April 28, 2024

యేదోకటి చేసెయ్యాలంతే…

రచన: జి.ఎస్.లక్ష్మి                                              

పరమేశానికి  భార్య ఇందుమతి కొత్తగా కనిపిస్తోంది. అదేంటో ఈమధ్య ఇందుమతి చాలా మారిపోయింది. పెళ్ళైన ఈ పాతికేళ్ళూ తన గురించి ఆలోచించడమే మర్చిపోయిన ఆవిడ పిల్లల పెళ్ళిళ్ళయాక తీరుబడిగా ఆలోచనలన్నీ మళ్ళీ తన వైపుకి తిప్పుకుంది.

ఇండియాలో కూతురికో కూతురు పుట్టగానే అందరూ “అమ్మమ్మా..” అని పిలిచేస్తారు. ఆ పిలుపు వినగానే ఇందుమతికి ఒక్కసారిగా నడుం వంగిపొయి, కోడలు యెప్పుడు భోజనానికి పిలుస్తుందా అని యెదురుచూస్తూ, కుక్కిమంచంలో కూర్చునే తన అమ్మమ్మ గుర్తొచ్చేది. అలాంటి ఆలోచనే తనకి రాకుండా వుండడానికి కనపడ్డ పుస్తకమల్లా చదివేసింది. అలా చదవడం వల్ల విదేశాల్లో యాభైయేళ్ళు దాటినవాళ్ళు వారి వారి అభిరుచులని యెలా పునరిధ్ధుంచుకుంటారో తెలుసుకుని ఆశ్చర్యపోయింది.

ఒక్కసారి తన చుట్టూవున్న పరిస్థితులు పరికించింది. ఇదివరకటి రోజులుకావు. ఇప్పుడు ప్రతి అభిరుచీ కాసులు పండిస్తోంది. అదిచూసి వెంటనే యేదో ఒకదానిలో ప్రావీణ్యం సంపాదించేసి, తను కూడా నాలుగురాళ్ళు సంపాదించగలనని చాటుకోవాలనిపించింది.

అవును ..తనకేం తక్కువ? అందంలేదా? చదువు లేదా? సంగీతం రాదా? చురుకుతనం లేదా?

ఈమధ్య అక్షరం ముక్క స్వఛ్ఛంగా పలకలేనివాళ్ళుకూడా వ్యాకరణం గురించి ఉపన్యాసాలిచ్చేస్తున్నారు.

సరిగమలు రానివాళ్ళు పద్యాలకీ, పాటలకీ రాగాలు కట్టేస్తున్నారు. యే దిక్కేదో తెలీనివాళ్ళు అన్నీ తెలిసినట్టు ప్రతిసమస్యకి సమాధానాలిచ్చేస్తుంటే తనెందుకు చేతులు ముడుచుకుని కూర్చోవాలీ? ముమ్మాటికీ కూర్చోకూడదని తీర్మానించేసుకుంది ఇందుమతి. అనుకున్నదే తడవు యెందులో ప్రావీణ్యం సంపాదించాలా అని చాలా తీవ్రంగా ఆలోచించింది. ఒక్కసారి చుట్టూ పరికించి చూస్తే ఎన్ని అవకాశాలో.. బోలెడు రకాల అభిరుచులూ, అవి ఇట్టే నేర్చుకుని అట్టే దుకాణం తెరిచే పధ్ధతులూ చూస్తుంటే ఇన్నాళ్ళూ ఇవన్నీ యెందుకు గమనించలేదా అని వాపోయింది.

మరింక ఆలస్యం చెయ్యకుండా వెంటనే యోగా క్లాస్ లో జేరిపోయింది. ఇందుమతి వుంటున్న లొకాలిటీలో సరైన యోగా స్కూల్ లేదు. పధ్ధతిగా ఒకట్రెండు నెలలు నేర్చేసుకుని, ముందరి గదిలో స్కూల్ పెట్టేస్తే చక్కగా అద్దె కూడా కలిసొస్తుందని ఆనందపడిపోయింది.

కట్ చేస్తే…

మూడోరోజు ఇందుమతికి నడుం పట్టేసి నెల్లాళ్ళపాటు బెడ్ రెస్ట్ తీసుకోవలసొచ్చింది. ఇందుమతి భర్త పరమేశం భార్య పరిస్థితికి బాధపడి, నెల్లాళ్ళపాటు అన్నిరకాల సేవలూ చెయ్యడమే కాకుండా ఆవిడకి బోలెడంత మనోధైర్యం అందించాడు. భర్త చూపిస్తున్న అభిమానానికి పొంగిపోయిన ఇందుమతి నేరుగా భర్తనే అడిగేసింది.

“ఇంతకీ నేను యేవిద్యలో రాణిస్తానంటారు..?” అంటూ..

ఈ ప్రశ్నకి పరమేశం కాస్త ఇబ్బంది పడ్డాడు. యేం చెపితే యేం తంటాయోనని ఆకుకి అందకుండా పోకకి పొందకుండా “నీకు చాలా విద్యలే వచ్చు బంగారం.. కాని యేది చేస్తే నీకు సంతోషంగా వుంటుందో నువ్వే ఆలోచించుకో..” అన్నాడు.

ఆలోచించింది ఇందుమతి. తీవ్రంగా మరీ తీవ్రంగా ఆలొచించింది. ఒక్క ప్రావీణ్యం వుండగానే సరిపోదు..ఇంత ఆలస్యంగా తను నిద్ర లేచినందుకు తన పేరు ప్రాచుర్యం లోకి ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనుకుంది. ఎవరైనా గాడ్ ఫాదర్ లాంటివారు ఆదుకుంటే తప్పితే అంత తొందరగా తన పేరు ప్రాచుర్యంలోకి రాదు అని నిశ్చయించేసుకుంది. అంతే.. ఇంక భర్త పరమేశం వెంట పడింది. పరమేశం పరపతి వున్నవాడు. అందరితో కలివిడిగా వుంటూ ఎవరికైనా మాటసాయం కాని, మనిషిసాయం కాని కావాలని తెలియగానే వెంటనే అక్కడ ప్రత్యక్ష్యమై ఆ కావలసిన పని చక్కబెట్టేవాడు. అందుకని అతనికి చాలామంది మంచి స్నేహితులున్నారు.

అలాంటివాళ్ళలో ఒకడే రాజారావు. అతను ఒక ప్రైవేటు టీవీ చానల్ లో కాస్త చెప్పుకోదగ్గ హోదా  లొనే వున్నాడు. ఎలాగైనా అతనితో చెప్పి తనని టీవీలో కనపడేలా చేయమని పట్టు పట్టింది ఇందుమతి.

“నువ్వక్కడ యేం చెయ్యగలవు ఇందూ..” అర్ధం కాక అడిగేడు పరమేశం.

“యాంకరింగ్..”అంది ధీమాగా. నోటమాటలేదు పరమేశానికి.

“యేం.. ఆ యాంకర్ల కన్న యేం తీసిపోయేను? ఒత్తులూ, దీర్ఘాలూ పలకలేనివాళ్ళే చేసేస్తుంటే అన్నీ స్పష్టంగా చెప్పగలిగిన నేను పనికిరానా..?” యెదురుప్రశ్న వేసింది.

యాంకరింగ్ చెయ్యడానికి చిన్నపిల్లల్నే తీసుకుంటారు అని చెపుదామనుకున్నాడు. కానీ అలా అంటే మళ్ళీ పరికిణీ, వోణీ వేసేసుకుని  వెడతానంటుందేమోనని భయపడిపోయి,

“అదే బంగారం. అలా వచ్చీ రాకుండా మాట్లాడేవాళ్ళనే తీసుకుంటున్నాయి ఈ మధ్య ఛానల్స్. నువ్వేమో తప్పులు మాట్లాడవాయె…” అంటూ సగంలో ఆపేసేడు పరమేశం.

యేమాట కామాటే చెప్పుకోవాలి. ఇందుమతి విషయంలో ఆ మాట నిజవే. చిన్నప్పుడు పిల్లల్ని చదివిస్తున్నప్పుడు చూసేవాడుకదా.. కూతురు “పెళ్ళి” అనడానికి “పెల్లి” అందని సరిగ్గా చెప్పేదాకా ఒకరోజంతా అదేమాట చెప్పించింది కూతురిచేత. తప్పుమాట ఇందుమతి నోటివెంట అస్సలు రాదు.

పరమేశం చెప్పింది నిజవేకదా అనుకుంది ఇందుమతి.. అయినా అంత సులభంగా వదిలేసే మనిషికాదు కనక వెంటనే చెప్పింది..

“ఇప్పుడేగా అన్నారు నాకు చాలా వాటిలో ప్రావీణ్యం వుందని.. టీవీలో అన్నీ పాటలపోటీలు, వంటలపోటీలే కదా.. ఎందులో దానిలో నన్ను జడ్జీగా వెయ్యమనండి..” అంది మొగుడి మీద తనకున్న అథారిటీ అంతా చూపించుకుంటూ..

“నువ్వా…జడ్జీగానా…”

అంతే.. ఇంక ఇందూ కుళాయి తిప్పేసింది. కళ్ళూ. ముక్కూ తుడుచుకుంటూ “అంతే లెండి.. ఊళ్ళో వాళ్ళందరికీ అన్ని పన్లూ చేస్తారు. మీకింత అఖ్ఖర్లేనిదాన్నయిపోయేనన్నమాట..ఏం..నాకు పాటలు రావా.. వంటలు రావా… మూడుపూటలూ శుభ్భరంగా తింటూనే వున్నారుగా…” అనేసి ముక్కు చీదేసింది.

మరింకేమీ మాట్లాడలేక రాజారావుకి ఫోన్ చేసి మొహమాటపడుతూనే తన భార్య కోరిక చెప్పేడు పరశురాం.

” హోస్..ఈ భాగ్యానికి ఇంత మొహమాటమేవిటోయ్.. వచ్చే నెలనుంచి చిన్నపిల్లలకి పాటలపోటీల ప్రోగ్రామ్ చేస్తున్నాం.. అందులో చెల్లాయిని కూడా ఒక జడ్జీగా వేసేద్దాం..” చాలా తేలిగ్గా చెప్పేసేడు రాజారావు.

చెప్పడమే కాదు.. వచ్చే నెలలో యే యే రోజుల్లో ఆ పోటీలు రికార్డ్ చేస్తారో షెడ్యూల్ అంతా పంపేసేడు. యేనుగెక్కినంత సంబరమైంది ఇందుకి. యెప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పెళ్ళిసంగీతం. మళ్ళీ ఈ సంసారంలో పడి ఆ వైపుకే వెళ్ళలేదు. ఇన్నాళ్ళయ్యాక ఇప్పుడు పాటలపోటీకి జడ్జిగా అంటే ఆహా.. మేఘాలమీద తేలిపోయింది ఇందుమతి. ఇలాగ తను ఎంతోమందిని చూసింది. వాళ్ళకున్న కాంటాక్ట్స్ వల్ల టీవీల్లో తరుచు కనిపిస్తుండడం, అది చూసి తల్లితండ్రులు తమ పిల్లలు కూడా టీవీలో కనిపించాలని వాళ్ళ దగ్గరే సినిమాపాటలు నేర్పించడం, అలా చూస్తూ చూస్తూండగానే వాళ్ళు బోలెడు పేరూ, డబ్బులూ సంపాదించెయ్యడం చూసిన ఇందుమతి తను కూడా వాళ్ళలాగే తొందరలోనే బోలెడు డబ్బులు సంపాదించేసుకున్నట్టూ, వాటితో మొట్టమొదటగా తన భర్తకి మంచి పేంటూ, షర్టూ కొన్నట్టూ ఊహించేసుకుంది. అవునుమరి.. భర్త పరమేశం వలన కదా తను పేరూ, డబ్బులూ సంపాదించుకున్నదీ అనుకుంటూ తను తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకుంది. ఆ తర్వాత తనకెంతో ఇష్టమైన మైసూర్ సిల్క్ చీర కొనేసుకోవాలనుకుంది. అలా ఏం కొనాలో నిర్ణయించుకున్నాక కాని ఇందుమతి మనసు స్థిమితపడలేదు. రికార్డింగ్ డేట్ వచ్చేలోపల తను చిన్నప్పుడు నేర్చుకున్న రాగాలు, కీర్తనలు ఒక్కటొక్కటే గుర్తు చేసుకుని బాగా ప్రిపేర్ అయింది.

అనుకున్నరోజు రానే వచ్చింది. స్టూడియోకి వెళ్ళేసరికి ఇంకా మిగిలిన జడ్ఝీలు కూడా పరిచయమయ్యేరు. అందులో ఒకాయన ఇప్పుడిప్పుడే ఒక సినిమాకి సంగీతదర్శకత్వం చేసేరుట. ఆయన పేరు జంబులింగం. టూకీగా జంగం అంటుంటారు. ఇంకొకాయన దర్శకత్వం చేసిన సినిమా ఇంకా విడుదలైనా కాలేదు కాని దాని ఆడియో రిలీజ్ అయినదగ్గర్నుంచి ప్రజలందరూ ఆ పాటలే పాడుకుంటున్నట్టు ఆయన ద్వారానే విని ఆనందించింది. ఈయన పేరు పంచాగ్నుల పండితరాయలు. . అందరూ పంపం అటూంటారు. ఇంత ప్రముఖులైన వారిద్దరి పేర్లూ ఇప్పటివరకూ తను వినలేకపోయిన తన అఙ్ఞానానికి చిన్నబుచ్చుకుంది. హు.. ఈ సంసారంలో పడి ఎన్ని విలువైన విషయాలు తెలీకుండా వుండిపోయాయో అనుకుని నిట్టూర్చింది. నయం.. ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. ఇంక విజృంభించవలసిందేనని నిర్ణయించేసుకుంది.

“మేడమ్, మీరు ముగ్గురూ మాట్లాడుకుంటూండండి. ఇదిగో ఈ రోజు పాడేవాళ్ళ లిస్ట్. చూస్తూండండి..” అంటూ ఆ స్టూడియో అబ్బాయి ఒక కాగితం ఇచ్చిపోయేడు. వాళ్ళిద్దరూ పాత పరిచయస్తులే అవడం వల్ల ఇందుమతిని పరిచయం చేసుకుని లిస్ట్ చూస్తూ..”ఈ వైదేహినీ, మల్లికనీ ఇవాళ తీసేద్దాం.” అనుకున్నారు.

ఇందుమతికి అర్ధంకాలేదు. “ఏం వాళ్ళు రాలేదా?” అనడిగింది. వాళ్ళు నవ్వేసేరు.

“మీరు జడ్జ్ గా రావడం మొదటిసారా అండీ..” అని చాలా మర్యాదగా అడిగేరు.

అవునని ఒప్పేసుకుంటూ..

“కాని నేను శంకరశాస్త్రిగారి శిష్యురాలిని. యెనిమిదేళ్ళు ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాను.” తనకీ సంగీతం తెలుసని సగర్వంగా ప్రకటించేసుకుంది.

జంగం, పంపం చాలా గౌరవంగా ఇందుమతికి నమస్కారం పెట్టేసేరు.

“మీరెవరి శిష్యులు..?”ఆసక్తిగా అడిగింది ఇద్దర్నీ.

“మాకు అలా ఒకళ్ళ దగ్గర నేర్చుకోవడం ఇష్టం వుండదు మేడమ్. అలా ఇంకోళ్ళు చెప్పిందే నేర్చుకుంటే మాలో వున్న సహజత్వం చచ్చిపోతుంది. అందుకని పాత సీడీలు అవీ విని మాకు మేమే నేర్చుకున్నాం.” గర్వంగా చెప్పేరు. అంటే వీళ్ళు సీడీలు విని సినిమాలకి మ్యూజిక్ చేస్తున్నారా అనుకుంటూ బాగా తెరుచుకోబోతున్న నోటిని బలవంతంగా అరిచేత్తో మూసేసింది ఇందుమతి.

“మేడమ్, ఈ పోటీల్లో జానకే విన్నర్ అవాలి. సెకండ్ ప్రైజ్ విమలకి రావాలి. అందుకని పోటీ మొదట్నించీ ఏ ఎపిసోడ్ కి ఎవర్ని ఎలిమినేట్ చెయ్యాలో మనం ముందే ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా..”

ఇందుమతి తెల్లబోయింది. ఇదెక్కడి పోటీ. అసలు వాళ్ళు ఏం పాడతారో తెలీదు. ఎలా పాడతారో వినలేదు. కాని విన్నర్ ఎవరో ముందే చెప్పేసుకుంటున్నారు. అంతా కొత్తగా అనిపించి ఏం మాట్లాడలేకపోయింది.

పోటీ మొదలైంది. చిన్న చిన్న పిల్లలు. అయిదేళ్ళనుంచి పదేళ్ళ వరకూ వున్నారు. వాళ్ళ అమ్మానాన్నా తీసుకొస్తే వచ్చేరు. వాళ్ళటీచర్ నేర్పిన పాట నేర్పినట్టు పాడుతున్నారు. అమాయకంగా ఎంత ముద్దుగా వున్నారో.

ఆ విన్నర్ అవ్వాల్సిన జానకి పాట పాడింది.”కెవ్వ్..కెవ్వ్..”మంటూ కేకలు పెట్టడం మొదలెట్టేడు జంగం.

అంతకన్న పైస్థాయిలో కేకలేసేడు పంపం. హడిలిపోయింది ఇందుమతి.

“చించేసేవ్..” అంటూ జంగం, “పొడిచేసేవ్..” అంటూ పంపం ఆ పిల్లని మెచ్చేసుకున్నారు.

“పంపం.. మీరు ఈ పాట గురించి మీ అనుభవాలు చెప్పండి..” జంగం అడిగేడు.

ఇదేంటీ.. ఇది చాలా పాత పాట కదా.. ఈ సినిమా వచ్చినప్పుడు ఈ పంపం ఇంకా పుట్టికూడా వుండడు అని ఇందుమతి అనుకుంటుంటే పంపం మొదలుపెట్టేడు.

“మా అమ్మగారు ఇప్పటికీ అందరితో చెప్తూంటారు. ఆవిడ ఈ సినిమా చూసిన పదేళ్ళకి నేను పుట్టేనుట. కాని ఆవిడ కడుపుతో వున్నప్పట్నుంచీ కూడా ఎప్పుడు ఈ పాట వింటున్నా కడుపులో వున్న నేను నా సంతోషం దాచుకోలేక పొట్టలో బాగా కాళ్ళూచేతులూ ఆడించేవాణ్ణిట. నాకు ఈ పాట ఇష్టమని మా అమ్మ నేను పుట్టినప్పటినించీ చెప్పేది. ఇప్పటికీ కూడా ఎప్పుడు ఈ పాట వింటున్నా నాకు తెలీకుండానే డేన్సు చేసేస్తుంటాను..”

అంటూ ఆ పాట పాడుతున్న పాప దగ్గరికెళ్ళిపోయి, ఆ పాప రెండుచేతుల్నీ తన రెండుచేతుల్లోకీ  తీసేసుకుని గుండ్రంగా తిప్పేసేడు. అలా తిప్పేస్తుంటే ఆ పాపతోబాటు ఇందుమతి కూడా తెల్లబోయింది.

వీళ్ళ అనుభవాలు బంగారంగానూ.. ఇదెక్కడి అనుభవం? ఏదో సంగీతంలోనే పుట్టిపెరిగినట్టు ఎలా డప్పు కొట్టుకుంటున్నాడో.. ఇది కూడా ఇలా స్టేజీ యెక్కి చెప్పుకోవాలా అనుకుంటూ వాళ్ళవైపు కంపరంగా చూసింది.

రన్నర్ అయితీరాల్సిన విమల కూడా పాడింది. ఇందుమతి ఎంత శ్రధ్ధగానో వింది ఆ పాటని. ఆ పాటలో మెలికలకన్న ఎక్కువ మెలికలు తిరిగింది స్టేజి మీద విమల. పాట పూర్తవడం ఆలస్యం జంగం, పంపం ఇద్దరూ ఒక్కసారిగా లేచి, పరిగెట్టుకుంటూ ఆ విమల దగ్గరికి వెళ్ళిపోయి, “కేవ్వు కేక..” అంటూ..”కొప్పున పూలెట్టుకుని..” అనే కెవ్వుపాట పాడేస్తూ ఆ పిల్ల చుట్టూ గుండ్రంగా తిరిగేస్తూ డేన్సు చేసెయ్యడం మొదలెట్టేరు. బిత్తరపోయిన ఆ విమల అక్కడే భోరున ఏడుపు మొదలెట్టేసింది.

ఈ ఫార్సంతా చూస్తున్న ఇందుమతికి కడుపులో దేవేసినట్టయిపోయి ఇంటికెళ్ళేక పరమేశాన్ని పట్టుకుని కడిగేసింది. పాపం పరమేశం.. కట్టుకున్న పాపానికి చచ్చినట్టు నోరు మూసుకుని తననీ, తన ఫ్రెండు రాజారావునీ ఇందుమతి అన్న మాటలన్నీ పడ్డాడు. “ఇంక నేను ఛస్తే ఇలాంటి పాటలపోటీకి పోనంతే ”

తేల్చి చెప్పేసింది. అమ్మయ్య అనుకున్నాడు పరమేశం. ఇకనైనా బుధ్ధిగా ఇంటిపట్టునుంటుందనుకున్నాడు.

పాపం పరమేశం.. పెళ్ళై అన్నేళ్ళయినా ఇందుమతి అర్ధంకాలేదతనికి.

మర్నాడు మళ్ళీ మొదలెట్టింది. “పాటలపోటీ కనక ఇలాంటివన్నీ చెల్లుతాయి. ఈసారి నన్ను వంటలపోటీకి జడ్జిగా పెట్టమనండి మీ ఫ్రెండ్ ని. ఎదురుగా వండుతారు కనక న్యాయంగా గెలవాల్సినవాళ్ళే గెలుస్తారు.” అంటూ చెవిలో జోరీగలా రొద మొదలుపెట్టింది. భార్యకో దండం పెట్టేసి రాజారావు ఫోన్ నంబర్ కలిపిచ్చి ఆమెనే మాట్లాడమన్నాడు పరమేశం.

రాజారావు ఇలాంటివాళ్ళని యెంతమందిని చూసేడో..వెంటనే..”చెల్లెమ్మా.. దాందేవుందమ్మా.. అలాగే.. వంటలపోటీలు ప్రకటించగానే షెడ్యూలు నీకు పంపిస్తానుగా..” అని హామీ ఇచ్చేసేడు. మరింక ఇందుమతి ఆనందానికి హద్దులు లేవు.

ఆ మర్నాటినుంచీ పరమేశాన్ని పూటకో హోటల్ కి తీసికెళ్ళడం మొదలెట్టింది. ఒకరోజు చైనీస్, ఒకరోజు మెక్సికన్, ఇంకోరోజు కాంటినెంటల్, మరో రోజు పిజ్జాహట్ ఇలాగ సిటీలో వున్న అన్ని వెరైటీ హోటల్స్ కీ వెళ్ళడం చూసిన పరమేశం నాలుగురోజులకే చేతులెత్తేసేడు.

ఎంతో ముద్దుగా భార్యతో చెప్పేడు. “చూడు బంగారం, జడ్జిగా వుండాలంటే ఇలా అన్నిరకాలూ తినడం కాదు. అవి తయారుచెయ్యడం వచ్చుండాలి..”

మూతి మూడు వంకర్లు తిప్పింది ఇందుమతి. “ఆమాత్రం తెలీకపోతే ఎలాగండీ.. జడ్జీలంటే వండినదాన్ని రుచి చూసి కదండీ చెప్పాలి.” అంటూ పరమేశం అమాయకత్వానికి జాలిపడింది.

ఎలాగైతేనేం.. ఆ మంచిరోజు రానే వచ్చింది. చాలా చాలారకాల వంటలు పరీక్షించాలని ఇంట్లో తగుమాత్రమే తిని వెళ్ళింది ఇందుమతి. అక్కడ యేకంగా పదిమంది పోటీ పడుతున్నారు. యేం వండాలన్న మొదటి ఛాయిస్  పోటీపడేవారికే ఇచ్చేసేరు నిర్వాహకులు.

అందులో ఒకావిడ కాస్త తూకంగా కనపడింది ఇందుమతి కళ్ళకి. ఆవిడ ముందున్న బల్ల మీద ఉగ్గుగిన్నె సైజునుంచి పెద్ద బకెట్ సైజు వరకు లైన్ గా వెండిగిన్నెలు పరిచివున్నాయి. బహుశా వాళ్ళాయన కేమైనా వెండికొట్టు వుందేమో ననుకుంటూ ఆవిడని కాస్త పరిశీలనగా చూసింది. బల్ల మీదే కాదు ఆవిడ ఒంటిమీద కూడా ఉంగరం నుంచి వడ్డాణం వరకూ ఏడువారాల నగలూ ఉన్నాయి. బహుశా ఈవిడ పుట్టింటివారికి వెండికొట్టూ, అత్తింటివారికి బంగారంకొట్టూ ఉండుంటాయన్న నిర్ణయానికొచ్చేసింది ఇందుమతి. యెంతో ఉత్సుకతతో ఆవిడని అడిగింది “యేం వండుతున్నారండి” అంటూ..

“కాకరకాయ హల్వా..” అందావిడ గర్వంగా..

కాకరకాయతో హల్వానా.. యెన్ని కిలోల పంచదార పోస్తే అది తియ్యబడుతుందో తెలీలేదు ఇందుమతికి.

“అదేవిటి..” అంది అర్ధంకానట్టు..

ఆవిడ వివరించింది. “మనం తినేది మనకి ఆరోగ్యంగా వుండాలి కదండీ.. కాకరకాయ కడుపులో వున్న నులిపురుగులని పోగొడుతుంది.” తనకి కడుపులో పురుగులేమన్నా వున్నాయేమో అని అనుమానం వచ్చేసింది ఇందుమతికి.

“కాని హల్వా అంటే తియ్యగా వుండాలి కదా..యెంత పంచదార పోస్తే ఆ చేదు తగ్గుతుందీ..?”అనడిగేసింది.

నవ్విందావిడ. “పంచదార ఒంటికి అంత మంచిది కాదుకదండీ. అందుకని నేను ఇందులో పంచదారతో పాటు బెల్లం కూడా వేసి చేస్తాను..” అంది.

“పైగా బలవర్ధకంగా వుండడానికి ఇందులో కాజూ, బాదం, పిస్తా, కిస్ మిస్ లాంటి డ్రైఫ్రూట్స్ వేస్తాను..” అంటూ ఆవిడ చూపించిన సామాన్లవైపు చూసింది.

అక్కడ ఓ చిన్న వెండి ప్లేట్ లో సన్నగా ఎలకతోకల్లాగ రెండు వాడిపోయిన కాకరకాయలూ, పక్కన ఉగ్గుగిన్నెలో పసుపు విఘ్నేశ్వరుడంత  బెల్లమ్ముక్కా, ఆ పక్కన పళ్ళు పెట్టుకునే బౌలంత బేసిన్ లో ఓ రెండు కిలోల పంచదార, ఇటువైపుకి ఓ పెద్ద కళాయిలాంటి గిన్నెలోఓ రెండు కిలోల నెయ్యీ, అటువైపుకి ఓ పేద్ద వెండిట్రేలో అన్నీ కలిపి రెండు కిలోల డ్రైఫౄట్సూ కనిపించేయి ఇందుమతికి.

హాసినీ అసాధ్యం కూలా.. ఇన్ని డ్రైఫౄట్స్ వేస్తే ఇంకా అది కాకరకాయహల్వా యెందుకౌతుందీ..డ్రైఫౄట్స్ హల్వా అవుతుంది కానీ… అనుకుంటూ మరో ఆవిడ వైపు వెళ్ళింది. అలా ఆ పదిమందీ వంటలు వండుతుంటే ఇంకా మిగిలిన జడ్జీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ, వాళ్ల జవాబులకి వెకిలిగా నవ్వడం చూస్తుంటే ఇంక అక్కడ వుండబుధ్ధికాలేదు ఇందుమతికి. పైగా జడ్జిమెంటు చెప్పడానికి వాళ్లందరూ చేసే పిచ్చివంటలతోపాటు ఆ కాకరకాయ హల్వా కూడా తినాలన్న ఆలోచన రాగానే పైప్రాణం పైనే పోయింది. వెంటనే పరమేశానికి ఫోన్ చేసేసి..”నేను ఇంటికి వచ్చేస్తున్నాను. ఆ రాజారావుతో యేం చెప్పుకుంటారో చెప్పుకోండి..” అని అక్కడ్నించి నెమ్మదిగా జారుకుని ఇంటికి వచ్చేసి, వేడివేడిగా అన్నం వండుకుని, ఆవకాయ కలుపుకుని తినేదాకా శాంతించలేకపోయింది.

ఈ శాంతి తాత్కాలికమేననీ, మళ్ళీ యెప్పుడో హఠాత్తుగా ఇందుమతి శంఖం పూరిస్తుందనీ అనుభవఙ్ఞుడైన పరమేశానికి తెలిసిపోతూనేవుంది.

అతని అంచనా తప్పుకాలేదు. ఒక శుభోదయాన కమ్మటికాఫీ ఇస్తూ తన ఉద్దేశ్యం ప్రకటించేసింది.

“నేనొకటనుకుంటున్నానండీ..”అంటూ..

కాఫీకప్పు పడిపోకుండా గట్టిగా పట్టుకుంటూ భయంభయంగా అడిగేడు పరశురాం..

“యేవిటి బంగారం…?”

“నేను  ఇవ్వాళ్టినుంచీ కథలు రాసేద్దామనుకుంటున్నాను..”

“హేవిటీ..?”

“అవునండీ.. ఇన్ని కథలు చదువుతున్నానా.. అన్నీ ఈజీగా రాసేసేవే..అందరిళ్ళల్లో రోజూ జరిగేవే.. అందుకని ఓ దస్తా కాగితాలూ, ఓ రెండు పెన్నులూ , ఒక రీఫిళ్లకట్టా తెచ్చెయ్యండి..అవునూ..మీకు పత్రికల వాళ్ళెవరైనా తెలుసా..?”

చీపురుకట్ట కట్టినట్టే రీఫిళ్ళను కూడా ఒకే కట్టకి కట్టిన ఇందుమతి సాహితీ ఙ్ఞానానికి మూర్ఛపోతూ, తనకెవరూ ఎడిటర్లు స్నేహితులుగా లేనందుకు యెంతో సంతోషపడిపోయేడు పరశురాం.

 

 

 

 

 

 

7 thoughts on “యేదోకటి చేసెయ్యాలంతే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *