May 3, 2024

హరికధా గానసార్వభౌమా.. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు

రచన: ఉషాబాల గంటి

adibhatla

“రససిద్ధులైన సంగీత సాహిత్య కళాకోవిదుల యశః కాయమునకు జరామరణముల భయము లేదన్నది బుధోక్తి. ఈ విషయం నారాయణదాసుగారి జీవితం వల్ల మనకు అర్థమవుతుంది. ఈ పుంభావ సరస్వతి చలువ వల్లనే ఈ నాటికీ హరికధలు శారదాపీఠములై విలసిల్లుచున్నవి. దాసుగారు పుట్టేవరకు హరికధలను ఆశ్రయించి హరిదాసులు జీవించారనవచ్చు. నారాయణదాసుగారు గజ్జ కట్టి హరిదాసు అయిన తరువాత హరికధలే ఆయన్ను ఆశ్రయించి అందమైన రూపును దిద్దుకుని నిలబడ్డాయన్న మాట నిజం.

పేరూరు ద్రావిడ దంపతులైన నరసమాంబ, వెంకట చయనులుగార్లు  నారాయణదాసుగారి తల్లిదండ్రులు. అయితే ఆయన జన్మభూమి విజయనగరం సమీపంలోని అజ్జాడ. ప్రకృతి ఒడిలోనే ఆయన అన్ని విద్యలూ అభ్యసించారు. ఈయన నృత్య, గీత వాద్యములలో నిధి. గాత్రంలోనూ, వీణలోను దిట్ట. సంస్కృతాంద్ర, పారశీ, ఆంద్ర భాషలలో అవసరమైన అన్ని కళలలోనూ ఆరితేరిన విద్వన్మణి. ఈయనను గురించి చెళ్ళపిళ్ళవారు ఇలా అన్నారు.

గీ!!         “ఆది భట్టీ తడయ్యేను హరికధలకు

ఆది భట్టీ తడయ్యే గేయపు కవితకు

ఆది భట్టీ తడయ్యే నాట్యంపు కళకు

ఆది భట్టీ తడయ్యే లోకాధృతులకు”

 

భక్తుడంటే నారాయణదాసని, ఆయన ప్రహ్లాద, నారద, పరాశరాది మహాభాగవతులలో చేర్చదగిన అంతర్ముకుడని పొగిడారు.

నారాయణదాసుగారు హరికధను చేబట్టినది 1883లో మెట్రిక్‌లేషన్ చదువుతుండగా. అంతవరకూ ఈ కళ అసూర్యంపశ్యే.. ఎక్కడో మారుమూల మూల్గుతూ ఉండేది. నారాయణదాసుగారు ఈ కళను చేపట్టాకే దిగ్విజయ కీర్తినొంది అన్ని ఉత్సవాలలోనూ హరి కధాగానం ప్రధమ స్థానం పొందింది.  దాసుగారి చిన్నతనంలో ఒకసారి “కుప్పుస్వామి నాయుడు” అనే భాగవతార్ చెన్నపట్టణం నుండి విజయనగరం వచ్చి “దృవచరిత్ర” అనే హరికధ చెప్పడం జరిగింది. ఆ కధకు దాసుగారు మిగిలిన పిల్లలతోపాటు ముందు వరుసలో కూర్చొని రెప్పవేయకుండా హరికధా గానం, వినడం, చూడటం జరిగింది. ఆయనకు అది చూస్తూన్నంత సేపూ హరిదాసు అలా నిలబడి చెప్పడం ఏమి బాగుంటుంది? చక్కగా లయానుగుణంగా అడుగులు వేసి భావం ప్రకటించినట్లు నాట్యభంగిమలను చూపించి చెబితే ఇంకా బాగుంటుందని తోచింది. వెంటనే ఇంటికి వచ్చి స్వయముగా ‘ధృవచరిత్ర” అనే కధ రాసి అందులో స్వంత కీర్తనలు గానంచేస్తూ ధూళిపాళ కృష్ణయ్యగారి పధ్యములు, ఆంధ్ర భాగవతములోని పద్యాలు, పంచతంత్ర కధలూ చొప్పించి అన్నగారయిన పేరన్నతో కలసి పెద్ద అన్నగారింట ప్రదర్శించి వారి మన్ననలను పొంది చక్కని గజ్జలు బహుమతిగా పొందారట. అటు పిమ్మట దాసుగారు వెనుతిరిగి చూడలేదు. సంగీత, సాహిత్యాలలో భరతశాస్త్ర, వ్యాకరణ, జ్యోతిషశాస్త్రాలతో పండితులను గడగడలాడించిన విద్య భక్తిమంతులు, సువర్ణఘంటాకంకణ వాస్తులూ అయినారు.

“ఈయన రచించిన హరికధలు జానకీ శపధము, రుక్మణీ కల్యాణము, మార్కండేయ చరిత్ర, హరిశ్చంద్రో పాఖ్యానము, అంబరీష చరిత్ర, భీష్మ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, యదార్ధ రామాయణము. ఈ కధలో మూల రామాయణంలోని కొన్ని ఘట్టాలను వదిలివేసి స్వతంత్రముగా రచించారు. ఈయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనమైన “ఉమర్ ఖయామ్” అనే గ్రంధమునకు డా!! సర్లేపల్లి రాదాకృష్ణగారు ముందుమాట రాసారు.

దాసుగారు ఆంధ్ర దేశమంతటా తిరిగి తన హరికధాగానామృతాన్ని పంచారు. ఉర్లాం జమిందారిణి కందుకూరి మహలక్ష్మమ్మగారి మెప్పుపొంది ఆమె కోరికపై అష్టావధానము చేసి అవధానిగా కూడా తన నైపుణ్యాన్ని కనబరచారు. బరంపురం, చక్రపురం, పర్లాకిమిడి, రాజమండ్రి, అమలాపురం మొదలైన చోట్ల తన హరికధాగానంతో కీర్తి ప్రభలను నలుచెరగులా వ్యాపింపజేసారు.

కాకినాడ నాటక సమాజం వారి ఆధ్వర్యంలో “విక్రమోర్వశీయ” నాటకంలో అనుకోకుండా “రాజు” పాత్ర ధరించి నాటకరంగంలో కూడా తన సత్తా చాటుకున్నారు.

ఒకసారి బందరులో ఈయన కధాగానంతో పాటు శాస్త్రసభలు, అవధాన సభలూ కూడా నిర్వహించారు. అయితే కొందరు దాసుగారు మహా పండితుడని కొనియాడగా మరికొందరు ఈయనకు సంగీతంలో స. ప లు కూడా రావని ఎద్దేవా చేసారు. అప్పుడు ఒక పోటీని ఏర్పాటు చేసారు. దాసుగారు ఒక గంట సేపు గానం చెయ్యాలి. అవతలివారు కూడా గంటసేపు పాడాలి. ఎవరిది బాగుందో ప్రజలే నిర్ణయిస్తారు. ఆనాటి సభకు పోలీసు బందోబస్తు కూడ ఏర్పాటు చేసారట. చివరకు బందరువారు ఓడిపోయారు.

మదరాసు ‘కపిలేశ్వరస్వామి” ఆలయంలో దాసుగారు చెప్పిన “అంబరీషోపాఖ్యానము” కధకు వచ్చిన కీర్తి మరే కధకూ రాలేదట. బెంగుళూరులో రెండు నెలలుండి హరికధా గానం చేసారు. ఆక్రమంలో బెంగుళూరు పై ఏదైన చెప్పమని ఒక ప్రముఖుడు అడుగగా ఈపద్యం చెప్పారు.

“అలరు దేనియ వారు దలిరుల జిగిమీరు

విన్నగురువు తీరు బెంగుళూరు

చిరుత మజ్జుల కారు చెమటరాని షికారు

వేడుక లింపారు బెంగుళూరు

చెరకు తీయని నీరు చేలపచ్చనిబారు

వెల్పునగరు గేరు బెంగుళూరు

ఆవుల పాలేరు తావుల లేమారు

పిలువ దగిన పేరు బెంగుళూరు.”

 

వింతనగ నాణెములనారు బెంగుళూరు

పెను తెవుళ్ళకు మందు లేర్పంగుళూరు

వెల్లదొరలను రాగోరు బెంగుళూరు

వేనుడువుత లీల? బంగారు బెంగుళూరు.

 

తరువాత మైసూరులో కధాగానం చేసి రాజుగారిచే ఘనసన్మానములు పొందారు. రాజాస్థానంలో అస్థాన కధకులుగా ఉండమన్న రాజుగారి కోరికను “మర్త్యుల గొల్వనొల్లను” అని నిర్భయముగా చెప్పారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన అందుకోని అందలాలు లేవనే చెప్పాలి. నోబుల్ గ్రహీత రవీంద్రనాధ్ ఠాగూర్ ను  కూడా తన కధాగానంతో ముగ్ధుణ్ణి చేసారాయన.

ఒకసారి ఈయన వేదికపై కధాగానంలో మునిగి యుండగా ఒకతను వేదికనెక్కి “ఇతరుల లోపాలను ఇలా దుయ్యబట్టి విమర్శిస్తున్నారే ఇది మీకు తగునా?” అని అడిగాడట.

దాసుగారు వెంటనే “ఒరే నేను కూడా ఊరుకుంటే ఇక లోకంలో మంచి, చెడ్డా విప్పి చెప్పే గుండె కలవాడెవడురా?” అని ఠీవిగా  సమాధానం చెప్పారట.

మరొకడు “ఇంత వయసు వచ్చినా మీకెందుకా వాలు మీసాలు ?” అని వేళాకోళం చేస్తే “ఓయ్ నే పోయిన తరువాత ఆంధ్ర దేశానికి మీసం పోయిందని అందరూ చెప్పుకోడానికిరా” అని చమత్కరించారట. ఆయన రూపాన్ని కరుణశ్రీగారు కళ్ల కట్టినట్లు ఇలావర్ణించారు.

 

గీ       “వాలుమెలి మీసకట్టు జులపాలజుట్టు

నొసట కుంకుమ బొట్టు మేల్‌పసిడి గట్టు

విద్దెలకు పట్టు నడయాడు వేల్పుచెట్టు

హరికధా శిల్ప సామ్రాట్టు ఆదిభట్టు”

 

1914లో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు వీరి ప్రతిభకు మెచ్చి “హరికధా పితామహ” బిరుదునిచ్చి సత్కరించారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాపాటశీలను మెచ్చి ఆంద్రవిశ్వ విద్యాలయం “కళాప్రపూర్ణ” బిరుదునిచ్చి సత్కరించింది. దాసుగారి శిష్యులతో పేరు గాంచినవారు పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు, మునుకుట్ల సదాశివశాస్త్రి, అమ్ముల విశ్వనాధ భాగవతులు, కోట సచ్చిదానంద శాస్త్రి మొదలగు వారెందరో.

1945వ సంవత్సరం జనవరి రెండవ తేదిన ఈ ప్రతిభా సరస్వతి దివికేగారు. సంగీత సాహిత్య హరికధా పితామహుని సంస్మరణ పరమ పవిత్రమైనది. ఏనాటికైనా చిరస్థాయిగా నిలిచిపోయే హరీకధా గంధర్వ సార్వభౌముడు “శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు.”

 

 

 

 

 

1 thought on “హరికధా గానసార్వభౌమా.. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *