May 8, 2024

భార్యా భర్తలు – 1 (వెండితెర నవల)

రచన: ముళ్లపూడి వెంకటరమణ
హాసం ప్రచురణలు
హైదరాబాద్

వెండితెర నవల అంటే సినిమా స్క్రిప్టు కాదు. కెమెరా భాషించే మూగబాసలను, సంభాషణలలో అంతర్లీనంగా వుండే ధ్వనిని, పాత్రల చర్యల వెనుక నున్న తర్కాన్ని, కవిహృదయాన్ని పాఠకుడికి విప్పి చెప్పే, విశదీకరించే ప్రక్రియ. సినిమా అనేక కళల సమాహారం, పండితుడినుండి పామరుడి వరకు వివిధ స్థాయిల్లో వుండే సినిమా ప్రేక్షకులకు రచయిత, దర్శకుడు ఉద్దేశించినవన్నీ చేరతాయన్న నమ్మకం లేదు. ఇటువంటి వెండితెర నవలలు ఆ ‘గ్యాప్’ను చక్కగా పూరిస్తాయి. రమణ వంటి వెండితెర నవలాకారుడు లభిస్తే ఎన్ని వన్నెచిన్నెలు అమరుతాయో చ(ది)వి చూడండి. ముఖచిత్రం, లోపలి బొమ్మలు శ్రీ బాపు గారివి. ఉపయోగించుకోనిచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. శ్రీ అన్నపూర్ణా పిక్షర్స్ వారికి ధన్యవాదాలు.

ప్రసిద్ధ తమిళ రచయిత్రి డాక్టర్ కె.త్రిపురసుందరి (లక్ష్మి) వ్రాసిన ఒక కథ “భార్యా భర్తలు” చలన చిత్రకథకు మాతృక. ఇది ఆధారంగా ప్రముఖ తెలుగు రచయిత శ్రీ.కె.ప్రత్యగాత్మ చిత్రానికి కథా సంవిధానం రూపొందించారు. ఆయన దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. ఒక వ్యక్తి తెలిసో తెలియకో ఒకసారి తప్పుచేస్తే అందుకు జీవితాంతం శిక్ష అనుభవించవలసిందేనా అన్న ప్రశ్నకు దాంపత్యం కథా వస్తువుగా-సమాధానం చర్చిస్తుంది ఈ నవల.

భవదీయుడు,

కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి
ప్రచురణకర్త

 

భార్యా భర్తలు

movieposter

అనగనగా ఒక ‘రోమియో’ అతని పేరు ఆనంద్. అతనికి కావలసినది డబ్బూ, పొడుగుపాటి కారూను. వాటిని వాడడానికి, వేటాడానికి, డ్యూయెట్‌లు పాడడానికి కావలసినంతమంది జూలియట్‌లు. ఈ కృష్ణలీలలకు కావలసిన పెట్టుబడికి లోటే లేకుండా ఇంటిదగ్గిర్నించి నెలనెలా మనియార్డర్లు గుప్పించేందుకు నాన్నగారూ (ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కాబోలు, పనిచేస్తున్నారు) ఆయనకి కోపం వచ్చి (అస్తమానం వస్తుందిట) “ఆ వెధవాయికి ఏగాణి పంపను” అన్నప్పుడల్లా సర్దిచెప్పి బిడ్డడల్లాడిపోతాడని ఏడ్చి మనియార్డరు కట్టించేందుకు అమ్మా (ఆవిడకి తనంటే చాల అపేక్ష పాపం. మావఁయ్య చెబుతూ వుంటాడు), ‘ఫర్వాలేదు, వాడే చదివి బాగుపడతా డ’ని అమ్మకి ధైర్యం చెప్పిందికి వెంకట్రత్నమ్మావయ్యా (చాల మంచివాడు) కూడా ఉన్నారు.
జూలియెట్లెవరూ కనబడనప్పుడూ, డ్యూయెట్లకి వరసలు కుదరనప్పుడూ, క్లబ్బులూ సినిమాలూ కట్టేసినప్పుడూ అప్పుడప్పుడూ ఊసుపోనప్పుడూ వెళ్ళేందుకు కాలేజీకూడా ఉంది. అక్కడ కాలక్షేపానికి కాసేపు లెక్చర్లు వినచ్చు.. లెక్చర్లు అన్నీ బోరు కొట్టవుట. వాటిలో అప్పుడప్పుడు విట్‌లు, జోక్‌లు పడుతూ ఉంటాయట. ఆ మాటకొస్తే, కొన్ని కొన్ని పుస్తకాల్లో కూడా అక్కడక్కడ ఈ జోక్‌లు ఉంటాయట. ఒకసారి ఎవరో చూపించరు. పాపం చదువుకూడా మంచిదే. ఒకపుడు కొఱమాలిన వస్తువులు ఏవీ లేవుట అని క్లబ్‌లో హేమో, పద్మో, లీలో – ఎవరో అంటే, “చదువు? కాలేజీ? ఇవేమిటీ, కొఱమాలినవి కాకపోతే కొఱవున్నవా?” అని అడిగేసి, కడిగేసి చిత్తు చేసేశాడు వాళ్ళని.
కాని తరవాత తెలిసింది వాటంత మంచివి, ఉపయోగకరమైనవి అవేనని. ముఖ్యముగా విద్యార్థులకు అవి చాలా ఉపయోగము. ఎవరైనా చాదస్తులు ఎదురై “ఏం చేస్తున్నావబ్బాయి” అంటే, “చదువుకుంటున్నానండి” అని ఠంగున జవాబు చెప్పొచ్చు. అసలు మనియార్డర్లు రావడానికి చదువే కదా ముఖ్యకారణం. చదువేమిటి నాన్సెన్స్ అనే వాడిని స్టుపిడ్ అన్నదిందుకే. అయితే, పరీక్ష లొకటున్నాయి గులాబీలకు ముళ్ళలాగా.
పరీక్షలు అసలు పాసయ్యేందుకు కాదు. అసలవి ప్రతిభ గురించి, నేర్చుకున్న చదువుకోసం పెట్టారు. వీడికి చదువూ, కాలేజీ అంటే ఎంత అభిమానమో చూద్దాం అని పెడతారు. ఎన్నిసార్లు ఫెయిలైనా ఆ క్లాసునీ, కాలేజీని పట్టుకు దేవుళ్ళాడాలి. పట్టుదలని, అభిమానాన్ని చూపించుకోవాలి. అన్నయ్య రామానంద్ ఎమ్మే ఎల్లెల్బీకి ఈ పట్టుదల, కాలేజీమీద ఈపాటి అపేక్ష, లాయల్టీ లేకపోయాయి. ముందూ, వెనకా చూసుకోకుండా చెడుసావాసాలు చేసి, గబగబ చదివి బుడుంగున పాసై ఊరుకున్నాడు. అక్కడితో పాపం, వాడికి మనియార్డర్లు బందయిపోయాయి,ఇంట్లో కుదేశారు.
చివరికి పాపం, పెళ్ళి కూడా చేసి పారేశారు వాడికి. పైగా, కోర్టుకెళ్ళి డబ్బు గడించు వెధవా అని కోప్పడ్డారుట నాన్నగారు. హుఁ! ఆయనతో ఇంట్లో మాటాడడానికే భయంగా ఉంటుందిగదా. కోర్టుకెక్కి ఎదుటపడి, యు హౌమచ్ అని వాదించడమే! అందులోనూ అన్నయ్య ! అసలే నాన్నగారు; అందులో ప్రాసిక్యూటరూను. పాపం, అన్నయ్య కోర్టు మానేసి, కొన్నాళ్ళు మీనమేషాల్లెక్కెడుతూ (అవేమిటో!) కూర్చున్నాడు. ఇంకొన్నాళ్ళయేసరికి పిల్లల్ని లెక్కెట్టుకోవలసి వచ్చింది. ఒకళ్ళా, యిద్దరా; అయిదుగురో, ఆరుగురో, పాపం, బెంబేలెత్తి కాశీ రామేశ్వరాలు పోయాట్ట. పిల్లలు కలక్కుండా వుండాలని.
అసలు పెళ్లే ఒక పెద్ద లిటిగేషను, ఖైదు. కులస్త్రీ అంటూ ఒకర్తి తయారవుతే మిగతావాళ్ళంతా పరస్త్రీలే గదా. వాళ్ళని కన్నెత్తకుండా చూడాలిట. ఇంటికి ఆలస్యంగా వస్తే భార్య, పతివ్రత మార్కు మొహం పెట్టి భోజనం మానేసి కూచుంటుంది కనిపెట్టుకుని. ఎంత కంట్రుకం మొగుడికి ! ఎంత పబ్లిసిటి! డామిట్. చస్తే పెళ్ళాడకూడదు. అసలు పెళ్ళేమిటి సిల్లీ. ప్రేమ తెలియని వాడికి పెళ్ళి కాలేజీ. అందుకే పెళ్ళయాక ప్రేమించడం నేర్చుకోవచ్చుంటారు పెద్దవాళ్లు. కాని అది పుట్టుకతో రావాలి. బార్న్‌గిఫ్ట్. అలాంటిది నేర్చుకున్నా ఒకటే మానినా ఒకటే. పెళ్ళయ్యాక ఆరంభిస్తే తెమిలేసరికి ఏజ్ బారయిపోతుంది.
లలిత కేందుకో ఈమాట మాత్రం నచ్చదు. లలిత కాదు ఆ పిల్ల పేరు… లీల కాబోలు.. అబ్బే లీలకి రెండు జడలుంటాయి… పద్మా?…. ఊహుఁ సరూ… నో నో పార్వతా?…. డామిట్ ఎవర్తో ఒకర్తి.. పేర్లొకటీ గుర్తుండి చావవు. ఒక పేరుకొక పేరు వస్తుంది. అదెవర్తె అని ఎదుట ఉన్నది డబాయిస్తుంది. అందరికీ జనరల్‌గా సర్వనామధేయం ‘డార్లింగ్’ ఉంది గదా, పేరులో ఏముందో…
వాటీజిన్ నేమ్ అని కొటేషనొకటి రాసిపారేశాడు షేక్స్‌పియరు ఇలాటిపోరు పడలేకే. దేవుడి కెన్నిపేర్లు లేవు? ఈ పద్మకి ఐమీన్ వనజకి – నో నో సరూకి – డామిట్ ఎవర్తెకో వకర్తెకి బొత్తిగా ఈ పాటి కామన్‌సెన్స్ కూడా లేదు. హాయిగా లైఫ్ ఎంజాయి చెయ్యక.
రోమియో ఆనంద్ కారువేగం తగ్గించాడు. దూరంగా ఫౌంటెన్ దగ్గర ఆ చక్కని పిల్ల పువ్వులా నవ్వులా వంది. కారాపి “ప్రియదర్శిని” తీసి చూశాడు ఆనంద్ (ప్రేమికులు కానివాళ్ళు దీన్ని బైనాక్యులర్స్ అంటారుట.. ఝామ్మని వచ్చి వళ్ళో వాలినట్టయింది. కన్ను గిలిపితే కనపడు. చెయ్యి ఊపి సైగచేశాడు. రైఠో అంటోంది ఆ అమ్మాయి చెయ్యి, రివ్వున అటు పోయాడు ఆనంద్, పాట ఆరంభించి. అతను పల్లవిగా ముగించేసరికి ఆమె అనుపల్లవి అందుకొంది వయారంగా
తరువాత యిద్దరూ ఒక చరణం పాడారు.
అంతలో ఆనంద్ దృష్టి దూరంగా మెయిన్‌రోడ్డు మీద దీపస్తంభం ప్రక్క దీపంలా వెలిగిపోతున్న అమ్మాయివేపు వెళ్ళింది. హృదయం బ్రేక్ వేసింది. చూపులు అక్కడే ఆగాయి – ఆ పిల్ల కళ్ల మీద. కనులు కనులు కలసే ఆ మనసులు వెన్నెలకురిసె… ఒక నిముషం తరువాత రెండో చరణం కలిసి పాడుతున్నాడు ఆనంద్.

జోరుగా హుషారుగా:
ఆనంద్ : జోరుగా హుషారుగా షికారు పోదామా!
హాయి హాయిగా తీయ తీయగా !! జోరుగా !!
ఓ… బాల నీ వయ్యార మెంచి మరులకొంటినే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
మరువనంటినే !! జోరుగా !!
నీ… వన్నెచిన్నె లని చూచి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలసి రాగదే !! జోరుగా !!
నా… కలలలోన చెలియ నిన్నె పిలచినాడనే
కనుల తెరచి ఎదుట నిన్నె కాంచినాడనే
వరించినాడనే !! జోరుగా !!

పూదోటలో తేటిలాటివాడు ఆనంద్. దేవుడికి జీవుల్లా, కృష్ణుడికి గోపికలలా, తుమ్మెదకి పువ్వులన్నీ సమానమే. దేనిమీద పక్షపాతం ఉండదు. ఆనంద్‌కీ అంతే. కంటికేది నదరైతే అదే అతని గమ్యం. ఆ పూట పాట ముగిసేసరికి ఆరుగురు అమ్మాయిలు పరిచితలయ్యారు. ఆనంద్‌కు కొత్త పరిచయాలంటేనే యిష్టం. పెళ్ళి పెళ్ళి అని గొడవపెట్టరు హేమలాగ. అన్నట్టు హేమతో ఎంగేజ్‌మెంటుంది ఈ పూట.
ఆనంద్ సరాసరి కారెక్కి హేమ ఇల్లు చేరుకున్నాడు.
ఈపాటికి హేమ మండిపడుతూ ఉంటుంది కోపంతో. ఎదురుచూసి విసిగి వేసారి ఉంటుంది. ఆ పిల్లని బెల్లించి దారికి తేవడం ఆనంద్‌కి నిముషం పని. అదో సరదా కూడాను. హేమేమిటి అంతకన్న హేమహేమీలనుకున్న అమ్మాయిలనే నిముషాలమీద వెన్నలాగ కరగించి పారేశాడు ఆనంద్.
ఈలవేస్తూ హుషారులా, తన కారులా హేమమందిరంలోకి ప్రవేశించాడు ఆనంద్.
హేమా! అన్నాడు.
పలకలేదు. కోపం అయిండదు. వినలేదేమో. వెనకే వెళ్ళి భుజంమీద చేయివేసి పిలిచాడు. ఉలికిపడింది హేమ.
“ఆనంద్! దారి తప్పినట్టున్నావే” అంది హేమ వెటకారంగా.
“ఊఁ మనకు దారితప్పడం అంటూ లేదే! ఏదో తీరికలేక….” అన్నాడు ఆనంద్ అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు.
హేమ ఏమనబోయిందో కాని, అనేలోగానే సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు ఆనంద్. “హేమా ! హేమా ! అందంలో, అకర్షణలో నిజంగా అప్సరసను మించిపోయావే !”
ఇలాటి అస్త్రాలతో తూట్లు పడివున్న హేమ మనసు ఉప్పొంగిపోలేదు. కాని ముఖస్తుతి అని తెలిసినా లొంగి వచ్చింది. “ముఖస్తుతి మాటలకేంగాని, ఆనంద్! నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?” అంది సూటిగా.
ఆనంద్ జాలిగా నవ్వాడు. “హేమా! ప్రేమను గురించి నువ్వు నన్నడుగుతున్నావా! నా పేరే ప్రేమకు మారుపేరు గదా. చూడు, మహా సముద్రాలయినా ఇంకిపోవచ్చుగాని ఈ ఆనంద్ ప్రేమ మాత్రం ఎన్ని యుగాలైనా ఇంకిపోదు.” అన్నాడు. చిరుకోపం కూడా ప్రకటించాడు. హేళన మేళవించి “ఓ అమోఘం, అద్భుతం… ఇటు వంటి ప్రేమజీవిని నిలబెట్టి ఎంత చచ్చుప్రశ్న వేశావు హేమా!” అన్నాడు.
“ఆనంద్, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లు నమ్మవచ్చా?” అంది హేమ అసలు సంగతి వదలక.
“సెంట్ పర్‌సెంట్… అంటే నూటికి నూరుపాళ్ళూ….”
“అయితే ఇంకేం. మన పెళ్ళికి వెంటనే ఏర్పాట్లు చేయించు.”
“పెళ్ళా?” అన్నాదు ఆనంద్ అదిరిపడి
“ఆఁ”
ఆనంద్ హేమకేసి ఒక్క క్షణం సూటిగా చూశాడు. అది సరసమేమోనని. కానట్టుంది. ఉత్తర క్షణంలో విరగబడి నవ్వసాగాడు. ఇంతమంచి జోక్ అతను ఈ మధ్య విన్నట్టు లేదు. ఆనంద్ నవ్వు చిత్రమైనది. విలక్షణంగా వుంటుంది. వేళాకోళం చేస్తుంది. వెక్కిరిస్తుంది. నీ సంగతి నాకు తెలుసులే అంటుంది. రెచ్చగొడుతుంది. ఆడవాళ్ళమీద అతనికున్న నిశ్చితాభిప్రాయం ఆ నవ్వు…
“ఎందుకలా నవ్వుతావ్?” అంది హేమ అమాయకంగా, కోపంగా.
“ప్రేమించడానికే మనకి తీరికలేకుండా చస్తుంటే పెళ్లేమిటి డార్లింగ్?” అన్నాడు ఆనంద్ నవ్వు ఆపుకుంటూ.
“అయితే, నన్ను పెళ్ళి చేసుకోనంటావు” అంది హేమ తీక్షణంగా చూసి.
“నిన్నేకాదు మరెవర్నీ చేసుకోను. కారణం ఏమిటంటే పెళ్ళంటే మనకి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి.”
“ఊఁ?” అంది హేమ – అసలు అభిప్రాయాలనేవి ఉన్నాయా అన్నట్టు.
“ఆఁ !”
“అవేమిటో సెలవిస్తావా ?”
“నిరభ్యంతరంగా, విను.” అన్నాడు ఆనంద్ ధీమాగా, తడుముకోకుండా సెలవివ్వడం అరంభించాడు వేలు ముడిచి లెక్క చెబుతూ.
“నంబర్‌వన్ ” వివాహమంటే బానిసత్వం. కోరి కోరి సంకెళ్ళు తగిలించుకోవడన్నమాట. నంబర్ టు: వివాహో ప్రేమనాశాయ అన్నారు పెద్దలు. అంటే పెళ్లయిన తరువాత ప్రేమ నశించిపోతుంది. అని దీని అర్థం. కాబట్టి మనిద్దరం పెళ్ళిమాట తలపెట్టకూడదు. నంబర్ త్రీ… … ”
“అది నే చెబుతాను వినండి.” అంటూ లేచింది హేమ. “ఆరు మాసాల్లో మనిద్దరం తలిదండ్రులం గాబోతున్నాము” అంది.
ఆనంద్ క్షణంలో సగం సేపు ఆమెకేసి చూసి తలతిప్పుకోన్నాడు.
“అందుచేత నీ కిష్టమున్నా కాకపోయినా నన్ను పెళ్ళిచేసుకోవలసిందే.. ఏమంటావ్” అంది హేమ జబర్దస్తీగా.
“నీ కట్టుకథలన్నీ నామీద పనిచెయ్యవు. నేను పెళ్ళిచేసుకునే ఘటాన్ని కాదని ముదే తెలుసుకో.”
“అయితే నేను ఏ నుయో గొయ్యో చూసుకోవలసిందేనా?” అంది హేమ దైన్యం అభినయిస్తూ.
తక్షణం ! ఆనంద్ కరుణ రసాన్ని పోషించాడు. “అయ్యయ్యో ఎంతమాటన్నావ్ హేమా ! నువ్వు చచ్చిపోతే నేను బ్రతకగలనా ! అందుకని నువ్వు చావనూ కూడదు; నన్ను చంపనూ కూడదు” అన్నాడు నాటకంలో హీరోలా భంగిమపట్టి.
“ఆనంద్ ! నన్ను రెచ్చగొట్టకు. నేను మంచిదాన్ని కాదు”. ఈ కొత్త భాష, కొత్త కంఠస్వరం విని ఆనంద్, హేమ వంక చూశాడు, జాలి, అసహ్యం చిరాకూ కలిగాయి. “ఏం చేస్తావ్?’ అన్నాడు నిర్లక్ష్యంగా.
‘ఎంతకైనా తెగిస్తాను ఇవాళే మీ నాన్నగారికి ఉత్తరం రాస్తాను.” అంది హేమ తెగించి.
“అడ్రస్ ఇవ్వనా?” అన్నాడు ఆనంద్ బేఖాతరీగా.
“ఇస్తావ్ ఇస్తావ్ – ఇలా ఎంతమంది గొంతుకలు కోస్తావో నేనూ చూస్తాను” అంది హేమ దుఃఖంలోకి కరిగిపోతున్న కోపాన్ని అణుచుకుకుంటూ, ఆనంద్‌కి పూర్తిగా చిరాకువేసింది. ఆమెకేసి ఎగాదిగా చూశాడు. “అధికంగా మాట్లాడి అలసిపోయావుగాని హేమా – కాస్త విశ్రాంతి తీసుకో వస్తా” అంటూ మరో పుష్పంకోసం ఎగిరి వెళ్లిపోయాడు.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *