May 17, 2024

అర్చన 2020 – నాతి చరామి

రచన: పరిమళ పప్పు

ఆరోజు డాక్టర్ చెప్పిన మాటకి విని నా తల తిరిగినట్టు అయ్యింది. నేను తల్లిని కాలేను అని తెలిసి అవాక్కయ్యాను. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచే
మా వారికి నాతో విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు.
మొదట్లో వినలేదు కానీ ఎన్నాళ్ళని వినకుండా ఉంటారు, చెవిలో జోరీగ లాగా ఊదుతూ ఉంటే ఏ మనిషి అయినా మారకుండా ఉంటారు చెప్పండి?
అదే భయం నాకు కూడా పట్టుకుంది. అప్పటి నుంచి కంటికి నిద్ర లేదు, మనసుకి ప్రశాంతత లేదు, కడుపుకి ఇంత తిండి కూడా లేదు. ఏదో తినాలన్న పేరుకి నాలుగు మెతుకులు నోట్లో వేసుకుంటున్నాను అంతే. లేదంటే మళ్లీ ఇంటి పనులు అన్నీ చేయాలి కదా.
ఒకరోజు బాగా నీరసం గా అనిపించింది లేవలేక పోయాను. అంతే పొద్దునే లేచి పోరు పెడుతూనే ఉన్నారు అత్తయ్యా వాళ్ళు. ఇంత సేపు అయినా నిద్ర లేవకపోతే ఎలాగే, ఇంటి పనులు అన్నీ ఎవరు చేస్తారు అంటూ…
అంటే నేను ఈ ఇంట్లో పనులు చేయటానికి మాత్రమే ఉన్నానా? నాకంటూ ఇంకేమి లేదా? ఎందుకు ఈ జన్మ అనిపిస్తుంది ఒక్కోసారి.
అంతకుముందు వరకు బాగానే ఉండే అత్తయ్యా వాళ్ళలో ఒక్కసారిగా వచ్చిన మార్పు నేను తట్టుకోలేక పోతున్నాను. అప్పటి నుంచీ ఇంట్లో గొడవలు, ప్రతి దానికీ పెద్ద రభస చేయటం అందరికీ బాగా అలవాటు అయిపొయింది.

అందరూ కలిసి పోరు పెట్టు మరీ మా వారిని మరో పెళ్లికి ఒప్పించారు. “తనని కూడా అడగనీ అమ్మా ఒక మాట, పాపం తను ఏమనుకుంటుందో ఏమో”, అన్నారు మా వారు. ‘ఆ మాత్రం ప్రేమ ఉంటే చాలు’ అనుకున్నాను నేను.
మా వారు ఆఫీస్ కి వెళ్ళాక, ఇంట్లో అందరూ నా మీద పడి నన్ను నానా మాటలు అనటం మొదలు పెట్టారు. “నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మాకు శని పట్టుకుందే, దరిద్రపు మొహం దానా ఎక్కడ దాపురించావే” అంటూ ఒకరు..
“అదే నీ స్థానంలో నేను ఉంటే ఎప్పుడో ఇల్లు వదిలేసి, వెళ్లిపోయే దానిని” అంటూ ఒకరు…
“నాకే కనుక పిల్లలు పుట్టరు అని తెలిస్తే, నేనే మా ఆయనకి వేరే పెళ్లి చేసేదాన్ని, లేదంటే ఏ నుయ్యో గోయ్యో చూసుకుందును” అంటూ ఒకరు..
ఇలా సూటి పోటి మాటలతో నన్ను చిత్రవధ చేయటం మొదలు పెట్టారు.
లోపం నాలో ఉంది కాబట్టి సరే, అదే తనలో ఉంటే నేను కూడా మరో పెళ్లి చేసుకోవచ్చా??
అదే మాట నేను అనగలనా? అంటే ఎంటి నా పరిస్థితి?
“ఏ పిల్లలు లేకపోతే చచ్చిపోతావా, ఈ లోకంలో ఎంతమంది పిల్లా జల్లా లేని వాళ్ళు ఉన్నారు. నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు, అది చాలు నీకు” అంటారు.
ఎందుకు ఇలా? ఆడదానికి ఒక న్యాయం, మగవాడికి ఒక న్యాయమా? ఇప్పుడు నా పరిస్థితి కాను,నేను ఎక్కడకని వెళ్ళను, అసలే ఆరోగ్యం బాగా లేని అమ్మ నాన్నలకి నేను మరొక భారం కాలేను.

ఇలాంటి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కి పోయింది. బాగా ఏడ్చి ఏడ్చి ఎప్పుడో పడుకున్నాను. నిద్రలో మంచి ఆలోచన ఒకటి వచ్చింది. ఎవరి మీదనో ఆధారపడి బ్రతకటం దేనికీ. నాకంటూ ఒక జీవితాన్ని నేను ఏర్పరచు కోగలను. నాకు చదువు ఉంది, నా చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకుంటూ ఎలాగోలా బ్రతకాలని నిర్ణయించుకున్నాను.
మర్నాడు పొద్దునే మామూలుగా లేచి అన్ని పనులు పూర్తి చేశాను. నా బట్టలు అన్నీ సర్ది పెట్టుకున్నాను. మా వారు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. ఎవరు లేని సమయం చూసి
నేను వెళ్లి రెడీ అయ్యి, నెమ్మదిగా అక్కడి నుంచి బయటకి వచ్చేసాను.
ముందుగా ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో చేరాను. అక్కడ నా వివరాలు చెప్పి నా కోసం ఎవరైనా వస్తె చెప్పద్దు అని కూడా చెప్పాను.
********
సాయంత్రం శ్రీహరి ఇంటికి వచ్చేసరికి “హమ్మయ్య దరిద్రం వదిలి పోయింది” అంటుకుంటూ ఉన్నారు ఇంట్లో అందరూ. శ్రీహరి కి వస్తూనే శిరిషా అంటూ పిలవటం అలవాటు. అదే అలవాటుగా పిలుస్తున్నాడు. కానీ ఎవరు ఏమీ పలక లేదు. సిరి కోసం ఇల్లంతా వేతికాక గదిలో తను రాసి పెట్టిన ఉత్తరం కనిపించింది.
ప్రియమైన శ్రీవారికి,.
మీతో పెళ్లి అయిన మరుక్షణం నుంచి మీరే నా ప్రపంచం అని అనుకున్నాను. మీ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచే ఇదే నా లోకం అనుకున్నాను. నా పుట్టినింటిని సైతం మరచిపోయాను. కానీ నాకు కలిగిన ఒకే ఒక్క లోపం వల్ల ఇప్పుడు మీ అందరికీ నేను కానీ దాన్ని అయిపోయాను. అందుకే ‘నా అనుకునే’ మీ ప్రపంచం నుంచి బయటకి వెళ్ళిపోతున్నాను. మీరు మీ అమ్మ గారు కోరుకున్నట్లు మరో పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. నా కోసం వెతకకండి.
ఉంటాను కాదు కాదు వెళ్తాను. ఇక మళ్ళీ మీకు కనపడను.
ఇట్లు,
మీ అర్ధాంగి కాలేకపోయిన మీ భార్య..
ఆ ఉత్తరం చదివి హతాశుడయ్యాడు శ్రీహరి. వెంటనే వాళ్ళ అమ్మతో, నాకు శిరీష కావాలి అమ్మా, నేను వేరే పెళ్లి చేసుకోను. నాకు పిల్లలు అవసరం లేదు. నాకు సిరి, సిరి కి నేను మాకు వేరే పిల్లలు వద్దు. పెళ్లి లో తనకి “నాతిచరామి” అని ప్రమాణం చేశాను. అంటే ఈ జీవితాంతం కష్టం లో సుఖం లో తనకు తోడు నీడగా ఉంటాను అని తనకి ఒట్టు వేసాను. ఇప్పుడు అది నిలబెట్టుకోలేకపోతే ఇంక ఆ మంత్రాలకు అర్థం ఏముంది? నా వాగ్దానానికి విలువ ఏముంది?
నేను ఇప్పుడే శిరీష కోసం వెళ్తున్నాను, వస్తె సిరి తోనే ఇంటికి వస్తాను. ఒకవేళ అలా కానీ పక్షంలో నేను కూడా తన కోసం వెతుకుతూ ఉండిపోతాను కానీ నా భార్యకు స్థానం లేని ఈ ఇంట్లో అడుగు పెట్టను. అని అక్కడ అందరికీ గట్టిగా చెప్పి వచ్చేశాడు శ్రీహరి అక్కడ నుంచి.
బయటకి వచ్చి తెలిసిన చోటల్లా శిరీష కోసం వెతకటం ప్రారంభించాడు. తనకి తెలిసిన శిరీష స్నేహితులు అందర్నీ అడిగాడు. అలా వెతుకుతూ ఉండగా శిరీష స్నేహితురాలు ఒకరు శిరీష ఉన్న హాస్టల్ గురించి చెప్పింది శ్రీహరి కి.
వెంటనే శ్రీహరి ఆ హాస్టల్ కి వెళ్ళాడు. కానీ శిరీష ముందే వార్డెన్ కి తన గురించి చెప్పవద్దు అని చెప్పటం తో శిరీష వివరాలు చెప్పటానికి నిరాకరించారు హాస్టల్ వాళ్ళు. అదే సమయంలో ఎక్కడకి వచ్చిన శిరీష స్నేహితురాలు జరిగేది చూసి శిరిషకు చెప్పింది.
దూరంగా ఉండి అక్కడ జరుగుతున్నది అంతా చూసిన శిరీష, తన భర్త రాకకు కారణం అర్థం తెలుసుకుంది. తన మీద ఉన్న ప్రేమ తో ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ వచ్చినట్టు అర్థం చేసుకుంది. ఇంకా శ్రీహరిని బాధ పెట్టడం ఇష్టం లేక తానే వెళ్లి శ్రీహరి నీ కలిసింది.
శిరీషనీ చూడగానే కొత్తగా అనిపించింది శ్రీహరికి. అందరూ ఉన్నారు అని కూడా చూడకుండా హత్తుకున్నాడు తనని. శ్రీహరి చేసిన పనికి శిరీష కు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
శిరీష కన్నీళ్లు తుడుస్తూ, “నువ్వు లేకపోతే నేను ఉండగలను అనుకున్నావా, నీ తోడుగా నీడగా ఉంటాను అని చేసిన ప్రమాణాలను మర్చిపోయాను అనుకున్నావా? నువ్వే నా జీవితం సిరి, ఈ జన్మకు నువ్వు చాలు నాకు, మనకొక పిల్లలు వద్దు నీకు నేను నాకు నువ్వు పిల్లలం అంతే.. నువ్వు నా ప్రాణం శిరీష”
అంటూ ప్రాధేయ పడుతున్న శ్రీహరి నీ చూసి మనసులో చిన్న అనుమానం కలిగింది శిరీష కి.
ఆ అనుమానాన్ని అర్థం చేసుకున్నట్టుగా శ్రీహరి, “మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు నా అమ్మ వాళ్ళు చెప్తే మరొక పెళ్లికి ఎందుకు సరే అన్నాను అనే కదా నీ అనుమానం. అలా ఒప్పించి ఇక పెళ్లి చూపులకి అంటూ నాకు తెలిసిన అమ్మాయిని పెట్టు, తన ద్వారా అమ్మ వాళ్లకి కనువిప్పు కలిగేలా చేద్దాం అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. నన్ను క్షమించి, నాతో రా సిరి” అని బ్రతిమాలాడు.
శ్రీహరి ప్రేమకు కరిగిపోయిన సిరి తనతో వెళ్ళింది. శ్రీహరి కి తన భార్య మీద ఉన్న ప్రేమని చూసిన ఇంట్లో వాళ్ళు అందరూ మరోసారి వేరే పెళ్లి ప్రస్తావన ఏమి తీసుకుని రాలేదు. అంతే కాకుండా అందరి అంగీకారంతో వాళ్ళు ఒక అనాధాశ్రమం నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకుని పెంచుకోసాగారు.

*******

1 thought on “అర్చన 2020 – నాతి చరామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *