May 17, 2024

అర్చన 2020 – త్రాణ

రచన: చెన్నూరి సుదర్శన్

పావని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుందని ఏ రోజూ.. కలలో గూడా ఆనుకోలేదు. కాని అన్ని రోజులూ ఒక్కతీరుగా ఉండవన్నది నగ్నసత్యం. ‘కాలం కలిసి రాకుంటే కర్రే పామై కరుస్తుంది’ అన్నట్టు ప్రమాదం వెనుకాల మరో ప్రమాదం తరుముకుంటూ వస్తుంటే.. ఈ రోజు తన గారాల పట్టి కోసం పోలీసు గడప తొక్కక తప్ప లేదు.
స్టేషన్ సమీపిస్తున్న కొద్దీ ఆమె ఎదలో అలజడి అధికం కాసాగింది. గుండె చిక్క పట్టుకుని.. స్టేషన్ ఆవరణలోకి అడుగు పెడ్తుంటే..
“ఎవరు కావాలి “ అంటూ.. నిఘా కేంద్రం నుండి సెంట్రీ భుజానికి వేళ్ళాడుతున్న తుపాకితో ఉన్నఫళంగా ప్రత్యక్షమయ్యే సరికి గజ్జున వణకింది పావని.
“సర్.. ఎస్సై గారిని కలవాలని వచ్చాను “ బిక్కు, బిక్కుమంటూ అంది.
“ఎందుకు?. ఏదైనా కంప్లైంట్ అయితే ఆ గదిలోకి వెళ్ళు స్టేషన్ రైటర్ ఉన్నాడు” అంటూ స్టేషన్ కుడి వైపున్న గదిని చూపించాడు.. ఎస్సై సత్తిబాబు మనఃస్తత్వం బాగా తెలిసిన సెంట్రీ.
“ముందుగా ఎస్సై గారిని కలిసి విషయం చెప్పి.. ఆతరువాత కంప్లైంట్ సంగతి ఆలోచిస్తాను సార్” అంటూ సవినయంగా మనవి చేసింది.
చటుక్కున తన గదిలో నుండి బయటికి వచ్చాడు సబ్¬ఇన్¬స్పెక్టర్ సత్తిబాబు. సెంట్రీని చూస్తూ.. పంపించమన్నట్టుగా ఇషార చేశాడు.
తడబడుతున్న అడుగులతో పావని ఆఫీసులో అడుగు పెడ్తుంటే.. ఆమెను నఖశిఖ పర్యంతం కనుబొమ్మలెత్తి చూడసాగాడు సత్తిబాబు. అది పోలీసులకు రివాజు అనుకుంది పావని.
“నీ పేరేంటి.. ఏంటా విషయం?” అంటూ ఆనందంగా అడిగాడు సత్తిబాబు.. పావని కాళ్ళకు మట్టెలు లేవని లోలోన సంబరపడుతూ..
పావని తన పేరు చెప్పింది. “సార్.. మా అమ్మాయిని ఒక రౌడీ వెధవ అల్లరి పట్టిస్తున్నాడు. వ్రాత పూర్వంకంగా కంప్లైంట్ ఇస్తే.. ప్రమాదమని మీతో నోటి మాటగా చెబుదామని వచ్చాను. వేరే మిషతో.. వానికి అర్థమయ్యేలా బెదిరించి గండం నుండి గట్టెక్కించండి” అంటూ రెండు చేతులు జోడించింది.
కంగుతిన్నాడు సత్తిబాబు. పావని ఒక బిడ్డకు తల్లిలా కనబడ్డం లేదు. అసలు పెళ్ళే కాలేదనుకుంటే అంత వయసొచ్చిన అమ్మాయి ఉండడం నమ్మశక్యం కావడంలేదు. అదే విషయాన్ని ఆమెతో అన్నాడు.
“పావనీ.. నిన్ను చూస్తుంటే నీకు అంత పెద్ద అమ్మాయి ఉన్నదనిపించడం లేదు. నువ్వు చెప్పేది నిజమేనా..! అసలు నీకు పెళ్ళే కాలేదనుకున్నాను. వివాహిత చిహ్నాలేవీ కనబడ్డం లేవు. ఇంకా ఎందరు పిల్లలు” అంటూ ఆవురావురుమని కళ్ళప్పగించి, పళ్ళికిలిస్తూ.. చూడసాగాడు. పావని తల దించుకునే వుంది.
“సార్.. నాకు ఒక్కర్తే అమ్మాయి. కళ్ళల్లో ప్రాణాలు పెట్టి కాపాడు కుంటున్నాను. గత ఏడాది భరత్¬నగర్ మార్కెట్లో మాఆయన కూరగాయలు కొంటుంటే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి కారు దొర్లి మీద పడి..” అంటూ భోరుమంది పావని. ఆమె కళ్ళు జలపాతాలయ్యాయి.
సత్తిబాబు తెచ్చి పెట్టుకున్న జాలి గుండెతో.. ఊరడించే యత్నం చెయ్యసాగాడు. పావని ఆవేదన నోటి నుండి మాట పెకలకుండా చేస్తోంది. కాసేపు మౌనంగా ఉండి పోయింది. కడ కొంగుతో కళ్ళ నీళ్ళు ఒత్తుకుంటూ కొంచెం తేరుకున్నట్లు కనబడే సరికి..
“ఇంతకూ మీ అమ్మాయి పేరు చెప్పలేదు. ఎవడు వాడు వెంటపడేది” అంటూ మాట మార్చాడు సత్తిబాబు.
“సర్ మా అమ్మాయి పేరు ప్రణతి. పదో తరగతి చదువుతోంది. సెయింట్ రీటా హైస్కూల్¬కు వెళ్తుంటే బజ్జీల బడ్డీకొట్టు భద్రయ్య కొడుకు భరణి దారి కాచి ఏడ్పిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటాను.. లేదంటే ఆసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు” అంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్ళు ఉబికి, ఉబికి రాసాగాయి. ‘ఊరపిచ్చుక భయం ఉండేలుకేం బాధ’ అన్నట్టు చూస్తున్నాడు సత్తిబాబు.
పావని గుండె నిబ్బరం చేసుకుంటూ.. ప్రణతి, భరణి ఫోటోలు అందించింది.
ఫోటోలను తేరిపారగా చూస్తూ.. వెనక్కి తిప్పాడు. మొబైల్ నంబర్లు కనబడ్డాయి. బహుశః ఎవరి ఫోటో వెనకాల వారి నంబరు ఉన్నదని పోలీసు తెలివితేటలతో పసిగట్టాడు. వెంటనే గుర్తుకు వచ్చిన వాడిలా.. పావని ఫోన్ నంబరు, చిరునామా అడిగి తీసుకుంటూ..
“సరే.. వానికెలా బుద్ది చెప్పాలో నాకు తెలుసు. ఇక నేను చూసుకుంటాను పావనీ. నువ్వేం దిగులు పడకు” అంటూ భరోసా ఇచ్చాడు.
“సరే సర్. దయచేసి మా పేర్లు బయటికి పొక్కకుండా చూడండి” అంటూ దీనంగా వేడుకుంది.
“నేనొక సారి మీ ఇంటికి వచ్చి అన్నీ వివరంగా మాట్లాడుతాను. పోలీసులం.. ఎప్పుడు వస్తామో..! మాకే తెలియదు. ఫోన్ చెయ్యడం కుదరదు. ఏడాది నుండి ఏపనీ లేక ఖాళీయే గదా..!” అదోరకంగా రెండు అరచేతులను సుతారముగా కొట్టుకుంటూ చూడ్డం, పావనికి ఒళ్ళు భగ్గున మండింది. మరో ఆపద క్యూలో ఉన్నట్టు పసిగట్టి.. ఓర్పు వహించింది. తనూ నేర్పుగానే సమాధానమివ్వాలనుకుంది.
”ప్రణతి స్కూలుకు వెళ్ళగానే ఖాళీయే సార్” అంటూ పెదవిపై సన్నగా చిరునవ్వు మొలిపించింది.. ఖాళీ ని ఒత్తి పలుకుతూ. అది తన మనో భావాలకు గ్రీన్ సిగ్నలని పొంగి పోయాడు సత్తిబాబు.
వెంటనే తన మొబైల్ ఫోన్ నుండి రింగ్ ఇచ్చాడు. పావని ఫోన్ మ్రోగింది. దాన్ని చూసేలోగానే రింగ్ కట్ చేస్తూ.. “ఇది నా పర్సనల్ ఫోన్ నంబరు. వాట్సాప్ గూడా. సేవ్ చేసుకో.. నువ్వు సమయం చూసి ఫోన్ చెయ్యి. రెక్కలు కట్టుకుని వాలుతాను” అంటూ క్రీగంటి చూపు విసిరాడు. కుత, కుతలాడుతున్న మనసును అదుపులో పెట్టుకొని అలాగే అన్నట్టు తలాడిస్తూ.. బయట పడింది పావని. సెంట్రీ సలహా ప్రకారం రైటర్¬ను కలిసి ఫిర్యాదు వ్రాసిస్తే సరిపోయేదేమో,,! అని బాధ పడింది. మదిలో పథకాలు రచిస్తూ.. ఇంటి దారి పట్టింది.
***
సత్తిబాబు మనసు, మనసులో లేదు. ‘కనులు మూసినా నీవాయె.. కనులు తెరిచినా నీవేనాయే..! ‘ అన్నట్టు పావని కళ్ళల్లో కదలాడుతోంది. ఆడవాళ్ళ ఆపదలను ఆసరాగా చేసుకొని పైసా తీసుకోకుండా సాయం చేస్తానంటూ.. వంచించడం సత్తిబాబుకు వెన్నతో పెట్టిన విద్య, నీతి నియమాలు విడచి.. ఎంతో బరితెగించిన ఆడదైతేనే పోలీసు స్టేషన్ గడప తొక్కుతుందని అతని ప్రగాఢ విశ్వాసం.
రెండు రోజులు.. రెండు యుగాల్లా గడిచాయి. కాని పావని నుండి ఫోన్ రాలేదు. తను ఫోన్ చేస్తే పావనికి వెసులుబాటు అవుతుందో లోదో..! అని లోలోన మదన పడసాగాడు. తనను ఎన్నడు కటాక్షిస్తుందోనని మాటి, మాటికి ఫోన్ క్లిక్ చేసి వాట్సాప్ సందేశామేమైనా ఉందేమోనని చూడసాగాడు. అదే ధ్యాసలో ఉన్న సత్తిబాబుకు స్వరం తప్పింది. అంటే పావని నన్ను తలుచుకుంటుందన్న మాట. అని లోలోన తెగమురిసిపోతూ.. టేబుల్ పై ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఒక గుటక వేశాడు. ఇంతలో పర్సనల్ ఫోన్ మ్రోగింది. మరో గుటక తాగాలని ఉన్నా.. విరమించుకున్నాడు. బాటిల్ పక్కకు పెట్టి ఫోన్ ఎత్తాడు.. అది పావని నుండి. ఎగిరి గంతులు వేయాలనుకున్నాడు గాని.. అది పోలీసు స్టేషన్ అని గుర్తుకు వచ్చి ఆగిపోయాడు.
అవతల పావని మరో ప్రశ్న వేయడానికి అవకాశమివ్వకుండా.. విషయమంతా వివరించి ఫోన్ కట్ చేసింది. పావని చెప్పిన సమయానికి మరో గంటసమయం మాత్రమే ఉందని లేచి తనకు ఆలాట్ చేసిన పోలీసు క్వార్టర్¬కు పరుగు తీశాడు.
అరగంటలో ఫ్రెషపై పావని ఇంటికి చేరుకున్నాడు. సత్తిబాబును చూసి.. స్వాగతం పలుకుతున్నట్లు తలుపులు మెల్లిగా తెరచుకున్నాయి. నక్క తోక తొక్కొచ్చినంత సంబర పడిపోయాడు.
ఇంట్లోకి అడుగు పెడుతూనే.. కంగుతిన్నాడు సత్తిబాబు. ఎదురుగా ఏమాత్రమూ ఊహించని భారీకాయం.. భరణి.
“వెల్¬కమ్ సత్తిబాబు” అంటూ మందహాసం చెయ్యసాగాడు భరణి. అతని ఏకవచన ప్రయోగంతో సత్తిబాబుకు అరికాలి మంట మాడ కంటి సుర్రుమంది. కాని వచ్చిన పని వేరాయే..! తమాయించుకుని.. పోలీసు బుద్ధికి పదును పెట్టాడు. భరణి ఆ రోజు నుండి దొరకడం లేదని పావని ఇలా ప్లాను వేసిందనుకున్నాడు.
“నీ కోసమే చూస్తున్నాను భరణీ.. ఎన్నాళ్ళని పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకో గలవు. అందుకే మఫ్టీలో వచ్చాను” అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు సత్తిబాబు.
“ఓసోస్.. కోతలు కోయకు. నేను నీలాంటి దగుల్బాజీని కాను. ఏదైనా ముక్కుసూటి మనఃస్తత్వం నాది. ఇది నీ పోలీసు స్టేషన్ కాదు. పావనికి కన్ను గీటినట్టు. కొత్తపెళ్లి కొడుకు శోభనం గదిలోకి దూరే వాడిలా తయారై వచ్చావు. ఆమాత్రం పసిగట్టలేననుకున్నావా?” అంటూ ఎకసక్కెంగా మాట్లాడసాగాడు.
సత్తిబాబు కొయ్యబారి పోయాడు. పదవతరగతి అమ్మాయి వెంటపడ్తున్నాడంటే.. కుర్రకుంక అనుకున్నాడు. కాని కండలు తిరిగి బజ్జీల భద్రయ్య బాబులా ఉన్నాడు వీడు. గొడవ చేస్తే తనకే ప్రమాదమని మనసులో అనుకుంటూ..
“ముందు నీసంగతి చెప్పు ప్రణతి వెంటబడి సతాయిస్తున్నావట. ఆసిడ్ పోస్తానని బెదిరిస్తున్నావట. మర్యాదగా చెబుతున్నాను.. మానుకో. లేదా ఎన్¬కౌంటర్ చేసేస్తా” అని పోలీసు తిట్లు తిడుతూ.. మీసాలు మెలెయ్యసాగాడు సత్తిబాబు.
“ఏదీ చెయ్యి చూద్దాం. నీకు అంత దమ్ము ఎక్కడిది?” అంటూ వ్యంగ్యంగా నవ్వాడు. ”పాపం..! తండ్రి లేని పిల్ల అని జాలి తలిచి ప్రణతిని చేసుకుని, వారి కుటుంబానికి అండగా ఉంటానని ముందుగా బతిమలుతూ అడిగాను. ఒప్పుకోలేదు. అందుకే బెదిరించాను. అంతే గాని నీలాగా మేక వన్నె పులిని గాను” అంటూ భరణి కోపంగా సత్తిబాబు వంక చూడసాగాడు.
సత్తిబాబు చూపు మారల్చుకొని.. “నేనూ అంతే.. పావనిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను” అంటూ ప్లేటు ఫిరాయించాడు.
“అంటే.. పెళ్లి పేరుతో ఆమెను లొంగ దీసుకుని మోసం చేద్దామని చూస్తున్నావా?”
“మోసమెందుకు చేస్తాను”
“మరి పురిటికని పుట్టింటికి పోయిన భార్యనేం చేస్తావు?” అంటూ ప్రశ్నించే సరికి అవాక్కయ్యాడు సత్తిబాబు. కథ అడ్డంతిరుగుతోందని.. ఇక నేర్పుగా అక్కడి నుండి తప్పించుకోవడమే ఉత్తమమనుకున్నాడు. తాను అలా తయారై రావడమే పెద్ద తప్పు చేశానని. జంకి వెనుకంజ వేశాడు సత్తిబాబు.
“చూడు భరణీ.. నీ ఆశయం మంచిదే.. పావనికి నేను నచ్చచెబుతాను” అంటూ రాజీకొచ్చాడు.
“నువ్వు పావనికి చెప్పాల్సిన అవసరం లేదు. మేము ముగ్గురం కూర్చొని నిర్ణయాలు తీసుకున్నాం. ప్రణతిని నాదానిగా చేసుకోవాలంటే.. నువ్వు పావని జోలికి రావద్దని షరతు పెట్టింది ప్రణతి”
“మరి పావని నిన్ను బెదిరించమని చెప్పిందే..!”
“అది గడచిన పర్వం” అంటూ చిన్నగా నవ్వసాగాడు భరణి.
“సరే అయితే నాకు పావనే కావాలని ఏమీ లేదు. లోకం ఇంకా గొడ్డుపోలేదు. వస్తా..” అంటూ పాములా పారి పోయాడు సత్తిబాబు. అతని మనసు కుత, కుతలాడిపోతోంది. ప్రతీకార వాంఛ రగలి పోతోంది.
***
ఆసాయంత్రం నుండి వాట్సాప్ గ్రూపుల్లో.. సత్తిబాబు పోలీసు సబ్¬ఇన్¬స్పెక్టర్, వీధి రౌడి భరణి భాగోతం అంటూ.. ఒక వీడియో అన్ని గ్రూపులల్లో చక్కర్లు కొట్టసాగింది.
భరణి భగ్గుమన్నాడు. కోపంతో ఊగిపోతూ.. పావని ఇంటికి పరుగెత్తాడు. తాళమేసి ఉంది. ఏం చెయ్యాలా.. అని బుర్ర గోక్కోసాగాడు. నిలువెల్లా ఒడలు మండి పోతుండడంతో బుర్ర పనిచెయ్యడం లేదు. లిప్తకాలం ఆలోచించి.. సత్తిబాబు కోసం పోలీసు స్టేషన్¬కు పరుగులు తీశాడు. భరణి కోసమే బయలుదేరబోతున్న సత్తిబాబు ఎదురుగా వచ్చే భరణిని చూసి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. కాని వీడియో విషయం ఆరాతీయాలని లోనికి పిలిచాడు.
“భరణీ.. ఈ వీడియోల సంగతి ఏంటి” అంటూ ఉద్వేగంగా ప్రశ్నించాడు.
“నాకూ అదే అర్థం గావడం లేదు సర్.. నేనూ అదే తేల్చుకుందామని పావని ఇంటికి వెళ్లాను” అంటూ మర్యాద ధోరణిలోకి వచ్చాడు భరణి. “ఇంటికి తాళం వేసి ఉంది” అంటుంటే.. భరణి కంఠం వణకుతోంది.
“ఇదంతా పావని పనై ఉంటుంది. నో డౌట్” అంటూ కోపంగా లేచి నిలబడ్డాడు సత్తిబాబు. కళ్ళ నుండి నిప్పులు కురుస్తున్నాయి.
“అయితే ఇప్పుడేం చేద్దాం సర్..” అంటూ భయం, భయంగా అడిగాడు భరణి.
ఇంతలో సత్తి బాబు ఫోన్ మోగింది. ఫోన్ తెరచి చూసి చతికిల పడ్డాడు సత్తిబాబు.
“ఎస్సార్..” అని ఆదేశాన్ని అందుకున్నాడు. ఫోన్ పెట్టేస్తూ..
“భరణీ.. నాకు కమీషనరేట్ ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది. బహుశః ఇదే విషయమనుకుంటా.. నువ్వెక్కడికైనా పారిపో,,” అంటూ హడావుడిగా బయలు దేరాడు సత్తిబాబు. భరణి బిక్కు, బిక్కు మంటూ సత్తి బాబు వెనకాలే స్టేజీ మీద జూనియర్ సర్కార్ మ్యాజిషియన్¬లా మాయమయ్యాడు.
కమీషనర్ గదిలోకి అడుగు పెట్టగానే సత్తిబాబు గుండె జారిపోయింది. ఎదురుగా పావని, ప్రణతి చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు.
సత్తిబాబు పోలీసు కడక్ సలాం కొట్టి ప్రతిమలా నిలబడ్డాడు.
“ఏమయ్యా.. సత్తిబాబూ.. ఇది పోలీసులు చెయ్యాల్సిన పనేనా.. నీలాంటి వారు ఒకరో ఇద్దరో చెయ్యబట్టి మొత్తం పోలీసు శాఖ అపఖ్యాతి పాలవుతున్నది. మొన్న పేపరు చూశావా..! పోలీసులు దొంగలతో దోస్తీ అని హెడ్ లైన్స్ లో వచ్చింది. దానికి మినిస్టరు గారు , నేను వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది” అంటూ చీవాట్లు పెట్టసాగాడు. “ఒక అబల సాయం కోరి వస్తే ఇదేనా నువ్వు చెయ్యాల్సిన పని. పావని గారు ఎంతో ధైర్యవంతురాలు. అంతే కాదు మంచి విజ్ఞాన వంతురాలు గూడా. సమస్యను గోటితో వదిలించుకోవాలని చూసింది. నువ్వేమో..! గొడ్డలి దాకా తెచ్చుకున్నావు.
ఒక్క దెబ్బతో రెండు పిట్టలను పడెయ్యాలని పథకం పన్నింది పావని.. గదిలో రహస్యపు వీడియో కెమెరాలు పెట్టి.. మీ పంపకాలను పట్టిచ్చింది. భరణి గాడు.. వాడెవ్వడు?. వాడు బిడ్డను, నువ్వు తల్లిని పంచుకుంటారా..! “ అంటూ కళ్ళెర్ర జేసి బెదిరించసాగాడు.
“సర్.. ఇదంతా నా ప్రణతి పన్నుగడ” అంటూ ప్రణతి శక్తిని వివరించింది పావని.
సత్తిబాబు నిలువెల్లా వణకి పోసాగాడు.
“సార్.. పొరబాటయ్యింది. ఇకముందు మన డిపార్ట్ మెంటుకు చెడ్డ పేరు రాకుండా మసలుకుంటాను. ఈ సారికి క్షమించండి” అంటూ సత్తి బాబు వేడుకోసాగాడు.
“క్షమించాల్సింది నేను కాదు” అంటూ పావని వైపు చూశాడు కమీషనర్.
పావని తల అడ్డంగా ఊపింది.. క్షమించే ప్రసక్తే లేదన్నట్టు.
ఆమరునాడు ఉదయమే ప్రముఖ వార్తా పేపర్లలో తాటికాయంత అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. మొదటి పేజీలోనే.. ‘రక్షించాల్సిన రక్షక భటులు భక్షిస్తున్నారు’ అనే హెడ్¬లైన్స్¬తో వచ్చాయి. కథనమంతా.. వీడియో క్లిప్పులతో సహా ప్రచురితమయ్యాయి.
వార్తను సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం.. కేసు నమోదు చెయ్యాల్సిందిగా పోలీసు డిపార్ట్¬మెంటును ఆదేశించింది.
సత్తిబాబు, భరణి కటకటాల పాలయ్యారు.
మహిళా సంఘాలన్నీ ఏకమయ్యాయి. వారిరువురికి కఠిన శిక్ష పడే వరకు విశ్రమించబోమని పావని, ప్రణతిలకు మద్దతు పలుకుతూ.. ప్రతిజ్ఞ చేశాయి. *

1 thought on “అర్చన 2020 – త్రాణ

  1. ‘త్రాణ’ కథ చాలా బాగా వచ్చింది. అచ్చు తప్పులు లేవు. – చెన్నూరి సుదర్శన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *