May 9, 2024

శ్యామాశాస్త్రులు

రచన : శ్రీ రాఘవ కిరణ్

భారతదేశంలో కర్ణాటకసంగీతం నేటిరూపును సంతసించుకోవటానికి కారకులైన వాగ్గేయకారులలో ప్రముఖులు జయదేవులు, తిరుజ్ఞానసంబంధులు, అన్నమాచార్యులు, పురందరదాసు, నారాయణతీర్థులు, క్షేత్రజ్ఞులు, భద్రాచల రామదాసు, సదాశివ బ్రహ్మేంద్రులు, ఊత్తుక్కాడు వేంకటసుబ్బయ్య, శ్యామాశాస్త్రులు, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగబ్రహ్మము, వీణ కుప్పయ్య, మహారాజా స్వాతి తిరుణాళ్, పల్లవి శేషయ్య, పట్నం సుబ్రహ్మణ్యయ్యరు, రామనాథపురం శ్రీనివాస అయ్యంగారు, హరికేశనల్లూరు ముత్తయ్యభాగవతులు, మైసూరు వాసుదేవాచార్యులు, సుబ్రహ్మణ్య భారతి ప్రభృతులు. ఈ వాగ్గేయకారులలో పురందరదాసు “కర్ణాటకసంగీతపితామహు”నిగా పేరొందితే, “కర్ణాటకసంగీతత్రిమూర్తులు”గా పేరువడసినవారు త్యాగబ్రహ్మము, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రులు గార్లు. వీరు ముగ్గురూ ఒకే కాలానికీ ఒకే ఊరికీ (తిరువారూరు) చెందినవారు కావటం విశేషం. ఈ సంగీతత్రయంలో త్యాగబ్రహ్మంగారి పేరు వినని తెలుగువారు ఉండరని చెప్పటం సాహసం కాజాలదు. అలాగే ముత్తుస్వామి దీక్షితులు వ్రాసారని తెలియకపోయినా వాతాపిగణపతిం భజే, మహాగణపతిం మనసా స్మరామి వంటి కృతులు విననివారూ ఉండరు. ఐతే బహుశా ఆంధ్రదేశంలో రామభక్తులు ఎక్కువమంది ఉండటం వలననో లేదా నారికేళపాకంలో రచింపబడిన వీరి కృతులు పాడాలంటే గాయకులకు విశేషపరిశ్రమ అవసరమవ్వటం చేతనో లేదా వీరి శిష్యబృందం చిన్నది కావటం చేతనో లేదా వీరు రచించిన కృతులే తక్కువ కావటం చేతనో ఏమో తెలియదు కానీ ముఖ్యంగా కామాక్షిపై మాత్రమే కృతులు రచించిన శ్యామాశాస్త్రులవారు ఎక్కువమందికి తెలియరు. ఈ వ్యాసపు ప్రధానోద్దేశ్యం ఏతద్దేవీభాగవతునిగుఱించి చెప్పుకోవటం.

 

 

బంగారుకామాక్షి

 

పూర్వం కాంచీపురంలో తపఃఫలితంగా బ్రహ్మగారు పరాశక్తిదర్శనం చేసికొని ఆ ఆనందపరవశంతో అమ్మవారి బంగారుమూర్తిని చేసి అక్కడి కామాక్షి ఆలయంలో ఉంచారనీ, తరువాత తరువాత ఆదిశంకరాచార్యులు కంచి ఆలయంలోని మూలవిరాట్టుకూ ఈ బంగారుమూర్తికీ నిత్యార్చనాదికములు నిర్వర్తించే బాధ్యతను “కంభం”వారికి అప్పగించారనీ చెబుతారు. ఆంధ్రదేశంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఈ కంభంవారు తమిళదేశంలో కాంచీపురానికి తరలిపోయి అక్కడి స్మార్మబ్రాహ్మణులైన ఔత్తరవడమలలో కలిసిపోయి “కంబట్టార్” అని పిలువబడ్డారు. ఈ కంభంవారు గౌతమసగోత్రులు బోధాయనసూత్రులు. విజయనగరసామ్రాజ్యం పతనమైన తరువాత రాబోయే ఉపద్రవాలనుండి ఏతన్మతమును కాపాడుకోవాలని ఈ బంగారుమూర్తినీ మఱొక ఉత్సవమూర్తినీ వెంటబెట్టికొని కొంత ద్రవ్యంతో కుటుంబసమేతంగా ఈ అర్చకులు అమ్మవారిని సేవించుకుంటూ అడవులలోనూ గ్రామాలలోనూ తిరిగి తిరిగి దాదాపు రెండు శతాబ్దాల తరువాత తిరువారూరు చేరారు. తిరువారూరు చేరాక వారు అక్కడ ఉన్న శ్రీత్యాగరాజస్వామి ఆలయమండపంలో ఈ బంగారుమూర్తిని ఉంచి నిత్యార్చనాదికాలు యథావిధి కొనసాగించారు. తరువాత హైదరాలీ తిరువారూరుపై దండెత్తబోతే ఆ సమయానికి అర్చకులలో ముఖ్యుడైన విశ్వనాథయ్యరు తంజావూరు మహారాజుకు ఈ విషయం విన్నవించి తంజావూరు కోటలోనే అమ్మవారి పూజనాదికములకు ఏర్పాటు చేసికొన్నారు. హైదరాలీ మరణించిన తరువాత బంగారుకామాక్షికై తంజావూరు మహారాజు భూములను సమకూర్చి ఒక ఆలయాన్ని కట్టించారు.

 

తిరువారూరు అనబడే శ్రీపురంలో నిత్యం బంగారుకామాక్షినే సేవించికొనే విశ్వనాథయ్యరు వెంగలక్ష్మి దంపతులకు సంతానం లేకపోవటం చేత, వేంకటాచలపతికి కైంకర్యం చేస్తున్న భావనతో వారు ప్రతి మాసంలోనూ చివఱి వారంలో రోజూ అతిథిబ్రాహ్మణసత్కారం చేసేవారు. ఆ దంపతులు ఈ బ్రాహ్మణపూజనాన్ని ఒక వ్రతంగా చేస్తున్నపుడు ఒకనాడు “ఒక బ్రాహ్మణుడు ఒక సంవత్సరం గడిచేలోపు గుణయశోవంతుడైన పుత్రుడు జన్మిస్తా”డని ఆశీర్వదించాడు. అలా, వారికి చిత్రభానునామసంవత్సరంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా చంద్రుడు కృత్తికానక్షత్రంలో ఉన్నరోజున (హూణశకం 1762వ సంవత్సరం 4వ మాసం 26వ దినం) “వేంకటసుబ్రహ్మణ్యము” అనే అబ్బాయి జన్మించాడు. ఈ అబ్బాయిని తల్లిదండ్రులు ముద్దుగా “శ్యామకృష్ణు”డని పిలుచుకునేవారు. ఏడవ ఏట ఉపనయనమైన తరువాత తెలుగు సంస్కృతమే కాక ఈ శ్యామకృష్ణుడు తన మేనమామదగ్గఱ సంగీతం కూడా నేర్చుకున్నాడు. ఐతే విశ్వనాథయ్యరు గారి కుటుంబంలో సంగీతం నేర్చుకున్నవారు లోగడ లేకపోవటం చేత తమ పిల్లవాని ప్రతిభను ఆ తల్లిదండ్రులు గుర్తించలేదు. శ్యామకృష్ణులు తన తల్లిదండ్రులు కామాక్షి అమ్మవారిని భక్తితో సేవించటం చూచి తను కూడా అమ్మవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు పెంచుకున్నారు. విశ్వనాథయ్యరు కుటుంబసమేతంగా బంగారుకామాక్షి అమ్మవారితో తిరువారూరునుండి తంజావూరుకు చేరేసమయానికి ఈ శ్యామకృష్ణులు  18 ఏళ్ల యువకుడు.

 

సంగీతస్వామి – పచ్చిమిరియం ఆదిఅప్పయ్య

 

విశ్వనాథయ్యరుగారు తంజావూరులో ఉన్న రోజులలో ఒకసారి కాశీలో ఉండే సంగీతస్వామి అనే సంన్యాసి దక్షిణదేశసంచారం చేస్తూ చాతుర్మాస్యానికై తంజావూరు వచ్చారు. పూర్వాశ్రమంలో ఆంధ్రబ్రాహ్మణుడైన ఆయన సంగీతంలోనూ నృత్యంలోనూ గొప్ప విద్వాంసుడు. ఒకనాడు విశ్వనాథయ్యరు ఈ సంగీతస్వామిని తన ఇంటికి భిక్షకై పిలిచారు. అక్కడ శ్యామకృష్ణుని చూచి ఆయన ప్రతిభనూ భవిష్యత్తునూ గుర్తించిన సంగీతస్వామి ఆయనను శిష్యునిగా స్వీకరించి ఈ చాతుర్మాస్యకాలంలోనే సంగీతశాస్త్రంలోని అనేక మర్మాలు బోధించారు. సంగీతస్వామి తంజావూరునుండి కాశీకి తిరిగి వెళ్లిపోయేముందు తన శిష్యుడిని పిలిచి సంగీతంలోని శాస్త్రభాగాన్ని శ్యామకృష్ణులు నేర్చుకోవటం పూర్తయ్యిందనీ, ఐతే ఏతచ్ఛాస్త్రాన్ని మఱింతగా ఆకళింపు చేసుకోవటానికి ఇకపైన మంచి సంగీతం వినవలసి ఉందనీ, అందుకోసం తంజావూరులోని పచ్చిమిరియం ఆదిఅప్పయ్య గారి సంగీతం వినమనీ, ఐతే ఆయనవద్ద ఏమీ నేర్చుకోవద్దనీ చెప్పారు. అలా సంగీతస్వామి ప్రబోధంపై పద్ధెనిమిదేళ్ల శ్యామాశాస్త్రులు తంజావూరు రాజాస్థానంలోని యాభై ఏళ్లు పైబడ్డ ఆదిఅప్పయ్య గారి సంగీతం వినటమూ, తరువాత వారిరువురి మధ్య స్నేహం చివురించి బలపడటమూ జఱిగింది. విశ్వనాథయ్యరు గారి తరువాత బంగారుకామాక్షి పూజనాదికములు సంక్రమింపజేసుకున్న శ్యామాశాస్త్రులను ఈ పచ్చిమిరియం ఆదిఅప్పయ్య గారు “కామాక్షీ” అని గౌరవంగా పిలిచేవారు.

శ్యామాశాస్త్రుల వైభవం

 

శ్యామాశాస్త్రులు పరమదేవీభాగవతులు, బోలెడు సందర్భాలలో ఆయనకు కామాక్షీదర్శనం చేసికొన్నారు. అలా దేవిని దర్శించిన సమయాలలో కన్నులవెంట ఆనందాశ్రువులు కారుతూండగా, ముఖ్యంగా తెలుగు సంస్కృత భాషలలో, అత్యంతలలితమైన పదాలతో, ఆయన గానం చేసిన కృతులు ఒక చిన్నిపిల్లవాడు తన తల్లికై ఏడిచినంత లేతగా కరుణార్ద్రంగా ఉంటాయి. మనోహరమైన భావంతో గంభీరమైన రాగతాళగతులతో చౌకమధ్యమగతులలో పాడబడి ఈ కృతులు అలరారుతూంటాయి. వీరి “పాలించు కామాక్షి పావని” (మధ్యమావతి) కృతిలో చివఱనున్న “కారుణ్యమూర్తివై జగముఁ గాపాడిన తల్లి కదా, నేను నీదు బిడ్డను, లాలించి పాలించు కామాక్షీ” అన్న పంక్తులు కదలించివేస్తాయి.

 

అమ్మవారి భక్తులైన తన తల్లిదండ్రులు తనను శ్యామకృష్ణా అని ముద్దుగా పిలవటం చేత ఆయన తన కృతులలో “శ్యామకృష్ణ” అనే ముద్రనే వాడారు. శ్యామాశాస్త్రులు నరులకై కృతులు వ్రాయలేదు, ప్రత్యేకించి తన కృతులను ఎవరికీ నేర్పనూ లేదు. ఐతే ఒకే ఊరివారు కావటం చేత తఱచుగా శ్యామకృష్ణులవారూ త్యాగబ్రహ్మముగారూ కలుసుకుంటూ ఉండేవారని అనేకానేక విషయాలు వారి చర్చలలో వచ్చేవనీ తెలుస్తోంది. ముత్తుస్వామి దీక్షితులకు శ్యామశాస్తులవారే శ్రీవిద్యను ఉపదేశించారని కూడా చెబుతారు.

 

అమ్మవారి ప్రేరణపై మధురలో మీనాక్షీదర్శనము చేసికొన్న శ్యామాశాస్త్రులు ఆశువుగా అమ్మవారిపై తొమ్మిది కృతులు పాడారనీ, వాటికి “కమలాంబానవరత్నమాలికాకృతులు” అని పేరనీ చెబుతారు. ఐతే ప్రస్తుతానికి ౧ సరోజదళనేత్రి హిమగిరిపుత్రి (శంకరాభరణం) ౨ దేవి మీననేత్రి (శంకరాభరణం) ౩ మఱి వేఱే గతి యెవ్వరమ్మ (ఆనందభైరవి) ౪ నన్ను బ్రోవు లలితా (లలిత) ౫ మా యమ్మ యని నేఁ బిలచితే (ఆహిరి) ౬ దేవి నీదు పదసారసములే దిక్కు (కాంభోజి) ౭ మీనలోచని బ్రోవ యోచనా (ధన్యాసి) అనే ఏడు కృతులు మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి.  మిగతా రెండు కృతులు ఏమిటి అన్న విషయం ప్రస్తుతం ఇదమిత్థంగా తెలియదు.

 

ఈ నవరత్నమాలికాకృతులే కాక “రత్నత్రయం” అని చెప్పదగిన మూడు స్వరజతులను యదుకులకాంభోజి, తోడి, భైరవి రాగాలలో శ్యామాశాస్త్రులవారు కల్పించారు. ఈ మూడు స్వరజతులూ భావప్రస్తారంలోనూ రాగస్వరూపాన్ని చూపించటంలోనూ మిక్కిలి గంభీరంగా ఉండి గాయకులకూ శ్రోతలకూ సమానంగా ఆనందం కలిగిస్తాయి. పదవర్ణాలకు దగ్గఱగా ఉండే స్వరజతులు అప్పటివఱకూ నాట్యానికి మాత్రమే పరిమితమైతే, శ్యామాశాస్త్రులు వాటికి సంగీతంలో కూడా ప్రత్యేకస్థానం కల్పించారు.

 

శ్యామాశాస్త్రులవారికి ఆనందభైరవి రాగం అంటే మిక్కిలి ప్రీతి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓ జగదంబా నన్ను నీవు జవమున బ్రోవుము, పాహి శ్రీగిరిరాజసుతే, మఱి వేఱే గతి యెవ్వరమ్మ మహిలో బ్రోచుటకు, హిమాచలతనయ బ్రోచుటకిది మంచిసమయము రావే, సామిని రమ్మనవే, మొదలైనవి విన్నవారికి ఆనందభైరవి రాగం వినాలంటే శ్యామాశాస్త్రుల రచనలే వినాలని అనిపిస్తుంది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అంతలా ఆ రాగాన్ని తన స్వంతం చేసుకున్న ప్రతిభాశాలి ఆయన.

 

ఆనందభైరవి, భైరవి, కాంభోజి, కల్యాణి, శంకరాభరణం, తోడి వంటి రాగాలేగాక; కలగడ (పార్వతి నిన్ను నే నెఱనమ్మితి), మాంజి (బ్రోవవమ్మా), చింతామణి (దేవి బ్రోవ సమయమిదే) వంటి అపూర్వమైన రాగాలలో కూడ శ్యామాశాస్త్రులు కామాక్షి అమ్మవారిని స్తుతించి ఆనందించారు. అలాగే శ్యామాశాస్త్రులకు ఉన్న లయజ్ఞానం అపారమైనది అని త్యాగబ్రహ్మమంతటివారే బహుధా ప్రశంసించారని, శ్యామాశాస్త్రుల కృతులు లయబద్ధంగా పాడలేని ఆయన శిష్యులను త్యాగబ్రహ్మంగారు మందలించారనీ చెబుతారు.

 

ఒకసారి తంజావూరు ప్రజలందరి కోరికపై, బొబ్బిలి కేశవయ్య అనే గొప్ప సంగీతవిద్వాంసుడు “సింహనందన” అనే తాళంలో (ఒక ఆవృతానికి 128 అక్షరాలు) పాడిన పల్లవిని శ్యామాశాస్త్రులు తాను అలవోకగా పాడి, తిరిగి “శరభనందన” (ఒక ఆవృతానికి 79 అక్షరాలు) అనే తాళంలో తాను పాడిన పల్లవిని పాడమని అడిగితే పాడలేక కేశవయ్య వెలవెలబోయారు. శ్యామాశాస్త్రుల లయజ్ఞానానికి సంబంధించి ఈ సంఘటన ఒక నికషోపలం. త్యాగబ్రహ్మం గారు భావానికీ, ముత్తుస్వామి దీక్షితులు రాగానికీ, శ్యామాశాస్త్రులు తాళానికీ ప్రసిద్ధులు.

 

శ్యామాశాస్త్రుల కృతులు గహనమైన గతులలో ఒప్పుతుంటాయి. సరోజదళనేత్రి (ఆది), హిమాద్రిసుతే (రూపక) కృతులనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఐతే ఆది రూపక తాళాలలో కృతులకంటె మిశ్రచాపులో ఉన్న శ్యామాశాస్త్రుల కృతులు ముఖ్యంగా చెప్పుకోదగినవి. సామాన్యమైన మిశ్రచాపు (తకిట-తకధిమి నడక) మాత్రమే కాక విలోమచాపు (తకధిమి-తకిట నడక) కూడా వీరి ప్రయోగాలలో చూడవచ్చు. తిస్ర మిశ్రాది నడకలలో రచింపబడిన వీరి కృతులు ఈయనకు లయపై ఉన్న పట్టును తెలియజేస్తున్నాయి. లయలో అందాన్ని అనుభవించాలంటే చాపుతాళమే చూడాలి, అందులోనూ శ్యామాశాస్త్రులవారి కృతులే వినాలి అని పెక్కుమంది సంగీతజ్ఞుల అభిప్రాయం.

 

రక్తిరాగాలైన ఆనందభైరవి వంటి వాటిపైన శ్యామాశాస్త్రులకు మక్కువ కలగటానికి బహుశా వారి ముందు తరానికి చెందిన పల్లవి గోపాల అయ్యరు, తిరుచ్చి మాతృభూతయ్య గార్లు కొంతవఱకూ కారణం అయ్యుండవచ్చునని కొందరు అభిప్రాయపడతారు. అలాగే మిశ్రచాపువంటి తాళాలపైన అభిమానం పెరగటానికి నాటి భాగవతమేళాలవారి నాటకాలూ దారువులు కారణమయ్యుండవచ్చు అంటారు. అంతే కాక శ్యామాశాస్త్రుల భైరవి స్వరజతిపై పచ్చిమిరియం ఆదిఅప్పయ్య గారి (విరిబోణి వర్ణం) ప్రభావం ఉందని అంటారు.

 

కృతిరచనలో స్వరాక్షరాలు వాడటంలో కూడా శ్యామాశాస్త్రులది అందివేసిన చేయి. ఉదాహరణకు వీరి “దేవి నీదు పదసారసములే” కృతిలో “పదసా”రసములే అన్నపుడు ప-ద-సా అన్న స్వరాలే పాడబడతాయి. స్వరాక్షరాల వాడుక మాత్రమే కాక, తాళానికి అతీతంగా “సరసముఖి” “వరమొసగు” “కమలముఖి” మొదలైన పంచలఘువర్ణాలు వాడటం కూడా ఈయన రచనలలో గమనించవచ్చు. ఇటువంటి అద్భుతమైన లయజ్ఞానం వలన, వీరి కృతులలో కొన్ని రెండు తాళాలలో పాడుకోవటానికి అనువుగా ఉంటాయి. ఉదాహరణకు వీరి “శఙ్కరి శం కురు చంద్రముఖి” కృతిని రూపక తాళంలో పాడినా ఆదితాళచ్ఛాయలు కనబడుతూంటాయి. ఏ ఇతర వాగ్గేయకారుడూ కూడా శ్యామాశాస్త్రులలాగ లయప్రస్తారం చేయలేదు అని చెప్పవచ్చు. వీరి కృతులలో కళ్యాణిరాగంలో పాడబడే “హిమాద్రిసుతే” “బిరాన వరాలిచ్చి” కృతులకు వేఱు వేఱు సాహిత్యాలైనా (మాతువు) ఒకే స్వరం (ధాతువు) ఉండటం విశేషం.

 

వీరి ఇతర కృతులలో ముఖ్యమైనవి: కనకశైలవిహారిణి (పున్నాగవరాళి), నన్ను బ్రోవు లలిత (లలిత), దురుసుగాఁ గృపజూచి (సావేరి), ఏమని మిగుల వర్ణింతు (తోడి), వేగమే వచ్చి (తోడి), కరుణఁ జూడవమ్మా (వరాళి), దయఁ జూడ (జగన్మోహిని), అఖిలాండేశ్వరి (కర్ణాటకకాపీ), పాలింపవమ్మా (ముఖారి), నీలాయతాక్షీ నీవే జగత్సాక్షి (మాయామాళవగౌళ), నన్ను బ్రోవరాదా (జనరంజని), నన్ను బ్రోవరాదా (గౌళిపంతు), తరుణం ఇదమ్మా ఎన్నై రక్షిక్క (గౌళిపంతు), నిను వినా (పూర్వీకళ్యాణి), నిన్నే నమ్మితి  (కేదారగౌళ), పరాకేల నన్ను (కేదారగౌళ), కరుణఁ జూడు (శ్రీ).

 

ముత్తుస్వామి దీక్షితులు, త్యాగబ్రహ్మం గార్లవలె శ్యామాశాస్త్రులు కూడా జ్యోతిశ్శాస్త్రంలో ప్రవీణులు. తన భార్య చనిపోయిన ఆఱవనాట తను కూడా సిద్ధి పొందుతానని ముందే చెప్పికొన్నారు. వ్యయనామసంవత్సరంలో మకరమాసంలో శుక్లదశమి నాడు (హూణశకం 1827వ సంవత్సరం 2వ మాసం 6వ దినం) తన ద్వితీయపుత్రుడైన సుబ్బరాయశాస్త్రుల ఒడిలో తలపెట్టికొని, కొడుకు తన చెవిలో కర్ణమంత్రం ఉచ్చరిస్తూండగా శ్యామాశాస్త్రులు కామాక్షిలో ఐక్యమయ్యారు.

 

సుబ్బరాయశాస్త్రులు

 

శ్యామాశాస్త్రుల శిష్యులలో సుబ్బరాయశాస్త్రులు, పొరంబూరు కృష్ణయ్య, అలసూరు కృష్ణయ్య, దాసరి అనే నాదస్వరవిద్వాంసుడు ప్రముఖులు. దుందుభి నామ సంవత్సరంలో సింహమాసంలో కృత్తికానక్షత్రంలో జన్మించిన శ్యామాశాస్త్రుల రెండవ కుమారుడైన సుబ్బరాయశాస్త్రులు తన తండ్రిగారివద్దనే కాక, సంగీతత్రయంలోని మిగిలిన ఇద్దరివద్ద కూడా సంగీతం నేర్చుకున్నారు. శ్యామాశాస్త్రుల కృతులవలెనే సుబ్బరాయశాస్త్రుల కృతులు కూడా ఘనభావరాగతాళాలతో శ్రోతలను రంజింపజేస్తాయి. శంకరి నీ యని (బేగడ), ఏమా నిన్నే (ముఖారి) వంటివి ఆయన అద్భుతమైన స్వరసాహిత్యాలకు నిలువుటద్దాలు. సుబ్బరాయశాస్త్రులు “కుమార” ముద్రతో చేసిన రచనలలో ముఖ్యంగా వేంకటశైలవిహార (హమీర్ కళ్యాణి), నిను వినా గతి గాన జగాన (కళ్యాణి), జననీ నిను వినా (రీతిగౌళ) మొదలైనవి కచేరీలలో తఱచుగా వినబడుతూ ఉంటాయి.

 

ఉపసంహారం

 

లలిమైన పదసంపదతో, ఘనమైన రాగతాళగతులో, నారికేళపాకంలో రచింపబడ్డ శ్యామాశాస్త్రులకృతులు అర్థం చేసుకొని పాడే దమ్ము లేని కొందరు సంగీతజ్ఞులు శ్యామాశాస్త్రుల కృతులు కష్టమైనవి అన్న ప్రచారం కల్పించారు. ఈ విషయాన్నే చెబుతూ సుబ్బరామ దీక్షితులు సంగీతసంప్రదాయప్రదర్శినిలో శ్రీనాథుని శృంగారనైషధంలోని ఈ పద్యాన్ని ఉదహరించారు:

 

పనివడి నారికేళఫల పాకమునం జవియైన భట్టహ

ర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందఱయ్యలౌ

నని కొనియాడనేరరదియట్టిద లేజవరాలు చెక్కు గీ

టిన వసవల్చు బాలకుఁడు డెందమునం గలఁగంగ నేర్చునే (1-17)

 

[యవ్వనవతి ఐన స్త్రీ పాలుగారే బాలుని బుగ్గ గిల్లినా ఆ బాలుడు ఏమైనా కలతపడతాడా? అలాగే నారికేళపాకంలో రచింపబడిన ప్రౌఢకావ్యాన్ని అర్థంచేసికొని ఆనందించాలంటే ప్రయత్నమే కాదు పాండిత్యం కూడా కావాలి.]

శ్యామాశాస్త్రుల రచించిన కృతులు మున్నూఱు మాత్రమే. రాశిలో ఎక్కువ కాకపోయినా వాసిలో ఘనమైనవి కావటం చేత శ్యామాశాస్త్రుల కృతులకు కర్ణాటకసంగీతంలో అద్వితీయమైన స్థానం ఉంది.

శ్యామశాస్త్రి కృతులు కొన్ని ఇక్కడ వినవచ్చు::

5 thoughts on “శ్యామాశాస్త్రులు

  1. మీ వ్యాసం మంచి సమాచారాన్ని అందించింది. ధన్యవాదాలు. అలాగే వీలైతే మిగిలిన ఇద్దఱి గుఱించి కూడా విపులంగా వ్రాయగలరని ఆశిస్తున్నాను.

Comments are closed.


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238