May 8, 2024

అర్చన 2020 – తల్లి కోడి

రచన: వాత్సల్య

“అమ్మో టైము ఐదయిపోయింది అప్పుడే, ఇంకా బాస్ చెయ్యమన్న రిపోర్టు పూర్తి కాలేదు, పిల్లలు తిన్నారో లేదో” అనుకుంటూ అన్యమనస్కంగానే పని చేసుకుంటొంది శైలజ.
ఇంతలో ఇంటి నుండి పెద్దమ్మాయి వర్ష ఫోను “అమ్మా, నువ్వు అర్జెంటుగా రా” అంటూ.ఏమయ్యిందే అని ఎంత అడిగినా సమాధానం చెప్పకుండా ఏడుస్తుందే తప్ప మాట్లాడదు. శైలజ గుండె జారిపోయింది, కానీ ధైర్యం కూడగట్టుకుని “ఇంట్లో తాతయ్యా, నానమ్మా లేరా?” అని అడిగింది.
ఇంతలో శైలజ అత్తగారు భాగ్య లక్ష్మి ఫోను తీసుకుని “నువ్వేమీ కంగారుపడకమ్మాయ్, ఏదో చిన్న పిల్ల పెంకితనం చేస్తోంది అంతే” అనడంతో ఊపిరి పీల్చుకుంది కానీ ఒక తల్లిగా ఆమె మనసు కీడు శంకిస్తోంది. అసలు వర్ష ఎందుకలా ఏడుస్తోంది? ఆమె మనసు పరివిధాల ఆలోచిస్తోంది.
వర్ష బుద్ధిమంతురాలు, చదువులో మరీ ఫస్టు ర్యాంకు కాకపోయినా బాగానే చదువుతుంది. ఇతరత్రా వ్యవహారాలు పట్టించుకునే రకం కాదు.మరి ఎందుకలా ఏడుస్తోంది?
చెయ్యాల్సిన పనిని కొలీగ్ లావణ్యకి అప్పచెప్పి ఇంటికి బయలుదేరింది.ఇంటికెళ్ళి చూసేసరికి హాల్లో మామగారు టీవీలో నిమగ్నమైపోయారు, చిన్నది పక్కింటికెళ్ళినట్లుంది, వర్ష బాల్కనీలో కూర్చుని ఏదో నోట్సు రాసుకుంటొంది.అత్తగారు కనిపించకపోవడంతో “అత్తయ్యేరి,మామయ్యా?” అని మామగారిని అడిగింది. “అలా డాబా మీదకి వెళ్ళొస్తానని వెళ్ళిందమ్మా” అనడంతో శైలజ ఆశ్చర్యపోయింది,”ఆవిడికెప్పుడూ ఒక్కర్తే డాబా మీదకి వెళ్ళే అలవాటు లేదుకదా” అనుకుంటూ.
వెంటనే బ్యాగు, టిఫిన్ క్యారేజీ ఇంట్లో పడేసి డాబా మీదకెళ్ళింది. అత్తగారు ఓ మూల నిల్చుని కళ్ళొత్తుకుంటున్నారు,తనని చూస్తే ఆవిడకి మొహమాటంగా ఉంటుందని వెంటనే కిందకొచ్చేసింది,ఏదో భార్యా భర్తల మధ్య గొడవ అయ్యుంటుంది అనుకుంటూ
లోపకెళ్ళి బట్టలు మార్చుకునొచ్చేసరికి పక్కింటికెళ్ళిన కావ్య పరిగెత్తుకొచ్చి శైలజని కావలించుకుని ఆరోజు స్కూల్లో జరిగిన విశేషాలు చెప్పి కానీ వదల్లేదు. ఇంతలో అత్తగారు టీకప్పుతో ఎదురొచ్చారు.శైలజ కృతఙతతో కూడిన చిరునవ్వుతో కప్పు అందుకుని “చెప్పండత్తయ్యా, ఏమిటి ఈరోజు విశేషాలు” అని అడిగింది.
“ఏమీ లేవమ్మా, సరే కానీ ఈరోజు రాత్రికి చపాతీలు చెయ్యనా, అన్నం తిందామా?” అని ఆవిడ ముభావంగా అడిగేసరికి “చపాతీలు చేసుకుందాము అత్తయ్యా, అయినా మీకెందుకు శ్రమ, ప్రొద్దున్న నుండీ ఇల్లు చూసుకుంటారు కదా, అలా మీరిద్దరూ పిల్లలతో కూర్చోండి, నేను కాస్త రిలాక్స్ అయ్యి కిచెన్‌లోకి వెళ్ళి వంట చేస్తాను” అని చెప్పి కాసేపాగి వంటింట్లోకెళ్ళింది.
వెనకాలే వచ్చిన వర్షని చూసి ఆశ్చర్యపోయింది.రోజూ తను వంట చేస్తోంటే పిల్లలిద్దరూ నానమ్మ, తాతతో కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటారు, అలాంటిది ఈరోజు వర్ష ఇలా వచ్చేసరికి “ఏమిటే, నన్ను ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నావు” అని అడిగింది.
“అమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండవా, ప్లీజ్?” బేలగా అడుగుతున్న కూతురిని పొదివి పట్టుకుని “ఇప్పటికిప్పుడు ఉద్యోగం మానెయ్యమంటే ఎలాగమ్మా? నువ్వు వచ్చే సంవత్సరం పదో తరగతికొచ్చేసరికి పరీక్షలప్పుడు శలవు పెడతా అన్నాను కదా, అయినా అసలు సంగతి చెప్పకుండా నువ్వు ఇంట్లో ఉండు అంటే ఎలాగరా ?” అని అడిగింది లాలనగా.
ఇంతలో శైలజ మామగారు గంగాధరం గారు వంటింట్లోకొచ్చేసరికి వర్షని వదిలి “మామయ్యా, ఏమి కావాలి?” అని అడిగి ఆయనకి కావాల్సిన బిస్కెట్ల డబ్బా తీసిచ్చింది.
ఆయన వెళ్తూ వెళ్తూ “వర్షా, రామ్మా, మాతో కూర్చుని కబుర్లు చెప్పు, మళ్ళీ హోంవర్కులు అదీ అంటూ మాట్లాడవు, అలా కాసేపు బాల్కనీలో కూర్చుందాము” అని పిలిచారు.
“తాతయ్యా! నేను రాను, అమ్మతో మాట్లాడుతున్నాను” విసురుగా వర్ష సమాధానమిచ్చేసరికి అవాక్కవ్వడం శైలజ, గంగాధరం గార్ల వంతయ్యింది.గంగాధరం గారు మౌనంగా నిష్క్రమించారు కానీ శైలజ మాత్రం కోపాన్ని ఉగ్గబట్టుకోలేక “ఏమిటే, ఏమయ్యింది నీకు ఈరోజు, అయినా ఆ పెడసరం సమాధానం ఏమిటి?” అంది కోపంగా.
ఇంతలో శైలజ అత్తగారు లోపలికొచ్చి “ఏదో చిన్న పిల్ల, వదిలెయ్యమ్మా, అయినా ఆయన ఏమీ అనుకోరు, నువ్వు రావే” అంటూ వర్షని తనతో పాటూ తీసుకెళ్ళింది.వర్ష అయిష్టంగానే ఆవిడని అనుసరించింది.
మరునాడు ప్రొద్దున్నే అందరికంటే ముందే లేచి వర్షని లేపి తనతో పాటు వాకింగుకి తీసుకెళ్ళి మాట్లాడాలనుకుంది కానీ మరునాడు తను లేచేసరికే అత్తగారు, మామగారు నిద్ర లేచి ఉండటంతొ వర్షతో మాట్లాడే సమయం చిక్కలేదు.
ఆ తరువాత పక్షం రోజులపాటు ఆఫీసు పని, ఇంటి పని, పిల్లల పరీక్షల హడావిడిలో ఈ విషయాన్ని శైలజ మర్చిపోయింది, కానీ వర్ష రెండు మూడు సార్లు “అమ్మా,నువ్వు ఇంట్లోనే ఉండవా?” అని అడిగింది. “తమ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఇద్దరూ ఉద్యోగం చెయ్యాలని” నచ్చచెప్పేసరికి వర్ష ఇంక ఏమీ మాట్లాడకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు శైలజ.
కావ్య మాటలని బట్టి ఈ మధ్య అత్తగారూ, మామగారూ తరచూ వాదులాడుకుంటున్నారని తెలిసింది కానీ పెద్ద వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం బాగోదని, ఏమీ తెలియనట్లే ఉంది.
ఎన్నడూ లేనిది ఈ మధ్య తను ఆఫీసు నుండి వచ్చేసరికి అత్తగారు పిల్లలిద్దరినీ తీసుకుని పక్కింట్లో ఉండటం శైలజ దృష్టి దాటిపోలేదు. ఒకరోజు ఆఫీసులో అలసిపోయి ఇంటికొచ్చిన శైలజకి ఇంట్లో పిల్లలిద్దరూ కనపడకపోయేసరికి చిర్రెత్తుకొచ్చింది.వచ్చే వారం నుండీ పరీక్షలు పెట్టుకుని వాళ్ళు పక్కింట్లో వెలగబెట్టే రాచకార్యమేమిటో అర్ధం కాలేదు. పిల్లలు నానమ్మతో కలిసి ఇంటికి రాగానే పిల్లలిద్దరిమీదా గయ్యిన లేచింది.
ఇంతలో శైలజ అత్తగారు కలగచేసుకుని “వాళ్ళ తప్పేమీ లేదమ్మా, నేనే వాళ్ళని పక్కింటికి తీసుకెళ్ళాను, నాతోపాటే ఉండి అక్కడే చదువుకుంటారని” అనడంతో శైలజ కోపం కట్టలు తెచ్చుకుంది.
“మీరు వెళ్తే వెళ్ళండత్తయ్యా,కబుర్లు చెప్పుకోవడానికో, కోడళ్ళ పెట్టే ఆరళ్ళు చెప్పుకోవడానికో,కానీ పిల్లలని మాత్రం ఇంట్లో మామయ్య దగ్గరే వదిలి వెళ్ళండి,వాళ్ళు చదువుకోవాలి కదా ” అని విసురుగా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది.
భాగ్యలక్ష్మికి కళ్ళ నీళ్ళు తిరిగాయి కోడలన్న మాటలకి.అసలు తమ ఇద్దరి మధ్యా ఉన్నది అత్తా కోడలి బంధం అని ఇద్దరూ ఎప్పుడూ భావించలేదు. శైలజ అత్తగారిని తల్లి కంటే ఎక్కువగా చూసింది, ఆవిడా శైలజని అలాగే చూసారు.
“పోనీలే ఏదో చిన్న పిల్ల, ఆఫీసులో చిరాకు నా మీద చూపించి ఉంటుంది” అని ఆవిడ సర్దుకుపోయారు కానీ శైలజ మాత్రం తాను ఎందుకు నోరు జారానా అని ఆ రాత్రంతా మధనపడుతూనే ఉంది.
శైలజ ఆ రాత్రంతా అన్యమనస్కం గానే ఉంది.భర్త శ్రీకాంత్ వచ్చి కారణమడిగినా “ఆఫీసు టెన్షన్స్” అని చెప్పిందే కానీ అసలు కారణం చెప్పలేదు.
ఇంతలో పిల్లలకి వేసవి శలవలొచ్చాయి . పిల్లలకి శలవలు కాబట్టి ఓ వారం రోజులపాటు వాళ్ళని తీసుకుని కూతురి దగ్గరకి వెళ్తామన్నారు గంగాధరం గారు .”అత్తా వాళ్ళింటికి” అనగానే శైలజ రెండో కూతురు కావ్య ఎగిరి గంతేసింది కానీ పెద్దది వర్ష మాత్రం ఇక్కడే ఉంటానని భీష్మించుకు కూర్చుంది.
“ఎక్కడికయినా అంటే చాలు, ఠక్కున తయారవుతావే నువ్వు,తాతయ్య ఒక్కరే వెళ్తారు అత్తా వాళ్ళింటికి, మనం ఇక్కడే ఉందాము” అని కావ్యతో అంటున్న అత్తగారిని అలా నోరు తెరిచి చూస్తుండిపోయింది శైలజ,”మామయ్యగారిని విడిచి ఒక్క క్షణం ఉండని ఈవిడేనా ఇలా మాట్లాడుతోంది” అనుకుంటూ.
రాత్రి ఈ విషయం శ్రీకాంతుకి చెప్తే, “అవును శైలూ నేనూ గమనిస్తున్నాను, ఈ మధ్య నాన్న ఎంతసేపూ తన ల్యాప్ టాపులో ఉంటున్నారు అర్ధరాత్రి రెండు, మూడింటికి కూడా. అమ్మా, నాన్నా ఇది వరకటిలా సఖ్యతగా ఉండట్లేదనిపిస్తోంది. కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు “ఇదీ సమస్య” అని చెప్పకముందే మనం కలుగచేసుకుంటే బాగోదేమో అని ఊరుకుంటున్నాను. ఎలాగూ అవకాశం వచ్చింది కదా,నాన్నని ఒక్కరినే లత దగ్గరకి పంపించి అమ్మతో నేను మాట్లాడతాను” అనడంతో నిశ్చింతగా అనిపించింది శైలజకి.
గంగాధరం గారు ఊరెళ్ళాకా ఆ రోజు రాత్రి తల్లి దగ్గర కూర్చున్నాడు శ్రీకాంత్. ఆమె మొహం లోకి చూసి షాక్ కొట్టినట్లయ్యాడు, ఆవిడ కళ్ళ నుండి ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళని చూసి.
“అమ్మా, ఏమయ్యింది” అన్నాడు ఆమె చేయి తన చేతిలోకి తీసుకుని.
“సిగ్గు పడుతున్నానురా ఈ విషయం చెప్పడానికి…మీ నాన్న…” ఇంక ఆవిడ వాక్యం పూర్తిచెయ్యలేక వెక్కుతూ శ్రీకాంత్ మీద తల వాల్చింది.
“అమ్మా.. చెప్పు, ఏమయ్యింది నాన్నకి?” ఆతృతగా అడిగాడు శ్రీకాంత్.
ఇంతలో భాగ్యలక్ష్మి “అమ్మా,శైలూ” అని కేకేసేసరికి “అమ్మా, శైలూ ఎందుకిప్పుడు, తనుంటే నువ్వు అనుకున్నది చెప్పలేకపోవచ్చు” అంటుండగానే శైలజ గదిలోకొచ్చింది.
“రా..కూర్చోమ్మా” అని శైలజకి తన మంచం మీద చోటు చూపించి శైలజ చేతులు పట్టుకుని “నన్ను క్షమించు శైలూ,నువ్వు మమ్మల్ని కన్న తల్లి తండ్రీ లాగే చూసావు కానీ తండ్రి ఆ గౌరవాన్ని నిలుపుకోలేక నీ కూతురి మీదే కన్నేసాడమ్మా” అంటూ భోరున ఏడ్చేసింది.
ఒక్క క్షణం మ్రాన్పడిపోయారు శైలజా, శ్రీకాంత్. అసలు తాము సరిగ్గానే విన్నామా అనుకున్నారిద్దరూ ఒక్కసారే. ఇంతలో శైలజే తేరుకుని “అత్తయ్యా, ఏమిటి మీరంటున్నాది?” అని అడిగింది గాభరాగా.
“ఆరోజు వర్ష నీకు ఎందుకు ఫోను చేసి ఇంటికి రమ్మందో తెలుసా శైలూ?”
“ఆరోజు ఎప్పటి లాగే పిల్లలిద్దరూ స్కూలు నుండొచ్చి మా దగ్గర కూర్చుని స్కూల్లో జరిగిన విశేషాలు పంచుకుంటోంటే నేను వంటింట్లోకెళ్ళి కాస్త కారప్పూసా గిన్నెలో వేసి తీసుకొచ్చేసరికి మీ మామగారు వర్ష బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం, అది ఇబ్బందిగా కదలడం చూసాను.కాసేపటికి డైనింగు టేబుల్ మీద చదువుకుంటున్న వర్ష దగ్గరే కూర్చుని దాని కాళ్ళని క్రింద నుండి తాకాడం నా దృష్టి దాటి పోలేదు. నేను గమనిస్తున్నాను అని చూసి ఆయన మిన్నకుండిపోయారు.ఇంతలోనే వర్ష నీకు ఫోను చేసేసింది.
ఆ తరువాత కూడా రెండు మూడు సార్లు ఇలాగే ప్రవర్తించడం చూసి, ఆయన కాళ్ళ మీద పడి వేడుకున్నాను,ఇలాంటి వేషాలు తగవని. మొదట్లో “అలాటిదేమీ లేదు” అని బుకాయించినా ఇంక రాను రాను ఆయన నా కళ్ళెదురుగుండానే దానితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. పైగా “నోర్మూసుకుని అలా చూస్తూ ఉండు,ఎవ్వరికైనా చెప్తే ఇక్కడినుండే దూకి చస్తాను” అని బెదిరిచడంతో మిన్నకుండిపోయాను కానీ దానిని ఆయననుండి కాపాడటానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. పిల్లలిద్దరినీ వదిలి క్షణమైనా ఉండేదానిని కాదమ్మా. నువ్వొచ్చేవరకూ వాళ్ళని పక్కింటికి తీసుకెళ్ళి కూర్చునేదానిని.
అసలు ఈ సంగతి మీకెలా చెప్పాలో కూడా తెలియలేదు.పోనీ పోలీసులకే తిన్నగా వెళ్ళి చెప్దామా అంటే, ఆధారాల్లేవు నిరూపణకి. పైగా స్వయంగా భర్త ఇలాంటి నీచపు పని చేస్తున్నాడని ఎలా చెప్పాలి ?వర్షని ఆయన తాకినప్పుడల్లా అది ఆయనని ఆపాలని ప్రయత్నించడం, కానీ సిగ్గు లేకుండా ఆయన అలాగే ప్రవర్తించడం చూసి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అర్ధమయ్యేది కాదు. ఇంక ఈయన హెచ్చుమీరిపోతుండటంతో నేను ఎలాగూ మీకు నోరు విడిచి చెప్పలేక పోతున్నాను, కనీసం అది అయినా చెప్తే బాగుండని నేను అనుకోని రోజు లేదంటే నమ్ము.
అసలు ఆయనలో వచ్చిన ఈ మార్పుకి కారణమేమిటని ఆయన బాత్రూములో ఉన్నప్పుడొకసారి ల్యాప్ టాప్ వర్షకి చూపించాను. పాపం చిన్న పిల్ల తట్టుకోలేకపోయిందమ్మా, ఆ జుగుప్సా కరమైన బొమ్మలు చూసి.నన్ను పట్టుకుని బావురుమంది.
నాకంతా తెలుసుననీనీ, ఈరోజే అమ్మా వాళ్ళకీ చెప్దామని ఊరుకోబెట్టాను.ఈరోజు ఎలాగైనా మీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను ఇంతలో ఆయన ఊరెళ్ళారు” అని ఆపి కళ్ళు తుడుచుకుందావిడ.
శ్రీకాంత్, శైలజల నోటి వెంట మాట లేదు.ఇంతలో ఆవిడే అందుకుని “ఇదేదో కుటుంబ వ్యవహారం కాబట్టి మెల్లిగా ఎలాగోలాగ సర్దుబాటు చేద్దామనుకోవద్దురా,అసలు ఈ వయసులో మనవరాలిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి దానితో ఇలా ప్రవర్తిస్తున్నాడంటే ఆయన పశువు కన్నా హీనం అని అర్ధం.ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి.ఆయనకి ఏ శిక్ష వేసినా నేను ఆనందిస్తాను,ఎందుకంటే కనీసం ఒక్క మృగాడైనా కటకటాల వెనక్కి వెళ్ళాడని” అని ఆగింది.
“కానీ అమ్మా!, నువ్వు ఇలాంటి నీచుడివి అంటే ఎవ్వరూ ఒప్పుకోరమ్మా, పైగా సొంత తండ్రిని ఇలా చేస్తున్నావా” అని ఎలా అడగాలి అన్నాడు శ్రీకాంత్ దీన స్వరంతో.
“అదిగో,ఆ బేలతనమే రా వద్దన్నది,ముందర నువ్వు లతకి ఫోను చేసి ఈయన విషయం చెప్పు, కనీసం దాని పిల్లలకైనా ఈ పీడకల ఉండదు.ఆయన వచ్చేలోపు మనం ఇంట్లో కెమేరాలు పెడితే బాగుంటుందనిపిస్తోంది,అయినా మీ ఫ్రెండు వేణు ఎస్సై కదా,నీ తండ్రి పశువు అని నిరూపించడానికి ఏ ఏ ఆధారాలు కావాలో వాడి సలహా తీసుకో” అనడంతో ఆవిడ చూపుతున్న నిబ్బరానికి ఆశ్చర్యపోయారిద్దరూ.
ఇటువంటి పరిస్థితిలో కూడా అలా నిబ్బరంగా ఉన్న అత్తగారిని చూస్తే పిల్లలని రెక్కల క్రింద దాచి పెట్టి గ్రద్ద నుండి కాపాడే తల్లి కోడిలా అనిపించిందావిడ శైలజ కళ్ళకి.
శ్రీకాంత్ లతకి ఫోను చేసి విషయం చెప్పడంతో లత మొదట నమ్మలేదు కానీ స్వయంగా తల్లి చెప్పడంతో నమ్మక తప్పింది కాదు.లత తన తండ్రిని ఒక కంట కనిపెడుతూనే ఉంది.
శ్రీకాంత్ తన ఫ్రెండు వేణుకి ఫోను చేసి విషయం వివరించాడు.వేణు ముందర వర్షకి కౌన్సెలింగ్ ఇప్పించమని సలహా ఇచ్చాడు.దాని వల్ల ఆమె మనసులో ఈ చర్య వల్ల గూడు కట్టుకున్న భయాన్ని కొంచమైనా తొలగించవచ్చని అతని ఆలోచన.అనుకున్నట్లే కౌన్సిలరుతో మాట్లాడాకా వర్షలో బెరుకు తగ్గింది.తరువాత వేణు ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఏమి చెయ్యాలో చెప్పి అవసరమయితే ఎప్పుడైనా ఫోను చెయ్యమని తన ఆఫీసు నంబరు కూడా ఇచ్చి వెళ్ళాకా వర్షతో పాటు ఇంట్లో అందరికీ ధైర్యం వచ్చింది.
తాముంటున్న అపార్టుమెంటులో, ఊళ్ళోనూ పెద్ద మనిషిగా చెలామణీ అయ్యే గంగాధరం గారు ఊరునుండి ఇంటికొచ్చినరోజే ఆయనలోని మరో కోణాన్ని ఇంటిలోని కెమేరాలు ఆవిష్కరించాయి.
మరునాడు భోజనం చేస్తున్న సమయంలో కాలింగ్ బెల్లు మ్రోగడంతో గంగాధరం గారు తలుపు తీసి,ఎదురుగుండా పోలీసులని చూసి తత్తరపడి,”ఎవరు కావాలి” అని లేని ధైర్యాన్ని నటిస్తూ అడిగారు.
“మీరే కావాలి సార్, ఇంక మీరు “పెద్దమనిషి” అనే ముసుగు తియ్యాలి,మిమ్మల్ని అరెస్టు చెయ్యడానికొచ్చాము,ఇదిగో మీ మీద ఇచ్చిన రిపోర్టు చూడండి” కఠినంగా అంది లేడీ కానిస్టేబుల్ స్వప్న.
“మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, అయినా నాకు మీ ఎస్సై తెలుసు, వాడు మా వాడి ఫ్రెండే, ఫోను చెయ్యమంటారా?” అని అడిగాడు బుకాయిస్తూ.ఇంతలో వేణూ వచ్చి “అంకుల్, మీరు నాకు ఫోను కూడా చెయ్యక్కర్లేకుండా నేనే వచ్చేసాను” అన్నాడు నవ్వుతూ,
“చూడు వేణూ, అసలు నేను ఏమీ చేసానని మీ వాళ్ళు నన్ను అరెస్టు చేస్తామంటున్నారు, పైగా నా మీద రిపోర్టుఇచ్చిందెవరు, ఏమని ఇచ్చారు?ఇక్కడెవ్వరినడిగినా చెప్తారు నేనెంత పెద్ద మనిషినో, అయినా నీకు తెలీనిదేముంది” అన్నారు ఆవేశంగా.
“మా ఇంట్లో ఉన్న మృగాడి మీద నేనే ఫిర్యాదు ఇచ్చాను” అన్న భాగ్యలక్ష్మి మాటలకి షాక్ కొట్టినట్లై ఆమె వంక చూసాడు గంగాధరం.
“భాగ్యం…నువ్వే..ఇలా చేస్తే….? అయినా నేను ఏమీ చెయ్యలేదు.అసలు నన్ను మీరందరూ కలిసి ఇరికించాలని ఎందుకు చూస్తున్నారు..? అంటూ ఇంకా ఏదో బుకాయించబోయాడు.
“తాతయ్యా..ఇంక బుకాయించకు, ఇంట్లో కెమేరాలు అబద్ధం చెప్పవు” అంటున్న వర్షకేసి చూసిన గంగాధరానికి నోట మాట రాలేదు అది చూపిస్తున్న కెమేరాలని చూసి. సూక్ష్మమైన కెమేరాలు హాల్లో షోకేసులో, బొమ్మల మధ్యా,గోడ మీద ఫ్రేముల మీదా అమర్చబడి ఉన్నాయి.
ఇంక తన బండారం బయట పడటంతో పోలీసులతో నడవక తప్పింది కాదు గంగాధరానికి.
ఈ హడావిడికి గుమిగూడిన ఇతర ఫ్లాట్ల పెద్దలు “పోనీ పెద్దాయన, ఏదో తప్పు చేసాడు, క్షమించి వదిలేయ్యమనీ,కాదూ కూడదంటే ఏ వృద్ధాశ్రమంలోనో ఆయనని చేర్పించాలని” సలహాలివ్వాలని చూసారు.
“మీకు అంత విశాల హృదయం ఉందేమో కానీ నాకు లేదు,ఈయనలాగ పెద్ద మనిషి అన్న ముసుగు ధరించి ఆడ పిల్లల మీద ఆకృత్యాలు చేసే వారిలో ఒక్కరిలో అయినా ఈయన వార్త మార్పు తేగలిగితే సంతోషం ” అని భాగ్యలక్ష్మి నిష్కర్షగా చెప్పడంతో ఇంక అక్కడ తమకేమి ఎంటర్టెయిన్మెంట్ లేదని భావించి ఎవరిళ్ళకి వారు వెళ్ళారు.
గంగాధరం గారికి పోక్సో చట్ట ప్రకారం శిక్ష పడేవరకూ పెద్ద పోరాటమే చేసింది ఆవిడ. శిక్ష అనుభవించాకా ఆయన ఒకవేళ ఇంటికొస్తే అప్పటికి తాను బ్రతికుంటే కట్టుకున్న భర్త అయినా సరే, ఆయనని ఇంట్లోకి రానీయనని కుండ బ్రద్దలుకొట్టి చెప్పేసింది భాగ్యం తన మీద జాలి చూపిద్దామని ప్రయత్నించిన వారందరికీ.
ఒక ఆదివారం నాడు తమ అపార్టుమెంటులో తల్లితండ్రులందరినీ ఇంటికి పిలిచాడు శ్రీకాంత్.అందరూ రాగానే మాట్లాడటం మొదలుపెట్టాడు.
“మనం డబ్బుల వెనకాల పరిగెడుతూ డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉంటాయి అని మరచి పోతున్నాము. ఆ విషయం మన పిల్లలు మనకి ఏదో ఒక రూపంలో గుర్తు చెయ్యాలని ప్రయత్నించినా పట్టించుకోలేనంతగా “బిజీ” అన్న ముసుగు వేసుకున్నాము మనం.మా ఇంట్లో జరిగిన సంఘటనే చూసారు కదా. వర్ష ఏడుస్తూ ఫోను చేసిన రోజే మేము మేల్కొని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు.కానీ అదృష్టమేమిటంటే ఈ పరిస్థితి చేయిదాటిపోకముందే మా అమ్మ చూపిన తెగువ.టీవీల్లో ఇలాంటి వార్తలు చూసి అక్కడెక్కడో ఇలాంటివి జరుగుతాయి కానీ మన ఇళ్ళల్లో పిల్లలందరూ క్షేమమే అన్న పిచ్చి నమ్మకాన్ని వదిలిపెట్టి పిల్లల్ని కాపాడుకుందాము.
ఈరోజుల్లో సొంత తండ్రిని,తోబుట్టువులనూ కూడా నమ్మలేని స్థితి.కనీసం ఒక్క అరగంట పిల్లలతో మాట్లాడండి రోజూ.
మార్కులు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తాయి. కానీ ఈ లోపు పిల్లలు మన మార్కుల హింస, వాళ్ళపై జరిగే లైంగిక హింస లేదా ఇతరత్రా ఒత్తిళ్ళు తట్టుకోలేక ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే?
టీవీలూ, ఇంటర్నెట్టు ఊరూరా విస్తరించిన ఈరోజుల్లో పిల్లల్ని పెంచడం కత్తిమీద సాము.
ఆడ,మగ పిల్లలన్న తేడాలేదు, రకరకాల ప్రలోభాలతో వాళ్ళని ఆకర్షించి ఉచ్చులోకి దింపడానికో లేదా లైంగిక హింసకి గురి చెయ్యడానికో గుంట నక్కలు కాచుకుని ఉన్న రోజులివి కానీ పిల్లలు మనతో ఏ విషయాన్నైనా స్వేఛ్చగా పంచుకోగలిగే వాతావరణాన్ని కల్పిద్దాము,అప్పుడే వారికి తమ గోడు వినడానికొకరున్నారు అన్న భరోసా కల్పించినవాళ్లమవుతాము.మార్పు మనతోనే మొదలుపెడదాము. ఏమంటారు?” అంటూ ముగించిన శ్రీకాంతుకి అందరూచప్పట్లతో తమ అంగీకారాన్ని తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *