April 28, 2024

సాహిత్యంలో “అమ్మ”

రచన-డా. వి. సీతాలక్ష్మి

sonnet-17-mother-and-babe

“ఉపాధ్యాయాన్ దశాచార్య
ఆచార్యాణాం శతం పితా
సహస్రంతు పితౄన్మాతా
గౌరవేణాతి రిచ్యతే”
-మనుస్మృతి

“మాత జాతినే నిర్మించే నిర్మాత” గా మనవాళ్ళు గుర్తించారు. మన సంస్కృతి మాతృత్వ పరిమళంతో నిండి ఉంది. అమ్మతో సరిపడే బంధువు ఈ ప్రపంచంలో మరొకళ్ళుండరు. తల్లి ఒక పౌరుని ఉత్పత్తి చేసి సమాజానికి అందిస్తుంది. అతని/ఆమె పెంపకం, వ్యక్తిత్వం సమాజం మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మాతృత్వం వ్యక్తిగతమైనప్పటికి అది సామాజిక బాధ్యతగా ప్రతి తల్లి గుర్తించాలి.

జంతువులకి సంబంధించి “మర్కట కిశోర న్యాయం”, “మార్జాల కిశోర న్యాయం” అని రెండు న్యాయాలున్నాయి. తల్లికోతిని పిల్లకోతులు గట్టిగా కరచి పట్టుకొని తల్లితోపాటు తిరుగుతాయి. ఇక్కడ బాధ్యత పిల్లలకి ముందునుంచే తెలుస్తుంది. మార్జాలం అంటే పిల్లి, తన పసికూనలని నోట కరచుకొని ఏడిళ్ళు తిప్పుతుంది. ఇక్కడ బాధ్యత తల్లిది. మనం మనుష్యులం కాబట్టి కొంతకాలం మనం బాధ్యత పడినా, తరువాత వివేకంతో పిల్లలు స్వయంగా బాధ్యత తెలుసుకునేటట్లు చెయ్యాలి. చెడు ప్రవృత్తితోవున్న సంతానాన్ని ఓపికతో సంస్కరించి ఒక ఉత్తముణ్ణి సంఘానికి అందించాలి. ఇది గురుతరమైన బాధ్యత. బాల్యంలో ఎంత సంతృప్తితో సంతోషంగా జీవనం గడపగలిగితే, అంత ఆత్మవిశ్వాసం పిల్లలకి పెరుగుతుంది. చిన్నతనంలో పిల్లలకి తల్లి సర్వజ్ఞురాలిగా, అద్భుతశక్తిగా, రక్షణ కవచంగా కనిపిస్తుంది.

“కుపుత్రోజాయేత క్వచదపి కుమాతాన భవతి” అంటారు జగద్గురువు శంకరాచార్యులవారు. మనం అచ్చతెలుగులో “లక్కవంటి తల్లి, రాయి వంటి బిడ్డ” అంటుంటారు. ఇప్పుడా సమీకరణాలలో మార్పుకనబడుతోంది.

దుర్యోధనుని తల్లి “గాంధారీదేవి” పరమ ధర్మమూర్తి. గాంధారి పెంపకం కన్నా, తండ్రి గారాబం దుర్యోధనుని ఎక్కువ పాడుచేసింది. శ్రీకృష్ణరాయబార సమయంలో దుర్యోధనుడు ఎవరిమాటావినడు. తల్లి మాటయినా వింటాడేమోనని గాంధారిని పిలవమంటారు. గాంధారి వచ్చి భర్తతో “నీ పుత్రుడవినీతుడగుట ఎరిగి ఎరిగి వాని వశంబున నీవు” అంటుంది. “నీపుత్రుడు” అని గాఢమైన చెంపదెబ్బను మాటలుగా మార్చి కొట్టింది గాంధారి. అక్కడ కొడుకు దుర్మార్గాలకి కారణం భర్తేనన్నకోపం, అధర్మాన్ని సహించలేని దొడ్డగుణం ఆ తల్లిలో కనిపిస్తాయి. అలాగే దుర్యోధనుడు యుద్ధానికి వెడుతూ, తల్లికి నమస్కరిస్తాడు. పుత్రుడెంత దుష్టుడైనా ఆ సమయంలో తల్లి ఏం దీవిస్తుందో మనందరం ఊహించగలం. కానీ మన అంచనాలకు భిన్నంగా గాంధారి, “పుత్రకాయతో ధర్మస్తతో జయ:” (ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే జయం కూడా ప్రాప్తిస్తుంది) అని దీవిస్తుంది. ఇలాంటి ధర్మమాతను ప్రపంచంలో ఎక్కడా చూడం, ఒక్క భారతదేశపు స్త్రీలలో తప్పా.

భారతంలో మరో మాతృమూర్తి “కుంతీదేవి”. సవితి పిల్లల్ని తన పిల్లలకన్నా మిన్నగా ప్రేమించిన తల్లి కుంతి. పాండవుల వనవాసానికి వెళ్ళే సమయంలో ఆమె సహదేవునితో అన్న మాటలు తల్లి హృదయవేదనకు సాక్షీభూతంగా నిలుస్తాయి.

“అన్న! సహదేవా! నీవును
నన్నలతో నరిగెదయయ్యట యడవులకే
వున్నను మతులందరు నిం
దున్నటులనాకు చిత్తమూరడి యుండున్” ….

భాగవతంలో అదితి వామనుడి కన్నతల్లి.

“నన్ను కన్నతండ్రి నా పాలి దైవమా
నా తప: ఫలంబ నా కుమార …”

ఈ మాటలు అదితివే కాదు. ఏ తెలుగు తల్లైనా ఇలాగే అంటుంది. కన్నకొడుకును “కన్నతండ్రీ” అని, కన్నకూతుర్ని “కన్నతల్లీ” అనీ పిలవడం తెలుగుభాషకు దక్కిన వరం.

యశోదాకృష్ణుల పరస్పరానుబంధం భాగవతంలో అమృతప్రాయమైన సన్నివేశాలున్నాయి “అమ్మా! మన్నుతినంగ నేశిశువునో …” అంటే ఆ పిచ్చితల్లి మాయలో పడిపోతుంది.

ఎందరో ఆదర్శమాతృమూర్తులు మనకి సాహిత్యంలోనూ దర్శనమిస్తారు. అలాంటి కొందరిపై ఒక విహంగ వీక్షణం.

ఆంధ్రమహాభారతంలో ఎందరో తల్లులు వారిలో ఒక ఆమె శకుంతల. కణ్వాశ్రమంలో మహర్షి కణ్వునికి పెంపుడు కుమార్తెగా పెరిగిన శకుంతల దుష్యంతుని గాంధార్వ వివాహమాడినప్పుడు ఆమె తనను హస్తినాపుర సామ్రాజ్యానికి రాణిని చేయమని కోరదు. తనకు జన్మించే పుత్రుని చక్రవర్తిగా చెయమని కోరుతుంది. అంతేకాదు. నిండుసభలో తనను భార్యగా అంగీకరించడానికి తిరస్కరించిన భర్తను నిలదీసింది. తండ్రితన సంతానాన్ని దగ్గరకు తీసుకుంటే కలిగే అనుభూతే వారు తనవారేననడానికి సాక్ష్యముంటుంది. తన బిడ్డ అవునో కాదో తెలియడానికి మరి ఏ ఇతర “డి.ఎన్.ఏ. పరీక్షలు” అక్కర్లేనంత ఖచ్చితంగా క్రింది పద్యం చెబుతుంది శకుంతల.

“విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాధ! యీ పుత్రగా
త్ర పరిష్వంగ సుఖము సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్రపరాగప్రసరంబు చందనము జంద్ర జ్యోత్స్నయున్ బుత్రగా
త్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యం చే కడున్ శీతమే”

విచిత్రమేమిటంటే తల్లి బాధ్యతారహితంగా పసిబిడ్డనైన తనను నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్ళిపోయినా, కణ్వుని పెంపకంలో ఎదిగిన శకుంతల తన కుమారుని కోసం భర్తతోనే వాదించి, నిలదీసింది. ఇలాంటి తల్లి పెంపకంలో పెరిగిన కుమారుడు కాబట్టే భరతుడు గొప్ప చక్రవర్తియై తన పేరుతోనే ఈ దేశాన్ని భరతఖండంగా నిలబెట్టాడు.

భోజరాజీయంలో గోవు జంతువేగాని, స్త్రీ మాతృత్వానికి ప్రతి రూపంగా అనంతామాత్య కవిచేత తీర్చదిద్దబడింది. అడవిలో తనను తినడానికి వచ్చిన పులిని, తన బిడ్డ కడుపునింపి వచ్చే అవకాశం ఇమ్మని బ్రతిమలాడుకోవడం గొప్ప సన్నివేశం. తనని చంపవద్దని గోవు కోరదు. తన బిడ్డకు కడుపునింపి వచ్చే అవకాశం ఇమ్మంటుంది. ఒక అద్బుతమైన పద్యం ఈ సంధర్భంగా …

“మునుమునుబుట్టె నాకునొక ముద్దులపట్టి యతండు పుట్టియే
డెనిమిది నాళ్ళ పాటి గలడింతియపూరియ మేయదేరడే
జనికడుపార జన్ గుడిపి చయ్యన వచ్చెద నన్ను బోయిర
మ్మని సుకృతంబుగట్టికొనవన్న దయాగుణముల్లసిల్లడన్”

గడ్డితినడం వల్ల తన ఆకలి తీరింది. తన బిడ్డ ఆకలితో ఉంది. అదే ధ్యాస. మాతృత్వం సమస్త ప్రాణకోటికి సమానమే అని కవి భావన. తన బిడ్డకు ఎన్నో నీతులు చెబుతుంది గోవు. తల్లిలేని బిడ్డ బ్రతుకు ఎంత బాధాకరమో సోదాహరణంగా వివరిస్తుంది.

“చులుకున జలరుహతంతువు
చులుకన త్నణకణము దూది చుల్కన సుమ్మీ
ఇలనెగయు ధూళి చులుకన
చులుకన మరి తల్లిలేని సుతుడు కుమారా?

అమ్మ మనం ఎలాంటి వాళ్ళమైనా తలచి సంతోషిస్తుంది. కంటి చూపు కందే దూరంలో ఉంటే చూసి కాపాడుతుంది. దగ్గరగా ఉంటే ఆప్యాయతగా అక్కున చేర్చుకుంటుంది. స్కాందపురాణం ఇలా చెప్తుంది.

“నాస్తి మాతృ సమ: కశ్చిత్
బాలానాం క్షీరజీవనం
నాస్తి మాతృ సమో నాధ:
నాస్తి మాతృ సమాగతి:”

జానపదసాహిత్యంలో కూడా అమ్మ, తన బిడ్డకోసం పడే తపనని ఎంత సహజంగా చూస్తామో!

“ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి
ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నేచూడలేను
పాలైనా కారవే బంగారుకళ్ళు

ఆడుకొని అమ్మాయి వచ్చె కాబోలు
అందెళ్ళ సందళ్ళు పందిళ్ళలోన
చదువుకొని అబ్బాయి వచ్చెకాబోలు
సరస్వతీ చప్పుళ్లు సందిళ్ళలోన …

అందుకే అమ్మ ప్రేమ అద్వితీయం, అపారం, అమూల్యం, దర్శనీయం. మన కుటుంబ వ్యవస్థలో పిల్లలకు ప్రముఖ స్థానం వుంది. కీ.శే. వేలూరి శివరామ శాస్త్రిగారి “మాతృహృదయం” కధ అమ్మ ప్రేమకి పరాకాష్త. ఇలా ఎన్నెన్నో సన్నివేశాలు తెలుగుసాహిత్యంలో చోటు చేసుకున్నాయి. అమ్మస్థానం ఎప్పుడూ అగ్రస్తానమే. శంకరాచార్యులైనా, రమణ మహర్షులైనా తల్లి గర్భము నుండి వచ్చిన వాళ్ళే. సన్యాసి అయివుండి కూడా శంకరాచార్యులవారు తల్లికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం తల్లికి దహన సంస్కారాలు చేసారు. రమణ మహర్షి తన తల్లికి జ్ఞానబోధ చేసి జన్మరాహిత్యం ప్రసాదించారు. తల్లిని సమాధి చేసి దేవాలయం కట్టించారు. భార్యలో తల్లిని దర్శించిన యోగీశ్వరేశ్వరుడు. రామకృష్ణ పరమహంస జన్మించిన దేశంలో ఈ రోజున తిలక్ చెప్పినట్లు “గజానికొక గాంధారి కొడుకు” కనిపించడం దురదృష్టం. ఏమైనా తల్లి తన బాధ్యతని విస్మరించకుండా పిల్లల్ని పెంచగలిగినప్పుడు కొంతైనా సమాజ ఋణం తీర్చుకున్నట్లే.

1 thought on “సాహిత్యంలో “అమ్మ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *