May 3, 2024

అలా మొదలైంది….

రచన: డా. జె. గౌతమి సత్యశ్రీ

 Pic.2

 

రాజ్, జూలీ తమకున్నంతలో హాయిగా, ప్రేమగా జీవించే జంట. జూలీకి జీవితం లో పెద్దగా కంప్లైంట్స్ లేవు, ఆశలు లేవు. కాబట్టి రాజ్ కూడా చాలా హ్యాపీ గా జీవితాన్ని   నెట్టుకొచ్చేస్తున్నాడు. ఎవరో తెలిసిన వాళ్ళు డిపార్ట్ మెంటల్ స్టోర్ లో పార్ట్ టైం ఉద్యోగం ఇస్తామంటే జూలీ స్టోర్ లో చేరింది, ఏదో కొంచెం ఎక్స్ ట్రా మనీ ఇంటికి వస్తుంది కదా అని. ప్రతిరోజూ  స్టోర్ కట్టేసాక, ఇంటికి వచ్చేసరికి రాత్రి 10.30 అవుతుంది. ఒకరోజు వీకెండ్ శనివారం రాత్రి స్టోర్ నుండి వస్తున్నప్పుడు జూలీ  కారు యాక్సిడెంట్ కు గురి అవుతుంది. యాక్సిడెంటు చేసిన వ్యక్తి బాగా త్రాగి ఉన్న మూలాన, ఈ యాక్సిడెంట్ చేయడం, తాను కూడా అక్కడికక్కడ మరణించడం జరిగింది. ఇక రాజ్ బాధ వర్ణనాతీతం. రాజ్ అనుకున్నాడు…ఇప్పుడు నాకు 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళవయసులో ఇద్దరు చిన్న పిల్లలతో ఒక విధవగా జీవించడమా? అసలు ఆ విధవ అనే పదమే భరించరానిది. ఇక నా జీవితం ఇంతే. అంతా అయిపోయింది. 

రాజ్, జూలీ చిన్నప్పటి స్నేహితులు తర్వాత ప్రేమికులు. ఒకటే స్కూలు, కాలేజి..పెళ్ళై 15 సంవత్సరాలు కలిసి జీవించారు.తననుండి జూలీని ఆ పొగరుబోతు, త్రాగుబోతు దూరంచేసాడు. రాజ్ కి కోపం వచ్చింది.ఈ రెండు ఫ్యామిలీలు ఒకటే చర్చ్ కి సంబంధించినవి. ఒకటే చర్చ్ వల్ల..ఒకరికొకరు తెలుసే తప్ప పెద్దగా స్నేహితులు కారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పేరు పాల్, రాజ్ కి తెలుసు. పాల్ ఒక ధనవంతుడు, బిజినెస్ మాన్. అతని భార్య జెన్నీఅందగత్తె, ఒక హౌస్ వైఫ్. పాల్ లావుగా, పొట్టిగా ఉంటాడు. జెన్నీవీడికి కేవలం ఒక డెకరేటివె పీస్, ట్రోఫీ లాంటిది అని రాజ్ అనుకుంటుండేవాడు. అయినా ఇప్పుడు పాల్ వల్ల తనకు జరిగిన అన్యాయానికి ఆ ఫ్యామిలీ మీద పీకల దాక కోపం వచ్చింది. 

రెండు ఫునరల్స్ కి చర్చ్ తేదీలిచ్చి అనౌన్స్ చేసింది. పాల్ ది మంగళవారం మద్యాహ్నం, జూలీది బుధవారం ప్రొద్దున. అంతా అయిపోయాక, రాజ్ పిల్లలతో కలిసి, కళ్ళనిండా నీళ్ళతో బయటికి వస్తుండగా,  జెన్నీని చూసాడు. జెన్నీ బాధగా, ఓదార్పుగా ఏడవద్దు అన్నట్లుగా తల అటు, ఇటు ఊపింది. రాజ్ నమ్మలేకపోయాడు.

కోపంతో ఈమె ఇక్కడేం చేస్తుంది, వాళ్ళ వల్ల నాకు జరిగిన అన్యాయం ఇంకా చాలకనా??? కోపంతో మొహం తిప్పుకున్నాడు.

నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ, వంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ  ఎన్నో పగళ్ళు, రాత్రులూ గడిపాడు … రాజ్ ఆవేదన వర్ణనాతీతం.

నిను వీడి వెళుతున్నా కానీ

నా మనసు నీకై వదిలి వెళుతున్నా అన్నావనీ

నీతో గడిపిన క్షణాలను తలచుకొని

గడుపుతున్నా నీవు లేని క్షణాలనీ…

నిను వీడి వెళుతున్నా కానీ

నా గుర్తులు నీకై వదిలి వెళుతున్నా అన్నావనీ

కనీసం బ్రతికున్నా తలుచుకుంటూ నీ తీపి గుర్తులని

అవే నా నీ ప్రేమకి ఉచ్చ్వాస నిశ్శ్వాసాలని..

జూలీ…నా వెంటే నువ్వుంటున్నావని

బయటకి వెళ్ళి లోపలికి వస్తే నువ్వు ఎదురయ్యావని

పదిమందిలోఉన్నా..నువ్వు కనబడి పిలుస్తున్నావనీ

ఎంత తలచి రోజులు గడిపినా నిన్ను స్పర్శించలేని

చూడలేని నాజన్మ వ్యర్ధమని చెప్తుంది నా కన్నీరు నిన్ను చేరమని..

ఈ లోపున క్రిస్ మస్ పండుగ వచ్చింది. ఇక పెద్దగా చెప్పాలా? రాజ్, పిల్లలు ఏదో మాములుగా కానిచ్చారు. రాజ్ వాళ్ళ అన్న, వదిన వాళ్ళ పిల్లలు రావడం మూలాన ఏదో కొంచెం సందడిగా అలా సాగిపోయింది.

ఫ్యునెరల్ అయిపోయినా, ఇంకా సింపతీ కార్డ్స్ వస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఆ టైము లో వచ్చే క్రీస్ మస్ కార్డ్స్  కాస్త సింపతీ కార్డ్స్ గా మారిపోయాయి. వాటిల్లో ఒక కార్డ్ చదవాడనికి రాజ్ చేతిలోకి తీసుకున్నాడు. అది ఎక్కడినుండో ఆ క్షణం రాజ్ కి తెలియదు, లేకపోతే వెంటనే దాన్ని ఫైర్ ప్లేస్ లోకి విసిరేసే వాడేమో. ఒక్కసారి చదవడం మొదలుపెట్టాక చదవడం పూర్తిచేయకుండా ఉండలేకపోయాడు. అది జెన్నీ దగ్గిరనుండి. జెన్నీ ఎంతో అపాలిజిటిక్ గా రాసింది. అంతే కాకుండా జూలీ గురించి తనకు తెలిసిన చక్కటి విషయాలు రాసింది. రాజ్ యొక్క బాధను తాను ఎంతో అర్ధం చేసుకుని, తాను కూడా అంత బాధ పడుతున్నట్లుగా వివరించింది. తాను అటువంటి బాధలోనే ఉంటూ కూడా, తన గురించి ఒక్క ముక్క కూడా రాయలేదు. అది చదివాక, రాజ్ ఆమె యొక్క ఉన్నతమైన మనస్తత్వాన్ని అర్ధం చేసుకున్నాడు. తాను అదే కష్టం లో ఉంటూ కూడా, ఎదుటివారికి సింపతీ చూపించగల ఆమె గొప్ప మనసుని అర్ధం చేసుకున్నాడు. ధన్యవాదాలు తెలుపుతూ, సమాధాన ఉత్తరం రాశాడు.జూలీ ఫ్యునరల్ కి వచ్చినందుకు తనకు కోపం లేదని తెలిపాడు. ఏదైనా అవసరం అయితే జెన్నీకి గాని, పిల్లలకి గాని తనకు వెంటనే తెలియజెయ్యమని జెన్నీకి చక్కటి ఓదర్పు మాటలు వ్రాశాడు. అది పోస్ట్ చేసేశాక ఎందుకో కొద్దిగా వేరేగా ఫీల్ అయ్యాడు. తాను రెస్పాండ్ అవ్వకుండా ఉండాల్సిందని, చదివి అక్కడితో ఆపేయాల్సింది అని. ఒక వారం తర్వాత జెన్నీనుండి మళ్ళీ ఒక కార్డ్, థాంక్స్ చెబుతూ.

ఇక అందరూ రొటీన్ లో పడిపోయారు. జీవితాలు నెట్టుకొచ్చేస్తున్నారు. రాజ్ అన్న, వదినలు వాళ్లకి చేదోడు వాదోడు గా ఉంటున్నారు. రాజ్ గ్రీఫ్ పిరమిడ్ లో యాక్సప్టెన్సె లెవెల్ కి చేరుకున్నాడు.ఈ లోపుల వసంతకాలం వచ్చింది, ఈస్టర్ పండుగ ని తెచ్చింది. మళ్ళీ క్రొత్తగా చిగురించాలని నిర్ణయించుకున్నాడు.ఈస్టర్ పండుగ ని జూలీ చాలా గొప్పగ చేసేది. పిల్లలకు చాకొలెట్స్, జెల్లీ బీన్స్, ప్లాస్టిక్ ఎగ్స్, ఈస్టర్ బన్నీ ప్రొద్దున్నే పిల్లలకి తెచ్చినట్లు టూత్ బ్రషెస్, టూత్ పేస్ట్ బాస్కెట్స్ లో సర్దేవారు రాజ్, జూలీ. ఆ సాంప్రదాయాన్ని ఆపకూడదని, రాజ్ షాప్ లో అన్నీ కొన్నాడు, టూత్ బ్రషెస్ మర్చిపోయాడు. వెంటనే రియలైజ్ అయి, కొని జూలీ కి మనసులో అపాలజైజ్ చేస్తూ…సన్నగా కన్నీటితెర కళ్ళునిండుకున్నాయి. సరిగ్గా….అదే..టైము కి

రాజ్.. పిలుపు వినబడింది. ఆ క్షణం రాజ్ కి జూలీ పిలిచినట్లయింది. వెంటనే వెనక్కి తిరిగాడు. చూస్తే జెన్నీ‘.

తానుకూడా ఈస్టర్ బాస్కెట్స్ కొనడానికి వచ్చింది. కాసేపు క్షేమసమచారాలు మాట్లాడాక, హటాత్తుగా జెన్నీతనను తాను నిందించుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. “రాజ్, నీ జీవితం లో జరిగిన ఈ దుర్ఘటనకి నేనే కారణం. ఆ రోజు పాల్ క్రిస్ మస్ పార్టీ కి వెళ్ళినప్పుడు, నేను కూడా తనతో వెళ్ళవలసినది. ఏదో విషయం మీద గొడవయ్యి, నేను ఇంట్లోనే ఉండిపోయాను. నేను వెళ్ళిఉంటే కారు నేనే డ్రైవ్ చేసేదాన్ని. ఇలా జరిగి ఉండకపోయేది..

చుట్టూ సీను క్రియేట్ అవుతున్నదని గమనించి, రాజ్ పిల్లల్ని, జెన్నీని కాఫీ షాప్ కి తీసుకువెళ్ళాడు. కాఫీ ఆఫర్ చేసాడు. ఈ దుర్ఘటనలకి తాను ఎటువంటి కారణం కాదని, అది దైవ నిర్ణయం అని ఓదార్చాడు. జెన్నీఇంకా ఈస్టర్ బాస్కెట్స్ ని కొనడం పూర్తికాలేదు. మళ్ళీ షాప్ కి అందరూ కలిసి వెనక్కి వెళ్ళి, ఒక గంట సేపు షాపింగు చేసారు. తిరిగి వెళిపోయేటప్పుడు అభిమానం గా..ఎటువంటి కష్టం వచ్చినా ఒకరికొకరుసహాయం చేసుకుందామని ప్రమాణాలు చేసుకున్నారు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. అప్పుడప్పుడు ఫోన్లు చేసుకోవడం, బయటికి కాఫీ షాప్లలో కలవడం, అలాగే లంచ్ కని, డిన్నర్ కని.ఈ స్నేహం లో రాజ్, జెన్నీలోని ఎన్నో మంచిగుణాలను చూశాడు, ఆమెలోని ఎన్నో ఉన్నతమైన భావాల్ని చదివాడు. వాళ్ళిద్దరి స్నేహం గురించి ప్రత్యేకం గా ఎవరికి చెప్పలేదు, అలా అని రహస్యంగానూ ఉంచలేదు.

రాజ్ కి మళ్ళీ ప్రశ్నలు. ఎదురుగుండాలేని తన చిన్ననాటి స్నేహితురాలు జూలీ ని మనసు ఆవేదనతో అడుగుతున్నాడు. తాను చేస్తున్నది సబబే నా అని??? ఈ లోపున అలానే నిద్దట్లోకి జారుకున్నాడు. లేచేసరికి జూలీ చెవిలో గుస గుస్ గా చెప్పిందనే ఒక సరిక్రొత్త భావన… “పరిచయం అనే మొక్కకి, ఆప్యాయత అనే నీరు పోసినప్పుడు ప్రేమ అనే పువ్వు పూస్తుంది”. ఇది తన జూలి అంగీకారం గా, ఒక దేవ దూత సందేశంగా మనసులో అనిపించి జెన్నీగురించి  రాజ్ అన్న, వదిన్లతో మాట్లాడాడు. ఆన్నది ఒకటే కన్ సర్న్, పిల్లలు. కాబట్టి సరే అన్నాడు. వదిన కు నచ్చలేదు, పైగా ఆమెతో డేటింగ్ చేస్తున్నావని కేకలేసింది. రాజ్ కి వదినంటే చాలా గౌరవం, ఇంటిల్లపాది, ఆమెను ఆ ఇంటికి ఒక దేవదూత లా చూస్తారు. జెన్నీ కి ఒకటే కన్ సర్న్, వాళ్ళ క్రైస్తవ కూటములు ఏమంటాయా అని. రాజ్ కి వాటితో పనిలేదని ఎప్పుడో అనుకున్నాడు కాబట్టి పట్టించుకోలేదు, కాని జెన్నీ అభిప్రాయాల్ని మాత్రం పూర్తిగా గౌరవిస్తున్నాడు.

ఇప్పుడు రాజ్ కి ఎన్నో ప్రశ్నలు..మేమేమి చేస్తున్నాం? దేవుడు మా ఇద్దరి జీవితాల్లో కొన్నాళ్ళు విషాదాన్ని నింపాడు, ఇప్పుడు దాన్ని తొలగించి అమృతాన్ని నింపుతున్నాడు. నా భార్య చావుకి కారణమైన వాడి భార్యని నేను ప్రేమించడమేమిటి? దీనినే విధి అంటారా?  చివరిదాకా ఉంటానన్న జూలీ లేకుండా వెళ్ళిపోయింది, ఏ జన్మదో ఈ క్రొత్త బంధం చేరువవుతున్నది. విధి మమ్మల్ని ఒక విషాదంతో కలుపుతున్నదా? ఈ నిర్ణయంవల్ల మమ్మల్ని అభిమానించేవాళ్ళు బాధ పడతారా? నేనీ ప్రశ్నలకి తలవంచనా? దైవ నిర్ణయానికి తలవంచనా?… 

కాలమే నిర్ణయించాలి………..

జూలీ..

ఇది దేవుడు ఆడించే నాలుగు స్తంభాలాట

ఈ ఆటనుండి నువ్వు తప్పుకుని, ఆ దేవునితో చేతులు కలిపావ్

వంటరిగా ఈ ఆట పూర్తిచెయ్యమని భుజం తడుతున్నావ్

ఇది శాపమో వరమో అర్ధం కాని నా జీవిత పయనం

నీ నమ్మకం దేవుని మీద, నా నమ్మకం నీ మీద

నువు ఇచ్చిన సందేశం నా విధిగా భావించి

నువ్వు చూపించిన మమకారం నా బాటగా గుర్తించి

నువు చూపించే మార్గం నా ధ్యేయంగా స్వీకరించి

ముందుకెళ్తా జీవితాన్ని మళ్ళీ జీవించడానికి..

రాజ్, జెన్నీపోయినవారమే ఒక బుధవారం చర్చ్ లో పెళ్ళి చేసుకున్నారు. జీవితం అంటే మళ్ళీ జీవించడమే. అంతా దేవుని యొక్క పన్నాగం. లైఫ్ ఈజ్ ఫర్ లివింగ్!!!!

 

1 thought on “అలా మొదలైంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *