April 16, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 47

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

మానవ జన్మ ప్రాముఖ్యాన్ని తెలియని వారుండరు. కానీ, అజ్ఞానం, అరిషడ్వర్గాలకు బానిసై అకృత్యాలు చేస్తుంటారు. పశ్చాత్తాపంతో తేరుకుని తెలుసుకున్నవారు చాలా తక్కువగానే ఉంటారు. ఆ విషయం తెలుసుకొని ఆచరణలో పెట్టే జనం ఇంకా తక్కువగా ఉంటారు. అలా ఆచరణలో పెట్టినవారు మాత్రమే కృతార్థులవుతారు. అన్నమయ్య సంకీర్తన ప్రాముఖ్యాని గ్రహించమంటున్నాడు. ఇకనైనా మేలుకోండి అంటున్నాడు. ఋగ్వేదంలో చెప్పబడిన “విష్ణోర్ముకం వీరాణి ప్రోవచాం” అనే శ్లోకమాధారంగా శ్రీనివాసుని స్తోత్రం చేత, సంకీర్తన చేత సేవించడమే వేదం చెప్పిన మాట అని ఈ బాధామయ లోకాన్ని దాటి కైవల్యం పొందడానికి ఇంతకన్న సుగమమైన మార్గమే లేదు అని చెప్తూ మానవులకు మార్గోపదేశం ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.
కీర్తన:
పల్లవి: ఏవం శ్రుతిమత మిదమేవ త-
ద్భావయితు మతఃపరం నాస్తి ॥పల్లవి॥
చ.1.అతుల జన్మభోగాసక్తానాం
హిత వైభవసుఖ మిదమేవ
సతతం శ్రీహరిసంకీర్తనం త-
ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి ॥ఏవం॥
చ.2.బహుళమరణపరిభవచిత్తా నా-
మిహపరసాధన మిదమేవ
అహిశయనమనోహరసేవా త-
ద్విహరణం వినా విధిరపి నాస్తి ॥ఏవం॥
చ.3.సంసారదురితజాడ్యపరాణాం
హింసావిరహిత మిదమేవ
కంసాంతక వేంకటగిరిపతేః ప్ర-
శంసైవా పశ్చా దిహ నాస్తి ॥ఏవం॥
(రాగం సామంతం; సం.1 సంకీ.4 – రాగిరేకు – 1-4 )

విశ్లేషణ:
పల్లవి: ఏవం శ్రుతిమత మిదమేవ త-
ద్భావయితు మతఃపరం నాస్తి

జీవుడు జనన మరణ చక్రంలో బడి అనేక జన్మలు ఎత్తి బాధనందకుండా ఉండడానికి శ్రీనివాసుని సంకీర్తనమే మార్గం తప్ప వేరొకటి లేనే లేదు అంటున్నాడు.

చ.1.అతుల జన్మభోగాసక్తానాం
హిత వైభవసుఖ మిదమేవ
సతతం శ్రీహరిసంకీర్తనం త-
ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి
సాటిలేని అనంత కాలచక్రపయనంలో జీవుడు పొందే జన్మలు ఎన్నో. దానినుండి నివారణ పొందడానికి, ఐహికాముష్మికములు పొందడానికి, అనంత శయనుడైన ఆ శ్రీమహావిష్ణువు సంకీర్తనా సేవ తప్ప మరొకటి లేదు.

బహుళమరణపరిభవచిత్తా నా-
మిహపరసాధన మిదమేవ
అహిశయనమనోహరసేవా త-
ద్విహరణం వినా విధిరపి నాస్తి
అనేక జన్మలలో పుట్టుక మరణం పొందినవారికి తరించడానికి ఆ శ్రీవేంకటేశ్వరుని పాద సన్నిధి తప్ప మరో గత్యంతరం లేదు. అన్యధా శరణం నాస్తి అని వేడుకోమని ప్రభోదిస్తున్నాడు.

చ.3.సంసారదురితజాడ్యపరాణాం
హింసావిరహిత మిదమేవ
కంసాంతక వేంకటగిరిపతేః ప్ర-
శంసైవా పశ్చా దిహ నాస్తి

సంసారం అనే పాపపంకిలంలో చేసిన ఘోరాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు హింసలేకుండా పరమపధం చేరడానికి ఇదే ఉత్తమమైన మార్గం. కను కంసాంతకుడైన శ్రీహరి చిత్తం గెలుచుకోండి. మనసారా ఆర్తిగా వేడుకోండి. నోరారా “శ్రీహరీ! శరణు! శరణు!” అనండి చాలు అని తాను నమ్మిన, ఆచరించిన హరినామ విశిష్టతను అందరికి పంచిపెడుతున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు: శ్రుతిమతం = వేదమతం లేక వేద సారం; ఇదమేవ = ఇదే సుమా!; భావయితుం = భావించడానికి; అంత:పరం = మిక్కిలి ఉన్నతమైనది; ఏవం = ఈవిధము; తద్వ్యక్తిరిక్త సుఖం = దానికంటే శ్రేష్టమైనదని చెప్పుటకు; వక్తుం = చెప్పడానికి; మరణ పరిభవ = మరణమనే అవమానం కలిగినవారికి; అహిశయన = శేషతల్పముపై ఉన్న; వినా = కంటే; విధిరపి = చేయదగిన కర్తవ్యము; పరాణాం = మునిగి తేలుతున్నటువంటి; హింసా విరహితం = హింస లేనటువంటి; ప్రశంసైవ = కొనియాడుటకు; పశ్చాత్ = వేరొక మార్గము.
-0o0-

2 thoughts on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 47

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *