April 26, 2024

ఉప్పెక్కడ తీపి?

రచన : చిత్ర

ప్రజల పట్ల నిబద్ధతతో సాహిత్యరంగంలో పని చేస్తున్న మహిళా రచయిత శ్రీమతి నల్లూరి రుక్మిణి. స్త్రీ సమస్యలపైనే కాకుండా విస్తృతంగా ప్రజల జీవితాన్ని రాస్తున్న రచయిత. ఆమె 2008లో ఆంద్రజ్యోతిలో “క్వీన్ విక్టోరియా మళ్లీ నవ్వింది” అనే కథ రాశారు. అది వుత్తమకథగా కూడా ఎన్నికయ్యింది.

విషయమంతా దాదాపు కథ పేరే చెప్పేస్తుంది. ఇది ఆవేదనల కథ. విదేశీ పెట్టుబడి మన దేశాన్ని దోచుకుంటున్నదనీ, ఆ దోఫిడీకోసమే అభివృద్ద్ధి అనబడేది జరపబడుతున్నదనీ ఆవేదన. స్థూలంగా అదైతే, నిర్ధిష్టంగా ఇది కృష్ణపట్నం రేవు కథ. ఆ రేవు కోసం ఎన్నో గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయనీ, వుప్పు పొలాలు పోతున్నాయనీ, లాభాలన్నీ ఎవరో విదేశీ కంపెనీలకి పోతున్నాయనీ ఆవేదన. కథలో కెళ్తే మనం మాట్లాడుకోవలసినది సముద్రమంత వున్నది. మీ సమయం తినెయ్యకుండా ఒక్క చెంచాడు చెప్తాను.

భూమిని కాస్సేపు పక్కన పెడితే, శ్రమ – పెట్టుబడి నిరంతరం ఘర్షణ పడే శక్తులే కాదు పరస్పరాశ్రితాలు కూడా. పెట్టుబడి తోడవ్వని శ్రమ చంటి పిల్లవాడిలాటిదైతే, శ్రమ తోడవ్వని పెట్టుబడి మృతదేహం. శ్రమకి దూరం లేదు. హద్దులు లేవు. దండకారణ్యంలోని గిరిజనుడు కూలీ కోసం పట్నం చేరతాడు. ఏదో ఒక విద్య (సంప్రదాయ, వృత్తి) నేర్చినవాడు గల్ఫ్‌కో, సింగపూర్‌కో చేరతాడు. చదువు అనే ఆధునిక వుత్పత్తి సాధనం వున్నవాళ్లు అమెరికాకో, ఇంగ్లండ్‌కో పోతారు. పెట్టుబడికీ అవే సూత్రాలు వర్తిస్తాయి.

వ్యవసాయంలో వినియోగమూ, వినిమయమూ దశల్ని దాటిన మిగులు, వుత్పత్తి మార్కెట్లో ప్రవేశించి సరుకుగా మారుతుంది. అది పెట్టుబడి పుట్టుక. శ్రమని క్రమక్రమంగా లోబరుచుకున్న పెట్టుబడి మరింత  మెరుగైన వుత్పత్తి సాధనాల్ని తయారుచేసి మరింత మిగులుని తయారు చేస్తుంది. ఆ మిగులు సరిహద్దులు దాటుకుంటూ ప్రయాణం చేస్తూనే వుంటుంది. గ్రామాలు, ప్రాంతాలు, రాజ్యాల మధ్య వ్యాపారం ఒక ప్రయాణ దశ. “భరత ఖండం” ఎప్పటినుంచో ఈ వ్యాపారం చేస్తూనే వున్నది. సుగంధ ద్రవ్యాలనుంచి భారీ యంత్రాల దాకా ఒక ప్రయాణం వుత్పత్తి విధానం మీద, వుత్పత్తి దశమీద ఈ ప్రయాణం ఆధారపడింది. దీనికి 1947 సరిహద్దు రేఖ కాదు. 1600 కాదు. 1800 కూడా కాదు.

 

కాబట్టి పెట్టుబడికి దేశీయ, విదేశీయ అన్న గీతలు గీస్తే, మమకారపు పూతలు పూస్తే మనం దారి తప్పి వెతుకు బాటలోనే గతించిపోతాం. పెట్టుబడి అంటే శ్రమని దోచుకొనే, అదనపు విలువని దోచుకొనే సాధనమే తప్ప దీనికి స్వదేశీ, విదేశీ అనే తేడాలుండవు. దానికి మమకారాలుండవు. మేం 36 దేశాల్లో వున్నాం. ఇక్కడి చట్టాలు మాకు అనుకూలంగా లేకపోతే మరో దేశం పోతాం అని కుమారమంగళం బిర్లా తెగేసి చెప్పాడు.

స్వదేశీ పెట్టుబడిదార్లు తమ కార్మికుల్ని విదేశీ పెట్టుబడిదార్లకన్నా స్వదేశీ పెట్టుబడిదార్లు తమ కార్మికుల్ని విదేశీ పెట్టుబడిదార్లకన్నా మెరుగ్గా ఏమి చూసుకోరు. పాలూ, పరమాన్నాలూ పెట్టి పోషించరు. దోపిడీ విధానాల్లో, తీవ్రతలో మార్పేం వుండదు. వేరేచోట లాభాల రేటు (ROR) ఎక్కువగా వున్న ప్రతిసారీ దేశంలో పరిశ్రమల్ని తరలించేసిన మన పారిశ్రామికుల చరిత్ర వేలవేల పేజీలు గ్రంధస్థమై వున్నది. గోగు, బట్టలు, పంచదార ఇలా ఏ పరిశ్రమ చరిత్ర చదివినా ఇది స్పష్టమౌతుంది.

పెట్టుబడి, శ్రమా నిరంతరం యుద్ధం చేస్తాయని మనం స్థూలంగానైనా నమ్మితే, అవతలి పక్షానికి లేని “దేశీయ” మమకారాల్ని మనం ప్రజలకి, పాఠకులకి బోధించడం అంటే పరోక్షంగా ఆ వర్గాన్ని బలపరుస్తున్నామని అర్ధం. మన దేశంలోకి వస్తున్న పెట్టుబడి గురించి, సరే, మాట్లాడదాం. కానీ ఒక్కసారి మన దేశ పెట్టుబడిదార్లు తమ లాభాలని ఏం చేస్తున్నారు? అని ఆలోచిస్తే వాళ్లు మరింత లాభాలొచ్చే రంగాల్లో వేరే దేశాల్లో పెట్టుబడి పెడుతున్నారు.

జిందాల్ స్టీల్ వాళ్లు ఆఫ్రికాలోని ఒక విద్యుత్ వుత్పత్తికేంద్రంలో రెండు బిలియన్ డాలర్లు పెట్టారు. బిర్లా వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా అల్యూమినియం పరిశ్రమకోసం 750 మిలియన్ డాలర్లు పెట్టారు. రిలయన్స్ వాళ్లు వెనిజులాలో రెండు బిలియన్ డాలర్లు పెట్టారు. ఇవి చిన్నవి. టాటా వాళ్లు కోరస్‌ని కొన్నారు. 2000 నుంచీ 2006 మధ్యలో ఒక్క టాటా గ్రూప్ వేరే దేశాల్లో 28  కంపెనీలు కొన్నది. సజ్లాన్ అనే మన దేశం కంపెనీ ఆర్.ఎ. పవర్ అనే జర్మనీ కంపెనీని రెండు బిలియన్ డాలర్లకు కొన్నది. ఎస్సార్ గ్రూప్ ఆల్‌గోన్ అనే కెనడా కంపెనీని ఒకటిన్నర బిలియన్ డాలర్లకు కొన్నది. హిండాల్కో ఆరు బిలియన్ డాలర్లకు నోబెలిస్‌ను కొన్నది. వుద్యోగుల జీతాలివ్వడానికి “నా దగ్గర డబ్బుల్లేవ్” అన్న విజయ్ మాల్యా కంపెనీ యునైటెడ్ స్ప్రైట్స్ ఒక అమెరికా కంపెనీ వైట్ ఎండ్ మాకీని ఒకటిన్నర బిలియన్లకు కొన్నది.

ఇన్ఫో క్రాసింగ్ అనే అమెరికన్ కంపెనీని విప్రో 2430 కోట్లకు కొన్నది. నేను చూపించింది కాకిరెట్ట. సముద్రాన్ని మీరు శోధించండి.

సరేలే ఇవన్నీ ప్రైవేటు పెట్టుబడులు. దేశంగా… అని సాగదీసే వాళ్లూ వున్నారు. కథలో ప్రధానపాత్ర కూడా అలాగే బాధపడుతుంది. యంత్రాలూ, వస్తువులూ అమ్ముకుంటే మనకి లాభం కానీ సహజ వనరులూ, ముడి సరుకులూ  అమ్మేసుకుంటే ఎలా? అని మనకి కూడా జాతీయభక్తి వుప్పొంగి నిజమే కదా హైస్కూల్లో అదే కదా చదువుకున్నాం అనిపించి ఆవేశం కలుగుతుంది.

జులై 2010లో రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం మనదేశం మొజాంబిక్‌కి చదువుకోసం, విద్యుత్ వుత్పత్తి కోసం 34 మిలియన్ డాలర్లు ఇస్తుంది. మంచిదే కదా! అయితే ఆ ఒప్పందంలో  భాగంగా మొజాంబిక్ మనకి జీడిపప్పు, ఆహారధాన్యాలు, చిక్కుడు జాతి చెట్లు, బొగ్గు, ఇనుము అమ్మాలి. పైగా మన దేశం నుంచి యంత్రాలు, వినియోగ వస్తువులు, మందులు కొనాలి. ఎగ్జిం(EXIM) బాంకు ఇథియోపియా ప్రభుత్వానికి 640 మిలియన్ల అప్పు ఇచ్చింది. ఆ దేశపు పంచదార పరిశ్రమ అభివృద్ధికి, ఈ అప్పులో డెబ్భైఐదు శాతం ఆ దేశం మన నుంచి పంచదార పరిశ్రమకి  సంబంధించిన వస్తువులూ, మరీ మరీ ముఖ్యంగా ‘సలహా సేవలు’ కొనడానికి వాడాలి. ఇథియోపియాలో 2008 నుండి 2010 మధ్య నాలుగున్నర లక్షల హెక్టార్ల భూమి స్థానిక ప్రజానీకం నించి వూడ లాక్కుని భారత కంపెనీలకి చెరకు, పత్తి పండించడం కోసం ధారాదత్తం చేయబడింది. దీని వెనక ప్రధాన సూత్రధారి ఎగుమతి దిగుమతుల బ్యాంకు.

అయ్యా ఇది జంధ్యంలో నూలుపోగు. మీరు వెతకండి ప్లీజ్. భారత ప్రభుత్వ అనుమతుల్లేకుండా ఇక్కడి పెట్టుబడి విదేశాలకు పోదు. పోకూడదు. ఈ ఫెమా(FEMA) చట్టాన్ని 2000లో సవరించారు. ఫిక్కీ జనరల్ సెక్రటరీ అమిత్ మిత్రా మాటల్లో చూస్తే. అమెరికాలో యు.ఏ.ఈ తర్వాత అతి పెద్ద మదుపుదారు భారతదేసమే. మొజాంబిక్ విదేశీమంత్రి కుర్నెర్యా మాటల ప్రకారం ఆ దేశంలో నాలుగో పెద్ద మదుపుదారు భారతం. KPMG ప్రకారం జర్మనీలో ఆరవ పెద్ద పెట్టుబడిదారు ఇండియా. ఒక్క 2008 (కథాకాలం)లోనే మారిషస్ అనే చిన్నదేశంలో మన పెట్టుబడి 284 మిలియన్లు దాటింది.(రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బులెటిన్ అక్టోబర్ 2008)

విదేశీ కంపెనీలు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాయని కథలో పాత్ర ఎంతో బాధపడుతుంది. మా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది. ఈ కంపెనీల్ని పంపేద్దాం అని మనకి అనిపిస్తుంది. కథ ఆశీంచిన ప్రధాన ప్రయోజనం అదే. చాలా మంచి విషయం. గ్రామాలు ఖాళీ అయిపోవడం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిజానికి ఇది బాధ కలిగించే విషయం. కంపెనీల్ని పంపెయ్యాల్సిందే.  కానీ విదేశీ అనే గీతలవల్లే  ఇబ్బంది. పెట్టుబడి రంగు ఏదైనా – నలుపు, తెలుపు, పసుపు – శ్రమనీ, ప్రజల్నీ దోచుకోడం., పీడించడం ద్వారానే బతుకుతుంది.

కరుటూరి గ్లోబల్ అనే కంపెనీ 2008 -09లో (కథాకాలం)  ఇథియోపియాలో మూడు లక్షల హెక్టార్ల భూమి దీర్ఘకాల అద్దెకి తీసుకున్నది. ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. కౌలు హెక్టారుకి అరవై రూపాయలు. ఈ కౌలు పంజాబ్‌లో అరవైవేలు, గోదావరి జిల్లాల్లోముప్పైవేలూ వున్నది. దీనివల్ల ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. గంబెలా ప్రాంతంలో తీవ్రమైన వుద్యమాలు  జరుగుతున్నాయి. అధ్యక్షుడు మాజీ మార్క్సిస్టు జెనెవా పెట్టుబడికి దత్తపుత్రుడయ్యాడు. ఈమని బయోటెక్ వగైరా ఎన్నో రకాల కంపెనీలు వుద్యోగాల ఆశపెట్టి భూములు లాక్కుంటున్నాయనీ, కానీ లాక్కున్న ప్రతి 2500 హెక్టార్ల భూమికి ఒక్క కూలీపని మాత్రం దొరుకుతోందనీ స్వయంగా ప్రపంచ బ్యాంకు రిపోర్టు రాసింది. ప్రజలు పోరాడుతుంటే దాన్ని ప్రభుత్వం “టెర్రరిజం” అంటున్నది. అరెస్టులు, జైళ్లు,  కాల్చివేతలు, మూడోకంటికి తెలీకుండా చంపెయ్యడం. ఇదీ వర్తమానం. మహిళా జర్నలిస్టు రీయట్ అలెమూపై నిర్భంధం. అరెస్టు. హింస.  ప్రపంచవ్యాప్తంగా నిరసనని తీసుకొచ్చింది. ఇలాంటి కథలే తూర్పు ఆఫ్రికా దేశాల్లో, కెన్యా, మెడగాస్కర్, సెనెగల్  లిస్టు పెద్దదే. ఆ దేశాల్లో భారత దేశాన్ని వ్యవసాయ రంగ సామ్రాజ్యవాది (Agricultual imperialisation)  అని పిలుస్తున్నారు. ఇండియా అంటే మండిపడుతున్నారు ప్రజలు. ఒక్క ఇథియోపియాలో మూడు లక్షలమంది. సెనెగల్‌లో లక్షకుపైగా ప్రజలు దిక్కుమాలిపోయేరు. (అవి చాలా చిన్న దేశాలు). ఆసక్తి వున్నవారు పరిశీలించండి. ఎన్నో పుస్తకాలొచ్చేయి. వీళ్లు మన దేశస్థులు. భాషస్థులూనూ. కథలో వుప్పు గురించీ, ఎంతో ఆవేదన కనిపిస్తుంది. వుప్పు సత్యాగ్రహం గురించి ఎంతో మమకారంతో, గాంధీగార్ని ఎంతో ఆరాధనతో రాస్తారు. అయితే దండి మార్చ్ అయిన కొన్నాళ్లకే అక్కడే మిత్తాపూర్ (గుజరాత్)లో 1940లో వుప్పు తయారీ “మన” టాటాలు మొదలు పెట్టేరు.

దేశంలోనే మొట్టమొదటిసారి 1983లోగా వుప్పుకి “బ్రాండింగ్” ఇచ్చేరు. “టాటా వుప్పు – ఈ దేశపు వుప్పు” అదీ నినాదం. దేశంలో వుప్పు అమ్మకాల్లో నలభై శాతం అమ్మకాలు టాటావే. “గళ్ళుప్పు”గా పిలవబడే స్ఫటికాల్లా వుండే వుప్పు కుదేలైపోయింది. మిత్తాపూర్ కథ చదివితే  చాలా తెలుస్తుంది. అలాగే కథలో చేనేత పరిశ్రమని  విదేశీ మిల్లులో లేదా విదేశీ పెట్టుబడి నాశనం చేసిందని ఆవేదనాపూర్వకంగా రాస్తారు. వాస్తవానికి భారతీయ బట్టల లేదా చేనేత (ముతకరకం) పరిశ్రమని నాశనం చేసినది పూర్తిగా, నిఖార్సుగా దేశీయ, స్వదేశీ, “మన” పెట్టుబడే అని రుజువు చెయ్యడానికి సిద్ధంగా వున్నారు. నా గురువు, సామాజిక పరిశోధకులు ఎస్.ఏ. విద్యాసాగర్ చాలా సాహిత్యం అందుబాటులో వున్నది. టాటాకి ఎభభై దేశాల్లో వ్యాపారాలున్నాయి. ఆ సంస్ధ రాబడిలో అరవైశాతం విదేశాల్లో వ్యాపారాల వల్లనే వస్తున్నది. బిర్లా, రిలయన్స్, మహీంద్రా & మహీంద్రా, విప్రో, ఇంఫోసిస్, బజాజ్, జిందాల్.. నా చెయ్యి పీకుతోంది. ఒక్కో గ్రూప్ చరిత్ర చదవండి.

మనదేశపు సహజ వనరులు పోవడం గురించి ఆవేదన కథలో కన్పిస్తుంది. దేశభక్తి మనలో వుప్పొంగుతుంది. అయితే టాటా పవర్ తన విద్యుదుత్పత్తి కేంద్రాలకి కావలసిన బొగ్గులో ముప్ఫై శాతం ఒక్క ఇండోనీషియా నుంచే “సంపాదిస్తోంది.” భూమి రిసోర్సెస్, బారా ముల్టీల్లాంటి వాటి ద్వారా అక్కడి గనులపై పట్టు సంపాదించింది. దేశంలో వస్తున్న ధర్మల్ విద్యుత్ కేంద్రాల కోసం బొగ్గు గనులపై ఆధిపత్యం కోసం మన దేశ సంస్థల మధ్య అక్కడ ఘర్షణ మొదలైంది. ఇందాక చెప్పిన ఆఫ్రికన్ దేశాల పంటలు ఇక్కడే అమ్ముతారు. పంచదారకీ, పత్తికీ ప్రపంచంలోనే పెద్ద వినియోగదారు ఇండియా. నిర్దిష్టంగా కృష్ణపట్నం ఓడరేవు విషయానికొస్తే ఆ పోర్టు పెట్టిన ప్రధాన వుద్దేశ్యాలు రెండు. కోస్టల్ కారిడార్‌లో రాబోయే థర్మల్ కేంద్రాలకు కావలసిన బొగ్గుని ఆఫ్ఘనిస్థాన్, ఆఫ్రికన్ దేశాలనుంచి చవగ్గా రవాణా చేసుకోడం. బళ్ళారిలోని గనుల్లో తవ్వే ఇనుప ఖనిజాన్ని చవగ్గా రవాణా చెయ్యడం. ధర్మల్ కేంద్రాలన్నీ జగన్‌వనీ, బళ్లారి గనులు గాలి జనార్ధన్‌వనీ బహిరంగా రహస్యమే. వీళ్లిద్దరూ మన దేశస్థులూ మన రాష్ట్రస్థులూ, మన భాషస్థులూ. కథలోని ఇనుపరజను దుమ్ము విదేశీ దుమ్ము కాదు స్వదేశీయే. పెట్టుబడిదారీ పెరిగింది. గుత్త పెట్టుబడి తయారీ ముమ్మరమైంది. పెట్టుబడికి ఏకైక లక్ష్యం ప్రమాణం – లాభాలు.. అవి చాలవన్నట్టు సరుకులో, శ్రమో ఎగుమతి చెయ్యడం కాకుండా కేవలం పెట్టుబడిని ఎగుమతి చెయ్యడం ద్వారా వచ్చే, లెనిన్ మహాశయుడు మాటల్లో మహా లాభాలు. మన దేశం నుంచి వెళ్తోన్న పెట్టుబడుల్లో కొంత భాగం, కేవలం ఫైనాన్స్, ఇన్సూరెన్స్ వగైరా రంగాలకి వెళ్లడం మన జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఆ భాగం చిన్నది కాదు. ఒక్క 2008లో (కథాకాలం) బయటికెళ్లిన పెట్టుబడి 3155 మిలియన్ డాలర్లలో నెదర్లాండ్స్ (23%) మారిషస్ (91%) సింగపూర్ (32%) లకు వెళ్లింది. ఇది అక్కడ ఏ వుత్పత్తిని పెంచింది అంటే అదొక పెద్ద ఆట. దీన్నే సుసాన్ జోన్స్‌లాంటి వాళ్లు కాసనోవా కాపిటలిజం అన్నారు. మహాశయులు ఫైనాన్స్ కాపిటల్ అన్నారు.

మరి సరిహద్దుల్నీ, మమకారాల్నీ తుంగలో తొక్కి లాభాలు  ఒక్కటే లక్ష్యంగా, దోపిడీ ఒక్కటే మార్గంగా, పీడన ఒక్కటే అయుధంగా వెళ్తున్న పెట్టుబడి రాక్షసత్వాన్నించి ప్రజలకి విముక్తి కలగాలంటే మనం రాసే మమకారాల కథలు ఎవరికి పనికొస్తాయి?

ఐర్లాండున ఓడ కలాసీ, చెక్ దేశపు గని పనిమనిషీ అన్న శ్రీశ్రీని స్మరించుకుందాం.

1 thought on “ఉప్పెక్కడ తీపి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *