December 7, 2021

నేటికీ మేటైన సుమతీ శతకంలోని నీతులు.

రచన: శ్రీమతి ఆదూరి హైమవతి

తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ శతకాలకు ఒక ప్రముఖ  స్థానం  ఉంది. ఎంతో మంది తెలుగు వారు   ఇష్టపడే శతకాలలో సుమతీ శతకం కూడా ఒకటి. శతకం అనగా నూరు ఆపైన 8 పద్యాలు ఉండే చిన్న గ్రంధం .శతకాలలో పద్యాలన్నింటి చివరా ఒకే ‘ముకుటము ‘ అంటే , ఒక పదం లేక వాక్యం, అంటే చివరి చరణం ఒకటే ఉంటుంది. ఇది ఒక  ఆనవాయితీ. దీన్నే’ముకుటము’అంటారు . ఇది ఆ రచయిత కు గుర్తుగాఉంటుంది.  ఉదాహరణకు’ విశ్వదాభిరామ వినురవేమ ‘అనేది వేమన శతకానికి ముకుటము, అలాగే ‘ సుమతీ ‘అనేది  ‘సుమతీ శతకానికి ‘ ముకుటము, అలాగే’ వెంకటేశ్వరా’, ‘దాశరధీ కరుణాపయోనిధీ  ‘, ‘కుమారీ ‘ , ‘తెలుగుబాల ‘, అనేవి ఆయా శతక కారులు తమకు గుర్తుగానో, తాము చెప్పదలచిన దానికి గుర్తుగానో వ్రాయడం జరుగుతుంటుంది.

ఈ శతకాలు సామాన్య ప్రజలకూ సులభగ్రాహ్యంగా ఉండటం వలన ప్రజల ఆదరణ పొందటం జరిగింది. మొన్న మొన్నటి వరకూ  తెలుగునాట  ఏపల్లె వారిని పలకరించినా ఏదో ఒక శతకంలోని పదాన్ని ఉదహరించి మాట్లాడేవారు. ఈనాడు  ఏ తరగతి తెలుగు వాచకంలోనూ శతకాలకు తగిన ఆదరణ లేదని చెప్పవచ్చు. అందు చేతే పసితనంలో నీతులు నేర్వడమనేది కొంత తగ్గిందని చెప్పకతప్పదు. షుమారుగా 20,25 సం. క్రితం వరకూ ప్రతి తరగతిలోనూ ప్రాధమిక స్థాయిలో ఒక్కొక్క శతకం తప్పక నేర్పించేవారు. దానివల్ల  6,7 తరగతులకువచ్చే సరికి గ్రహణ  శక్తి పెరిగి , తెలుగుపై  కొంత  అవగాహన , అధికారం[ grip]  వస్తుండేది. నేడది లోపించిందని చెప్పవచ్చు. దీనివలన తెలుగు భాషా ఙ్ఞానమూ పిల్లల్లో తగ్గి పదాల వాడుక కష్టతరమౌతున్నది.

తెలుగులో శతక సాహిత్యము  పండితులకూ , పామరులకూ వారధిగా ఉంటూ వచ్చింది.శతకాల్లో ముఖ్యంగా  ‘వేమనశతకానికీ‘,‘సుమతీశతకానికీ‘ఉన్నప్రాచుర్యం  అత్యధికం .

అన్నిశతకాల్లాగే  సుమతీ శతకం కూడా 108 నీతి పద్యాల సమాహారం.

‘ సుమతి ‘ అంటే ‘ మంచి బుధ్ధి ‘ కలవాడని అర్ధం, ‘ సు ‘ అనగా మంచి, ‘ మతి ‘ అనగా బుధ్ధి. ఈ శతకం పఠించి, అర్ధం గ్రహిస్తే ‘ మంచి బుధ్ధి ‘ తప్పక మన  స్వంత మవుతుంది. బద్దెనకవి ఈ సుమతీ శతక కర్త. సులభ  గ్రాహ్య మైన చిన్న చిన్న పదాల కూర్పుతో ఈ శతక పద్యాలు  ఉండటం వలన చిన్న పిల్లలకు సైతం సులువుగా అర్ధమవు తాయి. ఈ పద్యాలలోని  నీతులు తెలుగువారి  జీవితంలోనూ, భాషలోనూ మమేకమైపోయాయి.ఈ సుమతీ శతకం లోని ఎన్నో పద్య పాదాలను సామెతలుగా తెలుగువారు తమ సంభాషణల్లోవాడటం  జరుగు

తుంటుంది.  1840లో సి.ఫై.బ్రౌన్  సుమతీ  శతకాన్ని ఆంగ్లం లోకి  అనువదించాడు.

వందలఏళ్ళనుండీ  సుమతీ శతక పద్యాలు పండితుల, పామరుల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. సుమతీ శతక పద్యాలలోని పాదాలు చాలా తేలికగా గుర్తుంటాయి.   పదాలన్నీ నిత్య జీవితంలో వాడుకునేవీ, వినేవిగా ఉండి భాష ఎంతో సరళమైనది , విన సొంపైనది కావటం వల్ల వీటి అర్ధాలకొరకు ఏశబ్దార్ధ చంద్రికలూ వెతకనవసరం లేదు. పెద్ద పెద్ద సమాసాలు గానీ, సంస్కృత పదాలు గానీ లేవు. పద్యాలు రాగయుక్తంగా, జల జల పారే ఏరులా  ఉంటాయి. పద్యాలన్నీ ‘కందం ‘ ఛందస్సులో,  “సుమతీ” అనే మకుటంతో ఉన్నాయి .

నాలుగు  చిన్న పాదాల  [లైన్ల్] పద్యాలు   గనుక , వల్లె  వేయనవసరం లేకుండానే విన్నంత మాత్రాన గుర్తుండి పోతాయి.

సుమారు ఏడు వందల ఏళ్ళ క్రితం వ్రాయబడినా, దాదాపు అన్ని పదాలూ ఇప్పటి భాషలోనూ వాడుకలో ఉన్నాయి. భాషా ఙ్ఞానం ఉన్నవారికి  మాత్రమే పరిమితమైన శతకంకాదు  ఇది.   పెద్దగా కష్ట పడకుండానే గుర్తు పెట్టుకొనే శక్తి ఈ పద్యాలలోని పదాలలోనూ, వాటిని కూర్చిన శైలిలోనూ అంతర్లీనమై ఉంది. అందుకే  చదవడం  రాని వాళ్ళు కూడా సుమతీ శతకంలోని  పద్యాలను గుర్తుంచుకుని  సులువుగా చెప్ప గలుగుతున్నారు.

ఆనాటి నుండీ తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకూ, ఉపాధ్యాయులు  తమ శిష్యులకూ సుమతీ శతకంలోని నీతి పద్యాలను  సులువుగా అర్ధమయ్యేలా రాగయుక్తంగా పాడి నేర్పగలుగుతున్నారు. 700 సంవత్సరాల తరువాత కూడా ఈ సుమతీ శతకం లోని సూక్తులు ఈ నాటి సమాజానికి అద్దం పట్టి నట్లుండటం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆకవి రానున్న కాలాన్ని ఆరోనేత్రంతో[సిక్స్ సెన్స్ తో]   చూసి వ్రాసినట్లు అక్కడక్కడా మనకు గోచరిస్తుంటుంది. చెప్పదలచిన విషయాన్ని సూటిగా, కొద్ది పదాలలో చెప్పిన విధానం అత్యద్భుతం. మొదటి పద్యంలోనే  కవి “ధారాళమైన నీతులు  నోరూరగ  జవులుపుట్ట   ఔరా  యనగా నుడివెద ” నని చెప్పుకున్నాడు. ఇందుకు పూర్తి న్యాయం చేయగలిగాడు. ఎక్కడా ఒక్కమాట అధికం, అనవసరం, అని పించదు. కొన్నిచోట్ల కవి ఉపయోగించిన పదాలు ఆయన నేర్పరితనాన్నీ, చాతుర్యాన్నీ చూపుతాయి.

ఈ సుమతీ శతకంలోని  పద్యాలు ఆనోటా ఆనోటా నాని తర్వాతి తరాలవారికి అందటం వలన  ఈ శతకం వ్రాత ప్రతులు అలభ్యమై ఉండవచ్చు.మొదటకవి వ్రాసినవి యధాతధంగా ఉన్నట్లు అనిపించదు .మధ్య మధ్యలో ఇతరులు  జొప్పించిన పద్యాలు కొన్ని , పదాలు కొన్ని అక్కడక్కడా  కలిసినట్లు తోస్తుంది.“చీటికి ప్రాణము వ్రాలు” అనేది “కుంఫిణీ యుగం” కాలంలో పుట్టిన పదం కావచ్చునేమో నిపిస్తుంది. “వైదీకి”, “రొక్కము”  అనే పదాలు అంత పాతకాలం నాటివి  కాకపోవచ్చును. ఐనా  ఎక్కువ  పద్యాలకు పెద్దగా పాఠాంతరాలు  లేవు. కనుక  పద్యాలను స్థూలంగా పరిశీలిస్తే ఆనాటి  జీవన గతి, సమాజ స్థితి మనకు తెలుస్తుంది.

కవి ఈ శతకాన్ని వ్రాసేనాటికి  తెలుగు  భాష మాట్లాడేవారివి   చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి , రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండవచ్చుననిపిస్తుంది. సమాజంలోని ఇబ్బందులనూ, పేదరికాన్నీ ఆసరాగా తీసుకుని కొందరు మిగిలినవారిని పీడించే వారనీ , సామాన్య స్త్రీలలో విద్య అతి తక్కువగా ఉన్నట్లు తోస్తుంది.  పడుపు వృత్తి విస్తృతంగా ఉన్నట్లూ, సాని వారి వెంటబడి తమ సంసారాలను గుల్ల చేసుకొనేవారు పుష్కలంగా  ఉన్నట్లు కూడా అనిపిస్తుంది.  వేమన కాలంలో కూడా సమాజం అలాగే ఉన్నట్లు   మనకు వేమన చరిత్ర , ఆయన విరక్తి చెంది వ్రాసిన వేమన శతక పద్యాల ద్వారా  తేటతెల్లమవుతున్నది కదా! అలాగే  వివాహేతర సంబంధాలు , వివాహానికి ముందు అక్రమ సంబంధాలు ఉండి ఉండవచ్చు. రాజుగారి బంట్లు, కరణాలు ఎక్కువ గా అధికారాన్ని చలాయిస్తున్నట్లూ, డబ్బుకు అప్పుడూ గట్టి  అధికారమూ , పెద్ద

పీటా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉద్యోగులకు లంచాలిస్తేనే  పని జరుగు తుండ వచ్చు.

ఈ పద్యాల వల్ల ప్రజలు అప్పులు చేసి  వడ్డీల ఊబిలో కూరుకుపోయి దివాలా తీయడం జరిగినట్లు అర్ధ మవుతుంది. అల్లుళ్ళు అత్త మామల ఆస్తులను పిండేయడం అప్పుడూ జరిగేదని తోస్తుంది. ఎక్కువమంది సామాన్య జనులు సత్ప్రవర్తనకు,  సత్యానికి,  ధర్మానికి విలువ నిచ్చేవారై ఉండవచ్చు. ఇల్లాలిని సంతోష పెట్టడం  గృహస్తుని కర్తవ్యంగా  భవించేవారేమో!. మాటకు, మర్యాదకు  నిత్య వ్యవహారంలో చాలా ప్రాముఖ్యం ఇస్తుండే వారని పిస్తుంది. బాల్య వివాహాలు అప్పటికి  ఉన్నట్లు లేవు.  రాజులు, మంత్రులు, గ్రామాధి కారులు న్యాయానికి, చట్టానికి బాగా ప్రాముఖ్యత నిస్తుండవచ్చు. కనుక సమాజం  అల్లకల్లోలంగా  ఉన్నట్లు అనిపించదు.  అంత పేదరికమూ ఉన్నట్లనిపించదు. సంపన్నుల ప్రస్తావన తరచు వస్తుంది. ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువులనూ ధనికులు బహుశా తమ వాహనాలుగా వాడుతుండవచ్చు. జనంలో  ‘రసికత’కు మంచి ప్రాముఖ్యత ఉండవచ్చు. బహు విధాలైన శృంగారాల  ప్రస్తావన మనకు శతకంలో గోచరిస్తుంది. పద్యాలన్నీ  పిల్లలకు  సంబంధించిన నీతులు మాత్రమే  కాదు. పెద్దలకు కూడా అనదగిన నీతిపద్యాలు చాలా  ఉన్నాయి.

ఇప్పటి  “సామాజి సృహ”  పరంగా ఉన్న అవగాహనతో చూస్తే కొన్ని పద్యాలలో కనిపించే ఆనాటి దృష్టి

అసంబద్ధంగా కనిపిస్తుంది.  “నమ్మకు మీ వామ హస్తుని” అనీ, ముఖ్యంగా స్త్రీల పట్ల, కొన్ని కులాల పట్ల వ్యక్తమైన అభిప్రాయాలు మనకీ నాడు  కాస్త  కష్టంగా  అనిపిస్తాయి. ఉదాహరణకు–“కోమలి నిజము, గొల్ల ని సాహిత్య విద్య ,వంటివి.  ఎవరైనా తమ కాలానికి సంబంధించిన అభిప్రాయాలకు బధ్ధులై వ్రాస్తారని  మనం భావించాలి.

అప్పిచ్చువాడు, వైద్యుడు,

ప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్

జొప్పడిన యూర నుండుము,

చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!.

కష్ట సమయంలో  అవసమైనపుడు చేబదులిచ్చేస్నేహితులు  ,ఆరోగ్యం  బావులేనపుడు  వైద్య సేవలు అందించే వారూ, నిరంతరం నీటితో పారేనది ,పుట్టుకకూ, చావుకూ మంచీ చెడూ చెప్పే  బ్రాహ్మణుడు ఉన్న ఊరిలోనే నివసించ మంటాడు బద్దెన కవి.  ఇవి లేని ఊరు నివసించను మానవులకు పనికిరాదని అర్ధం ,అంటే సంఘజీవి ఐన మానవుడు తన అవసరాలకు అన్నీ అభించే ప్రదేశాన్నే నివసించను ఎంపిక చేసుకోవాలని కవి ఉవాచ  కావచ్చు.

శ్రీరాముని దయచేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనగా

ధారాళమైన నీతులు

నోరూరగ జవులు బుట్ట నుడివెద సుమతీ !.
 ఓ మంచి బుధ్ధిగలవాడా! శ్రీరామచంద్రుని కృపచేత, సకల జనులకూ అవసరమైన  నీతులను  వినువారికి అర్ధమయ్యే లాగున  చెప్తాను.–  అంటూ కవి తన సుమతీ శతకాన్ని మొదలెట్టారు.

అల్లుని మంచితనంబును –పద్యంలో —   అల్లుని  మంచితనమూ, గొల్ల వాని విద్వత్తూ,  స్త్రీ సత్యవాఃక్కూ , విత్తనం విరక్కుండ దంచిన బియ్యమూ , తెల్లని కాకులూ  లోకములో లేవని అన్నాడు కవి.  ఈనాడు  ఈ విషయాలు నిజాలని మనం అనలేము. ఈనాటి అల్లుళ్ళంతా  అత్త మామలను కొడుకులవలె చూసు కుంటున్నారు. ఇహ విద్వత్తు తెలివి వున్నవారందరి సొత్తూ ఐంది. తెల్లని కాకులూ  ఉన్నాయని విన్నాం, స్త్రీలు అసత్యం మాత్రమే చెప్తారనటం ఈనాడు ఎవ్వరూ ఆమోదించరు. కనుక అది ఆనాటి సంఘంలోని ఆలోచనలను ఆయన చెప్పారని  భావించాలి.
ఆఁకలి యుడుగని కడుపును–, అప్పుగొని చేయు విభవము, నధికార రోగపూరిత బధిరాంధక శవము, కుజనుల తోడ కూరిమి ,అక్కరకురాని చుట్టము, అంటూ ఏవేవి వదలాలో ఏవి అనుసరించాలో చెప్పాడు. ఎప్పుడు సంపదలు గలిగిన నప్పుడు బంధువులు వత్తురు– అంటూ ఆనాటి చుట్టాల గురించీ వివరించాడు. బలముగల సర్పము కూడా చలిచీమలచేతుల్లోపడి చనిపోతుంది కనుక   ఐకమత్యంగా ఉంటే ఏమైనా సాధించవచ్చంటాడు.
‘ఇచ్చునదె విద్య’ అంటూ విద్యాదానం గొప్పదనాన్నీ, ’సో కోర్చువాఁడె మనుజుఁడు ‘,-కష్టాన్నికి ఓర్చుకోడం అవసరమనీ,’ ఇత్తడి బంగారమగునె ‘ –అంటూ మంచిచెడులను తెల్సుకుని మసలమంటాడు. ’ఖలునకు నిలువెల్లవిషము ‘ – అంటూ చెడ్డ వానిస్వభావం  పాము కంటే  తేలుకంటే  అధికమని  చెప్తాడు. ‘కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టి  ‘ -అర్హతలేని వారికి అధిక గౌరవం ఇవ్వడం వృధా అని మానవుల వివేకాన్ని లేపుతాడు.

‘ వరదైన చేను దున్నకు ‘ –వరద ముంచిన చేనును దున్నటం వలన శ్రమవృధాకావచ్చు, ముందు దానిని ఎత్తు చేసుకుని ఆతర్వాతే వ్యవసాయం సాగించాలి.  ‘ తినను తిండిలేని కరువు ‘  ప్రాప్తించినా   బంధువుల ఇంటికి పోయి అవమానాల పాలు కావద్దంటాడు. ఇతరులకు రహస్యాలను  చెప్పి ఇక్కట్ల పాలు కావద్దనీ, పిరికి వాడికి  పనులు అప్పగించి నష్టపోవద్దనీ అంటాడు.
‘ వెలయాలు సేయు బాసలు ‘ —అనేపద్యంలో కొంత కుల ప్రస్తావన ఉంది, కానీ ఆనాడు వేశ్యలపాలై  తమ సంసారాలను కూలదీసుకున్నవారికి  కనువిప్పు కలిగేలా’   వేశ్య  ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల  జత, కలలో చూసిన సంపద ‘ లను స్పష్టంగా నమ్మరాదు అన్నాడు, అదిఆనాటి సంఘంలోని వాడుక కావచ్చు.

‘ వీడెము సేయని నోరును ‘ —తాంబూలం వేసుకోని, స్త్రీల అధరామృత పానం చేయని, గానం చేయని నోరు పెంట బూడిద పోసుకొనే గోయితో సమానం సుమా! –అంటూ ఆనాటి  సమాజంలోని  అతి  తీవ్రంగా  ఉన్న సౌందర్య పిపాసను ,జనంలో  ‘రసికత ‘  ను  తెలుపుతాడు. అవన్నీ  కీడుకే  అని గమనించాలి.

‘ వినదగు నెవ్వరుచెప్పిన ‘ –ఎవరు ఏం చెప్పినా వినవచ్చు కానీ  నిజానిజాలు పరిశీలించి నిగ్గు తేల్చాలనీ, తొందరపడి ఏమీ నిర్ణయించ రాదనీ అట్టి వాడే తెలివైనవాడని అంటాడు.తొందర అనర్ధ హేతువని భావన.

‘  లావుగల వాని కంటెను ‘ — పెద్ద శరీరంగల  ఏనుగును  దానికంటే  చిన్నవాడైన మావటి లోబరుచుకుని ఎక్కుతున్నాడు, అంటూ శరీర బలం కలవాని కంటే బుద్ధిబలం కలవాడే నిజమైన బలవంతుడ ని బుధ్ధికి ప్రాధాన్య మివ్వమని చెప్తాడు.
‘ పలికి బొంకడం,  ఆప్తబంధువులను  నిందించడం తప్పంటాడు.

‘మాటకు బ్రాణము సత్యము ‘ –మాటకు సత్యం, దుర్గానికి దాన్ని సరిగా కాచి కాపాడే గొప్ప సైన్యమూ, స్త్రీకి అభిమానమూ, పత్రానికి సంతకమూ, ముఖ్యమైనవి.
‘మంత్రి గలవాని రాజ్యము ‘ –అనేపద్యంలో – సమర్థుడైన మంత్రి ఉంటే సామ, దాన, భేద, దండము వంటి ఉపాయాలతో , రాజ్య పాలన సక్రమంగా సాగు తుందనీ,అలాంటి తెలివైన మంత్రులు లేని నాడు రాజ్యం మరలూడిన యంత్రంవలె [ మిషన్ ] కదలదని అర్ధం.

‘బంగారు కుదువబెట్టకు ‘  – అనే పద్యంలో – సరకులు అప్పుగా తెచ్చుకొవద్దనీ , దాని వలన అప్పు అధికమై అపాయం పాలవుతామనీ , మూఢునితో  స్నేహం  ప్రమాద భరితమనీ …..

‘ పొరుగున  పగ వాడుండిన ‘ పద్యంలో ఇంటిపక్కనే పగవారుంటే,‘గ్రామపెద్దచాడీలుచెప్పేవాడైతే   ప్రమాదమే!

‘ పెట్టిన దినములలోపల ‘ –అదృష్టం కలసివచ్చే రోజుల్లో అడవి మధ్యలో ఉన్నా అన్నిసపర్యలూ అందుతాయి. దురదృష్ట పు దినాల్లో  బంగారు పర్వతం పై కెక్కినా   ఏసౌలభ్యమూ  అందదు.

‘బంగారు కుదువబెట్టకు ‘ –  అనేపద్యంలో -సరకులు అప్పుగా తెచ్చుకొవద్దనీ ,దానివలన అప్పు అధికమై అపాయం పాలవుతా మనీ, మూఢునితో  స్నేహం  ప్రమాద  భరిత మనీ …..

‘పులిపాలు దెచ్చిఇచ్చిన ‘ — పద్యంలో – దుస్సాధ్యమైన పులిపాలు తెచ్చి ఇచ్చినా, హృదయాన్ని కోసి అర చేతిలో పెట్టినా, నిలువెత్తు ధనం  పోసినా  వేశ్యకు  నిజమైన ప్రే మ ఉండదు. అంటూ ఆనాటి సాంఘీక దురా చారాలను  ప్రస్తావిస్తాడు.
‘పుత్రోత్సాహము తండ్రికి ‘  —   ఈపద్యం  ఈనాటికీ ప్రతి పల్లె పట్టణ  ప్రజలంతా  ప్రస్తావించేది . కుమారుడు పుట్టగానే  తండ్రికి  సంతోషం  కలగదు.  ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన  రోజుననే నిజమైన సంతోషం కలుగు తుంది  అనగా  కొడుకు  పుట్టాడని  సంతోషం   వాడు  పెరిగి  పెద్దయ్యాక  తల్లి దండ్రులను కనీసం ముసలి వయస్సులో  ఆదరిస్తేనే  తప్ప వాడి వలన  ప్రయోజనం శూన్య  మని మనం భావించాలి. అది ఆనాడేమో కానీ ప్రస్తుతం పుత్రులు  ఉద్యోగార్ధులై  పరదేశాలు పట్టి పోతూ ముదుసలి తలిదండ్రులను ‘  ఓల్డేజ్ హోంస్ ‘ లోనో ,

‘అనాధ శరణాలయా ‘ ల్లోనో  వేస్తున్నారు. విద్యావంతులు కాకున్నా ముసలివారిని వీధుల్లో పడేసి పోతున్న వారి విషయమూ మనం వార్తల ద్వారా వింటూనే ఉన్నాం, కనుక  సంతు  కలిగినంత మాత్రాన   పొంగి పోనవసరం లేదని మనకు  సూచన,  ఇది అన్ని కాలాలకూ  వర్తిస్తూనే  ఉందికదా!

‘పాలసునకైన యాపద ‘ పద్యంలో  తేలు నిప్పులో పడిందని జాలిపడి  బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది , అలాగే మనం చేసే మేలును తెలుసుకోలేని మూర్ఖునికి ఆపదలో సాయం చేస్తే కృతఘ్నుడై మనకే ఆపద కలిగిస్తాడు , కనుక మూర్ఖుని  తో చెలిమి అతడిపై జాలి చూపడం మనకే ఆపద కలిగిస్తుందని భావన.
‘పాలను గలిసిన జలమును ‘ —పద్యంలో పాలతో కలిసిన నీరు  పాలలాగే కనిపించినా పాల రుచి చెరిచిన విధంగా , చెడ్డవారితో స్నేహం మన గౌరవాన్ని కూడా చెరుస్తుంది కనుక   ఎట్టిపరిస్థితుల్లో చెడ్డవారితో స్నేహం వద్దని కవి  భావన.

‘పొరుగిండ్లకు బనులు లేక పోవకు మెపుడున్ ‘ –పద్యంలో  ఇతరులకు ఇష్టం లేని మాటలు చెప్పి వారిని బాధించ వద్దనీ , తోచలేదని ఇతరుల ఇళ్ళకు పోయి వారిపనీ చెడగొట్టవద్దనీ , ఏదో ఒక ఉపయోగకరమైన  పని చేసుకోమనీ అంటాడు. సోమరితనం వలన కలిగే అనర్ధాలను ప్రస్తావిస్తాడు.

‘ పరసతుల గోష్టినుండి ‘ — పర స్త్రీలతో అతిగా ఉన్నట్లైన  నిందలపాలు కావలసి వస్తుంది, అలాగే స్త్రీ లు  ఎంత మంచివారైనా  పర పురుషునితో అతిచనువు వలనఅపకీర్తి పాలవుతారంటాడు..

‘పరనారీ సోదరుఁడై
పరధనముల కాసపడక పరులకు హితుడైఁ
పరుల దనుఁబొగడ నెగడక
పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!  —

ఇతర స్త్రీలను తోబుట్టువులుగా చూసుకొంటూ, ఇతరుల సొమ్మును ఆసించక , అందరికీ ఇష్టుడై, ఇతరులు  పొగుడుతుంటే  పొంగి పోక  , పరుల కోపానికి   బాధ పడని వాడే ఉత్తముడు అంటూ సజ్జనలక్షణాలను తెలుపుతాడు .

‘పగవల దెవ్వరితోడను ‘ — భూమిపై ఎవరితోనూ విరోధం మంచిది కాదనీ, లేమిలో బాధపడక తగుప్రయత్నం చేయాలనీ, సభలో ఎవరినీ విమర్శింప వద్దనీ , అంటూ  స్త్రీ విషయానికి వచ్చే సరికి  కొంత భేధ భావన చూపు తాడు, హృదయాన్ని మగువలకు విప్పి చెప్పరాదంటాడు. ఇది ఆనాటి సమాజంలో స్త్రీల పట్ల చూపిన వివక్షగా అనిపిస్తుంది.

‘నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!—-

సభల్లోనూ , తల్లిని, తండ్రిని, భర్తను, ఇతరుల భార్యను, బ్రాహ్మణులను చూసి నవ్వరాదు. అంటూ  నవ్వు  నాల్గు  విధాల  చేటంటాడు. లక్ష్మణుడు 14సం. నిద్రలేకుండా గడిపినా శ్రీరామ పట్టాభిషేక సమయంలో నవ్వడం అందర్నీ తలో విధంగా భావించేలా చేస్తుంది. చివరకు ఆయన నవ్వుకు  కారణం ఆసమయంలో నిద్రతో తూగు రావడం వలన ,అని తెలిశాక అంతా తేలిక పడతారు. కనుక కారణం లేకుండా నవ్వడం అనర్ధదాయకమని అర్ధం.

‘ నవరస భావాలంకృత …..జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ! ‘ — తొమ్మిది రసాలతోకూడిన మంచి భావాలతో ఉన్న  కవిత్వాన్ని , కమ్మని సంగీతాన్ని జ్ఞానహీనునకు వినిపించడం, చెవిటి వాని ముందు శంఖం వూదినట్లే. ‘ నవమున బాలుంద్రావరు ‘  –మెత్తని మాటలతో పాలు  తాగించడమూ కష్టమే  భయంతో విషాన్నై నా తాగుతారు. మృదుత్వ మెప్పుడూ అంత మంచిది కాదు .  కనక  భయంతోనే  పనులు చక్క  బెట్టుకోవా లంటాడు. ఈకాలంలో  అది  ఎంత వరకూ పని చేస్తుందో !

‘  నమ్మకు సుంకరి, జూదరి ’ — పన్నులు వసూలు చేసే వానిని, జూదం ఆడేవాడిని, కంసాలివానిని, నటకుని, వేశ్యను, వర్తకుని, ఎడమ చేతితో పనులు చేసేవాడిని నమ్మవద్దంటాడు. ఇక్కడ కుల  ప్రస్థావన ఈ నాటి సమాజం  గర్హిస్తుంది. . అది ఆనాటి సమాజపు పోకడ గా భావించాలి. ‘ నడువకుమీ తెరువొక్కటఁ ‘ — వంటరిగా తోడు లేకుండా ఎక్కడికీ పోరాదంటే , పూర్వం రాకపోక సౌకర్యాలు అంతగా లేనందున  వంటరి ప్రయాణం క్షేమం  కాదని అర్ధం , విరోధి ఇంట్లో భోజనం చేయటం కూడా ప్రాణహాని కలిగించవచ్చు,  ఇతరుల ధనం ఏ ఆధారం లేకుండా దగ్గర  ఉంచుకోరాదని, పూర్వం బ్యాంకుల వంటివి లేనందున  గ్రామాంతరం వెళ్ళేప్పుడు తమ ధనాన్ని తెలిసిన వారింట ఉంచేవారు ,కొన్ని  సమయాల్లో దాని వలన లేనిపోని అపనిందలు , కష్టాలూ  ప్రాప్తించేవి. ఈపద్యం వలన ఆనాటి సాంఘీక పరిస్థి తులు తెలుస్తున్నాయి.

స్నేహితుని ఇంట ఇనుము దాచి గ్రామాంతరం వెళ్ళి వచ్చి తన ఇనుమును తిరిగి ఇమ్మనగా , ఎలుకలు ఇనుమును తిని వేశాయంటాడు  ఆస్నేహితుడు. తర్వాత  ఆబాధితుడు న్యాయమూర్తి  సలహాతో,  వాని కుమారుని  తీసుకు వెళ్ళి  గ్రద్ద తన్నుకు పోయిందని చెప్పగా , న్యాయమూర్తి ‘ ఎలుకలు ఇనుమును తిన్నట్లే గ్రద్ద పిల్ల వానిని ఎత్తుకు పోడం వింత  కాదనగా , బుధ్ధి వచ్చి ఇనుమును తిరిగి  ఇచ్చేస్తాడు. మరి ఈరోజుల్లో అలాంటి న్యాయమూర్తులు  ఉన్నారా!  ఆలోచించాల్సిందే  మరి.  అందుకే ధనం విషయంలో ఎవ్వర్నీ నమ్మ వద్దంటాడు.

ధీరులకుఁ జేయు మేలది  సారంబగు నారికేళ సలిలము భంగిన్–అంటూ మంచివాని స్నేహాన్ని గురించిన ప్రస్తావన.

ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్
దనవారి కెంతకల గిన

దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!—

ధనపపతి ఐన కుబేరుడు స్నేహితునిగా ఉన్నా శివుడు  బిచ్చం ఎత్తవలసి వచ్చింది. కనుక తాను సంపాదిం చుకున్న (తన దగ్గరున్న) భాగ్యమే తనది కానీ  ఇతరుల ధనం తనది కాదని భావించ మంటాడు .ఈపద్యానికి చాలా వాడుక  ఉండటం గమనార్హం.
‘ చేతులకు దొడవు దానము—దానం చేసేందుకే చేతులనీ, అసత్యం పలకని వారే పాలకులనీ , అందరికీ న్యాయం జరగడం , స్త్రీ అభిమానంగా  ప్రవర్తించడం మంచిది.   చాడీ మాటలు విని మంచి చెడ్డలు తెలుసుకోలేక ప్రజలను బాధించే  పాలకుడు బొగ్గుల కోసం కోరికలుతీర్చే కల్పవృక్షాన్ని నరికి కాల్చే తెలివి తక్కువవాడు.

అరణ్యంలో తేనె టీగలు కూడ బెట్టిన తేనె చివరకు ఇతరుల పాలైనట్లుగా   లోభి నోరు కట్టుకొని కూడబెట్టిన ధనం పాలకుల పాలవుతుంది గనుక లోభ గుణం వీడమంటాడు.

‘ తనవారు లేనిచోటను
జన మించుక లేని చోట జగడము చోటన్
అనుమానమైన  చోటను
మనుజునకును నిలువంగ దగదు మహిలో సుమతీ! ‘
తన మేలు కోరేవారు  లేని  చోట, మనమాట  చెల్లుభాటు కాని చోట , గలాటాలు జరిగే చోట , మనకు అవమానం జరిగే చోట ఉండ రాదు.

‘కొరగాని కొడుకు పుట్టినఁ
కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుం
జెరకు తుద వెన్నుఁపుట్టిన
జెరకునఁ  దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!– —

ఈ  పద్యమూ బహుళ  జనాదరణ పొందినదే !  అప్రయోజకుడైన  కుమారుని  వలన ఆ కుటుంబానికి  ఉపయోగం లేక పోగా , చెఱకు గడ చివరన పుట్టిన కంకి  వలె వ్యర్ధం కనుక కొడుకులే  కావాలని వ్యధ చెందవద్ద ని కవి భావనకావచ్చు.

‘ స్త్రీల పట్ల విశ్వాసం, పాములతో స్నేహం, పరస్త్రీల ప్రేమ, వేప చెట్లలో తీయదనం, రాజుల పట్ల నమ్మకం అన్నీ అసత్యాలు ‘ , అని మరో చోట అనడం వేపచెట్టు  చేదుతో నూ, పాముల స్వభావంతోనూ,మహిళలనుపోల్చడం బహుశా ఆనాటి స్త్రీలపై పురుషులకున్న అభిప్రాయం కావచ్చు.
‘  స్త్రీలు సంపాదన  ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే  నడిచే  శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు’ అన్నాడు . అది ఆనాటి సమాజ పధ్దతేమో కానీ నేడు  సంపాదనాపరురాలైన  స్త్రీనే అంతా నెత్తిన పెట్టు కుంటున్నారు .  అడుగులకు మడుడుగులు ఒత్తు తున్నారు. సంపాదన  లేని భార్యను వ్యర్ధురాలిగా  భావిస్తున్నారు. ఇవి  సమాజంలో వచ్చిన మార్పులు.

‘ చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్
హేమంబుఁ గూడఁబెట్టిన
భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ! ‘….
ఈ పద్యమూ  సర్వజన రంజకమే ! అజ్ఞాని కూడ బెట్టిన ధనం  పన్నురూపేణ పాలకుల పాలౌతుంది . చీమలు పెట్టిన పుట్టల్లో పాములు వచ్చి చేరటాన్ని ఉదహరించాడు కవి, అంటే ధనాన్ని వ్యర్ధంగా కూడబెట్టక ఉపయోగ కరమైన పనులు , దాన ధర్మాలూ చేయమని అర్ధం.

‘ కులకాంత తోడ నెప్పుడుఁ-

గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ! ‘….

–భార్యతో [భర్తతోనూ] ఎప్పుడూ  తగాదాలు  వద్దు.  ఆమెపై [ అతనిపై] లేనిపోని  నేరాలను ఆరోపించ వద్దు.  ఉత్తమ ఇల్లాలు కంట నీరు కింద పడిన ఇంటిలో లక్ష్మిదేవి ఉండదు. ఇంటిలో తగాదాలు కీడు కలిగిస్తాయని భావన.
‘ కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ! ‘ –

ఈ పద్యమూ చాలా మంది నోట నానేదే! పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో తప్పులు  ఎప్పుడూ కని పించవు. ఆ స్నేహం చెడగానే  ఒప్పులు  సైతం  తప్పులు  గానే తోస్తాయి . కనుక స్నేహాన్ని చెడ గొట్టు కోక సామరస్యంగా  మెలగమని  కావచ్చు.
‘  కొంచెపు నరుసంగతిచే ….గించిత్తు నల్లి కుట్టిన ‘ –,  చిన్న నల్లి కుడితే ఆ నల్లి ఉన్న మంచాన్ని ఎండలో వేయడం, కర్రతో కొట్టడం, మరిగే నీళ్లు పోయడం వంటివి  చేసేవారు పూర్వం  . నల్లి చేరటం వల్ల  మంచానికే కష్టాలు సంభవించాయి ,  కనుక  నీచ స్వభావునితో  స్నేహం చేయ రాదని , ఆపదలు సంభవిస్తాయని  భావన.

అలాగే మరో  పద్యంలో ‘  కారణం లేని నవ్వు , రవిక లేని స్త్రీ, పూర్ణం లేని బూరె , వీరణం లేని పెళ్లి  వ్యర్థాలు అంటాడు [ నేడు  నటీ మణుల కెవ్వరికీ  సినిమాల్లో బట్టలే బరువైనాయి కదా! ]కవి . ‘ కానివాని రచన , నేర్పరితనం లేని  ఆయుధ విద్య వ్యర్ధం ‘ , ‘ పసిపాపలను కూడేవాడు నిజంగా పశువే’  అంటాడు [ ఈనాడు ఈ లాంటి  పశువులు మనకు  అంతా కనిపిస్తూనే  ఉన్నారు, ప్రతిరోజూ పత్రికల్లో ఏమూలో జరుగుతున్న ఈ రకం అత్యాచారాలు వింటూనే ఉన్నాం.  ]

‘ కరణం నెమ్మదితనం, మదం పోయిన ఏనుగు [అనగా ముసలిదైన ఏనుగు ], కరవని తాచు పాము,

కుట్టకుని తేలు ఆశ్చర్యాన్నికలిగిస్తాయంటాడు.

‘ కమలములు నీడఁ బాసినఁ
గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
దమ దమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!—

ఈ పద్యమూ సర్వ జనరంజకమే!
కమలములు పుట్టిల్లయిన నీటిలో అవి  ఉన్నంత వరకూ తమ మిత్రుడైన సూర్యుని  ఎండను భరించగలవు. నీరు విడిచిన కమలం సూర్యుని  ఎండకు  వాడిపోయినట్లే , తమ నివాసాలను విడిచి ఇతరులను ఆశ్రయించిన మానవులు అవమాన పడతారు  , స్నేహితులే శతృలవుతారు .
‘ కనకపు సింహాసనము
శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ
దొనరఁగ బట్టముగట్టిన
వెనకటి గుణమేల మాను వినరా సుమతీ! ‘
ఈ పద్యంలో నీతి సర్వకాలాల్లోనూ అనుసరింపదగినది.
‘ ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ! ‘
పెద్ద పడవలపై బళ్ళను నది దాటిస్తారు , అలాగే  బళ్ళపైన  పడవలనూ చేర వేస్తారు. పడవలు గొప్పకాదూ, బండ్లూ గొప్పకాదు,  భాగ్యం , దారిద్య్రం  ఒకరి నుండి మరొకరికి మారుతూనే ఉంటాయి, అనగా సంపద ఒకరి వద్దనే ఉండదు కనుక  సంపద కలనాడు గర్వించక సామరస్యంగా మెలగ మని అర్ధం కావచ్చు.

‘ ఒల్లనిసతి  నొల్లనిపతి ‘ — తనపై ప్రేమాదరణలు లేని  భార్యను, యజమానిని, స్నేహితుడ్ని వెంటనే విడిచి పెట్టడం శ్రేయస్కరం, అలాచేయనివాడే వెర్రి గొల్లవాడు , జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు, అంటూ ఇక్కడ కులానికి కాక గుణానికి ప్రాధాన్యతనిచ్చాడు.
‘ ఏరకుమీ కసుగాయలు
దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పారకుమీ రణమందున
మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ! ‘

ఈ పద్యమూ జనాదరణ పొందినదే !  … పచ్చికాయలు కోయ రాదు [రువిగా ఉండవు గనుక ], బంధు జనులను దూషించరాదు, యుద్ధం నుంచి వెను తిరిగి పారి పోరాదు, [ యుధ్ధమంటే తలపెట్టిన పనిగా  ఇక్కడ భావించ వచ్చు]. పెద్దల ఆజ్ఞలను జవ దాట రాదు, దాని వలన లాభం చేకూరదు, నష్టం తప్ప.

‘ ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ! ‘
చెరువు నిండా నీరు చేరగానే కప్పలు  వేలకొద్దీ దాని లో చేరి బెకబెక మని అరచినట్లే  సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా  చేరుతారు. ధనం లేని నాడు వారు ముఖం కూడా చూడరు.

‘ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ! ‘
ఎప్పుడూ తప్పులు వెతుకుచూ  మెచ్చుకొనక  నిందించే యజమాని వద్ద పని చేయటం ,నల్లతాచు నీడలో ఉండే కప్ప బతుకు వలె ప్రమాద కరమని అంతరార్ధం.
‘  ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
అపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ! ‘….
ఈ పద్యం బహుళ జనాదరణ  పొందినదే! విద్వాంసుని నుండీ పల్లె జనులు  సైతం తమ మాటల్లో ప్రస్తావించేదే! మేలు చేసిన వానికి మేలు చేయుటం కాక , హాని చేసిన వానికి సైతం  అంతకు ముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి. Help ever- Hurt never!

‘ ఉదకము ద్రావెడు హయమును– నీరు తాగే గుర్రం  దగ్గరకు,  కొవ్వుతో  విజృంభించే  మదపుటేనుగు  దగ్గరకు,  ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకు వెళ్లటం ప్రమాద భరితం.

ఉత్తమ గుణములు నీచు
కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కరగిపోసిన

నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ! ‘ –

ఇత్తడిని ఎన్నిసార్లు కరిగించిపోసినా బంగారం  కానట్లే ఈలోకంలో నీచునకు  ఏనాడూ   మంచి గుణాలు రావు. కనుక నీచునికి దూరంగా ఉండమని  సూచన.

ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్
మడుపునఁ గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ! ‘….
నూరేళ్ల పాటు ఉడుము , పది వందల ఏళ్ల పాటు పాము, చిరకాలం చెరువులో  కొంగ జీవించి ఉన్నా ప్రయోజనం సూన్యం. ధర్మార్థ కామ మోక్షాల పట్ల ఆసక్తి తో వాటిని ఆచరిస్తూ సదా లోచనల తో ఉన్న వాడే  మానవుడు .  మానవుడు  నిరంతరం  పరోపకార బుధ్ధితో జీవించాలని అర్ధం.

‘ ఇమ్ముగఁ జదువని నోరును
అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర ‘ –

చక్కగా సద్విషయాలు పలకని నోరు, ‘ అమ్మా! అని  పిలిచి అన్నం పెట్టు‘ అని అడగని నోరూ, ‘ ఒరే తమ్ముడూ! అని పిలవని నోరు,  కుమ్మరివాడు మన్ను తవ్విన గోతితో సమానం .

‘ ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు ‘ –

లోకంలో ఆకలి వేసినప్పుడు తినే  అన్నం అమృతం వలే ఉంటుంది.అది గంజినీరైనా సరే!, తూలనాడక ,బాధ పెట్టక తనవద్ద ఉన్నది హృదయ పూర్వకంగా ఇతరుల  అవసరం తెల్సు కుని ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే కార్య సాధకుడైన  మానవుడు,  ధైర్యంగా కష్ట నిష్టూరాలను ఒకే విధంగా భావించి సాగేవాడే  మంచి మనిషి.

‘ అడియాస కొలువుఁ గొలువకు
గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ! ‘ –
జీతం దక్కని పని చేయటం వృధా, గుడికి ధర్మకర్తగా ఉండటం వలన ఏదో ఒకసమయంలో భగవంతుని ధనాన్ని దుర్వయం చేసిన పాపం అంటుతుంది. చెడ్డవారితో  స్నేహము చేయటం వలన వాని దుర్మార్గం మనకు వస్తుంది. అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా ప్రయాణం చేస్తే  కష్టం కలిగితే ఆదుకునే వారుండరు.

[ పూర్వం ఒక ఊరినుండీ మరో ప్రాంతానికి  నడకే సాధనం ]

‘ అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!—

అవసరానికి  అడిగినప్పుడు జీతమివ్వని గర్వి ఐన వాని వద్ద  పనిచేయటం  వ్యర్ధం.  వేగముగా  పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలం దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం  మంచిది . అంటాడు ఆనాడు సమాజం లో వ్యవసాయమే అందరికీ అందుబాటులో ఉన్న పని.

‘అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!—

అవసరానికి పలకని  చుట్టమును , ఆపదలో ఉన్నపుడు కష్టం తీర్చని దేవుని   యుద్ధంలో   తాను అధిరోహించి ఉన్నపుడు  ముందుకు పరిగెత్తని గుర్రాన్నీ  వెంటనే వదల మంటాడు. బద్దెనకవి  ఆనాటి సమాజరీతులకు, నీతులు జోడించి , ఈనాటికీ అనుసరింపదగిన పధ్ధతులనూ, వదలవలసిన రీతులనూ తన శతకంలో’ సుమతీ !’అనే మకుటంతో  వర్ణించాడు. మనం అనుసరింపదగిన మంచి విషయాలను బద్దెన కవి తన ఎంతో నేర్పుగా కూర్చిన ఈ శతకాన్ని మనమూ ఆకళింపుచేసుకుని లాభం పొందేప్రయత్నం  చేద్దాం.

ఉపాధ్యాయినిగా 40 సం. ఎన్నోశతకాలు వందలమంది నా విద్యార్ధులకు బోధించిన అనుభవంతో  ఈ నాలుగు మాటలూ మీతో పంచుకోదలచి ఈవ్యాసాన్ని ధైర్యంగా  రూపొందించాను. దీనిలో ఏదైనాతప్పులు సవరింపులూ ఉన్నచో  విశాల హృదయంతో మన్నించి, సరి చేసుకునే అవకాశం నాకు కలుగజేస్తారని విశ్వసిస్తూ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 thought on “నేటికీ మేటైన సుమతీ శతకంలోని నీతులు.

  1. చాలా బావుంది. ధన్యవాదములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *