May 1, 2024

జగజ్జనని

రచన: లక్ష్మీ మైథిలి

చిరుజల్లులు కురిసే ఆషాఢమాసంలో
చల్లని తల్లి అమ్మవారి జాతర
ఆడపడుచులు అర్పించే బోనాల పండుగ
భక్తులను అనుక్షణం కాపాడే జగజ్జనని

ఉజ్జయిని మహంకాళిగా వెలసిన ఆదిశక్తి
పసుపు కుంకుమలతో పూజలందుకునే మహాశక్తి
భక్తజనుల కీర్తనలతో పరవశించే పరాశక్తి
లాల్ దర్వాజాలో అంగరంగ వైభవం
వివిధ పూల అలంకరణతో శోభిల్లే దేవత
వాడవాడలా నవ్యశోభలతో విరాజిల్లుతోంది

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలే
బోనాల పండుగ ప్రతీకలు
ఇంతులు గజ్జెకట్టి బోనాలెత్తేవేళ
జంటనగరాల ఉత్సవాలలో
సాకం..పాకం నైవేద్యం స్వీకరించే జగన్మాత

భక్తుల జయజయ ధ్వానాల నడుమ
శివభక్తుల పూనకాలతో
పోతురాజుల నృత్యాలతో
ఘటాల ఊరేగింపులతో
రంగంలో అమ్మ పలికే భవిష్యవాణితో
అంబారీపై అమ్మోరి రథయాత్ర…
నేత్రపర్వంగా సాగే శుభతరుణం
ముల్లోకాలు ఏలే తల్లి మురిసే సమయం

తెలంగాణ ఇంటి వెలుగు
ఇంటింటి కంటి వెలుగు
వ్యాధులను బాపే అభయంకరి
ఆ దేవి దర్శనం సకల పాప హరణం
మహిమాన్వితమైన శక్తిదాయిని
ముక్తి ప్రదాయిని సింహవాహిని!

1 thought on “జగజ్జనని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *