఐ లవ్ యూ ‘ అనేస్తే
వలపు విచ్చుకొంటుందా – ప్రేమ పుట్టుకొస్తుందా?
‘ప్రేమికుల రోజం ‘టూ గ్రీటింగ్స్ చెప్పేసి
తీపి గుర్తుగా బుల్లికానుకల నందిస్తే
రాగబంధమౌతుందా – హృదయవీణ మ్రోగుతుందా?
రైడ్ రైడ్ రైడంటూ మోటరు సైలెక్కి
ఒళ్ళు ఒళ్ళు రాసుకొంటూ వూరంతా తిరిగేస్తే-
పబ్ పబ్ పబ్బంటూ పబ్బం గడిపేసుకొంటే-
పబ్లిగ్గా పార్కుల్లో పెనవేసుక్కూర్చుంటే-
ప్రేమ పరిమళిస్తుందా- బ్రతుకు పండిపోతుందా?
కాలక్షేపం కాదు ప్రేమంటే-
అవసరాలు తీరే అవకాశం కానే కాదు-
అటు ఇటు కాని వయస్సులో పరిపక్వత చెందని మనసుల్ని
మాయలో పడేసే ఆకర్షణది…
ఎవరెన్ని చెప్పినా వినని వేగమది….
యవ్వన వేగమది… తెలియని మైకమది!!

5. ప్రగతి గతి

రథాన్ని లాగేవాళ్ళు కోట్లాటలో మునిగిపోయారు-
ప్రగతి రథం ఆగిపోయింది!
రాజకీయ పార్టీలు పరస్పరం
నిందారోపణలలో నిమగ్నమయ్యాయి-
దేశాభ్యుదయం స్తంభించింది!
చిన్నాపెద్దా పరిశ్రమలు పనిచెయ్యాలన్నా
పంటపొలాలకు నీరందాలన్నా
ప్రజల నిత్యావసరాలెన్నో తీరాలన్నా
విద్యుత్ శక్తి ఎంతో అవసరం-
విద్యుదుత్పత్తి జరగకుంటే అన్నిటా ప్రతిష్ఠంభనే!
అసెంబ్లీ, పార్లమెంట్లలో
వితండవాదాలు, నిరంతర వాయిదాలతో
ప్రజాసమస్యలపై చర్చలు సజావుగా సాగకుంటే
ప్రజాజీవితం అస్తవ్యస్తం…. అయోమయం!
కేకల అరుపుల గోలకు
పెట్టింది పేరు- పూర్వం… చేపల బజారు….
ఇప్పుడా ఖ్యాతిని దక్కించుకొన్నది…. చట్టసభలు!
సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం
పరితపించే నాయకులు కరువైతే
దేశంలో ప్రజాస్వామ్యం కాజాలదు అర్ధవంతం!!

6. డబ్బు! డబ్బు!!

గుండె గానం లబ్ డబ్ నుండి
డబ్బు డబ్బుకి మారింది-
హృదయభావం
మమకారం నుండి
వ్యాపారం వైపు మళ్లింది-
దాంపత్య వుద్దేశం
సంతానం నుండి
సంపాదనకు తిరిగింది-
జీవిత లక్ష్యం
నీతినియమాల నుండి
అవినీతి ఆదాయం అయింది-
బ్రతుకు విధానం
సుఖసంతోషాలకు నోచని
ఉరుకుల పరుగుల పాలయ్యింది!!

7. తరాల తీరు

తరాల తారతమ్యం
నిరంతరం కొనసాగుతుంది-
నిన్నటి, నేటి, రేపటి తరాలవారి
అనుభవాలు వేరు- అనుభూతులు వేరు….
బ్రతుకుబాటల తీరుతెన్నులు వేరు!
దేశానికి స్వతంత్రం తెచ్చిన తరం…. నాది
అది అనురాగాలు- ఆప్యాయతలు
శాంతిసహనాలు- న్యాయధర్మాలు
వైజ్ఞానిక వికాసాలు… వర్ధిల్లిన కాలం!

గిరిగీసుకొని అజ్ఞానపు చీకట్లో
మగ్గిపోయారు… నా తాతముత్తాతలు!
అవధులు దాటి విజ్ఞానపు వెలుగులో
పరిఢవిల్లారు…. నా తరం వారు-
నవనాగరికత పేర జ్ఞానం వెయ్యితలలు వెఱ్ఱిగా
మారుతోంది నేడు!
పాపం- ఏమయిపోతారో…
నా మనుమలు- మునిమనుమలు?!
విజ్ఞానం అంటే వికసించిన జ్ఞానం-
ఇప్పుడు అది వికటించిన జ్ఞానం!!

8. అక్రమతాండవం

గతంలో
అక్రమాలు అక్కడక్కడా వున్నా
మితిమీరిపోలేదు నేడున్న రీతిగా!
దైవభీతి లేనివాడు అందుకు తలపడినా
లోకభీతి కలిగి హద్దులు పాటించాడు!

దైవభీతి సంగతి దేవుడెరుగు-
లోకభీతి సైతం కానరాని కాలమిది….
అక్రమాల తైతక్కలు సాగుతున్న కాలమిది!

ఇదంతా చూస్తుంటే….
నాకో అనుమానం-
‘అహం బ్రహ్మాస్మి ‘ అనే వేదాంతుల భోధనతో
‘నేనే దైవాన్ని- నాకడ్డు నిలిచేదెవ ‘ రని
మనుషులే యీ అక్రమతాండవానికి
పాల్పడడం లేదు కదా!!!

9. ఆదరణ

బడుగు బలహీన వర్గాల వారిని
ఇంటిబయట కూర్చోబెట్టి
కడుపు నింపేవారు
‘కులం- కులం ‘ అని
కొట్టుకు చచ్చిన
అనాగరిక
సాంప్రదాయాల కాలంలో
ప్రజాస్వామ్యం పేరుతో
సామాజిక న్యాయమంటూ
ప్రక్కన కూర్చోబెట్టుకొని
పంచభక్ష్యాలు వడ్డించి
చేతులు కట్టేస్తున్నారు-
నోటికి అందనీయకున్నారు
నేటి అభ్యుదయ సమాజంలో!!

10. వృద్ధాప్యం

ర్యాంకుల పోటీ చదువులో
బాల్యం బలైనా
పిల్లల పెళ్ళిళ్ళు
లోన్స్ క్లియరెన్సుల
బరువు బాధ్యతలతో
యవ్వనం ఖర్చైపోయినా
బాధపడని ధీరులు
మమతానురాగాలు
మనీమేటర్స్ తో
ముడిపడిపోతున్న
ఈ కాలంలో
“మరణించేదాక
ఎవరికీ బరువైపోకుండ
పరువుగా బ్రతగ్గలనా? ”
అని వృద్ధాప్యంలో
భయపడుతున్నారు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *