May 7, 2024

మౌనరాగం – 3

రచన:అంగులూరి అంజనీదేవి

 anjanidevi

తెల్లవారింది.

నిద్రలేచినా లేవనట్లు అలాగే పడుకొంది దేదీప్య.

‘‘దేదీప్యా! ఇప్పుడే జ్యోత్స్న కాల్‌ చేసింది. మీ కాలేజీలో ‘ఫేర్‌వెల్‌’ పార్టీ వుందట. నిన్ను రమ్మంది. నీకోసం వెయిట్‌ చేస్తుందట.’’ అంది అపురూప.

‘‘ నాకు వెళ్లాలని లేదు వదినా!’’ అంటూ బెడ్‌మీద నుండి లేవకుండానే సమాధానం యిచ్చింది దేదీప్య . ఆమె గొంతులో కోపం, బాధ మిళితమై ఒకవిధమైన నిర్లక్ష్యం సుడులు తిరుగుతోంది.  దాన్ని బయటపడకుండా జాగ్రత్త పడింది. కారణం పెద్దవాళ్లంటే గౌరవం, భక్తి భావం.

‘‘పడుకుంటే అలాగే బద్దకంగా పడుకోవాలనిపిస్తుంది. లే. లేచి రెడీ అయి కాలేజీకి వెళ్లు.’’ అంటూ అక్కడే గుక్కపెట్టి ఏడుస్తున్న బాబును ఎత్తుకొని ‘లేదులే నాన్నా  ఏడవకు’’. అంటూ హాల్లోకి వెళ్లి ఆ తర్వాత క్రిందికి దిగి మామ్మ దగ్గరికి వెళ్లింది.

అపూరూప అలా వెళ్లగానే పనిమనిషి దేదీప్య దగ్గరికి వచ్చింది.

‘‘రాత్రి కూడా తినలేదు.  లేచి కాస్త టిఫిన్‌ తినండమ్మా.’’ అంది పనిమనిషి.

‘‘నాకు తినాలని లేదు.’’ అంది ఆసక్తి లేని దానిలా దేదీప్య.  మెల్లగా వెళ్లి దేదీప్య మంచం పక్కన కూర్చుంది పనిమనిషి అప్పుడప్పుడు వెళ్లి అలా కూర్చోవటం అలవాటే.

‘‘వాళ్లకి మీరు బాగా నచ్చారటమ్మా! ఇది సంతోషించతగ్గ విషయమే కదా! మరి మీరెందుకుకిలా తినకుండా…..’’ అంది అర్థం కాక పనిమనిషి.

‘‘ముందుగా నాతో చెప్పకుండా, నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్లిచూపులు జరిపించారు. వాళ్లేమో నేను, నచ్చానని నా అందానికి వందమార్కులు వేసుకొని వెళ్లారు. నా మనసులో ఏముందో ఎవరూ అర్థం చేసుకోవటం లేదు.’’ అంది బాధగా.

‘‘పనుల ఒత్తిడి వల్ల మీ అభిప్రాయం తెలుసుకోలేదేమో కాని అన్నయ్య, వదిన ఏది చేసినా మీ యోగక్షేమాలు ఆశించే చేస్తారమ్మా! మీ కన్నా  మీ గురించి వాళ్లే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వాళ్లిప్పుడు మీకు తగిన సంబంధం తెచ్చామన్న ఆనందంతో వున్నారు. మీరిలా గదిలోంచి బయటకు రాకపోతే బాధపడ్తారు.’’ అంది పనిమనిషి.

‘‘నా బాధ ఎవరికీ అవసరం లేదా? చదువును మధ్యలో ఆపేసుకొని పెళ్లి చేసుకోవాలంటే బాధగా వుండదా? ఎంత బాధగా వుంటుందో అర్థం చేసుకోరేం?’’ అంది దేదీప్య. మాటల్లో వ్యక్తం చెయ్యలేని తన మనసులోని బాధను ఎలా బయటపెట్టాలో అర్థం కావటం లేదు.

‘‘అసలు విషయం అది కాదు దేదీప్యమ్మా! ఆ రోజు హాస్పిటల్లో ఆ అబ్బాయిగారు మీకేదో చెప్పారని……’’

‘‘ ఏం చెప్పారే?

‘‘ఇంగ్లీషులో చెప్పారు కదమ్మా! ప్రేమిస్తున్నానని  అది మీ వదినగారికి, ఇందుమతమ్మ గారికి నచ్చలేదు. అందుకే తొందపడి పెళ్లి చేస్తున్నారు.’’ అంది తనకి తెలిసిన విషయాన్ని బయటపెడ్తూ.

‘‘అదేం కాదు నీ మొహం.  అంతా తెలిసినట్లే మాట్లాడతావ్‌!  అన్నయ్య, వదిన స్టేట్స్‌ పోతున్నారు. అందుకే ఈ పెళ్లి!’’ అంది దేదీప్య.

నోరెళ్లబెట్టింది పనిమనిషి.

ఫేర్‌వెల్‌ పార్టీకి అభిరాం జూనియర్స్‌ ఇన్‌వైట్‌ చేశారని, అభిరాం హైదరాబాద్‌ నుండి తప్పకుండా పార్టీకి వస్తాడని దేదీప్యకి గుర్తుకు రాగానే చటుక్కున మంచం దిగింది.

త్వరత్వరగా రెడీ అయింది.

చక, చక మెట్లు దిగి కాలేజీకి వెళ్లింది.

పార్టీ యింకా స్టార్ట్‌ అవ్వలేదు.  ఆమె చూపులు అభిరాం కోసం వెతికాయి.  ఎవరితోనో మాట్లాడి ఇటువైపే వస్తున్న అభిరాంని చూడగానే దేదీప్యకి సంతోషమనిపించింది.  వెంటనే అతన్ని సమీపించింది  .

ఇద్దరు ఒకరి నొకరు విష్‌ చేసుకున్నారు.

‘‘ ఈ పార్టీకి మీరు తప్పకుండా వస్తారని, మీతో మాట్లాడాలని వచ్చాను అభిరాం.’’ అంది దేదీప్య.

‘‘ఏంటో చెప్పు దేదీప్యా! ఏం మాట్లాడాలి నాతో?’’ అంటూ ఒక చోట కూర్చున్నాడు. అతను చాలా సేపటి నుండి ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్లుంది. రిలాక్స్‌ గా కూర్చున్నాడు. దేదీప్య కూడా అతనికి ఎదురుగా కూర్చుంది.

‘‘నాకు నిన్న పెళ్లి చూపులు జరిగాయి అభిరాం’’. అంది దేదీప్య.

ఆపై ఏం చెప్పాలో ఆమెకు తోచటం లేదు.  మెడ మీద కత్తి పెడ్తున్నారని తెలుస్తుంటే తప్పించుకోవాలని ఏ ప్రాణికైనా వుంటుంది. ఇప్పుడు తన సమస్యను ధైర్యంగా చెప్పకపోతే వేరే వ్యక్తితో పెళ్లి జరిగిపోతుంది.  చేతులు కాలాక ఎన్ని ఆకులు పట్టుకున్నా లాభం వుండదన్నట్లు తర్వాత తన బాధ గురించి ఎంత   ఘోషించినా ఫలితం వుండదు. ఇప్పుడే చెప్పాలి అనుకొంది మనసులో దేదీప్య.

‘‘కంగ్రాట్స్‌!’’ అన్నాడు దేదీప్య ముఖంలోకి సంతోషంగా చూస్తూ ….

ఆ మాటకి షాక్‌ తిన్నది దేదీప్య.

‘‘ కంగ్రాట్సేంటి? జోకా?’’ అంది.

‘‘జోకేంటి? నువ్వేగా పెళ్లి చూపులు జరిగాయి అన్నావ్‌!’’ అన్నాడు.

‘‘సీరియస్‌గానే కంగ్రాట్స్‌ చెప్పారా?’’ మళ్లీ అడిగింది.

‘‘నువ్వేదో కన్‌ఫ్యూజన్‌లో వున్నావ్‌. నన్ను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నావ్‌! నేను సీరియస్‌ గానే కంగ్రాట్స్‌  చెప్పాను.!’’ అన్నాడు తాపీగా.

‘‘మిమ్మల్ని ప్రేమించిన ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరిగాయని తెలిస్తే మీలాగ ఎవ్వరు కంగ్రాట్స్‌ చెప్పరు. ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తారు.’’ అంది నెమ్మదిగా.

ఆకాశం ముక్కలై మిాద పడ్డట్టు చూశాడు.

‘‘నువ్వు నన్ను ప్రేమించావా?’’ అంటూ ఆ షాక్‌ లోంచి తేరుకోలేపోతున్నాడు.

‘‘అవును ప్రేమించాను. మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరొచ్చి మా అన్నయ్యను అడగండి! పెళ్లి చూపులేగా జరిగింది.  పెద్ద ప్రాబ్లమ్‌ ఏమీ వుండదు.  అన్నయ్య ఎలాగో మేనేజ్‌ చేసుకుంటారు.’’ అంది దేదీప్యా.

అప్రతిభుడై చూస్తున్న అభిరాం గొంతు తడారి మాటలు రావటం లేదు.                                             ‘‘నిన్న పెళ్లి చూపుల్లో కూర్చోవాలంటే నా ప్రాణం చచ్చిపోయినట్లు అయింది అభిరాం! ఒకర్ని ప్రేమించి ఇంకొరితో పెళ్లిచూపులంటే భరించలేకపోయాను. అన్నయ్య మాట కాదనలేక  ఆ కొద్ది సేపు ముళ్ల మీద కూర్చున్నట్లే కూర్చున్నాను.’’ అంది కొద్దిగా తలవంచుకొని దేదీప్య.

‘‘నేను నిన్ను ప్రేమించలేదు దేదీప్య!  ఆ వూహ కూడా నాకు రాలేదు.’’అన్నాడు ఆమెనే చూస్తూ.

భూమిబ్రద్దలై క్రుంగిపోతున్న దానిలా చూసింది.

‘‘ఎందుకని అభిరాం? ఒక అమ్మాయిలో వుండాల్సిన మంచి లక్షణాలు నాలో వున్నాయని అందరూ అంటుంటారు. మరి నాలో మీకేదైనా లోపం కన్పించిందా?’’ అడిగింది దేదీప్య.

‘‘ప్రేమించటమనేది నా అంతట నేను ప్రేమించాలి. అడిగితేనో…. లేక ‘నాలో లోపం లేదు కదా ఎందుకు ప్రేమించవు’ అని డిమాండ్‌ చేస్తేనో ప్రేమించలేంగా!’’ అన్నాడు.

ఆ మాటల్లోని అహం బలమైన కెరటంలా తాకి సన్నగా వణికినట్లైంది. ఆమె మనసు.

‘‘పెళ్లైన తర్వాత కూడా ప్రేమించుకునే వాళ్లున్నారు.  నన్ను పెళ్లి చేసుకోటానికి మీకేమైనా అభ్యంతరం వుందా?’’ అని అడిగింది. అలా అడగటానికి వ్యక్తిత్వం అడ్డొచ్చినా మనసు అభిరాంనే కోరుకుంటుంటే అడగలేక అడిగింది.

‘‘మా పెద్దవాళ్లు ఒప్పుకోరు.  ముఖ్యంగా  మా అమ్మ, మా మామ్మ  మొదటి నుండి నాకేది కావాలో ఏది వద్దో వాళ్లే చూసుకుంటారు.  నా పెళ్లి విషయం కూడా వాళ్లకే వదిలేశాను. వాళ్లు ఏ అమ్మాయికి తాళికట్టమంటే ఆ అమ్మాయికి కడతాను. అంతేకాని ఈ ప్రేమ వివాహాలనేవి` మాలో ఏడు తరాల నుండి వెతికి చూసినా లేవు.’’ అన్నాడు.

‘‘కానీ నా మనసులో మీరున్నారు.  అర్థం చేసుకొని యింకోసారి ఆలోచించండి అభిరాం!’’ అంది అర్థింపుగా.

‘‘నీ మనసులో నేనుండొచ్చు కానీ… నా మనసులో నువ్వుండాలిగా’’.  అన్నాడు ఏ మాత్రం తడబాటు లేకుండా స్థిరంగా…

మన మనసులో వున్న వాళ్ల మనసుల్లో మనం తప్పకుండా వుంటామని వూహించుకోవటం తప్పు అని తెలియని దేదీప్య అతని మాటల్ని జీర్ణించుకోలేకపోతోంది.

‘‘నిజం చెప్పండి! నా పట్ల ఎలాంటి ఫీలింగ్‌ లేదా?’’ అంది అతని మిాద ఆశ చావట్లేదు ఆమెకి.

‘‘ఫీలింగ్స్‌దేముంది పుడుతుంటాయి. పోతుంటాయి. ఫర్‌ ఎగ్జాంపుల్‌. ఇంతకముందే నేనో అమ్మాయిని చూశాను. ఇంకాస్త ముందుకి రాగానే ఆహ్లాదంగా అన్పించే పూల బొకేలను చూశాను. ఒకేలా ఫీలయ్యాను.  ఫీలయ్యాను కదాని దేన్నీ నా సొంతం  చేసుకోలేను. ఇప్పుడు చెప్పు. ఫీలింగ్స్‌కి వ్యాల్యు లేదు కదా?’’ అన్నాడు అభిరాం.

ఆలోచనగా ఆమె భృకుటి ముడిపడిరది.

ఇంతకాలం తను చదివిన నవలల్లో హీరోలకి వుండే అతి ముఖ్యమైన వ్యక్తిత్వం అభిరాంలో కన్పించకపోవటంతో అప్రయత్నంగానే జీరో స్థాయికి దిగిపోయాడు.

ఇతన్నేనా తనింత కాలం ప్రేమించింది? జీవితంలో తను చేసిన మొట్టమొదటి పొరపాటు ఇదేనేమో! ప్రశ్చాత్తాపంతో క్రుంగిపోతూ ఆలోచిస్తోంది.

‘‘పిచ్చి, పిచ్చి ఆలోచనలు  పెట్టుకోకుండా మీ అన్నయ్య కుదిర్చిన సంబంధం చేసుకో.’’ అన్నాడు అభిరాం. దేదీప్య అర్జునుడిలా అన్పించి తను కృష్ణుడిలా ఫీలయ్యి

‘‘నా మనసులో వున్నది చెప్పాను. నా మనసు ` నా ఇష్టం వేరే వాళ్లను చేసుకోమని చెప్పటానికి మీరెవరు?’’ అంది సూటిగా.

‘‘ఓ.కె. కానీ నువ్వు నన్ను మనసులో పెట్టుకొని భవిష్యత్తుని పాడు చేసుకుంటావేమోనని…. ఐమీన్‌ మీ ఆయన్ని పురుగును చూసినట్లు చూస్తావేమోనని’’ అన్నాడు.

ఆ మాటలకి అతనిమీదున్న ప్రేమతో పాటు ఆమెలో వున్న అహం కూడా దెబ్బతిన్నది.

‘‘మనసులో వుంచుకొని జీవితాంతం ఆరాధించేంత యోగ్యత మీలో వుందో లేదో ముందు  మీలోకి మీరు వెళ్లి, ఒకసారి పరిశీలించుకోండి. సమాధానం మీకే దొరుకుతుంది.’’ అని దేదీప్య అక్కడ నుండి వెళ్లిపోయింది.

సుడిగాలికి కదలిన ఎండుటాకులా అయ్యాడు అభిరాం.

అభిరాం కాదన్నంత మాత్రాన తనకి జీవితమే లేదనుకోవడం సిల్లీ థింక్‌. అభిరాంని అప్పటికప్పుడే బయటకినెట్టి దీపక్‌ని మనసులోకి ఆహ్వానించటానికి సంసిద్దమై, మనసు దృఢం చేసుకొంది. వీలు కాదని మొరాయిస్తున్న మనసుని ఒక్క విధిలింపు విదిలించి, ప్రేమంటే రంపపు కోత కాదని తన మనసుకి నచ్చ చెప్పుకొంది.  అభిరాం తలపుల వర్షం ఎంత కురిసినా తన దోసిలిలో చోటు లేనంతగా దీపక్‌ని నింపుకోవాలనుకొంది. అభిరాం అనే వ్యక్తికి యిన్ని రోజులు తన మనసులో స్థానాన్ని యిచ్చినందుకు ప్రశ్చాత్తాప పడిరది.

 

* * * * *

 

 

దేదీప్య, దీపక్‌ల పెళ్లి జరిగింది.

ఎక్కడో ఎందుకు దేదీప్య గదిలోనే శోభనం ఏర్పాటు చేస్తే బావుంటుందని ఇందుమతి, అపురూపలు నిర్ణయించుకున్నారు.

నలుగుపిండితో మర్ధన చేసి, గులాబి పువ్వుల రేకులను కొద్దిగా నీళ్లలో కలిపి దేదీప్యకి స్నానం చేయించి, సింపుల్‌గా అలంకరించి ఆచారం తప్పకుండా పాలగ్లాసు చేతికిచ్చి దీపక్‌ వున్న గదిలోకి పంపారు.

మల్లెమొగ్గలా మౌనంగా నిలబడివున్న దేదీప్య మెత్తని ఒంటి సొగసులోంచి కమ్మటి వాసన తరలి వచ్చి దీపక్‌ ముక్కపుటాలను సోకి అద్భుతంగా అన్పిస్తుంటే ఎలాంటి మాటామంతీ లేకుండా పాలగ్లాసు పక్కన పెట్టి, ఆమె చేయి పట్టుకొని, శోభనం అయిపోయిందనిపించాడు.

దేదీప్య పడుకొంది. అతనికి నిద్ర రావటం లేదు.

ఏదైనా వారపత్రిక దొరికితే, చదువుకుంటూ కూర్చుందామని దేదీప్య బుక్స్‌ వుండే సెల్ప్‌ దగ్గరకి వెళ్లాడు.

అక్కడ వారపత్రిక లేమీ లేకపోయినా బుక్సన్నీ తిరగేశాడు.  తిరగేసే కొద్ది ఆసక్తి, పెరిగి, దేన్నో వెతుకుతున్నట్లు బుక్స్‌న్నీ తిప్పాడు. అతనికేం దొరకలేదు.

తన పెళ్లి చూపుల్లో పరిచయం అయిన ఒక అమ్మాయి ‘ఆడపిల్ల మనసు ఒక్కోసారి తను చదివే పుస్తకాల్లో దొరికిపోతుంది.’ అనటం గుర్తొచ్చి మళ్లీ ఆ బుక్స్‌న్నీ శోధించాడు. ఆ అమ్మాయికే కాకుండా తన పెళ్లిచూపుల్లో తనకి నచ్చిన యింకా కొంతమంది అమ్మాయిలకి కాల్స్‌ చేసి, మెసేజ్‌లు పంపి ‘ఐలవ్‌యు’  అని కూడా చెప్పాడు.  అతను చెబితే ఏం కాదులే కాని తన భార్య ఎవరికీ చెప్పకూడదన్నదే అతని ఉద్దేశ్యం.

‘ఐ లవ్‌ యు’ చెప్పే స్థాయికి వచ్చారూ అంటే ఆ మనిషిలో భావుకత మొత్తం ఖాళీ అయినట్లే లెక్క. ఇంకేం మిగులుతుంది  మనసులేని ఒట్టి మనిషి తప్ప అని అతని బాధ.

దేదీప్య రోజూ రాసుకునే డైరీ అతని చేతికి తగిలి క్రింద పడిరది. పాతపేపర్ల కట్ట చాటుకి పడడంతో అతని చూపులకు ఆ డైరీ అందలేదు అర్జంటనిపించి బాత్‌రూంకి వెళ్లాడు.

చప్పుడికి కళ్లు తెరిచిన దేదీప్యకి అక్కడ తన డైరీ కన్పించకపోవటంతో వెంటనే లేచి వెళ్లి అక్కడ చూసింది. పేపర్ల చాటున కన్పించిన డైరీని తెచ్చుకొని తన బెడ్‌ క్రింద తన పడుకున్న సైడ్‌కి పెట్టుకొంది.  ఆ కొద్దిసేపు ఆమె గుండె దడదడ కొట్టుకొంది.

బాత్‌రూంలోంచి బయటకొచ్చిన దీపక్‌ నేరుగా పుస్తకాల ర్యాక్‌ దగ్గరికి వెళ్లకుండా కుర్చీలో కూర్చున్నాడు.

అది శోభనం కావటం వల్ల కిటికీలన్నీ మూసివుండడంతో గాలి బయటకెళ్లే అవకాశం లేక పొగంతా అక్కడే ఆ గదిలోనే సుడులు తిరుగుతూ ఆగిపోయింది.

అందమైన దేదీప్యను దీపక్‌ కన్నా ఆ సిగరెట్‌ పొగే సుడిగాలిలా అల్లుకొని, ఊపిరాడకుండా చేస్తోంది.

మెల్లగా లేచి ఆ వాసన బయట కెళ్లేందుకు వీలుగా కిటికీ తెరచి, మళ్లీ పడుకొంది  దేదీప్య.  అలవాటు లేని ఆ ఘాటు వాసనకి ముక్కు నొప్పిగా అన్పిస్తూ, కడుపులో తిప్పినట్లై తలదిమ్ముగా వుంది.

ఈ స్థితిలో తల్లివుంటే పరిగెత్తుకుంటూవెళ్లి, తల్లి ఒడిలో తలదాచుకోవాలనిపించింది. అయినా సిగరెట్లు తాగే భర్తలున్న ఆడవాళ్లకి తల్లులు లేకనే భర్తల దగ్గర పడుకుంటున్నారా? తల్లులు లేకనే వాళ్లతో కాపురాలు చేస్తున్నారా? కాదు కదా అని సర్ధిచెప్పుకొంది.

తనేదో నవలలో చదివినట్టు… అమ్మాయిలు ఏదైనా చెయ్యగలరు కాని సిగరెట్‌ తాగే భర్తను ముద్దుపెట్టుకోలేరట.  ఇప్పుడు తనకి ముద్దెందుకు గుర్తొచ్చింది?  తనకి ఇప్పుడు ముద్దు అంత అవసరమా? ఒకవేళ పెట్టుకోవాలనిపిస్తే తన పరిస్థితి ఏమిటి?

శోభనం అంటే ఇలాగే వుంటుందని తనకి ఎవరూ చెప్పలేదు కాని, మూగ సినిమాలాగే వుంది. మౌనపోరాటంలాగే అన్పించింది. ఇప్పటివరకు తనకి అర్థమైంది ఏమిటంటే ఒంటరిగా పోరాడితే  ఒంటరి పోరాటం, అర్థం చేసుకొని ఇద్దరు కలసి పోరాడితే అర్థవంతమైన ముష్టి యుద్దం.

ఇది కావ్యకి చెప్పాలి.  తెలుసుకుంటుంది.

లేకుంటే గట్టిగా కుట్టేసినా దాని నోరు ఆగదు. ఎందుకయినా మంచిది ముందుగా తెలిస్తే కాస్త ప్రిపేరయి వుంటుంది.

తనకి పెళ్లి చూపులు జరిగినప్పటి నుండి కావ్య ఊరిలో లేదు.  నల్గొండ వెళ్లానని ఒకసారి వదిన సెల్‌కి కాల్‌ చేసి చెప్పింది. మళ్లీ కాల్‌ చెయ్యలేదు.  ఎందుకో? ఎప్పుడొస్తుందో ఏమో?

ఎంతకీ నిద్రరాకపోవడంతో లేచి కూర్చుంది దేదీప్య.

‘‘మీకు సిగరెట్‌ తాగే అలవాటు వుందని నాతో ఎప్పుడూ చెప్పలేదు.’’ అంది దీపక్‌ని ఉద్దేశించి.

‘‘చెప్పివుంటే పెళ్లి చేసుకునేదానివి కాదా?’’ అన్నాడు దీపక్‌.

‘‘అలా అని కాదు. నాకెందుకో ఈ వాసన పడదండి!’’ అంది దేదీప్య ముఖం ఏదోగా పెట్టి.

‘‘సరే! నీ కోసం పడేస్తానులే.’’ అంటూ చేతిలో పూర్తిగా కాలిపోయి మిగిలిన సిగరెట్‌ ముక్కని కిటికీలోంచి బయటపడేశాడు.

‘‘సిగరెట్‌కే యిలా అంటున్నావ్‌! ఒకవేళ నేను మందు తాగి ఇంటికొస్తే?’’  చాలా కూల్‌ గా ప్రశ్నించాడు.

‘‘మీకు మందు అలవాటు కూడా వుందా?’’ అంటూ ఆశ్చర్యంతో ఆవులించింది.  ఆమె ముఖంలో ఆ ఫీలింగ్‌ ఎంత అందంగా వుందో.

‘‘ఓ……నాకు చిన్నప్పటి నుండి ఆ అలవాటు వుంది.’’ ఆమెనే చూస్తు ఉడికించాడు.

‘‘చిన్నప్పటి నుండి అంటే! ఎప్పటి నుండి?’’ అంటూ క్యూరియాసిటిగా అడిగింది.

‘‘క్యాలిక్యులేషన్‌ చేసి చెప్పమంటావా?’’ అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు.

‘‘మీకు జోక్‌గా అన్పిస్తుందేమో! నేనైతే సీరియస్‌గానే  తీసుకుంటాను. ఎప్పుడు తాగివస్తే అప్పుడు ఓ  ‘పిల్లో’ మీ చేతికి యిచ్చి ‘కేరాఫ్‌ బాల్కనీ’ అని చెబుతాను’’ అంది.

‘‘అంతలోనే నా అడ్రస్‌ బాల్కనీలోకి మార్చేశావా?’’ అంటూ ఆమె భుజం మీద తలవుంచాడు.

‘‘నిజంగానే తాగుతారా? నిజం చెప్పండి?’’ అంటూ భయంతో కూడిన లాలనతో అడిగింది.

‘‘నువ్వు మరీ అంత దిగాలు పడకు పార్టీలప్పుడు ఏదో అప్పుడప్పుడు తప్ప ఎప్పుడూ తాగను. కానీ…. అప్పుడు మాత్రం నన్ను భరించాలి.’’ అన్నాడు.

భరించటం కాదిక్కడ కావలసింది.  తన భర్త చేత ఎలాగైనా తాగుడు మాన్పించాలి. మాన్పించకపోతే అతని ఆరోగ్యం దెబ్బతింటుంది. బాధ్యతల్ని విస్మరిస్తాడు. అతని మీద ఆధారపడివున్న తన జీవితం పిచ్చివాడి చేతిలో రాయిలా మారుతుంది. ఇంత అనర్థంతో కూడిన ఆ తాగుడు అంత అవసరమా? అని మనసులో అనుకుంది.

‘‘ఏదో అప్పుడప్పుడు అంటున్నారు. అసలెందుకు తాగాలండీ? తాగితే ఏమొస్తుంది?’’ అంది దేదీప్య.

‘‘తాగితే ఏమొస్తుంది అంటే ఏం చెప్పను చెప్పు? ఆఫీసులో ఒక్కోసారి మేము ఏమైపోతున్నామో   మాకే తెలియనంత వర్క్‌ వుంటుంది. ఆ స్ట్రెస్‌ తగ్గించుకోవడం కోసమే త్రాగుతుంటాము.’’.  అంటూ దేదీప్య డౌట్‌ క్లియర్‌ చేశాననుకున్నాడు.  పైగా ఈ మాటలతో తనెంత తెలివిగలవాడినో ఆమెకు అర్థమవుతుందనుకున్నాడు.

‘‘స్ట్రెస్‌ తగ్గాలంటే ఉదయాన్నే ఒక గంట మీకు ఇష్టమైన వ్యాయామం, ధ్యానం, ప్రాణాయామం చేయండి. సరిపోతుంది. త్రాగకండి’’.  అంది నారాయణరావు నోటి వెంట రోజు యిలాంటి మాటల్నే వింటుంది దేదీప్య.

వ్యాయామం, ధ్యానం, మార్నింగ్‌ వాక్‌ అంటే దీపక్‌కి నచ్చదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు హాయిగా, మత్తుగా నిద్రపోవటమే అతనికి ఇష్టం. అతని బాల్యమంతా వైజాగ్‌ పక్కనున్న చిన్న పల్లెటూరిలో గడచిపోయింది. అప్పుడు కూడా అతను తన స్నేహితులు కొందరు గోదావరిలో ఈదుతుంటే అతను ఇంకొందరితో కలసి కార్డ్స్‌ ఆడుతూ కూర్చునేవాడు.  అతనెప్పుడైనా అతనికి నచ్చిందే చేస్తాడు.

‘‘చూడు దేదీప్యా! మనిషి ఏదీ చేసినా తనకోసమే చేస్తాడు. తగిన విశ్రాంతి కావాలనుకున్నప్పుడు ఇలాంటివి తప్పకుండా సేవించాల్సిందే లైట్‌ తీసుకో.’’ అన్నాడు.

‘‘దేవుడు రాత్రుల్ని సృష్టించింది మనల్ని విశ్రాంతి తీసుకోమనే కదండీ! రెస్ట్‌ కోసమని, స్ట్రెస్‌ కోసమని మిమ్మల్ని మిారు మభ్యపెట్టుకుంటూ ఆ మత్తు పానియాలను సేవించటమెందుకు చెప్పండి? రాత్రి టైంలో హాయిగా నిద్రపోతే పగలంతా మీరు పడిన స్ట్రెస్‌ అంతాపోయి విశ్రాంతి దొరుకుతుంది. పైగా మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మన కుటుంబం హాయిగా ఉండేది’’ అంది దేదీప్య.

‘‘అబ్బో….. నీ దగ్గర చాలావుంది. రేపు వింటాను. పడుకో.’’ అంటూ చిన్నపిల్లాడిలా ఆమె ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు దీపక్‌.

ఆలోచనగా అతన్నే చూస్తూ కూర్చుంది.

ప్రపంచంలో ఎంతమంది భర్తలు తాగటం లేదు. ఎంతమంది భార్యలు భరించటం లేదు.  కానీ తన భర్త మాత్రం డ్రింక్‌ చెయ్యకుండా, స్మోకింగ్‌ చెయ్యకుండా వుండాలని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది. అదీకాక పెళ్లికి ముందు అమ్మాయిల కలల్లోకి త్రాగి తూలె భర్త, ముసలి అత్త, జబ్బు చేసిన మామగారు, ఉద్యోగం లేని మరిది, పెళ్లికాని ఆడపడుచులు రారు. అలా రావటం వాళ్ల కలల ప్రపంచానికే నిషిద్దం.

అందులో దేదీప్య కలల చిత్రం మాత్రం ఇంకా విచిత్రం.

ఆ చిత్రం ఏమిటంటే…..

పౌర్ణమి రోజుల్లో కాలువగట్టు ` వేపచెట్టు `కొమ్మ సందుల్లోంచి పడే తెల్లని వెన్నెల, అక్కడనుండి విన్పించే వేణుగానం, ఆ వేణుగానానికి ప్రవహించే కాలువతో పాటు ముగ్దురాలై పోవటం… ఆ అనుభూతిని త్రాగుతూ అరమోడ్పులైన కళ్లతో మైమరచిపోవటం, ఎప్పుడు చూసినా ఇదేకల.

ఆలోచిస్తూ కూర్చున్న దేదీప్య ఏదో కల గంటున్నట్లు అన్పించింది దీపక్‌కి.

‘‘కలలు బాగున్నాయని వెనకటికి ఎవరో కళ్లు మూసుకొని కూర్చున్నారట. నువ్వు కూడా అదేపనిలో వున్నావా?’’ అంటూ ఆమె బుగ్గ మీద సున్నితంగా వేలితో పొడిచాడు.

ఆలోచనలోంచి తేరుకుంటూ…..

‘‘ఇంకా నయం ముక్కు మూసుకుని కూర్చున్నాననలేదు.’’ అంది నవ్వుతూ.

ఆమె నవ్వుతో పాటు అతని నవ్వు కూడా ఆ గది నిండింది.

 

* * * *

 

 

సూర్యోదయం అయింది.

అపురూప చెప్పటంతో తలస్నానం చేసి, తులసిపూజ చేసింది దేదీప్య.  డైనింగ్‌ టెబుల్‌ దగ్గర కూర్చునివున్న దీపక్‌, బలరామయ్య, భ్రమరాంబికలకు అపురూప టిఫిన్‌ పెడ్తుంటే తింటున్నారు. వదినకు హెల్ప్‌ చేద్దామని అప్పుడే అక్కడికి వచ్చింది దేదీప్య.

‘‘నువ్యూ కూర్చో దేదీప్యా! ’’ అంటూ దేదీప్యకి కూడా టిఫిన్‌ పెట్టింది అపురూప.

తింటూ కూర్చున్న దేదీప్యకి రాత్రి తిన్నది జీర్ణం కాక కడుపులో తిప్పినట్లై వాష్‌ బేసిన్‌ దగ్గరకెళ్లి భళ్లున వాంతి చేసుకొంది.

దేదీప్యనే గుచ్చి, గుచ్చి చూసింది భ్రమరాంబిక.

ఆ తర్వాత అపురూపవైపు చూసింది.  ‘‘పెంపకం నీదేకదూ?’’ అన్నట్లు అపురూపను కూడా గుచ్చుకున్నాయి ఆ చూపులు.

కొత్తపెళ్లి కూతురికి మొదటి రాత్రి జరగగానే ప్రకృతికి విరుద్దంగా వాంతులు కావు కదా! వెంటనే అప్రసన్నంగా మారింది భ్రమరాంబిక.

‘‘ఏంటో  ఈ కాలం పిల్లలు……’’ అంటూ భ్రమరాంబిక తన వింత దోరణితో ఏదో అనబోతుంటే…. ఆ ఫీలింగ్స్‌ని గమనించిన అపురూప గుండెలు జారాయి.

‘‘పిన్నిగారు! మీరొకసారి యిలా వస్తారా?’’ అంది అపురూప ఆమెను అలా పక్కకు పిలిస్తే ఏమనుకుంటారో నన్న సంశయాన్ని పక్కకినెట్టి, సమయం సందర్భం దాటాక ఏం మాట్లాడినా అతికించి మాట్లాడినట్లవుతుందన్న ఉద్దేశ్యంతో..

అపురూపతో పక్కకి నడిచింది భ్రమరాంబిక.

‘‘దేదీప్యకి పిరియడ్స్‌ వచ్చేముందు ఇలాగే వాంటింగ్స్‌ అవుతుంటాయి. డాక్టర్‌ గారు కూడా ఇదేం జబ్బు కాదన్నారు. మీరేం కంగారుపడకండి పిన్నిగారు!’’ అంది.

అపురూప అలా అనగానే పర్వతమంత బరువేదో దిగినట్లు ప్రసన్నంగా మారింది భ్రమరాంబిక.

వదిన చెప్పిన అబద్దానికి అత్తగారి ముఖంలో కన్పించిన ప్రసన్నతకి లింకేంటో త్వరగా అర్థం కాక ఆ తర్వాత అర్థమై విభ్రాంతిగా చూసింది దేదీప్య.

వదిన సమయస్ఫూర్తికి లోలోన మెచ్చుకుంటూ, అత్తగారి కుసంస్కారానికి నొచ్చుకుంటూ తనగదిలోకి వెళ్లింది.

ఆలోచిస్తూ కూర్చుంది.

అభిరాం తనకి దక్కలేదని ‘ఎవడో ఒకడులే’ అని సరిపెట్టుకొని దీపక్‌ను చేసుకోలేదు. దీపక్‌లో కూడా హుందాతనం వుంది. చూడగానే ‘పర్వాలేదు’ అనిపించేలా వుంటాడు.  కానీ అత్తగారి మాట తీరు, చూపు దారుణంగా వుంది.  మనసు కెలికేలా వుంది.  దీన్ని బట్టి చూస్తుంటే ఈ పెళ్లి వల్ల జీవితంలో వెనుదిరిగి చూసుకుంటే తనకేం మిగలకుండా దు:ఖమే మిగులుతుందేమో నని బాధగా వుంది.  ఏ పని చేసినా ఆత్మ గౌరవంతో కూడిన సంతృప్తి కావాలి. అనుకునే తనకి భవిష్యత్‌ ఎలా వుంటుందోనని భయంగా వుంది.

పెళ్లిరోజు అత్తగారు, మామగారు, మరిది, బావగారు, తోడికోడలు, ఆడపడుచు తన చుట్టూచేరి తనని వాళ్ల వస్తువుగా భావించి, ఊపిరాడకుండా చేస్తుంటే ఆ బంధుబలాన్ని చూసి మురిసిపోయింది. వాళ్లకి కూడా తను ‘నేను మీ మనిషిని’ అన్న ఫీలింగ్‌ కలిగేలా ప్రవర్తించాలనుకొంది.

అలా ప్రవర్తిస్తూ, తన జీవితాన్ని ఆమోదయోగ్యంగా మార్చుకోవాలంటే ఇప్పుడు తనెంతో శక్తిని కూడ దీసుకోవాలి.  ధైర్యాన్ని దొరకబట్టుకొని మనసు దృఢం చేసుకోవాలి.  ముఖ్యంగా తనని తను మరచిపోయి కొత్త వ్యక్తిలా మారిపోవాలి.

‘‘ఏంటి దేదీప్యా! ఆలోచిస్తున్నావ్‌? వాంటింగ్‌ సెన్‌సేషన్‌ తగ్గిందా? ఆర్‌యు ఆల్‌రైట్‌?’’ అంటూ గదిలోకి వచ్చి ఆమెపక్కన కూర్చుని నుదుటి మీద చేయివేసి చూశాడు వేడిగా లేదు.

‘‘ నో ప్రాబ్లమ్‌!’’ అని తనలో తను అనుకుంటూ దేదీప్య నుండి ఎలాంటి జవాబు ఆశించకుండా…. రిలాక్స్‌గా అక్కడే పడుకున్నాడు దీపక్‌.

కానీ ఆమె ఆలోచన ఏంటో అతనికి అర్థం కాలేదు. అప్పుడప్పుడు ఇలా మూడీగా ఎందుకుంటుందో తెలియలేదు.

తెలియాల్సింది తెలియకపోతే అదో  పజిల్‌ లా వుంటుంది ఎవరికైనా.  నుదుటి మీద చేతులుంచుకొని తననే గమనిస్తున్న భర్తను పట్టించుకోకుండా వదినకు వంటలో సాయం చేద్దామని గదిలోంచి బయటకెళ్లింది. దేదీప్య. అతనలాగే పడుకున్నాడు.

 

 

* * * * *

 

 

దేదీప్యకు సారెపెట్టె అత్తవారింటికి పంపుతూ, క్రిందకి దిగి నారాయణరావు, ఇందుమతి ఆశీస్సుల కోసం ఆగారు.

ఆ దంపతులు నిండు మనసుతో దేదీప్యను దీవించి, గేటు వరకు సాగనంపారు.

దేదీప్య అత్తవారింటికి వెళ్తుంటే ఒక మంచి పాఠకురాలిని,  శ్రోతను కోల్పోతున్నానన్న బాధ నారాయణరావు ముఖంలో కన్పించింది. ఇందుమతి మాత్రం ఆడపిల్లకి పెళ్లి చేసి పంపటం పెద్ద పుణ్య కార్యంగా భావించి సంతోషించింది.

అపురూప, దేవేందర్‌ దేదీప్యను ట్రైనెక్కిస్తూ కళ్ల నీళ్లుపెట్టుకున్నారు.

దేదీప్య పరిస్థితి కూడా అలాగే వుంది.

ఒక్కక్షణం వాళ్లనలా చూడగానే ఏదో భరోసా ఇస్తున్న వాడిలా ఆమె భుజం చుట్టూ చేయివేసి  ఏడవకు అన్నట్లుగా ఆప్యాయంగా చూశాడు దీపక్‌.  దీపక్‌ని అలా చూస్తుంటే దేవేందర్‌కి, అపురూపకి ధైర్యం వచ్చింది.

అపురూపకి తన కొలీగ్‌ కన్పించటంతో మాట్లాడుతూ పక్కకెళ్లింది.దేవేందర్‌ కూడా  ఫ్రెండెవరో కన్పిస్తే మాట్లాడుతూ నిలబడ్డాడు.

ట్రైనింకా కదలలేదు.

వేరే ట్రైన్‌లోంచి దిగిన అన్వేష్‌ వాళ్ల తాతయ్యను మెల్లగా నడిపించుకెళ్లి అక్కడే వున్న బెంచీపై కూర్చోబెట్టి ఆయన పక్కన కూర్చున్నాడు.

‘అన్వేష్‌! మీ డాడీ పంపిన కారింకా రాలేదా?’’ అన్నాడు పర్వతరావు.  ఆయనకి ఒంట్లో బావుండక అసహనంగా వున్నాడు.

‘‘ఒక్క నిమిషం తాతయ్యా! డాడీయే వస్తున్నారట. కాల్‌ చేశారు.’’ అంటూ ఎదురుగా ఆగివున్న ట్రైన్‌లో కిటికీ పక్కన కూర్చునివున్న దేదీప్యను చూశాడు. ఆశ్చర్యపోతూ వెంటనే ట్రైన్‌ దగ్గరికి వెళ్లి ‘దేదీప్యా!’ అన్నాడు అన్వేష్‌.

పక్కన తాతయ్య వున్నాడని కాని, అక్కడ అందరు తననే చూస్తున్నారన్న సంకోచం కాని లేకుండా,  దేదీప్యను చూసి యుగాలైనట్లు పిలుస్తుంటే, అప్పుడే పైనున్న బ్యాగులోంచి ఏదో తీసుకోవాలని లేచి నిలబడిన దేదీప్య అన్వేష్‌ని చూడలేదు.

కదులుతున్న ట్రైన్‌ శబ్దంలో అన్వేష్‌ పిలుపు కలసిపోయినా అతను పిలిచింది దేదీప్య అని దీపక్‌ విన్నాడు.

విన్నవెంటనే నివ్వెరపోయాడు.

అతనెవరు? ఎవరైవుంటాడు? దేదీప్యకి ఫ్రెండా? బంధువా? లేక ఏదో సమ్‌ ఫీలింగ్‌ వున్న వ్యక్తా? దేదీప్య అతన్ని చూసివుంటే కరక్ట్‌గా అంచనా వేయగలిగే వాడే కాని ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. దేదీప్య అతన్ని ప్రేమించటమో! అతను దేదీప్యను ప్రేమించటమో జరగలేదు కదా! ఏది ఏమైనా ఇప్పుడే దేదీప్యను అడగాలి. అతనెవరో తెలుసుకోవాలి. అనుకుంటూ ఆమెపక్కన కూర్చున్నాడు.

ఆమెతో  మాట్లాడటానికి ప్రయత్నించి, రెస్పాన్స్‌ లేకపోవటంతో నిరాశగా ఫీలయ్యాడు దీపక్‌.

కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్న దేదీప్యకి వేగంగా దాటిపోతున్న అడవులు,  ఊర్లు కన్పిస్తూ అన్నయ్యకి తనకి దూరం పెరిగిపోతున్నట్లు అన్పించి దిగులుగా కూర్చుంది.

ఆమెనలా చూస్తుంటే ` నిశ్శబ్దంగా వున్న ఆమె మనసు కుటీరంలో ఒంటరిగా కూర్చుని  తలుపులు మూసేసుకున్న  దానిలా అన్పిస్తోంది. అంత మౌనగంభీరంగా  వున్న ఆమెను పలకరించలేక కట్టుకున్న భార్య పక్కనే పరాయివ్యక్తిలా కూర్చున్న అనుభూతికి లోనయ్యాడు.

చెమట పట్టకపోయినా, జేబులోంచి కర్ఛీఫ్‌ బయటకి తీసి ముఖం, మెడ తుడుచుకొని మళ్లీ కర్చీఫ్‌ వైపు చూసుకుంటూ.

‘‘ఇదేం మౌనంరా బాబూ! కదిలించినా కదిలేలా లేదు. యిలా మౌనంలో మునిగిపోతే …. ఈ మనిషితో ఎలా బ్రతకాలి?’’ అని మససులో అనుకుంటూ దేదీప్య పక్క నుంచి లేచి బాత్‌రూం వైపు నడిచాడు.

అక్కడో ప్రయాణీకుడు తోటి ప్రయాణీకులతో చక్కగా ఉపన్యాస దోరణిలో మాట్లాడుతున్నాడు. ఆసక్తిగా అన్పిస్తుంటే అక్కడ నిలబడ్డాడు దీపక్‌.

అతనెక్కువగా బార్యా, భర్తల రిలేషన్‌ గురించే కాకుండా మనుష్యుల స్వభావాల గురించి, జీవన విధానం గురించి మాట్లాడుతున్నాడు. అతను చెప్పేది ఎక్కడో విన్నట్టుగా, తెలిసినట్లుగా అన్పించినా అప్పుడే క్తొతగా వింటున్న ఫీలింగ్‌ కల్గుతోంది. వినగా, వినగా తమలోని భావాలను అతనితో చెప్పుకోవాలనిపిస్తుంది. అదే స్థితిలో వున్నాడు దీపక్‌.

పెళ్లయినప్పటి నుండి దేన్నో కోల్పోతున్నట్లు, దేదీప్య తనతో మనస్ఫూర్తిగా మాట్లాడనట్లు యింకా ఎన్నెన్నో సందేహాలతో సతమతమవుతున్న దీపక్‌ మెల్లగా వెళ్లి అతనికి ఎదురుగా కూర్చున్నాడు.

‘‘చూస్తుంటే ఎంప్లాయిలా వున్నావ్‌! ఇదేం ప్రశ్న? అని మీరు అనకపోతే నాకొకటి అడగాలని వుందండి!  నా భార్య ఎప్పుడో తప్ప నాతో ఎక్కువగా మాట్లాడదు. ఇది నాకు కష్టంగా వుంది.  ఏం చేయమంటారు?’’ అన్నాడు.  తన సమస్య అదే కాబట్టి  అదే చెప్పాడు.

దీపక్‌ వైపు పరిశీలనగా చూశాడు ఆ ప్రయాణీకుడు.

‘‘కొంతమంది ఎక్కువగా మాట్లాడరండి, వ్యర్థ సంబాషణ చెయ్యటం ఎందుకులే అనుకుంటారు. ఎదుటి వ్యక్తి  అర్థవంతంగా, జ్ఞానంగా మాట్లాడినప్పుడు మాత్రం వాళ్లు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు.’’ అన్నాడు.

అతని సమాధానం దీపక్‌కి తృప్తినివ్వలేదు.

‘‘పోనీ తను మాట్లాడకపోయినా నేను మట్లాడిందైనా వినాలిగా?’’. అన్నాడు.

‘‘వినటం అంటే! విషయం లేకుండా చెప్పే అడ్డమైన చెత్తంతా వినాలంటే  కొంతమంది వినరు. మనలోనే చాలా మందిని చూడండి తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా వినేవాళ్లున్నారు.  ఎక్కువగా  మాట్లాడుతూ తక్కువగా వినేవాళ్లున్నారు. ఇలాంటివి ప్రాబ్లమ్స్‌ అనుకోకూడదు.’’ అన్నాడు ప్రశాంతంగా ప్రయాణీకుడు.

‘‘కానీ వుండి, వుండి ఎందుకు మూడీగా మారుతుందో అర్థం కాకుండా వుందండి! ఆ నిశ్శబ్దాన్ని ఆ నిర్లిప్త్తతను తట్టుకోలేకపోతున్నాను.’’  అన్నాడు దీపక్‌.

ఆమె మౌనాన్ని మరోవిధంగా వూహించుకొని, మనశ్శాంతిని కోల్పోతున్న దీపక్‌ వైపు లోతుగా చూస్తూ  దీపక్‌కి కొత్తగా పెళ్లయినట్లు గ్రహించాడు ప్రయాణీకుడు.

‘‘మనిషన్నాక మౌనం వుంటుంది.  కోపం వుంటుంది. తట్టుకోవాలి. వెయిట్‌ చెయ్యాలి. ఎందుకంటే భార్యభర్తల రిలేషన్‌ ఒక్కరు మాత్రమే ఫిలప్‌ చేసే క్వొశ్చన్‌ పేపరు కాదు. చర్యకి ప్రతిచర్య వుంటూ రెండు ఆలోచనలు ఒకే ఆలోచనగా రూపుదిద్దుకోవాలంటే కాస్త టైం పడ్తుంది’’. అన్నాడు.

‘‘టైం ప్రాబ్లమ్‌ కాదు  సార్‌! నా భార్యలోనే ఏదో ప్రాబ్లమ్‌ వున్నట్లనిపిస్తోంది.  బహుశా తను కాలేజీలో ఎవరినైనా ప్రేమించి యిలా నిస్తేజంగా అప్పుడప్పుడు మారిపోతుందేమోనని పిస్తోంది.’’ అంటూ తన మనసులో వున్న అనుమానాన్ని రహస్యం చెబుతున్నట్లు చెప్పాడు దీపక్‌.

‘‘పెళ్లికి ముందు ఏం జరిగింది? ఎలా వున్నది అన్నది ముఖ్యం కాదు. ఇప్పుడెలా వున్నది అన్నదే ముఖ్యం.’’ అంటూ ఆణిముత్యాన్ని అందిస్తున్నట్లు మెల్లగా అన్నాడు.

‘‘ఇప్పుడు మూడీగా వుంది కదండీ!’’ అన్నాడు బాధగా దీపక్‌.

‘‘కొత్తగా పెళ్లైంది. మీ ఇద్దరు కలసి చెయ్యవలసిన ప్రయాణం చాలా వుంది. ప్రస్తుతం తన వాళ్లను వదిలి నీతో వస్తున్నప్పుడు ఆ అనుబంధం వెంటనే మరచిపోయి నువ్వే ప్రపంచం కావాలంటే కాస్త ఓపిక పట్టాలి.  అది నీ చేతుల్లోనే వుంది. నువ్వు కొంత టాలెంట్‌ని, ప్రేమని ఆమెకి రుచి చూపించాలి. అప్పుడే ఆమెను ఆ అనుబంధపు నీడలు వదలిపెడ్తాయి.’’ అన్నాడు చాలా సౌమ్యంగా.

‘‘ మరి అప్పుడైనా….పాలల్లో నీళ్లలా నాతో కలసి పోతుందంటారా?’’ అన్నాడు దీపక్‌.

‘‘ఈ మధ్యన ఆడవాళ్లలో వ్యక్తిత్వం బాగా డెవలప్‌ అవుతోంది. వాళ్ల గురించి వాళ్ల్ల్లు పూర్తిగా  తెలుసుకున్నాకే అడుగు వేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని వదులుకొని నీళ్లుగా మారి పాలల్లో కలవటానికి సిద్ధం కావాలి అంటే అది ఎదుటివ్యక్తి మహోన్నతుడై, మనసును దోచుకుంటేనే సాధ్యమవుతుంది.’’ అన్నాడు.

‘‘లేకుంటే సాధ్యం కాదా?’’ అన్నాడు దీపక్‌.

ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు కలవకపోతే ఆ కలవరం ఎంత గోప్యంగా వుంచుదామన్నా వుండదని దీపక్‌ ఆందోళన చూస్తుంటే అర్థమవుతుంది.

‘‘ప్రయత్నించి చూడు. నీ కోరిక తప్పకుండా తీరుతుంది.’’ అంటూ తను దిగవలసిన స్టేషన్‌ రాగానే దిగాడతను.

ఆ ప్రయాణికుడ్ని దింపేసి ట్రైన్‌ మళ్లీ వేగాన్ని అందుకొంది.

దేదీప్యకి ముందు సీట్లో కూర్చున్న ముగ్గురు స్టూడెంట్స్‌ ‘వ్యక్తిత్వవికాసం’ గురించి మాట్లాడుకుంటుంటే  దేదీప్య దృష్టి వాళ్ల మీద పడిరది.  వాళ్ల కాలేజికి ఒకరోజు యండమూరి వీరేంద్రనాథ్‌ వెళ్లి పర్సనాలిటి డెవలప్‌మెంట్‌ మీద ఒక క్లాసు తీసుకున్నాడట.  ఆయన మాటల ప్రభావం వల్ల అప్పటి నుండి ‘వ్యక్తిత్వ వికాసం’ మీద ఆయన రాసిన కొన్ని బుక్స్‌ని చదివారట.  అదే డిస్కర్‌షన్‌లో వున్నారు వాళ్లు.  ప్రస్తుతం ఒక బుక్‌ వుంటే దేదీప్య అడగ్గానే యిచ్చారు. దేదీప్య ఆ బుక్‌ చదువుతుండగా దీపక్‌ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అతన్ని చూడగానే పలకరింపుగా నవ్వి మళ్లీ బుక్‌ చదవటంలో లీనమైంది.

ఆమె నవ్వు అతనికి తృప్తి నివ్వలేదు. పెళ్లైనప్పటి నుండి ఆమె పక్కన వున్నా, లేనట్లుగా, ఏం తోచనట్లుగా అన్పిస్తోంది. భార్యంటే ఎప్పుడూ, భర్త ముఖంలోకి చూసుకుంటూ ఇతను నా భర్త  నా అదృష్టానికి ఎవరూ సరిరారు అన్నట్లుగా మురిసిపోవాలనుకుంటాడు. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా అన్పిస్తుంది దేదీప్య.

‘‘దేదీప్యా! ఆ బుక్‌లో ఏముంది? అంత దీక్షగా చదువుతున్నావ్‌? కళ్లు నొప్పులొస్తాయి. పక్కన పెట్టు.’’ అన్నాడు విసుగ్గా దీపక్‌.

‘‘ ఈ బుక్‌లో ఏముందో ఒక్కమాటలో చెప్పలేం కదండీ! తల్లి శరీరాన్ని పోషించి పెంచినట్లే యిలాంటి పుస్తకాలు హృదయాన్ని పోషించి పెంచుతాయి.’’ అంది మామూలుగా దేదీప్య.

‘‘హృదయాన్ని పోషించటం ఎవరిక్కావాలి?  మనల్ని పోషించుకునే సులభమైన మార్గం ఏదైనా వుంటే చూసుకోవాలి కాని. హృదయం ఎందుకు? దానితో పనేముంది? మాటా` మంతి లేకుండా ఎవరికీ కన్పించకుండా నోటితో మాత్రమే అందరు ఉచ్ఛరించే ఆ ‘హృదయం’ అనే పదం అంటేనే నాకు నచ్చదు. దాని గురించి కవులు ఎక్కువగా రాస్తుంటారు. సింబల్‌ వేసి చూపిస్తుంటారు.  అదేగా ‘హృదయం’ అంటే! దాని గురించి కూడా అంత సీరియస్‌గా చదవాలా?’’ అంటూ ఎత్తిపొడిచాడు.

‘‘ అది కాదండీ! హృదయం అంటే…. ’’ అంటూ ఆమె ఏదో చెప్పబోతుంటే.

‘‘వద్దులే…..’’ అన్నాడు. ఇక చాల్లే నువ్వేం చెప్పొద్దు. అన్నట్లుగా చేయి కూడా చూపాడు. ఆమెకు అంతటితో ఆపాలని లేదు.

‘‘చూడండి! పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ గురించి మనం చదువుతున్న కొద్ది బావిలో వూటలా వూరుతుందండి విజ్ఞానం’’ అంది.  స్వతహాగా బుక్స్‌ చదివే అలవాటు వున్న దేదీప్యకి బుక్స్‌ గురించి మాట్లాడడమంటే చాలా ఆసక్తి.  చదవటమే కాక అందులో భావాన్ని ఆస్వాదిస్తుంది.

దీపక్‌కి బుక్స్ అంటే పడదు. ఉద్యోగం వచ్చింది, కాబట్టి ఇక బుక్స్‌తో తనకి పని లేదు అనుకుంటాడు. న్యూస్‌ పేపర్‌ చదవాలన్నా ఎలర్జీగా ఫీలవుతాడు.  అదేమని అడిగితే ప్రపంచంలో జరిగేవి, జరిగినవి. తెలుసుకొని ‘నేనేం చేయాలి ఇప్పుడు?’ అంటాడు.  ఆ టైంలో హాయిగా నిద్రపోతే ఒంటికి మంచిది కదా అనుకుంటాడు.

‘‘ఇలాంటి పుస్తకాల్లో ఎంతో మంది రచయితలు తమ జీవితపు అనుభావాలను, విజ్ఞానాన్ని కలబోసి అవతల వాళ్లకు చెప్పటం కోసం అహోరాత్రులు శ్రమించిన తపన కన్పిస్తుంది. వీటిని చదివి మనల్ని మనం ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవచ్చు.  మన బలహీనతల్ని అధిగమించవచ్చు. మనలోని అంతర్గత శక్తుల్ని పటిష్టం చేసుకోవచ్చు.  మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు.’’ అంది దేదీప్య. తన మాటల్ని వింటున్నాడో లేదోనని భర్త వైపు చూసింది.

వెనక్కి ఆనుకొని కూర్చునివున్న దీపక్‌ ఎప్పుడో నిద్రపోయాడు.

దేదీప్య మనసు చివుక్కుమంది. ఇలాంటి మాటలకు అందరిలా దీపక్‌ ఎందుకు స్పందించడు? ఎదగాలని వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాలని అతనికి వుండదా? అతనితో కలసి తను చేస్తున్న ఈ సుదీర్ఘ ప్రయాణం ఎలా వుంటుందో!.

దీర్ఘంగా నిట్టూర్చింది దేదీప్య.

 

* * * * *

 

అన్వేష్‌ స్టేషన్‌ నుండి బయటకొచ్చి కార్లో కూర్చున్నాక కావ్యకి కాల్‌ చేశాడు.  పోయింది వెతికే వేదనలో వున్న అతని కాల్‌ని కావ్య లిఫ్ట్‌ చెయ్యలేదు.

ఇంటికెళ్లాక కావ్యకి మళ్లీ కాల్‌ చేశాడు.  అలాగే కట్‌ చేసింది ఆశ్చర్యపోయాడు.

ఈ మధ్యన ఎప్పుడు కాల్‌ చేసినా, కావ్య మాట్లాడుతుందే కాని ఎక్కువగా మాట్లాడటం లేదు. అది కూడా నల్గొండలో వున్నాననో, ఏడుస్తున్నానో అంటుంది. ఎందుకేడుస్తుందో చెప్పదు.

ఇప్పుడిలా ఎందుకు కాల్‌ కట్‌ చేస్తుందో, కావ్యకేమైందో అర్థం కాక వెంటనే తన కారు బయటకి తీసి కావ్య వుండే హాస్టల్‌ దగ్గరికి వెళ్లాడు.

కారణం చెప్పలేదు కాని, కావ్య హాస్టల్‌ వెకేట్‌ చేసినట్లు హాస్టల్‌ వార్డెన్‌ చెప్పింది. వెంటనే కావ్య గురించి తన ఫ్రెండ్స్‌ని అడిగాడు. కాలేజీకి కూడా రావటం లేదన్నారు.

ఒక్కక్షణం దిగ్భ్రాంతి చెంది. వెళ్ళి కార్లో కూర్చుని మళ్లీ కావ్యకి కాల్‌ చేశాడు. ఆమె కట్‌ చేసింది.

ఇక లాభం లేదనుకొని వేరే సెల్‌ నుండి కాల్‌ చేశాడు.

వెంటనే లిఫ్ట్‌ చేసింది కావ్య. అది అన్వేష్‌ కాల్‌ అనుకుంటే లిఫ్ట్‌ చేసేది కాదు. ఎందుకంటే అతనెప్పుడు చేసినా దేదీప్య గురించే మాట్లాడతాడని ఆమెకు తెలుసు.

‘‘హాలో…. చెప్పు అన్వేష్‌?’’ అంది కావ్య

‘‘ కావ్యా! ఇంతకముందు ట్రైన్‌లో కూర్చుని వెళ్తున్న దేదీప్యను చూశాను.                  ఎక్కడికెళ్తుందో కాని దేదీప్య వేషధారణలో గొప్ప మార్పు కన్పించింది. ఆ మార్పులో దేదీప్య ఎలా వుందంటే, పచ్చటి పసుపు కొమ్ములా, పొడిసోచ్చే ప్రొద్దులా, సంక్రాంతి ముగ్గులా, ముక్కెరలో మేలిముత్యంలా’’. అని అన్వేష్‌ అంటుంటే  ఒక్కక్షణం కావ్య నోట మాట ఆగిపోయింది.

మనసుతో చూడగలిగే మనిషి దగ్గరే స్త్రీ అందానికి గాని ఉనికికి గాని విలువ పెరుగుతుందని గ్రహించింది కావ్య.

‘‘ అన్వేష్‌! నువ్వు నీ మనసునిక  గట్టి చేసుకోవాలి.’’ అంది అన్వేష్‌ మనసు తెలిసిన కావ్య అంతకన్నా  ఏం మాట్లాడాలో తెలియక.

‘‘అంటే?’’ అన్నాడు అన్వేష్‌.

‘‘దేదీప్య కి పెళ్లయింది అన్వేష్‌!’’ అంది

‘‘ఆ…. ’’ అంటూ అతని స్వరం వణికింది. ఆకాశం వణికినట్ల్లు, భూమి కదిలినట్లు….. ఆ తర్వాత అవాక్కయి సెల్‌ పట్టుకొని అలాగే వుండిపోయాడు.

‘‘మాట్లాడు అన్వేష్‌! ’’ అంది అతనేంటో పూర్తిగా తెలిసిన కావ్య ఆత్రంగా, భయంగా…

అప్పటికే కాల్‌ కట్‌ అయింది.

ఈ చేదు నిజాన్ని అన్వేష్‌ తట్టుకోడని ముందుగా అన్పించే కావ్య చెప్పదలచుకోలేదు. కానీ ఎప్పటికైనా తెలియాల్సిన నిజమే కదా! ఇందులో తను దాచాల్సిందేముంది! అనుకుంటూనే చెప్పేసింది. ఇప్పుడు అన్వేష్‌ ఎంత బాధపడ్తున్నాడోనని మనసువుండబట్టలేక మళ్లీ కాల్‌ చేసింది.

సెల్‌రింగ్‌ విన్పిస్తున్నా అతను ఈ లోకంలో లేడు.

లాంగ్‌రింగ్‌ పోయి కట్‌ అయింది.

కావ్య మరింత భయబ్రాంతురాలై వెంటనే రీడయల్‌ చేసింది. అప్పటికే అతన్ని ఆవరించిన నిస్సత్తువను జయించి మాట్లాడాలని లేకపోయినా కాల్‌ లిఫ్ట్‌ చేశాడు.

‘‘చెప్పు కావ్యా?’’ అన్నాడు ఆ గొంతు ఎక్కడో దూరం నుండి విన్పించినట్లు అన్పించింది. ఒక్కసారిగా ఆ గొంతు విన్న కావ్యని గుండెనెవరో నలిపినట్లైయింది.

‘‘దేదీప్య పెళ్లి గురించి నీతో చెప్పాలని నా సెల్‌ లో బ్యాలెన్స్‌ లేకపోయినా బయటకొచ్చి చాలాసార్లు ట్రై చేశాను. కానీ నీ సెల్‌ ఎప్పుడు ‘అన్‌ అవేలబుల్‌’ లేకపోతే ‘స్విచ్‌ ఆఫ్‌’ అని వచ్చేది.  అదీ కాక మా ఇంట్లో పరిస్థితి బాగోలేక సరైన టైంకు నీకు ఇన్‌ఫర్‌మేషన్‌ ఇవ్వలేకపోయాను.’’ అంది కావ్య.

‘‘కాగజ్‌నగర్‌లో తాతయ్య వాళ్ల పేపర్‌ మిల్లు గొడవలు లేకపోయివుంటే ఆ టైంకు నేను వూరు వెళ్లేవాడిని కాను.’’ అన్నాడు.

‘‘ అయినా… వెళ్లకుంటే మాత్రం ఏం చేసే వాడివి?’’ అంది.

‘‘పెళ్లి జరక్కుండా చేసేవాడిని.’’ అన్నాడు.

‘‘అంటే ! పెళ్లి చెడగొట్టే వాడివా?’’ అంది.

‘‘చెడగొట్టటమెలా అవుతుంది కావ్యా! నేను దేదీప్యను ప్రేమిస్తున్నాను కాబట్టి పెళ్లి చేసుకునేవాడిని.’’ అన్నాడు.

‘‘ దానికి పెళ్లి నీతో అయినా ఒకటే ఆ దీపక్‌తో అయినా ఒకటే’’ అంది.

‘‘ ఒకటెలా అవుతుంది. నేను దేదీప్య ను ప్రేమించినవాడ్ని. ఆమెకు నా దగ్గర దొరికినంత సుఖం, సంతోషం అతని దగ్గర దొరుకుతుందా? నేను చూసుకున్నంత ఇంట్రెస్టుగా, జాగ్రత్తగా అతను చూసుకుంటాడా?’’ అన్నాడు

‘‘ఇంకా ఎక్కువగా చూసుకుంటాడు. ప్రేమించే క్వాలిటీ నీ ఒక్కడిలోనే వుందనుకుంటున్నావా?’’ అంది కావ్య. అతను తనని ఇష్టపడటం లేదన్న కోపం ఈ విధంగా తీర్చుకొంది.

తట్టుకోలేకపోయాడు అన్వేష్‌.

‘‘దేదీప్యను నేను తప్ప ఎవరూ ప్రేమించకూడదు. ప్రేమించినా వాళ్ల ప్రేమ నా అంత ఎక్కువ మోతాదులో వుండదు.’’

‘‘ప్రేమకు కూడా పర్సంటేజ్‌ వుంటుందా?’’ ఆశ్చర్యపోతూ అంది.

‘‘ ఎందుకుండదు కావ్యా! నిన్నెవరైనా ప్రేమించారా? పోనీ నువ్వెవరినైనా  ప్రేమించావా?’’ అన్నాడు.

ఇదే మంచి అవకాశం తను అతన్ని ప్రేమించిన విషయం మెల్లగా చెప్పేస్తే! బావుండదమో! ఈ మొహమాటమే కొన్నిసార్లు మనిషికీ, మనిషికీ మధ్య అగాధాలను సృష్టిస్తుంది.

‘‘నన్నెవరు ప్రేమించలేదు. నేను ప్రేమించాలనుకున్నవాళ్లు నన్ను పట్టించుకోవటం లేదు.’’ అంది బాధగా.

‘‘చూశావా! నువ్వు ప్రేమించటం గొప్పకాదు.  నిన్ను ప్రేమించటం గొప్ప. ప్రేమ అనేది మనం కావాలనుకుంటే దొరికేది కాదు. వద్దనుకుంటే పోయేది కాదు. అది హృదయసాగరంలో పొంగి ప్రవహించే అనంత ప్రవాహం.’’ అన్నాడు.

‘‘ఏం ప్రవాహమో అన్వేష్‌! నువ్వు చెప్పే ఈ హృదయ ప్రవాహాలు మనుష్యుల్ని సంతోషంలో ముంచినంత సేపు ముంచి తర్వాత మునిగిపోయేలా చేస్తాయి.  ఈదేవాళ్లు ఈదుతున్నారు.  మునిగేవాళ్లు మునుగుతున్నారు. నాకైతే ఈ బాధలేం లేవు దేవుడా! దానికి సంతోషం’’ అంది.

‘‘బాధలు లేని సంతోషం కూడా ఓ సంతోషమేనా కావ్యా!’’ అన్నాడు అన్వేష్‌.

‘‘బాధపడే ఓపిక లేనప్పుడు ఆ సంతోషాన్ని వదిలేసుకోవటమే బెటర్‌. అలాగే జారిపోయిన వస్తువు గురించి  కూడా ఆలోచిస్తూ కూర్చోవటం కూడా మంచిది కాదు. ముఖ్యంగా పెళ్లయిన అమ్మాయి గురించి అసలు ఆలోచించకూడదు.’’ అంది.

‘‘ఏమిటీ!! ఆలోచించకూడదా? నా ఆలోచనల్లో  దేదీప్య లేకుండానా!!’’

‘‘లేకుండా ఎందుకుండాలి? వుంచుకొని రీసర్చ్‌ చెయ్యిమరి’’. అంది కావ్య.

‘‘వ్యంగ్యమా లేక జోకా?’’ అన్నాడు అన్వేష్‌.

‘‘అవేం కాదు అన్వేష్‌! నీకు ప్రేమ తప్ప మరో ప్రాబ్లమ్‌ లేదు. మా లాంటి వాళ్లకు ప్రేమ గురించి ఆలోచించేంత పీసాప్‌మైండ్‌ వుండదు. ఎందుకంటే ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌. ఈ మధ్యనే మా నాన్న గారికి బైపాస్‌ సర్జరీ జరిగింది. ఇప్పటికే అప్పులు చాలా వున్నాయి. దానివల్లే నా చదువు ఆగిపోయింది.’’ అందికావ్య.

కావ్య మాటలకి కదిలిపోయాడు అన్వేష్‌.

‘‘మరి ఇన్ని రోజులు నాకీ విషయం ఎందుకు చెప్పలేదు?’’ అన్నాడు. అతని స్వరం కాస్త సీరియస్‌గా, బాధగా మారింది. ఆమె గురించి ఏం చెప్పకుండా తనని పరాయివాడిగా భావించటం అన్వేష్‌కి నచ్చలేదు.

‘‘కాల్‌ చేసినప్పుడల్లా దేదీప్య గురించి మాట్లాడటమో, వినటమో తప్ప నా కంత టైమెక్కడిచ్చావ్‌ అన్వేష్‌! చదువు గురించి వదిలెయ్‌! చేతనైతే డిగ్రీ బేస్‌ మీద నాకేదైనా జాబ్‌ వచ్చేలా చూడు’’. అంది కావ్య

‘‘తప్పకుండా కావ్యా! కొద్ది రోజులు ఓపికపట్టు.నా ఎం.బి.ఎ. పూర్తయ్యాక నేనే ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నా.  అందులో నీకు తప్పకుండా జాబ్‌ ఇస్తాను’’ అన్నాడు.  కావ్య కోసం ఏదైనా చెయ్యాలని వుంది అన్వేష్‌కి.  కానీ ఆర్థిక పరమైన బాధల నుండి దూరం చెయ్యాలంటే ఒక గంటలో, ఒక రోజులో అయ్యే పని కాదుగా.

‘‘దాహంగా వుందంటే బావి తవ్వుతాను ఆగు అన్నట్లుంది నువ్వు చెప్పేది. ప్రస్తుతం ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేదు. నాకిప్పుడు జాబ్‌ అవసరం అన్వేష్‌.’’ అంది కావ్య దీనంగా.

కావ్య మాటలు వింటుంటే జాలిగా వుంది అన్వేష్‌కి.

‘‘ఇట్స్‌ ఓ.కె. కావ్యా! నీకు జాబ్‌ రావటం కోసం నేను ట్రై చేస్తాను.’’ అన్నాడు.

‘‘థ్యాంక్యూ!॥ అంది కావ్య.

కాల్‌ కట్‌ చేశాడు అన్వేష్‌.

 

* * * * *

 

వరంగల్‌ నుండి విజయవాడ వెళ్లాక ఆ ట్రైన్‌ దిగి, వేరే ట్రైన్‌ ఎక్కి వైజాగ్‌ వెళ్లారు దేదీప్య, దీపక్‌.

ట్రైన్‌ దిగుతున్నప్పుడు దీపక్‌ అడుగులో అడుగువేస్తూ కొత్తపెళ్లికూతురులా ఉల్లాసంగా దిగుతున్న దేదీప్యలో అనంతమైన ఆశలు, కోటి కోరికలు, మనసులో తుళ్లింత, మనసు లోతుల్లో పులకింత, ట్రైన్‌ దిగాక ఆటో ఎక్కుతుంటే దీపకే ప్రపంచమన్నట్లుగా, దీపకే సర్వస్వం అన్నట్లుగా థ్రిల్లింగ్‌గా వుంది.  తొలిసారి కాపురానికెళ్తున్నప్పుడు ఏ అమ్మాయికైనా యిలాగే వుంటుంది కాబోలు.

ముందుగా ఆటో దిగిన దేదీప్య ఎదురగా కన్పిస్తున్న రెండంతస్తుల భవనం వైపు అడుగులు వేస్తూ గేటు వరకు వెళ్లింది.  సంతోషంగా ఆ భవనాన్ని చూస్తూ ఇకముందు తను వుండబోయేది ఈ ఇంట్లోనేనా? ఎంత బావుంది ఈ ఇల్లు! అనుకుంటూ ఆమె మనసు  ఆనందకెరటమైంది. అన్నయ్య ఫ్రెండెవరో కాని దీపక్‌ గురించి చెప్పి తనకి మంచి సంబంధాన్ని చూశాడు. లాంగ్‌జర్నీ కావటంతో బాబుతో ఇబ్బంది అవుతుందని వదిన కంపెనీలో వర్క్‌ వుండటంతో  వీలుకాక అన్నయ్య తన వెంటరాలేదు కాని వచ్చివుంటే తన అదృష్టానికి ఆనందపడేవాళ్లు అనుకుంటూ గేటుపై చేయి వేయబోయింది.

ఆటో అతనితో ఒకటికి రెండు సార్లు బేరమాడి డబ్బులిచ్చి ఇటు తిరిగిన దీపక్‌ దేదీప్యను చూడగానే.

‘‘దేదీప్యా!  ఆ ఇల్లు కాదు. ఇదిగో ఈ ఇల్లు మనది. ఇటు రా’’! అన్నాడు.

ఆ ఇంటివైపు చూసింది దేదీప్య.

రెండంతస్తుల భవనం పక్కన ఏనుగుపక్కన ఎలుకలా అన్పిస్తూ తప్పిపోయిన చిన్నపిల్ల ఓరాయిపై ఒంటరిగా కూర్చుని బిక్కు, బిక్కుమంటున్నట్లుందా ఇల్లు. ఆ ఇంటి చుట్టూ కన్పిస్తున్న మురికి కాలువ, ముళ్లచెట్లు, దానిని ఆనుకొని చిన్న చిన్న పెంకుటిల్లులు.  అక్కడక్కడ మున్సిపాలిటీవాళ్ల నీటిపంపులు.  నీళ్లకోసం వాటి ముందు  బారులు తీరిన ఆడవాళ్లు. రేప్పొద్దున తను కూడా అలాగే నిలబడాలా అని నిశ్చేష్ట అయింది దేదీప్య.

ఈ వాతావరణం ముందుగా అన్నయ్య చూసివుంటే తనని దీపక్‌కి యిచ్చి పెళ్లి చేసేవాడు కాదేమో.

దీపక్‌ వైజాక్‌లో వుంటున్నాడు. గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. భార్యను గడప దాటనీయకుండా తిండిపెట్టి పోషించుకుంటాడు అని మాత్రమే అన్నయ్యకు తెలుసు. ఆ విషయమే తనతో చెప్పాడు. వాళ్లది వైజాగ్‌కి దూరంగా వుండే ఒక పల్లెటూరు అని కూడా చెప్పాడు.  అంతకన్నా ఏం తెలియాలి? అయినా ఈ రోజుల్లో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి, వుంటున్న ఇల్లు చూసి ఎవరు చేస్తున్నారు పెళ్లిళ్లు? ఫ్రెండ్స్‌ చెప్పారనో, తెలిసినవాళ్లు అనో, మ్యారేజి బ్యూరోలతో మాట్లాడో పెళ్లిళ్లు చేస్తున్నారు.  పెళ్లి కూడా అప్పటికప్పుడు ఆర్డర్లు ఇచ్చి చేస్తున్నారు.  పెళ్లి మిాద మనసు పెట్టి గంటలు, గంటలు శ్రమించి చేసేంత టైం కూడా ఎవరికి వుండట్లేదు. ఇందులో అన్నయ్య తప్పేం లేదు అనుకొంది.

‘‘దేదీప్యా! మళ్లీ ఆలోచనలో పడ్డావా? ఖర్మ!’’ అనుకుంటూ ఆమెకు దగ్గరగా వెళ్లి మెల్లగా భుజం తట్టాడు.  ఒక్కక్షణం దీపక్‌ ముఖంలోకి చూసి మనలోకంలోకి వచ్చిన దానిలా అతని వెంట కదిలింది.

రెండంతస్తుల భవనంలో రాజశేఖరం, యశోదర వుంటారు.  యశోదర ఎంత సౌమ్యురాలో రాజేశేఖరం అంత గంభీరమైన వ్యక్తి.

మరుసటి రోజే దేదీప్య ను యశోదరకు పరిచయం చేశాడు దీపక్‌. అతి తక్కువ టైంలోనే దేదీప్య యశోదరకు బాగా దగ్గరయింది. అది ఎలాంటి దగ్గరితనం అంటే  యశోదర ఎక్కడికైనా వెళ్లాలన్నా, కొత్తరకం వంట చెయ్యాలన్నా, ఒంట్లో నలతగా వున్నా వెంటనే దేదీప్యను పిలిచేంత దగ్గరతనం.

దేదీప్యకి కూడా యశోదరతో గడపటం ఇష్టంగా మారింది.  ఆమె పిలుపు కోసం ఎదురుచూస్తూ అప్పుడప్పుడు కిటికీ వైపు చూస్తుంటుంది.  యశోదర ఎప్పుడు పిలిచినా కిటికీలోంచే పిలుస్తుంది. ఆ భవనానికి ఉత్తరం వైపు నున్న కిటికీలోంచి దేదీప్య వుండే ఇల్లు, పరిసరాలు స్పష్టంగా కన్పిస్తాయి.

దేదీప్యకి కారు డ్రైవింగ్‌ కూడా నేర్పింది యశోదర.  ఇప్పుడు యశోదరతో ఎప్పుడు బయటకి వెళ్లినా దేదీప్యనే డ్రైవ్‌ చేస్తుంది.

* * * * *

 

 

సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి ఇంట్లోకి అవసరవమైన సరుకుల్ని తెచ్చింది దేదీప్య. ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన దీపక్‌ టీ.వి. చూస్తుంటే ఆమె వంట ఇంట్లో కూర్చుని తెచ్చిన సరుకుల్ని డబ్బాల్లో నింపుకుంటోంది.  తెచ్చిన వాటికి లెక్క చూపించమని అప్పటికే రెండుసార్లు అడిగి మళ్లీ గుర్తుచేశాడు దీపక్‌.

అతని తొందరేంటో దేదీప్యకి అర్థం కాలేదు.  అసలే ఆ వంట ఇంట్లో గాలిలేక దేదీప్యకి చెమట్లు పోస్తున్నాయి. పవిటకొంగుతో తుడుచుకుంటూ తెల్లకాగితంపై సరుకుల లిస్టు వాటి రేట్లు రాసి ఇచ్చింది దేదీప్య.

ఆ లిస్ట్‌ పూర్తిగా చూడకముందే.

‘‘డబ్బులేమైనా మిగిలాయా?’’ అన్నాడు.

‘‘మిగల్లేదండి! మీరిచ్చిన డబ్బులు సరిపోలేదు. తేవలసిన సరుకులు యింకా వున్నాయి. తర్వాత తెస్తాను.’’ అంది.

అతని గుండెలో కొత్త రకం బాంబు పేలినటైంది.

‘‘నువ్వు సరుకులకి వెళ్లినప్పుడే యిన్ని డబ్బులు అవుతున్నాయి. నేనైతే అవసరమైనవే తెస్తాను.’’ అన్నాడు లోలోన చిరాకు పడ్తూ.

‘‘నేను మాత్రం అవసరం లేనివి ఏం తెచ్చాను?’’ అంది

‘‘కూల్‌డ్రింక్‌ అని రాసుందేం ఇక్కడ?’’ అడిగాడు.

‘‘నేనే త్రాగాను. దాహంగా వుంటే తాగాలనిపించింది’’ అంది దేదీప్య.

‘‘ఎంత త్రాగాలనిపిస్తే మాత్రం త్రాగెయ్యటమేనా? ఇంటికొచ్చి మంచినీళ్లు త్రాగితే సరిపోయేదానికి ఇన్ని డబ్బులు పెట్టాలా?’’ అన్నాడు.

అతను చెప్పేదానికి, తను చేసినదానికి ఏది సబబుగా వుందో తేల్చుకోలేక నోటమాట రాలేదు దేదీప్యకి.

‘‘ఆటో చార్జి అని రాసివుంది. ఆటోలో వచ్చావా? ఏమంత దూరం వుందని ఆటోలో రావటానికి?’’’ అన్నాడు కనుబొమలు ముడిచి.

‘‘పోయిన సారి నడిచే వచ్చాను.  సంచి బరువుగా అన్పించి ఆ రోజంతా చెయ్యి నొప్పి పట్టింది.’’ అంది దేదీప్య.

‘‘పూలు తెచ్చుకున్నావా?’’ అడిగాడు. పదిరూపాయలు పూలు అని రాసివుంటే అది చూసి.

‘‘మీరెలాగు తేరు. కనీసం నేను బయటకెళ్లినప్పుడైనా తెచ్చుకోవాలనిపించింది. మల్లెపూలంటే నాకు చాలా ఇష్టం.’’ అంది. పెళ్లికి ముందు పెట్టుకున్నదే ఆ తర్వాత పెట్టుకోలేదు. ఎప్పుడైనా అన్నయ్య దగ్గరికి వెళ్తానంటే వద్దంటాడు. తన అవసరాలకి, ఫుడ్‌కి ఇబ్బంది అవుతుందంటాడు. ట్రావెలింగ్‌ చార్జెస్‌ ఏమైనా తక్కువున్నాయా? అంటాడు.

‘‘ ఓ గంటయితే వాడిపోయే పూలకు కూడా డబ్బులు పెట్టాలా?’’ అన్నాడు.

‘‘వాడిపోతాయి కదాని పువ్వులెవరు కొనరా?’’ అంది ఆశ్చర్యపోతూ.  అయినా.. భార్య కూల్‌డ్రింక్‌ తాగితే, ఆటోలో వస్తే, పూలు కొంటే ఏ భర్త అయినా ఇలాగే అడుగుతాడా?

‘‘భయం లేకపోతే ఇలాగే వుంటుంది. బయట ఆడవాళ్లు చూడు ఎంత ఎదిగిపోతున్నారో… చూసి రమ్మంటే అవతలి వాళ్లను తన్ని వస్తున్నారు. నువ్వేమో అయినదానికి, కాని దానికి ఖర్చుబెడ్తూ డబ్బంతా తగలేస్తున్నావ్‌!’’ అన్నాడు.

‘‘ఎదగడమంటే అవసరాలను చంపుకోవటం కాదు. ఆదాయాన్ని పెంచుకోవటం’’. అంది దేదీప్య.

‘‘నీతో వాదించటం కన్నా యింకోసారి నీ చేతికి డబ్బు లివ్వకపోతేసరి. ఆ సరుకులేవో ఆఫీసు నుండి వచ్చేటప్పుడు నేనే తెస్తానులే!’’ అన్నాడు దీపక్‌.

అతను తిట్టట్లేదు, కొట్టట్లేదు, బాధపడేలా,ఏడుపు వచ్చేలా మాట్లాడటం లేదు. చాలా కూల్‌గానే అంటున్నాడు. కానీ ఏదో ఫీలింగ్‌తో దేదీప్య తల పగిలిపోయేలా వుంది.

ఆ క్షణం నుండి దేదీప్య చేతికి డబ్బులివ్వటం మానేశాడు.  ఓ ఫోన్‌కాల్‌ చేద్దామన్న దేదీప్య దగ్గర డబ్బుల్లేవు.

* * * * *

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *