March 19, 2024

చంద్రోదయం – 37

రచన: మన్నెం శారద

 

సారథి సలహా మీద ఆమె నుంగంబాకంలో వున్న మహిళా సమాజంలో మెంబర్‌షిప్ తీసుకుంది.

అక్కడ తమిళులకి తెలుగు నేర్పటం, తను తమిళం నేర్చుకోవటం, యిష్టమైన కుట్టుపనులు తెలుసుకోవటం ఆమెకు కొంత కాలక్షేపంగానే వుంది.

ఎంతయినా అది కేవలం రెండు గంటల కాలక్షేపం మాత్రమే. సారథి దాదాపు ఎనిమిది గంటల కాలం యింట్లో వుండడు. ఒంటరితనం నుంచి తననెలా రక్షించుకోవాలో అర్థం కాలేదు స్వాతికి.

పనిపిల్లతో ఏం మాటలుంటాయి?

మెల్లిగా వీధిలో వారితో స్నేహం మొదలెట్టింది.

పంకజం అనే ఆవిడ స్వాతిని ఆకర్షించింది. పంకజం బి.ఇడి చేసిందట. కానీ ఉద్యోగం చెయ్యటం లేదు. ఆమె భర్త ఇన్‌కంటాక్స్ ఆఫీసులో పని చెస్తాదు. వాళ్లకి ఒక అబ్బాయి, మళ్లీ గర్భిణి.

పంకజం ఒకరోజు ఏవో కబుర్లు చెబుతూ అకస్మాత్తుగా దేవుడి మందిరంలో వున్న నానీ ఫోటో వంక చూసింది.

“ఆ ఫోటో ఎవరిది?” అంది సంశయంగా.

స్వాతి అటువైపు చూసి నిట్టూర్చింది.

“మా బాబుది” అంది.

“పాపం! పోయేడా?” జాలిగా అడిగింది పంకజం.

స్వాతి క్లుప్తంగా చెప్పింది. అలా చెబుతున్నప్పుడు ఆమె కళ్లు బాధతో చెమర్చేయి.

“ఆ బాబు తర్వాత పిల్లలు కల్గలేదా?” అడిగింది పంకజం.

“లేదు” అంది స్వాతి అతి కష్టం మీద.

“ఒకసారి డాక్టరుతో పరీక్ష చేయించుకోండీ. పిల్లలు కలగొచ్చు. పోయినవాళ్ల కోసం ఎంత ఏడ్చినా తిరిగిరారు. పిల్లలు కలిగితే కాస్త ఆ బాధని మరచిపోయి లేచి తిరగొచ్చు” అంది.

స్వాతి మౌనంగా ఆమె చెప్పింది విన్నది.

పంకజం వస్తానంటూ లేచి వెళ్లింది. ఆమె వెంట బుడిబుడి నడకలు నడుస్తూ వెళుతోన్న పిల్లవాణ్ని రెప్పవేయకుండా చూసింది స్వాతి.

 

***

 

టేబుల్ లైట్ కాంతిలో సారథి ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు.

స్వాతి బెడ్ మీద పడుకొని ఆలోచిస్తోంది.

“నిజమే! పంకజం చెప్పినట్లు ఇంట్లో పిల్లలుంటే కొంత అశాంతి తగ్గుతుంది. తను చేసిన పొరబాటువల్లనయితేనేం, విధి ఆడిన వింత నాటకం వల్లనయితేనేం,, తను ఒంటరిగా, చిగురించని మ్రోడులా మిగిలిపోయింది..”

స్వాతికి ఏదో అనుమానం.

వద్దనుకున్నప్పుడు తను మూడుసార్లు తల్లి కాబోయింది.

కాదు, కాదు. తల్లి కాబోయే అదృష్టం కలిగినప్పుడు తనే గ్రుడ్డిదయి యితరుల మాటలు నమ్మి బ్రతుకుని సర్వనాశనం చేసుకొన్నది.

ఈ రోజు తనకి కావాలన్నా, ఆ అదృష్టం పట్టడం లేదు. ఇలా ఎన్నాళ్లు తామిద్దరూ నిరాశా, నిస్పృహలతో బ్రతుకుతారు.

సారథి లైటార్పి బెడ్‌మీదకొచ్చేడు.

ఆమె అసహనంగా కదిలింది.

“ఇంకా నిద్రపోలేదా? అనునయంగా పలకరించేడు.

ఆమె “ఊహూ” అంది.

“ఏం. నిద్ర రావట్లేదా? సెకండ్ షో కి వెళడామా?” అన్నాడు సారథి.

“ఇలా ఎన్నాళ్ళు రోడ్ల మీద తిరిగి మన ఒంటరితనాన్ని పోగొట్టుకోగలం?” అంది స్వాతి దిగులుగా.

“ఏం చేద్దాం. చెప్పు!”

“మీరు మగవారు, ఎంత బాధనయినా యిట్టే మరచిపోయి తిరగ్గలరు. రోజంతా బయట నల్గురిలో మసిలే మీకు ఒంటరితనం వల్ల కలిగే వేదనా, బాధ అర్థం కావు” అంది స్వాతి మెల్లిగా.

“నీవన్న్నది నిజమే. పగలు పనిలో పడి జరిగిన సంఘటనలన్నీ మరచిపోయేననే అనుకుంటాను. కానీ అది వట్టి భ్రమ మాత్రమే. ఇంటికి రాగానే నాలోని బాధ భూతద్దంలో కన్పించి నన్ను క్రుంగదీస్తుంది స్వాతీ. అయితే మగవాణ్ని కాబట్టి నీలా బయటపడలేను, అంతే!” అన్నాదు సారథి బాధగా నవ్వుతూ.

“జీవితాంతం మనమిలా బాధపడక తప్పదా?” ఆమె ఆవేదనగా అడిగింది.

“ఏం చేద్దాం చెప్పు?” అనునయంగా అడిగేడు సారథి.

ఆమె కాస్సేపు మౌనంగా చూసింది.

“ఇలా అడగటానికి నాకు అర్హత లేదు. ఎన్నో తప్పులు క్షమించిన మీరు ఈసారి కూడా నన్ను క్షమించగలరనే ధైర్యంతో అడుగు తున్నాను. ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకోవటానికి, మనం మామూలుగా బ్రతకటానికి మనకి పిల్లలు కావాలి. ఇదే నా కోరిక.  మీరెలా అర్థం చేసుకున్నా సరే!” అంది స్వాతి గబగబా.

సారథి ఆమెవంక ఆశ్చర్యంగా చూసేడు.

అతను మాట్లాడకపోవటం చూసి స్వాతి తిరిగి తనే మాట్లాడింది. “మీకింకా నా మీద కోపం పోనట్లుంది. నేనడిగిన కోరిక అంత తీర్చరానిదా?”

సారథి ఆమె తల నిమురుతూ “ఇంకా మనకా బంధాలు దేనికి స్వాతీ. నానీని ఎంతో ప్రేమగా పెంచేం. వాడే లోకంగా బ్రతికేం. వాడితోనే ఆనందాన్ని సృష్టించుకుని వాడి చుట్టే మన ప్రపంచాన్ని నిర్మించుకున్నాం. చివరకేం మిగిలింది? ఆవేదన, దుఃఖం. వాడు మనల్ని మోసం చేసి పారిపోయేడు. వాడు మనకిచ్చిన ఆనందానికి బదులుగా రెట్టింపు జరిమానా కట్టించుకున్నాడు. అందుకే తిరిగి తెలిసీ, ఆ రొంపిలోకి దిగటం దేనికి? తిరిగి ఇంకోసారి అలాంటి అనర్థం జరిగితే భరించే శక్తి నాకు లేదు!” అన్నాడు జీరబోయిన గొంతుతో.

“మీకు నేను ఏం చెప్పాలో తెలియటం లేదు. మీరు ఆఫీసుకెళ్లిపొతారు.ఆ తర్వాత ఎంతసేపని పుస్తకాలు చదువుతాను. మహిళా మండలి కెళ్ళినా రెండు గంటలకన్నా కాలక్షేపం కాదు. అక్కడయినా ఆడవాళ్లు చెప్పుకునేది భర్తల గురించీ, పిల్లల గురించీ. “మీకెంత మంది పిల్లలు?” మొదటి ప్రశ్న అదే. లేదంటే ఎక్కడలేని జాలి చూపిస్తారు.ఇంటికొస్తే భరించలేని శూన్యం. అందుకే సిగ్గు విడిచి నాకు పిల్లలు కావాలని, ఈ యింట్లో నేనొక్కర్తినీ వుండలేనని అడుగుతున్నాను” అంది కన్నీళ్లతో స్వాతి.

సారథి ఆ మాటలు విని గాఢంగా నిట్టూర్చేడు.

“సరే పడుకో!” అన్నాడు చివరికి.

స్వాతి మరింకేం మాట్లాడలేదు.

 

***

 

ఉదయం లేవగానే

“స్వాతీ! త్వరగా రెడీ అవ్వు. బయటికెళదాం” అన్నాడు.

“ఎక్కడికి?” అంది.

“అదంతా యిప్పుడే నువ్వడక్కూడదు. ఒక్కసారే నువ్వు ఆశ్చర్యపడేలా చేస్తాను” అన్నాడు సారథి నవ్వుతూ.

“ఏదయినా ప్రజంటేషన్ యివ్వబోతున్నారా?” అంది స్వాతి వూహించడానికి ప్రయత్నిస్తూ.

“ఒక విధంగా అలాంటిదే” అన్నాడు సారథి బట్టలు తొడుక్కుంటూ.

స్వాతి త్వరత్వరగా తయారయింది.

సారథి టాక్సీ పిలిచేడు.

టాక్సీ మద్రాసు వీధులన్నీ దాటి వూరి చివరగా వెళుతోంది.

సారథి ఎక్కడికి తీసుకెళుతున్నది అంతుపట్టడం లేదు స్వాతికి.

టాక్సీ వూరి చివరగా వున్న పెద్ద బిల్డింగు ముందాగింది. స్వాతి అటువైపు చూసింది. అక్కడ పెద్ద అక్షరాలతో వున్న బోర్డుని చూడగానే ఆమె ఉలిక్కిపడింది.

బాధతో ఆమె కళ్లు రెపరెపలాడేయి.

“ఇదేమిటి, నన్ను అనాధాశ్రమానికి తీసుకువచ్చేరు?” అంది స్వాతి కోపంగా.

సారథి మీటర్ రీడింగువైపు చూస్తూ “నువ్వు పిల్లలు కావాలన్నావుగా మరి” అన్నాడు.

స్వాతికి చివ్వున కన్నీళ్లు తిరిగేయి.

“నన్ను నడిరోడ్డుమీద ఏడిపించటం మీకు ధర్మంగా తోస్తుందా? ప్లీజ్ వచ్చేయండి ఈ ఇంటికెళ్లిపోదాం” అంది రోషంగా.

సారథి నవ్వుతూ కారు డోర్ తెరచి”ముందు దిగు, ఇక్కడ కూర్చుని మాట్లాడుకొందాం” అన్నాడు.

స్వాతి అయిష్టంగా టాక్సీ దిగింది.

ఇద్దరూ అక్కడే వున్న కల్వర్టు మీద కూర్చున్నారు. ఆ ప్రదేశమంతా కొబ్బరిచెట్లతోనూ, పొగడచెట్లతోనూ చల్లగా, ప్రశాంతంగా వుంది.

వుండీ వుండీ గాలికి పొగడపూలు జల్లుజల్లుగా కాలుతున్నాయి. అలా రాలినప్పుడు వీచే పరిమళం ఆహ్లాదం కలిగిస్తోంది.

“ఇప్పుడు నీ సందేహాలు చెప్పు, ప్రశాంతంగా తీరుస్తాను” అన్నాడతను.

స్వాతి అతనివంక కోపంగా చూసింది. “అనాథ పిల్లల్ని పెంచుకొవాలసిన అవసరం మనకేముందు?”

సారథి ఆమెను దీక్షగా చూస్తూ “ఆ విషయం చెప్పాలనే నిన్నింత దూరం తీసుకొచ్చేను. ఆవేశపడక ప్రశాంతంగా అర్థం చేసుకొన టానికి ప్రయత్నించు” అన్నాడతను.

స్వాతి అతనేం చెబుతాడోనని భయంగా చూసిఒంది.

“నువ్వు నా మీద నమ్మకం లేక ఎబార్షన్ చేయించుకోవటం నాకు విభ్రాంతిని, ఆవేదనని కల్గించింది. కారణం ఏదన్నా కాని, నువ్వు నన్ను నమ్మలేదన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోయేను. ఆస్తి నా పేర వుండటం, నాకంటూ సంతానం కల్గితే నానీని సరిగ్గా చూడననే భయం నీలో వెయ్యింతలయి మన ఇంట్లో వెలగబోయే దీపాలని ఆర్పేసింది. నువ్వింత దారుణంగా ప్రవర్తిస్తావని వూహించని నేను చాలా గట్టి దెబ్బ తిన్నాను. దానితో నా మనసు విరిగిపోయింది. ఎటో వెళ్లిపోదామనుకున్నాను. కాని నానీని వదలలేకపోయేను. అందుకే నీ సందేహం నివృత్తి చేయటానికి నీ ఆరోగ్యం పాడుగాకుండా ఉండటానికిగానూ నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను” సారథి చెప్పటం ఆపి ఆమెవైపు చూసేడు.

స్వాతి పిడుగుపాటు తగిలిన మనిషిలా కంపించిపోతూ చూసింది.

“ఊరికే బాధపడకు. నేను మాత్రం వూహించేనా, నానీ యిలా దగా చేసి పోతాడని. వాడొక్కడూ చాలనుకున్నాను” అన్నాడు సారథి మళ్లీ.

స్వాతి చెంపలు కన్నీటితో తడిసిపోతున్నాయి.

సారథి ఆమెను వూరడించడానికి ప్రయత్నించలేదు.అలా చేసి ఆమె దుఖాఃన్ని  రెట్టింపు చేయటం ఆతని కిష్టం లేదు. కాస్సేపలా ఏడ్వనిస్తూ ఆమె గుండె తేలికపడుతుందని వూరుకున్నాడు.

స్వాతి అకస్మాత్తుగా అతని చేతులు పట్టుకొని “ఎప్పుడు చేసారీ పని?” అని అడిగింది.

“నిన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసికొచ్చేక వూరెళ్ళేను కదా! ఆపరేషన్ చేయించుకుని తిరిగొచ్చేటప్పటికి నానీ హాస్పిటల్లో వున్నాడు”

“అంతా మన మంచికే అనుకున్నాను. కానీ విధి ఇలా వక్రిస్తుందని మాత్రం అనుకోలేదు”

స్వాతి అకస్మాత్తుగా అడిగింది. “ఆపరేషన్ చేయించుకున్నా, పిల్లలు కావాలంటే మళ్లీ ఆపరేషన్ చెయించుకోవచ్చని ఎక్కడో చదివేను. దాన్ని రీకానలైజేషన్ అంటారట. ప్లీజ్! మీరది చెయించుకోండి”

సారథి జవాబు చెప్పలేదు.

“ఏం! మాట్లాడరూ?” అంది స్వాతి.

సారథి నిట్టూర్చేడు. “నీకెలా చెబితే అర్థమవుతుంది? నా మనసులో యిప్పుడలాంటి కోరికలు, బంధాలు లేవు స్వాతి.ఎప్పుడైతే నువ్వు నాకు తెలియకుండా ఎబార్షన్ చెయించుకున్నావో అప్పుడే నా మనసుకి పెద్ద దెబ్బ తగిలింది. నానీ పోవటంతో ఆ గాయం మరింత పెద్దదయింది.

నీది – నాది అనే స్వార్థం, అపోహ మన ఇద్దరి మధ్యా చేరి వింత నాటకం ఆడించింది. చివరకు మనకి ఏదీ లేకుండా చేసింది. ఇంకా ఎందుకు చెప్పు ఈ మమకారాలు. అక్కడ చూడు ఎంతమంది అనాధలు తల్లీ, తండ్రి అనే పదానికి అర్థం తెలియక నిరర్థకంగా బ్రతుకుతున్నారో. ఎన్నో గృహాలని తమ చిరునవ్వుతో వెలిగించాల్సిన దీపాలు ఎలా నిస్సారంగా తమ వెలుగుని ఎవరికి పంచలేక మిణుకుమిణుకుమంటున్నాయో. వాటిలో ఏదో ఒక్కటి  తెచ్చుకుని మన ఇంటిలోని చీకటిని పోగొట్టుకుందాం.”

స్వాతి కాసేపు ఆలోచించి లేచి నిలబడి “పదండి” అంది.

ఇద్దరూ అనాధాశ్రమంలోకి నడిచేరు.

రోజుల పాపల్నుంచి రకరకాల వయసుల పిల్లలు వున్నారక్కడ. సారథిని చూడగానే వార్డెన్ లేచి నిలబడి ఆప్యాయంగా ఎదురొచ్చింది.

“స్కూల్ బిల్డింగ్ ఎంతవరకయింది?” అడిగేడు సారథి.

“చాలావరకు పూర్తయింది. రండి చూద్దురుగాని” అందామె.

“ఇప్పుడు కాదు మరోసారి చూద్దాం. మేము మరో పని మీద వచ్చేం” అన్నాడు.

ఆమె స్వాతి వైపు చూసింది.

“ఈమె నా భార్య. పేరు స్వాతి! మాకు పిల్లలు లేరు. ఎవరినయినా పెంచుకుందామని…” అన్నాడు ఉపోద్ఘాతంగా.

“ఓ! దానికేం భగ్యం. మీకు నచ్చినవాళ్లని తీసుకెళ్లండి”

ఆమె ఒక హాల్లోకి నడిచింది. అక్కడంతా ఉయ్యాలల్లో రోజుల పసికందులున్నారు.

స్వాతి ఒక చోట ఆగిపోయింది. అక్కద ఒకే పోలికలో వున్న ఇద్దరు పసిపాపలున్నారు.

స్వాతి దృష్టి ఆ పిల్లల మీద వుండటం చూసి “వీళ్లు కవలపిల్లలు. నిన్న రాత్రే పుట్టేరు. తల్లి చచ్చిపోయింది” అంది.

స్వాతి సారథి వైపు చూసింది.

“వీళ్లు నచ్చేరా?” అన్నాడు నవ్వుతూ.

స్వాతి అవునన్నట్లు తల పంకించింది.

“నీకెవరు కావాలో తీసుకోమ్మా!” అంది వార్డెను.

“ఇద్దరూ!”

స్వాతి జవాబుకి ఆశ్చర్యంగా చూసేరు వాళ్లిద్దరూ.

“ఇద్దరు దేనికి స్వాతి?” అన్నాడు సారథి.

“ఒక్క బిడ్డ బిడ్డ కాదండి” అంది స్వాతి తల దించుఇకొని.

ఆమె బాధని అర్థం చేసుకున్న సారథి అభ్యంతరం చెప్పలేదు. వార్డెన్ చెప్పిన కాగితాలమీద సంతకాలు చేసి యిద్దరూ చెరో బిడ్డని ఎత్తుకున్నారు.

స్వాతి బయటికొస్తూ అక్కడే పూర్తవుతున్న బిల్డింగ్స్ వైపు చూసింది.

“ఆశాకిరణ్ మెమోరియల్ హాల్” అని వుంది. ఇంకో వైపు కట్టిన బిల్డింగ్స్‌కి “శేఖర్ మెమోరియల్ స్కూల్ బిల్డింగ్స్” అని వుంది.

స్వాతి ఆశ్చర్యంగా సారథి వైపు చూసింది.

“నీకు చెప్పనందుకు మన్నించు. నానీకి చెందవలసిన అస్తినంతా ఈ అనాథాశ్రమానికి రాసేసేను. శేఖర్ కోరిక కూడా అదే” అంటూ సంజాయిషీ యిచ్చేడు.

స్వాతి సజల నయనాలతో చూసిందతనివైపు. చీకటితో పోరాడిన ఆ దంపతులు, చేతుల్లో వున్న ఆశాజ్యోతుల్ని అపురూపంగా పట్టుకొని రోడ్డు మీద కొచ్చేరు.

దూరంగా ఏ చెట్టు కొమ్మమీద నుంచో ఓ కోయిల కూ కూ అని పాడుతోంది.

ఆ పాట స్వాతి గుండెల్లో పన్నీటిని చిలికినట్లయింది. ‘ఏ గూటిలో పుడితేనేమి, ఎలా వుంటేనేమి, ఎన్ని హృదయాలని పరవశింప చేయగలుగుతోంది. కోయిల జీవితమెంత సార్థకమైనది?’

చేతుల్లో వున్న పిల్లలవైపు అపురూపంగా చూసింది స్వాతి.

‘ఎవరు కన్న పిల్లలైతేనేం? పిల్లలు పిల్లలే. మనస్సుకు దగ్గరగా  గుండెల్లో పెట్టుకుని పెంచితే వీళ్లు తన పిల్లలే.’

మోడుబారిన ఆమె గుండెపైన తొలకరి జల్లు కురుస్తుంటే మెరిసే కళ్లతో టాక్సీలో ఎక్కి కూర్చుంది.

సారథి ఆమె భుజాలపై ఆప్యాయంగా చేతులుంచి ఆమె కళ్లలోకి చూసేడు.

ఆ క్షణం ఆ యిద్దరి చూపుల్లో పెనవేసుకొన్న భావాలు అనిర్వనిచనీయం.

టాక్సీ వూరివైపు పరుగుతీస్తోంది.

 

సమాప్తం

 

 

1 thought on “చంద్రోదయం – 37

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *