May 8, 2024

ఆలోచింపజేసే ప్రకటన

రచన: రామహరిత పూసర్ల

తనిష్క్ నగల  వారి కొత్త వాణిజ్య ప్రకటన

టీ వీ లో ఈ మధ్య వస్తున్న వాణిజ్య ప్రకటనలు ప్రస్తుత కాలంలో  వేగంగా మార్పు చెందుతున్న మన సమాజం యొక్క  దృష్టి కోణాన్ని అద్దం పట్టేవిగా  వుంటున్నాయి. నేటి  యువత ప్రస్థుత సమాజంలో ఎన్నో కొత్త మార్పులు సంతరించుకోవాలని ఆశ పడుతున్నారు. ఈనాడు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న టీవీ చానెళ్ల మూలంగా  వస్తున్న కొత్త కొత్త వాణిజ్య ప్రకటనలు మారుతున్న భారత దేశం యొక్క అభిరుచులు, ఆకాంక్షలను ప్రస్పుటిస్తున్నాయి. తరతరాలుగా వస్తున్న మూర్ఖపు కట్టుబాట్ల నుంచి, సాంప్రదాయాలు నుంచి బందనాలు తెంచుకొని ఒక స్వచ్చందమైన, ఛాందస భావాలు లేని సమాజం నిర్మించాలని యువత ఉవ్విళ్ళూరుతున్నారు. వారు తమ కొత్త అలోచనలకు, విధానాలకు, భావాలకు వాణిజ్య ప్రకటనల ద్వారా సామాన్య ప్రజలను చేరాలని  సరికొత్త  ప్రయోగాలు చెయ్యటం మొదలుపెట్టారు. ఈ ఆలోచనలను జన స్రవంతిలోకి తీసుకొని వెళ్ళే దిశలో వారు టీవీ ని ఒక చక్కటి మాధ్యమంగా ఎన్నుకున్నారు. ఈ దిశలో సాగిన ఒక  ప్రయత్నమే కొత్తగా వచ్చిన తనిష్క్ నగల ప్రకటన. మొదట్లో చాలా మంది ఈ ఏడ్ ని చూసి చూడనట్టు ఊరుకున్నారు కాని రాను రాను అందరిని అలోచింపచేసింది, చర్చలకు ముఖ్య అంశమైంది. ఇప్పటి వరకు మనము  ఏడ్స్ లో  అందమైన అమ్మాయిల వివాహలు చూడటానికి అలవాటు పడ్డాం. కాని దానికి విరుద్ధం గా తనిష్క్ కొత్త ఆడ్ లో  విడాకులు తీసుకున్న,లేదా భర్త పోగొట్టుకుని పిల్లలు వున్న మహిళ యొక్క పునర్వివహం చూపించటం జరిగింది. ఈ కొత్త పద్దతి అందరిలో ఆశ్చర్యం,ఉద్వేకం కలిగించింది.

మన సమాజం చాలా భిన్నమైనది, ఆచార వ్యవహారాలు, పద్దతులు, నమ్మకాలలో  చాలా తేడాలు వున్నాయి. ఆధునీకరణ వల్ల పట్టణాలలో వుండే జీవన శైలి పల్లెలలోని జీవన విధానం భిన్నదృవాలుగా మారాయి. ఒకవైపు కుల, మత, జాతి విభేదాలు లేని  ఒక  ఆదర్శవంతమైన  సమాజం కోసం కొంత మంది ప్రయత్నిస్తుంటే మరోవైపు ఎప్పటినించో వస్తున్న మూఢ సంప్రదాయల ఊబిలో కూరుకు పోతున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ సంచలనాత్మకమైన ప్రకటన సమాజంలోని వారి ఆలోచనా దృక్పధంలో వెంటనే ఆశించిన మార్పు,  తీసుకొని రాకపోవచ్చు కాని అందరి మనసుల్లో మార్పు యొక్క బీజం నాటిందని చెప్పవచ్చు… ఎన్నో తరాలనుంచి నాటుపోయిన ఛాందస భావాలను మార్చడానికి  ఇలా ప్రకటనల ద్వారా  వేసిన తొలి అడుగులా భావించవచ్చు.

ఆధునిక భారత సమాజం సంకుచిత భావాలకు స్వస్తి చెప్పి కొత్త ఆలోచనా దోరణికి, జీవన సరళికి ఆహ్వానం పలకడానికి ప్రయత్నిస్తుంది. మారుతున్న పరిస్తితుల ప్రకారం పెద్దలు కూడా మారుతున్నారు. ఉదాహరణకి విడాకులను ఇదివరకు ఎంతో అనుమానంగా, అభద్రతా భావంతో చూసే తల్లితండ్రులు  ఇప్పుడు ఇష్టం లేని పెళ్ళిలకి స్వస్తి చెప్పమని, విడాకులు తీసుకోవడానికి, కొత్త జీవితం మరల ప్రారంభించడానికి పిల్లలకి అండగా వుంటున్నారు. అదే విధంగా కులాంతర, మతాంతర వివాహలకు కూడా కాస్త సమ్మతం పెరిగింది. సమాజంలో కొంత శాతం కొత్త పద్దతులను ఆచరించడం మొదలుపెట్టింది.

ఒక దశాబ్దం క్రితం  పునర్వివాహం అంటే ఎంతో తప్పుగా భావించే వారు. కాని ఇప్పుడు పునర్వివాహాల శాతం బాగానే పెరిగింది. కాని ఇంకా ఒక బిడ్డ తల్లికి పెళ్ళి జరగడం కష్ట తరమైనదే. పిల్లలు వున్న ఆడవారికి పెళ్ళి కావాలంటే వారు  ఎంతో రాజీ పడాలి, సరైన జోడి వారికి దొరకటం ఇప్పటికీ చాలా కష్టమే. పునర్వివాహం తరువాత సమాజం మగవారికి ఇస్తున్న ఆదరణ ఇంకా ఆడవారికి  ఇవ్వటం లేదు.    పునర్వివాహాలు బాగా డబ్బులు వున్న కుటుంబాలలో  ఎక్కువ గానే జరుగుతున్నాయి కాని మధ్యతరగతి కుటుంబాలు వీటిని అదరరించటంలో వెనుకాడుతున్నారు.  ఈ  వివాహాలు ఎంత కాలం నిలకడగా వుంటాయి అన్నది కూడా ఒక ఆందోళన కలిగించే విషయం. భారత దేశంలో ఆడవారి మీద వున్న వివక్షత ఈ విషయం లో ప్రస్పుటం గా కనబడుతుంది.

దురదృష్ట వశాత్తు సమాజంలో  చోటు చేసుకుంటున్న  కొత్త పద్దతులను, మార్పులను పూర్తి స్థాయిలో అందరూ అంగీకరించటం లేదు. సమాజాన్ని ఉద్ధరిస్తున్నామన్న సాకుతో, సంప్రదాయాన్ని రక్షిస్తున్నామన్న దోరణితో,  నైతిక విలువలనూ కాపాడుతున్నామన్న  నెపంతో  కొంత మంది ఇంకా కొత్త పద్దతులను, ప్రవృత్తులను నిరాకరిస్తున్నారు.

ఈ వాణిజ్య ప్రకటన వల్ల TATA group కి ఎన్ని లాభాలు వచ్చేయన్న విషయం  తెలియదు కాని, ఇటువంటి వ్యాపార ప్రకటనల వల్ల సమాజంలో వెంటనే మార్పు కలగటం అసాధ్యం. కాని ఏడ్ ప్రపంచం లో ఇదొక కొత్త ప్రయోగం

1 thought on “ఆలోచింపజేసే ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *