May 3, 2024

మాయానగరం – 3

రచన: భువనచంద్ర

bhuvana

ఆనందరావు ఆలోచిస్తున్నాడు. “మూడో యింటివాళ్లు అకస్మాత్తుగా కాఫీ టిఫెన్ పంపడంలోని  అంతరార్ధం ఏమిటా” అని. వాళ్లకి పెళ్ళీడుకొచ్చిన కూతురున్నట్టు ఎలాంటి దాఖలాలూ లేవు. మరెందుకీ ‘ఉచిత’ కాఫీ టిఫెన్ పథకం?

ఆంధ్రదేశంలో బ్రహ్మచారులకి ‘ప్రత్యేక’ సదుపాయాల్నీ’సంసారులు’ సమకూర్చడంలో ఎన్నో అర్ధాలుంటాయి. పెళ్లి కావలసిన కూతురో, చెల్లెలో, మరదలో ఉంటేగానీ ఇలాంటి ‘అర్ధాంతర ఆప్యాయతల  వర్షం  కురవదు’. ఇది అతని నిశ్చితాభిప్రాయం. కాఫీ తాగటం, కప్పూ సాసరూ, టిఫెన్ ప్లేటు తిరిగివ్వడం ఎప్పుడో జరిగిపోయినా, ఆలోచనలు మాత్రం ఆగలా. అసలు చిక్కేమిటి? ఫిలసాఫికల్ ‘వ్యూ’తో ఆలోచించాడు. ‘కార్యం’ తరవాత ‘కారణం’వస్తుందా. ఎఫెక్టుకి ముందే ‘కాజ్’ ఉంటూందా? అసలీ కాఫీ టిఫిన్లు చెయ్యడం కాజా? ఎఫెక్టా? ఆలోచిస్తూ నడుస్తున్నాడు. నడుస్తూ ఆలోచిస్తున్నాడు.

ఆ పక్కనించి మిసెస్ మాధవీరావ్ ‘చీపురు పుల్లా’విడ విషయం మర్చిపోయి తను వ్రాయబోయే వ్యాసానికి ఏ పేరు పెట్టాలా ఆని ఆలోచిస్తూ నడుస్తూ, మళ్లీ ఆలోచిస్తూ వస్తోంది. ఆనందరావు కాజ్ ఎండ్ ఎఫెక్టు థియరీతో కుస్తీ పడుతూ ఇటునిచి అటువైపు నడుస్తున్నాడు. ఆలోచనతో ఉండి ‘బండి’ తోలినప్పుడే ‘యాక్సిడెంట్లు’ జరుగుతాయి. ఇప్పుడు ఓ యాక్సిడెంటు జరిగింది. ఇలా ఇద్దరు ముక్కూ మొహం తెలియని వ్యక్తుల్ని కలపడానికి ‘ఇటు’వంటి యాక్సిడెంట్లు నవలల్లోనూ, కథల్లోనూ, సినిమాల్లోనూ పెట్టడం అటు రచయితలకీ ఇటూ పాఠకులకీ, ప్రేక్షకులకీ కూడా కొత్త కాదు. చాలా కన్వెన్షనల్ ఎండ్ సక్సెస్‌ఫుల్ ప్రాసెస్. సరే.. యాక్సిడెంట్ సక్సెస్‌ఫుల్‌గా జరిగి ఆనందరావు అనబడే బ్రహ్మచారి, మిసెస్ మాధవీరావ్ అనబడే సౌందర్యరాశిని ‘ఢీ’ కొట్టడం జరిగింది. చిన్నపాటి మెరుపులు మెరిశాయి. వచ్చేపోయే వాహనాలు కొద్దిపాటి ‘రీరికార్డింగ్ ఎఫెక్టు’ని  సమకూర్చాయి.

“సారీ..” అన్నాడూ ఆనందరావు తలదించుకుని.

“ఓహ్…”అంది మిసెస్ మాధవీరావు. ఓ చిన్నసైజు ‘బొప్పె’  బ్యూటీ స్పాట్‌లా ఆమె నుదిటి మీద ఉబికింది.

“తప్పు నాది. క్షమించండి” అన్నాడు ఆనందరావు.

“కాదు కాదు. తప్పు నాదే. ఏదో ఆలోచిస్తూ.. “అంటూ సన్నగా నవ్వింది.

“నో.. నో.. నాటెటాల్.. ఆలోచిస్తూ వస్తున్నది నేను. “బాబీ సినిమాలో “పెహలే ఆప్” పాటలా మళ్లీ అన్నాడు ఆనందరావు.

“ఊహూ.. నేనే ఆలోచిస్తూ వస్తున్నా.” ఏమైనా సరే. తప్పు నాదే అన్నట్టుగా పట్టుబట్టింది మాధవీరావ్…

“పోనీ.. తప్పు ఇద్దరిదీ అనుకుందాం…” రాజీ పడ్డాడు ఆనందరావు. సమస్యకి పరిష్కారం కుదిరింది. కిందపడ్డ ఆవిడ పుస్తకాల్ని తీసి ఆవిడకందించాడు ఆనందరావు. ఓ బ్యూటిఫుల్ స్మైల్‌ని ‘ఫ్లాష్’ చేసి ఆవిడ ముందుకు నడిచింది.

********************************

పగలు తొమ్మిదింటీకి మిస్ శోభారాణి B.Sc మంచం మీంచి లేచింది. ఆవిడ వయసు ఖచ్చితంగా ఇరవై. రాత్రి చాలా దుఃఖంతోనూ, అనేకానేక ప్రశ్నలతోనూ సతమతమై నిద్రపోవడం వల్ల లేవడం ఆలస్యం అయింది గానీ, మామూలుగా అయితే ఠంచనుగా ఆరింటికే లేస్తుంది. బాగా నిద్రపోవడం వల్ల ‘ఫ్రెష్’గా అనిపించింది. ఆవిడ ఉండే గది చాలా చిన్నది అయినా నీటుగా సర్దబడింది.

మిస్ శోభారాణి బియ్యస్సీ అద్దం ముదుకెళ్ళి నిలబడింది. రాత్రి చెంపలమీద జాలువారిన కన్నీటి మరకలు ఇంకా అక్కడక్కడా కనిపిస్తున్నై. ఆదివారం గనక ఫరవాలేదు. లేకపోటే యీ వేళ్టికి కుక్కింగూ, డ్రెస్సింగూ కానిచ్చి ఏదో భూతం వెంటబడ్డట్టు ఉరుకులు పరుగుల మీద స్కూలుకి పోవాల్సి వచ్చేది. ‘నా’ అనే వాళ్లుంటే ‘ఎలా’ ఉంటుందో అనాధాశ్రమంలో పెరిగిన శోభారాణికి తెలీదు. అక్కడే చదువుకుని, పెరిగి పెద్దదై ప్రస్తుతం  ప్రయివేటు స్కూల్లో సైన్సు టీచరుగా పనిచేస్తోంది. కాలం విచిత్రమైంది. శరీరానికి మూలకారణం ఎవరో తెలీదు గానీ శరీరం మాత్రం ఉంది. కులమతాలు  తెలీవు గనక ఎవరితోటీ గొడవల్లేవు. ఒంటరితనంలో ఉండే కష్టనష్టాలు ఒంటరివాళ్లకు మాత్రమే తెలుసు. అందుకే అమ్మానాన్నా, అక్కా చెల్లీ, అన్నా తమ్ముడూ ‘ఉంటే ఎంత బాగుంటుందో’ అనే ఊహల్తో సతమతమవుతారు. మరోచిత్రం ఏమిటంటే, ‘అందరూ’ ఉన్నవాళ్లకి బాంధవ్యాల సౌందర్యం అర్ధం కాదు. వాళ్లు ‘విడి’గా వుండాలని కోరుకుంటారు. వీలున్నంత  దూరంగా ఉండాలని టేక్నికల్ ఎక్స్‌క్యూజెస్ వెదుక్కుంటారు. ‘లేని’దాన్ని కావాలనుకోవడమూ, ఉన్నదాన్ని నిర్లక్ష్యంతో చూడడమూ మానవస్వభావం.. ఇది అత్యంత సహజం.

‘స్టౌ’మీద కాఫీకి నీళ్లు పడేసింది పనిమనిషిని పెట్టుకోలేదు. ‘మనీ యీజ్ ఎనర్జీ! సేవ్ ఇటీ..!’ యీ సిద్ధాంతం వంటరివాళ్లకి భగవద్గీతలాంటిది. ఎందుకంటే, అన్నీ, ఆఖరికి ‘ప్రేమ’ని కూడా డబ్బుతోనే కొనాలి గనక! పెళ్ళి చేసుకోవాలన్నా.. ఒంటరిగా బయటకు వెళ్లదీయాలన్నా ‘డబ్బే’ అల్లావుద్దీన్ దీపం.  యీ విషయాలన్నీ శోభారాణికి ‘సౌందర్య’ బోధించింది. సౌందర్య మేత్స్ టీచర్. ఇద్దరు పసిపిల్లలున్న విడో. భర్త ముందు చూపుతో ‘తన లైఫ్’ని ఇన్ష్యూర్ చెయ్యడం వల్ల, సౌందర్యకి డబ్బు ఇబ్బంది లేదు.  కానీ పిల్లల కోసం ‘పొదుపు’ ని వ్రతంగా ఆచరిస్తోంది.

ప్రస్తుతం శోభారాణికి అనఫిషియల్ గార్డియన్ సౌందర్యే. ‘చూడు శోభా… ‘డబ్బు’ అనగానే రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి ఖర్చు. రెండోది జమ. యీ రెండూ త్రాసుకి ఉండే రెండు పళ్లాల్లాంటివి. ఒకటి పైకెడితే రెండోది కిందకి దిగక తప్పదు. కనుక “ఖర్చు” పళ్ళెం స్థిరంగా ఉండేలా చూసుకున్ననాడే ‘పొదుపు’ పళ్లెంలో ‘జమ’ ఎక్కువగా చెయ్యొచ్చు. “సేవ్ పెన్నీస్.. పౌండ్స్ విల్ సేవ్ దెంసెల్వ్స్…!” అని ఓనాడు ఉపన్యాసం కూడా ఇవ్వడం వల్ల శోభారాణి బియ్యస్సీ వీలున్నంత ‘జమ’ చెయ్యటానికి అలవాటు పడింది… యీ లోకం బోలెడు నీతుల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్లే ప్రతివాడి దగ్గరా లెక్కకు మించిన నీతులు స్టాకులో పడుంటాయి. పబ్లిష్ చేసిన పుస్తకాలు ‘అమ్ముడు’ బోని రచయితలు ఇంటికొచ్చిన గెస్టులకు ఆటోగ్రాఫు చేసిన సవర పుస్తకాలు ‘ప్రెజెంటు’ చేసి భారం వదిలించుకున్నట్టు ప్రతివాడూ  అయిందానికీ, కానిదానికీ కూడా సలహాలివ్వడానికి ‘రెడీ’గా ఉంటాడు. ఆదో సంతృప్తి. మరో ‘యూనివర్సల్ ట్రూత్’ కూడా ఇందులో ఇమిడి ఉంది. నీతులు ఇతర్లకి చెప్పడానికే తప్ప ‘స్వంతానికి’ ఎవరూ ఉపయోగించరు. అలాగే ‘సలహా’ కూడా.

లోకానికి మరో ముఖ్యమైన పని కూడా వుంది. ఇన్సూరెన్శ్ ఏజంటులా భవిష్యత్తుని భయంకరంగా చిత్రించడం. గతంలో కలిసిన భూతకాలానికి బంగారపు తొడుగు వెయ్యడమే కాక వర్తమానాన్ని తిట్టిపొయ్యడం కూడా లోకులకి ముఖ్యతిముఖ్యమైన పనే! జుడీషియల్‌గా బాగా మధించిన ఓ జడ్జిగారు ఇలా సెలవిచ్చారు “డు నాట్ అప్రోచ్.. అన్లెస్ యూ ఆర్ అప్రోచ్డ్” అని.. అంటే, “కళ్లెదురుగా మర్డర్లు జరుగుతున్నా మౌనంగా కూర్చో. కేసు కోర్టుకొచ్చినప్పుడు విచారణ ప్రారంభించూ” అని. యీ సూత్రాన్ని మాత్రం లోకం విధిగా పాటిస్తుంది. ముందర మనసుల్ని ‘చంపేసి’ (మాటల్తో) ఆ తరవాతే తీరిగ్గా కన్నీరు కారుస్తుంది.

ఒంటరి వాళ్లంటే లోకానికి ఎలర్జీ. లోకుల దృష్టిలో ఒంటరి వాళ్లు పబ్లిక్ ప్రాపర్టీ. ‘ఆమ్రపాలి’ని లిచ్చవీ పరిషత్తు ‘పబ్లిక్ ప్రాపర్టీ’గా డిక్లేర్ చేసినట్టుగా అందమైన అనాధల్ని లోకమూ ‘పబ్లిక్’ చేస్తుంది. వాళ్ల ప్రతీ చర్యనీ గూఢచారిలా లక్ష కోట్ల కళ్లతో గమనిస్తూ ఉంటూంది. ఏ చిన్న ‘తప్పు’ జరక్కపోయినా ఏదో ఒకటి ‘అంటగట్టి’ సనాతన ధర్మానికి నీరు పోస్తుంది.

మిస్ శోభారాణి బియ్యస్సీ ఒంటరిది. అందునా వయసూ సొగసూ, వాలుకన్నులూ, ఉంగరాలు ముంగురులూ కలిగి యున్నది. మరి సంఘానికింకేం కావాలి? ఇంత గొప్ప ‘ఆపర్చ్యునిటీ’ని సమాజం ఎలా వదులుకుంటుంది?

మగాడనే ప్రతివాడూ ఆవిడ్ని చూపుల్తో సర్జరీ చేసి చప్పరించేవాడే. ఇప్పతివరకు యీ  ‘చప్పరించడం’ ‘మనసా వాచా’నేగానీ ‘కర్మణా’ జరగలేదు. ఫ్యూచర్ ఏవిటో శొభారాణికీ తెలీదు.

*********************

పంచాయితీ ఆఫీసుల్లో ఎగ్జిక్యూటివ్‌లూ, చాంబర్లలో మినిస్టర్లూ ‘పేరు’కే ఉంటాయి. కేవలం పబ్లిక్ ఫండ్‌ని దండుకోవడానికే ఉంటారనేది జగమెరిగిన సత్యం. మున్సిపాలిటీ ఎద్దుల్లా ‘గజం’ కదలటానికి గంటల కొద్దీ ‘టైం’ తీసుకుంటారు. చాలాసార్లు ఆ గంటలు రోజుల్లోనే నెలల్లోకీ, సంవత్సరాల్లోకీ పారిపోతూ వుంటయై. ‘ఎందుకూ’ అని ఏ పబ్లిక్ సర్వెంట్‌నన్నా అడగండి. ప్రభుత్వ లొసుగులన్నీ ఏకరువు పెడతాడు. ‘పన్నులు పెంచడం’ లాంటి సున్నిత వ్యవహారాలు మాత్రం యమార్జంటుగా అమలవుతాయి. ‘దంపినమ్మకి బొక్కిందే దక్కుడు’ అన్నది గవర్నమెంటు ఉద్యోగుల ‘మూలా సిద్ధాంతం. ‘కుర్చీలో ఉండగానే కోట్లు కూడబెట్టుకో’ అనే హెచరికని నిత్యం వాళ్ల మనసు మర్చిపోకుండా గుర్తు చేస్తుంది’.

గుడిసెల సిటీకి లైట్స్, వాటర్ సప్లై చేసే పవిత్ర భారాన్ని  ప్రభుత్వోద్యోగులు భగవంతుడి మీదకి నెట్టేశారు. దాంతో ఆయన తన సబార్డినేట్సయిన సూర్యుడ్నీ, వరుణుడ్నీ ఆ యొక్క పవిత్ర కార్యం నిర్వర్తించడం కోసం ‘డిప్లోయ్’ చేశాడు. ఉదయాన్నే సూర్యుడు స్విచాన్ అయిపోయి వెలుగులు కురిపిస్తే అప్పుడప్పుడూ వరుణదేవుడు వర్షాన్నికురిపించి నీటి కొరతనేగాక , చెత్తా చెదారాన్నీ వీధుల్లోంచి తొలగించి మున్సిపాలిటీ కర్తవ్యాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. అన్నట్టు రోగాల్నించి రక్షించడం కోసం పైన యమధర్మరాజూ కింద గవర్నమెంటు హాస్పిటలూ సర్వవేళలా సిద్ధంగా ఉంటారు. ఇక ఎగ్జక్యూటివ్స్‌కి పనేముందీ? పన్నులు మాత్రం ‘పళ్లూడ’గొట్టి కట్టించుకుంటారు. కలరాలూ, ప్లేగులూ రాకపోవడం జనాల అదృష్టం. పేదవాడి కొంపలో దూరితే ఆకలికి ఆగలేక ‘వండుకు తినేస్తా’రనే భయంతో ఎలకలు కూడా గుడిసెల్లోమకాం పెట్టవు. దోమలు మాత్రం ఇంపార్షియల్‌గా వ్యవహరిస్తాయి.

ఆకలీకాటు’కే భయంలేని వాళ్లకి దోమాకాటెంత? ఇనాక్యులేషన్ అంటే ఆ జనాభాకి ఎలర్జీ. ‘ఇంజక్షన్లిచ్చి’ చంపుతారనే అపప్రధ కూడా ప్రజల్లో ఉంది. కారణం ఎక్స్‌పయరీ డేట్ అయిపోయిన మందుల్ని మాత్రమే వారికి డాక్టర్లూ, నర్సులూ ఉచితంగా సప్లై చేస్తారు గనక. ‘ఫేమిలీ ప్లానింగ్’ వాళ్ళు పొరపాట్న కూడా ఆ సందుల్లోకి అడుగుపెట్టదు. ఒకవేళ అడుగుపెట్టినా గవర్నమెంటు చదివించే కేషూ, రేడియోలాంటి కానుకలు గుడిసెలోళ్లకి అందవు. హెల్త్ విజిటర్స్‌కి గుడిసెలంటే ఎలర్జీ. ప్రస్తుతం గుడిసెల్లో ఒకడికి ఏదో జబ్బు చేసింది. వీళ్ళకి సామాన్యంగా జబ్బులు రావు. వస్తే పోవు. ఆ జబ్బు చేసింది ఓ ముసలాడికి. వాడీకీ బోస్‌బాబుకీ ఏదో దూరపు చుట్టరికం ఉంది. అదీ కొసప్రాయంగా! వాడికి ‘నా’ అన్నవాళ్లు వేరే లేక బోస్‌బాబుకి కబురెట్టాడు. బోస్ వెళ్ళేసరికి ముసలాడు “ఖళ్ళు’న దగ్గి “భళ్ళు’న  కక్కాడు. మన పొలిటిషియన్స్‌కి హెల్తంటే మహాశ్రద్ధ. కరువులూ, కాటకాలూ, వరదలూ, వుప్పెనలూ వచ్చినా ‘ఏరియల్ సర్వే’ తప్ప ఎదటికి రారు. బోస్‌బాబు కూడా అదే టైప్. ముక్కుకీ, మూతికీ రుమాలు అడ్డం పెట్టుకుని, ‘ఇప్పుడే వస్తా’నని గురువుగారింటికెళ్ళాడు. ఏం చేసినా ‘పెద్ద’లకి చెప్పకుండా చెయ్యటం రాజకీయ నేరం. అందుకే ‘గురు’గారి దగ్గరికి పరిగెత్తాడు బోసుబాబు.

అయితే, ముసిలాడికొచ్చింది ‘జబ్బు’ కాదనీ, అంతకు ముందురోజు దట్టించిన ‘మందు’ ఎఫెక్టనీ, ఆ మందు కల్తీమయమనీ, ఆ షాపు ఓనరు తనేనని, బోసుబాబుకి తెలియకపోవడం కేవలం ఇగ్నోరెన్స్. ‘చిన్న’ తప్పు ‘చింత’గింజలాంటిది. నీరుపోస్తే మహావృక్షమవుతుంది. బోస్ వెళ్ళేసరికి గురువుగారి చుట్టూ చాలా మంది శిష్యులున్నారు. శిష్యుల్లో కూడా అనేక రకాలు. ఆంతరంగిక శిష్యులు, అంతరంగ శిష్యులు, పరమాంతరంగిక శిష్యులు .. జస్ట్ కేవలం శిష్యులు. ‘గ్రేడింగ్’ని బట్టి వారికి కొన్ని హక్కులూ, గౌరవాలూ ఇవ్వబడతాయి. గురువుగారి పరమాంతరంగ శిష్యుల్లో బోసుబాబొకడు. అందుకే అతను లోపలికెళ్ళగానే మిగిలినవాళ్లంతా ‘ఏదో’ ఒక పని పేరు మీద బయటికెళ్ళిపోయారు.

“ఏమయింది?”సూటిగా సమస్యలోకి దిగిపొయాడు గురూజీ.  “ముసలోడికొకడీకి దగ్గూ. వెంటనే వాంతి” కట్టే, కొట్టె, తెచ్చే అన్న పద్ధతిలో వివరించాడు బోసు. గురువుగార్లందరూ (ప్రత్యేకంగా పొలిటికల్ గురువులు) ఆవలించకుండానే పేగుల్లెక్కబెట్టే సామర్ధ్యంగలవాళ్లు. ఆ ‘చింత’ గింజంత ‘ఇగ్నోన్స్’నీ గురువుగారు వెంటనే పట్టేశాడు. ఎలాగూ అంటే అంతే!! అతి చిన్న లాజిక్కు.. శిష్యుడికే ‘ఆ’ తెలివుంటే తనదాకా ఎందుకొస్తాడు? “శభాష్” అంటూ గురువుగారు చిర్నవ్వు నవ్వాడు. బోస్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.

గురువుగారు నవ్వితే “మిగతాది నేంజూసుకుంటా నువ్వు వెళ్లిపో!!” అని అర్ధం ‘అభయం’ కూడా. బోస్‌బాబు చరచరా బైటికొచ్చి బందేక్కాడు.

******************

మిసెస్ మాధవీరావ్ కావల్సిన సరంజామా కొనుక్కుని ఇంటికెళ్ళాక ‘కిటికీ’ తలుపు తెరిచి అవాక్కయింది. ఒళ్ళంతా వేదనతో భయంతో గడ్డకట్టుకుపోయినట్లు ఆమెకనిపించింది. శవాలు.. వరసగా ఆరు శవాలు. ఒకదాని పక్కన ఒకటి పడుకోబెట్టి వున్నాయి. కనీసం అరవై, డెబ్భై మంది విహ్వలంగా రోదిస్తున్నారు. ఆ శబ్దం ఎంత ‘దీనంగా’ ఉందంటే.. పాషాణాన్నైనా కరిగిస్తుంది. కొత్త పెళ్ళికూతురి భర్త కూడా ఆ శవాల్లో ఒకడూ. దృశ్యం భయానకంగా ఉంది.

శవాలు… రోదన.. పాపం ఆ అమ్మాయికి నిన్నగాక మొన్న పెళ్ళయింది. లేతగా తమలపాకులా ఉంటుంది. మొన్న పెళ్లికూతురు .. నిన్న భార్య… నేడు విధవ… “హే భగవాన్.. ఏమిటిదంతా..??” గట్టిగా రెండు చేతుల్తోటి తల నొక్కుకుంటూ మంచం మీద కూలబడింది మాధవీరావ్. ఏం చెయ్యాలి ?

గబగబా వీధిలోకొచ్చి అడిగింది ఏమయిందని. “ఏటున్నాదమ్మా? తాగారు. చచ్చారు. తాగి ఎంతమంది చచ్చినా పట్టించుకోకుండా కల్తీ సారా అమ్మేవాళ్లు అమ్ముతూనే ఉంటారు. తాగి చచ్చేవాళ్ళు చస్తూనే ఉంటారు. తెగేది ఆడాళ్ళ తాళేగా?”నిర్వేదంగా  అంది ఓ ఆడమనిషి. మాధవీరావ్ మనసు ఉడికిపోయింది.

“పోనీ ఆడాళ్లంతా కలిసి ఆ సారాకొట్టుని మూయించొచ్చుగా? ఎన్నాళ్ళిలా ఊరుకుంటారు?” ఉద్రేకంతో ప్రశ్నించింది.

“సారాకొట్టుని మూయించాలంటే ప్రభుత్వాన్నిమూయించాలి. అదెవరికి సాధ్యం? ఆ కొట్టి పెట్టించిందే ప్రభుత్వం. ఆ లైసెన్సు తీసుకుంది పంచాయితీ మెంబరు.. అమ్మేది ఆడి చుట్టం..  తాగి సచ్చేది మా వాళ్ళు.. ఎవరు చెపితే ఎవరు వింటారు తల్లీ.. నా మొగుడూ ఇట్టాగే తాగి తాగి చచ్చాడు. ఏం చేస్తాం? తెచ్చినరోజున వండిపెట్టా, తాగి చచ్చిన రోజున ముండమోశా!”కదిలిపోయింది ఆడమనిషి.

“ఊహూ. ఏమైనా దీన్ని వదలకూడదు. యీ అన్యాయన్ని అరికట్టి తీరాలి. ప్రభుత్వం ముందు “దోషుల్ని’ నిలబెట్టి తీరాల్సిందే.” తనలో తనే ప్రతిజ్ఞ చేసుకుంది మాధవీరావ్.

కానీ ఆవిడకి తెలీని వ్యవహారం ఒకటుంది. అది రాజకీయం.

ఇంకా ఉంది….

3 thoughts on “మాయానగరం – 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *