April 27, 2024

చిక్కని కవిత్వంతో చక్కని సంకలనం ”కవి సంగమం”

రచన: శైలజ మిత్ర                                                                                                  

 

”నువ్వొక పచ్చని చెట్టువైతే / పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను” అనే ఒక విలక్షణమైన, వాస్తవమైన, హృద్యమైన వాక్యాలతో మొదలయిన ఈ కవిసంగమం నేడు 144 మంది కవులతో  ఒక కవితా సంకలనం తీసుకుని రావడం బహుశా తెలుగు కవిత్వ వొరవడికి వినూత్నం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కవిత్వం కావాలంటున్నారు.  కవిత్వం పేరిట నినాదాలు, విషయాలు వద్దంటున్నారు. కవులంటే కవిత్వం రాయాలి. కానీ కవిత్వం రాస్తున్నామని ఎవరికి వారు ఆత్మవంచన చేసుకోకూడదని అభిప్రాయ పడుతున్నారు. ఆకాశం అందరికీ అందంగానే కనిపిస్తుంది. ఆకాశం హావభావాలను ఒక్క కవి మాత్రమే వర్ణించగలడు. ఆకాశం నీలంగా ఉంది. అనడానికి కవి అక్కర్లేదు,  ఎందుకంటే ఆ మాటను ఎవరైనా చెప్పగలరు. కానీ సముద్రపు నీలిరంగు ఆకాశంపై పడితే కనిపించే తాలూకు సౌందర్యం ఆ నీలాకాశం అని ఎవరు చెప్పగలరు? సముద్రం కెరటాలతో భయపెడుతుంది అందరికీ తెలుసు. కానీ సముద్రపు నేల మట్టంలో జరిగే కదలికల తాలూకు ఆవేదనే ఆ కెరటాలని కవులు మాత్రమే అభివర్ణించగలరు. అలా కవులను మాత్రమే ఎన్నికచేసి వారినుండి ఉత్తమ కవిత్వాన్ని ఒకచోట ప్రోది చేసి అవన్నీ ఒక సంకలనంగా తీసి వందమంది కవులలో మన కవిత్వ స్థానం ఏమిటి? అసలు మనర రాస్తున్నది కవిత్వమేనా? అని తెలిపేరీతిలో అందరికీ సరిసమానమైన స్థాయిని కలిగించి విని, ఎంతో ఆదరించి మరింత సాహితీ కృషి చేస్తున్న ప్రముఖ కవి యాకూబ్‌.

పత్రికల ద్వారా, రోజువారీ పేపర్లద్వారా అనేక కవిత్వాన్ని మనం చదువుతూనే ఉన్నాం. నేడు పత్రికలు కూడా వారి వారి గ్రూపులను ప్రోత్సహిస్తూ ఇచ్చినవారికే స్థానాల్ని కలుగజేసేవి కొన్నయితే, మరికొన్ని కులాలని, మతాలని, దళితులని, వాదాలని, వ్యక్తిగత విభేదాలని విభజించి వారికే పట్టం కట్టడం మన దృష్టిని దాటిపోలేదు. కానీ ఇలా ఎంతని రాస్తాం? ఎన్నాళ్ళని సహిస్తాం? ఉన్నంతవరకు రాస్తాము.  కానీ బంగారు పళ్ళానికి కూడా గోడ దాపు అవసరం అన్నట్లు ఎంత మంచి కవి అయినా ప్రోత్సాహమో, లేక ప్రముఖుల అభినందనో అవసరం. అవేవీ లేకుంటే కళాకారులలో నిర్లిప్తత చోటుచేసుకుని ఎందుకు రాయాలి అని నిరాశ చెందే కవులు లేకపోలేదు. . కవిత్వం రాసిన వారందరూ కవులు కాలేరు. ఎన్నో పుస్తకాలను రచించాను నేను గొప్ప కవయిత్రిని అంటే నమ్మే రోజులు పోయాయి. ఎందుకంటే కవిత్వం ఇపుడు రాను రాను మరింతగా చిక్కపడుతోంది. చక్కపడుతోంది కూడా. ఒక తరం కంటే మరో తరం కవిత్వాన్ని మరింత పదునుగా రాస్తున్నారు. ఎందుకంటే కవిత్వపు ఆత్మను వారు అందుకున్నారు. ఎలా ఉంటే కవిత్వం అవుతుందో అనే విషయాన్ని  తెలుసుకుని ప్రముఖ, వర్థమాన కవులతో పాటు ఇపుడిపుడే కలం అందుకున్న  యువ కవులను కూడా ప్రోత్సహిస్తున్నారు. మంచి కవిత్వమైతే వారికి సముచితమైన స్థానాన్ని అందజేస్తున్నారు.నేడు వస్తున్న కవిత్వం పోకడలు చాలా వరకు ఆశాజనకంగానే ఉన్నా చాలా వరకు నాలుగు గోడలు దాటడంలేదు. లేదా సమాజపు నాలుగు గోడలు అధిగమించడంలేదు. కానీ యువత నేడు ఆకాశమే హద్దుగా ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుని మరీ రాస్తున్నారు. ఏ సంఘటన ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది అనే అంచనాలను దృష్టిలో పెట్టుకుని మరీ రచించడం మూలంగా ఎన్నో వాస్తవ విషయాలను అలవోకగా అర్థం చేసుకునే అవకాశం వస్తోంది. అనుభూతి కవిత్వం, భావకవిత్వంతో పాటు సమాజంలో ఇపుడిపుడే జరుగుతున్న విషాదాలనే కాకుండా విషాదానికి మూలాలను కూడా తెలపడం అత్యాధునిక కవిత్వం లక్షణంగా మారింది. సమస్యలు పెరుగుతున్నాయి.  ఆవేదనలు గుండెను తాకుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, అమానవీయ అంశాలు అనేకం జరుగుతున్నాయి. అయితే వాటికి సరైన స్పందన లభిస్తోందా? అంటే వస్తోంది కానీ ఎలా? పేపరు ప్రకటనల్లా, అరుపుల్లా, కేకల్లా వస్తున్నాయి. సందర్భానుసారం ప్రచురించాలనే దృక్పథంతో ఆయా పత్రికలు ప్రచురిస్తున్నాయి. ప్రచురించేరు కాబట్టి అది కవిత్వం అని కవులు అదే ధోరణిని అవలంబిస్తూ తాను ఒక కవిగా మొదలై తానూ ఒక కవిగా తయారై చివరికి తానుమాత్రమే కవిగా చెలామణి అవ్వడం జరుగుతోంది.

మరి ఆ విషయాలను ఎవరు ఎవరికి చెబుతారు? ఎవరికి చెప్పితే అర్థం చేసుకుంటారు? మీ కవిత్వంలోకాస్త కవిత్వం కనిపించనీయండి అంటే ఎవరు ఒప్పుకుంటారు? పక్కకు తప్పుకుంటారు తప్ప నిజమేదో గుర్తించి వారి తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటివి ఎన్ని చూసారో ఏమో యాకూబ్‌గారు తదితర కొందరు కవులు ఒకచోట చేరి కవి సంగమం అనే పేరుతో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ప్రారంభించేరు. ప్రారంబించిన సమయం ఏమిటో కానీ పుంఖాను పుంఖాలు కవిత్వం వచ్చి పడ్డాయి. ఎన్ని గ్రూపులున్నా దీనికే ఇంతటి ప్రాధాన్యత ఎందుకు కలిగింది? అంటే ఇక్కడ కవిత్వం కావాలంటున్నారు. కవిత్వంలో ఏమాత్రం లోపం ఉన్నా స్పందన ఉండటం లేదు. అంటే ఈ కవిత్వంలో కవిత్వం లేదన్నమాట అనే అవగాహనకు వచ్చి వారికి వారే సరిచేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇంతయిన తర్వాత ఇపుడు ఇందులో కవిత్వం ఎలా ఉంది? అనే విషయానికి వద్దాం!  కవిత్వం సమస్తం/ మొహర్రం రంజాన్‌ బక్రీద్‌” అంటారు  బారహమతుల్లా.్ల అంటే కవిత్వమనేది ఒక పండుగ. కవిత్వం మనల్ని అనుసరించే ఒక శుభమని చెప్పారు.

”మూరెడు మల్లెలూ/ మూడక్షరాలూ/ చెప్పి కథలన్నింటినీ కవిత్వీకరించుకుంటాను/ ఎంతో నిశ్శబ్దాన్ని మౌనంగా మోసే/ ఈ అక్షరాలే నా చిల్లర  దేవుళ్ళు” అని మౌనానికి మల్లెలకు మధ్య అక్షరాన్ని అందంగా అలంకరించిన శ్రీనివాస్‌వాసుదేవ్‌ గారి రచన నుండి ప్రారంభమైంది. కథకే కాదు కవిత్వానికి కూడా ప్రారంభం ఎంతో అవసరం. అదెలా అనుకుంటుంటే ఇక్కడ గమనించండి ” వెళ్లిపోతూ వెళ్ళిపోతూ మలుపు దగ్గర కాస్సేపు నిలబడి చూడు/రాయాలనుకున్నదేదో నీ చూపు చివర కదిలిపోతుంది” అంటున్న ఈ వాక్యాలు ఎంత సున్నితంగా ఉన్నాయో అంత సౌందర్యాన్ని ఒలకపోస్తున్నాయి. కవిత్వానికి బంధాలు, ప్రతిబంధకాలు అవసరంలేదు అన్నట్లు శీర్షికలోనే ”రాయలేనిదేదో” అనే సంశయాన్ని జతచేసి చివరిలో ”వెళ్ళిపోతూ మలుపు దగ్గర కాసేపు నిలబడి చూడు/ రాయలేనిదేదో ఒకటి దగ్డమయింది. రెప్పల తెల్లనవ్వు కింద” తెల్లని నవ్వు అంటే కంటి భాషను ఎంత చక్కగా మలిచారో కదా అనిపిస్తుంది ఈ కవి ఎవరో కాదు. కవిత్వాన్ని కవిత్వంలానే తీర్చిదిద్దే మన కవి ” అఫ్సర్‌ ”

కవిత్వానికి చిరునామా ఒక నవ్వు. ఒక నువ్వు అంతేనా అంటే కాదు. మనిషి నవ్వాలనంటే ఒక స్వచ్ఛమయిన నువ్వుండాలి. ఆ నువ్వు నా నువ్వు కావాలంటే నా నుండి స్వచ్ఛమయిన నవ్వు ఉండాలి. అనుకుంటాం ఒక నవ్వు ఒక నువ్వే కాదాని. కానీ ఈ రెంటి మధ్య ఎంతటి భావం ఉంటుందో గమనించండి ”యాకూబ్‌ గారి కవిత్వం చూడండి ” పూలతోటలోంచి పువ్వు కళ్ళు విప్పార్చి నవ్వుతున్నట్లు ఆమె నవ్వుతుంది/ గలగలపారే సెలయేటి మధ్య సుడులు తిరుగుతున్న నీళ్ళలా ఆమె నవ్వుతుంది/ మిట్టమధ్యాహ్నం నీడల్లోకి ప్రయాణం కట్టిన తెల్లటి మేఘంలా ఆమె నవ్వుతుంది/ నవ్వుకు నవ్వుల నడకలు నేర్పుతూ అలసినట్లు అపుడపుడూ కునుకు కూడా తీస్తుంది/ దాగిన దృశ్యాలకు, దాగని అర్ధాలకు నడుమ చేతనంలా కదులుతున్న భావాలేవో తచ్చాడుతుంటాయి” నవ్వు అయినా, నువ్వు అయినా రెండూ భావావేశాల చిత్రాలే! వాటికి అమరత్వం చిందించాలంటే ఒక కవిత్వంలాంటిది కావాలని అనుకోలేదు. ఏకంగా కవిత్వమే కావాలని చెప్పి మనకు అందించేరు. అభినందనలు.

కవిత్వం ఒక జ్ఞాపకాల అల్లిక. కవిత్వం ఒక అనుభవాల మాలిక అయితే కవిత్వం ఇలా ఉంటుందేమో చైతన్యశంకర్‌ కవిత్వాన్ని గమనించండి ” నాన్నిచ్చే డైరీకి / ఏడాది ఎదురుచూపు/ నీ పై నా ప్రేమను /తొలిసారి చెప్పింది ఆ డైరీకే/ చేజిక్కిన నీ తలవెంట్రుక / నా డైరీలో మెరుస్తూనే ఉంది/ డైరీలో పరిమళాలు /వాడిపోని జ్ఞాపకాలని” ఇలా సాగుతున్న వీరి కవిత చదవడానికి హాయిగా ఉంది. ఇదే దోరణిలో సాగిన చాంద్‌ ఉస్మాన్‌ ప్రేమ ఖరీదు కవితలో ” నువ్వు  మా ప్రాణంలా కన్నా/ నీకు నచ్చినదే చదువు/ కష్టాలు కన్నీళ్ళు.. అంత గొప్వవా/ నువ్వు ఎదగాలనే ఆశముందు మేమేది కోల్పోయినా / సంపాదించేది నిన్నేకదా”  అంటూ తల్లి తండ్రులకు బిడ్డలపై ఉన్న ప్రేమను వర్ణించిన తీరు ఎంతో హృద్యంగా ఉంది. నిశీధి అంటుందట నాకెవ్వరితోనూ సంబంధంలేదు. నా పాటికి నేను ఉంటాను. నాకోసం ఎవ్వరూ రారు. కనీసం నావైపు కూడా చూడరు. కానీ నాలోనూ ఎన్నో భయంకరమైన నిజాలుంటాయి. కీచుమని అరిచే కీచురాళ్ళ రొదలో కూడా కన్నీళ్ళుంటాయి. అది అర్థం చేసుకోకుండా అందరూ నన్ను వెలివేస్తారు అందట.  వాస్తవమనే వెలుగు లేకుంటే చీకటనే కనికట్టును మనిషి కనిపెట్టలేడు. చీకటంటే ఒక అవాస్తవం. అందులో ఏమి ఉంటాయో అనే అనుమానం ఉంటుంది. అందుకే నిశీధిలో నడవాలంటే ఒక వాస్తవం తోడుండాలి. ఆ తోడే వెలుగు. అలాగే సరిచేయలేని, మానలేని, అరచి గెలవలేని పాత్రలకు కవిత్వం ఎంతో అవసరం. జనాన్ని మనంగా మార్చుకోవాలంటే కవిత్వం కావాలి. ఆ కవిత్వం పదిమందికీ పంచే వెలుగులా ఉండాలి. అలాంటి వెలుగులు చిమ్మే

బివివి ప్రసాద్‌ గారి వర్దమాన కవికి అనే శీర్షికతో ”కవీ, నీ పాత్రలో కొద్దిపాటి నీరు చేరగానే/ దానినే గలగల లాడించి అది ఒక సెలయేరని భ్రమింపజేయకు/ నీ ముందు, నదుల్ని తాగి ఏమీ ఎరగనట్లు చూస్తున్నవారుంటారు” అంటారు బివివి ప్రసాద్‌గారు. తర్వాత ” నీ దగ్గర ఉన్న శబ్దాలను కొన్ని / కాగితం పేర్చడమే కవిత్వం అనుకున్నంతకాలం / నువ్వ ఒక్క కవితైనా చెప్పలేవు..”ఎంతటి జీవిత సత్యం దాగుంది? కవికి అంతకంటే సందేశం ఏంకావాలి? అనిపించక మానదు. ప్రసాద్‌గారు కవిత్వం ఏమిటో? అసలు కవిత్వ లక్షణాలేమిటో వర్దమానకవికి చెప్పడంలో కవిత్వంలోని వాస్తవాన్ని, కనపరిచే వెలుగును మన ముందుంచేరు. నిర్మొహమాటంగా  ముక్కుసూటిగా రచించే వీ కవిముందు వాస్తవాలన్నీ వర్ణచిత్రాలుగా మనకు కనబడటం విశేషం.

కవిత్వం కవిత్వమయ్యేవేళ మనకు కనిపించేవన్నీ కమనీయ దృశ్యాలే. మండుటెండలు సైతం పండువెన్నెలే. కాల్చే మంచు సైతం గిలిగింతలు పెట్టే పట్టెమంచమే!  దృశ్యాన్ని బట్టి ఏదీ అందగించదు. మనోస్థితిని అనుసరించి ప్రకృతి మనల్ని పలకరిస్తుంది. గుండె మంటతో పకక్షుల అరుపులను ఆలకిస్తే గోలగోలగా అనిపిస్తుంది. అదే సేదదీరే మనసుతో ఆలకిస్తే మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది అలా హాయిగా సాగిపోయే మెర్సీ మార్గెరెట్‌ కవిత్వం మనం గమనిద్దాం ”అదంతా ఆకుపచ్చ సముద్రం/ ఎన్ని చెట్ల ఆకులు తెంచి సముద్రాన్ని సృష్టించారో/ ఎన్ని మ్రానులు నరికి ఎన్ని మొక్కలు నాటి నిర్మించారో/ ఆ సముద్రపు తీరానికి కొట్టుకొచ్చే అలలు/ సారం పోయి ప్రాణం లేని పండుటాకులు/ వాటిని/ సముద్రం తనలో ఉంచుకోదు/ గాలికి ఎప్పటికప్పుడు పనిచెప్పి/ శుభ్రం చేయిస్తూ ఉంటుంది” అంటూ సాగిపోతుంది. భావాల్ని బరువుగా రాతికి కట్టి వేల్లాడదీయడం కాదు కవిత్వమంటే అనే కవిత్వాలు ఇలా సాగిపోతాయి అలాగే మనసు చిత్రాల్ని కాచి వడబోసే కవిత్వం మన శ్రీకాంత కాంటేకర్‌ గారి కవిత్వం ”ఇపుడు కన్నీళ్లలో ఉప్పదనం తగ్గిపోయింది/ ప్రేమలో చిక్కదనం తగ్గిపోయింది/బంధాలలో గట్టిదనం తగ్గిపోయింది/వ్యవస్థలో గొప్పదనం తగ్గిపోయింది/ చివరాఖరుకు మానవత్వానికి విలువ  తగ్గిపోయింది ” అని నేటి జీవనగతులను  అర్థమయ్యేరీతిలో తెలియజేసారు.

కవిత్వంలో కేవలం కవిత్వాన్ని మాత్రమే ఎంచుకుని ఆస్వాదించే కవి మన రాళ్ళబండి కవితాప్రసాద్‌ గారు. నిరంతరం కవిత్వంతో మమైకమై కవిత్వానికి విత్తనాన్ని బీజాన్ని సూర్యతేజంతో కలిపి మన ముందుంచేది వీరే. అందుకేనేమో వీరంటారు శబ్ధం ఇపుడు నిద్రిస్తోందని.. కవిత్వం ఒక శబ్ధమని వీరి భావన. నిద్రిస్తున్నా సరే శబ్ధిస్తుంటాడు కవి అనేదే వీరి కవితలోని ఆంతర్యం. బావుంది. ”అతడొక అక్షరాగ్ని పర్వతం/ అతని జీవితం ఒక అపరిచిత స్వప్నం/ అవిచ్ఛిన్నంగా కురిసే కాల వర్షంలో తడిసిపోతున్న ఆత్మ/ హఠాత్తుగా వేసుకున్న గొడుగులా ఉంది వాడి శరీరం/ అందుకే లోపల తడిగా/ బయట పొడిగా బతుకు పంజరం! / నిశ్శబ్దాన్ని శబ్ధంతో చీల్చే ఆయుధం వాడి పాట” ఇలా వెళుతున్న వీరి కవిత్వంలో చిక్కదనంతో పాటు చక్కదనం కూడా ప్రయాణిస్తూనే కవిలోని కవిత్వాన్ని, కవిత్వంలోని కవి తత్వాన్ని , రెండింటి మధ్య భావచిత్రాన్ని తెలిపిన తీరు హర్షణీయం.

ఈ సంకలనంలో అనేకమంది సుప్రసిద్ద కవులున్నారు. వారి కలంనుండి వెలువడ్డ ఒక్కో కవిత్వం గురించి ఒక్కో పేజీ రాసినా సరిపోదు అనిపిస్తుంది. కాలమనేది కనికట్టుకాదు. కాలం కవి సొత్తు. కాలానికి కవిత్వానికి ఎంతో సామీప్యత ఉంది. ఎందుకంటే కవిత్వం రాస్తుంటే కాలం తెలియదు. కాలం కవిత్వానికి ఒక ఆయువు పట్టుగా ఎంచుకుంటే మరో అద్బుతమైన కవిత్వాలు మీ ముందు ఉంచుతాను. ” నేను శబ్ధ వనాల మంచు సంచారానికి తీసుకుపోతానా/అతను/ ఆమె ముళ్ళ వంకాయల గురించి మురిసిపోతుంటుంది/టాడు/ నేను సృజించిన రంగమాయల నగలు చెబుతుంటాను/అతడామె ఎనగర్రబూజు దులపడానికి కాసె పోస్తుంటుంది” అంటుంటే మరో కోణమయినా ఇదే తీరులో సాగిన కవిత రేణుకా అయోలా గారిది ” జ్ఞాపకం మజిలీలు తెరలు తెరలుగా కమ్ముకుంటున్నాయి/ జాకెట్టు వేసుకోవడం కోసం అమ్మమ్మ అమ్మ పోరాటం/తలమీద గుప్పెడు వెంట్రుకలకోసం తన్నులు తిని మంగలివాడిని తరిమి కొట్టిన గాయంఆ మూడురోజులు మూల గదిలో ముగ్గిపోతూ చీకటి రాత్రుళ్ళలో ఒంటిమీద పాకిన గొంగళీలు ” ఇలా తన అభివ్యక్తీకరణలో ఎక్కడా రాజీ పడని తత్వం మనకు గోచరిస్తుంది.

ఇంకా ఈ సంకలనంలో కొన్ని కవితలు మినహా దాదాపుగా అన్నీ అరుదైన, అద్భుతమైన. మళ్ళీ మళ్లీ చదవాలనిపించే కవితలే ఉన్నాయి వాటిలో కటుకోఝ్వుల ఆనందాచారి చెరగని సంతకం, బెడిదె నరేందర్‌ రాళ్ళు, డాక్టర్‌ డి.కామేశ్వరరావుగారి జీవితం జ్ఞాపకం కాదు, దాసరాజు శ్రీనివాస్‌ పిచ్చిలోకం, రావిరంగారావుగారి ఎటియం కార్డు, స్వాతి శ్రీపాద శబ్ధ చిత్రాలు, దాలినాయుడు  ఎదేమయినాయి , సాయి పద్మ అపరిచితా , వేంపల్లి గంగాధర్ ఈ రాత్రి నక్షత్రపులా చెట్టు కింద , జగద్ధాత్రి నూత్న సనాతనం , జయశ్రీ నాయుడు నేనే నా నౌక , జుగాష్ విలీ ఎవరి నిర్వచనాలు వారివి , కాశీరాజు తాటాకిల్లు , మామిడి హరికృష్ణ  కొత్త సాలు ముచ్చట , కిరణ్ గాలి యాంద్రాయిస్ , జ్వలిత కురుసభ నాటి గొంగళి , యశస్వి సతీష్ బొమ్మరాళ్ళు , కట్టా శ్రీనివాస్ గుచ్చుకునే చూపులు ,జ్యోతిర్మయి మళ్ళ మొదటి వర్షం , జాన్ హెడ్  ఒక పక్కటెముక కొన్ని ఆలోచనలు , శీలాలోలిత గారి చలన సూత్రాలు , సిరికి స్వామీ నాయుడి గారి అసలే నేనంటే అమ్మకు ప్రాణం , శోభారాజు నీ జీవితపు శిల్పి, ” ఇలా ప్రతి కవితా పేరు పేరునా విశదీకరించ దగినవే . అందరికీ అభినందనలు .  మరిన్ని మంచి కవితలతో ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా చిక్కనైన , చక్కనైన మనల్ని అలరించాలని కోరుకుంటూ ఈ ప్రయత్నానికి వారదులైన కవి యాకూబ్ గారికి , తదితర కార్య వర్గానికి అభినందనలు మరియు కృతజ్ఞతలు

14 thoughts on “చిక్కని కవిత్వంతో చక్కని సంకలనం ”కవి సంగమం”

  1. శుభోదయం .
    మీ అక్షర కోయిలల సమీక్షార్చన తో ..
    సంగమంలో అభిషేకించారు ..
    ఇది ఒక పవిత్ర .. కవి కుంభమేళా ..

  2. మంచి ప్రయత్నాన్ని సాహితీ మిత్రులలోనికి తీసుకెళ్ళేందుకు మీరు సహృదయంతో చేసిన ప్రయత్నానికి అభివందనాలు మేడమ్. నిజానికి ఇది కత్తిమీద సామే కానీ న్యాయం చేసారు.

  3. ఒక్కొక్క అక్షరం సృషించడానికి ఒక శిశువును కనే ప్రసవ వేదన అనుభవిస్తాడు నిజమైన కవి. విమర్శకుడు/విమర్శకురాలు కవిత్వం లైన్లు quote చేసినప్పుడు తప్పనిసరిగా కవి పేరు చెప్పడం సాహిత్య ధర్మం.

  4. కవిసంగమం ఆహ్వానించదగ్గ ప్రయత్నం.మీ సమీక్ష చక్కని విశ్లేషణతో సాగింది.

  5. శైలజ గారు
    కవి సంగమం 2012 కవితా సంకలంనం మీద విస్తారమైన సమీక్ష చాలా బాగుంది అబినందనలు

  6. అభినందనలు … అభినందనలు

    చాలా మక్కువగా చదివారు, అంతకంటే మక్కువగా రాసారనిపిస్తుంది.

    1. makkuva sare sir.. Naku aa group pai gouravam koddee makkuva untundi. kaani ela undo cheppandi.

      1. బాగావుందనే కదా చదవగానే పోస్టు చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *