April 27, 2024

” ఉగాది “

రచన : రమాశర్మ

సర్వ మానవ సౌభ్రాతృత్వమే
సమతని చాటుతున్నారో వైపు
కులమతవాదులు తమ  కులమత
మతాబులను రగిలిస్తున్నారు మరో వైపు

ఆకాశాన్నంటుతున్న  నిత్యావసర ధరలో వైపు
అవకాశం వదలమంటున్న అవకాశవాదులు యింకో వైపు
ఆవిరై ఆకాశాన్నంటుతున్న పెట్రొల్ ధర
హై కమాండ్ కి లేనే లేదు ఏ కంట్రోల్
అడుగడుగునా పెంపుదల డీజల్ లో
అడుగడుగున పై వాళ్ళ ప్రపోజల్లే అవి

కరెంట్ కోత ఓ వైపు
ఆ బిల్లుల మోత మరో వైపు

గ్యాస్ కి నిప్పుతో పని లేదు
తన ఉనికి తెలుపుకోవటానికి
ధరతోనే వెలిగిపోతుంది

ఎంతో దూరం ప్రయాణం చేస్తే అలసట గతంలో
ఇపుడు  గమ్యం ధర తెలుసుకుంటేనె  అలసట బస్సులో

పాలకులే పాములై ప్రజలపై
పగ తీర్చుకొంటుంటే
రక్షక భటులే భక్షక భటులై
రక్కసుల్లా అక్కసు వెళ్ళగక్కుతున్నారు

కొంతమంది స్వాములు  భూస్వాములవుతున్నారో వైపు
ఆ భూస్వాములు స్వాముల కాళ్ళ క్రింద యింకో వైపు
పాలకులు , రక్షకులు తమ రక్షణ కొఱకు
స్వాముల అడుగులకు మడుగులొత్తుతున్నారు మరో వైపు

కొంతమంది స్వాములు రేపు ఉందో లేదో డౌటే
నేడే , అహ ఈ క్షణం నీది , మరుక్షణం
సారీ నే గట్టిగా చెప్పలేను అంటూ ,
అమాంతంగా అమ్మాయిల్ని కౌగిలిలో బిగిస్తున్నారు

ఏకం నుంచి అనేకం అయినట్లు  ఆ
ఒక్కటిని చీల్చేయమని ఒక వర్గం
సమైక్యంగా ఉంటేనే స్వర్గం  అంటూ  యింకో వర్గం
ముక్కలు ముక్కలుగా చేయాలని మరో వర్గం
ఎటూ తేల్చుకోలేని ( పై ) పరిపాలక వర్గం

రాజధాని ఢిల్లీ గల్లీ లోనే
పట్టపగలు నట్ట నడిబజారులో
బస్సులో బుసలు కొట్టిన కిరాతకులు
అరాచకానికి , అత్యాచారానికి
అబల నిర్భయను నిర్భయంగా
బలి తీసుకున్నారు

తరతరాలుగ చూస్తున్నాం
అంతరాలలో అఘోరిస్తున్నాం
బాహాటంగా భేష్ అని చెప్పుకుంటున్నాం
ఆర్భాటంగా ఆనందాల్ని ఆస్వాదిస్తున్నాం

ఎన్ని ఉగాదులు వచ్చాయో , వెళ్ళాయో ,
ఎందరో చూశారు , మనమూ చూశాం
ఈ ఉగాదైనా మార్పుకి పునాదని
ఆమడ దూరంలోని ఆనందాల్ని
అందించమని ఆహ్వానిస్తున్నాం  ” విజయ ” మ్మా

కొత్త చింతపండు రేకుల కోకతో
మామిడి పిందెల అంచులతో
వేప పూత చుక్కల రవికతో
పంచదార వంటి పలకరింపులతో
అడుగిడవమ్మా ” విజయ ” మ్మా

కలవాడు క్లబ్బుల జబ్బుల్లో
నూకలవాడు నుయ్యి , గొయ్యిలలో
మారక ద్రవ్యాల్లో మునగకుండా
అభయమీయవమ్మా ” విజయ ” మ్మా .
అడుగిడవమ్మా ” విజయ ” మ్మా

చట్టం
న్యాయ శాస్త్రాలకు
మూలమట్టం
నేరస్థుల జీవితాలకిదే
అంతిమ ఘట్టం
అందుకే ప్రజలకిదంటే
ఎంతో యిట్టం

యింతటి పవర్ ఫుల్ చట్టం  పని తీరు తెన్నులిలా

గత 3 ఏళ్ళలో 68 వేల అత్యాచారాలు
16 వేల మందికి మాత్రమే శిక్షలు
చూశారా చట్టం ఎంతగా తన పని
తను చేసుకుపోతుందో

అమ్మా ” విజయ ” నామధేయవైన నీవు
నీ జాతి కిరాతకుల , అరాచకాల
బారి పడకుండా భయము లేదని
అభయమీయవమ్మా ” విజయ ” మ్మా .

*   *   *   *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *