May 17, 2024

అర్చన 2020 – దోషి ఎవరు?

రచన: పూర్ణ కామేశ్వరి

కిటకిటలాడుతున్న కోర్ట్ హాలులో ఆర్డర్ ఆర్డరన్న జడ్జిగారి ఉత్తర్వుకు కొంత సేపటికి కానీ నిశ్శబ్దము చోటు చేసుకోలేదు. అంతా అగమ్యగోచరంగా వున్న అహల్యకి, ఇన్నేళ్ళ జీవిత పయనంలో ఇలాంటి మలుపు వస్తుందని కలలోనైనా అనిపించలేదు. తన జీవితంలో పడ్డ మచ్చ తనే మరచిన ఇన్నేళ్లకిలా తనని వెంటాడు తుందని అనుకోలేదు. సజావుగా సాగిపోతున్న జీవితంలో ఉప్పెనలా వచ్చిన ఈ తాకిడికి తట్టుకోలేకపోయినా అందులోనూ ఒక మధురానుభూతి దాగుడడం తనకే తెలియని ఆనందాన్ని కలిగించింది.
అదొక సంచలాత్మక కేసు అవ్వడంతో ఆ చిన్న కోర్టు-హాలులో సంబంధిత వ్యక్తులే కాక పత్రికా-విలేఖరుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
పాతిక సంవత్సరాల క్రితం బిడ్డను త్యజించిన నేరానికి, నేరస్తురాలిగా నిలుచునున్న అహల్య మనసులో ఎన్నో సమాధానంలేని ప్రశ్నలు కదలాడుతున్నాయి.
బాల్యాన్ని కోల్పోయి, ప్రతి రోజూ పిడికెడన్నం కోసం పడరానిపాట్లుపడుతూ అనునిత్యమూ చావుబతుకుల మధ్య నలిగిపోయి, నా అనే వాళ్ళులేక, తన వారెవరో తెలియక, ఎన్నో అగచాట్లతో పెరిగి, మరెన్నో ఛీత్కారాలు ఎదుర్కోవలసి వచ్చి, చేయని తప్పుకు పసిప్రాయం నుంచి శిక్షను అనుభవిస్తూ పెరిగిన తనకు, అందుకు గురిచేసిన వారెవరైనా సరే అంతకంతా అనుభవించాలని ఆక్రోశపడే అవసరమూ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించే హక్కూ వున్నాయి. అభిరామ్ వున్న ఆ స్ధితికి తనకు న్యాయం జరగాలని వాదించడము సమంజసమనే అనిపించింది అహల్యతో సహా అక్కడున్నవారందరికీ.
అటువంటి స్థితికి తనను గురిచేసిన తన తల్లి మీదే కేసు పెట్టి నష్టపరిహారం చెల్లించమని కోరడం బహుశా మన న్యాయవ్యవస్థలో యిదే మొదటిసారి కాబోలు. ఇన్నేళ్లకు తల్లి ఆచూకి తెలిసినందుకు ఆనందంకంటే, అనుక్షణం తనని వెక్కిరిస్తూ హేళన చేస్తున్న తన గతాన్ని తలచుకుంటూ ఆగ్రహమే ఎక్కువ కలిగింది. తను అనుభవించిన క్షోభకు గురి చేసినవారికి తగిన శిక్ష పడాలనే మనసు కోరుకుంది.
సాక్ష్యాలనూ పూర్వాపరాలనూ పరిశీలించిన తరువాత, అహల్య అనబడే ఈమె, తల్లిగా తన బాధ్యతని విడిచి తన సుఖం తాను చూసుకుని, ముక్కుపచ్చలారని పసి బిడ్డను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లడం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యము కాదు. నష్టపోయిన జీవితాన్ని విలువకట్టనలవు కాదు. ఆ నష్టాన్ని ఎవ్వరూ భర్తీ చేయ లేరు. ఐతే, ఆమె ద్వారా జరిగిన ఈ చర్య మూలంగా, నా క్లయింటు శారీరిక, మానసిక వత్తిడికి లోనవడమేగాక సామాజిక, ఆర్థిక యిబ్బందులతో అమూల్యమైన బాల్యాన్ని కోల్పోయాడు. అందుచేత, ఏ విధంగానూ జీవితాన్ని నష్టపోని ఆమె, తన భర్తతో కలిసి నా క్లయింటుకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను, అంటూ వాదించిన లాయర్ గారి వాదనకు కోర్ట్ హాలంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. మానవతా విలువలకై పోరాడే లాయర్ కళానిధిగారు ఎప్పుడూ న్యాయంవైపే నిలబడతారనీ, తాను చేపట్టారంటే ఆ కేసు గెలిచినట్టేనని అందరికీ తెలిసిన విషయమే.
తీర్పు ఇచ్చే ముందు మీరు ఏమైనా చెప్పుకోదల్చుకున్నారా అని అడిగిన జడ్జి గారిని చూసి, “నా పాపానికి ఈ శిక్ష కూడా చాలదు. ఐతే, ఏవిధంగానూ నష్టపోకుండా జీవితాన్ని సుజావుగా సాగిస్తున్నానన్న లాయరుగారి వాదనను విని, సమాజం ముందుంచడానికి కొన్ని వాస్తవాలు, సమాధానం లేని ప్రశ్నలూ వున్నాయి. జడ్జిగారు అనుమతిస్తే, విన్నవించుకుంటాను” అంది అహల్య.
ఇంతవరకు ఎవరికీ చెప్పవలసిన అవసరంరాని నా గతాన్ని లోకానికి చెప్పడం వలన సమాజంలో అత్యాచారాలకు గురవుతున్న అబలలకు చిన్నపాటి మేలైన జరగవచ్చునేమోనన్న ఒకే ఒక ఆశతో నా కథను చెప్పదలుచుకున్నాను. అభిరామ్ కు జరిగిన అన్యాయానికి వాడి కోరికలో ఎంతో న్యాయం వుంది. అందువలన నేను చెప్పదలచుకున్నది, కేవలం నా వైపు కథను చెప్పడం కోసమే కానీ, నేను చేసినదానిని న్యాయపరుచుతూ సంజాయిషీ ఇవ్వడమో, లేక శిక్షను తగ్గించమని అభ్యర్ధనో ఎంత మాత్రమూ కాదు.

*****

మేము హాస్టల్లో ఉండి డిగ్రీ చదువుతున్న రోజులవి. నేనూ సాధన, నవ్య ఒకే గదిలో వుండేవాళ్ళము. అందరమూ ఇంచుమించు చిన్న టౌన్లనుంచి వచ్చిన అతి సామాన్యమైన కుటుంబాల వాళ్ళమే. గవర్నమెంట్ ఎయిడే లేకపోతె అసలు చదువుకునే స్థోమత కూడా లేనివాళ్ళము. ట్యూషన్ ఫీజూ, హాస్టల్ ఫీసులోను ఎయిడ్ లభిస్తున్నందువల్లనే మేము అసలు చదువుకోగల పరిస్థితి.
ఎదో సాధించాలన్న ఆశతో సాధనకు ఆ పేరు పెట్టునకున్నారు తల్లితండ్రులు. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా తలవొంచక ఆమె చదువును మాత్రం ఆ దంపతులు ఎన్నడూ ఆగనివ్వలేదు. కుమ్మరి పనిలో ఒంట్లోని శక్తినంతటినీ కూడగట్టి బలంగా చక్రాన్ని కర్రతో తిప్పాలి. గుండె బలహీనమవ్వడం వలన ఆ పనికి ఇక స్వస్తి చెప్పాలని డాక్టర్లు హెచ్చరించినా, సాధన డిగ్రీ కోసమే లాక్కొచ్చేవారు. ఇంక మా ఇంటి పరిస్థితికొస్తే, ఒక్కొక్కరుగా మా ఇద్దరు మేనత్తలూ మా ఇంటికి చేరారు. పెద్దావిడ విధవగా చేరితే, రెండో అత్తయ్య భర్త వదిలేసి పుట్టింటింకి చేరింది. ఒకళ్ళకు నాలుగురయ్యేసరికి మా నాన్నకు వచ్చే ఆ ప్రైవేటు కంపెనీ జీతం ఏ నెలకానెల అత్తెసరయ్యేది. స్ట్రైకులంటూ పూర్తి జీతం రాకపోతే మరింక చెప్పనే అక్కర్లేదు. చాలా సుఖమయమని చెప్పలేక పోయినా, నవ్య వాళ్ళింట్లో విపరీతమైన ఇబ్బందులు మాత్రం లేవు. మాకెప్పుడూ కాస్త చేదోడువాదోడుగానే వుండేది నవ్య.
డిగ్రీ పూర్తవుతూనే క్యాంపస్ సెలెక్షనులో మంచి ఉద్యోగం సంపాదించాలన్నదే మా లక్ష్యంగా ఉండేది. ముగ్గురమూ పట్టుదలతో పోటాపోటీగా చదివేవాళ్ళము.
ఒక రోజు మా కరెస్పాండంటు నవనీతంగారు నాకు రాత్రి 8 గం.లకు ఫోన్ చేసారు. “అహల్య, ఎలా వున్నావు? బాగున్నావా?” అంటూ ఎంతో ప్రేమగా పలకరిస్తూ, పరీక్షలకు బాగా చదువుతున్నావాని ఎంతో అక్కరగా అడగడమేకాక నీ చదువు, క్యాంపస్ సెలక్షన్, ఇంటర్నల్సుతో సహా డిగ్రీలో నీకు మంచి స్కోర్సు రావాలనీ, ఆ విషయమై నీతో మాట్లాడదామనీ చేశానన్నారు.
మన బాగోగులు ఇంతలా అడుగుతూ మంచి చెడ్డలను చూస్తున్న మేడంగారి ఔన్నత్యానికి మనసులోనే సంబర పడుతూ కృతజ్ఞతలను చెప్పుకున్నాను.
అది ఒక్క నువ్వు చదవడం వల్లనే సాధ్య పడదు అన్న ఆవిడ మాటలకి, ఎందుకని మేడం, నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. నేను రేయింపవళ్ళు చాలా కష్టపడి చదువి మంచి మార్కు లు తెచ్చుకుని మీ పరువు తప్పక నిలపెడతాను. క్రితం ఏడు మొదటి సంవత్సరమవ్వడంతోనూ, సిటీ లైఫుకి కొత్త అవ్వడంతోనూ, హాస్టలుకి అలవాటు పడడానికీ కాస్త టైం పట్టింది. ఈ మూడేళ్లు ఆలా జరగదు. అంటూ నాలోనున్న పట్టుదలనంతా చూపిస్తూ అన్నాను.
నీ గురించి నాకు తెలుసు. ఐతే, నేను నిన్ను మరికొంచం ఉన్నతంగా చూడాలనుకుంటున్నాను. అందుకు నీకో సహాయం చేద్దామనుకుంటున్నాను. నువ్వు కొంచం సహకరిస్తే, అన్నిట్లోనూ చక్కటి మార్కులతో పాసవ్వడమే కాకుండా మంచి ఉద్యోగం కూడా మొదటి క్యాంపస్ రౌండ్ లోనే వచ్చేస్తుంది. మీ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఈ అవకాశం ముందుగా నీకు ఇవ్వాలని నీకు కాల్ చేశాను.
పట్టుదలగా చదవడం ఎలాగా చేస్తాను, అది కాకుండా మరింకేమి చెయ్యాలి మేడం? అని అమాయకంగా అడిగింది.
అదే, నేను చెప్పిన చోటుకు వచ్చి అక్కడ కాస్త సహకరించాలి. అన్ని ఏర్పాట్లు గౌప్యంగా ఉంటాయి. మన చైర్మన్గారి అబ్బాయే అన్నీ చూసుకుంటారు. ఎలాంటి భయాలు అక్కర్లేదు. ఒక్క సహకారం తప్ప. మన ఈ సంభాషణ తో సహా, ఏది ఎవ్వరితోను చర్చించనవసరంలేదు.
ఒళ్ళంతా జలదరించి గగుర్పాటుగా అనిపించింది అహల్యకు.
మొదట బుజ్జగింపుగా ఆరంభమైన ఆ ప్రస్తావన, వత్తిడిగా మారి ఆ పైన బ్లాక్మెయిల్ గానూ కాలేజీ లోంచి అర్ధాంతరంగా తీసివేయబడునన్న బెదిరంపుగానూ తయారయ్యింది. యూనివర్సిటీలో భర్తీ అయిన మొదటి సంవత్సరంలో తీసివేయబడితే, తగిన టీసీ లేకుండా మరే కాలేజీలో సీటుకూడా రాదు. పెద్దలతో చెపితే అసలు చదువుకుని తమ కాళ్ళమీద నిలబడే స్థితికూడా ఉండదు. నవనీతం గారిపై ఫిర్యాదు చేసి ఆ అతిబలవంతులైన ముఠాను ఎదుర్కునే పరపతి కానీ ధైర్యం కానీ లేవు. చదువుకుని నాన్నని గుండెపోటు నుంచి కాపాడాలన్న కనీస ఆశకు కూడా స్వస్తి చెప్పాలి సాధన. ఇంటర్నల్స్ దగ్గర పడగా వత్తిడి బలపడింది. మొహమాటంగా అనిపించి, అసహ్యంగా అనిపించి చర్చించుకోలేక ఒకరికి తెలియకుండా మరొకరం మొత్తానికి ఆ వత్తిడిని ముగ్గురమూ ఎదుర్కోవలసి వచ్చింది. ఆ పై ఒక్కరోజు దుఖ్ఖం ఉప్పెనలా పొంగి ఒకరికొకరు చెప్పుకుని బావురు మన్నాము. ఐతే, అంతలోనే మాకు విపరీతమైన విషవలయం పేనబడి అన్యాయం జరిగిపోయింది. నవనీతం గారి ఆఫీసులోనే మాకు మత్తు-పదార్ధాలు ఇచ్చి మా మీద బలాత్కారపు దాడి చేయబడింది. నోరు మెదపకూడదన్న బెదిరింపుతో వీలు లేక,, నోరు విప్పే ధైర్యం లేక లోలోపల విలపిస్తూ, జీవచ్చవాలమయ్యి మాపై మాకే కలిగిన న్యూనతా భావనను ఎదుర్కోవడానికి ఒక సంవత్సర కాలం పట్టింది.
మేము తలపడని తప్పు నను వీడక మరింత పరీక్షించగా, అప్పుడప్పుడే తన ఆగడాలు బయటపడ కుండా జాగ్రత్తపడుతున్న నవనీతం గారికి నేను గర్భవతినని తెలిసి తనను తాను కాపాడుకోవడానికి నన్ను రక్షించిక తప్పలేదు. వాళ్ళు ఇచ్చిన మత్తుపదార్ధాలతో ఏమి జరుగుతోందో నాకు తెలియలేదు. అప్పటికే 5 మాసాలు దాటేసాయని తెలిసిన నాకు వేరే దారి లేకపోయింది. ఆరు నెలల పాటు ఆ ఊర్లోనే లేకుండా వుండే ఏర్పాటు చేసి జాగ్రత్త పడ్డారు. ఐతే, ఎవ్వరి ఆచూకీ తెలియకుండా, మా వాళ్ళు కంగారు పడకుండా నేను కాలేజీ లోనే వున్నట్టు బయటప్రపంచాన్నంతటినీ నమ్నించారు. ఆ పొరుగూరినుంచి మళ్ళీ తిరిగి వచ్చేసమయంలో ఆ శిశువుని నాకు దూరం చేసారు. నా బిడ్డని చెప్పుకోవడానికి నేను జన్మనిచ్చిన శిశువెవరని కూడా తెలియ నివ్వకుండా, చూడనివ్వకుండా కర్కోటకరంగా నడుచుకున్నారు. ఇదంతా పకడ్బందీగా చేసిన చర్య. మళ్ళీ నన్ను హాస్టల్లోకి చేర్చారు. ఇంక నోరు తెరిచే అగత్యం కూడా లేకుండా చేసారు. నేను తిరిగి వచ్చిన 8 నెలలకి నవనీతంగారు పోలీసుల చేతచిక్కి అరెస్టు అయ్యారు. ఆవిడ మీద అనేక కేసులు నమోదయ్యాయి. ఐతే, నేను జీవితాన్నే కోల్పోయి, జీవచ్చవంలా అయిపోయాను. ఆ బాధ తెలిసిన సాధన, రంజనులు నాకు తోడూ-నీడై నిలిచారు. తేరుకోవడానికి ఎంతో సహకరించి మనిషిని చేసారు. నాకు కూడా తెలియని బిడ్డను తెలుసుకు నేందుకు ప్రయత్నించే అవకాశమే లేకపోయింది. తెగించి తెలుసుకున్నా, లోకాన్ని ఎదుర్కొనే ధైర్యమూ లేకపోయింది. వరము పొందని కుంతీదేవిలా లోలోపల కుమిలిపోయాను.
ఎంతో నేర్పుతో వాదించిన లాయరుగారు, సంచలనం సృష్టించి కోర్టుకు వచ్చిన నవనీతంగారి కేసు చదివే వుంటారు. ఐతే, పోలీసుల చేతికి చిక్కక ముందు బలైపోయిన ఎందరో అహల్యలు, సాధనలు మూగవారిపోయి, తమ ప్రశ్నలు ఎవ్వరినీ అడగలేక, తమ గోడు ఎవ్వరికీ చెప్పుకోలేక జీవచ్ఛవాలయ్యారు. వారికి ఏమిటి సమాధానం? మూగబోయిన వారి ఆర్తనాదాలు ఎవ్వరికి వినిపించలేదు. బలవంతంగా నోళ్లు మూసివేయబడిన వారి స్థితికి ఎవరు కారణం? అలాంటి భయంలో నలిగిపోయి చితికిన మరెందరో అహల్యలు నేటికీ వున్నారే? సభ్య-సమాజంగా మనమందరమూ ఈ స్థితికి బాధ్యులం కాదా? ఏళ్ళు గడిచాయే కానీ అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. కొన్ని బహిర్గతంగా, కొన్ని గౌప్యంగా. ఇక్కడ దోషులెవ్వరు?
కోర్ట్ హాలంతా నిర్ఘాంత పోయింది. దోషిలా చూసిన అహల్యను ఇప్పుడు జాలిగా చూడసాగింది. ఆగ్రహంతో రగిలిపోతున్నఅభిరాంకు ఇప్పుడు ఆమెలో అమ్మ కనబడడం మొదలుపెట్టింది.
అహల్య కథ విన్న పిమ్మట, మన సమాజంలోని కొందరు చీడపురుగుల వల్ల ఎన్ని జీవితాలు ఇలా లోతు తెలియని అగాధాల్లోకి పడిపోతున్నాయో, మరెందరు అభిరాంలు అనాధలవుతున్నారోనని అందరూ చర్చించుకున్నారు.
ఐతే, ఇది కేవలం తన ఆవేదనను పంచుకోవడానికి మాత్రమేకానీ కోర్టు వేయబోయే శిక్షను తప్పించుకోవడానికో లేక నష్టపరిహారము తప్పడానికో కాదని అహల్య చెప్పినందువలన, కాలేజీ స్కాం కేసును ఈ కేసు విషయంలో పరిశీలించట్లేదని జడ్జిగారు తేల్చేస్తూ, ప్రతి నాణానికి మరో వైపుంటుందని తెలుసుకున్న అభిరాం, తన కేసును వాపసు తీసుకోదలచినందున, అహల్యకు నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం లేదని చెప్పడం జరుగుతున్నది, అని తీర్పు ఇచ్చారు.
ఒక సగటు వనిత పడిన ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని, మరెవ్వరూ ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోకుండా, మనమంతా ఒక సమాజంగా కృషి చేయాలని వేడుకొన్నారు. ఇలాంటి ఘోరాలు జరగడంలో ఎంతోకొంత మనమందరమూ బాధ్యులమే. మనందరిలోనూ ఇంకిపోయిన భయమే ఇలాంటి సంఘటనలు జరగడానికి మూల కారణం. సమస్య వచ్చినప్పుడు, ఒక్కటై ఎదుర్కోవడానికి మనలో ఐకమత్యం, ఒకరి పట్ల ఒకరికి గౌరవం, మరొకరి సమస్యను మనదిగా చూడగలిగే మానవత్వమూ ఉంటే చాలు, అప్పుడు దాన్ని బయట పెట్టే సాహసం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. దానితోసగానికి సగం సమస్యలు తొలగిపోతాయి. స్త్రీలను ఒక విలాస వస్తువుగా చూస్తూ అత్యాచారాలకు పాల్పడే వారికి గుణపాఠం చెప్పడానికి దోహదపడే యీ గుణాలను నేటి సమాజంలో పెంపొందించడమే మన తక్షణ కర్తవ్యం. అంతవరకు ఎన్ని చట్టాలున్నా, దోషులు తప్పించు కుంటూనేవుంటారు.
సమాజంలో తనకంటూ ఒక గౌరవాన్ని, ఉన్నత స్థానాన్నీ, పరపతినీ సంపాదించుకుని తాను స్థాపించిన NGO మూలంగా కాలేజీ స్కామును తిరగ-తోడి అందులో బలైన వారందరి కథలనూ కనువిప్పుగా చూపుతూ నేటి సమాజానికి మరగదర్శకమవ్వడానికి తనవంతు కృషి చేయసాగాడు అభిరాం. కుట్రలను చేసేవారిని వదిలి బాధితులను నిందించే మన ప్రవృత్తికి నేటితో స్వస్తి చెప్పాలని మొదటి గుణపాఠం నేర్చుకున్నవాడిగా నినాదం చేస్తూ గొంతెత్తి చాటాడు.
* * * * * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *