April 16, 2024

కవి పరిచయం..

రచన: లక్ష్మీ రాధిక

పేరు..తాటిశెట్టి రాజు, నివాస స్థలం విశాఖపట్టణం. వృత్తిపరంగా అవుట్సోసింగ్ జాబ్ వర్క్స్ చేస్తూ ఉన్నా ప్రవృత్తి పరంగా కవిత్వాన్ని, సంగీతాన్ని సమంగా ఆస్వాదిస్తుంటారు. ప్రకృతి పట్ల, సమాజం పట్ల సమబాధ్యత వహిస్తూంటారు.

“గోరంత గుండెచప్పుడు పదాలుగా మారితే ఆయన కవితైనట్టు..”
చైత్రపు తొట్టితొలి పండుగ ఉగాది మొదలు మాఘమాసపు శివరాత్రి వరకూ ఏటా పన్నెండు పండుగలకో లెక్కుంటే, తను రాసే రెండు..రెండున్నర నెల్లాళ్ళూ పండుగే అభిమానులకి అంటే అతిశయోక్తి కాదు.
“పెరిగీ తరిగేను నెలరాజు..వెలుగును నీ మోము ప్రతిరోజూ..ప్రతిరేయి పున్నమిలే..నీతో ఉంటే” అని C. నారాయణరెడ్డి గారు అన్న సందర్భం ఏదయినా గానీ ప్రతి రోజూ.. రాత్రి ముగిసే ముందు ఆయన కవితా చంద్రోదయం కావలసిందే..ఆ వెన్నెల ఆస్వాదించి గానీ రెప్పలు మూతబడవు వారి నేస్తాలకు. మనసు మేఘమై సంచరిస్తూ ఆకాశమంతా కలిదిరగాలంటే..సంతోషాన్ని మించిన రసానుభూతి కావాలి కనుక కొన్ని క్షణాల ఆత్మసమర్పణ కోసమని ఆన్ని ఎదురుచూపులేమో..
నిరంతం సముద్రాన్ని స్నేహిస్తూ తనివితీరా అలల్ని హత్తుకున్నందుకేమో, ఎంత గంభీరంగా రాసిన కవితలైనా కూడా కొంత సంగీతాన్ని వినిపిస్తాయి. ఇది మరెవరికీ లేని ప్రత్యేకమైన తన’లోని’ స్వరానిది. అయితే.. ద్వేషాన్ని పంచడం తెలీని తను తిరస్కారాన్ని మాత్రం యధావిధిగా వెనక్కి ఇచ్చేస్తారు. భావుకత్వానికి బంధువో, వాలంటైనుడి వారసుడో, ప్రేమలోకపు రాయబారి కావచ్చునో.. ఎప్పుడూ మృదువైన వాత్సల్యాన్ని వెంటబెట్టుకు తిరుగుతూనో, అవధుల్లేని ఆనందాన్ని పంచుతూనో, సహజమైన ప్రేమ సువాసనలు వెదజల్లుతూనో, హృదయాలకు దగ్గరగా మసులుతూనే ఉన్నట్టుండే సార్ధక నామధేయులు శ్రీ “రాజు”గారు. ఇంతకు మునుపు ఎన్నో రంగురంగుల కలలొచ్చి, ఉదయానికి గుర్తురాని కలతొకటి ఉండి ఉండవచ్చు. కలలేని ప్రశాంత నిద్ర, కమనీయ లాలిత్యమూ తన పదాల పోహణింపులో నిత్యకృత్యము. తన కవిత్వంలో.. కనిపించే ప్రతి విషయమూ కళాకృతిలా కన్నులముందు అందంగా నిలబడి తీరుతుంది. ఆ రాతల్లో ఎన్ని భావాలంకారాలో చేయి తిరిగిన చిత్రకారుని కుంచె స్ఫురణకొస్తుందంటే అతిశయోక్తి లేదు. గులాబీల గుండెలు పిండితీసే అత్తరుని సైతం తిరస్కరించే సున్నితత్వం ఆయన సొంతమనిపిస్తుంది.
చలం ఆరాధకుడ్ని అని చెప్పుకొనే తను ప్రేమను ఎంతగా ఉపాసించి సున్నితంగా రాస్తారో, సామాజిక సమస్యలను, వ్యక్తిగత ఆలోచన ఇతివృత్తాలను, అర్ధాలు కోల్పోతున్న భావాలను సూటి బాణాలుగా ఎక్కుపెట్టేస్తారు. ముఖ్యంగా స్త్రీల పట్ల sensibleగా ఉంటూ ధైర్యాన్ని నేర్పిస్తారు. ఎంతోమంది, ఎక్కడోచోట ఆయన కవిత్వంలో తమని తాము చూసుకోకుండా ఉండరు. బహుశా Emotional Immunity Systemని ఆయన వాక్యాలతోనే పెంచుకుంటారు కాబోలు. ఇంతమందిని ఆదమరిచేలా చేసే ఈయన కవిత్వం ఓ వ్యసనమందుకే..😁

“అశాశ్వతమైన జీవితానికి నీ ప్రేమ తప్ప
వేరే ఏ విలువా – అర్ధం లేకపోవడానికి మించి
ధన్యతేముంటుంది..” ఇంత లోతైన భావ వ్యక్తీకరణ చేయగలిగేదెవ్వరూ..

“ఎప్పుడైనా .,
లోకం తృణీకరించినపుడో
సంఘం నిరాదరించినపుడో
అక్షరాన్ని కావలించుకోగలిగిన వాడే కవి .,
భావంతో రమించగలిగినవాడే తాత్వికుడని
నీకూ చెప్పాలా …? ” ఒక కవి గురించి ఇంత చిన్న వాక్యాల్లో ఇమిడించగలవారు లేరు..

“ఎవరి రాక
నీ జీవితాన్ని తేలిక పరిచిందో..
ఎవరు
నీదన్న ప్రతీదీ మనదిగా భావిస్తారో..
ఎవరు
కలలో కూడా దాపరికమే అవసరం రాని
స్వేచ్ఛాఉనికిగా నీలోపల వశిస్తారో
తనతోనే నువ్వు ప్రేమలో ఉన్నట్టు
తను మాత్రమే నీకు ప్రేమను అందిస్తున్నట్టు..” అంటూ గిలిపెట్టినా..

“ఎవరో కోసేస్తున్నారని
పూలను పుష్పించకుండా ఆపడం మొక్కకి చేత కానట్టే
పడ్డ కోతలకి భారమైన నా జీవితం
నా ప్రేమించే హృదయాన్ని నిరోధించలేదు” అంటూ మెలిపెట్టినా ఆయన తరువాతే..

“ఎప్పుడు
స్త్రీపురుషులు వేరువేరు జీవులుకారని
ప్రకృతి తన కొనసాగింపు ఎత్తుగడలో ఎంచుకున్న
ఒకే దేహానికి రెండు తీరాలని తెలుసుకుంటాడో..

అప్పుడే మనిషి మనిషిగా పరిణామం చెందినట్టు..” ఓహ్..కలని కవిత్వం చేస్తే బంగారులోకం కళ్ళబడుతున్నట్లు…
చదివేందుకు మనసుల్ని మించిన పుస్తకమే లేదన్నట్టు ఆయన రాసే ప్రతీ భావమూ అన్వయయించుకో తగిన రహస్యానుభూతే శృతి తెలిసినవారికి..
ఉన్నచోటునే ఉంటూ ఒకొక్కరి హృదయాల్లోకి వలసపోతూ, తన అస్తిత్వాన్ని అక్షరాలుగా అల్లుకుపోతుంటారు. అందుకే అందరివాడైన మకుటం లేని “మహరాజే”.. ఈ రాజు..💜
మరింత చిక్కని కవిత్వం రాసి, మరిన్ని హృదయాలు గెలిచి మీ కవిత్వాన్ని సంపుటీకరించాలని ఆశిస్తూ..మరోసారి హృదయపూర్వక అభినందనలు

4 thoughts on “కవి పరిచయం..

  1. సూపర్ మేడం, మీ కవితా సమీక్ష. మీరు ‘సెలెక్ట్’ చేసిన ఆ మూడు కవితలు కూడా అందీ అందని భావాల్ని జారిపోకుండా ఒడిసి పట్టాలనే జిజ్ఞాసలా ఉన్నాయి.మంచి కవితలు ఎంచుకున్నారు సమీక్షకు, ఇందులో మీ కవితా పాఠవం, ఆరాధన కొట్టొచ్చినట్లు కనబడుతోంది. వెరసి అద్భుతమైన కవి పరిచయం.

  2. సూపర్ మేడం, మీ కవితా సమీక్ష. మీరు చేసిన ఆ మూడు కవితలు కూడా అందీ అందని భావాల్ని జారిపోకుండా ఒడిసి పట్టాలనే జిజ్ఞాసలా ఉన్నాయి.మంచి కవితలు ఎంచుకున్నారు సమీక్షకు, ఇందులో మీ కవితా పాఠవం, ఆరాధన కొట్టొచ్చినట్లు కనబడుతోంది. వెరసి అద్భుతమైన కవి పరిచయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *