May 3, 2024

మా నాన్న

                                                 డా. కొప్పాడి శ్రీనివాస్

 

అమ్మ వెచ్చని పొత్తిళ్లలో

పడుకొని అమృతంలాంటి

చనుబాలు తాగుతున్నపుడు

కొన్ని పాల చుక్కలు పెదాల సంధులోంచి

జారి నా పాల బుగ్గల మీదుగా

ఒలుకుతుంటే ఒక వేలు సుతారంగా

తుడిచి నన్ను ముద్దాడింది

ఆ వేలు పేరు మా నాన్న!

బాల్యంలో నాన్న కోసం అంతే తెలుసు

రాను రాను తెరలు తెరలుగా తెలుసుకున్నాను

చిన్నప్పుడు ఏనుగు ఎక్కుతానంటే

ఏనుగు తేలేక నాన్నే ఏనుగులా మారి

వీపున ఎక్కించుకొని మా ఇల్లంతా తిప్పిన సంగతి!

నిద్రపోతున్నపుడు కలలో ఉలికిపడి

భయపడతానేమోనని తను నిదురపోకుండా

మేల్కొని నా మీద చెయ్యి వేసి

కాపలాకాసిన విషయం!

బడి నుండి వర్షంలో తడుస్తూ వస్తుంటే ఎదురొచ్చి

తను తడుస్తు నాకు గోనె సంచి అడ్డుపెట్టిన

అనురాగం అన్నీ లీలగా గుర్తున్నాయి

ఇప్పుడు పేద్ద డాక్టర్ నయ్యాక కూడా

తల నిమురుతు ప్రేమగా “నీ ఆరోగ్యం జాగ్రత్త నాయనా”

అంటుంటే ఉగ్గుపాలకు బదులు కన్నీళ్లొస్తున్నాయి నాన్నా..!

నన్ను ఇంత అపురూపంగా పెంచిన నీ ఋణం ఎలా తీర్చుకోను..

జీవితాంతం నిన్ను చంటిపాపలా చూసుకోవడం తప్ప!

1 thought on “మా నాన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *