April 16, 2024

భిన్నధృవాలు

రచన: మంథా భానుమతి

“ఈ సంగతి తెలుసా? సుబ్బన్న భార్య సీత, సుబ్బన్నని విదిలేసిందిట!” కాఫీ కలుపుతున్న సరోజ వెనక్కి తిరిగి అలా నిర్ఘాంతపోయి ఉండిపోయింది రమ మాటలు విని.
“ముందా కాఫీ సంగచ్చూడు తల్లీ! సుబ్బన్న ఎక్కడికీ పోడు కానీ..” రమ హెచ్చరించింది.
సరోజ, రమ ఆరో క్లాసు నుంచీ డిగ్రీ అయే వరకూ కలిసి చదువుకున్నారు. పెళ్లిళ్లు అయాక కూడా ఒకే ఊరిలో ఉండటంతో నిరాటంకంగా సాగుతోంది వారి స్నేహం. వారానికొక సారైనా కలిసి గడుపుతారు. బజారు, సినిమాలు వగైరాలకు కలిసి వెళ్తుంటారు. సరోజ వాళ్లాయన డాక్టర్. ఆ ఊర్లోనే హాస్పిటల్ నడుపుతున్నాడు. రమని ఆ ఊర్లోనే లాయర్ కిచ్చారు. ఇరు కుటుంబాలు కలిసి విహారయాత్రలు కూడా చేస్తుంటారు.
సుబ్బన్న కూడా వాళ్ల క్లాసే. అసలు పేరు సుబ్బావధానులు. రమా వాళ్ల పుట్టింటి పక్క ఇల్లే. దూరపు బంధుత్వం కూడా ఉంది. ఆ చుట్టు పక్కల, పురోహితుడుగా పేరు పొందిన శంకరావధాన్లు గారబ్బాయి. పదో తరగతి వరకూ మామూలు చదువు ఉండాలని స్కూల్లో చేర్పించారు శంకరావధాన్లు, ఒక పక్క స్మార్తం నేర్పిస్తూనే. స్కూలు చదువయ్యాక, తిరుపతి పంపి, వేద పాఠశాలలో చేర్పించారు. తన శిష్యరికంలో అక్కడ చేరటానికి అవసరమైనంతా నేర్పించి.
సుబ్బన్న కంఠం విప్పుతే, ఆదిభట్ట నారాయణదాసుగారిలాగా, మైకు అక్కర్లేకుండా నాలుగు వీధులు వినిపిస్తుంది. పూజ మంత్రాలు చదివినా, వేద పఠనం చేసినా వింటున్న వాళ్లు మంత్ర ముగ్ధులై ఉండిపోవలసిందే.
తిరుపతిలో పట్టభద్రుడయ్యాక, తమ ఊరిలోనే, తండ్రి వారసత్వం చేపట్టాడు సుబ్బన్న. తండ్రి కూడా కార్యక్రమాలకి వెళ్తూ విధానమంతా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.
నిజం చెప్పాలంటే, వ్రతాలూ పూజలూ శంకరావధాన్లుగారికంటే సుబ్బావధాన్లు చేయిస్తే నచ్చుతోంది అందరికీ. తెలుగు సరిగ్గా రాని యన్నారైలు వచ్చినప్పుడైతే మరీ.. “మీ అబ్బాయిని పంపండీ..” అని అడిగి పిలుస్తూన్నారు. ఇంగ్లీషులో అర్ధాలన్నీ విడమర్చి చెప్తాడని.
“ఇప్పుడు చెప్పు. ఏం జరిగిందీ?” సరోజ కాఫీ కప్పులు తీసుకుని ముందు గదిలోకి నడిచింది. ఇద్దరూ రిక్లైనర్ సోఫాల్లో కాళ్లు జాపి కూర్చుని కాఫీ తాగటం మొదలుపెట్టారు.
తాగే ముందు రమ నురుగుతో ఉన్న కాఫీ వాసన చూసి గట్టిగా పీలుస్తుంది. ఆ వాసన తనకి చాలా ఇష్టం. తరువాత అర్ధనిమీలిత నేత్రాలతో ఆస్వాదిస్తూ తాగుతుంది.
“నీ కాఫీ చాలా ఇష్టమే నాకు. ఉండు తాగనీ.”
రమ చేష్టలన్నీ నవ్వుతూ చూసింది సరోజ. రమ వచ్చినరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది సరోజకి.
“ఇప్పుడన్నా చెప్తావా?” కాస్త నిష్ఠూరంగా అంది సరోజ. రమైతే అలవోకగా అనేసింది కానీ, సుబ్బన్న సంగతి చెప్పినప్పట్నుంచీ మనసంతా పాడయింది.
సుబ్బన్నంటే ప్రత్యేక అభిమానం అందరికీ. ప్రతీ వారికీ ఏ శుభ కార్యం వచ్చినా అఘమేఘాల మీద వచ్చెయ్యటమే కాకుండా, యాంత్రికంగా కాకుండా, మనసు పెట్టి నిర్వహిస్తాడు. పైగా కలసి మెలసి పెరిగారు.
నలుగురాడపిల్లల తరువాత అపురూపంగా పుట్టాడు సుబ్బన్న. గారం, క్రమశిక్షణ సమ పాళ్లలో కలిపి చూసుకున్నారు ఇంట్లో అందరూ. అపర వశిష్ఠునిగా పేరు పొందిన శంకరావధాన్లు గారి వీలు చూసుకునే ముహుర్తాలు పెట్టుకునే వారు ఊర్లో. అయినా ముహుర్తాలు పెట్టేది వారే ఐనప్పుడు సమస్యే లేదు.
మూడు సంవత్సరాలైనా నిండకుండానే స్పష్టంగా “శుక్లాం బరధరం విష్ణుం..” తో మొదలు పెట్టిన సుబ్బన్న విద్యభ్యాసం నిర్విరామంగా సాగిపోయింది. స్కూల్లో కూడా, పదేళ్లు దాటినప్పటి నుంచీ ప్రతీ పూజకీ సుబ్బన్నే పురోహితుడు.
పట్టుపంచ కట్టుకుని పూజకి కూర్చుంటే, సాక్షాత్తూ కుమారస్వామి అక్కడుండి మంత్రాలు చదువు తున్నట్లే అనిపించేది. రమకి పక్కిల్లే అవటంతో ముగ్గురూ కలిసి ఆడుకోవటం, కలిసి స్కూలుకి వెళ్లటం, అప్పుడప్పుడు కలిసి చదువుకోవటం చేసేవారు. సుబ్బన్న గ్రహణ శక్తికి ఆశ్చర్యపోతుండేవారు స్నేహితురాళ్లిద్దరూ.
“ఏకసంథాగ్రాహే..” అంటుండేది రమ.
సరోజ, రమలు కాలేజీలో చేరటం, సుబ్బన్న తిరుపతి వెళ్లిపోవటంతో దూరం అయిపోయింది వారి స్నేహం.
పెళ్లయ్యాక సరోజ అత్తగారిల్లు చాలా దూరం అయింది. అమ్మా వాళ్లు కూడా కూతురికి దగ్గరగా ఇల్లు కట్టుకుని మారిపోయారు. రమ కూడా దూరమే కానీ, పుట్టింటికి వెళ్లినప్పుడు సుబ్బన్న గురించి తెలిసేది. అయినా.. హైస్కూలు వదిలేశాక వాళ్లిద్దరికీ సుబ్బన్న గురించి చెప్పుకునే అవసరమే రాలేదు. సరోజ వాళ్ల ఇంటి గురువుగారు వేరవటంతో.
“టెంత్ అయాక సుబ్బన్న.. అదే సుభ్రహ్మణ్య అవధాన్లు తిరుపతి వెళ్లి పోయాడు కదా! అక్కడి నుంచి వచ్చాక అతని జీవితంలో చాలా మార్పులు వచ్చాయి.” రమ మొదలుపెట్టింది.
“ఆ తరువాత మనం ఎప్పుడూ అతని గురించి చెప్పుకోనే లేదు. చాలా స్నేహంగా ఉండే వాళ్లం కదా! వాళ్ల ఇంటికొకసారి తీసుకెళ్లావు కూడా. చిన్న దేవాలయం లా ఉంది. వాళ్లమ్మగారు ఆప్యాయంగా పలుకరించారు. అమ్మాయిలు కూడా.. పరికిణీ, ఓణీలతో ముచ్చటగా ఉన్నారు. అప్పటికే ఇద్దరికి పెళ్లిళ్లైపోయాయి కదా?” సరోజ గుర్తుకు తెచ్చుకుంది.
“చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఆచార వ్యవహారాలన్నీ వాళ్లు పాటించి చూపి, ఆదర్శంగా ఉండేవారు. శంకరావధానిగారికి మంచి డిమాండ్ ఉండేది కూడా. సంపాదన కూడా బాగుండేది. దేనికీ లోటు లేకుండా గడిచి పోయేది. మనం వచ్చేశాక, ఆడపిల్లలందరి పెళ్లిళ్లూ అయి అత్తారిళ్లకెళ్లిపోయారు. సుబ్బన్న తిరుపతిలో ఉండగానే జరిగింది.. వాళ్ల జీవితాల్లో మొదటి ఘాతం.” రమ కళ్లముందు అప్పటి దృశ్యాలే కదిలాయి. గొంతు వణికింది.
“ఏమయింది రమా?”
“ఆ సంవత్సరం నువ్వు, డాక్టర్ గారు లండన్ వెళ్లారు ట్రైనింగ్ కని. ఆ సమ్మర్ లో జరిగింది. అవధానిగారు ఎక్కడో పూజకి వెళ్లారు. సుబ్బన్న వాళ్ల అమ్మగారొక్కరే ఉన్నారు. మా కాలనీలో తెలుసుకదా.. ఇళ్లు చిన్నవే ఐనా ఆవరణ పెద్దది. చెట్లు బాగా పెంచే వాళ్లం. సుబ్బన్న ఇంట్లో కూడా బోలెడు చెట్లు. ఇంటి ముందు కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మందార, జాజి వంటి పూల మొక్కలు, తీగలతో నడిచే తోవ తప్ప అంతా మూసుకు పోయి ఉంటుంది.
ఒక రోజు.. పనంతా చేసుకుని భోంచేసి అలిసిపోయి పడుక్కున్నారావిడ. వీధిలోంచి తలుపు దగ్గరి బెల్ వినిపించింది. నిద్ర మత్తులోనే తలుపు తీసింది. ఆ సమయానికి అవధానిగారు వస్తారు సాధారణంగా. తలుపు తోసుకుని వచ్చాడు ఒకతను. ముప్ఫై ఏళ్లుంటాయి. లోపలికి రాగానే గుప్ఫుమని కల్లు వాసన.. ముక్కు మూసుకున్నారావిడ, కొంగు అడ్డం పెట్టుకుని.”
రమ ఆగింది. లోపలికి వెళ్లి మంచినీళ్ల సీసా తెచ్చి ఇచ్చింది సరోజ. సీసా ఎత్తి గడగడా తాగి కాసేపు ఆగి మొదలుపెట్టింది.
“ఎవరయ్యా ఏంటిలా వచ్చేస్తున్నావూ? అంటూ గట్టిగా కేకలు పెట్టింది. ఎక్కడనుంచి తీశాడో.. కత్తి తీసి డొక్కలో ఒక్క పోటు పొడిచాడు. చివ్వున చిమ్మిన రక్తం చూసి, చేతినున్న బంగారు గాజులూడ బెరికి, పరుగెత్తుకుంటూ బైటికెళ్లిపోయాడు.”
వింటున్న సరోజ ఒక్కసారిగా లేచి నిలబడింది. అదేం గమనించనట్లు, రమ చెప్పసాగింది.
“తరువాత కొద్ది సేపట్లోనే ఇంటికొచ్చిన అవధానిగారు లోపలికెళ్లి చూస్తే అంతా భయానకంగా ఉంది. అప్పటికి స్పృహలోనే ఉన్న అమ్మగారు జరిగిందంతా చెప్పింది. వెంటనే చుట్టుపక్కలవాళ్ల సహాయం తీసుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇంటర్నల్ హెమరేజ్ చాలా ఎక్కువగా అయింది. దారిలో జరిగిందంతా చెప్పింది. ఎంత ప్రయత్నించినా ఆవిడ ప్రాణం నిలప లేక పోయారు డాక్టర్లు.”
“అయ్యో.. ఆరోగ్యంగా ఉన్నావిడ. ఎంత పని జరిగింది?” సరోజకి ఆవిడ గుర్తుకొచ్చి, కళ్లలో నీళ్లు తిరిగాయి.
“అంతే.. ఆ సంఘటనతో అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఆవిడ పోయినప్పటి నుంచీ అవధానిగారు అన్ని క్రతువులూ చెయ్యలేకపోయారు, ధర్మపత్ని లేకపోవటం వల్ల. సుబ్బన్న తన విద్య పూర్తి చేసుకుని వచ్చేవరకూ శిష్యులతో నడిపించారు. అయినా వాళ్లెవరికీ ఆయనకున్న ప్రతిభ లేదు. దాంతో, ఆదాయం తగ్గిపోయింది. ఇంట్లో కూడా పూర్వపు వైభవం పోయింది.”
“ఆడపిల్లలందరూ పెళ్లిళ్లయి స్థిరపడ్డారు కదా! అది కొంత నయం.” సరోజ అంది, నిట్టూరుస్తూ.
తలూపింది రమ. మొహంలో విచారం. పక్కింటి వాళ్లంటే, కాలనీల్లో స్వంత వాళ్లలాగే ఉంటారు.
“కానీ.. ఒక్క మనిషి నిష్క్రమణ వల్ల ఆ సంసారం ఎంత అల్లకల్లోలం అవుతుందో చూస్తుంటే బాధ కలుగుతుంది.”
“ఆ హంతకుడిని పట్టుకున్నారా లేదా?” సరోజ కోపంగా అడిగింది.
“పట్టుకున్నారు. వాడు ఆ చుట్టుపక్కలే మత్తుగా పడిపోయున్నాట్ట. ఏం లాభం? పోయిన మనిషి రాదు కదా?” రమ కళ్లలో నీళ్లు.
“సుబ్బన్న వచ్చేశాక పరిస్థితి బాగుండాలి కదా?”
“బానే ఉంది. సుబ్బన్న విద్వత్తు అందరినీ ఆకర్షించి ఆదాయం పెరిగింది. దాదాపు పాత వాభవం వచ్చేసింది. సుబ్బన్న తెలివిగా పొలాలు కూడా కొనటం మొదలెట్టాడు. ఐతే ఇల్లాలు లేని లోటు కనిపిస్తూనే ఉంది. వాళ్లమ్మగారి సంవత్సరీకాలు అయాక, పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పుడు మొదలయింది అసలు సమస్య.” రమ మాటలకి ఆసక్తితో చూసింది సరోజ.
“అదేం? సుబ్బన్న అపర పరమశివుడి లాగ ఉంటాడు. ఆ గాంభీర్యం, ఠీవీ, పచ్చని పసిమి ఛాయా, పెద్ద పెద్ద కళ్లలో కనిపించే విశ్వాసం, చెరగని నవ్వు.. సమస్యేముంది? వాళ్ల వాళ్లలో అమ్మాయే దొరకలేదా?” ఆశ్చర్యపోయింది రమ.
“ఆధునికత ప్రభావం. ఆడపిల్లలందరికీ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కావాలి. పెద్ద సిటీల్లో ఉండాలి. అమోరికానో ఆస్ట్రేలియానో ఐతే మరీ బాగు. అందరి ఇళ్లలో అమ్మాయిలకి ఇవే కోరికలు. ఇంజనీరింగులు, కంప్యూటర్ చదువులూ..”
………………..
రమ, సరోజ మాట్లాడుకున్నట్లే.. శంకరావధానిగారి కుటుంబం తెలిసిన వారంతా ఆరు నెలల నించీ మధన పడుతున్నారు.. ఏమీ చెయ్యలేని పరిస్థితి.
సుబ్బన్నకి వారి దగ్గరి బంధువుల లోనే సంబంధం కుదిరింది. శంకరావధానిగారికి పిన్ని మనుమరాలు.. ఇంచుమించు మేనరికం వంటిదే. పెద్దలందరికీ ఇష్టమయింది. పిల్లలు మాత్రం మాట్లాడుకోలేదు. వాళ్ల కుటుంబాలలో పెళ్లికి ముందు ఒక సారి చూడటమే తప్ప మాట్లాడుకోకూడదు.
అమ్మాయి పేరు సీత. సాంప్రదాయంగా బాగానే ఉందనిపించింది. చామనఛాయ కంటే ఒక రవ్వ తక్కువే అని చెప్పచ్చు. మొహం కళగా ఉన్నా పీలగా ఉంది. పచ్చని పసిమి ఛాయతో, ఠీవిగా ఉండే సుబ్బన్నకి నచ్చుతుందో లేదో అని భయపడ్డారు అమ్మాయి తల్లిదండ్రులు. ఆర్ధికంగా కూడా అవధాన్లుగారి కంటే రెండు మెట్లు కిందే. హైద్రాబాద్ లో ఉంటారు. సీత తండ్రి, అతని ఇద్దరు తమ్ముళ్లూ ఒక పెద్ద పురోహితుడికి అసిస్టెంట్లు గా చేస్తుంటారు. ముహుర్తాలు పెట్టటం, జాతకాలు చెప్పటం స్వంతంగా చేస్తుంటారు.
సాధారణ మధ్యతరగతి కుటుంబం.. అణకువగా ఉంటుందని అవధాని గారు ఒప్పుకున్నారు. సుబ్బన్నకి కూడా బానే ఉందనిపించింది. మంచి ముహుర్తాలు చూసి పెళ్లి చేశారు.
అయితే సీత అభిప్రాయం అడగలేదు ఎవరూ.. పెళ్లకొడుకుని అందరూ ఆకాశానికెత్తేస్తున్నా సీత ఏ స్పందనా లేకుండా ఉండి పోయింది. ఇంట్లో వాళ్లకి ఏ లోటూ కనిపించలేదు. కాదనటానికి కారణమూ లేదనుకున్నారు.
చిన్నప్పటి నుంచీ తెలివిగా ప్రతీ క్లాసులోనూ ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటూ బి.యస్సీ కంప్యూటర్స్ చదివింది. సిటీలో పెరగటం.. స్నేహితుల్లో అన్ని మతాల వారూ ఉన్నారు. ఎక్కువ సమయం ఇంట్లో కంటే స్నేహితులతోనే గడిపేది. టెంత్ అయాక పట్టుపట్టి సెయింట్ యాన్స్ కాలేజ్ లో చేరింది. అ అమ్మాయి గ్రేడ్ లు చూసి, ఫీజు చాలా తగ్గించారు.
చదువు మీది ఆసక్తితో, ఇంటిలోని పద్ధతులకి దూరమై పోయింది సీత. ఇంట్లో ఉన్నంతసేపూ ఏదో అనాసక్తత. బైటికెళ్తే ఉన్న ప్రత్యేకత ఇంట్లో లేదు. ఉమ్మడి కుటుంబం. ఎంత సేపూ, పూజలూ, తిథులూ, జాతకాలూ, వచ్చేపోయే వారూ.. ఒక్కరైనా ‘సీతా’ అని పిలిచి తన అభిప్రాయాలు, అభిరుచులూ తెలుసుకుంటే ఎలా ఉండేదో?
వైదిక సాంప్రదాయాలు, వాటి ప్రాముఖ్యతలూ తెలుసుకుని ఆచరిస్తే ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది.
హడావుడిగా పరుగులు పెడ్తూ జీవన యానం సాగించటమే కానీ, కుటుంబ సభ్యులు ఒక చోట చేరి మంచీ చెడూ మాట్లాడుకోవటమే కరవై పోయుందీ ఆధునిక జీవితాల్లో.
సీతకి పై చదువులు చదవాలనీ, విదేశాలకు వెళ్లాలనీ, కంప్యూటర్ సైన్స్ లో రిసెర్చ్ చెయ్యాలనీ ఉంది. ఈ లోగా పెళ్లి నిశ్చయించారు. ఎలాగైనా సుబ్బన్నతో మాట్లాడాలని ప్రయత్నించింది. ఇంట్లో హడావుడి, సంబరాలు చూస్తుంటే ఏం చెయ్యాలో తోచలేదు. తనకు ఇంతే ప్రాప్తం అనుకుని సర్దుకుపోదామనుకుంది.
పెళ్లయింది. అత్తగారూరు వెళ్లిపోయింది సీత. బి.యస్సీ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ క్లాస్, కాలేజ్ ఫస్ట్. మనస్సు చివుక్కు మంది. ఆ పాటికి కాలేజ్ కి వెళ్తే అందుకునే ప్రశంసలూ, పైచదువులకు లభించే ప్రోత్సాహాలూ.. ఆ చదువుకే జరిగే కాంపస్ ఎన్నికలూ..
ఎందుకిలా? తన జీవితం తనిష్టం వచ్చినట్లెందుకు నడవదూ? సీతకి పిచ్చెక్కినట్లనిపించింది.
రెండు నెలలనుంచీ అత్తగారింట్లో తన జీవితం చూసుకుంది. తెల్లవారు ఝామునే లేచి, స్నానం, పూజ, తులసమ్మ దగ్గర దీపం.. మడిచీర కచ్చ పోసి కట్టుకుని నైవేద్యం తయారు చెయ్యటం, పూజకి కావలసిన సామగ్రి తయారు చెయ్యటం, వంట.. బైట పూజల దగ్గర భోజనాలు లేకపోతే మామగారికి, భర్తకు వడ్డించటం, వంటిల్లు వగైరాలు శుభ్రం చెయ్యటం.. బట్టలుతకటం, ఎండేసి మడతలు పెట్టటం, ఇంక పప్పు రుబ్బుకోడాలూ (మిషన్లోనే..), వచ్చే పోయే వాళ్లకి కాఫీలు..
అంతే.. రోజు తర్వాత రోజు.. అదే కార్యక్రమం.
సుబ్బన్న ఇంట్లో ఉంటే కాస్త ఫరవాలేదు. ఏవో పురాణ గాధలూ, శ్లోకాలకి అర్ధాలూ వివరంగా ఆసక్తి గా చెప్తాడు. కానీ అది వారానికొక్క రోజు కూడా ఉండదు.
చుట్టుపక్కల ఆడవాళ్లకీ సీతకీ కామన్ గా ఆసక్తి కలిగించే విషయాలే లేవు. కాస్త ఖాళీ ఉంటే టి.వీ సీరియళ్లు చూట్టం, సినిమాల గురించి మాట్లాడు కోవటం మాత్రం తెలుసు వాళ్లకి.
రెండు నెలలకే ఊపిరాడనట్లు ఉక్కరిబిక్కిరైపోయింది సీత. తన లైఫ్ ఇది కాదు. ఏదో చెయ్యాలి. కళ్లు మూసినా తెరిచినా కంప్యూటర్లు, ప్రోగ్రాములు. తెలుసు.. రెండు కుటుంబాలకి ద్రోహం చేస్తున్నానని. అయినా, ఈ మానసిక పోరాటాన్ని తట్టుకోగల శక్తి లేదు ఇంక.
ఆ రోజు.. మామగారు యజ్ఞం జరుగుతోందని అంతర్వేది వెళ్లారు. సుబ్బన్న కూడా వెళ్లాల్సిందే, కానీ మూడు రోజులు సీతని ఒంటరిగా వదలాలని వెళ్లలేదు. అదే సరైన సమయం అనుకుంది సీత.

మధ్యాన్నం భోజనాలయ్యాక కూర్చోబెట్టి, తన మనసు విప్పింది. ఇదే విధంగా కొన్నాళ్లు సాగితే తనకి ఆత్మహత్య తప్ప దారి లేదని చెప్పింది. పెళ్లికి ముందే తన ఆలోచన, ధ్యేయం చెప్పకపోవటం తప్పే అని ఒప్పుకుంది.
“నాకసలు సావకాశమే ఇవ్వలేదెవరూ. మీరైనా, ఒక్క సారి మాట్లాడుతారేమో అనుకున్నా. పైగా.. వేరే దారి లేదు కదా, సర్దుకుపోగలనేమో అని కూడా ప్రయత్నిద్దామనుకున్నా.” అంతా చెప్పి, సీత సుబ్బన్నని చూస్తూ నిలుచుంది.. తీర్పు కోసం వేచి చూస్తూ.
సుబ్బన్న అంతా విన్నాడు. అన్ని సంవత్సరాల వేద పఠనం, వైదిక సాంప్రదాయ అనుసరణ, పురాణ విజ్ఞానం.. అతనికి ఎటువంటి పరిస్థితిలోనైనా సంయమనంగా ఉండటం నేర్పాయి. తండ్రికి చెప్పి ఒప్పించటం కష్టమేం కాదు. ఇష్టంలేని కాపురం చెయ్యమని అవధాన్లుగారెప్పుడూ చెప్పరు.
కాపురానికి వచ్చినప్పటి నుంచీ సీతలోని ఉదాసీనత గమనిస్తూనే ఉన్నాడు సుబ్బన్న. కొత్తేమో అనుకున్నాడు. కానీ.. ఇలా అంటీ ముట్టనట్లు ఎన్నాళ్లు? నిర్ణయానికి వచ్చాడు.
“నీ ఇష్టం సీతా! నీ ప్రయత్నాలు చేసుకో. నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నీ చదువు పూర్తి చేసుకుని, ఇక్కడికి వచ్చి కంప్యూటర్ సెంటరో, కాలేజ్ లో లెక్చరర్ గా చేరటమో చేస్తానంటే సరే. వంటకి ఎవర్నైనా పెట్టుకుని నీ పని చేసుకోవచ్చును. లేదా విడాకులు కావాలన్నా సరే. రేపే లాయరుగారి దగ్గరకు వెళ్దాం.”
సీత చటుక్కున వచ్చి సుబ్బన్న కాళ్ల మీద పడిపోయింది. ఇంత మంచివాడిని వదిలేయటమా?
“అయ్యో.. లేలే. నువ్వేం చేస్తానన్నా నాకిష్టమే.” భుజాలు పట్టుకుని లేపాడు.
“ప్రస్తుతానికి మా కాలేజ్ లోనే యమ్మెస్సీలో చేరతాను. హాస్టల్లో ఉంటాను. మా మేడమ్ మొత్తం స్కాలర్ షిప్ ఏర్పాటు చేస్తానన్నారు. చదువయ్యాక ఆలోచిస్తాను. మీరు ఒంటరిగా ఉండలేననుకుంటే, లాయర్ దగ్గరకు వెళ్దాం.” తడబడుతూ చెప్పింది సీత.
“నేను ఉండలేకపోవటం అనేది లేదు. ఒకే వివాహం, ఒకే పత్ని అని నమ్ముతాను. నువ్వు తిరిగి వచ్చినా, రాకపోయినా అంతే.”
…………..
సీత తను చదివిన కాలేజ్ లోనే యమ్మెస్సీలో చేరింది. అందులో కూడా ఫస్ట్ క్లాస్ లో పాసయి, కాలేజ్ ఫస్ట్ వచ్చి, యమ్ ఫిల్ లో చేరింది. అది అయ్యాక సుబ్బన్న దగ్గరికి వెళ్లి, స్వంతంగా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెరుద్దామని ఆలోచిస్తోంది. సుబ్బన్న భార్యకి ఫోన్లు చేస్తూనే ఉన్నాడు.
అయితే.. తమ విషయం ఇదీ అని ఎవరికీ చెప్పకపోవటం వలన అందరూ సీత వదిలి వెళ్లిపోయిందని పుకార్లు పుట్టించారు.
“సరోజా! సుబ్బన్న భార్య వచ్చేసిందట. పైచదువులకని వెళ్లిందిట. అది వాళ్లిళ్లలో విడ్డూరమే కదా.. అందుకనే ఆ వింత మాటలు.” కొన్నాళ్ల తరువాత, సరోజ ఇంట్లో కాఫీ తాగుతూ రమ ఉల్లేఖించింది.
“అంతే రమా! అదే వివాహ బంధం. ఎటువంటి భిన్న ధృవాలైనా కలిసి నడవాలంటుంది. మరీ తప్పని సరైతే తప్ప, ఏ ఒడిదుడుకులు వచ్చినా సర్దుకుపోయి జీవించాలి. సుబ్బన్న జీవన విధానం పూర్తిగా వేరు. అయినా భార్య ఇష్టాయిష్టాల్ని గౌరవించి అనుకూలమైన పరిష్కారం చూపించాడు. హాట్సాఫ్ టు సుబ్బన్నా!” సరోజ సంతోషంగా అంది.
*——————*

8 thoughts on “భిన్నధృవాలు

  1. భానక్కా! ఆధునికతకూ, పురాతన సంస్కారాలకూ మంచి పొందిక ఇచ్చారు.భార్య మనస్సునేకాక విద్యార్జనా అభిలాషను అర్ధంచేసుకున్న సుబ్బన్న పంతులు సంస్కారం వేదపురాణాలకు ఇచ్చిన గౌరవం .

  2. నెక్స్ట్ అమెరికా ప్రయాణమే ఇద్దరూ. మాకు సుబ్బన్న అవసరమే ఎక్కువ. ఇది ముందుగా ఆయన గుర్తించివుంటే సీత ఆయనవెనుకే వుండేది.స్టోరీ లైన్ చాలా బాగుంది భానుమతిగారూ.

  3. చాలా చక్కని కధ మల్కాజిగిరి లో వేదపాఠశాలలో అలాంటి గంటలనుంచీ చూసాను అరవపిల్లలు వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్లు మొగుడు వేదం. అధి చూసాక కధ రాయాలనిపించింది ఎందుకో రాయలేదు మంచం కధ అందించినందుకు ధన్యవాదాలు

  4. సర్దుకుపోవటానికి చక్కని భాష్యం చెప్పారు.. పురోహితులకి పెళ్ళిళ్ళు కష్టమవుతుందనే నేపధ్యంలో విడాకులు తీసుకుంటారేమో అనుకున్నా

  5. ఎంత బాగుందో..చక్కని కథ..మంచి మనసుల సుగంధ పరిమళం .సుబ్బన్న పంతులు లాంటి వారు సమాజానికి దిక్సూచి లా తోవచూపుతారు..మంచి కథ అందించిన భానుమతి అక్కాజీ గారికి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *