May 10, 2024

సహజమైన వెండి కిరీటం(కర్ణుని కవచం లాగా…)

రచన: లలితా చెన్నూరి

 

ఎలా ఉన్నావూ? పిల్లల దగ్గరే ఉన్నావా? వచ్చేశావా? నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులయ్యింది. ఫోన్ చేయడం మనిద్దరికీ నచ్చదుగా, చక్కగా అందమైన లేఖావళి మనకిష్టం. ఎప్పుడైనా పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఉత్తరాలన్నీ ముందరేసుకొని చదువుకుంటూ ఉంటే ఆ అనుభూతి, ఆ ఆనందమే వేరు. రోజంతా అలా చదువుకుంటాము కదా! ఎంత బావుంటుంది. ఇప్పటి తరాలు ఫోన్ లోనే ఎక్కువ సేపు గడుపుతారు. అందుకే వారి మాటలు కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్లు ఉంటాయి. వ్రాయటం పూర్తిగా మరచిపోయారు. ఫోన్లు ఎక్కువై ప్రత్యక్షంగా వారికి మాటలు తగ్గిపోయాయి.  ఏమిటో కాలం ఎటు వెళ్తోందో తెలియటం లేదు కదా! పిల్లలు పదిహేను రోజుల క్రితం వచ్చారు, అందుకు బిజి అయ్యాను. వాళ్ళు నిన్ననే వెళ్ళారు. తీరుబడిగా నా బాధలు నీతోనేగా చెప్పుకునేది, అందుకే రాస్తున్నాను. నెమ్మదిగా చదివి నాకు పరిష్కారం చెప్పి నీ చల్లని మనసుతో నన్ను ఊరడించు, 40 ఏళ్ళ మన స్నేహంలో నీకు తెలియని లేవనుకో. అయినా కొత్త బాధ పాత బాధను మరపించక పెంచుతోంది.

నీకు తెలుసు కదా చిన్నతనంలోనే నాకు జుత్తు నెరిసిందని. దాని వల్ల ఏ ఏ గౌరవాలు, అగౌరవాలు రుచి చూశానో కూడా తెలుసు. మరొకసారి చెబుతాను విను. నాకన్న చిన్నవారు, నాకన్న పెద్దవారు (రంగువేసుకున్నవారు) నాకు నమస్కారాలు పెడుతుంటే ఏమి చెయ్యాలి? చిన్నవారిని దీవించి, పెద్దవారికి వినిపించకుండా ‘కృష్ణార్పణం’ అనటం నేర్చుకున్నాను. పిల్లలు “వాళ్ళకి చెప్పచ్చుగా వాళ్ళు నీకన్నా పెద్దవాళ్ళు కదా” అని నా మీద అరిచేవారు. ఎంతమందికి చెపుతామని ఊరడించేదాన్ని. బస్సులో సినియర్ సిటిజన్ సీట్లో కూర్చోమనేవారు, అప్పుడు నాకు 40 ఏళ్ళు కూడా లేవు. బాధపడేదాన్ని. తర్వాత సానుకూలంగా స్ఫందించి గౌరవంగా భావించి నీరసంగా ముఖం పెట్టి కూర్చునేదాన్ని. బస్సు కోసం పరిగెత్తి ఎక్కితే డ్రైవర్ ఎగాదిగా చూసేవాడు… ‘ఈ పెద్దావిడకి పరుగు అవసరమా?’ అని.

ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. నాకన్నా ముందు వెళ్ళిన ఆవిడని చూసి మందులు రాసి పంపాడు. తరువాత వెళ్ళిన నాకు మందులు రాసి, “ఎప్పుడు రిటైర్ అయ్యారు?” అని అడిగాడు. నాకు కోపం వచ్చి,”ముందొచ్చినావిడను అడగలేదే?” అని అడిగాను. డాక్టర్ తలవంచుకొని, “సారీ మేడం” అని అన్నాడు. ముందు వచ్చినావిడ మా పక్కింట్లో ఉంటారు. అప్పుడే 75 ఏళ్ళు కానీ, నల్లటి రంగు జుట్టు. నవ్వు ఆపుకుంటూ చదువుకుంటున్నావు కదా? నాకు కనిపించదు, వినిపించదుగా అక్కడ, బాగా నవ్వుకో, వచ్చాక నీ పని పడతాలే!

ఒకసారి అప్పుడెప్పుడో తిరుపతి వెళ్ళాము. పెద్దవాళ్ళము అందరం ఒక లైన్ లో నిల్చొని ఉన్నాము. ఒక పూజారి వచ్చి, “మీరు జుట్టు నెరిస్తే సీనియర్ సిటిజన్లు కాదు, మీరు జెనరల్ లైన్ లోకి రండి” అని వెనక్కి పంపారు. నాకు చాలా సంతోషంతో మేఘాలలో తేలిపోతునట్టు అనిపించింది. ఆ భగవంతుడికి తెలుసుగా నా వయసు అది చాలనిపించింది.

తరువాత నా కూతురు పెళ్ళి, ఏడాది కల్లా దానికో పాప. అప్పుడు నా వయసు 45. మరింత సానుకూల దృక్పథం ఏర్పడింది.  కాలనీలో ఏ పాపైనా నన్ను ‘అమ్మమ్మ’ అని అని పిలిస్తే ముద్దుగా ఎత్తుకునేదాన్ని. అలా నాకు ప్రతీవీధిలో చిన్నారి మనువలు ఎంతమందో చెప్పలేను. ‘ఇవన్నీ నాకు తెలుసుగా’ అని నువ్వు విసుగు మొహం పెట్టకు. అసలు విషయం ఇప్పుడు ఉంది. ఇదో కొత్త సమస్య… ఇది చదివితే నువ్వు నవ్వు ఆపుకోలేవు. వెంటనే నా మీద ప్రేమ, జాలి పెరిగిపోతాయి. వెంటనే నన్ను ఊరడిస్తూ నాకో 10 పేజీల ఉత్తరం రాసేస్తావు.

నీకు ఈ సమస్య లేదు. నీ జుట్టు ఇప్పటికీ తెలుపు నలుపు కలిపి నేసిన కలనేత చీరలా చాలా అందంగా ఒత్తుగా పొడుగ్గా ఉంటుంది కదా, నాదేమో నీ జుట్టుకు వ్యతిరేకం.

భారతీయులు తమ వయసును దాని వల్ల వచ్చే మార్పులను చాలా సంతోషంగా ఆహ్వానిస్తారు. తమ ముదిమి వయసులో మనుమలతో మునిమనమలతో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. పాతకాలపు సమస్యలు లేవు. కానీ ఇప్పుడు? ఇపుడు వయసుకు తగ్గట్టు ఉన్నాను కదా అని ఆనందంగా ఉన్నాను ఇపుడు కొత్త సమస్య వచ్చింది ఏమిటి? అని ప్రశ్నార్థకంగా చూడకు. ఆత్రపడకు అలివేణి రాస్తాగా చదువు.

ఎక్కడికైనా వెళ్ళడానికి ఆటో ఎక్కాననుకో ఆటో వాడు నా వంక చూసి,”మీరేనయం అమ్మా! చక్కగా హుషారుగా తిరుగుతున్నారు. మీ వయసు వరకు మేముంటామో ఉండమో? ఏంటో మా బ్రతుకులు ” అని నిట్టూరుస్తూ ఆటో నడుపుతాడు. అప్పుడు నా ముఖం కించిత్తు గర్వంతో వెలిగిపోతూ ఉంటుంది.  ఒకసారి ఒక ఆటో అతను “మీ పాత కాలం వాళ్ళు నెత్తికి రంగు వేసుకోరు, ఇప్పటివాళ్లైతే తప్పక వేసుకుంటారు” అని అన్నాడు అతని వాక్ స్వాతంత్రం నాకు నచ్చింది.

ఏదైనా షాప్ కి వెళ్ళాననుకో, “మీ కాలమే బాగుండేదమ్మ, మేము చూడండి ఎలా నీరసించిపోతున్నామో. ఏ పని చేయలేకపోతున్నాం! మీ తిండి మీ అలవాట్లు అన్నీ మంచివమ్మ, మాకే ఏ మంచలవాట్లూ లేవు” అని నిరసంగా మాట్లాడతాడు. వాకింగ్ కి వెళ్తానా? , “అమ్మమ్మ జాగ్రత్త, మీరెందుకు వచ్చారు చక్కగా ఉన్నారు కదా? మేం చూడండి ఎలా ఉన్నామో? ఏం చేసినా మేము సన్నగా అవ్వము. మీరు హాయిగా ఇంట్లో కూర్చొని ‘కృష్ణా రామా’ అని అనుకోండి. జాగ్రత్త ఎక్కడన్నా పడిపోతారేమో ఇంటికెళ్ళండి” అని జాగ్రత్తలు ఆప్యాయంగా చెప్తారు.

చీరల షాప్ లోకి వెళ్తే అక్కడి జనాలు, “మీరు మీ చీరలు సెలెక్ట్ చేసుకోడానికి మీరే వస్తారా? గ్రేట్ చాలా బాగుంది. మా అమ్మని రమ్మంటే రాదు, కాళ్ళ నొప్పులంటుంది. మీరు చక్కగా నడుస్తున్నారు, హుషారుగా ఉన్నారు. మా అమ్మ మీ కన్న చిన్నదైనా రాదు” అని పొగుడుతూ వెక్కిరిస్తాడు. (నా వయసు అతనికి తెలియదు అయినా వాళ్ళ అమ్మ చిన్నదని నేను పెద్ద అని అతని మూఢనమ్మకం…. నిజమేమో నాకు తెలియదు).

డాక్టర్ దగ్గరకు వెళ్తే అన్నీ విన్నాక, “వయసు అవుతుంటే ఇలాగే ఉంటుందమ్మ, ఇంట్లో వస్తువులు రిపేరు చేసుకుంటాము కదా, అట్లాగే మన అవయవాలు కొన్ని రోజులు పని చేశాక వాటిని కూడా మందులతో రిపేర్ చేసుకొని కాలం గడపాలి” తప్పదని సముదాయిస్తాడు. అసలు విషయం ఏమిటంటే ఆయన నాకంటే 10 ఏళ్ళు పెద్ద. (రంగుతో వయసు దాచేశాడు). ప్రపంచానికి తెలిసిన పెద్దమనుషులు జుట్టు రంగుతో నల్లగా ఉందని తెలిసినా ఏమి అనడానికి సాహసించరు. నాలాంటి పిచుక మీద బ్రహ్మాస్త్రాలు దండయాత్రలు చేస్తారు. తెల్లటి పదార్థాలు (పంచదార, తెల్లబియ్యం, మీదా.. వగైరా) తినరాదని శాస్త్రజ్ఞులు తీర్మానించారుట. తెలుపు అందరికీ చులకనగా, నిషేదంగా మారింది కదా! హింసా ప్రవత్తి పెరిగిన ఈ కాలంలో శాంతికి చిహ్నమైన తెలుపును నిరసించే స్థాయికి ఎదిగాము. కలిప్రభావం యుగ ధర్మం ఇదేనెమో! ఎక్కడ నా తెల్లజుట్టు… ఎక్కడ ఆ తెల్ల రంగు. కోపంతో బాధతో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. పెద్దల జనాభ ఎక్కువయ్యి వారికిచ్చే సదుపాయాలు తగ్గిస్తున్నారుట ప్రభుత్వం వాళ్ళు. ఏదేదో రాసేస్తున్నాను కదా?

నేను రిటైర్ అయ్యాక ఒక స్కూల్లో చేరాను. కొత్తగా చేరిన పిల్లలందరూ వాళ్ళ అమ్మనాన్నని వదిలేసేటప్పుడు ఏడుస్తూ నా దగ్గరకే చేరేవారు. అందరూ నన్ను ఆప్యాయంగా ‘అమ్మమ్మ టీచర్ ‘ అని పిలిచేవారు. వాళ్ళ ఏడుపు తగ్గాక వాళ్ళ క్లాస్ కి తీసుకెళ్ళి నేనే కూర్చోబెట్టేదాన్ని. నన్ను చూడగానే వాళ్ళ ఇంట్లో ఏ బామ్మో, అమ్మమ్మో గుర్తొచ్చేదేమో మరి.

అందమైనలోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామా రామా అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. మనం మనిషిగా పుట్టి మనిషిగా ఎదిగి కొన్నాళ్ళకు మంచిని మాయం చేసి మరమనిషిలా ఎదిగి మనుషులకు దూరంగా జరిగిపోతున్నాము. మానవత్వం మమతానురాగాలు మరచిపొతున్నాము. ఎవరికీ వెలుగునివ్వకుండా ఆరిపోతున్నాము. మనం నిజంగా ఎదుగుతున్నామా? నిజంగా… ఈ మార్పు వికాశానికా వినాశనానికా నాంది? ఏదో రాస్తూ నిను విసిగించాను.

తెల్లజుట్టు సమస్య నన్ను చిన్నప్పుడు పెద్దప్పుడూ కూడా బాధపెట్టింది. యుగధర్మాన్ని అనుసరించక పాత రాతియుగంలో ఉంటే మనుగడ ఇంతేనేమో! ఏది ఏమైనా నాకు నచ్చినట్లు జివించానన్న తృప్తి నాకుంది. నా సమస్యను/బాధను చెప్పుకోడానికి నువ్వు కాక మరెవరున్నారు? నా ఈ ఉత్తరానికి త్వరగా బదులిస్తావని ఆశిస్తూ జాబుకోసం ఎదురు చూస్తూ…

 

నీ అర్చన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *