May 17, 2024

అర్చన 2020 – పెద్దరికం

రచన: ప్రకాశ రావు

“నువ్వు ఏ రాంక్ తీసుకొని రాగలవు ” అడిగాడు భార్గవ్
“అన్నింటిలో తొంభై మార్కుల పైన తప్పకుండా వస్తుంది “అన్నాడు అశ్విన్
” పేపర్లు ఎవడైనా తలతిక్క మాస్టారు దిద్దారంటే …..” అడిగాడు భార్గవ్
“ఎటువంటి మాష్టర్ నా పేపర్ దిద్దినా తొంభైకి తక్కువ కాకుండా మార్కులు వేస్తారు ” పూర్తి నమ్మకంతో అన్నాడు అశ్విన్ .
“నీకు పూర్తి నమ్మకం ఉంది.కానీ నా పరీక్షా ఫలితం గోడమీది పిల్లిలా ఎటువైపు అయినా ఎగురవచ్చు .నా పేపర్ దిద్దే మనిషిపై నా ఫలితం ఆధారపడివుంది .ఇంతకూ ముందు చెప్పినట్లు తలతిక్క మనకిషికి నా పేపర్ దొరికిందంటే నేను …..నేను చావడం తప్ప మరో మార్గం లేదు “అన్నాడు భార్గవ్ .
అశ్విన్ కోపంతో భార్గవ్ చెంప చెళ్లుమనిపించాడు “భార్గవ్ నీకు బుద్దుతుండే మాట్లాడుతున్నావా .ఇదొక్కటే జీవితమనుకకుంటున్నావా, నీవు ఫెయిల్ అయినందుకు చస్తే నీ తల్లితండ్రులు సంతోష పడుతారా,అలా సంతోష పడేటట్లుంటే నీవు చావడానికి నేను సహాయం చేస్తాను .ఇంటర్ ఫెయిల్ అయితే జీవితం లేదనుకొంటున్న మూర్ఖుడిని ఇప్పుడు చూస్తున్నాను ” కోపంగా అన్నాడు అశ్విన్
” ఓటమి ఎవడికీ సొంతం కాదు……ఒక్కొక్క సారి ఓటమి వల్ల చెడుకన్నా మంచే జరుగుతుంది . మా మామయ్యా ఇంటర్ ఫెయిల్ కాగానే కృంగిపోకుండా తండ్రి ఆలోచన ప్రకారం వ్యాపారం మొదలు పెట్టారు .ఇప్పుడు ఈ పట్టణంలోనే ప్రముఖ వ్యాపారస్థులలో ఆయన ఒకరు “అన్నాడు కరుణాకర్
“మీరిద్దరూ పరీక్షలు బాగా వ్రాసారు ఆ నమ్మకంతో లక్ష సలహాలు ఇమ్మన్నా ఇస్తారు .పడేవాడికి ఆ బాధ తెలుస్తుంది .నేనూ బాగానే వ్రాసాను కానీ ….నాలో ఏదో తెలియని భయం …అందుకే అటువంటి నిర్ణయం ” అన్నాడు భార్గవ్
“నీ ఆలోచనా విధానం పూర్తిగా తప్పురా “అన్నాడు అశ్విన్
“కానీ నా మనసులో కలిగే భయం ఆందోళనలు ఎలా చెప్పానురా …నిద్రలేని రాత్రులు….. కాస్సేపు నిదురపోయినా ప్రశాంతంగా నిదురపోనీయకుండా అడ్డుపడే పీడకలలు ….అందుకే ….అందుకే ….తప్పని తెలిసినా అలాంటి నిర్ణయం .ఎప్పుడో నా నిర్ణయాన్ని అమలు చేసేవాడిని కానీ….. ఒక వేళ పాస్ ఔతానన్నచిరు ఆశతో ఇంకా ఇలా ఉన్నాను ” చెమ్మగిల్లిన కళ్ళతో మత్తుగా అన్నాడు భార్గవ్
అశ్విన్ , కరుణాకర్ లకు ఏమి చెయ్యాలో తోచలేదు .ఎలా చెప్పాలో అర్థంకాక ఒకరినొకరు బాధగా చూసుకొనసాగారు
*** *** ***
తనకోసం ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారని ప్రక్కనున్న క్లర్క్ చెప్పగానే లేచి వెళ్ళాడు .
“అంకుల్ …మేమిద్దరమూ మీ భార్గవ్ స్నేహితులం ….మీ భార్గవ్ …మీ భార్గవ్ “అంటూ ఎలా చెప్పాలో తికమక పడుతున్న అశ్విన్ వైపు చూస్తూ “భార్గవ్ కు ఏమైంది “ఆందోళనగా అన్నాడు.
“అంకుల్ ఏమీ కాలేదు మీరు కంగారు పడవద్దండి. భార్గవ్ నడవడికతో మాకు అనుమానం వచ్చింది .అందుకే మేమిద్దరమూ వాడికి తెలీకుండా అనుసరించాము .చాలా డిప్రెషన్ కు లోనయినట్లుంది. మత్తు కలిగించే డ్రగ్ ఏదో తీసుకొన్నాడు “
“వాడికి ఎలా ఎలా దొరికింది ఎవరిచ్చారు ….”
“అంకుల్ మీకు అన్నీ తెలుసు ….డబ్బులు ఇస్తే ఈ నగరంలో దొరకనిది అంటూ ఏమీలేదు . ఈ నగరం అంతగా దిగజారిపోయింది. అసలు విషయానికి రండి .వాడితో మాటలు కలిపి అసలు విషయం తెలుసుకున్నాము. వాడిది పరిష్కరించగల చిన్న సమస్య ….” అంటూ క్రితం రోజు జరిగిన సంగతంతా వివరించి చెప్పాడు కరుణాకర్.
“మీరిద్దరూ చిన్న పిల్లలు అవడం వల్ల మీకు చేతులు జోడించి కృతఙ్ఞతలు చెప్పలేకపోతున్నాను .ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది ఈలోగా వాడి మానసిక పరిస్థితిని బాగు చేస్తాను ” అన్నాడు భార్గవ్ తండ్రి .
అశ్విన్ ,కరుణాకర్ లు వెళ్ళారు.
*** *** ***
“హలో భార్గవ్ ఒక సారి వెంటనే మనం కలుసుకొని పార్క్ దగ్గరకు వస్తావా ” అన్నాడు అశ్విన్
“ఏమయిందిరా ”
“దయచేసి వెంటనే రా రా ….ఫోన్లో ఏమీ అడగవద్దు ”
“ఒక్క ఐదు నిమిషాలలో అక్కడ ఉంటాను ”
పార్క్ గేట్ దగ్గర భార్గవ్ కోసం ఎదురుచూడసాగాడు
“అశ్విన్, ఏమిట్రా అంత తొందరగా రమ్మంటూ పిలిచావు” రాగానే అడిగాడు భార్గవ్
“ ఆ కరుణాకర్ కన్నా నీవే వందరెట్లు నయంరా “
“అసలేమైందిరా “
“వాడి మామయ్య ఇంటర్ తరువాత వ్యాపారంలో దిగినట్లు కరుణాకర్ ను చదవడం ఆపి వ్యాపారం చెయ్యమని వాడి తల్లితండ్రులు బలవంతం చేసారంట .వీడేమో డిగ్రీ చదవాలని ఉన్నట్లు చెప్పాడంట ….. మాట మాటా పెరిగింది .చివరకు కరుణాకర్ ఆత్మహత్యా ప్రయత్నం చేయబోంతుంటే వారింటి పనిమనిషి చూసి కాపాడింది .అనుకోకుండా ఆ సమయాన వెళ్లిన నాకు వాళ్ళ తల్లితండ్రులు వీడి బాధ్యత నాకు అప్పగించారు ”
“ నీ కెందుకు అప్పగించారు అది వారింటి సమస్య ….”
“కావచ్చు ….వాడు తల్లితండ్రులంటేనే అగ్గిమీద గుగ్గిలంలా ఎగిరిపడుతున్నాడు.మనిద్దరం కలసి వెళ్లి వాడిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లే పని అప్పగించారు . వాళ్ళ తల్లితండ్రులు చెప్పిన డాక్టర్ దగ్గరికే మనం వెళ్తున్నాము .ఆ డాక్టర్ తో వాళ్ళు ఇంతకు ముందే ఫోన్ లో మాట్లాడారంట . ఇప్పుడు వాడిని ఏమీ అడగవద్దు . మనం ముగ్గురం ఆటోలో డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి “
పార్క్ నందు బెంచీ మీద తలవంచుకొని కూర్చొన్న కరుణాకర్ దగ్గరకు ఇద్దరూ వెళ్లారు .
“వెళదాం రారా ” అని అశ్విన్ చెప్పగానే ఎటువంటి సమాధానం చెప్పకుండా కరుణాకర్ వారితో బయలుదేరాడు. బయటకు రాగానే ఆటో ఎక్కారు
ఆటో నుండి దిగిన ఆ ముగ్గురు ప్రముఖ సైక్రియాటిస్టు గదిలోనికి ప్రవేశించారు
*** *** ***
“ ఔను సార్ ….నన్ను ఇంటర్ తరువాత పై చదువులకు వద్దంటే నేను జీవించదలచుకోలేదు ” విసుగ్గా అన్నాడు కరుణాకర్
“నీవు మరలా చదవడానికి మీ తల్లితండ్రులు అంగీకరించలేదని ఇలాంటి నిర్ణయం తీసుకొన్నావు .మీ తల్లితండ్రులు చదవడానికి అంగీకరిస్తే “అడిగాడు సైక్రియాట్రిస్టు
“వారు అంగీకరించకపోవడం వల్లనే కదా సమస్య ఆరంభమయింది . అంగీకరిస్తే ఆత్మహత్య ఆలోచన ఎలా వస్తుంది సార్ “అన్నాడు కరుణాకర్.
“నీవు ఇంటర్ లో ఫెయిల్ అయితే ”
“అలా జరగదుసార్ “
“కరుణాకర్ ,ఒకవేళ జరిగితే నీ స్పందన ఏమిటి “అడిగాడు సైక్రియాట్రిస్టు
“నేను భార్గవ్ లాగా ఆత్మా హత్య చేసుకోను ….మరలా పరీక్షలు వ్రాస్తాను ” అంటూ సమాధానం చెప్పగానే ప్రక్కనే ఉన్న భార్గవ్ అసహనానికి లోనయ్యాడు
“ఏమిటి భార్గవ్ ఇంటర్ లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నా వా .మన భారత దేశంలోని ఒక రాష్ట్రంలో జరిగిన పదవతరగతి పరీక్షలో అరవై మూడు పాఠశాలల్లో ఒక్కరూ పాస్ కాలేదు తెలుసా. వారిలో ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదు.” భార్గవ్ వైపు చూస్తూ అన్నాడు
భార్గవ్ మౌనంగా తలా వంచుకొన్నాడు
“ మీ ముగ్గురిలో ఒక్కరనుకొన్నాను .మీలో ఇద్దరు మానసిక సమస్యకు లోనయ్యారు ….మీ ఇద్దరికీ నేను కౌన్సిలింగ్ చెయ్యాలి “అన్నాడు సైకియాట్రిస్ట్.
*** *** ***
ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చే రోజు ముగ్గురూ ఒకే చోటు ఉండాలనుకొన్నారు . అనుకోని కారణాల వల్ల ముగ్గురూ వేరు వేరు ఊర్లలో ఉన్నారు
తాతయ్య అనారోగ్యంగా ఉన్నారని అశ్విన్ గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది
పరీక్షా ఫలితాలకోసం తన దగ్గరున్న సెల్ ఫోన్ ద్వారా చూడసాగాడు .’నాకెలాగూ తొంబై శాతం తగ్గదు …ముందు భార్గవ్, కరుణాకర్ల మార్కులు చూడాలి అనుకొంటూ మొదట భార్గవ్ హాల్ టికెట్ నెంబర్ వేసి చూసి ఆశ్చర్య పోయాడు .రెండు సబ్జెక్టులలో తొంబై శాతానికి పైన ఇతర సబ్జెక్టులలో ఎనభై శాతానికి పైన చూడగానే చాలా సంతోషం కలిగింది
భార్గవ్ తండ్రి దగ్గరనుండి ఫోన్ వచ్చింది “అశ్విన్ ,భార్గవ్ మార్కులు ఇప్పుడే చూసాను వాడే ఎదురుచూడని మార్కులు … పేపర్లు దిద్దడంలో ఏదో అవక తవకలు జరిగినట్లుంది మంచి మార్కులతో పాస్ అయినట్లు వచ్చింది. ….”
“ఔను అంకుల్ …ఇప్పుడే చూసాను. భార్గవ్ కరుణాకర్లు మంచి మార్కులతోనే పాస్ అయ్యారు.“
” నీవొక పెద్దమనిషిగా మా అబ్బాయి సమస్యను పరిష్కరించడానికి పూనుకొన్నావు .సైకియాట్రిస్టు దగ్గరకు నేను తీసుకెళ్లడానికి బదులు పెద్ద మనుషుల్లా నీవు కరుణాకర్లు వెళ్లడం …… మిమ్మల్ని ఎలా మెచ్చుకోవాలో అర్థం కావడం లేదు “
“వాడు మాకు ప్రాణ స్నేహితుడు అంకుల్ …… మా నాన్న కు జరిగిందంతా చెప్పాను .మా నాన్న సలహా మీద మీకు జరిగినదంతా చెప్పిన తరువాత సైకియాట్రిస్టు దగ్గరకు వెళ్లాను “
“ప్రాణ స్నేహితుడైనాసమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి నీలా పెద్దమనిషి తరహాలో ప్రయత్నించే స్నేహితులు ఎవరున్నారు బాబూ, నీవు ఆ కరుణాకర్ కలిసి కరుణాకర్ ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు చిన్న నాటకమాడి నా బిడ్డను కాపాడారు ”
” ఆ ఆలోచన ఆ సైకియాట్రిస్ట్ చెప్పిందని మరిచారా……ఇంతకూ భార్గవ్ ఎక్కడ అంకుల్.”
“వాడు వాళ్ళ అమ్మతో కలసి గుడినుండి ఇంకా బయటకు రాలేదు .నేను ముందుగా వచ్చి ఫలితాలు చూసాను ఒక ప్రక్క పిల్లలు ఇంటివారితో మనసు విప్పి మాట్లాడటం కరువైపోతుంటే ,మరో ప్రక్క మీలాంటి స్నేహితులు కరువైపోతుండటం వల్లనే ఈ మధ్య ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. మీసహాయానికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో ….. ”
“అంకుల్ నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి.”
“ ఏమిటీ నీవు నాకు కృతజ్ఞతలా …. నేనేంచేసాను “
“సారీ అంకుల్ … నేను ఫెయిల్ అయ్యాను. ఒక సబ్జెక్టు లో పది మార్కులే వచ్చింది . మిగిలిన సబ్జక్ట్స్ నందు నేనాశించిన మార్కులు రాలేదు. అన్ని పేపర్లకు రీ వాల్యుయేషన్ కు దరకాస్తు పంపాలి “మామూలుగా అన్నాడు అశ్విన్
“అశ్విన్ …..భాదపడుతున్నావా”
“జీవితం గురించి భార్గవ్ కు ఇచ్చిన సలహాలు కారణం అనుకొంటాను.ఎవరో చేసిన పొరపాటుకు నేనేందుకు బాధపడాలన్న భావన కలిగింది అంకుల్ .”
“అశ్విన్ , పెద్దరికంతో మా అబ్బాయి సమస్యను పరిష్కరించావు . ఆ పెద్దరికమే నీకు ఏర్పడిన సమస్యకు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా సులభంగా పరిష్కరించుకోగల ధైర్యాన్నిచ్చింది ”

(అయిపొయింది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *