April 26, 2024

ఈశాన్యంలో బరువు ఉండ కూడదు

రచన : టీవీయస్.శాస్త్రి

ఈ మధ్య అన్ని మతాలవారు ఎక్కువగా మాట్లాడుతున్నది’వాస్తు’ను గురించి.జ్యోతిష్యం, వాస్తు పిచ్చి ఇప్పుడున్నంతగా — పూర్వం లేదు.

మొన్న ఈ మధ్య ఒక వాస్తు సిద్ధాంతి గారి వద్దకు వేరే పని మీద వెళ్లాను. చాలామంది వరుసగా కుర్చీలలో, బల్లల మీద కూర్చొని ఉన్నారు.ఒక కుర్రవాడు వచ్చి నా పేరు, ఊరు వ్రాసుకొని, ఒక కాగితం ముక్క మీద నెంబర్ వేసి అది నాకిచ్చి కూర్చొనమని చెప్పాడు.’నాకు ఈ నెంబర్ ఎందుకు? సిద్ధాంతి గారు నాకు బంధువులు. నాకు వారితో వ్యక్తిగతమైన పని ఉంది. నేను అంతసేపు ఆగలేను, వెంటనే కలిసి వెళ్ళాలి’ అని ఎంత మొత్తుకున్నా వాడు వినటం లేదు, పైగా కూర్చున్న మిగిలిన వారు కూడా ‘మేమందరమూ వచ్చింది, వ్యక్తిగత విషయాలు చెప్పుకోవటానికే!’అని ఆ కుర్రవానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు.’నేను వచ్చింది వారిని ఒక వివాహానికి ఆహ్వానించటానికి, అదీ నా వ్యక్తిగతమైన పని.’ అని చెప్పినా కుర్రవానితో సహా అందరూ ‘అలా కలవటానికి కుదరదు, వీల్లేదు.’అని ముక్త కంఠంతో చెప్పారు. అ కుర్రవాడు నా వంక విజయగర్వంతో చూస్తుంటే, మిగిలిన వాళ్ళు ఆగ్రహంగా చూస్తున్నారు. వారికి నా మీద ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్ధం కాలేదు. మంచి ఆలోచన వచ్చి సిద్ధాంతి గారి మొబైల్ కు ఫోన్ చేస్తే, వారు బయటకు వచ్చి ‘రండి,రండని’ లోపలికి  తీసుకొని వెళ్ళారు.’ఏమిటండీ! బయట అంత మంది జనం, ఇంతమంది జనాన్ని, నేను ఈమధ్య ఏ ఆసుపత్రిలోనూ చూడలేదు.’ అని చెప్పగానే వారు చిరునవ్వుతో, ‘చెప్పండి శాస్త్రి గారూ! మీరు వచ్చిన పని ఏమిటి?’ అని అన్నారు.’అయ్యా! నేను వచ్చింది నా మేనకోడలి వివాహ ఆహ్వానపత్రిక ఇవ్వటానికి. మీరు వివాహానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్ళండి.’అని చెప్పి ఆహ్వానపత్రిక వారి చేతిలో పెట్టి నెమ్మదిగా బయటకు వచ్చాను. బయట ఉన్నవారు నామీద ఇంతకు ముందుకన్నా ఎక్కువ కోపంగా ఉన్నారు. ఎవరైనా ఏమన్నా అంటారేమో నని, అనవసరంగా వివాదాలలోకి వెళ్ళడం ఎందుకని, నేను గబగబా వెళ్లిపోయాను. ఆ సాయంత్రం పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చి చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాను.

నాకొక గుణం ( అది సుగుణమో లేక దుర్గుణమో నాకు తెలియదు) ఉన్నది. అది ఏమిటంటే, ఎవరు చెప్పినా వినను, నా అంతట నేనే తెలుసుకోవాలి. ‘వాస్తు శాస్త్రం’లోని కొన్ని పుస్తకాలు చదివాను. ఒక పుస్తకంలో చెప్పిన విషయాలకు పూర్తి భిన్నంగా మరొక పుస్తకంలో ఉన్నాయి. అంతటితో వదలదేదు, నా మిత్రుడు ఒకడు Architect Engineer ఉన్నాడు. వాడి వద్దకు వెళ్లి కొన్ని విషయాలు అడిగాను, వాడు శాస్త్రీయంగా చాలా విషయాలు చెప్పి నన్ను కొంతవరకు సంతృప్తి పరిచాడు. అయినా ‘వాస్తు’ విషయాల మీద నా అనుమానాలన్నీ తీరలేదు. పుస్తకాలు చదువుతూనే ఉన్నాను. మొన్న నా  మిత్రుని ఇంటికి  వెళ్లాను, వాడికి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని పలకరించటానికి. చనువుకొద్దీ లోపలికి  వెళ్లి ఎప్పుడూ నేను చెప్పులు విడిచే చోట చెప్పులు విడవబోతే, వాళ్ళ ఆవిడ గబగబా వచ్చి’అక్కడ చెప్పులు విడవకండి,అది ఈశాన్యం, అక్కడ దేవుణ్ణి పెట్టాం’ చెప్పులు బయటనే విడిచి రండని చెప్పింది. ‘మా వారికి వంట్లో బాగాలేనప్పటి తరువాత ఇంట్లో కొన్ని మార్పులు చేశాం! రండి,చూడండి.’ అని ఇల్లు చూపించటానికి చాలా ఉత్సాహంగా ఉంది .’అమ్మా! అవన్నీ  తర్వాత చూస్తాను, ముందుగా వాడిని చూడాలి, అసలు వాడి జబ్బేమిటి?’అని ప్రశ్నించి అవిడ సమాధానం కోసం ఎదురు  చూడకుండా వాడి గదిలోకి వెళ్లాను. వాడు నీరసంగా వున్నాడు. ‘అసలు నీ జబ్బు ఏమిటిరా ?’అని వాడిని ప్రశ్నిస్తే వాడు, ‘రెండు రోజులు జ్వరం వచ్చింది తగ్గలేదు. మూడు నాలుగు రోజుల తర్వాత తగ్గి మళ్ళీ తిరగబెట్టింది.’అని వాడు చెప్పగానే, నేను, ‘ఏ డాక్టర్ వద్ద వైద్యం చేయించుకుంటున్నావు?’అని అడిగాను.’డాక్టరా ! నా బొందా! వంటినిండా విభూతి రాసి రకరకాల బొట్లు పెట్టి. నోట్లో తీర్ధం(ఆ’తీర్ధం’ కాదు సుమా!) పోస్తుంటుంది మా ఆవిడ. ఇల్లంతా మార్పులు చేయిస్తున్నది.అదీ! నాకు ప్రస్తుతం జరుగుచున్న treatment!’ అని వాడు చెప్పగానే చనువు కొద్దీ ఇంట్లో వారందరితో పోట్లాడి వాడిని, డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళితే, డాక్టర్ గారు వాడికి వచ్చిన వ్యాధి’డెంగ్యూ’జ్వరమని నిర్ధారించి వైద్యం చేస్తే కోలుకొని ప్రస్తుతం హాయిగా ఉన్నాడు.

అసలు ‘వాస్తు’ అంటే వసతి కోసం కట్టినదని అర్ధం. కొన్ని పుస్తకాలలో చాలా విపులంగా ‘లక్ష జనాభా దాటిన పట్టణాలకు వాస్తు చూడనవసరం లేదు’అని విపులంగా వ్రాయటం జరిగింది.శ్రీ కృష్ణుడు మయబ్రహ్మను పిలిచి అతని ఆధ్వర్యంలో పూర్తి వాస్తుశాస్త్ర ప్రకారం పాండవుల కోసం నిర్మించిన నగరం ‘ఇంద్రప్రస్థం’. ఆ నగరం నిర్మించిన తరువాతే వారి కష్టాలన్నీ మొదలైనాయి. అసలు ఆ నగరంలో వాళ్ళు ఉన్నది ఎంతకాలం? అంత మహనీయులకు వాస్తు ప్రకారం నిర్మించిన ‘ఇంద్రప్రస్థం’వల్ల అన్ని కష్టాలు వచ్చాయా అంటే , కాదు, అది వారి ‘ప్రారబ్ధం’ మాత్రమే అని సమాధానం చెప్పుకొని సరిపెట్టుకోవాలి. ప్రస్తుతం ‘వాస్తు’ ప్రకారం పెద్ద పెద్ద నగరాలలో ఇళ్ళు కటితే, మన ఇళ్ళలోని మురికి నీరు ప్రక్కవారి ఇళ్ళలోకి వెళ్లి పెద్ద గొడవలు కూడా వస్తాయి.

ఈ మధ్య ఒక ‘గృహప్రవేశ’ ఉత్సవానికి వెళ్లాను.ఆ ఇంటి వారు ఇల్లు మొత్తం చూపించారు.దేవుడి మందిరంలో అందరి విగ్రహాలు ఉన్నాయి, ఒక్క వినాయకుడి విగ్రహం తప్ప! కారణ మేమిటి అని నేనడిగిన ప్రశ్నకు,వాళ్ళు చెప్పిన సమాధానం’ఈశాన్యంలో బరువు ఉండ కూడతటగా! వినాయకుడు బరువైన దేవుడు కదా అని మేము పెట్టలేదు’అని. ఆశ్చర్యపోవటం నావంతైంది. ఇంటికి వచ్చిన తర్వాత , మళ్ళీ ఆలోచనలలో పడ్డాను. ‘ఈశాన్యంలో  బరువు ఉంటే కష్టాలు వస్తాయి’ అనే మాటలు నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. అవును, నిజమేమోనని నాకూ అనిపించింది.ఈ దేశంలో ఇన్ని కుంభకోణాలు,అవినీతి,అక్రమాలకూ,రాజకీయ నాయకుల వికృత చేష్టలకూ, వీటన్నిటికీ ‘వాస్తే ‘ ముఖ్య కారణం అయి ఉంటుంది. మనదేశానికి ఈశాన్యంలో బరువు ఉన్నది. అది సామాన్యమైన బరువు కాదు.అది హిమాలయ పర్వతాలంతటి బరువు!

 

మన కష్టాలు తీరటంకష్టమే‘!


 

 

16 thoughts on “ఈశాన్యంలో బరువు ఉండ కూడదు

  1. చక్కగా వివరించారు!వాస్తు నప్పక కట్టిన వాటిని..కూల్చి కడుతుంటారు…ఇదో వెర్రి గఆ మారింది ఈ మధ్య..నాకు తెలిసిన ముస్లిం ఫ్రెండ్ ఇల్లు పూర్తిగా వ్వాస్తు విరుద్ధం.వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారో.పిల్లలు బుద్ధి మంతులు.వృద్ధి లోకి వచ్చారు…regards సర్

  2. నమస్తే నేస్తమ్! నీ రచనలు వాస్తవానికి దగ్గరగా వుంటున్నాయి.ఇంటి నిర్మాణములో గాలి, వెలుతురు,
    మురుగు నీటి పారుదల సక్రమముగా వుంటే చాలు.
    దానికి శాస్త్రము అక్కరలేదు.వాస్తు,జ్యోతిష్యము,
    శకునాలు,వ్యర్జాలు,తావీజులు,మంత్రాలు ఇత్యాదులన్నీ
    మూఢనమ్మకాలే.మూఢనమ్మకాలతో దేవుని శక్తిని
    శంకించడమే! కొందరి నమ్మకాలు కొందరికి ఉదరపోషణ!
    KCR గారు హైదరాబాద్ సచివాలయానికి వాస్తు సరిగా
    లేదని పడగొడ్తారట.ప్రజాధనంతో వేరే చోట కడతారట.

  3. వాస్తు అనగా వాస్తవంగా ఉండాలిసిన విధానం, మనకు అనుకూలంగా గాలి వెలుతురు చక్కగా వచ్చే విధంగా ఉంటే అది వాస్తుకు ఉన్నట్లే . ఈ మధ్య వాస్తు పిచ్చితో జనాలు ముఖ్యంగా ఆడవారు, ప్రతి బట్టకట్టిన వాడు చెప్పినది నమ్మి నానా రకాల మార్పులు చేసుకొని , మరల ఇంకోకరు చెప్పారని అవి మార్చి మరలా కట్టించి నష్టపోతున్న వారు కోకొల్లలు. వాస్తు ఆరోగ్యం, అనుకూలత కొరకే అనే విషయం తెలుస్తే బాగుపడతారు.

  4. నమస్తే శాస్త్రి గారు,మీరు చెప్పినట్టు ఈశాన్యం లో బరువు బాగానే ఉంది…మన నాయకులికి తెలిస్తే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఈశాన్యం లో బరువుని నైఋతి కి షిఫ్ట్ చేసి వాస్తు శాంతి చేస్తామంటారు 🙂

  5. మీ స్పందనకు కృతజ్ఞతలు.ప్రత్యేకించి చెప్పవలసినదేమీలేదు.

    టీవీయస్.శాస్త్రి

  6. baagaane undhi.
    vaasthu ni namme vaaru, nammani vaaru lakshallone unnarru
    jannaabha moodu rakaalu dhenikainaa.
    1.nammevaaru
    2.nammani vaaru
    3.anumaanam tho undevaaru
    yemainaa nammakame pradhaanam,
    namasthy.,,,.,,

  7. రాజు గారికి,
    మూఢ నమ్మకాలతో శాస్త్రాన్ని వక్రీకరించుకొనవద్దని చెప్పటమే ఈ వ్యాసం ఒక్క ముఖ్య ఉద్దేశ్యం.కొంత మందైతే,తమ ఇళ్ళల్లో ప్రతి గదిలో ఈశాన్యాన్ని చూస్తున్నారు.కాలగమనంలో

    ప్రజలు తమంతట తామే చైతన్యవంతులవుతారు.

    టీవీయస్.శాస్త్రి

  8. మూఢనమ్మకాలతో ఇదో అనుభవం మీ స్నేహితునితొ.. “వాస్తు” గురించి శాస్త్రీయత జోడించి ప్రజలను చైతన్య పరచడం ఎలాగో……..

  9. మీ చక్కని స్పందనకు కృతజ్ఞతలు సాంబశివరావు గారు.

    భవదీయుడు,
    టీవీయస్.శాస్త్రి

    1. మీ చక్కని స్పందనకు కృతజ్ఞతలు.

      భవదీయుడు,
      టీవీయస్.శాస్త్రి

  10. kanuvippu kaliginche rachana. prativaaru chadivi paatinchali.
    Inta manchi vishayamnu T.V.S.Sastry garu chala chakkaga vivarincharu. Dhanyavadamulu.

    1. మూఢ నమ్మకాలాతో శాస్త్రాన్ని వక్రీకరించుకొని అపహాస్యం పాలు కావద్దని వ్యంగ్యంగా చెప్పటమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.మీ స్పందనకు కృతజ్ఞతలు.

      టీవీయస్.శాస్త్రి

        1. మీ చక్కని స్పందనకు కృతజ్ఞతలు.

          భవదీయుడు,
          టీవీయస్.శాస్త్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *