April 16, 2024

జ్ఞానజ్యోతి శ్రీమతి సూరి నాగమ్మ గారు

రచన: శారదాప్రసాద్

కష్టాలు, కన్నీళ్ళతో నిండిన జీవితానుభవాలు ఒక్కొక్కసారి జీవితాన్ని అనుకోని మంచి మలుపులు తిప్పుతాయి. శ్రీమతి సూరి నాగమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం. ఈ వ్యాసం చదివే వారిలో చాలామందికి శ్రీమతి సూరి నాగమ్మ గారు ‘సూరి నాగమ్మ గారి లేఖలు’ అనే ఆవిడ గ్రంధం ద్వారా సుపరిచితులు. ఈ లేఖలను ఆవిడ 1940 ప్రాంతంలో రమణ మహర్షి ఆశ్రమం నుండి తన సోదరునికి వ్రాసారు. 20 వ శతాబ్దానికి చెందిన ఒక దివ్య తేజోమూర్తి అయిన రమణ మహర్షి వలన ఒక భక్త శిఖామణిలో వెలిగిన జ్ఞానజ్యోతులు, చక్కని అనుభవాల సారమే ఈ గ్రంధం. నిజానికి ఈ లేఖలలోని కవితా ధోరణులు నన్ను ఎక్కువగా ఆకర్షించాయి. ఈ లేఖల ద్వారా ఆమె ఆ జ్ఞాన జ్యోతులను భక్తి, వేదాంతపరుల హృదయాలలో కూడా తన దివ్య హస్తంతో వెలిగించారు. అయితే, ఆమెకు కలిగిన ఈ అనుభవాల వెనక ఉన్న ఆమె జీవితాన్ని గురించి చాలా మందికి తెలియదు. అనేక సంఘర్షణల, పోరాటాలే ఆమె జీవిత నేపధ్యం.

సూరి నాగమ్మ గారు 1902 ఆగష్టు నెలలో మన రాష్ట్రానికి చెందిన ఒక కుగ్రామమలో జన్మించారు. తన 10 వ ఏటనే తండ్రిని కోల్పోయారు. ఆనాటి సంప్రదాయాలు, కట్టుబాట్ల ననుసరించి ఆమెకు బాల్యంలోనే వివాహం చేసారు. అప్పుడు ఆమె వయసు 11సంవత్సరాలే!పెద్దల మాటను శిరసావాహించిన ఆమె, ఆ చిన్న వయసులోనే పతిసేవలో పునీతురాలైంది. అయితే, వక్రించిన విధి ఆమె భర్తను మశూచి వ్యాధికి బలిచేసి మరణం పాలు చేసింది. లేత వయసు అయిన 12వ ఏట నుండే ఆమె వితంతువుగా జీవితాన్ని గడుపవలసి వచ్చింది. భర్తతో గడిపిన ఆ కొద్ది కాలాన్ని ఆమె మరువలేక దు:ఖంతో క్రుంగిపోయింది. ఆ చిన్న వయసులోనే, భర్తకు ఆమెకు మధ్య అనేక వేదాంత చర్చలు జరిగాయి. అవి అన్నీ గాయపడిన ఆమె హృదయంలో నాటుకుపోయాయి. ఆ గ్రామంలో, ఆ రోజుల్లో విద్యావంతులు చాలా తక్కువగా ఉండేవారు. ఆ ఊరి జనం ఆమె భక్తి పాటలను విని మురిసిపోయేవారు.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ఆమెకు కూడా మొదట్లో చదవటమూ, వ్రాయటమూ చేతనయింది కాదు. కష్టపడి స్వయంకృషితో విద్యను అభ్యసించింది. నెమ్మదిగా తెలుగు సాహిత్యంమీద మంచి పట్టును సాధించింది. పోతన గారి భాగవతంలోని పద్యాలన్నీ ఆమెకు కరతలామలకాలు. ఒకనాడు, భాగవతాన్ని చదివే సమయంలో తనకొక సద్గురువు కావాలని పరితపించింది. ఆ బాధతో దు:ఖిస్తూ , స్పృహతప్పి నిద్రలోకి జారుకుంది. నిద్రలో ఆమెకు ఒక దివ్యస్వప్నం కలిగింది. కలలో రాయి మీద కూర్చొని కాలి మీద మరొక కాలు వేసుకున్న భంగిమలో ఒక సద్గురువు ఆమెకు దర్శనమిచ్చాడు. ఆ దివ్యపురుషుని చుట్టూ ఒక కాంతి వలయం కనబడింది. అటు తరువాత, ఆ దివ్యపురుషుడు ఆమెకు స్వప్నంలో పలుమార్లు దర్శనమిచ్చాడు. ఆ దివ్య పురుషుడే శ్రీ రమణ మహర్షి.
ఆమె తన జీవిత చరమాంకంలో ఆ మహనీయుని సన్నిధికి చేరుకోకలిగింది. ఆమె మంచి చెడులను చూసే (వరసకు తమ్ముడైన) శ్రీ శేషాద్రి శాస్త్రి గారు ఆ ప్రక్క ఊరిలోనే న్యాయవాదిగా 1918 లో పనిచేసే వారు. ఆనాటి సాంప్రదాయాల ననుసరించి వితంతువులకు శిరోముండనం చేయించేవారు. ఆ సాంప్రదాయాన్ని నాగమ్మ గారు ధిక్కరించింది. ఆనాటి సనాతనాచారపరులు ఆమెను పలు విధాలుగా విమర్శించటంతోపాటుగా, ఆమెను బహిష్కరించారు కూడా!పోతన గారి భాగవతం చదవటం వలన, ఆమెకు కూడా పోతన గారి వలే సహజ పాండిత్యం అబ్బింది. తనలోని ఈ ప్రతిభను ఆమె చక్కగా ఉపయోగించుకొని జీవితాన్ని మరో కొత్త మలుపు తిప్పుకుంది. అప్పటి నుండి ఆమె పలు వేదాంత పరమైన విషయాల మీద గ్రంధాలను వ్రాసారు. వాటిలో నేడు చాలా లభ్యపడలేదు. జీవితాంతం వరకూ అలానే రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 1923 లో శ్రీ శేషాద్రి శాస్త్రి గారు దివంగతులయ్యారు. ఆ తరువాత ఆమె ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని, దానిలో తన జీవిత శేషాన్ని గడపాలని కోరుకున్నారు.
ఆ ఆశ్రమంలో బీదవారికి, అనారోగ్యులకు సేవ చేస్తూ గడపాలని ఆమె కోరిక. కానీ ఆమె బంధువులు దానికి అంగీకరించక పలు అడ్డంకులు కల్పించారు. ఆ సమయంలోనే ఆమెకు శ్రీ రమణ మహర్షి పేరు తెలియవచ్చింది. కానీ అరుణాచలంలో ఉన్న ఆ మహనీయుని సన్నిధికి చేరుకోవాటానికి ఆమెకు పదేళ్ళ సమయం పట్టింది. ఆ పదేళ్ళలో ఆమె అనేక బాధలు అనుభవించింది. అనారోగ్యం చేత మంచం పట్టింది. ఆ సమయంలో శ్రీ రమణ మహర్షిని దైవ సంకల్పంగా కలసిన ఆమె సోదరుని మనసులో–తన సోదరి ఆవేదన తీరి, ఆమెకు మానసిక శాంతి రమణమహర్షి ఆశ్రమంలో లభిస్తుందనే భావన కలిగింది. ఆమెను రమణాశ్రమానికి ఒంటరిగా పంపటానికి నిర్ణయించుకున్నాడు. అలా ఆమె అరుణాచలానికి చేరుకుంది. మొదటి సారిగా ఆమె రమణ మహర్షిని చూసినప్పుడు ఆమెకు కలిగిన అనుభూతిని ఆమె ఇలా చెప్పారు. “ఆశ్రమం అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. పది నిముషాల తరువాత భగవాన్ నాకేసి నిశితంగా చూసారు. ఆ ప్రేమ, దయా పూర్వక చూపులు, సంఘర్షణలో ఉన్న నా మనస్సుకు ప్రశాంతిని చేకూర్చాయి. ఆ చూపులలోని కాంతిని నేను ఎక్కువ సేపు తట్టుకోలేక, వెంటనే మరలా తలను దించుకున్నాను. భగవాన్ నాతో ఒక ముక్క కూడా మాట్లాడలేదు. అయినా, ఆ దయాపూర్వక చూపులు నన్ను పలకరించాయి, నన్ను కట్టి పడేసాయి. నాకు కలలో అనేక మార్లు దర్శనమిచ్చిన మహాపురుషుడు వారేనని గ్రహించటానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. తామరాకు మీద నీటిబిందువు లాగా, ఏ వాసనలూ అంటనట్టుగా కనిపించారు. ఆ నీటిబిందువు సూర్యకాంతిలో మెరుస్తున్నట్లుగా భావన కలిగింది. అది నీటిబిందువు కాదు. మహా దయాసింధువు. ”
ఆ తరువాత కొన్ని కుటుంబ బాధ్యతలను నిర్వహించే నిమిత్తం ఆమె ఆశ్రమం నుండి తిరిగి వచ్చింది. ఇంట్లో ఏ పని చేస్తున్నా ఆమెకు రమణమహర్షి ప్రసన్న వదనం ప్రతి చోటా కనిపించేది. ఎప్పుడూ పరధ్యానంగా వేరే ప్రపంచంలో ఉన్నట్లుగా ఉండేది. తనలో తానూ ఏదో మాట్లాడుకుంటూ ఉండేది. ఆశ్రమంకి వెళ్ళి వచ్చిన తరువాత ఆమెకు మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లుగా బంధువులందరూ భావించారు. కానీ వారిలో చాలామందికి ఆమెలో వెలిగిన ఆధ్యాత్మిక జ్యోతి కనపడలేదు. కుటుంబ బాధ్యతలు పూర్తి అయిన తరువాత ఆమె తిరిగి రమణమహర్షి ఆశ్రమానికి చేరింది. రమణమహర్షి ఆశ్రమంలోని అన్ని గ్రంధాలను చదివింది. ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకుంది. ఒ కరోజుఒక మహనీయుని జటిలమైన వేదాంత ఉపన్యాసం విన్న తరువాత, ఆమెకు కలిగిన సందేహాలను తీర్చుకుంటానికి రమణమహర్షి ఉన్న గోశాలకు వెళ్ళింది. ఆమె తన సందేహాన్ని అడుగక ముందే, శ్రీ రమణులు ఆమెతో ఇలా అన్నారు. “ఆయన చెప్పిన శాస్త్ర రహస్యాల సారమంతా ‘నీవెవరివో?’ తెలుసుకోవటమే! నీవు కూడా ‘నీవెవరివో?’ తెలుసుకుంటానికి ప్రయత్నించు. ” ఆ విధంగా శ్రీ రమణులు ఆమె మార్గ గమనాన్ని సుగమం చేసారు.
ఆమె సోదరుడు- ఆమెకు శ్రీ రమణుల సన్నిధిలో కలిగిన అనుభూతులను గురించి ఎప్పటికప్పుడు లేఖల ద్వారా తెలియచేయమని కోరాడు. అలా ఆమె వ్రాసిన లేఖలును మొదటిసారిగా శ్రీ రమణుల సన్నిధిలో అందరిముందూ చదివి వినిపించింది. ఆ లేఖలలోని సారాన్ని గ్రహించిన రమణమహర్షి “నాగమ్మ గారు తన ఆధ్యత్మికానుభూతులను, జ్ఞాన సంపదను అందరితో పంచుకోవటం ఆనందంగా ఉంది. “అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ లేఖలన్నిటినీ ఆమె తెలుగులోనే వ్రాసారు. తరువాత అవి ఆంగ్లంలోకి తర్జుమా అయ్యాయి. అలా ఆమె వ్రాసిన లేఖలన్నీ గ్రంధస్థం అయ్యాయి. ఆశ్రమం అధికారులు మాత్రం కొద్ది కాలం ఆమెను లేఖలు వ్రాయవద్దని కోరారు. కానీ భగవాన్ మాత్రం ఆమెను లేఖలు వ్రాయటానికి ప్రోత్సహించారు. శ్రీమతి సూరి నాగమ్మ గారి శ్రీ రమణాశ్రమ లేఖలలో వారు ప్రస్తావించిన ఒక ఆసక్తికర సంఘటన ఇది. ఒకప్పుడు భగవాన్ రమణులకు కాళ్ళు నెప్పులు అధికంగా ఉండటం వల్ల తైలం రుద్ది కాళ్ళు వత్తేవారు సేవకులు. మిగతా చొరవ గల భక్తులంతా అరగంట చొప్పున వంతులు పడి కాళ్ళు వత్తడం ప్రారంభించారు. ఆ విధంగా గురుసేవ చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల అభిప్రాయం. కానీ సర్వ జీవ సమభావం గల రమణులకు ఇది ఇష్టం లేదు. అలా అని వద్దు అని కఠినంగా చెప్పటం వారి పద్ధతి కాదు. అందువల్ల ఛలోక్తిగా “మీరంతా కాస్త ఆగండి. నేను కూడా కాసేపు కాళ్ళు వత్తుతాను. ఆ పుణ్యం నాకు కూడా రావద్దూ?” అంటూ వారి చేతులు తొలగించి తామే కాళ్ళు వత్తుకోవడం ప్రారంభించారు. దీంతో అందరూ ఆశ్చర్య పోయి విచిత్రంగా చూడటం మొదలు పెట్టారు.
తనకూ గురుపాదసేవా భాగ్యం కల్పించమని కోరిన ఒక భక్తునితో “అత్మావై గురుః” అన్నారు. ఆత్మ సేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే అని భావం. “ఇక నైనా ఆత్మ సేవ చేసుకోండి. మాట్లాడకుండా ఊరికే ఉంటే అంతే చాలు” అన్నారు. సరిగా విచారిస్తే ఇంతకన్నా ఉపదేశం ఏముంది? రమణ మహర్షి తన దేహయాత్రను చాలించించిన తరువాత చాలా కాలం వరకు నాగమ్మగారు ఆశ్రమంలోనే తన జీవితాన్ని గడిపారు. ఆ తరువాత కొంత కాలానికి తన సోదరుని వద్దకు చేరారు. సోదరుని స్థలంలో ఒక ప్రత్యేకమైన గదిని నిర్మించుకొని తన ఆధ్యాత్మిక జీవితాన్ని అక్కడే చివరివరకూ కొనసాగించారు. ఆమె భౌతిక జీవితం అంత ప్రశాంతమైంది కాదు. మానసిక శాంతితో వాటినన్నిటినీ అధికమించింది. దేనికీ చింతించకుండా ఉండి వర్తమానంలో జీవించటమే మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం అని ఆమె బోధించేది. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ఎక్కడ ప్రవచనాలు చెప్పినా సూరి నాగమ్మ గారి లేఖలను ప్రస్తావించేవారు.

జ్ఞానజ్యోతి శ్రీమతి సూరి నాగమ్మ గారికి స్మృత్యంజలి!

2 thoughts on “జ్ఞానజ్యోతి శ్రీమతి సూరి నాగమ్మ గారు

  1. Suri Nagamma
    Life story is an example of lakhs of untold lives stories.But it is a guide to everyone those are on the same path..
    Thank you for giving a good example.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *