May 1, 2024

// ఏక్ తార //

రచన: కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

kalam

రైలు వెళ్ళిపోతుందన్న హడావుడిలో ఆటో దిగిన సుధేష్ ని ఎవరో చెయ్యిపట్టుకు లాగుతున్నట్లనిపించి చిరాగ్గా చూశాడు వెనక్కి..
అయ్య..అయ్యా.. అయ్య.. ఒక్కరూపాయుంటే ఇయ్యయ్య.. అయ్యా.. అంటూ చేతిలోని ఏక్ తార ను వాయిస్తూ అడుగుతున్నాడు ఓ చిన్నోడు..
అయ్య.. అయ్య.. అయ్య..
అయ్య.. అయ్య.. అయ్య..
” లేదు ఫో… ” అంటూ విదిలించుకుని అంటూ స్టేషన్ లోకి వడివడిగా పరిగెడుతున్న సుధేశ్ ని వెంటబడుతూనే ఉన్నాడు ఆ చిన్నోడు..
“అయ్యా.. ఆకలేస్తోంది.. చిన్నది పొద్దుగాల్నుంచి ఏందిన్లే… ఒక్కరూపాయుంటే.. ఇయ్యయ్యా.. అయ్యా..అట్టెళ్లమాక.. ఒక్కరూపాయియ్యయ్యా.!”
టికెట్ క్యూలోకి వెళ్ళేంతవరకూ వెంటబడ్డ కుర్రాడు సుధేష్ తో ఏం లాభం లేదనుకున్నాడో ఏమో తన దగ్గరి ఏక్ తార పై చక్కటి త్యాగరాజ కృతి వాయిస్తూ మరొక వ్యక్తి దగ్గరకు పరిగెత్తాడు..!
చినిగి చీకిపోయిన చొక్కా. జారుతున్న లాగు.. మాసిన జుట్టు.. ఒంటిపై అక్కడక్కడా దెబ్బలు.. వాడి పక్కన ఓ చిట్టిది.. లంగా జాకెట్టూ.. చెదిరిన జుట్టూ.. చీదడం తెలీక జారుతున్న ముక్కు… నట్టనడిన సూరీడి ప్రతాపం లెక్కచేయకుండా.. “అన్నా నువ్వైనా ఇయ్యన్నా..! ఆకలేస్తోంది.. చిన్నది
పొద్దుగాల్నుంచి ఏందిన్లే… ఒక్కరూపాయుంటే.. ఇయ్యయ్యా.. కాస్త జాలి జూపించన్నా..! ” ప్లీజన్నా.. ఒన్ రూపీ అన్నా..”
చివరి ఇంగ్లీశు పదాలు సుధేష్ కి వినిపించి, వెనక్కి తిరిగి, తన వెంటబడిన ఆ కుర్రోడికేసి తీక్షణంగా చూశాడు.. ఎక్కడో చూసినట్లనిపించింది.. బాగా చూసిన జ్ఞాపకం.. టికెట్ తీసుకుని రైలెక్కాడే గానీ.. మస్తిష్కం మాత్రం గతాన్ని తవ్వి తీస్తూనే ఉంది.. కంప్యూటర్ సెర్చ్ కుక్కలాగా..! రైలు దిగి
ఆఫీస్ కు వెళ్ళాక కూడా తనను వెంటాడుతూనే ఉందా ప్రశ్న.. ఎక్కడ ఎక్కడ..ఎక్కడో చూశా.. బాగా చూసిన జ్ఞాపకం.. దగ్గర నుంచీ.. విఐపిలాగా చూసిన జ్ఞాపకం ?? నిజమా.. లేక కలా..? అనుమానం వెంటాడుతుండగా… తాను అనుకునే పిల్లవాడూ ఇతడూ ఒకడేనా..? అయితే
ఇక్కడెందుకున్నాడూ అని బుర్ర హీటెక్కి పోతోంది సుధేష్ కి.
అంతగా సుధేష్ మెదడుకు పని పెట్టిన కుర్రాడి పేరు ఓబులేశు..
ఉదయం నుంచి అడుక్కోగా, వచ్చిన డబ్బుతో స్టేషన్ బయట టీ కొట్టులో , చెల్లికి పాలు ఇప్పిస్తూ తనకి రెండు బిస్కట్లు ఇమ్మని అడిగాడు ఓబులేశు… అంతలో అక్కడ తగిలించిన పేపర్లో పడ్డ ఒక ఫొటో వాడ్ని ఆకర్షించింది.. ఆ ఫొటోని తీక్షణంగా చూస్తూ… ” అయ్యా ఈయన…” ప్రక్కనున్న వ్యక్తిని ఫ్యాంటు గీరి .. అడిగాడు..
“ఛ.. దొంగనాకొడకా.. ఇష్టమొచ్చినట్లు తాకుతావ్.. ఏడబడితే ఆడ తిరిగొచ్చి..”
అతను తిడుతున్నా.. అదేమీ ఓబులేశు బుర్రకు ఎక్కడంలా.. “అయ్యా.. ఈ తాత…” మళ్ళీ అదే ప్రశ్న…
ఆ వ్యక్తి ఏమనుకున్నాడో ఏమో.. “ఆ పెద్దాయన రెండు రోజుల్లో ఈ ఊరొస్తున్నాడు..ఫో..” అని ఏవగించుకున్నాడు..
“అయ్యా బిస్కెట్ వద్దు … పేపరీ..” అని పేపర్ కొనుక్కున్నాడు.. ఏదో తెలీని అనిర్వచనీయమైన ఆనందానికి లోనౌతున్నాడు.
“పెద్ద తెలిసోనోడిలా ఏం ఫోజురా..! అడుక్కుండే వాడికీ పేపరు , దానిలో న్యూస్ కావలిసొచ్చిందే..!” అంటూ గొణుగుతున్నాడు.. ప్రక్కన నిలబడ్డ వ్యక్తి.
వెంటనే ఆ ఓబులేశు.. పాలు త్రాగిన చెల్లి మూతి తుడిచి చంకకెత్తుకుని..
” చిల్డ్రన్ మస్ట్ బీ హ్యాపీ.. వెన్ చిల్డ్రన్ ఆర్ హ్యాపీ.. పేరెంట్స్ విల్ బీ హేపీ.. వెన్ పేరెంట్స్ ఆర్ హేపీ..సొసైటీ విల్ బి హ్యాపీ.. వెన్ సొసైటీ ఈస్ హేపీ.. ఇండియా విల్ బి హేపీ.. వెన్ ఇండియా ఈస్ హ్యాపీ.. ది వరల్డ్ విల్ బి హ్యాపీ” అంటూ ప్రతిజ్ఞ చేసిన వాడిలా.. చక చకా చెప్పేసాడు ఓబులేశు ఇంగ్లీశు అంతా కంఠతా వచ్చినోడిలా..! ఏదో గొప్పపని చేశానన్న గర్వం తొణికిసలాడుతుండగా.. అక్కడ నుంచి చెల్లితో సహా వెళ్ళిపోయాడు.. ఓబులేశు..
ఓబులేశు బట్టీ వేసి ఒప్పజెప్పిన ఆ వాక్యాలు ఒక మహానుభావుడు నేర్పినవి.
నోరు పారేసుకున్న వ్యక్తి.. నోరెళ్లబెట్టాడు.. అతను ఆ ఊర్లో పేరు మోసిన కార్పొరేట్ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్… అడుక్కున్న ఓబులేశు వైపు అలాగే బిక్క మొఖం వేసుకుని చూస్తూ ఉండిపోయాడు.. ఆ నాలుగు ఇంగ్లీశు మాటలు తప్ప ఓబులేశుకు ఏమీ రావని తెలిస్తే ఇంకెంత ఆశ్చర్యపోయేవాడో
పాపం ఆ ఇంగ్లీశు మాస్టారు.
*****
సాయంత్రం…
ఇంటికి చేరాక
చేతిలో ఫొటో చూస్తూ కూర్చున్న ఓబులేశు దగ్గరికి ఇంకొకడొచ్చాడు..! ఏంద్రదీ ఓబులేశా..!.. ఎవళ్లదా బొమ్మా..?..
“ఈ తాత మనూరొస్తున్నాడంట.. ఎట్టైనా కలవాలిరా.. ఈ తాతని కలిస్తే మన కష్టాలన్నీ దీరిపోతాయ్.. శివడా..” అన్నాడు ఓబులేశు.
ఓబులేశు, శివుడు ప్రాణ మిత్రులు.. ఊరి చివర, మురుగు కాల్వ ప్రక్కన వేసుకున్న తాత్కాలిక పాకల్లో వీరి నివాసం.. దాదాపూ 30 కుటుంబాల వరకూ అక్కడ కాపురం ఉంటారు.. అందులో ఆడాళ్లంతా ఒక టీం.. పెద్దాళ్ళు చిన్నాళ్ళకి పెళ్ళికూతురు వేషం వేసి.. పెళ్ళి అంటూ అడుక్కోవడం…
కొందరు చిన్నపిల్లల్ని చంకనెత్తుకుని అడుక్కోవడం.. గర్భం దాల్చిన కొందరు గర్భం చూపించి అడుక్కోవడం.. ఆడాళ్ళ వృత్తి.. ఇక చిన్న పిల్లల్లో కొంత వయసు ఉన్న వారికి, మరో చిన్న పిల్లని తోడు తీసుకుని పోయి అడుక్కోవడం.. స్వాముల వేషాలేసుకుని కొందరు, కుంటివాళ్ళలా కొందరు అదుక్కోవడం. ఇక మగాళ్ళ పని ఎక్కడెక్కడ, ఎవరు అడుక్కోవాలో నిర్ణయించడం.. మరలా ఏ వూరు వెళ్ళాలా అని నిర్ణయించి.. అక్కడికెళ్ళి పరిస్థితి బేరీజు వేయడం,… ఒక రకంగా మార్కెటింగ్ సర్వే మగాళ్ళ పని ..! ఇదీ ఆ ముఫ్ఫై వలస కుటుంబాల నిత్య కృత్యం.. అడపాదడపా.. పోలీసోల్లకి దొంగలెవరన్నా దొరక్కపోతే ఈ ఊరి చివర పాకల్నే సెటిల్ మెంట్ వాళ్ళలా భూతద్దమేసి చూపించి , లోపలేసి చేతులు దులుపుకుంటుంటారు .. అర్ధరాత్రిళ్ళు ఒక్కసారిగా బెటాలియన్ లు విరుచుకుపడి కుమ్మేసి స్టేషన్ కి తరలిస్తుంటారు.. అప్పుడు ఈ చిన్నపిల్లలే , అడుక్కొచ్చి అన్నం పెట్టి, వాళ్ళ అమ్మా, అయ్యలొచ్చిందాకా ముసిలోల్లని పోషిస్తుంటారు. విజయనగరం నుంచి ఈ మధ్యే ఒంగోలు వచ్చి ఈ కూటమిలో కలిశారు ఓబులేశు అమ్మ అయ్య..!
“ఎవర్రా ఆ తాత? మన లచ్చీ తాతా మాదిరా..? ” వాళ్ల తాతను గుర్తు చేసుకున్నాడు శివుడు..
“కాదురా..! ఈయన మన దేశం మొత్తానికి పెద్ద.. ఈయన అంటే అందరికీ బయమే.. ఆ మనల్నెత్తుకెల్తారే ఆ పోలీసోల్లకీ.. అందరికీ బయమే”
“అట్టనా.. ఆ తాత పేరేందిరా..?”
“కలాం.. అబ్దుల్ కలాం.. మన దేశానికంతా పెద్ద..
రాష్ట్రపతి అంతారీ తాతని. ..
అన్నీ దెల్సు ఈ తాతకి , …
బలే సెప్తాడు దెల్సా… .
ఈ తాత మామూలోడుగాదు.. రాకెట్లు చేసిండంటా… సానా గొప్పోడు..”
“ఆ.. మనమెప్పటికీ అవ్వంగా ఓబులేశా.. గొప్పోల్లం”. దీనంగా అడిగాడు శివుడు..
“అయినా ఇయ్యన్నీ నికెట్టాదెల్సు.. అన్నీ తెలిసినోడి మల్లే సెబుతున్నా..” ఓబులేశుని నిలదీశాడు శివుడు..
” అయినా అంత పెద్ద తాత దగ్గరకు మనల్ని రానీరుగదా ఆ పోలీసోల్లు.. సిన్మావోల్లొత్తేనే ఆల్లు రాసుకుపూసుకుంతారు గానీ మనల్ని సూడ్నీరు గదా…” ప్రశ్నల వర్షం కురిపించాడు శివుడు.
“అవన్నీ తర్వాత చెబుతా ఆయన నాకు బాగా దెల్సు గదా.. రేపెళ్దాం ఆ తాతని చూసొద్దాం . అమ్మోళ్ళకు చెప్పవాక.. ఆడ్నే సానామంది ఉంటారు గదా.. తాతని జూసినంక అడుక్కుని ఇస్కూల్ తాన అడుక్కున్నాం అని సెబ్దాం.. సరేనా.. సెల్లి నేమో ఆ ఎర్రోడికిచ్చి పంపుదాం.. జాగ్రత్త మల్ల ఎవల్లతో సెప్పమాక “అని శివుడిని హెచ్చరించాడు ఓబులేశు..
రాత్రి రోడ్డు ప్రక్కనే ఉన్న సిమెంట్ పైపు మీద పడుకుని పున్నమి చంద్రుడ్ని చూస్తూ.. అనంద తాండవం ఏక్ తార పై వాయిస్తున్నాడు ఓబులేశు.. చెప్పనలవి కాని ఆనందానుభూతికి లోనౌతునాడు.. రేపు రెండో సారి కలాంని కలవబోతున్నాడు.. కలిసి పేదోళ్ళ కష్టాలన్నీ ఏకరువు పెట్టి.. వాళ్ళ కష్టాలన్నీ తీర్చేయాలనుకుని ధృడంగా నిశ్చయించుకున్నాడు.. తనతో పాటు అడుక్కునే పిల్లలందరూ స్కూల్ కి పంపించాలని అడగాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు… ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనమూ అంటూ తనకిష్టమైన పాటను ఏక్ తార పై వాయిస్తూ ఉండగా.. రెండేళ్ల క్రితం జరిగిన విషయం కళ్ళ ముందు మెదిలింది ఓబులేశుకు.
*****
విజయనగరంలో ని ప్రభుత్వ పాఠశాల ముందు అడుక్కుంటూ వచ్చే పోయే విద్యార్ధుల భాష.. ధ్వని అనుగుణంగా పలకడం నేర్చుకున్నాడు ఓబులేశు. రోజూ ఉదయం సాయంత్రం పిల్లల ఇంటర్వెల్ సమయంలో స్కూల్ దగ్గరకొచ్చి పిల్లలు మాట్లాడుకునే పదాలు వల్లెవేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఆడుకుంటుండే వాళ్ళని చూసి తాను ఆడినంతగా కుషీ అయ్యేవాడు.. ఒకరకంగా చెప్పాలంటే ఓబులేశు ఏకసంథాగ్రాహిలాంటోడు. సంగీత జ్ఞానం లేకున్నా.. పొట్టొ పొడిస్తే అక్షరం రాకున్నా..! దారిన పోతూ వినబడే పాటల్ని ఒకటి రెండు సార్లు విని తన ఏక్ తార మీద లయబద్దంగా శ్రుతి తప్పకుండా వాయించేస్తాడు.
ఒకరోజు అకస్మాత్తుగా పోలీసులు ఓబులేశు ఉంటున్న కాలనీ మీద పడి పిల్లలందరినీ ఈడ్చుకు పోయారు.. అమ్మ నరసమ్మ ఓబులేశుని ఎత్తుకెళ్ళకుండా గంప క్రింద దాచి పెట్టింది.. పోలీసులు చిందర వందర చేస్తుండటంతో గంప క్రింద దాచిన ఓబులేశుని కూడా చూసి , అడ్డుకోబోయిన ఓబులేశు అమ్మని కూడా నెట్టి వారితో తీసుకుపోయారు.. కొద్దిగా ధైర్యం చేసిన పెద్దోళ్ళు ఒకరిద్దరు పోలీసులని ఆపి , , తమ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ నిలదీశారు.. ” మీ పిల్లలందరూ రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తారు.. ఎక్కువగా గొడవ చేయకండి” దబాయించి మరీ తీసుకెళ్లారు..
హడావుడిగా పిల్లలందరికీ స్కూల్ యూనిఫారం కుట్టించారు.. వంద సంవత్సరాలు పూర్తిచేసుకోనున్న ప్రభుత్వ పాఠశాలకు విచ్చేయనున్న భారత రాష్ట్రపతి కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు పోలీసులు తీసుకెళ్ళిన పిల్లలకి, స్కూల్ లో ఉన్న విద్యార్ధులతో కలిపి తర్ఫీదునిస్తున్నారు
టీచర్లు.. వీరందరిని పర్యవేక్షిస్తున్నారు రెవెన్యూ అధికారులు. కలాం అంతటి వాడిని భారతదేశానికి అందించిన ఈ స్కూల్ లో ఇప్పుడు పట్టుమని పాతిక మంది విద్యార్ధులు లేక విలవిల్లాడుతుండటంతో పరువు కోసం గ్రామాల మీద పడి అన్నీ స్కూల్స్ విద్యార్ధులతో పాటూ ఓబులేశులాంటి పిల్లలనీ తరలించాలని నిశ్చయించారు. ఈ కార్యక్రమాన్ని ప్రిస్టేజ్ గా తీసుకున్నారు జిల్లా కలెక్టర్ అజయ్. ఏర్పాట్లన్నీ ఆయన స్వీయ పర్యవేక్షణలో జరుగుతున్నాయ్.
అప్పటికే స్కూల్ ముందర రోజూ ఏకతారపై చక్కటి గీతాలు వాయిస్తున్న ఓబులేశు పిల్లల్లో ఉండటం గుర్తించాడు తెలుగు మాస్టరు సత్తర్.. వాడితో ఏకతారపై ఈ మధ్య స్కూల్ బయట వాయించిన ఎందరో మహానుభావులు పాట వాయించమని అడిగాడు.. భయపడుతున్న ఓబులేశుని “ఏం కాదు నేనున్నాను వాయించు” అని భరోసా ఇచ్చాడు. పిల్లలందరూ నిశ్శబ్ధంగా ఉండగా.. ఏకతార సరిచేసుకుని హాయిగొలిపేలా “ఎందరో మహానుభావులు” కీర్తనను ఏక్ తార పై వాయించాడు ఓబులేశు.
ఎంత చక్కగా వాయించావురా.. ! అని మెచ్చుకుని, అందరిచే చప్పట్లు కొట్టించి, రెండు మూడు చోట్ల వాయించిన తప్పులను సరిచేయించి రేపు స్టేజ్ మీద వాయించాలి సరేనా..! అని వెంటనే హెడ్ మాస్టర్ కి రికమెండ్ చేశాడు.. దీంతో అనుకోకుండా ఓబులేశు స్టేజీ మీదకు ఎక్కే అవకాశం తన్నుకుంటూ వచ్చింది.. అది కూడా అదే పాఠశాలకు చెందిన వైశాలి ప్రార్ధన అనంతరం ఓబులేశు ఏకతార కచ్చేరి.. (అదే ఏకతారపై ఏక్ పాట కచ్చేరీ..!)
భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం రానే వచ్చారు.. అధికారులు అనధికారులతో స్కూల్ ప్లే గౌండ్ కిక్కిరిసి పోయింది.. స్వయానా అదే పాఠశాలలో కొన్ని రోజులు చదువుకుని దేశాధ్యక్షుడుగా ఎదిగిన అబ్దుల్ కలాం రాకకై ఎదురు చూసిన విద్యార్ధుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.. ఆయన చదివిన స్కూల్ లో చదువుకుంటున్నామనే ఆనందంలో కొందరు, అయన చదివిన ఊరిలో చదువుకుంటున్నామని మరి కొందరూ ఆనందంతో ఆయనను చూసిన అనంతరం ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు..
స్కూల్ ప్లే గ్రౌండ్ అంతా నిశ్శబ్దం.. వందల మంది విద్యార్ధులు..
స్టేజ్ మీద .. కలాంతో పాటూ చిన్ననాడు కలాంతో కలిసి చదువుకున్న ఒక వృద్ధుడు.., జిల్లా కలెక్టర్ అజయ్ ., స్థానిక ఎమ్మెల్యే ఆశీర్వాదం, ఎంపీ శ్రీరాం రెడ్డి తదితరులు కూర్చొని ఉన్నారు.. వెనుక బాడీగార్డులు నిలుచుని ఉన్నారు. పాఠశాల హెడ్మాస్టర్.. ప్రారంభ ప్రసంగం మొదలెట్టి విద్యార్ధిని వైశాలిచే ప్రార్ధన చేయించారు..
అనంతరం.. ఓబులేశు ఏక్ తార ప్రార్ధన… ఒణుకుతూ స్టేజ్ మీదకి వెళ్ళిన ఓబులేశు.. ఏక్ తార పలకటం లేదు.. వందల మందిని చూసి నరనరంలో ఒణుకు మొదలైంది.. వాయించు ఓబులేశు.. నీకు చాక్లెట్ ఇస్తా అంటున్నాడు సత్తార్.. సత్తార్ కి చలి జ్వరం వచ్చినంత పనైంది..
ఓబులేశు భయాన్ని గుర్తించి, కళ్ళు మూసుకుని మొదలెట్టమని సైగ చేశాడు సత్తార్.. అంతే , కళ్ళుమూసుకున్న ఓబులేశు.. తన ఏక్ తార తో త్యాగరాజు కీర్తనకు జీవం పోయడం మొదలెట్టాడు.. “ఎందరో మహాను భావులు.. అందరికీ వందనము..” అంటూ.
సంగీతం స్వరపరచిన మరో త్యాగయ్యలా ఉన్నాడా సమయంలో ఓబులేశు. పాట వాయించడం పూర్తైంది.. హైస్కూల్ ఆవరణ మొత్తం నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది.. అప్పటి వరకూ కళ్ళు మూసుకుని వింటున్న అబ్దుల్ కలాం చప్పట్లు కొట్టడంతో స్టేజ్ మీద వాళ్ళందరూ జత కలిపారు.. వారికి తోడయ్యారు స్టేజ్ ముందున్నవారు. వారందరి చప్పట్లు కలిసి మిన్నంటాయి.. అనందంతో మేఘాలు కూడా అక్కడ సన్నని జల్లు కురిపించాయి..
ఓబులేశుకు ఏమీ అర్ధం కావడం లేదు.. ఆనందం, భయానికి నడుమ గిరి గీసుకు నిలుచుండి పోయాడు ఓబులేశు. దగ్గరికి పిలిచిన రాష్ట్రపతి ఓబులేశుని హత్తుకుని ప్రక్కనే కూర్చోమని చెప్పారు.. ముందు ప్రార్ధన చేసిన వైశాలిని కూడా పిలిపించమని చెప్పాడు అబ్దుల్ కలాం.. ఇద్దరికీ తనతో పాటు తెచ్చిన పుస్తకాలు బహుమానంగా ఇచ్చారు.. అనంతరం విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించడం మొదలెట్టారు కలాం.. ” బాగున్నారా..?? అంటూ ప్రారంభమైన అబ్దుల్ కలాం ప్రసంగం కేవలం పిల్లలని ఉద్దేశించి సాగింది.
“పిల్లలూ నేను చెప్పింది మీరంతా పలకండీ..” అంటూ తనదైన శైలిలో ” వెన్ ఐయాం హ్యాపీ.. అవర్ హోం విల్ బి హ్యాపీ..వెన్ అవర్ హోం ఈస్ హ్యాపీ.. అవర్ టౌన్ విల్ బి హ్యాపీ.. వెన్ టౌన్ ఈస్ హ్యాపీ.. స్టేట్ విల్ బి హ్యాపీ ..వెన్ స్టేట్ ఈస్ హాపీ.. అవర్ ఇండియా విల్ బి హ్యాపీ.. వెన్ ఇండియా ఇస్ హాపీ.. వరల్డ్ విల్ బి హ్యాపీ..”అంటూ ప్రమాణం చేయించారు.. పిల్లలందరితో పాటూ ఓబులేశు కూడా ఆ ప్రమాణాన్ని పెద్దగా పలికాడు.. అందరినీ ప్రేమగా పలకరించిన అబ్దుల్ కలాం అక్కడికి వచ్చిన విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సహనంతో సమాధానం ఇచ్చారు.. అందరి తోపాటూ జనగణమణ కు పెదాలు క(ది)లిపాడు ఓబులేశు.. అందరి లో ఎవ్వరికీ దక్కని దక్కని అదృష్టం దక్కింది ఓబులేశుకు..!! ఆ తర్వాత నుంచి గుర్తొచ్చినప్పుడల్లా.. ఆ ప్రమాణాను వల్లెవేయడం ఓబులేశుకు అలవాటుగా మారింది.
పిల్లలందరికీ బై బై అని చేయి ఊపుతూ కాన్వాయ్ వద్దకు బయలుదేరారు కలాం. అడుక్కునే వారికి కొత్తబట్టలు కుట్టించి కూర్చోబెట్టారని ఓబులేశు ఎక్కడ చెబుతాడో నని తర్జనభర్జనపడ్డ అధికార యంత్రాంగం చెమటలు తుడుచుకుంది. ఓబులేశు అసలు విషయం రాష్ట్రపతితో చెప్పనందుకు ఊపిరి పీల్చుకున్న వారిలో కలెక్టర్ అజయ్ కూడా ఉన్నాడు..
చాకిరి చేసిన గొడ్డును చావిట్లో వదిలేసినట్లు మీటింగ్ అయ్యాక ఓబులేశు వాళ్ళ వలస కాలనీ నుంచి తీసుకొచ్చిన చిన్నపిల్లలందరినీ నడిరోడ్డులో వదిలేసి ఎవరిదారిన వారెళ్ళి పోయారు అధికారులు… పోలీసులు.. టీచర్లు. ! తమ పనైపోయిందనిపించుకున్నారు అంతా.!
రాష్ట్రపతి అబ్ధుల్ కలాం ప్రక్కన నిలబడి సెల్యూట్ చేస్తూ ఉన్న ఓబులేశు, వైశాలి ఫొటోలతో తర్వాత రోజు పేపర్లు నిండిపోయాయ్..
*****
చల్లగా తడి ఒంటికి తడితగలటంతో అకస్మాత్తుగా మెలుకువ వచ్చిన ఓబులేశు, కళ్ళు తెరిచే సరికి కుక్క కాలు నాకుతూ కనిపించింది.. తెల్లారిందని గుర్తించిన ఓబులేశు కుక్కను నిమిరి హడావుడిగా స్నానం చేసేందుకు చెరువుకెళుతూ.. శివుడ్ని నిద్రలేపాడు.
ఓబులేశు, శివుడూ.. ఇద్దరూ త్వరత్వరగా రెడీ అయ్యారు. ఏమీ ఎరగనట్టు.. చిన్నారిని పట్టుకుని రోడ్డుమీదకొచ్చారు.. వాళ్ళ స్నేహితుడు ఎర్రోడిని పిలిచి “ఒరేయ్ చెల్లిని నీతో తీసుకెళ్ళు.. నేను మల్లత్తా.. ఎవ్వలికీ చెప్పమాక మరిసి పోకుండా చెల్లికి పాలిప్పీ” అని చెల్లిని అప్పగించాడు.. అడుక్కోవడానికి వెళ్తున్నట్టు నమ్మించి అబ్దుల్ కలాం రానున్న వేదిక వైపు నడక ప్రారంభించారు.. దారి పొడువునా ఏర్పాటుచేసిన కలాం ఫ్లెక్సీలను చూసుకుంటూ పరుగులాంటి నడకతో ప్రాంగణం చేరుకున్నారు..
పెద్ద సభా ప్రాంగణం. వందల మంది విద్యార్ధులు. రెండింతలు తల్లిదండ్రులు. టీచర్లు.. సిబ్బంది.. వాళ్ల చుట్టూ వందల సంఖ్యల్లో పోలీసులు .. బాకాల్లో ముఖ్యఅతిథి ప్రసంగం.. అంతా నిశ్శబ్ధంగా ఆ ప్రసంగం చెవులప్పగించి వింటున్నారు..
అంతలో స్టేజీకి దూరంగా జనాల వెనుక అలికిడి..
“మమ్మల్ని ముందుకెళ్ళనివ్వండి,, ఒక్క సారి చూడనివ్వండి.. అయ్యా.. ముందుకెళ్ళనియ్యండి.. కలాం తాతని చూడ నియ్యండయ్యా.!”
ముందున్న పెద్దలు చీత్కారంగా చూస్తూ విదిలిస్తున్నారు.. ఎంత ప్రయత్నించినా అంగుళం ముందుకెళ్ళడానికి కూడా వల్ల కాలేదు ఓబులేశు, శివుడు ఇద్దరికీ .
చొక్క చినిగి పోయి మాసి పోయి జుట్టు మట్టిగొట్టుకు పోయి ఉన్న వారిద్దర్ని చూసి అక్కడ కాపలా కాస్తున్న పోలీసు
“ఏడకిరా మీరు పోతోందీ.. ఆ.. మీటింగ్ కాడ ఏందిరయ్య మీ గొడవ..” అంటూ ఇద్దరి చొక్కాలు రెండు చేతుల్తో పట్టుకుని ” పోండిరా జేబులు కొట్టే నాయాళ్లారా..”
“వెళ్ళండి .. బయటికి పోండి ” అని తిడుతూ నెట్టడంతో ఓబులేశు శివుడూ ఇద్దరూ ప్రక్కనే ఉన్న మురికి నీటిలో పడిపోయారు.. ఓబులేశు ని విసిరేయడంలొ తన చేతిలోని ఏక్ తార దూరంగా ఎగిరి పడింది. .. ఇక లాభం లేదనుకుని వెనుదిరిగారిద్దరు.. కోటి ఆశలు నేలరాలినట్లైంది..
అలా వెనుదిరిగి నడుచుకుంటూ వెళుతూ కలాంను చూడలేని కళ్ళు మసకబారుతున్నయి..చెమ్మగిల్లుతూ..
“ఏరా! నిన్ను చూడగానే లోపలికి రానిత్తరన్నవ్..” ఊగి పోయాడు శివుడు
ఓబులేశు : మౌనం
“ఏందిరా ఆ మాట్టాడే పెద్దాయన తెలుసన్నావ్..”
ఓబులేశు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయ్..
“ఏందిరా అట్టై నావే.. దా ఆ చెరువు దగ్గర కూర్చుందాం కాసేపు తర్వాత మార్కెట్ దగ్గరకి వెళ్దాం అడుక్కోవాలిగా ” అన్నాడు శివుడు.
ఇద్దరూ నడుచుకుంటూ దగ్గర ఉన్న చెరువుగట్టున కూర్చున్నారు.. శివుడు ఢమరుకం వాయిస్తుంటే, ఓబులేశు తన ఏక్ తార వాయించడం మొదలెట్టాడు.. సమయం గడుస్తున్నా తన కన్నీరు ఆగడం లేదు.. ఓబులేశుకి..
ఇద్దరి మధ్య నిశ్శబ్ధాన్ని చేధిస్తూ..
“ఆయన నాకు తెలుసు రా… !” పెద్ద స్వరంలో అన్నాడు ఓబులేశు.
“ఆయన నీకు తెలుసు నువ్వు ఆయనకి తెలియాలిగా..!” అమాయకంగా అన్నాడు శివుడు..
“అరే అమ్మతోడు నిజం చెబుతున్నా..! ” అన్నాడు ఓబులేశు.
అప్పటికే ఏడుస్తూ కూర్చున్న ఓబులేశుని చూసిన శివుడికి ఓబు కళ్ళనీళ్ళతో చెరువు నిండిందేమో అనిపించింది.
“బాధపడమాక.. లే ఇంటికి పోదాం” అంటూ ఓబులేశుని తీసుకుని బయలుదేరాడు.
ఓబులేశు ఏక్ తార మాత్రం ఆగలేదు.. ఇప్పటికే ఏ 20 సార్లో వాయించేశాడు “ఎందరో మహానుభావులు” కీర్తనను.
అంతలో అబ్దుల్ కలాం కాన్వాయ్ ఊరు దాటింది.. చల్లని పచ్చని ప్రదేశంలోని స్వచ్చమైన గాలిని పీల్చాలని ఉందన్న దేశాధినేత కోరిక మేరకు గ్రామం దాటగానే కలాం కారు అద్దాలు దించారు.. సెక్యూరిటీ అలెర్ట్ అయ్యారు. ఝుం అని గాలి చీల్చుకుంటూ వెళ్తున్న కార్లు కొంత నెమ్మదిగా కదులుతున్నాయి . అంతలో కలాం చెవులకు సంగీత ఝరి ఒకటి తాకింది. అది తనకి అత్యంత ఇష్టమైన కృతి “ఎందరో మహానుభావులు” అంటూ ఏక్ తార వాయిద్యం పై ఓబులేశు వాయిస్తున్న పాట.. రోడ్డు ప్రక్కన నడుస్తూ వెళ్తున్న చిన్నారులను చూసి కాన్వాయ్ ఆపమన్నారు రాష్ట్రపతి కలాం. ఏమైందంటూ అక్కడకు చేరుకున్నారు జిల్లా అధికార యంత్రాంగం. వారిలో జిల్లా కలెక్టర్ అజయ్ కూడా ఉన్నాడు.. ఇటీవలే విజయనగరం నుంచి ఈ జిల్లాకు బదిలీ పై వచ్చాడు కలెక్టర్ అజయ్.
కలాం కారు దిగారు.. ఓబులేశు, శివుడిని ఆయన దగ్గరకు తెచ్చారు సిబ్బంది..
“ఆర్ యూ ఓబులేష్” అన్నాడు అని గుర్తుపట్టినట్లు ఓబులేశ్ ని పలకరించారు కలాం..
“ఎస్ సర్.. ఇయాం ఓబులేశ్..” అని నేర్పుగా చెప్పాడు ఓబులేశు. ప్రక్కనున్న శివుడిని గురించి ఎలా చెప్పాలో అర్ధంకాక .. “ఇట్ శివుడు.. ఫ్రెండ్” అని చెప్పాడు .. “ఇక్కడేం చేస్తున్నారు మీరు.. ఆర్ యూ బెగ్గింగ్” అని వారి వేషాన్ని చూసి అడిగారు కలాం.. వాట్..? మీరు చదువుకోవడం లేదా.. మరి ఆరోజు స్టేజ్ పై ఎలా ? అర్ధం కాక అయోమయానికి గురౌతున్న కలాంతో..
“తాతా మరే మరేమో అంటూ .. ఆ రోజు..” అంటూ విజయనగరంలో జరిగిందంతా వెళ్ళగక్కాడు ఓబులేశు. అప్పటికే అక్కడికి చేరుకున్న అప్పటి విజయనగరం కలెక్టర్ అజయ్ కు నుదురంతా చెమటతో నిండి పోయింది… అంతకు కొద్ది సేపటి ముందే అజయ్ తాను విజయనగరంలో పనిచేసిన సమయంలోనే మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగిందని , విజయనగరం జిల్లా అంతా అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకు రాష్ట్రపతి అవార్డుకు కూడా ఎంపికైనట్లు గర్వంగా చెప్పుకున్నాడు కలాంతో.. అంతలో ఇలా..!
“అడుక్కునే పిల్లలందరికీ నిర్భంద విద్యనందించండి.. దేశంలో ఏ చిన్నారి అడుక్కోకూడదు.. వెంటనే దీనిపై కేంద్ర రాష్ట్రాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చెయ్యండని” ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ అత్యున్నత వ్యక్తి .
కలాంతో పాటు కారులో ప్రయాణం మొదలెట్టారు ఓబులేశు, శివుడు ఇద్దరూ…. ఆనందంగా తమ గుడిసెల వైపు…..!!!
*******
ఉదయాన్నే కాఫీ త్రాగుతూ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు సుధేష్,.. పేపర్లో అబ్దుల్ కలాం ప్రక్కన ఓబులేశు.. శివుడి ఫొటోలతో బ్యానర్ ఐటం చూసి బిత్తరపోయాడు.. గతంలో పేపర్ లో అబ్దుల్ కలాంతో పాటూ సెల్యూట్ చేస్తూ ఉన్న ఫొటోలో వైశాలితో పాటూ ఓబులేశు ఉన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చింది సుధేష్ కి.. రైల్వేస్టేషన్ లో కనిపించి.. బుర్రకి పనిపెట్టిన పిల్లాడూ, తాను అనుకున్న ఓబులేశే నని గుర్తించి సంతోషపడ్డాడు. ఓబులేశ్ గురించి సుధేష్ అంతగా ఆలోచించడానికి కారణం ప్రార్ధనా గీతం ఆలపించిన వైశాలి అతని కూతురే.! ఒంగోలులో పని నిమిత్తం వచ్చి
విజయనగరం తిరిగి వెళుతూ ఓబులేశుని చూసి గుర్తించడంలో విఫలమైనందుకు కాస్త సిగ్గుపడ్డాడు సుధేష్.

31 thoughts on “// ఏక్ తార //

  1. మా విజయనగరం జిల్లా ను కథ లో ఎంచుకోవడం లోనే మీరు చాలా మంచి ఆలోచన చేశారు… ఎందుకంటే అక్షరాస్యత లో చివర, నిరక్షరాస్యత లో ముందు మా జిల్లా. అంతేకాకుండా బాలకార్మికులు కూడా ఎక్కువగా ఉన్నారు. వాస్తవ సన్నివేశాలు… పెద్దల మెప్పు కోసం అధికారులు ఎలా వ్యవహరిస్తారో చక్కగా చూపించారు.ముఖ్యంగా జిల్లా కలెక్టర్ పై సెటైర్లు చక్కగా సరిపోయాయి. కలాం గారి వ్యక్తిత్వం, సహజంగా రాసిన తీరు అద్భుతంగా ఉంది…ముఖ్యంగా టైటిల్
    ఏక్ తార… సూపర్బ్…అభినందనలు కల్యాణ్ గారు…

    1. ధన్యోస్మి మాస్టారూ..ఒక జర్నలిస్ట్ గా.. కొంత మంది ఉన్నతాధికారుల కుత్సుత బుద్ధి ని దగ్గర నుంచి చూసి ఉండటం వలన ఆ కలెక్టర్ కి కొంచెం మొట్టికాయలు వేయాల్సివచ్చింది.. అధికార దుర్వినియోగం.. బాలకార్మిక నిర్మూలన సంపూర్ణంగా దేశంలో ఫలించకపోవడానికి కారణం అని నా అనుభవంలో గుర్తించి వ్రాసిన కథ… ఈ ఏక్ తార ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *