May 8, 2024

“విరించి బాబా”

బెంగాలీ కథ; పరశురామ్(రాజశేఖర్ బాబు)

ఆంగ్ల అనువాదం; గోపా మజుందార్

తెలుగు అనువాదం; మంథా భానుమతి   bhanumathi

 

 

 

 

 

కలకత్తా మహా పట్టణం.. ఆ పట్టణం పేరు కోల్కత్తా గా మారకముందు.. అనేక కారణాల వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో కుటుంబాలనుంచి, ఉద్యోగాల రీత్యా ఆ నగరంలో అనేక మంది తప్పనిసరి బ్రహ్మచారుల్లా కాలం గడుపుతున్నారు. వారందరికీ భోజనం, వసతి సౌకర్యాల కోసం బోలెడు వసతి గృహాలు వెలిశాయి.

అది ఎక్కువగా ఎగువ మధ్య తరగతి కుటుంబీకులు ఉండే పేట.. ఆ వీధిలో 14 వ నంబర్ ఇంట్లో ఉన్న మెస్..  అవటానికి చిన్నదే, కానీ శుభ్రంగా, శుచిగా, పొందిగ్గా ఉంటుంది. దానికి కారణం మానేజర్ నివారణ్‍బాబు. స్వభావ సిద్ధ్యా ఏదీ పట్టించుకోనట్లు ఉంటాడు కానీ, అక్కడ ప్రతీ చిన్న విషయం మీద అతను పెట్టే నిశిత దృష్టి  పనివాళ్లని చురుకుగా ఉంచుతుంది. ఆ మెస్‍లో ఐదారుగురు కంటే ఉండరు. అందరూ కొద్దో గొప్పో ఉన్నవారే.

అందరికీ కామన్‍గా ఉన్న హాల్లో రకరకాల సంగీత వాయిద్యాలు, పేక ముక్కలు, చదరంగం బల్ల, కారమ్బోర్డ్ వంటివి వారి కాలక్షేపానికి ఉన్నాయి.. అలాగే కొన్ని పేరు పొందిన వార్తా, వార, పక్ష, మాస పత్రికలు కూడా!

మర్నాటి నుంచీ దసరా సెలవలు. మెస్ సభ్యులు అందరూ వారి ఊళ్లకి వెళ్లారు. నివారణ్‍బాబు, పరమార్ధ మాత్రం ఉన్నారు. వారి భార్యా పిల్లలు సెలవులకి అక్కడికే వస్తామన్నారు. లేకపోతే వాళ్లు కూడా వెళ్లిపోయే వారే.

నివారణ్ కాలేజ్‍లో ప్రొఫెసర్. పరమార్ధ ఇన్శ్యూరెన్స్ ఏజంట్. అతను యోగా, దివ్యజ్ఞానం వంటి వాటిల్లో కూడా మునిగి తేలుతుంటాడు.

ఆ రోజు సాయంత్రం.. పక్కింట్లో ఉండే నితాయ్ బాబు కూడా హాల్లో చేరాడు. నితాయ్ బాబు తరచు అక్కడికి వస్తుంటాడు. మెస్ లో అందరికంటే వయసులో పెద్ద.. అందుకే అతన్ని గౌరవంగా చూస్తారు. ఉదాహరణకి.. అతని ఎదురుగా దమ్ము కొట్టడం వంటివి చెయ్యరు.

“నాకు ఇవేళ మనసేం బాగా లేదు.” నితాయ్ బాబు చెప్పడం మొదలుపెట్టాడు.

“ఇంట్లో పనివాళ్లు వెళ్లిపోయారు. మా ఆవిడ ఎప్పుడు చూసినా సాధిస్తూ ఉంటుంది. మా అమ్మాయికి జ్వరం. ఇంక మా ఆఫీసులో మరీ ఘోరం.. కొంచెం విశ్రాంతిగా పడుక్కుందా మంటే కుదిరి చావట్లేదు. చూశారా.. ఆ మాత్రం స్వేఛ్ఛ కూడా లేకుండా చేశాడు మా కొత్త బాస్.. అన్నింట్లో వేలు పెడ్తాడు. అక్కర్లేనిదీ కావల్సిందీ లేదు.”

“నిజంగానా! చొచ్చో..మీ ఆఫీసులో స్టాఫ్ కి మంచి వసతులు ఉన్నాయనుకున్నాను ఇన్నాళ్లూ..” పరమార్ధ సానుభూతి చూపించాడు.

“ఒకప్పుడుండేవి. ఆ రోజులే వేరు. మిస్టర్ మెకెంజీ టైమ్ లో అలా ఉండేది. మీకు శ్యామనగర్ నుంచొచ్చిన వరద్ ముఖర్జీ గుర్తున్నాడా? రోజూ మధ్యాన్నం రెండు గంటలకి ఒక నల్లమందు మాత్ర దట్టించి, రెండున్నర నుంచీ నాలుగు వరకూ హాయిగా పడుక్కునేవాడు. మిగిలిన వాళ్లం అయితే వంతుల వారీగా టీ రూమ్ కి వెళ్లి కాసేపు కునికి వచ్చేవాళ్లం. అతను మాత్రం తన సీటు వదిలేవాడు కాదు. ఒక రోజు లెడ్జర్ పుస్తకంలో ఏవో ఎక్కిస్తూ, నిద్ర ఆపుకోలేక పోయాడు. అంతే.. కదలడు, మెదలడు… గుర్రు పెట్టడు. కానీ పెన్ను పట్టుకున్న చెయ్యి అలాగే పేజీ చివర లైనులో కూడికల ’మొత్తం’ దగ్గర ఉండిపోయింది. అతనికి దేముడా వరం ఇచ్చాడు. దూరం నుంచి చూస్తే ఎవ్వరూ అతను నిద్రపోతున్నాడని కని పెట్టలేరు.

ఒకసారి ఉన్నట్టుండి మిస్టర్ మెకెంజీ గదిలోకి వచ్చాడు. అందరూ లేచి నిల్చున్నారు. ఒక్కసారి వరదముఖర్జీ కేసి చూసి, సీటు వెనక్కి వెళ్లాడు మెకెంజీ. కొంచెం సేపు వరదని గమనించి భుజం మీద ఒక గిల్లు గిల్లాడు. వరద వెంటనే కళ్లు తెరిచి, “ముప్ఫైఏడు లోంచి ఏడు తీసేసి మూడు పక్కకి తీసుకొస్తే..” అంటూ గొణగ సాగాడు. మిస్టర్ మెకెంజీ పకపకా నవ్వి, “ఓ కప్పు టీ తాగండి వరదబాబూ!” అని వెళ్లిపోయాడు. అటువంటిది.. ఎప్పుడైనా ఇటువంటి మార్పు ఉంటుందని ఊహించామా? మరి ఇప్పుడో.. అడక్కండి. టీ రూముకి వెళ్లడానికి కూడా లేదు. నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి, ఇన్ని బాధ్యతల మధ్య బతుకు వద్దే వద్దు. ఇంక చాలు. ఎవరైనా మంచి సాధువు దొరికి దారి చూపుతే అన్నీ వదిలేసి అతని వెంట వెళ్లిపోతాను.”

“ఇవేళే జగన్నాథ్ ఘాట్ దగ్గర ఒక సాధువుని చూశాను. అతన్ని ’పచ్చిమిరపకాయ బాబా’ అంటారు. వారు రోజూ అన్నం, రొట్టెలు, కూరలు, పళ్లు.. ఇటువంటివి తినరుట. తినేదల్లా కిలోల కిలోలు పచ్చి మిరపకాయలు. వేలమంది భక్తులు చూడ్డానికి వస్తారు. అందరికీ ఏవేవో సమస్యలు ఉండనే ఉంటాయి కదా.. అనారోగ్యం, డబ్బు, ప్రేమ.. ఇలా. ఆయన ఆశీర్వదించి, ఒక మంత్రించిన మిరపకాయ ఇస్తాడుట.. అంతే.. సమస్యలు మటు మాయం. ఆయన గురువు ఇంకా పెద్ద మహిమ ఉన్నవాడని విన్నాను. ఆ పెద్ద గురువు తినేదల్లా రంపంపొట్టు మాత్రమేట. మీకు పచ్చిమిరపకాయ సాధువు చాలనుకుంటాను” పరమార్ధ సలహా ఇచ్చాడు.

“ప్రొఫెసర్! మీరు ఇంగ్లీష్, వేదాంత శాస్త్రాలలో యమ్మే కదా.. పచ్చిమిరపకాయలు, రంపం పొట్లలో ఉన్న పరమార్ధం చెప్పగలరా? ఆ మృదంగం  ఆపండి. నాకు పిచ్చెక్కుతోంది…” నితాయ్.

ఈ సంభాషణ నడుస్తుంటే మొదట్లో నివారణ్ ఏదో పత్రిక చదువుతూ కూర్చున్నాడు. అందులో ఐదు కథలున్నాయి. ప్రతీ కథలోనూ నాయికకి అతి మంచి లక్షణాలే.. అది చూసి ఒళ్లు మండి పత్రికని పక్కకి పడేసి, ఆ తరువాత మృదంగం మీద తోచీ తోచని దరువేస్తున్నాడు నివారణ్.

నితాయ్ బాబు మాటలతో ఆపేశాడు.

“పచ్చిమిరపకాయలు.. రంపంపొట్టూ? నిజమే..” సాలోచనగా అన్నాడు నివారణ్,  “మోక్షానికి దారి చూపే ఆధ్యాత్మిక మార్గాలు అయితే మూడున్నాయి. అవి, ధ్యానం, కర్మ, భక్తి. అటువంటివే ఇంకా ఉన్నాయని విన్నాను చాలా చోట్ల.. మిరపకాయలు, రంపంపొట్టు, ఉప్పు, ఆవు పేడ, స్ఫటికాలు, బ్లేడ్లు, మేకులు, కాకులు..”

“కాకులా..”

“అవును.. మీరు వినలేదా! నిరుడు ఒక పెద్ద తీర్థానికి వెళ్లాను. అక్కడ వెదురు బొంగులతో చేసిన ఒక పెద్ద పంజరం చూశాను. అందులో షుమారు రెండువందల కాకులున్నాయి, భయంకరంగా గోల చేస్తూ అక్కడ నరకాన్ని సృష్టిస్తున్నాయి. “ఒక కాకి రెండణాలు మాత్రమే..” ఒకాయన అరుస్తున్నాడు. రెండణాలకి ఒక కాకా? ఏదో విశేషముంటుంది.. ముల్తాన్నుంచో, పెషావర్ నుంచో వచ్చిన ప్రత్యేకమైన కాకులేమో.. అక్కడ మాట్లాడే పక్షులయుంటాయిట.. ఉన్నవాటిల్లో ఒక పెద్ద కాకి దగ్గరగా వెళ్లి బుజ్జగిస్తూ అడిగాను,

“మైనా.. ఇటు చూసి రాధాకృష్ణ అను.. సీతారామ్ అని పలుకు..” అది పలకలేదు సరికదా, నాకేసి పక్క చూపులు చూస్తూ పెద్ద ముక్కుతో పొడవబోయింది. “లేదు బాబూ! ఇది మాట్లాడదు.” అరిచే ఆయన అన్నాడు. మరేం చేస్తుంది? ఇన్ని కాకుల్ని ఎందుకు అమ్ముతున్నాడు? కాకి మాంసం పరమ చేదుగా ఉంటుందట. దాన్నెవరు తింటారు? “అబ్బే.. ఈ పక్షులు తినడానికి కాదు. వాటిని వదిలెయ్యడానికి.. వాటిని జైల్లో బంధించినట్లు కనిపించడం లేదూ? మీకెన్ని కావాలంటే అన్ని కొనండి.. ఒక్కోటి రెండాణాలు..  కొని వాటిని వదిలెయ్యండి. వాటికి స్వేఛ్ఛ ప్రసాదించండి. అది ఎంత పరోపకారమో చూడండి. అది మీ అత్మకి విముక్తి ఇస్తుంది.” ఆ మనిషి వివరించాడు. నాకయితే అతని తెలివికి ముచ్చటేసింది. నాకు మోక్షం కలగడానికి దారి చూపిస్తున్నాడు. నా ఆత్మ సాక్షాత్కారానికి, అతను ఎంత త్యాగం చేస్తున్నాడో చూడండి. వేల కొద్దీ పక్షుల్ని బంధించి పాపం చేస్తున్నాడు. అది అతని మోక్షమార్గానికి అడ్డే కదా! ఆ త్యాగనిరతి అభినందనీయం కదూ.. బహుశా ఇదే ధర్మ పరిరక్షణ అనుకుంటా.. ఒకళ్ళకి ముక్తి కలగాలంటే ఇంకొకళ్లు పాపం చెయ్యాలి.”

సరిగ్గా అప్పుడే సూటు, టై, బూటుతో ఒక నవ యువకుడు హాల్లోకి ప్రవేశించాడు. వయసు ఇరవై, ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు.. అయినా పెద్ద బాధ పడకుండా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు.

“రోజంతా ఆఫీస్ లో చచ్చే చాకిరీ చేశాక, సాయంకాలం కాస్త విశ్రాంతి తీసుకుని సినిమా చూద్దామనుకున్నా.. అబ్బే.. ఎందుకెళ్తానూ.. అత్తమ్మ ఊరుకుంటుందా, “సత్యా! నువ్వు చాలా పెద్ద వాడివయిపోయావు. నాతో మిస్టర్ సన్యాల్ ప్రవచనానికి రా. అది నీ మానసిక వికాసానికి చాలా మంచిది,” అంటూ పట్టుకుపోయింది. అయితే అదేం నా వికాసానికేమంత మంచేం చెయ్యలేదు.. అక్కడ మిస్టర్ సన్యాల్ మత ధర్మాన్ని మాట్లాడుతుంటే ఇక్కడ నేను బొద్దింకల గురించి ఆలోచిస్తున్నాను.”

“బొద్దింకలా..” నితాయ్ బాబు ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోయాడు.

“అవును. మూడు టన్నుల బొద్దింకలు. ఈ నవంబర్, డిసెంబర్ లోగా, ఒక టన్నునలభై పౌండ్ల పదిహేను సెంట్లకి చొప్పున సిఐయఫ్, హాంకాంగ్ కి ఎగుమతి చెయ్యాలి. చైనా అత్యవసరంగా యుద్ధానికి సన్నిద్ధమౌతోంది. అందుకే వాళ్లు అన్నీ సర్దుకుని సమాయత్తమౌతున్నారు. మా బాస్ మొత్తం సరుకంతా పాక్ చేసి సీల్ చేసి నెల్లాళ్లలో పంపమంటున్నాడు. అంతలోపు అన్ని బొద్దింకలు ఎలా సంపాదించగలనో చెప్పండి.. అంతా కష్టకాలం కాకపోతే..”

“సత్యా! నువ్వు బ్రహ్మసమాజవాదివి కదా.. అబద్ధాలు చెప్పచ్చా?”

“ఎవరు చెప్పారు? నిక్షేపంలా చెప్పచ్చు.. ఒక్క అత్తమ్మ దగ్గర తప్ప..” అలా.. సాగి పోయేదేమో కానీ,

“సత్యా! నీకు ఎవరైనా మంచి, మహిమగల సాధువులు తెలుసా” నివారణ్ అడ్డుకున్నాడు.

“సాధువులా? ఎంతమంది కావాలి?”

“కమాన్.. సత్యా! ఆట పట్టించకు. నీకు ఆచారాల మీద నమ్మకం లేదు. పూజల్లేవు. మంత్రాలు లేవు. ఇంక సాధువుల గురించేం తెలుస్తుంది.” నితాయ్ బాబు అభ్యంతర పెట్టాడు.

“మాకు ఆచారాలమీద, అద్భుతాలమీద నమ్మకాల్లేవని ఎవరన్నారు? మొన్నామధ్యన అత్తమ్మకి భయంకరమైన పంటినొప్పి వచ్చింది. ఏ పనీ చెయ్యలేకపోయింది. మాట్లాడ్లేదు, తినలేదు, నిద్రపోలేదు.. మామయ్యని సాదించడం మాత్రం తప్ప. ఇంట్లో అంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.. ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేసింది పాపం.. యాస్ప్రో వేసుకుంది. పిప్పరమెంటు పంటి కింద పెట్టుకుంది. ఎవరో తాయత్తు ఇస్తే చేతికి కట్టుకుంది.. దానికి నొప్పి తగ్గించే మహత్తుందంటే.. కానీ ఏదీ పని చెయ్యలేదు. అటువంటి నిస్సహాయ స్థితిలో మామయ్య రెండు రోజులు ఎవరితో ఉలక్కుండా పలక్కుండా, గాఢంగా ప్రార్ధన చేశాడు. అంతే.. మూడో రోజు ఠపీమని పన్ను రాలి కింద పడింది.”

పరమార్ధకి తిక్క రేగింది.

“చూడు సత్యా! నీకు తెలియని విషయాలని అపహాస్యం చెయ్యకు. ప్రార్ధన, మంత్ర సాధన పవిత్రమైనవి.. సాధన.. అదేంటో నీకు తెలుసా? దాన్నే  ధ్యానం అంటారు. ఒకే మంత్రాన్ని దృష్టి అంతా కేద్రీకరించి పదేపదే ఉఛ్ఛరిస్తుంటే అపరిమితమైన శక్తి వస్తుంది. నమ్మగలవా?” కోపంగా అన్నాడు.

“హా.. ఎందుకు నమ్మలేను.. ఈ సిద్ధాంతాన్ని రాజ షాహిలో ఉండే తరితానంద స్వామి నిరూపించాడు. అక్కడి కాలేజ్ కుర్రాళ్లు ఆయన్ని రేడియో బాబా అని పిలిచే వాళ్లు. ఎందుకో తెలుసా.. ఆయన జుట్టుని రెండు కుచ్చులుగా పైకి లేపేవాడు. ఒకటి ధన విద్యుత్తుకు, ఇంకొకటి ఋణ విద్యుత్తుకి. ఆయన ఆకాశం నుంచీ, గాల్లోంచీ విద్యుత్ శక్తిని గ్రహించేవాడు. అతని శరీరం పద్ధెనిమిది అంగుళాల పొడవుగల మెరుపులు వెదజల్లేది. సిల్క్ శాలువా కప్పుకోకుండా ఆయన దగ్గరికి వెళ్లడం ఎవరికీ సాధ్యం అయ్యేది కాదు. వెళ్లారంటే షాక్కొట్టి ఢామ్మని కింద పడాల్సిందే.”

“కానే కాదు. నేనొప్పుకోను.. పచ్చి మిరపకాయలు, రంపం పొట్టు.. విద్యుత్ మెరుపులు.. ఇవేం కాదు. మన నితాయ్ దాదాకి అవేం పనికి రావు. నీకు ఎవరైనా నెమ్మదైన, మహిమగల సాధువు తెలుస్తే చెప్పు. మతం గురించి మామూలుగా మాట్లాడే వాళ్లు మనకి వద్దు. ఏమంటావ్ నితాయ్ దాదా?” నివారణ్ స్పష్టంగా, గట్టిగా చెప్పాడు.

“అలా అయితే అందరం గురుపాద బాబు ఇంటికి వెళ్దాం.. ఆయన ఊరవతల డమ్డమ్ లో ఉంటారు. అక్కడ విరించి బాబా ఉన్నాడు.” పరమార్థ ఉటంకించాడు.

“గురుపాద బాబూనా! ఆయన ఆలిపూర్లో వకీలు కదూ? మన ప్రొఫెసర్ నోని మామగారు. ఈ బాబాజీని ఎక్కడ పట్టుకున్నారు? సత్యా! నీ కేమైనా తెలుసా?”

“అవును.. నిజమే. వాళ్ల మామగారు ఒక సాధువుని కనిపెట్టారని నోనిదాదా అన్నాడు. చాలా మహిమ కలవాట్ట. భార్య పోయాక గురుపాద బాబు చాలా మారాడు. అంతకు ముందు ఇటువంటి సాధువుల్ని నమ్మేవాడు కాదు.”

“ఆయనికి ఒక పెళ్లికాని కూతురు ఉంది కదూ?”

“అవును. నోనిదా మరదలు. ఆమె పేరు బుచ్కి.”

“సర్సరే.. పరమార్థా! ఈ సాధువు ఎటువంటి వాడో చెప్పు..”

“అబ్బో! ఆయనొక అద్భుతం. కొంతమంది ఆయనకి ఐదు వేల సంవత్సరాలంటారు. మరికొందరు.. అబ్బే, ఐదు వందలే అంటారు. చూడ్డానికి మన నితాయ్ దా కంటే చిన్నగా ఉంటాడు. ఎవరైనా మీ వయసెంతని అడుగుతే, ఒక చిరునవ్వు నవ్వుతాడు. అసలు వయసనేది లేదంటాడు. కాలం, ప్రదేశం ఎక్కడైనా ఒకటే.. నిజం తెలుసుకున్నవాడు భూతకాలం నుంచి వర్తమానంకి, భవిష్యత్తుకి.. ముందుకి వెనక్కి వెళ్లగలడంటాడు. అతను ఈ భూమ్మీదైనా ఉండగలడు.. ఇష్టం వచ్చినట్లు వేరే లోకానికైనా వెళ్లగలడు. ఇవేళ నువ్వు ఇక్కడున్నావు కదా.. టైము, తేదీ గుర్తు పెట్టుకో.. విరించిబాబా నిన్ను అక్బర్ కాలంలోకి తీసుకెళ్లగలడు. కావాలంటే ఇంకా బిసి నాలుగో శతాబ్దంలోకి తీసుకెళ్లి అలనాటి పాటలీపుత్రం ఎలా ఉండేదో చూపించగలడు. ప్రతీదీ సాపేక్షం అనుకో..” పరమార్ధ వీర ఆవేశంతో రెచ్చిపోయాడు.

“అంటే ఐన్ స్టీన్‍్‍ని తోసిరాజన్నట్లేనా?” నివారణ్ సందేహం..

“హాహా.. ఐన్ స్టీన్నా? విరించిబాబా జెకోస్లోవేకియాలో ఉన్నప్పుడు, అప్పుడప్పుడు వచ్చి సలహాలడుగుతూ ఉండేవాడుట. అయితే ఏం లాభం.. సాపేక్ష సిద్ధాంతం మించి కనుక్కోలేకపోయాడు.”

నితాయ్ బాబు ఈ చర్చ అంతా కుతూహలంతో విన్నాడు.

“ఐన్స్టీన్ సిద్ధాంతం నాకు కొంచెం వివరించగలవా?”
“ఏముందీ.. ఐన్స్టీన్ ప్రకారం, కాలం, ప్రదేశం, జనం ఒకరి మీదొకరు ఆధారపడి ఉన్నారు. కాలం, చోటు మారితే.. జనం కూడా..”

“ఉండండి.. నేను అర్ధమయ్యేట్లు చెప్తాను.” సత్య ముందుకొచ్చాడు, “మీరు లావుగా, బరువుగా ఉన్నారనుకోండి.. ఇండియన్ అసోసియేషన్ కి వెళ్తే అక్కడ ఎనభై కిలోలుంటారు. అదే కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ కి వెళ్తే కొద్ది గ్రాములే ఉంటారు. ఉఫ్ అని ఊత్తే ఎగిరిపోతారన్నమాట.”

“నిజమే!” నివారణ్ ఒప్పుకున్నాడు. “అచ్చు మన వంటవాడిలాగే. రోజూ మార్కెట్ కి వెళ్లి రెండున్నర కిలోల బంగాళాదుంపలకి డబ్బులిస్తాడా.. మెస్ కొచ్చి చూస్తే అవి రెండు కిలోలు కూడా ఉండవు. మార్కెట్లో ఒక బరువు.. మెస్లో..”

నితాయ్ బాబుకి విసుగొచ్చింది. “ఈ సంగతి చెప్పు పరమార్ధా! విరించిబాబా, తను ముందుకీ వెనక్కీ వెళ్లగలడేమో కానీ.. అతన్నినమ్ముకున్న శిష్యులకి ఏమైనా ఉపయోగించాడా? గలడా?”

“తప్పకుండా.. ఆ శిష్యుడు ముఖ్యుడైతే.. ప్రముఖుడైతే! ఆ మధ్యని మెకిరామ్ అగ్గర్వాల్ అనే శిష్యుడికి ఎంత సాయం చేశాడో తెలుసా? అతన్ని యుద్ధానికి ముందు 1915వ సంవత్సరంలోకి తీసుకెళ్లాడు. అక్కడతను మూడు రోజులుండి, బాగా బేరం చేసి ఇనప దూలాలు కొన్నాడు. టన్ను ఆర్రూపాయల చొప్పున ఆరువేల టన్నులు ఇనుము. అక్కడ్నుంచి 1919 లోకి ఒక నెల తీసుకెళ్లాడు. మెకిరామ్ ఆ ఇనుముని టన్ను ఇరవై మూడు రూపాయలకి అమ్మేశాడు. అప్పుడు అతన్ని మళ్లీ వర్తమానానికి తీసుకొచ్చాడు. నికరంగా పదిహేను లక్షలు లాభం. నా మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా లెక్కేసుకోండి.”

నితాయ్ బాబు చటుక్కున పరమార్ధ చెయ్యి పట్టుకున్నాడు.
“పరమార్ధా.. నా ప్రాణ స్నేహితుడా.. తమ్ముడా.. నన్ను తక్షణం విరించి బాబా దగ్గరికి తీసుకెళ్లు.” గొంతు ఉద్వేగంతో రాచుకుపోతుంటే అన్నాడు, “మొత్తం ఖర్చంతా పెట్టుకుంటాను. నా దగ్గరున్న వన్నీ అమ్మేస్తాను. నా భార్యని తన బరువైన బంగారు గొలుసిమ్మని అడుక్కుని, అది తాకట్టు పెడ్తాను. ఒక వారం రోజులు 1914 లో గడప గలుగుతే.. నీ మేలెప్పటికీ మర్చిపోను. నీకు టెన్ పర్సంట్.. అహ.. కమీషన్ కాదు సుమా.. కృతజ్ఞత మాత్రమే. అయ్య బాబోయ్.. అంత ఇనుమే.. కలలో కూడా ఊహించలేం..”

నివారణ్, పరమార్ధ కేసి చూశాడు, “గురుపాద బాబు సంగతేమిటి? అతనికేమైనా డబ్బు దొరికిందా?”

“అతనికి డబ్బు మీద అస్సలు వ్యామోహం లేదు. పైగా తనకున ఆస్థి అంతా విరించిబాబాకి ఇచ్చేస్తాడని విన్నాను.”

“ఓహ్.. అంత దూరం వెళ్లిందా? సత్యా! ఈ విషయంలో మీ నోనిదా, అతని భార్యా ఏమీ చెయ్యలేరా?” నివారణ్, సత్య కేసి చూశాడు.

“ప్చ్.. మీకు నోనిదా సంగతి తెలుసు కదా! అతని ప్రపంచం అతనిది. తన ప్రయోగాలు తప్ప ఏమీ పట్టని సైంటిస్ట్. ఇంక అతని భార్య.. అమాయకురాలు. నోరు తెరిచి ఇది తప్పని చెప్పలేదు, ఎదిరించలేదు. ఏదైనా చెయ్యగలిగితే మీరు, నేనే చెయ్యాలి. అదీ.. ఏం చేసినా తొందరగా చెయ్యాలి..”

“అయితే తక్షణం నోనిని కలిసి అతనేం చెప్తాడో విందాం. తర్వాత డం డంకి వెళ్దాం.”

నితాయ్ బాబు కాగితం మీద ఏవో లెక్కలు వేస్తూ కూర్చున్నాడు. నివారణ్ మాటలు విని కళ్లు పైకెత్తి చూశాడు.

“డం డం? మీరు కూడా బాబాని చూడ్డానికి వస్తున్నారా? ఎందుకు? ఇంతమంది వెళ్లి కోరికలు కోరితే ఆయన తికమక పడచ్చు. సత్యా బ్రహ్మసమాజ వాది.. అతనికి భక్తి, గిక్తి లేదు. అతను అనవసరం.. నువ్వు మా హిందూ దేవుళ్లని మాకు వదిలి, నీ బ్రహ్మసమాజంకి వెళ్లు సత్యా! ఒక పని చేద్దాం. రేపు నేను, పరమార్ధా వెళ్తాం. నివారణ్ ఇంకొక సారి వెళ్లచ్చు.”

“ఏం భయపడద్దు నితాయ్ దా! మేం ఎవ్వరం కోరికలు కోరం. ఊరికే వేదాల గురించి, వేదాంతం మీద చర్చిస్తాం. అందరం తయారయితే, రేపు సాయంత్రం కలిసి వెళ్లచ్చు.” నివారణ్ అభయం ఇచ్చాడు.

…………….

బోలెడు డిగ్రీలున్నాయి కానీ, ప్రొఫెసర్ నోని ఎక్కడా ఎప్పుడూ ప్రొఫెసర్ పని చెయ్యలేదు. అతని సైన్స్ ప్రయోగాలన్నీ ఇంట్లోనే చేస్తుంటాడు. అందుకే దగ్గరివాళ్లు అందరూ అతన్ని ప్రొఫెసర్ అని పిలుస్తారు. పెద్దలిచ్చిన ఆస్థితో కాలి మీద కాలేసుకుని గడిపెయ్యచ్చు. భుక్తి కోసం పని చెయ్యవలసిన అవసరం లేదు.

అతను గురుపాద బాబుకి అల్లుడు. సత్యాకి దూరపు బంధువు, నివారణ్ సహాధ్యాయుడు.

సత్య, నివారణ్, మరునాడు పొద్దున్ననోని ఇంటికి వెళ్లే సరికి ఎనిమిదయింది. హాల్లో ఎవరూ లేరు. అయ్యగారు, అమ్మగారు పెరట్లో ఉన్నారని తలుపు తీసిన పనిమనిషి చెప్పింది. సత్య, నివారణ్‍లు పెరట్లోకి వెళ్లారు వెతుక్కుంటూ. అక్కడ ఒక మూల స్టౌ వెలుగుతూ ఉంది. దాని మీద ఒక పెద్ద డేగిసాలో ఆకుపచ్చని పదార్ధం నెమ్మదిగా ఉడుకుతోంది. నోని భార్య నిరుపమ దాన్ని ఒక గరిటతో కలుపుతోంది. పెరట్లోకి వెళ్లే ఒక సందులో హార్మోనియమ్ పెట్టి కనిపించింది. దాన్నుంచి మరుగుతున్న పదార్ధం లోకి ఒక రబ్బరు గొట్టంపాకుతోంది. దాని పక్కనే ధోవతి బెల్ట్ లోకి దోపి, ప్రొఫెసర్ నోని చేతులు కట్టుకుని నిలబడి తీక్షణంగా చూస్తున్నాడు.

“దీదీ! ఇంత తోటకూర ఎవరికోసం?” నివారణ్ అడిగాడు.

“అబ్బే,, ఇది తోటకూర కాదు. పచ్చ గడ్డి. మీ ఫ్రెండ్ కి అన్నీ వింత ఆలోచన్లు వస్తుంటాయని మీకు తెలుసు కదా!” నిరుపమ, నోని భార్య జవాబిచ్చింది.

“పచ్చగడ్డా? ఎందుకు పచ్చగడ్డి వండుతున్నావు? నోని ఈ మధ్యన పచ్చిది తినలేకపోతున్నాడా?”

“జోక్స్ వద్దు నివారణ్! ఈ ప్రయోగం ఫలిస్తే ప్రపంచంలో ఎక్కడా ఆహార కొరత ఉండదు.” నోని గంభీరంగా అన్నాడు.

“అదెలా.. ప్రపంచంలో అందరూ ఆకులలములు తిని ఉండలేరు కదా, ప్రొఫెసర్ నోని లాగ.. వాళ్లందర్నీ గడ్డి తినమంటే అంత సంతోషిస్తారనుకోను.”

“బ్రదర్! కనిపించట్లే.. అది గడ్డిలాగే ఉంటుందా? దీన్ని ప్రోటీన్ సింథసిస్ అంటారు. ఈ గడ్డి జలీకరణం చెంది కార్బోహైడ్రే్ట్ అవుతుంది. నాక్కావసిందల్లా రెండు అమినో గ్రూపులు. హెక్సాహైడ్రాక్సీడైఅమినో..”

“చాల్చాలు. ఇంతకీ హార్మోనియమ్ ఎందుకుట?”

“ఆమాత్రం తెలీదా.. అది ఉడుకుతున్న ఆ గడ్డి మొత్తాన్నీ ఆక్సిడైజ్ చేస్తుంది. నీరూ.. వాయించు.”

నిరుపమ డేగిసాని వదిలేసి హార్మొనీ వాయించడం మొదలుపెట్టింది. చెవులకింపైన సరిగమల బదులు, రబ్బరు గొట్టంలోంచి గాలి వెళ్లి డేగిసాలో బుడగలు వచ్చి, వింత వింత ధ్వనులు రావడం మొదలుపెట్టాయి.

“బుడగలా.. ఇదేనా నువ్వు సృష్టించేదీ! చక్కని సంగీతం ఆ గొట్టంలోంచి వెళ్లి, గడ్డితో మిళితమైపోయి అద్భుతమైన ఆకుపచ్చ,స్వర్గ స్వర సమ్మేళనం   వస్తుందేమో అనుకున్నానింకా. పోన్లే కానీ, దీదీ! మీ నాన్నగారు ఎలా ఉన్నారో అడుగుదామని వచ్చాను. ఎలా ఉన్నారు?” నివారణ్ కించిత్ నిరాశతో గడ్డిని చూస్తూ అన్నాడు.

“ఏం చెప్పమంటారు.. అమ్మ పోయాక పూర్తిగా మారిపోయారు. గణేశ్ మామా ఈ సాధువుని తీసుకొచ్చారు.. ఇంక పగలు, రాత్రి ఆయనతోనే. ఇంకేపనీ లేదు. ఎంతో చెప్దామని చూశాను.. ఏడ్చాను కూడా. ఏదీ పని చెయ్యలేదు. ఇప్పుడు ఆయన ఆస్థి అంతా ఆ గురువుకే ఇచ్చేస్తారుట. నా బాధల్లా మా చెల్లెలు బుచ్కీ గురించే. కొన్నాళ్లు వెళ్లి తనకి తోడుగా ఉందామంటే.. ప్చ్.. ఇక్కడ మా అత్తగారికి బాగాలేదు.” విచారంగా అంది నిరుపమ.

“నోనిదా! మీ మామగారితో మాట్లాడి అతనికి కాస్త తెలిసేట్లు నచ్చ చెప్పచ్చు కదా!” సత్య అన్నాడు.

“లేదు సర్! కల్లో కూడా ఆస్థి గురించి అతనితో మాట్లాడలేను. నేనేదో అతని డబ్బు మీద కన్నేశానని అనుకుంటారు.”

“అలా ఐతే ఆ గురువు సంగతేదో మేం తేలుస్తాం, నీ కిష్టమైతే..”

“వద్దు వద్దు.” నిరుపమ గాభరాగా అంది. “మీరు రౌడీతనం చెయ్యద్దు.. దాని వల్ల మా పాపా ఇబ్బందిలో పడ్తారు. ఎవర్నీ బాధపెట్టకుండా, అతనికి మాట రాకుండా ఏమైనా చెయ్యగలిగితే..”

“అది కొంచెం కష్టమే.. అది సరే.. అసలీ విరించి బాబా ఎవరో.. డం డంలో మీ ఇంట్లో ఏం జరుగుతోందో కొంచెం చెప్పు.”

……………………

“ఇది ఒక నెల క్రితం మొదలయింది. విరించిబాబా, అతని శిష్యుడు..చిన్న మహారాజ కేవలానంద్ తో కలిసి, డం డం వచ్చాడు. గణేష్ మామా వాళ్లిద్దర్నీ చూసుకుంటున్నాడు. మా పాపా తన ఇల్లు వదిలి ఎక్కడికీ వెళ్లనంటాడు. రోజూ.. మూడు వందలమంది తక్కువ కాకుండా విరించిబాబా చెప్పే చోద్యాలు, విచిత్రాలు వినడానికి వస్తుంటారు. ప్రతీ ఆదివారం హోమం చేసి, ప్రత్యేక పూజ చేస్తాడతను. ఆహోమం లోనుంచి ఒక దేముడొస్తాడు.. రాముడు, కృష్ణుడు, శ్రీ చైతన్య.. జీసస్ కూడా.. ఆ గదిలోకి అందర్నీ రానియ్యరు. శిష్యగణంలో మొదటి వరుస వాళ్లో. ప్రత్యేకమైన అనుమతి ఉన్నవాళ్లో తప్ప. ఆరోజు బ్రహ్మదేవ్ వచ్చినప్పుడు నన్ను మాత్రం ఉండనిచ్చారు.”

“ఏం కనిపించింది?”

“అంత సరిగ్గా జ్ఞాపకం లేదు. చీకటిగా ఉంది. స్పష్టంగా కనిపించలేదు. హోమం వెనుక ఉన్నట్లుండి.. పెద్ద ఆకారం, నాలుగు తలలు, పెద్ద గడ్డంతో ప్రత్యక్ష్యమయింది. కొంచెం సేపు చూడగానే కళ్లు తిరిగి పడిపోయాను. నా కంటే బుచ్కికి ధైర్యం ఎక్కువ.. అయినా అది ఎప్పుడూ చూస్తుంటుంది కదా! రేపు మహాదేవుడు వస్తాడుట.”

“నిజంగానా.. అయితే కచ్చితంగా రేపు వెళ్లి విరించిబాబాని కలిసి ఆరాధించాల్సిందే. ఆయనకి దయ కలిగితే, మనం మహదేవుడ్ని కూడా కలవచ్చు.” నివారణ్ ఉత్సాహంగా అన్నాడు.

“మీరు గణేష్ మామాని కాకా పట్టాలి. అతని అనుమతి లేకుండా ఎవరూ..”

“ఆసంగతి మేం చూసుకుంటాం. కానీ నీ గురించే నాక్కొంచెం అనుమానం సత్యా! నవ్వడం మొదలు పెట్టి అంతా పాడు చేస్తావేమో అని..”

సత్య తల, కాళ్లు, చేతులూ అన్నీ అడ్డంగా ఊపుతూ అన్నాడు, “నేనా! నవ్వడమా? నీ లైఫ్లో జరగదు. ఎవరు నవ్వేది.. ఏ వెధవతత్తు కొ.. ఓహ్. సారీ..”

“ఏంటి సత్యా! ఏ మయింది? ఏమంటున్నావు?”

“ఓహ్.. క్షమించు దీదీ.. ఆ మాట నేను అనకూడదు. నయం.. అత్తమ్మ ఇక్కడ లేదు. ఉంటే నా తోలు తీసి ఎండబెట్టేది.”

………………..

“సరే.. ఇంక మేం బయల్దేరతాం. అన్నట్లు మర్చిపోయాను.. దట్టమైన పొగ ఎలా సృష్టించగలమో ఎవరైనా చెప్పగలరా?” నివారణ్ అడిగాడు.

“పొగా?” నోని ముందుకొచ్చాడు. “ఎటువంటి పొగ? నీకు ఎర్రటి పొగ కావాలంటే కాపర్ మీద నైట్రిక్ యాసిడ్ పొయ్యి. వయొలెట్ కావాలంటే అయోడిన్ వేపర్.. ఆకుపచ్చ కావాలంటే బోరేట్ మంట పెట్టు. నీలం కావాలంటే కోబాల్ట్ సాల్ట్..”

“అబ్బెబ్బే.. అవేం వద్దు. నాక్కావలిందల్లా మామూలు సాధా…రణ, దట్టమైన పొగ.”

“అలా అయితే.. ఆర్గానిక్ కాంపౌండ్ కావాలి. ట్రై నైట్రో డై మీథైల్..”

నివారణ్ చెవులు మూసుకున్నాడు. “రామ రామా.. ఇతను మళ్లీ ఎక్కడికో వెళ్లిపోయాడు. దీదీ! ఈ మానవుడితో జీవితమంతా ఎలా వేగుతున్నావు?” నిరుపమ పకపకా నవ్వింది.

“మా బాబాయికి ఆవులున్నాయి. పనివాళ్లు వాటి పాకల్లో తడి గడ్డిని అంటించినప్పుడు ఉక్కిరిబిక్కిరయ్యే పొగ వచ్చేది.”

“యురేకా.. దీదీ! నోబెల్ ప్రైజంటూ వస్తే నీకే వస్తుంది. ఇక్కడున్న నోనీ ఎక్కడికీ వెళ్లలేడు.” నివారణ్ ఆనందంగా అరిచాడు.

“ఇంతకీ పొగ దేనికి” నిరుపమ సందేహం.

“ఎక్కడ పడితే అక్కడ చీడ పురుగులు తయారయి నానా భీభత్సం చేస్తున్నాయి. వాటిల్ని వదుల్చుకొనగలమేమో చూద్దామని.”

………………………..

డం డంలో గురుపాద బాబు ఇల్లు ఒకప్పుడు కళకళ్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఎవరూ పట్టించుకోనట్లు వేళాయ మొహం వే్సింది. ఆయన భార్య చనిపోయాక, దాని జోలికి ఎవరూ పోయినట్లు లేదు. ఈ మధ్యన కొంత భాగం బాగులు చేయించారు.. విరించి బాబా కోసం. అయినా పూర్వ వైభోగం కొంచెం కూడా రాలేదు.

గురుపాద బాబుకి ఆ ఇంటి కోసం ఏమైనా చెయ్యాలనే ఆలోచనే రానట్లుంది. ఆయన బావమరిది గణేష్ ఇంటి యజమానిలా వ్యవహరిస్తున్నాడు.

నివారణ్, సత్య, నితాయ్ బాబు, పరమార్ధ.. నలుగురూ మరునాడు సాయంత్రం ఐదు గంటలకి డండంలో ఆ ఇంటికి చేరారు. కింది అంతస్థులోని ఒక హాలు మగవారి కోసం కేటాయించారు. హాల్లో నేలమీద ఒక తివాచీ, మూలగా ఒక దివాన్ ఉన్నాయి. దివాన్ మీద ఒక పరుపు, దాని మీద పులి బొమ్మ ఉన్న ఒక దుప్పటి వేశారు. స్త్రీలని పక్క గదిలోకి తీసుకెళ్తున్నారు.

విరించిబాబా ఇంకా భక్తుల దర్శనానికి రాలేదు. ఈ లోగా ఆయన శిష్యులు ఆతృతగా వేచి చూస్తూ, బాబా మహత్తుని, అద్భుతాలనీ చర్చిస్తున్నారు.

ఒక మధ్యవస్కుడైన పెద్దమనిషి, సూటూ బూటూ వేసుకుని, నేల మీద మఠం వేసుకుని కూర్చోడానికి ప్రయత్నిస్తున్నాడు. అదేమంత సులభ సాధ్యమయిన పని కాదు. అయినా అసౌకర్యంగానే కూర్చున్నాడు మొత్తానికి. ఆయనే ఓ.కె సేన్.. పేరు పొందిన వకీలు. ఈ మధ్యన బొగ్గు బ్యాపారంలో బోలెడు డబ్బు పోగొట్టుకుని, సౌకర్యం కోసం మతం వైపుకి దృష్టి సారించాడు.

నివారణ్, సత్య తమతో వచ్చిన వాళ్లని ప్రేక్షకుల మధ్యలో మంచి చోటు చూసి కూర్చోపెట్టి, బైటికి వెళ్లారు. తోటంతా తిరిగి, ఇంటి ముందు గేటు దగ్గరికి వచ్చారు. అక్కడ రేకులతో కప్పిన కొన్నిగదులున్నాయి. అందులో గురుపాద బాబు గుర్రబ్బండి నడిపే్వాడు, తోటమాలి, కాపలావాడు ఉంటారు. గుర్రపు శాల అక్కడికి దగ్గర్లోనే ఉంది.

గుర్రాలశాల పక్కనున్న విరిగిపోయిన బెంచీ మీద కూర్చుని ”మౌళవి బచ్చిరుద్ది” అనే అతను, జ్యోతి మియా (బండివాడు), ఫేకు పాండే (చౌకీదారు) లతో కబుర్లు చెప్తున్నాడు.

మౌళవి సాబ్ ఫరిద్ పూర్ నుంచి వచ్చాడు. గురుపాద బాబు దగ్గర పని చేసే గుమాస్తాల్లో ఒకడు. ఇప్పుడు గురుపాద బాబు లాయర్ పని చెయ్యకపోవడంతో అతని జీతం తగ్గి పోయింది. అయినా నెల నెలా జీతం ఇస్తున్నాడు గురుపాద బాబు. అందుకని మధ్య మధ్యలో వచ్చి తన యజమాని యోగక్షేమాలు విచారిస్తుంటాడు, కృతజ్ఞతతో.

నివారణ్, సత్య రంగంలోకి ప్రవేశించేటప్పటికి, మౌళవి సాబ్ ప్రపంచాన్ని బాధిస్తున్న దురదృష్టాన్ని వివరిస్తుంటే, అతని శ్రోతలు తలలూపుతున్నారు. సుదూరంగా ఒక పనివాడు గుర్రానికి చక్కని మాలీసు ఇస్తున్నాడు. అది కదిలినప్పుడల్లా “ఇడియట్.. కదలకు..” అని గదమాయిస్తూ డొక్కమీద ఒక్కటిస్తున్నాడు.

తోటలో ఒక పిల్లి గడ్డి తింటూ ఆపసోపాలు పడుతోంది. అనుమానం లేదు.. విరించిబాబా భోజనం చేసిన పళ్లెంలో మిగిలిన చేపలు తిని, తినీ దానికి అజీర్తి చేసుంటుంది.

“సలాం మౌళవి సాబ్! కులాసానా? పాండేజీ, నమస్తే. జ్యోతి మియా! ఎలా ఉన్నావు? ఇతను నివారణ్ సాబ్ అని మీ యజమాని అల్లుడి స్నేహితుడు. మీకందరికీ బహుమతులు తీసుకొచ్చాడు. దుర్గాపూజ దగ్గరకొస్తోందిగా మరీ! మీకు అభ్యంతరం లేకపోతే.. మౌళవిజీ! మీకు పది రూపాయలు, పాండేజీకి, బండి తోలే జ్యోతిమియాకి చెరో ఐదు, మాలికీ, గుర్రాల్ని చూసే అతనికీ కలిపి ఐదు రూపాలు.”

బచ్చిరుద్ది, పాండే, జ్యోతి మియా కృతజ్ఞతతో పెదవులు సాగదీసి నవ్వుతూ, అల్లావీ, కాళీమాతవీ అనుగ్రహాలు ఇద్దరు బాబులకీ లభించాలని ప్రార్ధించారు.

“బాబూజీ! మంచిరోజులు వెళ్లిఫొయాయి. ఠాకూరాణీ అమ్మ స్వర్గానికి వెళ్లినప్పట్నుంచీ మన బాబూజీకి జీవితం మీద ఇఛ్చ నశించింది. ఎన్నో సార్లు ఆయన ప్రాక్టీసు మానవద్దని చెప్పి చూశాను. కానీ ఆయన వినట్లేదు. ఇప్పుడు అల్లా ఒక్కడే ఆయన్ని రక్షించగలరు.” మౌళవి విచారంగా అన్నాడు.

“ఇదంతా ఆ బాబాజీ వల్లనే. ఈ కష్టాలన్నింటికీ కారణం ఆయనే.” నివారణ్ విచారంగా అన్నాడు.

ఇది విన్నాక ఫెకు పాండేకి ధైర్యం వచ్చింది.

“ఆ బాబాజీ నిజం స్వామీజీ కాదు. మొదట్లో అతను బ్రాహ్మలు వేసుకునే జంధ్యం వేసుకోలేదు. సాధువులకుండే పొడవాటి జడల్లేవు. చేపలు, గొర్రెమాంసం కూడా తినే వాడు. రోజూ పొద్దున్నా సాయంత్రం టీ, బిస్కట్లు ఉండాల్సిందే. ఈ బెంగాలీ బాబాజీలందరూ నకిలీలే! ఇంక ఆ చిన్న మహారాజు.. అదే.. విరించిబాబా ముఖ్య శిష్యుడు.. ఆయనగారి సంగతి సరేసరి. ఆయనే ఏదో దేవుడి అవతారం అనుకుంటాడు. ఎందుకూ.. అతను నాతోనే పెట్టుకున్నాడు.” ఫెకూ ప్రకటించాడు. “నేను కత్తి ఝుళిపించగలనని, సిపాయీల తిరుగుబాటులో యుద్ధం చేశానని ఆయనగారికి తెలియదనుకుంటా!” ఫెకూ చెప్తుంటే సత్య అడ్డగించాడు..

“సిపాయీల తిరుగుబాటు నువ్వు పుట్టకముందు కదా..”

“అదే.. అది వరకు జన్మలో.. ఎందుకు? మా మాస్టర్ని ఒక్క మాట చెప్పమనండి.. కర్ర పట్టుకుని ఒక్కటిచ్చానంటే బాబాలు వాళ్లు పుట్టినూరికి పరుగెత్తాల్సిందే! బాడీల్లో బొక్కలొక్కటి కూడా మిగలకుండా చేసేస్తా..” ఫెకూ ఊగిపోయాడు ఆవేశంతో!

మౌళవి బషీరుద్ది కూడా చాలా అవమానాలని ఎదుర్కోవలసి వస్తోంది. గణేష్ మామాబాబు అధికారాన్ని అతను సహించలేకపోతున్నాడు. బచ్చీరుద్ది అంటే సామాన్యుడేం కాదు. అతనిలో మొఘల్ రక్తం ప్రవహిస్తోంది. అందరూ అతన్ని బచ్చీరుద్ది అని పిలుస్తుండచ్చు గాక.. కానీ అతని అసలు పేరు మ్రెదమ్ ఖాన్. అతని తండ్రి జహన్బజ్ ఖాన్, తాత అబ్దుల్ జబ్బర్. వాళ్లేం ఫరిద్ పూర్ నుంచి రాలేదు.. అరబ్బు దేశం నుంచి.. మళ్లీ మాట్లాడ్తే టర్కీ నుంచి వచ్చారు. అక్కడంతా లుంగీలు ధరించి, ఉర్దు మాట్లాడుతారు. ఉద్యోగం కోసం.. పొట్టకూటికీ అతను బెంగాలీ నేర్చుకోవలసి వచ్చింది. అరబ్ దేశం మధ్యలో ఇస్తాంబుల్ ఉంది. ఎడం పక్కన బాగ్దాద్ నగరం ఉంది. బాగ్దాద్ తో పోలుస్తే ఈ కలకత్తానగరం ఎందుకూ పనికిరాదు.

మక్కా-షరీఫ్ బాగ్దాద్ కి చాలా దగ్గర. అతని వద్ద మక్కానుంచి తెచ్చిన పవిత్ర జలం.. ఆబ్-ఎ-జమ్ జమ్ కూడా ఉంది. మౌళవికి కనుక అడ్డు లేకపోతే..ఆ పవిత్రజలం ఇద్దరు బాబాజీల మీద చల్లాడంటే చాలు.. మామాబాబు మీద కూడా.. అందరూ నరకానికి ప్రయాణం అవాల్సిందే!

“చూడు మౌళవి సాబ్! మేం ఆ ఇద్దరు బాబాజీల వదిలించాలనే నిశ్చయంతోనే వచ్చాం. వీలయితే ఈ రోజే. కానీ మా అంతట మేమేం చెయ్యలేం. మాకు మీ సహాయం కావాలి. పాండేజీది కూడా.” నివారణ్ అన్నాడు వాళ్లందరినీ చూస్తూ.

“వాళ్లని పచ్చడి చేసెయ్యమంటారా?” ఫెకు ఆశగా అడిగాడు.

“అబ్బెబ్బే.. అదేం వద్దు. ఎక్కడా హింస, దౌర్జన్యం ఉండదు. మీరు చెయ్యాల్సిందల్లా గట్టిగా అరవడం, గొడవ చెయ్యడం. చెయ్యగలరా?”

“దాందేముంది? భయమేం లేదు. కానీ సాబ్కి కోపం వస్తే..”

“గురుపాదబాబు మిమ్మల్నేం అనకుండా చూసే పూచీ నాదీ! కొంచెం సేపయాక వచ్చి మీరేం చెయ్యాలో చెప్తాను.” నివారణ్ అభయం ఇచ్చాడు. అందరి మొహాల్లోనూ చిరునవ్వు కనిపించింది అప్పుడు.

నివారణ్, సత్య వీడ్కోలు చెప్పి, అక్కడ్నుంచి హాల్లోకి వెళ్లారు. దార్లో వారికి గణేష్ మామ తగిలాడు. గణేష్, హడావుడిగా వేరే గదిలో జరగబోయే హోమంకి ఏర్పాట్లు చెయ్యడంలో మునిగి తేల్తున్నాడు.

నివారణ్ని, సత్యని చూసి ఆశ్చర్యపోయాడు.

“హే.. హే! మీరు కూడా ఇక్కడ.. వెరీ గుడ్. వెరీ గుడ్! మీ ఇళ్లల్లో అంతా కులాసానా? హే హే.. నివారణ్! మీ నాన్నగారు ఇప్పుడు బాగున్నారా? మీ అమ్మగారు, చెల్లెలు.. సత్యా! మీ అత్తమ్మ, మిగిలిన అందరూ..?”

“ఓహ్.. అవును.” నివారణ్ తొందరగా జవాబిచ్చాడు. “అతని కుటుంబంలో అందరూ హెహే. సత్యా ఇంట్లో కూడా హేహే. అంతా మామాబాబు ఆశీర్వాదాలే!”

గణేష్ మామా సంతోషంతో గట్టిగా శబ్దం చేస్తూ నిట్టూర్చాడు.. మరి వాళ్ల కుటుంబాల గురించి చింతతో అతనికి రాత్రిళ్లు నిద్ర కూడా పట్టట్లేదేమో అన్నట్లు.

“మామా! మీ చిన్న అల్లుడికి ఉద్యోగం దొరికిందా? లేక పోతే సెలవులయ్యాక నన్ను కలవమను. మా ఆఫీసులో ఖాళీ వచ్చేట్లుంది.” సత్య, వాళ్ల అల్లుడికి ఉద్యోగం వేయించడమే తన ధ్యేయం అన్నట్లు అడిగాడు.

“నిజంగానా అబ్బాయ్! థాంక్ యు.. థాంక్యు..  నువ్వే నా స్వంత మనిషివి. నువ్వు కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? మీ ఆఫీసు తెరవగానే అతను తప్పకుండా నిన్ను కలుస్తాడు.”

“మామాబాబూ!” నివారణ్ మధ్యలో అడ్డుకున్నాడు, “నాదో చిన్న విన్నపం. నాకు దేవుడి ప్రత్యేక దర్శనం ఇప్పిస్తారా?”

“దాందేముంది.. అదేం పెద్ద సమస్య కాదు. హాల్లోకి వెళ్తే ప్రతీ ఒక్కరికీ..”

“అబ్బెబ్బే.. అది కాదు నాక్కావలసింది. అదే.. సులువుగా చూసే దేముడ్ని కాదు.. ఆ చిన్న గదిలో మీరు వెలిగించే హోమంలో కనిపించే దేముడు.”

గణేశ్ మామా అదేదో భయంకరమైన విషయం అన్నట్లు గాఢంగా నిట్టూర్చాడు.

“అబ్బే.. అదెలా కుదురుతుంది?”కొంచెం సేపు ఆలోచించి అన్నాడు, “అది ప్రత్యేకమైన హక్కు. దాన్ని కష్టపడి సంపాదించుకోవాలి. ఇష్టమొచ్చినట్లు అందర్నీ.. పైగా.. ఈ సత్యా మరి..”

“నాకు తెలుసు, బ్రహ్మో! కానీ అతను పూర్తిగా బ్రహ్మసమాజ వాది కాదు. చూడండి.. అతను ఇంకా హిందూగానే ఉన్నాడు. అంటే పూర్తిగా కాదు, కానీ గీత నించి అప్పుడప్పుడు శ్లోకాలు చెప్తుంటాడు. సభలకి వెళ్తాడు, హిందూ పండగలకి వెళ్తాడు. మీరు మాఇద్దరికంటే చాలా పెద్ద. మీముందు పొగడకూడదు కానీ.. సత్యకి వేదాల గురించి మంచి పరిజ్ఞానం ఉంది. కావాలంటే ఎవరైనా పండితులతో సవాలు..” నివారణ్ మాట సగంలో ఉండగానే అందుకున్నాడు గణేశ్ మామా,

“అది కాదు. అతనికి చాలా విషయాలు తెలిసుండచ్చు. కానీ హిందూ సమాజం నుంచి ఒకసారి బైటికి వెళ్ళిపోయాక వెనక్కి రావడానికి కుదరదు. ఇంక నువ్వు.. తినకూడనివి తింటావనీ, తాగ కూడనివి తాగుతావనీ విన్నాను.”

“అది అందరూ చేస్తారు మామా.. అంతా టైమ్ ని బట్టి ఉంటుంది. గురుపాద బాబు కూడా అలాగే చేశాడు, కావాలంటే అడగండి. పోన్లెండి.. మీరు మమ్మల్ని నిరాశ పరచడాఅనికే నిశ్చయించుకుంటే, మేం వెళ్లొస్తాం. సత్యా దా..”

“సరే అయితే.. మామాబాబూ! నమస్కారం. మర్చిపోయా.. ఇంకో సంగతి చెప్పాలి.. మీ అల్లుడ్ని టైప్ రైటింగ్ నేర్చుకోమని చెప్పండి. నాలుగైదు నెలలు ప్రాక్టీస్ చెయ్యమనండి. అస్సలు అనుభవం లేకపోతే అతని బాస్కి నచ్చక పోవచ్చు. నాకు ఎంత ఇబ్బందో ఆలోచించండి. ఒకవేళ మళ్లీ భవిష్యత్తులో ఖాళీ ఏర్పడితే చూద్దాం..”

“అయ్యయ్యో.. అలా అనద్దు.” గణేశ్ మామా ఆందోళనగా అన్నాడు, ” ప్రతీ రోజూ ఖాళీలు వస్తాయా ఏమిటి? రావు కదా! అబ్బాయ్ సత్యా, నువ్వు ఈ ఉద్యోగం అల్లుడికి ఇప్పించే తీరాలి. ష్.. అయితే నువ్వు భగవద్గీత చదువుతావన్నమాట. అయితే లోపలికెళ్లడానికి నీకు ఫరవాలేదనుకుంటా. నీ నెత్తి మీద కొంచెం గంగనీళ్లు చల్లుకో. యస్.. యస్.. మీరిద్దరూ వెళ్లచ్చు. కానీ ఆ ఉద్యోగం మాట మర్చిపోవద్దు.”

“ఇప్పటి వరకు అనుకున్నట్లుగానే నడిచింది. చివరి నిముషంలో ఏ గడబిడా జరగదనే ఆశిద్దాం. మీ స్నేహితులు, అముల్య, హబ్లా ఇక్కడున్నారా?” నివారణ్, గణేష్ మామా దూరం వెళ్లే వరకూఆగి సత్యతో అన్నాడు.

“అవును నివారణ్దా! పెద్ద హాల్లో కూర్చున్నారు. సరయిన సమయం వచ్చినప్పుడు వచ్చేస్తారు.. ఏం భయం లేదు. నిజం చెప్పండి.. గణేష్ మామాకి ఇక్కడ దొరికే దాంట్లో భాగం ఉంటుందని మీరు అనుకుంటున్నారా?”

“దేవుడికి తెలుసు. నేను చెప్పగలిగిందల్లా ఒక్కటే.. గురుపాదబాబు తన డబ్బు ఖర్చుపెట్టడంలో, ఇల్లు నడపడంలో ఉదాసీనంగా ఉన్నన్నాళ్లూ గణేష్ మామా అన్నింట్లో వేలు పెట్టగలడు.. అతని ఆటలు సాగుతాయి.”

…………………………………

మొత్తానికి ఎలాగైతేనేం విరించి బాబా హాల్లోకి వచ్చి వేదికనలంకరించాడు. ఆరడుగుల పొడుగు, తెల్లని తెలుపు.. ఆకర్షణీయంగా ఉన్నాడు. గడ్డం అదీ గీసుకున్నాడేమో.. మొహం మెరిసిపోతోంది. అతని లావుపాటి బుగ్గలమీదుగా రెండు కళ్లు మిల మిలా మెరుస్తున్నాయి. వెడల్పాటి ముక్కు సొమొసా ఆకారంలో ఉండి దాని కింద దట్టమైన పెదవులు నవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ పెదవుల కింద పొరలు పొరలుగా గడ్డం ఉంది. అతనయితే జన్మలో ఉపవాసం జోలికి పోయినట్లు లేదు.. ఇంకా చెప్పాలంటే రోజుకి ఆరు సార్లయినా ఆహారం కొట్టేస్తుండచ్చు.

అచ్చమైన మతగురువులాగ.. కాషాయ వస్త్రాలు ధరించాడు. నెత్తికి టోపీ కూడా అదే రంగు బట్టతో చేశారు. టోపీకున్న అంచులు చెవుల్ని కప్పేస్తున్నాయి. ఆయన ఐదువేల సంవత్సరాల వయసు వాడిలాగ అనిపించడం లేదు. మహా ఐతే యాభైఐదుంటాయి.. ఐదువేలో ఐదువందలో కానే కాదు.

వేదిక కింద కుడి పక్కన అతని ప్రధాన శిష్యుడు కేవలానంద కూర్చున్నాడు. భక్తులు అతను ఏ శతాబ్దం నాటివాడో నిర్ణయించలేదు కానీ.. బలంగా, యవ్వనంలో ఉన్నాడు. అతను కూడా కాషాయం ధరించాడు కానీ, బట్ట మాత్రం తక్కువరకం గా కనిపిస్తోంది.

ఎడం పక్కన గురుపాద బాబు కూర్చున్నాడు.. కుర్చీలో కిందికి జారి, తల వెనక్కి ఆనించి. అతను చాలా సన్నగా అయిపోయాడు. కళ్లు మూసుకుని ఉన్నాయి. నిద్రపోతున్నాడో, మెలకువగా ఉన్నాడో చెప్పడం కష్టమే!

పక్క గదిలో ఎర్ర చీర కట్టుకున్న పద్ధెనిమిదేళ్ల అమ్మాయి, ఆడవాళ్లతో ముందు వరుసలో కూర్చుని, తెరచి ఉన్న తలుపులో నుంచి మధ్య మధ్యలో గురుపాద బాబుకేసి విచారంగా చూస్తోంది. ఆమె పొడవాటి జుట్టుని విరబోసుకుని ఉంది. ఆమే గురుపాదబాబు చిన్నకూతురు బుచ్కీ.

హాల్లో ఉన్న వారిలో కొంతమంది సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. మిగిలిన వాళ్లు చేతులు జోడించి కూర్చుని, పాదాలు తాము కట్టుకున్న వస్త్రాలతో కప్పుకుని ఉన్నారు. అందరూ విరించిబాబా నోటి వెంట వచ్చే జ్ఞానామృతధారలని గ్రోలడానికి తయారుగా ఉన్నారు.

సత్య గౌరవ పూర్వకంగా తల నేల కానించి లేచి ప్రేక్షకులలో తన స్థానంలో కూర్చున్నాడు.

అయితే నివారణ్ మాత్రం కేవలానంద్ అడ్డుపడుతున్నా వినకుండా ముందుకి దూసుకెళ్లి బాబా కాళ్లని దొరకపుచ్చుకున్నాడు. విరించి బాబా స్నేహపూర్వకంగా నవ్వాడు.

“నిన్ను ఎక్కడో చూసినట్లుందే?”

“మీ ఈ భృత్యుడి పేరు నివారణ్ బాబా!”

“అవునా! అంటే ఇప్పుడు నిన్నందరూ అలాగే పిలుస్తున్నారా? ఇంతకుముందు నిన్నెక్కడ చూశానబ్బా! నేపాల్? కాదు.. ముర్షిదాబాద్లో అనుకుంటా. నీకు జ్ఞాపకం లేదు.. నాలు తెలుసు. మనం జగత్ సేత్ పాలస్లో, వాళ్లమ్మగారు కాలంచేశాక, కర్మకాండలన్నీ అయ్యాక కలుసుకున్నాం. జగత్ సేత్ అందరికీ విందు ఏర్పాటు చేశాడు. అక్కడ రాజా కిష్ణ చంద్ర, రాయ్ నారాయణ్ జానకి ప్రసాద్, నవాబ్ గారి సైన్యాధికారి ఖాన్ ఖనన్ ముహబ్బత్ జంగ్.. ఇంకా సుతానుతి అమీర్చంద్, అతన్ని చరిత్ర కారులు ఉమిచంద్ అంటారులే.. నువ్వు సేత్ గారి కోశాధికారివి. నీ పేరు.. ఉండుండు.. మోతిరామ్. హా! ఇప్పుడు తెలిసింది. చాలా మంచి భోజనం. సేత్జీ ఖర్చుకి వెనుకాడ లేదు. కానీ అందరూ ఒక్కలా అనుకోరు కదా! సుతానుతి బాబులు మాత్రం వాళ్లకి వేసిన మిఠాయిలు మిగిలిన అందరికన్నా తక్కువని గోల చేశారు. చెడ్డ చెడ్డ మాటలని మధ్యలో లేచి పోయారు. ఇంకేం మరీ.. మోతి రాం.. అదే.. నివారణ్ బాబూ! ధూర్జటి మంత్రాన్ని పఠించు. నీకు చాలా మంచిది. రోజూ పొద్దున్నే.. కళ్లు తెరవగానే జపం చెయ్యాలి. ఏమె లేదు.. “ధూర్జటి.. ధూర్జటి..” అంటూ నూట ఎనిమిది సార్లు జపం చెయ్యాలి. సరేనా! ఇంక వెళ్లి కూర్చో!”

నివారణ్ పెల్లుబికిన భక్తితో మళ్లీ బాబా గారి కాళ్లు తాకాడు.. వాటి మీద ఉన్న మట్టి అంతా పోయేలా తుడిచినట్లు చేశాడు. ఆ తరువాత తన చేతుల్ని నాకడానికి ప్రయత్నం చేశాడు.. ఆ దుమ్ము, మట్టి.. అంతా పవిత్రమైనవి. మరి బాబా గారి పాదాల నుంచి వచ్చాయి కదా.. అందరి కేసీ ఒక్క సారి చూసి.. వెళ్లి సత్య పక్కన కూర్చున్నాడు.

“ఎంత అన్యాయమో చూశావా?” అప్పటి వరకు జరిగినదంతా చూసిన నితాయ్ బాబు ఉడికిపోయి, పరమార్థతో అన్నాడు. “వచ్చిన నిముషంలోనే నివారణ్, బాబా కంట్లో పడ్డాడు. నేనేమో ఇక్కడ గంట పైగా కూర్చుని ఉన్నాను. అంతా నా అదృష్టం.. చూడు.. నేను కూడా వీలు చిక్కిన వెంటనే బాబా కాళ్లు పట్టుకుని లాగకపోతే! అప్పుడేం జరుగుతుందో చూద్దాం.”

సాష్టాంగ పడిన వారిలో ఒక లావుపాటి పెద్దాయన ఉన్నాడు. ఆయన సన్నని జరీ అంచున్న మేలి రకం నూలు పంచె కట్టుకున్నాడు. అతని లాల్చీ కూడా ఖరీదైన నూలుదే. అందులోంచి బంగారు గొలుసు మెరుస్తూ కనిపిస్తోంది. అతను చుట్టుపక్కల పేరున్న వ్యాపారి. పేరు గోవర్ధన్ మల్లిక్. ఈ మధ్యనే మూడో పెళ్లి చేసుకున్నాడు. నెమ్మదిగా లేచి నించుని ముకుళిత హస్తాలతో అడిగాడు, “బాబా! ఏదిమంచిది? కోరికతో కూడిన మార్గమా లేక సంతృప్తి కలిగిన దారా?”

బాబా చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.

“సరిగ్గా ఇదే ప్రశ్న తులసీ దాస్ కూడా అడిగాడు. వివరిస్తా నుండు.. మనం భోం చేస్తాం కదా? ఎందుకు తింటాం? మనకి ఆకలేస్తుంది కనుక. ఏం తింటాం? అన్నం కానీ చపాతీలు కానీ. కొంచెం కూరగాయలు, మాంసం కూడా. మనం తిన్నాక ఏమవుతుంది? ఆకలి తగ్గి, తృప్తి కలుగుతుంది. అంటే.. మనం జీవించడానికి కోరికే కారణం. కోరిక అంతమయ్యేది తృప్తి కలిగిన తరువాతే! తుల్సి ఒక సన్యాసి. అందుకే అతనికి ఇలా చెప్పాను, “చూడు తుల్సీ! నీ కోరిక తీరుతేనే కానీ నీ జీవితం సంతృప్తి చెందదు.” అప్పుడు అతను రామాయణం హిందీలో రాయడం పూర్తి చేశాడు. ఆ తరువాత అతన్ని నేను రాజా మాన్ సింగ్ కింద మార్చాను. అతను బోలెడు సంపద చేకూర్చాడు, కానీ కొంచెం కూడా మిగల్లేదు. అతని కొడుకు జగత్ సింగ్ బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మొత్తం తగలేశాడు.”

“అద్భుతం!” బారిస్టర్ ఓ.కె.సేన్ ఆశ్చర్యపోయాడు.

నితాయ్ బాబు ఇంక ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు. లేచి నిలుచుని, ముందుకి పరుగెత్తి బాబా కాళ్లమీద పడిపోయాడు. “స్వామే! నన్ను కాపాడండి. నా మీద దయ చూపండి.” ప్రాధేయపడ్డాడు.

“నీకేం కావాలి?” బాబా చికాగ్గా అడిగాడు.

“పంథొమ్మిది వందల పధ్నాలుగు..” తడబడుతూ గొణిగాడు నితాయ్ బాబు.

ఇదంతా చూస్తుంటే సత్యాకి భరించలేని కడుపునొప్పి వచ్చింది. అతనికి నవ్వు ఆపుకోడం చాలా కష్టమయింది. అతనంతట అతను ఎవర్నైనా ఏడిపించదల్చుకుంటే.. అపసవ్యమైన విషయాలని తొణక్కుండా బెణక్కుండా నిశ్చలంగా చెప్పగలడు. ఇంకెవరైనా అన్నదేదైనా అతనికి విడ్డూరంగా అనిపిస్తే మాత్రం నవ్వు ఆపుకోలేడు. తన్ని తను అదుపులో పెట్టుకోడానికి, ఏవైనా భయంకరమైన సంఘటనలు, విచారమైన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది అస్తమానూ పని చెయ్యదు.

“పంథొమ్మిది వందల పధ్నాలుగా?” విరించిబాబా కొంచెం అయోమయంగా చూస్తూ అడిగాడు. “ఏమిటి నీ ఉద్దేశ్యం?”

“ఒకటి తొమ్మిది, ఒకటి నాలుగు.. జవాబు దొరకలేదా? మళ్లీ ప్రయత్నించు మిస్..” నివారణ్, సత్య కేసి వంగి అన్నాడు.

సత్య కళ్లుమూసుకుని, ఒక ఘోరమైన దృశ్యం ఊహించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. “అతనొక బల్ల మీద పడుక్కుని ఉన్నాడు.. ఒక వడ్రంగి పనివాడు, అతని వీపు లోనుంచి కొంత మాంసాన్ని రంపంతో కోస్తున్నాడు. అయ్యో దేవుడా.. ఎంత భయంకరమైన నొప్పి..”

“నా మీద కృప చూపండి బాబా! నన్ను పంథొమ్మిది వందల పధ్నాలుగుకి తీసుకెళ్ళండి.. అదే యుద్ధం మొదలవక ముందుకి. ఒక వారం రోజులు చాలు. ఎంత తక్కువ ఖరీదైతే అంత తక్కువకి ఇనుము కొనాలి నేను. మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబా!” నితాయ్ బాబు వివరించాడు భయపడ్తూనే.

“నువ్వేం చేస్తుంటావు?” బాబా తేరుకుని అడిగాడు.

“నేనా! వోల్చర్ బ్రదర్స్ ఆఫీస్లో లెడ్జర్లు చూస్తుంటాను. నెలకి నూట యాభై మాత్రమే నా జీతం. అది అస్సలు సరిపోవట్లేదు బాబా!”

“అంటే నీకు బోలెడు సంపద కావాలి.. చాలా చాలా.. అదేమంత సులభం కాదు. దానికి క్రమశిక్షణ, యోగశక్తి కావాలి. ఆ యోగశక్తితో సూర్యుడ్ని వెనక్కి నడపాలి. అది ప్రతీ ఒక్కళ్లకీ చేతకాదు మిస్టర్! దానికి ఎంతో తతంగం ఉంది. క్రతువులు చెయ్యాలి.. బోలెడు డబ్బు కావాలి. అబ్బే.. అది నీ వంటి వాళ్లకి కాదు. నువ్వేం చెయ్యాలంటే.. మార్తాండ మంత్రాన్ని జపం చెయ్యాలి. అదీ మిట్ట మధ్యాన్నం.. సరిగ్గా పన్నెండు గంటలకి, సూటిగా సూర్యుడ్ని చూస్తూ..”మార్తాండ.. మార్తాండ..” అని గబగబా నూట ఎనిమిది సార్లు చెయ్యాలి. ఆ జపం చేస్తున్నంత సేపూ కళ్లు చికిలించకూడదు.. కన్ను ఒక్కసారి కూడా ఆర్ప కూడదు. అలా చేస్తే అష్టకష్టాలూ పడతావు.”

నితాయ్ బాబు నీరసంగా, పేలవంగా వెనక్కి తిరిగి తన చోట్లో కూర్చున్నాడు.

“ప్రతీ ఒక్కళ్ళకీ డబ్బు కావాలి. సంపద కావాలి. కానీ అది సరి అయిన వాళ్ల వద్దకే వెళ్తుంది.. ఎవరికి అర్హత ఉందో వారికే! జీసస్, నేను దీనిగురించే వాదించుకుంటూ ఉండే వాళ్లం. ధనవంతుడెప్పుడూ స్వర్గానికి వెళ్లడని జీసస్ అంటుండే వాడు. నేను ఒప్పుకునే వాడ్ని కాదు.. ఏం ఆ డబ్బు మంచి కార్యాలకి వాడితే ఎందుకెళ్లడు అనే వాడ్ని. పాపం జీసస్.. చాలా చిన్నప్పుడే జీవితాన్ని పోగొట్టుకున్నాడు.” విరించి బాబా ప్రవచనాన్ని కొనసాగించాడు.

“క్షమించాలి ఫ్రభూ! మీకు జీసస్ నిజంగా తెలుసా?” ఆశ్చర్యం ఆపుకోలేని మిస్టర్ సేన్ లేచి అడిగాడు.

“జీసస్! హహహా.. జీసస్ నిన్ననే పుట్టాడు.”

“మై గాఆహ్డ్!”
సత్యా ఇంకో సీన్ ఊహించుకోసాగాడు. ఈసారి అతని చెవుల్లో, ముక్కులో విషకీటకాలు చేరి కరుస్తూ కుడుతున్నాయి.. విపరీతమైన బాధ..

మిస్టర్ సేన్ నివారణ్ కేసి తిరిగాడు, “అంటే ఈయనకి గౌతమ బుద్ధుడు కూడా తెలుసా?

“అనుమానం లేదు. ఇక్కడున్న ఈ ప్రభుకి గౌతముడేం ఖర్మ.. మనువు, పరాశరుడు.. ఇంకా పురాణ కాలం నాటి మునులు, యోగులు, అందరూ తెలుసు. తెలియడమే కాదు, వాళ్లందరితో కలిసి ఒకే చిలుము నుంచి గంజాయి కూడా పీల్చాడు. నువ్వు ఎవరి గురించైతే విన్నావో వారందరూ.. భగీరథుడు, నెబుచద్నజెర్, హమ్మురబి, నియోలిథిక్ మానవుడు, పెథకాంథోర్పస్ ఎరెక్టస్.. మనకి తెలియని వాళ్లు కూడా ఈయనతో కలిసి మెలసి ఆడుకున్నారు.”

మిస్టర్ సేన్ కళ్లు సంభ్రమంతో పెద్దవయ్యాయి.. ఎంత పెద్దవంటే గుడ్లు ఊడి కింద పడిపోతాయేమో అనిపించింది నివారణ్కి.

సత్యాని ఏడు పెద్దపులులు వెంటాడుతున్నాయి. మూడు భయంకరమైన ఎలుగుబంట్లు ఎదురుగా నిలబడి మీద పడ్డానికి సిద్ధంగా ఉన్నాయి.

విరించిబాబా ఇంకా మాట్లాడుతున్నాడు.

“ఒకసారి పెద్ద వరదలొచ్చాయి.. అవును! సరిగ్గా అప్పుడే నోవా అతని ప్రఖ్యాత ఆర్చ్ కట్టాడు. నా సలహా తీసుకున్నందుకు నాకు చాలా సంతోషం కలిగింది. మహావిష్ణువు నాదగ్గరికి వచ్చి అడిగాడు, “నేను ఈ భువిని రక్షించి కాపాడాలి. ఈ విధంగా అంతా మునిగిపోతే ఇందరి జీవితాల్ని ఎలా కాపాడాలి?” అప్పుడు నేనే అతనికి భరోసా ఇచ్చాను. “విష్ణూ! మై ఫ్రెండ్.. విచారించకు.” అని అభయం ఇచ్చి, నేను సూర్యుడి వేడిని పెంచాను. ఆ వేడికి నీళ్లన్నీ ఒక్కక్షణంలో ఇగిరిపోయాయి. భూమి మళ్లీ పచ్చగా కళకళ్లాడింది. సూర్యచంద్రులు నా అధీనంలోనే ఉన్నారు. చూశారా! నేనెలా చెప్తే అలా నడుస్తారు.”

మిస్టర్ శేన్ ఏదొ చెప్దామని నోరు తెరిచాడు. కానీ కొంచం కూడా శబ్దం పైకి రాలేదు.

సత్యా ప్రాణం పోయింది. అతను ప్రయాణం చేస్తున్న పంజాబ్ మెయిల్, డార్జిలింగ్ మెయిల్ని గుద్దుకుంది. ఎక్కడ చూసినా హాహాకారాలు.. రక్తం కాలువలై పారుతోంది.. అన్నిచోట్లా శవాలు. ఘోర భయంకర దృశ్యాలు..! ప్చ్. అతని ప్రయత్నం ఫలించలేదు.

బిగపట్టిన నవ్వు అతని గొంతులోంచి ఉబికి ఉబికి ముందుకురకడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. తెగించి ఆఖరి ప్రయత్నంగా మానవాతీత శక్తిని ఉపయోగించి ఆ నవ్వుని కన్నీళ్లగా మార్చగలిగాడు. రెండు చేతులతో కళ్లు మూసుకుని వెక్కివెక్కి ఏడవసాగాడు.

“ఏమిటది” విరించిబాబా ఆదుర్దాగా అడిగాడు. “ఏమయిందతనికి? దారి ఇవ్వండి.. అతన్ని నా దగ్గరకి రానియ్యండి.”

దొరికిందే సందుగా సత్య త్వరగా వేదిక దగ్గరికి పరుగెత్తాడు. “నన్ను రక్షించండి బాబా!” సత్య ఆక్రోశించాడు. “నాకు మానవుడిగా జీవించాలని ఎంతమాత్రమూ లేదు. ఇప్పటికే విసుగొచ్చింది. నన్ను లేడిగా మార్చి, శకుంతల చేతుల్లోకి పంపండి. నాకు డబ్బు, కీర్తి.. చివరికి మోక్షం కూడా.. ఇవేం వద్దు. నాక్కావలసిందల్లా కొంత గడ్డి.. అదీ శకుంతల నేలలోనుంచి పీకింది. అది కాక, నాకు బలమైన కొమ్ములు ఇవ్వండి. వాటితో దుష్యంతుడు ఆవిడ్ని వలలో వేసుకోడానికి వచ్చినప్పుడు పొడిచి పారేస్తాను.”

ఇంక విషయం తన చెయ్యిదాటిపోతోందనిపించింది నివారణ్కి. తొందర తొందరగా ముందుకి నడిచాడు.

“దయచేసి క్షమించి వదిలెయ్యండి బాబా!  అతనికి పిచ్చెక్కింది. చాలా చిన్నవాడే కానీ బోలెడు కష్టాలు పడ్డాడు.”

అంతలో గడియారం ఏదుగ్ంటలు కొట్టింది.. బాబాకి జవాబివ్వవలసిన అగత్యం తప్పింది. రోజూ చేస్తున్నట్లుగానే విరించి బాబా వెంటనే కళ్లు మూసుకుని సమాధిలోకి వెళ్లిపోయాడు.

అతను నిటారుగా, కదలకుండా కూర్చున్నాడు. అతని పెదవులు మాత్రం కదులుతున్నాయి. గణేశ్ మామా, కేవలానంద.. ఇంకా ఇద్దరు శిష్యులు అతన్ని లోపలి గదిలోకి తీసుకుపోయారు.

ప్రస్థుతానికి బహిరంగ సభ ముగిసినట్లే.. ఆయన భక్తులు ఒక్కొక్కళ్లే వెళ్లి పోవడానికి కదిలారు, నెమ్మదిగా!

నితాయ్ బాబు పరమార్థ కేసి తిరిగాడు.

“శుద్ధ దండుగ. అంతా హంబగ్! అతనికి ఏదయినా మహత్యం ఉంటే ఏదో ఒకటి చేసి చూపించచ్చు కదా! అబ్బే.. అదేం లేదు. గంటలు గంటలు.. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయనగారేం చేశాడో చెప్తాడు. పరమార్థా! మనం పోదాం. ఇప్పుడు బయల్దేరుతే, ఏడూ ఇరవై ట్రామ్ కారు దొరుకుతుంది. నివారణ్, సత్యాల కోసం మనం ఆగనక్కర్లేదు. వాళ్లు ఆనందంగా వారి దారి వెతుక్కోగలరు. అన్నట్లు, రేపు మీ మిర్చి బాబా దగ్గరకి నన్ను తీసుకెళ్లగలవా?”

………………………………………

విరించిబాబా సమావేశం అయిపోగానే సత్యా, బుచికిని వెతకడానికి వెళ్ళాడు.

“కొంచెం టీ పెట్టగలవా? నివారణ్దా కూడా మనతో కలుస్తాడు. అబ్బా! నా గొంతు చీరుకుపోయింది.” బుచ్కి కనిపించగానే వేడుకున్నాడు.

“మరి అంతలా అరుస్తే ఏమవుతుంది? నేను అనుకుంటూనే ఉన్నా! టీ పెడ్తాలే కానీ, ఈ సంగతి చెప్పు.. మా నాన్నగారి ఎదురుగా అంత గొడవ చెయ్యాలా?”

“మీ నాన్నా! ఆయన అసలు మన స్పృహలో ఉన్నాడా అని..” తనలో తను అనుకుని, “నిజంగా.. నేను కాస్త అతి చేసినట్లున్నా కదూ? సారీ! బుర్రలేని పని.. ఇంకెప్పుడూ అలా చెయ్యను. ప్రమాణపూర్తిగా! చూడు… నేను వెళ్లేలోపుగా మీ నాన్నగారిని క్షమించమని అడుగుతాను. సరేనా!” పైకి మాత్రం బుచ్కీతో అన్నాడు.

“మా నాన్నగారా! ఆయన మీతో ఏమీ అనరు. తన చుట్టూ ఏం జరుగుతోందో గమనించే స్థితిలో ఉన్నారని నే అనుకోను. ఆయన బ్రతికి ఉన్నారంతే.. ఇంకేం లేదు.” బుచ్కీ విచారంగా అంది.

“ఈ పరిస్థితి కొంత కాలమే ఉంటుందిలే! తొందర్లోనే అంతా మామూలైపోతుంది. చూస్తుండు. చూడు.. నివారణ్దా వస్తున్నాడు.”

……………………………

రాత్రి తొమ్మిదయింది.

విరించి బాబా భక్తులు అంతా వెళ్లిపోయారు… విరించి బాబా, గురుపాద బాబు, బుచ్కి, గణేష్ మామ, నివారణ్, సత్య గోవర్ధన్ బాబు మాత్రం ఉన్నారు. గోవర్ధన్ బాబు బాబాకి ప్రియాతి ప్రియమైన శిష్యుడు.. అతను ఆశ్రమం కోసం మూడంతస్థుల భవనం కట్టిస్తానన్నాడు మరి!

చిన్నగదిలో ప్రత్యేకమైన హోమం వెలిగించారు.

గదికున్న రెండు కిటికీలు, వెనుక తలుపు మూసి వేశారు. లోపలికెళ్లే గుమ్మం దగ్గర గణేష్ మామ కాపలాగా ఉన్నాడు.. అటూ ఇటూ ఐతే తన జీవితమే పణంగా పెట్టినట్లు ఉన్నాడు.. కేవలానంద కనిపించట్లేదు. అతను బాబావారి భోజనం తయారు చేయించడంలో మునిగిపోయాడుట. ఒక చిన్న నూనె దీపం మాత్రం వెలుగుతోంది.

హోమం ఎదురుగా విరించిబాబా పద్మాసనంలో కూర్చున్నాడు. కళ్లు మూసుకుని ఉన్నాయి. అతని వెనుక గురుపాద బాబు, బుచ్కి ఉన్నారు. వారికి ఒక పక్క నివారణ్, సత్య.. ఇంకో పక్క గోవర్ధన్ బాబు కూర్చున్నారు.

చాలా సేపయ్యాక విరించి బాబా కళ్లు తెరిచి, రాగి కమండలంలోనుంచి నీళ్లు తీసుకుని గదంతా చల్లాడు. నూనె దీపం ఆరిపోయింది. హోమం కూడా ఆరినట్లే.. పెద్ద మంటలయితే ఎక్కడా లేవు. నిప్పు మీది నివురు మాత్రం ఉంది.

విరించి బాబా కొత్త యోగా కసరత్తు మొదలెట్టాడు.. రెండు బుగ్గల్నీ చేతి వేళ్లతో గట్టిగా వాయించుకుంటున్నాడు. గొంతులోనుంచి వింత శబ్దాలు వచ్చి ఆ చిన్న గదిని తన ప్రకంపనాలతో ఊపేస్తున్నాయి.

“బుచూ! భయం వేస్తోందా?” సత్యా వంగి బుచ్కి చెవిలో అడిగాడు.

“లేదు.” బుచ్కి జవాబిచ్చింది.

ఉన్నట్లుండి ఆరిపోతున్న నివురు నుంచి నీలి మంట పైకెగసింది. ఆ మసక వెలుతురులో అందరికీ ఒక ఆకారం కనిపించింది.. అస్పష్టంగా! అరే.. మహదేవుడు! హోమం వెనుక.. పులి చర్మాంబర ధారి, ఎముకల పుర్రెల దండ కంఠహారంతో, ఒక చేత డమరుకం ఇంకో చేత శూలం.. అతని శరీరం ఆ చీకట్లో తెల్లగా మెరిసిపోతోంది.

అవును.. నిజంగా మహదేవుడే! అనుమానం లేదు. గురుపాద బాబు కదల్లేదు, మాట్లాడట్లేదు.

గోవర్ధన్ బాబు మాత్రం ఊరుకో లేదు. తన మూడో పెళ్లి మూలాన వచ్చిన కష్టాలన్నీ ఏకరువు పెట్ట సాగాడు. అతని వ్యాపారంలో అన్నీ నష్టాలే.. ఎన్నో చిక్కులు.. అతని గొంతు దుఃఖంతో జీర పోయింది.

గణేష్ మామా తన చిన్న కూతురు బడిలో నేర్చుకున్న శివ స్థుతి వల్లించ సాగాడు.

నివారణ్, సత్య చెవిలో ఒక్క మాటన్నాడు.. “ఇప్పుడే!”

వెంటనే సత్యా, “బామ్ బాబా మహదేవ్!” అంటూ గట్టిగా అరిచాడు.

కొన్ని సెకండ్ల తరువాత ఆవరణలో పెద్ద గొడవ, హడావుడి మొదలయింది. చాలామంది ఒకేసారి మాట్లాడుతున్న ధ్వని.. అంతలో ఎవరో అరిచారు..

“మంటలు, మంటలు. అక్కడ మంటలు వస్తున్నాయి.”

విరించి బాబా వేళ్లు బుగ్గలమీద డప్పు వాయించడం మానాయి. అటూ ఇటూ ఆందోళనగా చూస్తున్నాడు. గణేష్ మామా ఏమయిందో కనుక్కోడానికి బయటికి పరుగెత్తాడు.

“అవును. మంటలే. ఇల్లు అంటుకు పోతోంది. అందరూ బయటికి రండి. వెంటనే.. త్వరగా!” ఒక గొంతు కేకెట్టింది. రింగు రింగులుగా దట్టమైన పొగ గదిలోకి రావడం మొదలెట్టింది.

విరించిబాబా ఆలస్యం చెయ్యలేదు.. వెంటనే కాళ్ల మీదికి గెంతి, గదిలోంచి ఒక్క దూకు దూకాడు. గోవర్ధన్ బాబు అతని వెనుకే పరుగెత్తాడు శక్తి కొద్దీ అరుస్తూ! బుచ్కి తండ్రి చొక్కా చేతులు పట్టుకుంది, “బాబా! లేవండి.” బ్రతిమాల సాగింది.

“ఏం ఫరవాలేదు.” నివారణ్ లో గొంతుతో అన్నాడు, “ఇక్కడే ఉండండి. కదలద్దు. నన్ను నమ్మండి. ఏం అపాయం లేదు.”

చివరికి మహదేవుడికి కూడా ఏదో అవుతోందని, పరిస్థితి సవ్యంగా లేదనీ అర్ధమయింది. అస్త వ్యస్తంగా కదులుతున్నాడు. నివారణ్ లేచి దీపాన్ని వెలిగించాడు. మహదేవ్ వెంటనే వెనుక తలుపు తెరిచాడు. సరిగ్గా అతను బైటికి జారుకునే లోపు సత్యా ఒక్క దూకు దూకి, అతని చేతులు గట్టిగా పట్టుకున్నాడు.

“నన్ను వెళ్లనివ్వండి.. వెళ్లనివ్వండి.” మహదేవుడు ప్రార్ధించాడు.

“ఇది వేళాకోళానికి సమయం కాదు. అక్కడ మంటలు.. నన్ను పోనివ్వండి.”

“మహదేవా! ఇంత త్వరగానా?”సత్య ఆపాడు.

“ముందు మనం ఒకరికొకరు పరిచయం కావాలి కదా! అది మంచి పని కదూ! హా.. కేవల్రామ్.. ఎప్పట్నుంచి నువ్వు దేవుడి వేషాలు వేస్తున్నావ్?”

అంతలో ముందు తలుపులోనుంచి కొందరు ప్రవేశించారు. సత్య, కేవలానందని ఫెకు పాండేకి అప్పగించి, బుచ్కిని ఆమె తండ్రిని గదిలోంచి బైటికి తీసుకొచ్చాడు.

చివరికి అక్కడ మంటలేం లేవని తెలిసింది. ఎవరోకొందరు పక్క గదిలో తడి గడ్డిని అంటించారు. ఫెకు, మౌళవి సాబ్, కోచ్ వాడు, సత్య స్నేహితులు.. అందరూ అనవసరంగా గొడవ చేశారు.

………………………..

విరించిబాబా కొంచెం తగ్గాడు.. కానీ పూర్తిగా బయట పడ లేదు. గురుపాద బాబు మీద అంతెత్తు లేచాదు.

“ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీకు పూర్తి నమ్మకం లేదు. అందుకే దేవుడు నీకు అలా చేశాడు. నీ దగ్గరికి వచ్చాడు కానీ, నువ్వు చూసే సమయానికి నిన్ను ఆటాడించడానికి మనిషిగా మారి పోయాడు.”

“నిజమే! నిజంగా ఆటే.. మహదేవుడికేమయింది? కుప్పలా కూలాడు. దాంట్లో బయట పడిందేవరు? కేవల్ రామ్! మరి.. విరించి బాబా! అతనొక కపట సన్యాసని తెలిసిపోయింది. ఏమాట.. ఎటువంటి ఆట!” సత్య అన్నాడు.. చిలిపిగా చూస్తూ.

గోవర్ధన్ బాబుకి నిజంగా చాలా కోపం వచ్చింది. “ఏంటయ్యా.. నన్ను మోసం చేస్తావా? నాకున్న పలుకుబడి, అధికారం నీకు తెలుసా? పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి నాకు. అదీ ఇంగ్లీష్ వాళ్లతో. తప్పించుకోగలననుకుంటున్నావా? నాలుగు తగల్నియ్యండి.” ఆవేశంతో ఊగిపోయాడు.

“వద్దు.. వద్దు. వాళ్లని పోనివ్వండి. ఇక్కడ గొడవ జరగడం నాకిష్టం లేదు. సత్యా! బండి తయారు చేయించి వాళ్లని స్టేషన్ వద్ద దిగపెట్టేయి. ఇంకెవరూ.. ఏమీ మాట్లాడద్దు.” అప్పటికి గురుపాదబాబు స్పృహలోకి వచ్చి ఏం జరుగుతోందో గమనించి అన్నాడు.

సామాన్లు సర్దుకున్నాక సత్య, గురు శిష్యులిద్దర్నీస్టేషన్ దగ్గరికి రైల్లో కూర్చోపెట్టాడు.

“ప్రభూ! నిజంగా మమ్మల్ని వదిలి వెళ్తున్నారా? సూర్యచంద్రులిద్దర్నీ మీరే చూసుకోవాలని గుర్తుంచుకోండి. సరిగ్గా పని చేసేలా చూడండి.. అప్పుడప్పుడు ఆగిపోకుండా కొన్ని నూనె చుక్కలు వేస్తుండండి.” రైలు కదిలాక విరించి బాబాతో అన్నాడు.

అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి చాలా మంది జనం వెళ్లిపోయారు.

“నివారణ్! సత్యా! మీరిద్దరూ నాకు పెద్ద ఉపకారం చేశారు. నన్ను రక్షించారు ఆ శృంఖలాలనుంచి.. జన్మలో మర్చిపోలేను.. మర్చిపోను. ఇప్పుడు మీరు వెళ్లడానికి ఆలశ్యమైపోయింది. ఇక్కడే భోజనంచేసి, రాత్రికి ఉండి పొద్దున్నే వెళ్లండి. అరే.. సత్యా! ఏమిటారక్తంచేతికేమయింది? గురుపాదబాబు ఆందోళనగా అడిగాడు.

“అబ్బే! మరేం ఫరవాలేదు. మహదేవుడ్ని పట్టుకున్నప్పుడు, అతను నా చేతిని కరిచాడు.”

“నాతో రండి. బుచ్కిని నీ చేతికి టించర్ అయోడిన్ పెట్టమంటాను.”

………………………

భోజనాలయ్యాక సత్య, నివారణ్ని ఒక మూల కలుసుకున్నాడు.

“నాకు తీరని కష్టం వచ్చి పడింది.”

“ఏమయిందిప్పుడు? ఏం కష్టం?”

“నివారణ్దా!”   “ఊ..”

“ఓహ్.. నివారణ్ దా!”

“ఏంటి సత్యా..”

“ఏంటంటే.. నివారణ్ దా!”  “అబ్బా.. త్వరగా చెప్పెయ్..”

“నాకు బుచ్కిని పెళ్లి చేసుకోవాలను ఉంది.”

“అది తెలుస్తూనే ఉంది. మరి ఆమె వద్దంటే..”

“ఎందుకు వద్దంటుంది.. అననే అనదు. బుచ్కి వాళ్ల నాన్న నన్ను ఎప్పటికీ వద్దనడు.”

“వాళ్ల నాన్న సరే.. మరి ఆమె ఏమంటుంది?”

“అదే.. సరిగ్గా తెలియట్లేదు.”

“ఏమందేంటి?”

“’ఆహా.. సర్లే.” అంది.”

“అయ్యో సత్యా! నువ్వొట్టి అమాయకుడివి. ఒకమ్మాయి.. ’ఆహా.. సర్లే..’ అంటే, ’ఆహా.. సరే!’ అని అర్ధం.”

*——————————*

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *