May 17, 2024

అర్చన 2020 – ధీరుడు

రచన: కట్టా రాంప్రసాద్ బాబు

పరుగెత్తి, పరుగెత్తి అలసిపోయాడు.
కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఒళ్ళంతా చమట పట్టేసింది. ఒంట్లో నుంచి ఆయాసం తన్నుకొస్తుంది. ఒకటే టెన్షన్‌ ఏమవుతుందోనని. కాళ్ళకు చెప్పుల్లేకపోవడం, దారికూడా రాళ్ళూ, రప్పలతో నిండి వుండటంతో పాదాలు పుండ్లుపడిపోయాయి. అసలా సమయంలో ఏదీ ఆలోచించే స్థితి లేదు. ముందు అక్కడ నుంచి కదలాలి అనే అలోచన తప్ప మనసులోకి ఇంకోటి రాలేదు. ఇంక ముందుకు కదల్లేని పరిస్థితి.
ఓ చెట్టుకింద ఆగిపోయి అక్కడే కూలబడిపోయాడు. నోరంతా పిడచకట్టుకు పోయింది. ఎక్కడా నీటి జాడలేదు. అలాగే ఆయాస పడుతూ కాసేపు కూర్చున్నాడు. ఎక్కువ సేపు కూర్చోడం మంచిది కాదని మళ్ళీలేచి వేగంగా నడవటం మొదలెట్టాడు. కొంచెం దూరం వెళ్ళే సరికి బావి కన్పించింది. నీళ్ళు తోడుకోడానికి చేద కూడా వుంది. చేదనిండా నీళ్ళుతోడుకుని కడుపునిండా తాగాడు. అప్పుడు గానీ గుర్తుకు రాలేదు ఉదయం నుంచీ ఏమీ తినలేదని. ఆ సమయంలో ఏదైనా తినాలని కూడా అన్పించలేదు. అక్కడే వుంటే ఎవరైనా చూస్తారని, చూస్తే ప్రమాదమని తన పని పూర్తియిన వెంటనే అక్కడి నుంచి పరుగందు కున్నాడు.
ఓ ఫర్లాంగ్‌ వెళ్ళేసరికి మెయిన్‌ రోడ్‌ కనిపించింది. హమ్మయ్య అనుకుంటూ ఓసారి జేబు తడుముకున్నాడు 100 రూపాయల నోటు తగిలింది. అక్కడికి చేరుకుని కొంచెం దూరంలో వున్న బస్టాప్‌ దగ్గరకు వెళ్ళి నిబడ్డాడు. అరగంట తర్వాత బస్సొచ్చింది. అదెక్కిన గంటకు తను చేరాలను కున్న చోటుకి చేరుకున్నాడు.
సమయం మద్యాహ్నం రెండు గంటలు కావొస్తుంది. బాగా ఆకలి వేస్తుంది. పక్కనేవున్న టీ బంకులో రెండు బన్నులు తిని టీ తాగాడు. అక్కడ నుంచి తను వెళ్ళానుకున్న ఆఫీసుకి ఆటోలో చేరుకున్నాడు. లోపలి కెళ్ళా లంటే భయం వేసింది అక్కడున్న వాళ్ళని చూసి. అయినా సరే ధైర్యంచేసి ముందుకడుగు వేసాడు. వెళ్ళనివ్వకుండా ఆపేసారు.
‘‘ఎక్కడికి’’ అందులో ఒకడడిగాడు.
‘‘సార్‌ని కవాలి’’
‘‘ఏసార్‌ని’’ అడిగాడింకొకడు.
‘‘పెద్ద సార్‌ని’’
‘‘ఎందుకు?’’
‘‘ఆయనతో మాట్లాడాలి’’
‘‘ఏం మాట్లాడతావు’’
‘‘ఆయనకే చెప్పాలి’’
‘‘నువ్వెవరివని చెప్పాలి’’
‘‘మహారాజపురం నుంచి వచ్చానని చెప్పండి.’’
అదిరి పడ్డారు అక్కడున్న వాళ్ళంతా.
‘‘ఏమిటీ!! మహారాజపురమా? ఆ వూరా నీది’’ ఆశ్చర్యంగా అడిగారు.
‘‘అవును’’. అప్పటికే ఒకడెళ్ళి పెద్ద సార్‌కి చెప్పి రెండునిముషాల్లో తిరిగొచ్చి ‘‘లోపలికెళ్ళు సార్‌ రమ్మంటున్నారు’’ అంటూ అతని వెంట ఆయన రూము వరకు తీసుకెళ్ళాడు.
లోపలికి భయం భయంగానే వెళ్ళాడు. అక్కడ కూర్చున్న ఆయన్ని చూస్తే ఇంకా భయం కలిగింది. టేబిల్‌ మీదున్న నేమ్‌ప్లేటు మీద ‘సింహా’ ఐ.పి.ఎస్‌ అనే పేరుంది. నిజంగా సింహంలాగే వున్నాడాయన.
లోపలి కొచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు ఎస్పీ సింహా.
పదిహేడు సంవత్సరాల వయసున్న కుర్రాణ్ణి చూసి ‘ఈ అబ్బాయా వచ్చింది’ అనుకున్నాడు. మహారాజపురం నుంచొచ్చాడంటే డిపార్ట్మెంటుకు ఉపయోగపడే సమాచారం దొరుకుతుందనుకున్నాడు.
‘‘ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు’’ అనడిగాడు కొంచెం కోపంగా.
‘‘నేను కూర్చోవచ్చా’’ చాలా అసటగా వుండటంతో అడిగాడు.
‘‘కూర్చో’’ సర్దుకుని కుర్చున్నాడా కుర్రాడు.
‘‘ఇప్పుడు చెప్పు’’
‘‘సార్‌! నాపేరు వీరబాబు. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. మాది మహారాజపురం సార్‌. పూర్వం గొప్ప గొప్ప మహారాజులు పరిపాలించిన రాజ్యంలో మావూరుండేదట. అందుకే దానికా పేరొచ్చింది సార్‌. కానీ అంత మంచి పేరున్న వూరు ఈరోజు ఎంతో చెడ్డపేరు తెచ్చుకుంది సార్‌.’’
‘‘దానికి కారకు లెవరంటావ్‌’’
‘‘అంతా సార్‌’’
‘‘అంతా అంటే?’’
‘‘అంతా అంటే…….. ప్రభుత్వం, రాజకీయనాయకులు, చట్టాలు, న్యాయవ్యవస్ద….. పోలీసులు ….. అంతా సార్‌.’’
వీరబాబు అలా అన్నాకూడా సింహాకి కోపం రాలేదు. వీరబాబు దగ్గర నుంచి విషయాలు రాబట్టాలని చూస్తున్నాడు.
‘‘అంటే మీవూరిని నువ్వు చెప్పిన వాళ్ళంతా నాశనం చేసారంటావ్‌.’’
‘‘నిజం కాదాసార్‌. మావూరీ రోజు అట్టుడిగి పోతుందంటే నేను చెప్పిన వాళ్ళంతా కారణం కాదంటారా చెప్పండి.’’
‘‘అంటే మా పోలీసులు కూడా కారణమంటావా’’ అన్నాడు కూల్‌గా.
‘‘అవునంటే మీకు కోపం వస్తుంది కానీ మీరేచెప్పండి సార్‌ నిజం కాదంటారా’’
సింహా ఏమీ మాట్లాడలేదు. ఈ కుర్రాడు మాట్లాడే దానిలో వాస్తవం వుంది కదా అనుకున్నాడు.
అసలీ కుర్రాడెందు కొచ్చినట్లు?
మహారాజపురంలో జరిగినవి మామూలు సంఘటనలు కావు. చాలా ఘోరాతి ఘోరమైన సంఘటనలు. సభ్యసమాజం సిగ్గుపడేలాంటి సంఘటనలు. ఎవరు చేసారో అంతు బట్టని సంఘటనలు. పోలీసులకు సవాలుగా నిలిచాయవి.
మానభంగాలు, హత్యలు, దహనాలు ఇలాంటి వన్నీ నెలరోజుల్లో వరుసగా జరగడమే కాదు ఎవరూ వూహించని విధంగా వుండేవి. వాటిని చేసిన వాళ్ళకి కూడా వెంటనే వూహించని విధంగా శిక్షలు పడేవి. వాటికి సూత్రధారులెవరో, పాత్రధారులెవరో తెలియక పోవడమే కాదు చిన్న పాటి సాక్ష్యం కూడా లేని పరిస్థితి.
వీడికేమన్న తెలిసుంటుందా? ఆ విషయాు చెప్పడానికొచ్చాడా? లేక చిన్న పిల్లల చేష్టల్లాగ ఆవూరు పేరు చెప్పుకుని తన దగ్గర కొచ్చాడా అనే సందేహం కూడా కలిగింది ఎస్పీ సింహాకి. అయినా శాంతంగా ‘‘చూడు వీరబాబూ! నువ్వెందు కొచ్చావో నాకు చెప్పలేదు. నాకు చాలా పనుంది. మీవూళ్ళో జరుగుతున్న సంఘటన గురించే హోం మినిష్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ వుంది. ఈ రోజు ఉదయం ఆస్వామిజీ ఆశ్రమంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి, ఇంతవరకు జరిగిన పరిణామాల గురించి కూడా చర్చించడానికి మా డి.జి.పి గారు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసారు.’’
‘‘ఎందుకు సార్‌ ఆ కాన్ఫరెన్సు. ఏం ఉపయోగం చెప్పండి. ఎవరూ ఏం చేయలేరు. రాజకీయ నాయకులు మీ పోలీసుల్ని స్వేచ్చగా పని చేసుకోనివ్వరు. ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వాటిని ఆపలేకపోతున్నారు. మావూరన్న మాటేమిటి రాష్ట్రంలోను, దేశమంతా కూడా ఇలాంటివి జరుగతూనే వున్నాయి. అంతా ఏం చేస్తున్నారు చెప్పండి. రాజకీయనాయకులు ఆ సంఘటల్ని పావుగా వాడుకుని మీది తప్పంటే మీది తప్పని వాదులాడుకుంటున్నారు. పోలిసు లేమో మా పరిధిలోది కాదంటే మా పరిధిలోది కాదని తప్పించుకుంటున్నారు. ఈలోపల జరగవసిందంతా జరిగిపోతుంది. మావూరే తీసుతీసుకోండి. అక్కడ నాుగు మానభంగాలు జరిగాయి వాళ్ళని అతి కిరాతకంగా చంపేసారు. వాటికి బాధ్యులెవరో పోలీసులకూ తెలుసు, ప్రభుత్వానికీ తెలుసు. అయినా వాళ్ళని తూతూ మంత్రంగా అరెస్ట్‌ చేసి బెయిలిచ్చి వదిలేసారు. వాళ్ళు మీ దగ్గరున్నా బాగుండేది. వారేమో బయటకొచ్చి శిక్ష అనుభవిస్తున్నారు. ఆస్వామిగాడు మావూళ్ళో ఎంతో మంది ఆడాళ్ళని పాడుచేసాడు. వాడు చేసిన పాపాలకు ఈ రోజు అగ్ని ప్రమాదంలో సగం కాలిపోయి చావుబతుకుల మధ్య హాస్పిటల్లో వుండుంటాడు. బాధితలకు ఇలాగే న్యాయం జరగాలి తప్ప మీరెవ్వరివల్లా కాదు సార్‌’’ అన్నాడు వీరబాబు ఉద్రేకంగా.
‘‘అంటే చట్టాల్ని మావూరి వాళ్ళే తమ చేతుల్లోకి తీసుకుంటారా? మరిమేమున్న దెందుకు’’
‘‘నేరస్థుల్ని కాపాడటానికి’’ అన్నాడు టక్కున.
దాంతో సింహాకి చాలాకోపం వచ్చేసింది.
‘‘ఏంటి నువ్యనేది. కుర్రాడివని వూరుకుంటుంటే నీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావే.’’
వీరబాబు టేబుల్ మీద తలపెట్టుకుని ఒక్కసారిగా బావురుమన్నాడు. చాలాసేపు వెక్కివెక్కి ఏడ్చాడు. దాంతో ఎస్పీగాకికి మతిపోయింది.
‘‘ఏంటి వీరబాబు! ఎందుకలా ఏడుస్తున్నావు’’
‘‘ఆ బాధిత కుటుంబాల్లో మాకుటుంబం కూడా వుంది సార్‌’’ అన్నాడు బెక్కుతూ.
‘‘అవునా?’’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘అవునుసార్‌. అసలు ఏం జరిగిందో చెబుతాను వినండి. మాది చాలా పేద కుంటుంబం సార్‌. మానాన్న కూలి పనులు చేస్తాడు. మా అమ్మ నాలుగిళ్ళలో పనులు చేస్తుంది. వాళ్ళకి నేను, చెల్లి పిల్లలం. చెల్లెలికి అయిదు సంవత్సరాలు. అందరికీ అదంటే ప్రాణం సార్‌. అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాం. ఆనందంగా జరిగిపోతున్న మా కుటుంబం లోకి మా సర్పంచి కొడుకు రాహువులా వచ్చి మా చెల్లెల్ని అతికిరాతకంగా రేప్‌ చేసి చంపేసాడు సార్‌’’ అంటూ మళ్ళీ బావురుమన్నాడు వీరబాబు.
‘‘నిజమా!!!!’’
‘‘అవును సార్‌ మాచెల్లెల్ని వాడు స్కూలు నుంచి వస్తున్నప్పుడు బలవంతంగా బండెక్కించుకుని ఫామ్‌ హౌస్‌కి తీనుకెళ్ళడం, పాడుచేసి చంపేసి బండి మీద తీసుకొచ్చి రోడ్‌ పక్కన పారెయ్యడం కొంతమంది చూసారు. చూసిన విషయాన్ని ధైర్యంగా చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. ఎందుకంటే సర్పంచి కోటేశ్వరుడు. డబ్బుతో అన్నీ కొనగల సామర్థ్యమున్న వాడు. అందుకే వాడి కొడుకు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. వాణ్ణి పోలీసులు అరెస్ట్‌ చేసి బెయిలిచ్చి వదిలేసారు. వాడి కింకేం భయం చెప్పండి అచ్చోసిన ఆబోతులా తిరుగుతున్నాడు.’’
‘‘అందుకేనా వాణ్ణి కాళ్ళూ, చేతులు విరగ్గొట్టి ఎందుకూ పనికి రానివాడిగా తయారు చేసారు మీవూరివాళ్లు.’’
‘‘అవును సార్‌ జీవితాంతం వాడు కుమిలి, కుమిలి ఏడవాలి. వాడికి నడవడానికి కాళ్ళు లేవు, తింటానికి చేతుల్లేవు. వాడు జీవితాంతం చాలా నికృష్టమైన జీవితం గడపాలి.’’ అన్నాడు కసిగా.
‘‘ఎవరంటావ్‌ వాడికలాంటి శిక్షవేసింది’’?
కొంచెం సేపు నిశ్శబ్దం తర్వాత నెమ్మదిగా అన్నాడు వీరబాబు ‘‘నేనే సార్‌!!
‘‘నేనే వాణ్ణిలా తయారు చేసాను. ముందసలు వాణ్ణి చంపేద్దామనుకున్నాను. చంపితే ఆబాధవాడు కొంచెం సేపే అనుభవిస్తాడు. ఆబాధేమిటో వాడు జీవితాంతం అనుభవించాలి. అందుకే వాడు ఒంటరిగా దొరికినప్పుడు దొంగ దెబ్బతీసాను. ముందు కర్రతో వాడి వెనుక నుంచి తలుమీద బాదాను పెద్దకేక వేసి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పెద్ద బండరాయితో వాడి కాళ్ళు, చేతుల్ని పచ్చడి పచ్చడి చేసాను అవింక పనికిరావు. అసలు వాడి మర్మాంగాన్ని కోసేద్దామన్నంత కక్ష ఏర్పడిరది కానీ అలా చేస్తే వాడు చస్తాడని ఆపని చేయలేదు. వాణ్ణి చూసిన వాళ్ళకి అలాంటి తప్పుచేస్తే శిక్ష ఎలావుంటుందో తెలియాలి సార్‌.’’
‘‘అంటే చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావన్న మాట’’
‘‘తీసుకోకపోతే వాడి చేతిలో నాచెల్లెళ్ళలాంటివారు చాలా మంది బలయిపోతారుసార్‌. నా చెల్లి అలా అయిపోయినందుకు నా తల్లిదండ్రులు మంచం పట్టారు సార్‌. వీళ్ళ దుర్మార్గాలకు బయిపోయిన వారినీ మీరు రక్షించలేరు, వాళ్ళనూ శిక్షించలేరు. అందుకే వీడొక్కణ్ణే కాదు మిగిలిన వాళ్ళని కూడా ఇలాగే చేసాను.’’
ఉలిక్కి పడి ‘‘అంటే…..’’
‘‘అవునుసార్‌ మావూళ్ళో అలాంటి వెధవ పనులు చేసినవాళ్ళకి బుద్ది చెప్పడానికి అలాంటి శిక్షలే వేసాను. శిక్ష వేయ్యడానికి నువ్వెవరు అనకండి. మీరెలాగూ వెయ్యలేరు. ఎవరొకరు వెయ్యకపోతే వాళ్ళంతా పేట్రేగిపోతున్నారు కదా. పనీ పాటా లేని ఓపనికి మాలిన వెధవొకడు మాపెద్దమ్మ కూతుర్ని ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకుంటానని చెప్పిదానికి కడుపుచేసాడు. అది ఇంట్లో చెబుతుందేమోనని దాన్ని పీకపిసికి చంపేసి కాలువలో పారేసాడు అలాంటి వాడికి బుద్ది చెప్పొద్దామరి. అందుకే వాణ్ణీ కాళ్ళు చేతులు విరిచేసి దేనికి కూడా పనికి రాకుండా చేసేసాను.
ఆ స్వామీజీగాడు మావూళ్ళో ఆశ్రమం కట్టుకుని ప్రజలధన, మాన, ప్రాణాలతో ఆడుకుంటున్నాడు వాడికి రాజకీయ నాయకులు, అధికారులు పాదపూజు చేస్తుంటారు. వాళ్ళకి మీరు రక్షణకల్పిస్తుంటారు. వాడెంతో మంది ఆడాళ్ళ శీలాన్ని దోచుకున్నాడు. ఎవరూ బయట చెప్పుకోలేని పరిస్థితి. మా మామయ్య కూతురికి పిల్లలు లేక పోతే పూజలు చేసి సంతాన భాగ్యాన్ని కలిగిస్తానని మాయమాటు చెప్పి దాన్ని మాన భంగం చేసి చంపేసాడు. అలాగే మా బందువుల అమ్మాయినీ రేప్‌ చేసి చంపేసి శవాలను ఊరికి దూరంగా పారేయించాడు. దెబ్బలన్నీ మా కుటుంబానికే తగులు తున్నాయి సార్‌.
వాళ్ళు పోయి పదిరోజుయ్యిందిసార్‌. జరిగిన విషయాలన్నీ ఎలా తెలుసని అడక్కండి. ఇలాంటి వన్నీ పల్లెటూళ్ళలో ఈజీగానే తెలుస్తాయి. ఆ స్వామీజీగాడి ఆగడాలకు స్వస్తి పలకానుకున్నాను. అయితే వాడు అందరిలాగా బయటదొరకడు. అందుకే వాడి ఆశ్రమంచుట్టూ తెల్లారకుండా కిరసనాయిు జల్లి నిప్పుపెట్టాను. ఈ ఉదయమే చేసానా పని. అది పూర్తిగా కాలిపోకుండా జనం మేల్కోనడంతో ఆ వెధవ సగం కాలిపోయి బతికాడు. వాడు బతికినా స్వామిజీ అవతారం ఎత్తలేడుగా. కాలిన గాయాతో జీవితాంతం చిత్రవధ అనుభవిస్తాడావెధవ. ఆ సమయంలో నేనక్కడవున్నాను కాబట్టి నన్ననుమానిస్తారనే ఉద్దేశంతో పరుగందుకుని అడ్డదారిలో మీదగ్గరకు వచ్చి విషయాలన్నీ మీకు చెప్పాలను కున్నాను. అందుకే వచ్చాను.’’
‘‘ఇంత సాహసం ఎందుకు చేసావురా నువ్వు’’
‘‘ఎవరోకరు సాహసం చేయకపోతే అలాంటి వెధవలకు ఎవరు బుద్దిచెబుతారుసార్‌. అసలు సమాజం ఎలాబాగు పడుతుంది చెప్పండి. నేనేమైనా పర్వాలేదనుకుని ఈసాహసం చేసాను.
అయినా నేనేమవుతాను సార్‌. నేనింకా మైనర్‌నే కదా. మైనర్‌ రేప్‌ చేసి చంపేస్తేనే వాడిని వదిలేసిన న్యాయవ్యవస్థమనది. నన్నూ అలాగే వదిలేస్తారు. నేను ఎవర్నీ చంపలేదుగా. అయినా ఇవన్నీ నేనే చేసాననడానికి సాక్ష్యాలు కూడా లేవు నేను చెప్పడం వల్లే మీకు తెలిసింది. నేనిలా చేసానని ఎవరికైనా చెప్పినా, లేదా చదివినా అసహజంగా అనిపించ వచ్చు. ఇప్పుడు ఏపని చెయ్యడానికైనా పెద్దా, చిన్న అనే తారతమ్యం లేకుండా ఎవరికి తోచింది వాళ్ళు చేసేస్తున్నారు. అందుకే మన సమాజంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
నేను తప్పేచేసాను సార్‌. నన్నేం చేస్తారో చెయ్యండి. అన్నింటికి సిద్దపడేనేనిక్కడకు వచ్చాను. మా వూరికున్న వూర్వపు వైభవం రావాలి. అదే నాకోరిక. ఇలాంటి వెధవలున్న మా వూరు కొంత కాలం తర్వాత అధోగతి పావుతుంది. అది మళ్ళీ మహారాజభోగం పొందాలి. అందుకే నేనింత సాహసం చేసాను. ప్రతీవూళ్ళోను నా లాంటి వాడొకడు అక్కడున్న చీడ పురుగుల్ని ఏరేస్తే అన్ని గ్రామాలే కాదు మొత్తం దేశమే బాగుపడుతుంది, ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారను కోవడం భ్రమేకదా’’ అన్నాడు వీరబాబు.
‘నిజంగా నువ్వు థీరోదాత్తుడిరా’ అని మనసులో అనుకుని తర్వాత ఏం చేయాలా అనే ఆలోచనలో పడ్డాడు ఎస్పీ సింహీ. % % % %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *