May 3, 2024

తుమ్మెద పద్యములు

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు j.k.mohanrao

పాల్కురికి సోమనాథుడు తెలుగులో ఆ కాలములో ఉండే దేశీయ ఛందస్సులను గుఱించి ఈ విధముగా చెప్పాడు –

పదములు, తుమ్మెద – పదముల్, ప్రభాత

పదములు, శంకర – పదముల్, నివాళి

పదములు, వారేశు – పదములు, గొబ్బి

పదములు, వెన్నెల – పదములు, సంజ

వర్ణన మరిగణ – వర్ణన పదము …

ఇందులో తుమ్మెద పదములు అనేవి బహుశా ద్విపద ఛందస్సులోని ఒక ప్రత్యేకత యేమో?  ఇప్పటికి కూడ ద్విపద ప్రతి పాదమును రెండు భాగములుగా చేసి చివర తుమ్మెద, ఉయ్యాల, లాలి లాటి పదములను తగిలించి పాడుట వాడుకయే.  నా ఊహలో అలాటిది ఒకటి –

ఎక్కడే నారాజు తుమ్మెదా

ఎక్కడే వాడు తుమ్మెదా

చిక్కడే వెదుకగా తుమ్మెదా

చిక్కడే వాడు తుమ్మెదా

ముక్కలే హృదయమ్ము తుమ్మెదా

మొక్క వాడేను తుమ్మెదా

పక్కన వస్తాడొ తుమ్మెదా

పక్కున నవ్వ తుమ్మెదా

ఛందోఽగ్రంథాలలో తుమ్మెద పేరితో ఎన్నో పద్యములు ఉన్నాయి. ఆంధ్రభారతి నిఘంటువును శోధించగా, తుమ్మెద పర్యాయపదములు ఈ విధముగా వివరించబడినవి –

తుమ్మెద : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) –

అనిమకము, అలి(ప)(మ)కము, అళి, ఇందిందిరము, కలక్వాణము, కలాలాపము, కలానునాది, కొంకిరము, కృష్ణదేహము, గంధమాదనము, ఘండము, చంచరీకము, జంటముక్కాలి, జమలిముక్కాలి, తేటి, తే(నె)(నియ)తిండి, ద్విరేఫము, నీలభము, పద్మబంధువు, పుష్పంధయము, పుష్పకీటము, పుష్పలిహము, ప్రియకము, బంభరము, బమిపుర్వు, భసలకము, భసలము, భృంగకము, భృంగము, భృంగరాజము, భ్రమణము, భ్రమరకము, భ్రమరము, మధుకరము, మధుపము, మధులిహము, మధులిట్టు, మధువ్రతము, మధుసూదనము, మిళిందము, ముద్దుగలకాళ్ళపురువు, మొగరంభము, రేణువాసము, రోలంబము, లోలంబము, విరితేనెమేపరి, శిలీముఖము, షట్చరణము, ష(ట్ప)(ట్పా)దము, షడంఘ్రి, సారంగము, సుకాండి.

ఈ లఘు వ్యాసపు ముఖ్యోద్దేశము తుమ్మెద పదముతో ఉండే వివిధ నామముల వృత్తములను, జాతి పద్యములను సోదాహరణముగా విశదీకరించుటయే.

తుమ్మెద పేరితో కొన్ని వృత్తములు –

భ్రమరవిలసితా – మ/భ/న/లగ, యతి (1, 5) UU UU – IIII IIU

11 త్రిష్టుభ్ 1009

వచ్చెన్ గాదా – వసుధకు సిరియై

వచ్చెన్ గాదా – వలపుల పదమై

వచ్చెన్ గాదా – వధువుల మధువై

యిచ్చున్ గాదా – ఋతు విది వరమై

భ్రమర – భ/ర/మ/ర, యతి (1, 7) UII UIU – UUU UIU (సార్థకనామ వృత్తము)

12 జగతి 1047

అభ్రముపైన నా-ట్యమ్మాడెన్ మేఘముల్

శుభ్రముగా నదుల్ – సొంపై పాఱెన్ ధరన్

విభ్రమ మీయుచున్ – విచ్చెన్ పుష్పాచయం

బా భ్రమరమ్ములో – యాలాపించెన్ సదా

చంచరీకావళి – య/మ/ర/ర/గ, యతి (1, 7) IUU UUU – UIU UIU U

13 అతిజగతి 1154

ససిన్ బూలన్ గ్రోలన్ – జంచరీకావళుల్ హృ-

ద్వసంతమ్మం దెందున్ – వర్ణ సౌభాగ్యమేగా

రసాంబోధుల్ నిండన్ – రాగరత్నమ్ములేగా

నిసిన్ నక్షత్రమ్ముల్ – నేత్రపర్వమ్ములేగా

మత్తభృంగ – భ/జ/త/న/లగ, యతి (1, 8) UIII UIU – UIII IIU

14 శక్వరి 7983

కాను మిట మత్త భృం-గమ్ములను వనిలో

వానవలె సూనముల్ – వందలుగ కురియన్

దేనెవలె గాలిలోఁ – దీయనగు రజముల్

ఓ నవ వసంతమా – యుర్విపయిఁ ద్వర రా

మధుపాళి – స/స/స/స/లల, యతి (1, 9) IIUII UII – UII UII

14 శక్వరి 14044

ఇది యామని కోయిల – యింపుగఁ బాడును

మధుమాసపు టూయెల – మల్లెల నాడును

మధుపాళియు నెల్లెడ – మత్తుగ ఝుమ్మనె

మధురాధర మిప్పుడు – మాధవు నిమ్మనె

భ్రమరావలికా     స/స/స/స/స, యతి (1, 9) IIUII UII – UIIU  IIU

15 అతిశక్వరి 14044

కన నెల్లెడ సొంపుగఁ – గన్నుల కింపులతో

వనిలోఁ బలు సుందర – వర్ణములన్ విరులే

యనురాగము జూపుచు – నా భ్రమరావళి సు-

స్వన శోభలఁ గ్రోలెను – బాడుచుఁ దేనియలన్

షట్పదేరితము – న/ర/న/ర/న/ర, ప్రాసయతి (1, 7, 13) III UIU – III UIU – III UIU

18 ధృతి 95704

లలిత భావమై – లలిత రాగమై – లలిత గీతమై

కలల నీడగా – లలన బాడగా – నలలు లేచెగా

నలల హోరులో – జలము  చిందగా – వెలుఁగు కాంతిలోఁ

గలుఁగు భ్రాంతిలో – నలరు మోదమా – తెలుఁగు నాదమా

లోలలోలంబలీల – ర/ర/ర/ర/ర/ర/గ, ప్రాసయతి (1, 7, 13) UIU UIU – UIU UIU – UIU UIU

19 అతిధృతి 74899

మాధవా కేశవా – రాధికానాయకా – యాదవాఽకాశదీపా

శ్రీధరా అచ్యుతా – భూధరోద్ధారణా – వేదమంత్రార్థరూపా

నాదలోలా హరీ – శ్రీద గీతప్రియా – మోదవారాశిచంద్రా

హ్లాదసంజీవనా – ఖేదనాశాఽనఘా – యోధరాజా ఉపేంద్రా

లోలలోలంబలీల – ర/ర/ర/ర/ర/ర/గ, యతి (1, 8), ప్రాసయతి (1, 13) UI UUI UU – IUIIU – UI UUI UU

19 అతిధృతి 74899

వీణ మ్రోగేను నీకై – వినేవా సకీ – వాణి పల్కేను నీకై

మేనిలోఁ బుల్క నీకై – మృణాళాననా – దేనెలోఁ దీపి నీకై

కానలోఁ బూవు నీకై – కనేవా చెలీ – గానరాగమ్ము నీకై

మానసమ్మిందు నీకై – మహచ్చేతనా – నేను జీవింతు నీకై

శిలీముఖోజ్జృంభితము – మ/స/జ/న/జ/త/గ, యతి (1, 9) UU UII UIU – IIIII UIU UIU

19 అతిధృతి 155481

ఆనందమ్ముల రాశిగా – నగపడెను భూమి యీ యామనిన్

తేనెల్ జిప్పిలు పూల పం-దిరులకు శిలీముఖోజ్జృంభితం

బైనట్లుండెను జూడఁగా – ననిలముల నిండెఁ గింజల్కముల్

గానమ్మాడెడు కోకిలల్ – గదలె సహకారహిందోళకన్

భ్రమరకుంతల – భ/భ/త/య/భ/జ/ల, యతి (1, 12) UII UII UU IIU – UU III UII

19 అతిధృతి 451383

ఆ నభమందున సూర్యుండు జనెన్ – హర్షారుణము సంధ్యయు

ధేనువు లెల్లెడఁ జేసెన్ సడులన్ – దేలే నవియు గాలిని

రా నను జూడఁగ వేగం బిటకున్ – రమ్మో భ్రమరకుంతల

వేణువు నూదెద నాదమ్ములతో – ప్రేమాకృతిగ వింతల

భృంగ లేక మానిని లేక మదిరా – ఏడు భ-గణములు, ఒక గురువు, యతి (1, 11), ప్రాసయతి (1, 13) (ఇది ఒక సార్థకనామ వృత్తము)

22 ఆకృతి 1797559

భృంగము లెల్లెడ పాడెనుగా – విరి

రంగులు శోభల గూడెనుగా

శృంగముపై హిమ రాశులుగా – చిఱు

కొంగ లెసంగెను బారులుగా

తుంగములైన తరంగిణులే – తొల

చెంగులు దూర్పున రాగములే

రంగని జూచిన మోదములే – రస

గంగ యొనర్చెడు నాదములే

శరషట్పదివలె (లక్షణములు తఱువాత) ఒక షట్పదిగా భృంగ –

నింగిని జూడుము

రంగుల వార్ధి త-

రంగము లెల్లెడ – రమ్యముగా

భృంగము లీ వన

రంగమునన్ గుసు-

మాంగములన్ గడు – మంగళమై

క్రింద కొన్ని తుమ్మెద పేరితో నుండే కొన్ని జాతి పద్యములను మీకు అంద జేస్తున్నాను –

రసికా లేక తుమ్మెద – షట్పద, 11 మాత్రలు, ప్రాస, అంత్యప్రాస, చివర లఘువు

రమ్మిట విడి యెటఁ బోకు

సొమ్ములు నీవే నాకు

తుమ్మెద పాటలఁ బాడె

కమ్మగ నాటల నాడె

రమ్మిట రసికా వేగ

యిమ్మిల సిరిఁ దులదూఁగ

కన్నడములో షట్పదులు ప్రసిద్ధములు.  షట్పదలలో కావ్యములే వ్రాయబడినవి.  క్రింద కొన్ని కన్నడ షట్పదులకు ఉదాహరణములు –

భోగషట్పది – 3,3,3,3 / 3,3,3,3 / 3,3,3,3-3,3,2 మాత్రలు

పూవు లెల్ల లతలపైనఁ

బ్రోవులుగను గదలుచుండెఁ

ద్రోవ లెల్లఁ గంబళములు – తోటలోపలన్

జీవనమ్మునందుఁ గ్రొత్త

చేవ గలిగెఁ జెలువు నిండె

భూవనితయు భోగమతిగఁ – బొంగుచుండెగా

శరషట్పది – 4,4 /4,4 / 4,4-4,2 మాత్రలు

కరిగిన హిమములు

ఝరియై పాడఁగ

మురియుచుఁ దీగలు – బూచెనుగా

శరములవలె సుం-

దరముగ ధరపై

బరుగిడె మృగములు – వందలుగా

కుసుమ షట్పది – 5,5 / 5,5 / 5,5-5,2 మాత్రలు

చూడుమా కుసుమములఁ

జూడుమా భ్రమరములఁ

జూడుమా ఋతు విదియు – సుందరమ్ము

ఆడుమా యాటలను

బాడుమా పాటలను

వేడుకలు నిండగా – వేగవేగ

భామినీషట్పది – 3,4,3,4 / 3,4,3,4 / 3,3,3,4-3,4,2 మాత్రలు

ఆమనీ మధు యామినీ శుభ

కామినీ మృదు గామినీ చిర

ప్రేమినీ ప్రియ మోహినీ నవ – శ్రీమణీ దరి రా

గోమినీ వర పద్మినీ సౌ-

దామినీ రస శోభినీ శ్రియ

భామినీ విద్యున్మణీ హృ-త్స్వామినీ త్వర రా

విషమ షట్పది – 4,5/4,5/4,5-4,2 మాత్రలు

మనసున నుండు యా

యణువుల నీవెగా

ననుదిన మిదియె నా – యనుభవమౌ

కనులిట విరియు నా

తనువది మురియు రా

ప్రణయపు నాదమై – పరుగులతో

తెలుగు షట్పద – (ఇం-ఇం) (ఇం-ఇం) (ఇం-ఇం-చం)

బేలను వదలకు – లీలలు జాలును – లీలాత్మ యిపుడు శ్యామా లలితా

కాలము గడిచెర – యాలన పాలన – జాలించ వెతలు భార మ్మయెగా

ఆలయ మయె హృది – మేలగు మాలల – మాలీ యొసఁగెద  మంగళకరమై

జాలము వలదుర – డోలలఁ దేలఁగఁ – గాలమ్ము వచ్చె దేవా కనరా

షట్పద రూపములో –

బేలను వదలకు

లీలలు జాలును

లీలాత్మ యిపుడు శ్యామా లలితా

కాలము గడిచెర

యాలన పాలన

జాలించ వెతలు భార మ్మయెగా

ఆలయ మయె హృది

మేలగు మాలల

మాలీ యొసఁగెద  మంగళకరమై

జాలము వలదుర

డోలలఁ దేలఁగఁ

గాలమ్ము వచ్చె దేవా కనరా

ఈ షట్పదలో రెండు కంద పద్యములు కూడ గర్భితమై ఉన్నాయి. అవి –

బేలను వదలకు లీలలు

జాలును లీలాత్మ యిపుడు – శ్యామా లలితా

కాలము గడిచెర యాలన

పాలన జాలించ వెతలు – భార మ్మయెగా

ఆలయ మయె హృది

మేలగు మాలల మాలీ యొసఁగెద  – మంగళకరమై

జాలము వలదుర  డోలలఁ

దేలఁగఁ గాలమ్ము వచ్చె – దేవా కనరా

తేటి – తేటగీతికి చివర ఒక చంద్రగణము, యతియో లేక ప్రాసయతియో చంద్రగణముతో కూడ చెల్లుతుంది. ఇది శ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులు గారి సృష్టి.

ఈ వసంతయామిని జూడు – భావములకు – రావముగా

ఈ ప్రశాంత నిశీథిని – యెంత హాయి – యెంత హాయి

ఈ యనంత వియన్వీథి – నెన్ని తార – లెంత కాంతి

నా కొకింత యానందపు – నవ్వు లిచ్చె – నవ్వుఁ దెచ్చె

వసంతకాలములో ఎక్కడ చూసినా పూవులే.  ఆ పూల చూట్టు ఎన్నో రకాల తుమ్మెదలే.  తుమ్మెదల వివిధ నామములతో విలసిల్లే పద్యములను కొన్నిటిని మనము పరిచయము చేసికొన్నాము.

 

 

 

4 thoughts on “తుమ్మెద పద్యములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *