May 17, 2024

అర్చన 2020 – పాచిక

రచన: నందిరాజు పద్మలత

ల్యాండ్ లైన్ ఫోను రిసీవర్ అప్పటికి పావుగంట నుంచీ రాజేశ్వరి చెవిని అంటిపెట్టుకునే ఉంది. ఈ మధ్య ఈ ఫోనుని వాడడం బాగా తగ్గిపోయింది. ఎప్పుడో తప్ప కాల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే హిమబిందు కి ఆశ్చర్యంగా ఉంది.
తల్లి వంకే చూస్తోంది. ఆవిడ ముఖంలో మారే రంగులు, భావాలు అర్థం కాక, సైగలతో అడిగింది బిందు, ఎవరు అవతలి వైపు అని. కానీ ఏకపక్షంగా సాగుతున్న ఆ సంభాషణలో, రాజేశ్వరి వినటంలోనే నిమగ్నమయి పోయి ఉంది. అయ్యో, అవునా,నిజమా లాంటి ఆశ్చర్యార్థకాలు తప్ప మరో మాట లేదు రాజేశ్వరి వైపు నుంచీ.
ఎట్టకేలకు ఫోన్ పెట్టేసింది రాజేశ్వరి. నీరసంగా వచ్చి సోఫాలో కూలబడింది.
“ ఎవరమ్మా? బాగా వాయించేశారుగా!
“ఏదో రాంగ్ నంబరు”
“రాంగ్ నంబరుతో అరగంట మాట్లాడావా? చెప్పమ్మా ఎవరూ?”
“ఏదోలే!” కూతురి వంక చూడకుండా, లేచి వంట గదిలోకి వెళ్లిపోయింది రాజేశ్వరి.
సాయంత్రం అయిదున్నర అవుతుండగా చక్కగా తయారయి బయల్దేరింది హిమబిందు.

“ఎక్కడికీ”
“మర్చిపోయావా అమ్మా…కేదార్ నీ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడుగా… ఇద్దరం అలా షికారు వెళ్ళొస్తామమ్మా…”
“వద్దొద్దు….”
అర్థం కాలేదు బిందుకి. కాబోయే భర్తతో మాట్లాడుకోవడానికి ప్రైవసీ కావాలని తెలియనంత అమాయకురాలు, చాదస్తురాలు కాదే! సరిగ్గా వారం క్రితమే నిశ్చితార్థం అయింది. వచ్చే నెలలోనే పెళ్ళి.
“అదేంటమ్మా…నిన్న వస్తానని చెప్పి, ఇవాళ ‘రాను’ అంటే, అతనేమనుకుంటాడు? ఏం అయ్యిందమ్మా?”
“ ఒద్దన్నాను. ఒద్దంతే . రావట్లేదు అని చెప్పేయి. వాదించకు.”
“ అది కాదమ్మా….ప్లీజ్…అతను నా కోసం ఎదురు…..”
“నువ్వు చెప్తావా…నన్ను చెప్పమంటావా….” కోపంగా అంది రాజేశ్వరి.
బిందు కళ్ళల్లో నీరు తిరిగాయి. లోపలికి వెళ్లిపోయింది.
***
“ఏవండీ…. ఇవాళ మధాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటి నుండి నా మనసు మనసు లో లేదు.” మధ్యాహ్నం కొంగున కట్టుకున్న నిప్పు కణికను విప్పింది రాజేశ్వరి.
చంద్రమౌళికి కూడా అనుమానంగానే అనిపించింది ఇంట్లో ఉన్నా అసహజ వాతావరణం. ఎప్పటిలాగా, బిందు నవ్వుతూ ఎదురు రాలేదు. తన గదిలోనే ఉండి పోయింది.
“ ఎక్కడి నుంచీ…”
“చెప్తాను. బిందు పడుకుందో లేదో చూసొస్తాను.”
“అక్కర్లేదులే….చూసే వచ్చాను. నిద్రపోతూంటే నేనే దుప్పటి కప్పి వచ్చాను. “
“ ఎవరోనండీ…సుందరిట. అరగంట పాటు చెప్తూనే ఉంది. చాలా చెప్పింది. మన బిందుకి కాబోయే భర్త కేదార్ గురించి చెప్పింది.” కంగారు ఆమె గొంతులో.
“ బాడ్ క్యారెక్టర్ అనా?”
“దాదాపు అంతే. వాళ్ళ అమ్మాయికి ఎనిమిది నెలల క్రితం ఈ కేదార్ నాథ్ తో నిశ్చితార్థం జరిగిందట. ఈవిడ వద్దన్నా వినకుండా అతను ఆ పిల్లని షికార్లకీ సినిమాలకీ తీసుకెళ్ళాడట ముందుగానే రెండు లక్షలు కట్నం కూడా తీసుకున్నారట. సరిగ్గా వారం రోజుల్లో పెళ్ళి అనగా ‘మీ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది, మాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నారట కేదార్ తల్లి,తండ్రి.’ ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోలేదట. పాపం! ఆ బాధ నుంచీ బయట పడడానికి చాలా రోజులు పట్టిందట వీళ్ళకి.”
షాక్ తిన్నాడు చంద్రమౌళి.
సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడికి ఇది పెద్ద కష్టమే! రెండేళ్ల క్రితం పెద్దమ్మాయికి పెళ్ళి చేసి అమెరికా పంపాడు. రెండో అమ్మాయిని కూడా ఓ ఇంటిదాన్ని చేస్తే, తన బాధ్యత అయిపోతుందని అనుకుంటే ఈ వార్తతో గుండె గుభేలుమంది. శుభలేఖలు కూడా వచ్చాయి ప్రెస్ నుంచీ. పెళ్ళి హాలు, వంట వాళ్ళూ, అన్నీ బుక్ చేయడం ఐపోయింది. పిలుపులే మిగిలాయి.
“ కానీ రాజీ… ఆవిడకి మన ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? బిందూ కి అతనితో కుదిరిందని ఎవరు చెప్పి ఉంటారు? అసలు ఆవిడకి మనతో ఏం సంబంధం? “
“అడిగానండీ! చెప్పింది. వాళ్ళు ఎంక్వయిరీ చేస్తే తెలిసిందట, అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయిట. అసలు ఆ కుటుంబమే అలాంటిదట. ‘మీ శ్రేయోభిలాషి గా చెప్తున్నాను. మరో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అని, చాలా కష్టపడి మీ నెంబర్ కనుక్కున్నాను అని’ ఏమేమో చెప్పిందండీ. అప్పటినుండీ నాకు మనసు మనసు లో లేదు.”
భర్త చెవిన వేశాక, రాజేశ్వరి గుండె బరువు కొంత తగ్గింది.
“కానీయ్. ఈ విషయాలేవీ బిందూకి తెలియనీయద్దు. చిన్నపిల్ల! బాధపడుతుంది. ఇందులో నిజమెంతో నేను కూడా ఎంక్వయిరీ చేస్తాను. నువ్వు తొందరపడకు.” భార్యతో చెప్పి, భోజనం పూర్తి కాకుండానే లేచాడు చంద్రమౌళి.
తన గది గుమ్మం దగ్గరే నిల్చుని అన్నీ విన్నది హిమబిందు.
“నాన్నా…అమ్మ ఎందుకింత డల్ గా ఉందో నాకిప్పుడర్థమైంది. నేనేమీ చిన్న పిల్లను కాదు. చూస్తూ చూస్తూ ఒక వంచకుడితో జీవితాన్ని పంచుకుంటానా? కేదార్ తో నేనే ముఖాముఖీ మాట్లాడుతాను. మీరు మనసు పాడు చేసుకోవద్దు.” గబగబ అని గిరుక్కున తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది.
భార్యాభర్తలిద్దరూ అవాక్కయ్యారు.
**
నేషనల్ హై వే మీద మెత్తగా దూసుకుపోతోంది ఇన్నోవా కారు.
“నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టమే. ప్లాన్ చేసిన నిన్నటి ప్రోగ్రాం కాన్సిల్ చేశావు. ఈ రోజు నువ్వే కాల్ చేసి లీవ్ పెట్టి రమ్మన్నావు. క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్….” నవ్వుతూ అన్నాడు కేదార్.
నవ్వలేదు బిందు.
“ఏమిటీ మూగనోము? రాణీగారికి అలకా?”
మౌనం వీడలేదు బిందు. కొద్ది దూరం వెళ్ళాక, ఊరి చివరికి వచ్చింది కారు.

“కారాపండి. ఎక్కడయినా కూర్చుని మాట్లాడుకుందాం.” ముక్తసరిగా అన్న బిందు మాటలకి కాస్త ఖంగు తిన్నాడు కేదార్.
భుజం మీద చెయ్యి వేసి, “ఎనీ థింగ్ సీరియస్?”
“ఎస్” చెయ్యి తీసి దూరం జరిగింది బిందు.
కొద్ది దూరంలో హై వే ప్రక్కగా కారాపాడు కేదార్. ఇద్దరూ అక్కడే చెట్టు క్రింద ఉన్న సిమెంటు చప్టా మీద కూర్చొన్నారు.
“రేఖ ఎవరు?” ఏ ఉపోద్ఘాతము లేకుండా అడిగింది బిందు
“ఏ రేఖ?”
“ఎందరు రేఖలు తెలుసేం? ప్రస్తుతానికి ఒక్క రేఖ చాలు. చెప్పండి. మీ పూర్వ ఫియాన్సీ . ఎంగేజ్మెంట్ అయ్యాక, మీరు వదులుకున్న శశిరేఖ .”
“నీకు…తన గురించి ఎలా తెలుసు?” ఆశ్చర్య పోయాడు కేదార్. నిజానికి బిందు అతను తత్తరపడి అవాక్కవుతాడనుకుంది.
“ ఆ విషయం తర్వాత. ముందిది చెప్పండి. ఆ అమ్మాయిని కాదన్నదెందుకు? నన్ను కావాలనుకున్నదెందుకు? మాకు ఈ విషయం తెలియకుండా దాచారెందుకు? ఎవరిని మోసం చేయాలని?” కోపం, దు:ఖం కలగలిసి ఆమె కళ్ళెరుపెక్కాయి.
“కమాన్…బిందూ…బీ కూల్…..చెప్పకూడదనేమీ లేదు. నీకు అవసరం లేదనుకున్నాను. నువ్వనుకునే అంత సీరియస్ కాదు కాబట్టి చెప్పాలనిపించలేదు. దట్సాల్ .”
చాలా కోపం వచ్చింది బిందూకి.
“ఎంత సీరియస్ కాకపొతే వాళ్ళు, మా ఫోన్ నెంబర్ తెలుసుకుని మరీ మీ చరిత్ర తెలియజేస్తారు? ఒక ఆడపిల్లని అలా మోసం చేసి మరో అమ్మాయికి తాళి కట్టేందుకు సిద్ధమయ్యారే … అరె…చదువుకున్నారు. మంచి జాబ్ చేస్తున్నారు అని పొరపడ్డారు మా వాళ్ళు..రియల్లీ అయాం సేవ్ డ్.” ఆమె ముక్కు పుటాలు ఆదరుతున్నాయి.
“మోసమా…నేనా…ఎవరిని చేశాను? ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? నాకు అర్థమయ్యేలా చెప్పు బిందూ.”
“ఏం చెప్పాలి? అప్పుడు రేఖని, ఇప్పుడు నన్ను. రేపెవరినో? ఎంత మందిని మోసం చేస్తారిలా ?”
“నీకు ఎవరేం చెప్పారో నాకు కాస్త స్పష్టంగా చెప్పగలవా బిందూ…. నేనెవరినీ మోసం చెయ్యలేదు. వాళ్ళు కాదు, మోస పోయింది మా కుటుంబం.”
కేదార్ మరీ మరీ అడిగాక, జరిగిన విషయం అంతా చెప్పింది హిమబిందు.
కాసేపు మౌనంగా ఉండి పోయాడు కేదార్.
“హిమబిందూ ! ఇలా జరగడం మంచిదయ్యింది. అవును. నీకు తెలియడమే మంచిది. విను. నాకు రేఖతో నిశ్చితార్థం జరగడం నిజం. అది విఫలం అవడం ఇంకా నిజం. తను నా లాగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కోసం మూడు సార్లు బయట తిరిగాం. ఇదీ నిజమే. బాగా షాపింగ్ చేసింది తను, నా కార్డు మీదే అనుకో. పెళ్ళి చీరలు, డ్రెస్సులు వగైరాలన్నీ కొనిపించుకుంది. ఇక వారంలో పెళ్ళి. మా ఇంట్లో అందరూ హడావిడిగా సందడిగా ఉన్న సమయంలో ఫోన్ చేసి రమ్మంది. ఇంటి నిండా మా బంధువులు, యు ఎస్ నుంచీ వచ్చిన కజిన్స్. వీలు కాదన్నా తను వినలేదు. తప్పక వెళ్లాను. ఇద్దరం పెద్దమ్మ గుడి లో కలిశాం. ‘నీకో షాకింగ్ వార్త కేదార్….అర్థం చేసుకుంటావనే నా నమ్మ్మకం ‘ అంది రేఖ.”
“ఊ…తర్వాత?” అడిగింది బిందు.
‘పర్లేదు చెప్పమన్నాను. చెప్పింది. నిజంగా షాకింగ్ న్యూసే. ‘తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, పేరు దినకర్ అని, తామిద్దరికీ నెట్ ఫ్రెండ్ షిప్ ఉందనీ , అతడినే తను పెళ్ళి చేసుకుంటాను’ అని. మరి ముందుగానే మీ వాళ్లకి ఎందుకు చెప్పలేదు అని అడిగితే, యు ఎస్ లో ఉన్న దినకర్ రెండు నెలల తర్వాత ఇండియా వస్తాను అన్నాడనీ, అతను కనుక రాకపోతే, ఇక తన గతి ఇంతే అని నాతో జీవితం పంచుకుందాం అనుకున్నానని, కానీ ఇప్పుడు అతను తన కోసమే భారతదేశం వచ్చాడని చెప్పింది. అంటే, నేను స్టెపినీని అన్నమాట. స్టాండ్ బై గా నన్ను ఉంచుకుంది. చాలా బాధపడ్డాను. అయినా, ఇంత వరకూ వచ్చాక పెళ్ళి రద్దయితే పరువు పోతుందని, దినకర్ని మరచిపోమని చాలా ప్రాధేయపడ్డాను. మరో ముఖ్య విషయం ఏమిటంటే, అప్పటికే తనకి ఇస్తాం అని మేము చెప్పిన నగల తాలూకు పది తులాల బంగారం కోసం మూడున్నర లక్షలు డబ్బు కూడా ఇచ్చేశాం. మధ్యతరగతి బ్రతుకులు కదా, డబ్బు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ, రేఖ ‘ససేమిరా’ అంది. కన్నీళ్ళతో వేడుకుంది.”
“ఏమని?” అడిగింది బిందు .
“తమ కులం కాని వాడిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పే ధైర్యం రేఖకి లేదు. చెప్పిందంటే, వాళ్ళు ఎట్టి పరిస్థితులలోనూ ఆమెను బయటకు రానివ్వరు, బలవంతంగా నాతోనే పెళ్ళి చేస్తారు. ‘ దయచేసి, మీరే ఏదో ఒకటి చెప్పండి. నేను మీకు నచ్చలేదని చెప్పెయ్యండి. పెళ్ళి కాన్సిల్ చేయండి.’ అంటూ ఏడ్చింది. బ్రతిమిలాడింది నేనూ ఆలోచించాను. మనసు లేని పెళ్ళి చేసుకుని ఏం సుఖపడగలను? అందుకే, తను చెప్పినట్లే చేశాను. నిజం తెలియని వాళ్ళ పెద్దవాళ్ళకి నా మీద చాల కోపం వచ్చింది. బాగా గొడవలయ్యాయి. కొన్నాళ్ళకి సద్దుమణిగాయి. అయితే, మేమిచ్చిన సొమ్ముతో కొన్న నగలేవీ వాళ్ళివ్వలేదు. అవి తీసుకుని దినకర్ తో వెళ్ళిపోయింది రేఖ. నాకు, మా అమ్మా నాన్నలకు తప్ప అసలు విషయం ఎవరికీ తెలియదు. ఆడపిల్ల జీవితం అల్లరి పాలు కాకూడదని మేము మౌనంగా ఈ రహస్యాన్ని దాచుకున్నాం. ఎందుకంటే నాకూ ఓ చెల్లెలుంది బిందూ! జరిగిందిది. నీ ఇష్టం! నమ్మాలంటే నమ్ము. మీకు ఎవరు ఏమేం చెప్పారో నాకు అనవసరం. నమ్మితే ముందుకు వెళ్దాం. లేకపోతే, ఇక్కడితో వదిలెయ్యి. ఫ్రెండ్స్ గా ఉందాం. “అతని స్వరంలో నిజాయితీ.
“ఇది నిజమని నమ్మేదెలా?” ఇంకా అనుమానంగానే ఉంది బిందుకి .
“నమ్మించేదెలా ? ఆగు. రేఖ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. “ అంటూనే డయల్ చేశాడు కేదార్.
“హాయ్ కేదార్! హవ్వార్యూ? ఎంత హ్యాపీగా ఉందో నువ్వు కాల్ చేస్తే! బట్, నాకు తెలుసు ఎప్పటికయినా నువ్వు నా కాంటాక్ట్ లోకి వస్తావని. “ రేఖ స్వరం స్పీకర్ లో నుంచీ బిందుకి స్పష్టంగా విన్పిస్తోంది.
“ఔనా ! థాంక్యూ …ఎలా ఉంది లైఫ్? నువ్వూ దినకర్ యు ఎస్ లోనేనా?”
“ఓ ! అయాం సో అన్ లక్కీ కేదార్. వాడొట్టి చీట్. పెద్ద ఫ్రాడ్. వాడు చదువుకున్న బ్రూట్. అన్ని కబుర్లు చెప్పాడా…ఇండియా వచ్చాక, ఏమన్నాడో తెలుసా!. ‘నువ్వింకా చాలా అందంగా ఉంటావనుకున్నాను. అయినా సరే! ఏదో అడ్జస్ట్ అవుతాను. యాభై లక్షలు కట్నం తెమ్మ’న్నాడు. ‘ ఇంకేం చేస్తాను? బ్రేక్ అప్ చెప్పి బయట పడ్డాను. నిన్ను మిస్ చేసినందుకు నేను ఎంత ఫీల్ అవుతున్నానో…” బాధగా అంది రేఖ.
“ రియల్లీ శాడ్ రేఖా…ఒకో సారి అంతే.! అనుకున్నట్లు జరగదు. బీ బ్రేవ్.” చెప్పాడు కేదార్.
“కేదార్! ఒక మాట చెప్పనా…. ముందు నుంచీ నువ్వంటే నాకిష్టం. కానీ, దినకర్ నీకన్నా క్వాలిఫైడ్. ఫారిన్ లో మంచి జీతం. అందుకే అటు మొగ్గాను. ప్లీజ్! నువ్వు పాత విషయాలు మనసులో పెట్టుకోవద్దు. లెటజ్ గెట్ మారీడ్. మా అమ్మతో చెప్పాను, నీ కోసం ట్రై చేయమని. ప్లీజ్! కేదార్! ఒక్క సారి మనం కూర్చుని మాట్లాడుకుందాం. నాకు తెలుసు నువ్వు ‘కాదు’ ఆనవు అని. లవ్యూ కేదార్….”ఇంకా ఏదో చెప్తూనే ఉంది రేఖ.
హిమబిందు, కేదార్ చేతిలో ఉన్న మొబైల్ ఫోనుని తీసుకుంది.
“మిస్ రేఖా…నేనెవరా అని ఆశ్చర్య పోతున్నట్లున్నావు కదూ…. నా పేరు హిమబిందు. కొద్ది రోజుల్లో మిసెస్ కేదార్ నాథ్ ని . పాపం మీరు చాలా కష్టపడి మా ఫోన్ నెంబర్ వెతికి మరీ కనుక్కున్నారు. మీ స్వార్థం కోసం, చాలా డ్రామా ఆడారు. కేదార్ కోసం క్రొత్త వల పన్ని, మమ్మల్ని తప్పిద్దానుకున్నారు. శభాష్. కానీ, పాపం! ఈ సారి నీ పాచిక పారేలా లేదు బేబీ…. చూడూ …పెళ్ళికి కావాల్సినది ప్రేమ. నమ్మకం. ఆస్తి, అంతస్తు కాదు. నువ్వూ, మీ అమ్మా ఈ తెలివితేటలని కాస్త మంచి పనులకి వాడుకోండి. మంచి మనిషిని వంచించడానికి కాదు. ఏది ఏమైనా నా జీవిత భాగస్వామి ఔన్నత్యాన్ని తెలుసుకున్నాను. వివాహబంధాన్ని వ్యాపారంగా మార్చేసే మీలాంటి వాళ్ళ వల్లే సమాజంలో ఆడవాళ్ళ పట్ల గౌరవభావం తగ్గుతోంది. బై! “
ఫోనుని తిరిగి కేదార్ చేతికిచ్చి, ఆ చేతిని గట్టిగా పట్టుకుంది హిమబిందు.
ఆమె కళ్ళల్లో అనుమానపు తెరలు తొలిగి ఆ స్థానంలో తొణికిసలాడుతున్న అభిమానాన్ని చూశాడు కేదార్.
“థాంక్యూ “ అతని కళ్ళు చెప్పాయి ఆమెకి.

**************************************************************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *