March 19, 2024

గిలకమ్మ కతలు .. ఉప్పులో .. బద్ద

రచన: కన్నెగంటి అనసూయ

“ఏం..కూరొండేవేటి ..వదినే..…! ”
మిట్ట మజ్జానం రెండున్నరకి పిల్లలు అన్నాలు తిని బళ్ళోకి ఎల్లిపోయాకా.. తలుపుకి తాళవేసి ఆటిని జాగర్తగా జాకిట్లోకి దూరుపుతా అప్పుడే అరుగు మీద కొచ్చి కూచ్చుని తొక్క బద్దలు ఏరటానికని అక్కడే గోడకి జేరేసి ఉన్న సేటల్లోంచి ఏ సేట సేతుల్లోకి తీసుకుని పక్కనే ఉన్న కందిపప్పు బత్తాలోంచి దోసిలితో రెండో దోసిలి..కందిపప్పోసుకుంటున్న సరోజ్ని వంక సూడకుండానే సావిత్రంది ఏదోటి పలకరిచ్చాలి గాబట్టి అన్నట్టు.
రోజూ మజ్జానం కందిపప్పులో తొక్క బద్దలేరతానో..ఎండు మిరపకాయలకి ముచ్చికలు తీస్తానో..బియ్యంలో రాళ్ళేరతానో..సింతపండు రోజుల్లో ఉట్టులూ, గింజలూ తీత్తానో..అప్పడాలు వత్తుతానో..ఏదో ఒక పని అంతా కలిసి సేసుకుంటానే ఉంటారు..సావిత్రి వాళ్ల మండువా అరుగుల మీద ఆ సుట్టుపక్కలోళ్లంతా . అదెవరి పనైనా అందరూ తలో సెయ్యీ ఏత్తం రివాజు.
నాలుగు సేతులడితే సంద్రాన్నయినా వడకట్టచ్చంటారు ఆల్లంతా.
సావిత్రి ఆళ్ల మండువాకి రెండిళ్ళవతల ఉంటది సరోజ్ని ఇల్లు.
సావిత్రి మొగుడు సుబ్బారావ్ సేల గట్ల మీద ఏదోటి ఏసి పండిత్తా ఉంటాడు..ఒకోసారి కంది మొక్కలేత్తే ఒకోసారి జనపనార సెట్లేత్తాడు. ఒకోసారి..బెండమొక్కలెడితే మరోసారి బంతి మొక్కలేత్తాడు.
మిగతా ఆటి మాటెలా ఉన్నా బంతి పూల మొక్కలేసిన ఏడు…అందరి గుమ్మాలూ రోజిడిసి రోజూ గుమ్మాలకి బంతి పూల దండల్తో..అమ్మోరికి ఆవ్వానం పలుకుతున్నట్టుంటాది ఈధి ఈదంతాను.
అలాగ ఈ ఏడు కంది సెట్లేసేడేమో..ఇంట్లోకి సరిపడా అయిన కందుల్ని పురుగు పట్టకుండా ఎండలో పోసి బాగా ఎండబెట్టి..వారం రోజులపాటు కందుల్ని తిరగలిలో ఏసి ఇసిరింది ఇసిరినట్టుందేమో ..సావిత్రి, అంతా య్యాకా దాన్ని జల్లెడతో జల్లిత్తా నలగని కందిగింజల్ని తీసేసి.., సేటతో పొట్టు సెరిగేసి..నూకల్ని తీసేసిందేమో దానంతా సేటతో బత్తాలోకెత్తి మూఠదెచ్చి అరుగు మీదెట్టి అయిదారు సేటల్ని పక్కనే పడేసింది ఇరుగుపొరుగోల్లొత్తారు తొక్కబద్దల్ని ఏరతాకని.
“సెరుకు తోటకి జడేత్తన్నారు కూలోల్లు పొలంలో. సేలో లోపలెక్కడో సిన్న పాదుందంట. కాసినియ్యని రెండు దోసకాయలుంటే తెచ్చేరు మియ్యన్నయ్య. పప్పులో పడేసి సారెట్తేను. నువ్వేంజేసా..?”
అంది సరోజ్ని ఉండుండి సేట్లోని కందిపప్పుని నాలుగేళ్లతో ముందుకి విసిరినట్టుగా లాగి అలా విసరగా పల్చగా అయిన పప్పులోంచి తొక్క బద్దల్ని ఏరి పక్కనున్న సోలలో ఏత్తా.. యధాలాపంగా..
“ఆ..! బెండకాయ పులుసెట్టేను. సావిడి కాడ నాలుగు సెట్లు నాటేరెంట. తెచ్చి నాల్రోజులయ్యింది. తెచ్చిన్నాడైతే నవనవలాడతా ఉంటాయని సగం కాయలు బెల్లం ఇగురేసేను. ఇంకో నాలుక్కాయలుంటే ముదిరిపోతన్నాయని ..”తలెత్తకుండానే బదులిచ్చింది సావిత్రి.
“దోసకాయ పప్పు మా పిల్లోడు నెయ్యేత్తే బాగానే తింటాడుగానీ ..మా గిలకే..నోటబెట్టదు.
తిన్నంటే తినదంతే. పిల్లోడికైనా బెతిమాలి ఓ ముద్ద తినిపిచ్చొచ్చు. ఇదొట్టి పెంకిది.
రెండు కొట్టి తినిపిద్దావని సూత్తానా..? తింటేనా..తిందు.నాకే తినిపిత్తది..తిరిగి.”
“మావోడూ..అంతే. డబ్బులిత్తాను, కొట్టుకాడ బిళ్లలు కొనుక్కుందుగానంటే తినేత్తాడు..”
“అలాగైతే బాగానే ఉండును. ఏదిత్తానన్నా..నచ్చాపోతే నోట పెట్టిచ్చలేను. ఒట్ఠి పెంకిముండ. యేగలేక సత్తన్నాననుకో దీంతో.. ..”
“రెండు మూడేల్లు పోతే ఇవరం అదే వత్తదిలే. ఇవరం వచ్చిందంటే మనకే సెప్పుద్దది..”అంది సావిత్రి..సేట్లోంచి తలెత్తకుండానే.
మాటల్లోనే ఇరుగూపొరుగోళ్ళొచ్చి తలో సేటా తీసుకుంటుంటే సావిత్రంది..
“టీలు ఐపోయినియ్యా ఏటి..?”
“ఇంకాలేదు. ఏదో పని మీద ఈయన మజ్జానం పొలాన్నించి ఇంటికొచ్చి వణ్ణం తిని గంటలో వత్తానని ఎల్లేరు. వత్తే టీ పెట్టి రావొచ్చని ఆగేను. ఇంకా వత్తాలేదని సూసీ సూసీ ఇటోచ్చేను. య్యే..మియ్యయిపోయినియ్యా..?”
“అప్పుడేనా..?”
మరో ఇద్దరొచ్చి చేరేసరికి సోల్లో తొక్క బద్దల్తో పాటు కవుర్లూ ఎక్కువైపోయినియ్ అక్కడ.
ఇంతలో .. రయ్యిమంటా దూసుకుని ఈరో సైకిలొచ్చి ఆగిందక్కడ. సైకిల్తో పాటు సుట్ట కంపూ అగిందక్కడ.
ఆ డొక్కు సైకిలు శబ్ధం, సుట్టకంపూ ఆల్ల ముక్కుసెవులకి అలవాటేనేమో..వంచిన తలెత్తలేదెవ్వరూ. ఎవరి పన్లో ఆళ్ళున్నారు.
ఒక్కాలు కిందెట్టి ఇంకొక్కాలు పెడలు మీద అలాగే ఉంచి సరోజ్ని వంకే సూత్తా..
“గిలకొచ్చేత్తందక్కా..బల్లోంచి..” అన్నాడు సావిత్రి మొగుడు సుబ్బారావ్ .
సివ్వున సేట్లోంచి తలెత్తి “మా గిలకే..?” అంది తెల్లబోతా..సరోజ్ని.
“అయ్యా..! గిలక తెలవదేటక్కా..నాకు? గిలకే. లంగా జాకిట్తేసుకుంది గదా..”
“అవును ..ఏస్కుంది. ఇప్పుడే గదా ఎల్లింది బళ్ళోకి? ఇంతలోనే ఇంటికాడ ఏం పనొచ్చింది ఎదవకి?”ఇసుగ్గా అంది సరోజ్ని మళ్ళీ సేట్లో పప్పులో తలదూరుత్తా..
సుబ్బారావు పకపకా నవ్వేడు ఏదో గుర్తొచ్చినట్టు. కాసేపలా నవ్వీ, నవ్వీ…
“లంగాని ఇస్రుగా తన్నుకుంటా వచ్చేత్తంది సరోజ్నక్కా.! ఆ ఇసురుకి లంగా ఇంతెత్తున ఎగిరెగిరి పడతంది. మూతేమో మూరడు పొడుగొచ్చింది ఇవతలికి. ఏదో సిరాగ్గా ఆపడతంది మడిసిగూడాను మరి..”
నవ్వుతానే అన్నాడు..సైకిల్ దిగేసి మందువా గోడపక్కమ్మటా స్టేండేసి లుంగీని పైకి మడుత్తా..
“ఉప్పుడే ఎల్లింది సుబ్బయ్యా ..అన్నందిని. దాన్నలాగంపి తాళవేసుకుని నేనిటొచ్చేను మీయావిడ కందిపప్పేరతంటే సూసి. ఇంతలో దానికి ఇంటికి ఏవన్నా పనుందంటావా? పేనం ఏగిచ్చిపోతందనుకో. ఇంటికాడుంటే ఏపిచ్చుకు తింటందని బళ్ళో పడెయ్యమన్నాను మీ బావయ్యని. ఇంటికాడుంటే ఒగ్గొడవ. బళ్లో ఏత్తే ఇంకొగ్గొడవా.సత్తన్నాననుకో దీంతో..”
“ఏ దొడ్లోకన్నా వత్తందేమో లేపోతే..” అదోలా నవ్వుతా అంది సావిత్రి మొగుడొచ్చేడని సేట పక్కనెట్టి లేసి నిలబడతా..
“అబ్బే. ఎప్పుడైనా ఇరోసనాలొత్తే తప్ప మజ్జలో ఎల్దు. పొద్దున్నే ఓసారి ఎల్లద్దంతే…! “సరోజ్నంది .
“ఒకవేళ ఎవరన్నా ఏవన్నా అన్నారేవో..మూతి ముందుకెట్టింది అంటన్నారుగదా ఈయన. అయినా కాసేపాగితే అదే తెలుత్తుది. “
“ ఎదప్పిల్లలు . అంతే బాబ. కొట్టుకుంటా ఉంటారు. కొంపలంటూ పోయినట్టు తిట్టుకుంటా ఉంటారు. మల్లీ ఆల్లే కలుత్తా ఉంటారు. మా రోజుల్లో అయితే రత్తాలొచ్చేతట్టు గీరేసుకునేవోల్లం. ఇంకా ఈ రోజుల్లో పిల్లలు నయవే..! సేతుల్తో కొట్టుకుంటన్నారు. ఎన్నిమార్లు కొట్టుకుంటే తగిలేను దెబ్బలు. కూతంతుంటాయ్ ముండా సేతులని..ముండా సేతులు..” రవణ అంది పిల్లల సేతులు గుర్తొచ్చి మురిపెంగా..
“అమ్మో..అలాగనకు రవణక్కా..! నీకుదెలవదు. మా గిలక సరిసిందంటేనా..? సుర్రున మండుద్ది..పిడపల్లాగుంటయ్యేవో సేతులు..ఎప్పుడైనా ఓ దెబ్బేత్తే పిల్లోడు గింగిరాలు దిరిగిపోతాడనుకో..దాని దెబ్బకి తట్టుకోలేక..”
ఏరేసిన పప్పుని పక్కనే ఉన్న బత్తాలో పోసేసి ఈధెనక్కి సూత్తా మరో నాలుగు దోసిళ్ల కందిపప్పు సేట్లో పోసుకుంటా అంది..సరోజ్ని.
అంతలోనే రయ్యున దూసుకుంటా వచ్చేసింది గిలక.
తలుపు గడియేసి ఉంటం సూసి నిలబడ్ద సోటే నిలబడి రెండు సేతుల్తో లంగా కొంచెం పైకెత్తి కాళ్ళు రెండూ నేల కేసి తపా తపా కొడతా రాగం లంకిచ్చుకుంది గిలక “అమ్మెక్కడికెల్లిపోయిందో “నన్నట్టు నిరాశగా.
సేతులు సేటలో ఆడిత్తా..అదంతా సూత్తానే ఉన్నారు మండువా అరుగుల మీద ఆడాళ్ళు.
అప్పటికే సూరీడు తిష్టేసేసినట్టు ఎర్రగా కందిపోయి భగభగలాడతందేవో..దానికి ఏడుపు తోడై వానలో మెరుత్తున్న సూరీళ్ళా ఉంది గిలక..
“మియ్యమ్మిక్కడుందే గిలకా..! ఏ..ఏటి? ఇయ్యాలప్పుడొచ్చా..” లోలోపల నవ్వుకుంటానే ఎటకారంగా అంది..గిలకొంక సూత్తా.. రవణ.
దాంతో ఏడుపాపి.. ఏమ్మాట్తాడకుండా తిన్నగా ఆల్లమ్మ..దగ్గరకంటా వచ్చి నిలబడి సెయ్యి సాపింది ఇంటి తాలాలిమ్మన్నట్టుగా..
“ఎంతుకొచ్చా…మజ్జలో..ఇంటికి? కడుపులో కాలిందా ఏటి?”
“హ్హె..కాదు..తాలాలియ్యి..”కోపంగా అంది గిలక.
“అదే ఎంతుకని అడిగితే సెప్పవే? మేస్టారు కొట్తేరా?’
“కాదని సెప్పేనా? ముందు తాలాలియ్యి..”ఇసుక్కుంది గిలక.
“మేస్టార్ని అడిగే వొచ్చేవా..?”
“ఆ..అడిగే వచ్చేను. ఒకటికి వత్తందన్నాను..పరిగెత్తన్నారు..”
..”ఎంతుకో సెప్పి సావొచ్చుకదా..! సెప్తుంటే నీక్కాదా? యేసాలేత్తన్నాయ్ యేసాలని..”
కళ్ళెర్రసేసింది సరోజ్ని..
ఇంక సెప్పక తప్పదని..సరోజ్ని దగ్గరకంటా వచ్చి ఈపుకి జారబడి కూకుని..సేట్లో కందిపప్పు కూతంత సేతుల్లోకి తీసుకుని పకి ఎగరబోత్తా..
“మరీ..మరీ .. ఆ కిట్టవేణుంది కదా…అదే ఆ గుడికాడిల్లు.. కిట్టవేణి. ఎలుగుబంటెహ్హె..”
“గుడికాడ కిట్టవేణంటే నాకెలా తెలుత్తుది. ఆల్ల ఇంటి పేరు సెప్తే తెలుత్తుదిగానీ..”
“సరోజ్నంది ..ఏంజప్పుద్దా అని సెవులు ఒదిలేసి ఇంటా.. .
“ అదేనెహ్హే…ఆ ఈడుబుగంటోరు కిట్టవేణి. ఎలుగుబంటీ ..ఎలుగుబంటీ అంటానుగదా నేను. “
“ నువ్వందరికీ పేర్లేలేగానీ సెప్పి ఏడువ్ ..! అలా పిలవద్దని నెత్తీ, నోరూ బాగుకున్నా ఇనవా?” ఇసుక్కుంది..సరోజ్ని..గిలక సాగతీతకి.
“ అబ్బా..సర్లేగానీ..ఆ..ఎలుగుబంటి..ఎప్పుడో నాకు సిన్నది, ఇదిగో ఇలా సూడు..ఇంత. ఇంతంటే ఇంతే. ఈ గోరంత కూడా ఉండదది. కూతంత ఉప్పులో ముక్కెట్టిందమ్మా..! ఉప్పుడు తెచ్చివ్వమంటంది.”
లాకుల వెనక దాక్కున్న నీళ్లల్లా..వాళ్లందరి ముఖాలూ ఉబికుబికి వచ్చే నవ్వుతో గుంభనంగా ఎప్పుడెప్పుడు వరదై పారదామా అన్నట్టున్నాయ్ గిలక మాటలకి.
“ఎప్పుడెట్టింది నీకు..?”నవ్వాగటం లేదు రవణకి.
“ఎప్పుడో అప్పుడ్లే. నువ్వు మరీను. సెప్పింది ఇనక..”ముసి ముసి నవ్వులు నవ్వుతా సావిత్రంది రవణని సెప్పనియ్యి అన్నట్టు
“ఎప్పుడో..! ..నాకే గుత్తులేదు..”…పప్పులో గీతలు గీత్తా.. అందేమో.. గిలక బుంగ మూతిని ముద్దెట్టి కొరికెయ్యాలనిపించింది..రవణకి.
“తింగరిముండ కాపోతే ..అప్పుడెప్పుడో పెట్టి ఇప్పుడెంతుకివ్వమంటందది….”సావిత్రంది…గిలకని రెచ్చగొడతాకన్నట్టు..మనసులో నవ్వుకుంటానే..
సావిత్రి కృష్ణవేణిని తింగరి ముండని తిట్టటంతో కొత్త ఉత్సాహం వచ్చేసింది గిలక్కి. దాంతో..గబుక్కున లేసి నిలబడి …నడుం మీద సెయ్యేస్కుని మరీ సావిత్రెనక్కే సూత్తా..
“అదే..సావిత్రత్తా..! మరీ..మరీ ..ఆ ఎలుగుబంటేవో.. ఓంవర్కు సెయ్యలేదు. నేనేమో..మేస్టారింకా రాలేదని వరండాలో..తంబాలాట ఆడుకుంటన్నాను. నేనలా ఆడుకుంటన్నానా..ఆడుకుంటుంటే నా సంచీలో స్సెయ్యెట్టి నా పుస్తకం ఇవతలకి తీసేసి.. సూసి రాసేత్తంటే గిరీసొచ్చి సెప్పేడు. నేనేమో మా మేస్టారుతో సెప్పేను. మా మేస్టారు సూసెంతుకు రాసేవు? ఇంటికాడేంజేత్తన్నా..గౌడిగేదెల్ని కాత్తన్నావా? అని దాన్ని తిట్టి బెంచెక్కి నిలబడమన్నారు. దానిక్కోపం వచ్చి పైనుంచి నాయనక్కి సూత్తా..”నన్ను బెంచీ ఎక్కిత్తావు గదా..! సూడు నిన్నేం సేత్తానో..? అని ఏలెట్టి బెదిరిచ్చి.. అప్పుడెప్పుడోను..డ్రాయింగు క్లాసులో నీకు ఉప్పులో ముక్కిచ్చేను గదా ..నా ముక్క నాకిచ్చెయ్ అంది. అత్తా..”
సెప్పేటప్పుడు అదేపనిగా తిప్పుతున్న ఆ బుజ్జి బుజ్జి సేతుల వంకే సూత్తన్నారేమో..ఒకటే నవ్వులు అక్కడంతా.
“అప్పుడు నువ్వేవన్నా..”పొట్టని సేత్తో పట్టుకుని నవ్వుని ఆపుకుంటా రవణంది..
పప్పేరతానే పైకి ఇనపడకుండా లోలోన సరోజ్ని నవ్వే నవ్వుకి అంతేలేదు..
“నేనూరుకుంటానేటి రవణత్తా..! నేనూ అన్నాను..గాడిద గుడ్డు. నీ ఉప్పులో ముక్క నీకు పడేత్తా.. కావాలంటే రెండిత్తా. సూసి రాసేవంటే మాత్తరం ఊరుకోనన్నాను. సూసి రాత్తే తప్పే కదా సావిత్రత్తా..”ప్రశ్నొకటి..
“తప్పా..తప్పున్నరా..?” సావిత్రత్త ఇచ్చే సపోర్టుకి లోకాల్ని జయించినట్టు పెట్టింది మొకాన్ని గిలక..వెయ్యేనుగుల బలవొచ్చేసి..
ఇంతలో రవణంది..
“మరి..మరి ..ఆ ఉప్పులో ముక్కని దాని ఎదాన కొట్తాలిగదా..! ఉప్పుడెక్కడ్నించి తెత్తా ఉప్పులో ముక్కని.. కిట్టవేణితోనేమో..ఒకటిగాదు. రెండిత్తాననని సెప్పొచ్చేవ్..”
“అమ్మిత్తాది..”సరోజ్ని ఈపుకి జేరబడతా గిలకన్న మాటల్లో ధీమా.
“ఎక్కడ్నించి తెచ్చివ్వను? ఈ యేడు నేను ఉప్పులో ముక్కలు పొయ్యలేదు..”లాకులెత్తితే దూసుకొచ్చిన నీళ్ళల్లా ఇస్సురుగా వచ్చేసింది జవాబు సరోజ్ని నించి.
“నువ్వుగాని కోసేవా సావిత్రొదినే..”అంతలో అంది సేట్లోంచి తలెత్తకుండానే..
“కోసేను గానీ ఆ మజ్జన ముసుర్లు పట్టినప్పుడు..పప్పులో ఏసేసేను. రవణ దగ్గరేవైనా ఉన్నాయేమో..? ఎంత? అడుగూబొడుగూ రెండు మూడు ముక్కలున్నా దానికి సాలు. పిల్లముండ బాకీ తీరుత్తాకే గదా .”
“బాగాసెప్పేవ్..! కానీ…నేనూ కొయ్యలేదు. అసలు ఈ యేడు సరైన మావిడికాయ దొరక్క..అసలు పచ్చడే పెట్టగలనో లేదోనని భయపడ్డాను. ఏదో మా పెదనాన్న ఓ పాతిక్కాయలు కొత్తపల్లి కొబ్బరి మావిడి కాయలు పంపేసరికి పచ్చడెట్టేను..లేపోతే అదీ ఉండాపోను..”రవణంది..
గిలక మొకంలో దిగులు మేగాలు సేరతం గమనించి..
“రేపిత్తానని సెప్పాపోయేవా..? ఇప్పటికిప్పుడే ఇచ్చేత్తానన్నావా?”అన్న సావిత్రి మాటలకి..
“అబ్బే..! తలుసుకున్నప్పుడే తాతపెళ్ళి. ఇప్పుడా ఉప్పులో ముక్కట్టుకెల్లి దాని మొకానగొట్తాల్సిందే. లేపోతే నా తల మీద జుట్టు పీకి మొలేత్తది..” సేట పక్కనెట్టి పైకి లేసి నిలబడి సీర దులుపుకుంటా సరోజ్నంది..
“మరిప్పుడా ఉప్పులో ముక్కని ఎక్కడ్నించి తెచ్చి ఇత్తా.! “
“సూడాలి. ఏదోటి సెయ్యక తప్పుద్దా?”అంది సరోజ్ని ఏళ్లిరిసుకుంటా..
ఇంతలో..
“సర్లే ..తాలాలియ్యి..”అంటా సరోజ్ని సేతిలోంచి తాళాలు లాక్కుని , లంగా పైకెత్తుకుని మరీ పొట్టేలు పిల్లలా పరిగెత్తుతున్న గిలకొంక సూత్తా..
“ఏవీ అనుకోకు వదినే. ఎప్పుడూ ఉంటాయ్ ఉప్పులో ముక్కలు మా ఇంట్లో..! ఈసారే మరీ తక్కువ కోసేను. నాకూ ఇష్టవే ఉప్పులో ముక్కలంటే..వానాకాలంలో ఉప్పుప్పగా ఏదైనా తినాలనిపిత్తే ఉప్పులో ముక్కే నోట్లో ఏసుకుంటాను. ఉప్పుప్పగా, పుల్లపుల్లగా నోటికి బాగుంటాయని. ఎంతుకలా తింటావ్. నాలుక్కొట్టూపోద్ది అంటారీయన. అయినా ..ఏంటో అదంటే ఇట్తం.. ‘
తొక్కబద్దల్ని కుంచంలో పోత్తా..సావిత్రంది…
౭౭ ౭౭ ౭౭
కాసేపయ్యాకా..ఏరిన కందిపప్పు బత్తాని లోపలెట్టేసి..అరుగంతా సీపురెట్టి ఊడ్సేసి సుబ్బరంగా ఉంది అనుకున్నాకా… “ఏంజేసా…ఉప్పులో బద్దల సంగతి వదినే..? లేపోతే ..మా పిన్నత్తగారింట్లో ఉంటాయేమో..! ఓమాటడగమంటావా? ఏటా కుండడు ముక్కలు కోత్తది. అదే.. ఊళ్ళో పిన్నత్తగారు. నీకూ దెల్సుగదా. అక్కడ్నించి తెప్పిచ్చమంటావా?” అంటా సరోజ్ని ఇంటికో అడుగేసిన సావిత్రి..అక్కడ ఎండలో నేలమీద సిన్న పేపరు ముక్కేసి..దాని మీదెట్టిన సన్నగా మూడు అంగుళాల పొడవున్న ఆ మెత్తనిదాన్ని సూసి నోరొదిలేసి “ఏటే ..అది..”అనడిగింది గిలకని సావిత్రి. “మాడికాయ్ ముక్క…”
“అదెక్కడ దొరికిందిప్పుడు నీకు?” తెల్లబోయింది.. సావిత్రి.
“మాగాయ పచ్చట్లోది ..”అక్కడే ఎండలో కిందకూచ్చుని పేపర్ మీద దాన్ని అటూ ఇటూతిరగేత్తా అంది గిలక తలెత్తకుండానే..
“…కడిగేసేవా?”ఆరా గా అంది సావిత్రి.
“ఊ..! మరి కడగొద్దేటి? కడిగేసి మళ్ళీ ఉప్పు గూడా రాసేసేను..”
“ఏటేటి? మాగాయ పచ్చట్లో ముక్క కడిగేసి ఉప్పు కూడా రాసేసేవా? రాసి ఎండబెడతన్నావా? ఆసి ముండకనా..! ”
సావిత్రి మాటలకి గిలక ఏమ్మాట్టడలేదు గానీ.. సరోజ్నంది…వంటింట్లోంచి పచ్చడి గరిటట్టుకుని బయటికొత్తా..
“దీని పెంకితనం సూసేవా వదినే? నేను కాళ్ళు కడుక్కుని వచ్చేలోపే ఇదంతా సేసేసింది. పచ్చడి జాడీలో ఏ గరిట పెట్టిందో ఏటోనని..గుండెలు దడెత్తి పోయేయనుకో. తడుంటే బూజొచ్చేత్తది..గదా. దీన్తో ఓ సమస్య కాదు నాకు. ఎలాగ ఏగాలో ఏటో..దీన్తో..”తలట్టుకుంది సరోజ్ని.
“నాకు తెల్దా..ఏటి? ! పెద్ద సెప్పొచ్చిందిగానీ మాయమ్మ, గరిటిని నా లంగాతో తుడిసేన్లే..అత్తా..”
తెల్లబోతా సూసేరిద్దరూ గిలక్కేసి.
“సర్లే..మేం ఎండబెడతాంగానీ నువ్వెల్లు బళ్ళోకి. మేస్టారు కొడతారు మల్లీని..”
దాంతో..కింద కూచ్చున్నదల్లా లేసి నిలబడి గుమ్మానికేసి అడుగేత్తా..
“అమ్మా..! కాసేపాగి తిరగెయ్..! బేగిని ఎండుద్ది. “అంటా రెండు సేతుల్తో లంగా పైకెత్తుకుని ఎగిరెగిరి పరిగెత్తుతున్న గిలక్కేసే సూత్తా..
“ఉప్పులో ముక్కల్లేవని మాగాయ ముక్క ఎండలో పెట్టుద్దా? దీని తెలివి సల్లగుండా..” అని మనసులో అనుకుని ..నవ్వుతా సరోజ్ని వంక సూత్తా .. “నీ కూతురు మామూల్ది గాదమ్మో…సరోజ్నే..! ఊళ్ళేలేత్తది.. “బుగ్గల్నొక్కుకుంది సావిత్రి.
ఉత్సాహంగా పరుగెత్తుతున్న కూతుర్ని దూరం నించే మురిపెంగా సూసుకుంది సరోజ్ని.
—-

5 thoughts on “గిలకమ్మ కతలు .. ఉప్పులో .. బద్ద

  1. ధన్యోస్మి అండి శశికళగారూ! ఇది మా జిల్లాల ఆహారపు అలవాట్లు.

  2. గిలకను మా మనసులకు దగ్గర చేసేస్తున్నారు. గిలక ఎక్కటున్నా వెతికి పట్టుకుని ఆ బుజ్జిబుర్రలో తెలినికి ముద్దుపెట్టేసుకోవాలని ఉంది. పల్లెల జీవనసౌందర్యం మీ రచనలో ప్రతిబింబిస్తోంది.

  3. Thanku so much జ్వలితగారూ! నాకు ఆనందం వేసిందండి మీరు చదివినందుకు.
    ఇది మా గోదావరి జిల్లాల యాస,సంస్కృతి,అలవాట్లండి.

  4. భలే సరదాగా ఉన్నయి గిలకమ్మ కథలు అభినందనలు మేడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *