May 18, 2024

ఖరహరప్రియరాగం

రచన:

భారతీప్రకాష్ ( డైరెక్టర్, స్వరాలంకృత మ్యూజిక్ స్కూల్) – email : bharatiiyengar@yahoo.co.in

 

 

 

 

 

 

22వ మేళకర్త రాగం.

4వ  చక్రమైన “వేద” లో 4వ రాగం.

మూర్చనకారక మేళరాగం.ఈ రాగము యొక్క

’రి’ ని షడ్జమం చేస్తే  హనుమత్తోడి,

’గ’ ని షడ్జమం చేస్తే మేచకల్యాణి,

’మ’ ని షడ్జమం చేస్తే హరికాంభోజి,

’ప’ ని షడ్జమం చేస్తే నటభైరవి,

’ని’ ని షడ్జమం చేస్తే ధీరశంకరాభరణం గా మారుతాయి.

 

ఆరోహణ —> స రి గ మ ప ద ని స

అవరోహణ–>  స ని ద ప మ గ రి స

 

షడ్జమ, పంచమములతో పాటు చతుశృతి రిషభం, సాధారణ గాంధారం. శుధ్ధమధ్యమం, చతుశృతి దైవతం  మరియు కైశిక నిషాదం ఈ రాగం లోని స్వరాలు.

సంపూర్ణ రాగం.

సర్వ స్వర గమక వరీక రక్తి రాగం.

’రి’, ’గ’, ’ద’ మరియు ’ని’ లు రాగఛాయా స్వరాలు మరియు న్యాస స్వరాలు.

’రి’, ’ప’ ఆధార స్వరాలు.

“ప్రత్యాహత గమకం” ఈ రాగానికి మంచి స్వరూపాన్ని ఇస్తుంది.

నెమ్మదిగా ఉపయోగించే

“నీ ద పా మ గా రీ”

“నీ ద ప ద ని ద ని స నీ ద పా మ గా రి ”

ఈ రెండు ప్రయోగాలూ రంజిత ప్రయోగాలుగా చెప్పవచ్చు.

రాగాలాపనకు బాగా అవకాశమున్న రాగం.

అన్నివేళలూ పాడతగిన రాగం.

ఈ రాగంలో నుండి ఎన్నో జన్యరాగాలు పుట్టాయి.

గానరస ప్రధానరాగం.

త్రిస్థాయి రాగం.

ఈ రాగంలోని రచనలు ఎక్కువగా “స, రి, ప, ని ” స్వరాలతోనే ప్రారంభమవుతాయి.

ఈ రాగం కోసం మనం శ్రీ త్యాగరాజు కి ఎంతో ఋణపడి వున్నామని చెప్పాలి. ఆయన ఈ రాగం లొ   ఎన్నో అద్భుతమైన కీర్తనలు వ్రాసారు. అందువలనే ఈ రాగం ఎంతో ప్రాముఖ్యత సంపాదించింది. ఈ రాగం వలన “భైరవి” స్వరూపం బాగా తేటతెల్లమమ్యింది.

ఈ రాగం హిందుస్థానీ కాఫీ రాగంతో కలుస్తుంది.

ఈ రాగం పేరు దీనికి ఎంతో బాగా సూటవుతుంది.

“ఖర” అనేది కటపయాది సూత్రం కోసం చేర్చబడింది. “హరప్రియ” అంటే శివునికి ప్రీతిపాత్రమైనది లేదా చెవుల కింపైనది అని అర్ధం. ఇది చాలా పురాతనమైనరాగం.

సంచారం

రి గ మ పా మ గా రి – నీ ద ప ద ని ద పామ గా రి –

రి గ మ ప ద ని సా – స ని ద పా మ గా రి -రి గ మ ప ద ని సా స ని దా-

ప ద ని స రీ రీ – ద ని స రి గా గా గ రి –  గ మ గా గ రి రీ

రీ సా స ని దా – ప ద ని స రి గ రి స నీ ద – ప ద ప ద ని స

నీ ని ద పా -మ ప ని ద – ప మ గా రీ -నీ ని ద ద ప ప

మ మ గ గ రి రీ – సా ని ద – ని స రి స రీ – ని ద ప ద ని ద పా మ గా రి సా –

ని ద ని స రి సా ||

(స -ఎరుపు రంగు లో వున్న స్వరాలు హెచ్చుస్థాయి స్వరాలుగాను

స – ఆకుపచ్చ రంగులో వున్న స్వరాలు మంద్రస్థాయి స్వరాలుగాను

గమనించ ప్రార్ధన.)

 

కొన్ని ముఖ్య రచనలు

1. చక్కని రాజమార్గం –  కృతి – ఆది – శ్రీ త్యాగరాజు

2. నడచి నడచి –         కృతి – ఆది – శ్రీ త్యాగరాజు

3.  కోరి సేవింప –          కృతి  -ఆది – శ్రీ త్యాగరాజు

4. ప్రక్కల నిలబడి –      కృతి – త్రిపుట- శ్రీ త్యాగరాజు

5. రామా నీ సమానమెవరు – కృతి – రూపక – శ్రీ త్యాగరాజు

6. సంకల్పమే –           కృతి –    ఆది – శ్రీ పట్నం సుబ్రమణ్యయ్యర్

7. త్యాగరాజ –             కృతి  – ఆది – శ్రీ తిరువత్తియార్ త్యాగయ్యర్

 

చక్కని రాజమార్గం..

 

చక్కని రాజమార్గము లుండగ

సందుల దూరనేల ఓ మనసా  ?

 

చిక్కని పాలు మీగడలుండగ

ఛీయను గంగా సాగరమేలే..? |చ|

 

కంటికి సుందరతరమగు రూపమే – ము

క్కంటికి నోట చెలగే నామమే – త్యాగరా

జింటనే బాగ నెలకొన్నాది దైవమే యిటు

వంటి శ్రీ సాకేత రాముని భక్తియనే…|చ|

 

శ్రీరామ చరణారవింద భక్తి శ్రవణ కీర్తనాదులతో తొమ్మిది విధములుగా ప్రహ్లాదుడు పేర్కొనినాడు. అవియే పరమాత్మపదము చేరుటకు రాజమార్గములు. ఙ్ఞాన, వైరాగ్యములు ఉత్తమభక్తి యందే ఇమిడియున్నవి. అట్టి రాజమార్గములుండగా “సందుల దూరనేల మనసా ?” యని శ్రీ త్యాగరాజు ప్రబోధించినారు.

అందుకు ఉదాహరణముగా – చిక్కని పాలు మీగడలుండగా , ఛీ యను గంగాసాగరము (తాత్కాలికముగా మత్తు నిచ్చి తర్వాత సర్వానర్ధములు కలుగచేయునది) సేవించుటయేల అని తెలిపారు.

కంటికి సుందరరూపుడైన శ్రీరాముడే అక్షరక్షకుడు. పరమశివునికి కూడ నిత్య జపమైన దివ్య తారకనామము శ్రీరాముడు.

ఈ నామరూపములు ధ్యానించుట వలన ముక్తిపదము నందుట విశేషము. అట్టి శ్రీరాముడు త్యాగరాజింటనే ఇలవేల్పుగా నెలకొనియున్నాడు.

అనగా త్యాగరాజు స్వానుభవముతో రాముడు అంతరారాముడై చిన్మయముగా అనుభవించ బడుచున్నానని తెలిపి, అట్టి రామభక్తియను రాజమార్గము ననుసరించిన ధన్యులు శాశ్వతానందమంద గల్గుదురని ఉపదేశమిచ్చారు.

ఈరాగములో ఎన్నో సినిమా పాటలున్నా నాకు ఇష్టమైన పాట…

సంగీత సాహిత్య సమలంకృతే

స్వరరాగ పదయీగ సంభూషితే

శ్రీ భారతీ మనసా స్మరామి

శ్రీ భారతీ శిరసా నమామి..||

చిత్రం – స్వాతికిరణం

సంగీతం – శ్రీ కె. వి. మహదేవన్

పాడినవారు – శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

 

 

 

********************************************************

 

2 thoughts on “ఖరహరప్రియరాగం

  1. చాలా వివరణాత్మకం గా ఉందండీ… సాలూరి రాజేశ్వర రావు గారికి ఈ రాగం ఎంతో ఇష్టం…పాట పాడుమా… కృష్ణా… లలితగీతం ఈ రాగం లోనే కట్టి అద్భుతం గా పాడారు..

Comments are closed.


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238