May 3, 2024

చపలమహర్షి తపస్సు – హాస్యకథల పోటి – మొదటి బహుమతి

రచన: ధనికొండ రవిప్రసాద్

పూర్వకాలంలో మహర్షులు తపస్సు చెయ్యటం, స్వర్గలోకం నించి అప్సరసలు దిగొచ్చి ఎంచగ్గా వాళ్లని సుఖపెట్టి పోవటం ఉండేది. ఈకాలంలో కూడా స్వామీజీలు, యోగులు తపస్సులు చేస్తూనే ఉన్నారు కానీ అప్సరసలు రావటం ఆగిపోయింది. అలా జరగటానికి గల కారణమే ఈ కథ.
************
కలియుగారంభంలో చపలమహర్షి ఘోరాతిఘోరమైన తపస్సుచేస్తున్నాడు. ఆ తపోగ్నికి స్వర్గలోకంలో టెంపరేచర్ భూలోకంలో మే నెలలో రామగుండంలో ఉన్న టెంపరేచర్ని మించిపోయి దేవేంద్రుడు గాబరా పడిపోయాడు. దేవగురువైన బృహస్పతిని రప్పించి “sudden increase of temperature” కి గల కారణాలని అన్వేషించి “remedy” సూచించమన్నాడు. అంత బృహస్పతి ప్రసన్నుడై తన దివ్యదృష్టితో కారణం కనుక్కున్నాడు .
లేలేత కల్పవృక్షపు ఆకులతో చేసిన కిళ్లీ నములుతూ “దేవేంద్రా ! ఈ టెంపరేచర్ పెరగటానికి వాతావరణ సంబంధమైన కారణాలేమీ లేవు. భూలోకంలో చపలమహర్షి చేస్తున్న ఘోరమైన తపస్సే ఇందుకు కారణం. వెంటనే మన అప్సరసలలో ఎవతో ఒకతిని పంపి ఆ తపస్సుని భగ్నం చెయ్యి. వాడే బ్రహ్మర్షో అయితే మనకి పోయిందేమీ లేదు కానీ వాడికి ఇంద్రపదవి లభిస్తే నీ పదవి ఊడుతుంది.” అంటూ హెచ్చరించాడు బృహస్పతి.
దేవేంద్రుడు బెంబేలెత్తిపోయాడు “ఈ కలియుగంలో ఇంత ఘోరమైన తపస్సా”! అని. దేవభటుల్ని పిలిచి “ఒరే ! అర్జంట్ గా తిలోత్తమని పిల్చుకు రండి” అన్నాడు. వంపుసొంపులు వొలకబోసుకుంటూ దేవదూతల వెంట వచ్చింది తిలోత్తమ.
“ఏం కావాలో సెలవివ్వండి స్వామీ ! నేనే కావాలా ?” అంది ఒళ్లంతా తిప్పుకుంటూ.
“నేనిప్పుడా మూడ్ లో లేను కానీ భూలోకంలో ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. నువ్వెళ్లి వాడి మూడ్ చెడగొట్టి దేవలోకాన్ని కాపాడాలి” అన్నాడు దేవేంద్రుడు.
ఉక్రోషంతో కళ్లు ఎర్రబడ్డాయి తిలోత్తమకి. అరుణారుణనేత్రాలతో దేవేంద్రుణ్ని చూస్తూ ” ప్రభూ ! నేనెంత అప్సరకాంతనైనా నా గురించి అంత చీప్ గా ఆలోచించొద్దు. ఏదో ఎక్స్ క్లుజివ్లీ మీవద్ద డ్యాన్స్ చేస్తానే కానీ పరాయి మగాళ్లతో డీలింగ్ నాకు అలవాటు లేదు. ఈ విషయంలో అనుభవం ఉన్న రంభక్క, ఊర్వశక్క, మేనకక్క లలో ఎవరో ఒకర్ని పంపొచ్చుగా !” అని పతివ్రతలాగా ఫోజు కొట్తి చరచరా వెళ్లిపోయింది.
“అదీ నిజమేలే !” అనుకొని రంభని పిలిపించాడు దేవేంద్రుడు.
“స్వామీ ! ఈరోజు నా నాట్యకౌశలమంతా మీ ముందు ప్రదర్శించి, మీ దేహతాపం చల్లార్చి మీ గాఢపరిష్వంగంలో పరవశించా లనుకుంటున్నాను . అప్సరస లందరిలోనూ నేనంటే మీకు ప్రేమ ఎక్కువని నాకు తెలుసు” అంటూ దేవేంద్రుని ముఖంలో ముఖం పెట్టి అధరామృతం అందించి ఆయన మూడ్ నే మార్చేసి అసలు పని ఎగ్గొట్టింది రంభ .
రంభాగాఢపరిష్వంగం లో ఒక రోజు సేదతీరిన దేవేంద్రుడు ఈసారి ఊర్వశిని మహర్షి మీదకి ఎగదొయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఊర్వశి డైలాగ్స్.
“స్వామీ ! నామాట వినగానే , నా కొంగు తగలగానే ఎంతటి ఋషి అయినా నావెంట పడవలసిందే. కానీ నాకొక చిన్న ప్రాబ్లం ” అంది.
“ఏమిటో అఘోరించు” అన్నాడు దేవేంద్రుడు.
“ఏమీ లేదు. నేను ఒక్కోసారి మగాణ్ని మాయలో పడెయ్యటానికి ప్రయత్నిస్తాను కానీ నా మాయలో వాణ్ని పడెయ్యటం కాక నేనే వాడి ఆకర్షణలో పడిపోతూ ఉంటాను. ఇది నాకున్న పెద్ద వీక్ నెస్.
ఒకప్పుడు మీ వరపుత్రుడైన అర్జునుడు స్వర్గానికి వచ్చినప్పుడు అతణ్ని చూసి వావివరసలు మర్చిపోయి మనసు పారేసుకున్నాను. పైగా అతను నాకు లొంగ లేదని శపించాను. పాపం ! ఆ వీరాధివీరు డెంత బాధపడి పోయాడో! అతని ముఖంలోని మగసిరి, ఆ కోర మీసాల అందం , ఆ చూపుల బాణాల చురుకుదనం ఇప్పటికీ నా కళ్లలో మెదులుతున్నాయి. అలాగే ఇప్పుడు మళ్లీ ఆ చపల మహర్షికి లైనెయ్య బోయి నేనే ఆయన లైన్ లో పడిపోయి తిరిగి మీ దగ్గరికి రాలేనేమో ! అని భయం. ఇక్కడ ఒక అప్సరస పోస్ట్ ఖాళీ అవుతుందని భయం. వేరే ఏమీ లేదు ” అంటూ చల్లగా చెయ్యిచ్చింది ఊర్వశి.
“చీ ! హోప్లెస్” అనుకున్నాడు దేవేంద్రుడు. “అయినా విశ్వామిత్రుడి లాంటి వాణ్ని బుట్టలో వేసిన మేనక ఉండగా వీళ్లెందుకు?” అనుకొని మేనకకి కబురు పెట్టాడు.
ఇక మేనక వయ్యారంగా చెప్పిన హాట్ డైలాగులు- “స్వామీ ! ఇంతకీ నేను స్వర్గలోకంలో ఉద్యోగం చేస్తున్నట్టా ? భూలోకంలో చేస్తున్నట్టా ? ఇలా ప్రతి మహర్షీ తపస్సు చేస్తూ ఉండటం , వాళ్ల తపస్సులని భగ్నం చెయ్యటానికి నా అపురూపమైన మేని సొగసుల్ని అర్పించటం , వాళ్ల ముసలి గడ్డాలకీ, మీసాలకి నా అధరాలు అందించటం, చివరికి వాళ్లతో కడుపు చేయించుకోవటం. ఇంత చేసినా వాళ్లు బ్రహ్మర్షులు కాకుండా మనమేమన్నా ఆపగలిగామా ? అసలు వీళ్లు మా కోసమే తపస్సులు చేస్తున్నారల్లే ఉంది. వాళ్ల కోసం మా అందాన్ని పాడు చేసుకోదల్చలేదు. హాయిగా పిల్లా పాపా లేకండా ఇలా బతకనివ్వండి” అంటూ పాతపురాణమంతా తిరగేసే సరికి నోరెత్తలేక పోయాడు దేవేంద్రుడు . తరుణోపాయం చెప్పమని బృహస్పతిని వేడుకొన్నాడు.
“చింతించకు దేవేంద్రా ! ముల్లుని ముల్లుతోనే తీద్దాం. భూలోకమహర్షిని భూలోక కాంతలతోనే లొంగదీద్దాం” అంటూ ఆకాశమార్గాన భూలోకంలో చపలమహర్షి తపస్సు చేస్తున్న కుటీరప్రాంతానికి హుటాహుటిన చేరుకొన్నాడు బృహస్పతి. ఆ పరిసరప్రాంతాలలో అప్సరసలని తలదన్నే అందంతో మెరిసిపోతున్న ఒక లేమని చూసి తనని తానే నిగ్రహించుకొని ఆమె ముందు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు దేవగురువు. కళ్లు మిరుమిట్లు గొలిపే ఎన్నడూ తెలియని ఆ దివ్యరూపాన్ని చూసి ఆ అబలకి కళ్లు బైర్లు కమ్మి స్పృహ కోల్పోయి దమిక్కిన కిందపడి పోయింది . ఆమె ముఖంపై కాసిని నీళ్లు చల్లి స్పృహతెప్పించి ” భయపడకు సుందరీ ! నేను దేవగురువైన బృహస్పతిని ” అన్నాడు బృహస్పతి.
అది విని ఆమె మళ్లీ స్పృహ తప్పటానికి సిద్ధ పడుతుంటే కాసిని మంచినీళ్లిచ్చి ఆమె భయం పోగొట్టి ఆమెతో ఒక పాదాభివందనం పొంది చెప్పసాగాడు బృహస్పతి.
సమస్య అంతా వివరించి ” సుందరీ ! నీవు ఆ మహర్షిచెంత భక్తురాలిగా స్థానం సంపాదించి , ప్రతిదినమూ ఆయనతో కొంత కాలక్షేపం చేసి ఆయనకి నీపై మోహం కలిగించాలి. అందుకు ప్రతిఫలంగా నువ్వు జీవితాంతం యౌవనంతో ఉండేటట్లు, ప్రపంచసుందరిగా నిన్ను లోకమంతా గుర్తించేటట్లు వరమిస్తాను. మహర్షిని వరించిన కారణంగా నీ భవిష్యత్ వివాహం లో పాతివ్రత్యభంగదోషం రాకుండా వరమిస్తాను. నీకు మన్మథుని వంటి భర్త లభిస్తాడు. దేహాంతాన స్వర్గానికి వస్తావు ” అంటూ వరాలు గుప్పించాడు దేవగురువు. “దైవాజ్ఞ శిరోధార్యం స్వామీ” అంటూ చపల మహర్షి ఆశ్రమానికి బయలుదేరింది ఆ భూలోక సుందరి.
* * * * *
“స్వామీ ! నా పేరు చంచల . నాకు ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగింది. మీ పాదసేవకి అనుమతివ్వండి. ప్రతి దినం తమ ఆశ్రమానికి వచ్చి పరిచర్యలు చేస్తూ మీ బోధలు వింటాను” అంది మహర్షి పాదాలు పట్టుకొని. చిరునవ్వుతో అంగీకారం తెలిపాడు మహర్షి.
ఆనాటి నుంచి మహర్షికి ఆహారం సమకూర్చటం, స్నానానికి నీళ్లు పెట్టటం , మహర్షి తపస్సు నుంచి కళ్లు తెరవగానే ఆధ్యాత్మికసందేహాలు అడగటం చంచల దినచర్య అయింది.
ఒక రోజు ” స్వామీ ! మీ ఇంద్రియనిగ్రహం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. అందం చందం లేని కోతి వెధవలు కూడా నాలాంటి వయస్సులో ఉన్న స్త్రీని చూస్తే అతిగా ప్రవర్తిస్తారు. కానీ ఇంత అందంగా ఉన్న మీరు, తేజస్సుతో అలరారే మీరు నా వంక కన్నెత్తి కూడా చూడరు. మీరెంత గొప్పవారో ! మీరంటే నాకు చాలా అభిమానం ” అంది.
గంభీరంగా నవ్వి గడ్డం సవరించుకున్నాడు మహర్షి. తిరిగి తపస్సులోకి వెళ్లాడు. తపస్సు చేస్తున్నప్పుడు మహర్షికి ఫాలభాగంలో ఒక వెలుగు కనిపించేది కానీ ఈ సంభాషణ అయ్యాక విచిత్రంగా వెలుగుతో పాటు చంచల రూపం కనిపించ సాగింది.
చపల మహర్షి తన అసమానమైన నిగ్రహశక్తితో ఆమె రూపాన్ని ధ్యానం నుంచి తొలగించుకున్నాడు . ఆరు నెలలపాటు ఆయన నిగ్రహం సడలలేదు. కానీ అడపా దడపా ఆమె తన అందాన్ని, తేజస్సుని , జ్ఞానాన్ని మెచ్చుకొంటూ ఆయన మనస్సులో ఒక జ్ఞాపకంగా ఎదగ సాగింది.
“చంచలా! నువ్వు వయస్సులో ఉన్న స్త్రీవి. నీ సేవలు పొందటం నా తపస్సుకి క్షేమం కాదు. దయ చేసి ఇకపై నీవు మా ఆశ్రమానికి రాకు” అన్నాడు చపల మహర్షి.
చంచల ముఖం ఎర్రబడి పోయింది. ఎక్కెక్కి ఏడుస్తూ ” స్వామీ ! నన్నింత నిరాదరిస్తారా ! మీవంటి మహర్షుల తపస్సుకి స్త్రీలు అడ్డమౌతారా ! ఇకపై ఎన్నడూ ఈ మాట అననని నాకు ప్రమాణం చెయ్యండి” అంటూ మహర్షి చేతిని తన కోమలహస్తం లోకి తీసుకొని తన వేళ్లతో ఆయనలో మృదుమధుర రాగాలు పలికించింది.
ఆనాటి నుంచీ చంచల తనని పొగిడినప్పుడల్లా ఆమెని వారించక పోగా చపలుడు కూడా ఆమెని మెచ్చుకొనే స్థాయికి చేరుకొన్నాడు. నువ్వు రంభవి, మేనకవి అంటూ మెచ్చుకొనే వాడు.ఇలా మెచ్చుకొంటూ తనని తాను సమర్ధించుకొనేవాడు. “నేనేమీ అసభ్యంగా ప్రవర్తించలేదు కదా! నన్ను మెచ్చుకొన్న స్త్రీని నేను మెచ్చటం తప్పెలా అవుతుంది ? పైగా అలా మెచ్చుకోటమే న్యాయం” అని . కానీ చంచలకి మాత్రం మహర్షి నెమ్మదిగా ప్రేమలోకి జారాడని అర్ధమయ్యింది.
ఒకరోజు “స్వామీ ! నేను మీ తపస్సుకి ఆటంక మౌతున్నానేమో ! ఇక నుంచీ నేను రావటం మానేద్దామని అనుకుంటున్నాను. అంది చంచల.
“చంచలా! నీ వల్ల నా తపస్సుకి భంగం లేదు. పైగా నీ సేవల వల్ల నా తపస్సు నిర్విఘ్నంగా నడుస్తోంది. నిన్ను వదులుకోవటం నాకు సమ్మతం కాదు.” అంటూ చెయ్యి పట్టుకు బతిమాలాడు చపలుడు. “సర్లెండి” అంటూ మొహమాటం నటించి అంగీకరించింది చంచల.
ఆనాటి నుంచీ వారి మధ్యన ఒక దాగుడు మూతల ఆట మొదలైంది. ” నేను నిన్ను ప్రేమిస్తున్నాను ” అని అనకుండా ప్రేమని వ్యక్తం చేస్తుంది చంచల. ఒక ప్రక్కన ప్రేమలో కూరుకుపోయి కూడా ప్రేమించినట్టూ పైకి కనిపిస్తే తన మహర్షిత్వం ఎక్కడ అభాసు పాలౌతుందో అని భయపడుతూ ఆ ప్రేమ అనే రెండక్షరాలని ఆమె ద్వారానే పలికించాలనేది చపలుని ప్రయత్నం. ఆయన తనని మరో విధంగా కూడా సమర్ధించుకున్నాడు. “ఇంత తపస్సు చేసిన నేను ఒకటి రెండుసార్లు చంచలతో సుఖిస్తే మాత్రం తప్పేమిటి ? విశ్వామిత్రమహర్షిలాంటి వాడే అలా చేసి మళ్లీ తపస్సు చేసి బ్రహ్మర్షి అవలేదా ? అని. “ఐనా ఇష్టం లేని స్త్రీని అనుభవిస్తే పాపం కానీ ఇష్టపడే స్త్రీ తో తప్పెలా అవుతుంది ? పైగా ఆమెని అసంతృప్తికి గురి చెయ్యటమే హింస అవుతుంది” అని కూడా సమర్ధించుకున్నాడు.
* * * *
ఒకనాడు బద్ధకంగా వొళ్లు విరుచుకుంటూ తన మేని వంపుల్ని బహిర్గతం చేస్తూ ” స్వామీ ! ఈ రోజు నాకు వొళ్లు నెప్పులుగా ఉంది” అంటూ వయ్యారంగా పడుకొని మెలికలు తిరగసాగింది చంచల.
“చంచలా ! ఏమిటీ ! నీకు ఆరోగ్యం బాగుండ లేదా ? జ్వరం వచ్చిందా ?” అంటూ అప్రయత్నంగా ఆమె చెంపపై చెయ్యి వేశాడు చపలమహర్షి.
“చీ !” అని సిగ్గుపడుతూ చెయ్యి పక్కకి తీసింది చంచల.
“సిగ్గు పడకు చంచలా ! అంటూ ఆమె చేతులనీ కాళ్లనీ వత్తసాగాడు చపలుడు.ఆమె అభ్యంతర చెప్పకుండా సిగ్గు నటించటం మొదలెట్టింది. మోహావేశంలో పూర్తిగా మునిగిపోయిన మహర్షి క్రమంగా తన తనువుని ఆమె ప్రక్కన చేర్చి శయనించాడు.
తోక తొక్కిన తాచులా లేచింది చంచల. “చీ దుర్మార్గుడా ! నీ అసలు నైజం తెలియక నువ్వొక మహర్షి వనుకొన్నాను. నువ్వు పచ్చి కాముకుడివి. నీ వల్ల నా జీవితం అపవిత్రమై పోయింది . నీ సంగతి లోకమంతా తెలియజేస్తాను ” అంటూ అడ్డమైన తిట్లూ తిట్టి చరచరా వెళ్లిపోయింది చంచల .
ఎన్నడూ స్త్రీ స్నేహమే ఎరుగక ఒక్క స్నేహంతోనే ప్రేమలో పడిపోయిన చపలమహర్షి అటు తపస్సు భగ్నమై, ఇటు స్త్రీ ప్రేమ భంగమై ఒక్కమారు కొయ్యబారి పోయాడు. అతనికి మతి భ్రమించింది. ఇక “బ్రహ్మ సత్యం . జగన్మిధ్య. కాదు కాదు జగత్తు సత్యం. బ్రహ్మ మిథ్య . కాదు కాదు. రెండూ మిధ్య. చంచల మిధ్య. అసలు నేనే మిధ్య అని వెకిలి నవ్వులు నవ్వుతూ వనాలవెంట పడి పరుగులు తీయసాగాడు.
చపలుని తపస్సు తగ్గుతుండగా క్రమంగా స్వర్గలోకపు టెంపరేచర్ తగ్గి ఈ సంఘటనతో పూర్తి నార్మల్ కొచ్చేసింది.
తన ముందు తిరిగి ప్రత్యక్షమై మెచ్చుకొన్న బృహస్పతితో ” స్వామీ ! మీ అప్సరసలకంటే మా భూలోకంలో ఉన్న కొందరు కాంతలం చాలా తెలివైనవాళ్లం . ఫర్ ఎగ్జాంపుల్ “ఇదే మీ మేనకో రంభో ఐతే వాళ్ల తపస్సులని భంగం చేసినా భౌతికసుఖాన్ని ఇస్తారు. అది అనుభవించి ఆ మహర్షి మళ్లీ తపస్సు చేస్తాడు. కానీ నాలాంటి వాళ్లు ఆధ్యాత్మిక జీవితాన్ని భ్రష్టం చేస్తారు. భౌతిక సుఖాన్నీ ఇవ్వరు.అది చెడగొడతారు.ఇది ఇవ్వరు. ఇక జన్మలో ఆ చపలుడు తపస్సు చెయ్యలేడు. ఇది పర్మినెంట్ సొల్యూషన్ . ఇక మీరిచ్చిన వరాలు ఖాయమేగా ? అంది”.
“అహో ! నీ చాకచక్యం అమోఘం సుదతీ ! మా దేవవరాలకి తిరుగుండదు” అని అంతర్థానమయ్యాడు దేవగురువు.
ఆనాటి నుంచీ మహర్షులనీ , యోగీశ్వరులనీ కంట్రోల్ చెయ్యటానికి తమ అప్సరసల దివ్యశక్తుల్ని వృథా చేసే బదులు భూలోకపు హ్యూమన్ రిసోర్సెస్ నే ఉపయోగించసాగారు దేవతలు. వీరి ప్రతాపానికి ఇప్పుడు తపస్సులు కొనసాగించగలవారు తగ్గి పోయారు. అప్సరసలకంటే వీరే ఎక్కువ తెలివైన వారు కావటంతో అప్సరసల రాకలూ లేకుండా పోయాయి. ఇదీ అసలు కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *