May 19, 2024

సీతా స్వయంవరం – గౌసిప్స్

రచన: డా. జె. గౌతమి సత్యశ్రీ pic.-for-maalika

రచన: డా. జె. గౌతమి సత్యశ్రీ

 

స్వయంవరం అంటే స్వయంగా రాకుమారి తనను వరించడానికి వచ్చిన వరము (వరుడు) లలో తనకు నచ్చిన ఒకరిని  వరించడం. ఇది భారత దేశం లో రాజవంశీయుల్లో ప్రాచీన సాంప్రదాయం. రాకుమారి తండ్రి గాని, అన్న గాని ఈ స్వయంవర మహోత్సవాన్ని నిర్ణయించి పలుదేశాల రాకుమారులకు ఆహ్వానపత్రికలను రాయబారులద్వారా పంపేవారు. వధువు  ఒక్కొక్క రాజును తన పరిచారిక  పరిచయం చేస్తుంటే తనకు కాబోయే భర్తని తానే ఎంచుకొంటుంది. వరమాలను అతని మెడలో వేసి వరిస్తుంది, తదుపరి వెంటనే కళ్యాణమహోత్సవం జరుగుతుంది. తనకు కాబోయే వ్యక్తిని తానే స్వయంగా ఎంపిక చేసుకోవడం, వరించడంలో తాను పూర్తి స్వాతంత్ర్యము కలిగి ఉండడము గొప్ప సాంప్రదాయము.

హిందూ పురాణాల్లో ఇటువంటి స్వయంవర కధలు సమృద్దిగా ఉన్నవి, వాటిల్లోని కొన్ని మచ్చుతునకలు నలదమయంతి, సన్యోగితా పృధ్వీరాజ్, ద్రౌపదీఅర్జునులు, సీతారాములు మొదలైనవారి వివాహ ఘట్టాలు.

దమయంతి దేవుళ్ళ కోరికకు భిన్నంగా తన స్వయంవరంలో నలుణ్ణి వరించింది. ఇది మహాబారతంలోని కధ. నలదమయంతుల పరిణయం స్వయంవరానికి సరియైన ఉదాహరణ. ద్రౌపది, సీతల స్వయంవరాలను సమగ్రమైన స్వయంవరాలుగా చెప్పుకొనలేమని నా భావన. వారి స్వయంవరాల్లో రాకుమారులకు పరీక్ష పెట్టి, పోటీ నిర్వహింపబడినది. పోటీలో నెగ్గిన వారినే రాకుమారి వరించడం జరిగినది, స్వయంగా  తానే ఎంపిక చేసుకున్న మాదిరిగా లేదు. అర్జునుడు పైన తిరుగుతున్న మత్సయంత్రాన్ని క్రింద నీటి ప్రతిబింబం లో గురి చూసి, విల్లు ఎక్కుపెట్టి కొట్టి, ధనుర్విద్యా పరీక్షలో నెగ్గి, ద్రౌపదిని భార్యగా పొందెను. ఇక్కడ ద్రౌపది యొక్క ఇష్టాయిష్టాలతో పనిలేదు. శివధనుర్భంగంతో సీత, రాముని పెండ్లి ఆడడం కూడా ఈ వ్యత్యాసపు స్వయంవరం కోవకే చెందుతుంది.   కానీ ఈ వ్యత్సాసానికి ఒక విశిష్టత ఉంది.

rama164

జనక మహారాజు తనకు శివుడు కానుక గా ఇచ్చిన శివధనస్సుని ప్రతిరోజూ ఒక ప్రత్యేక రీతిలో పూజిస్తూ ఆరాధిస్తుండేవాడు. ఒక రోజు రాకుమారి సీత తన స్నేహితురాళ్ళతో ఆట పాటల మధ్య అలవోకగా శివధనస్సుని ఎత్తి వేరే చోట పెట్టి అక్కడినుండి వెళ్ళిపోయినది. ఇంతలో జనకుడు శివారాధనకు, శివధనస్సు పూజకు వేళయినదని వచ్చి ధనస్సు ఉన్నచోట కనబడక, మరియొక వైపున ఉండుట చూసి అవాక్కయ్యెను. చుట్టూన్నవారిని అడుగగా, సీత ముందుకి వచ్చి, తానే ధనస్సుని కదిలించెనని చెప్పినది. జనకుడా మాటకి అత్యంత ఆశ్చర్యమునొంది, అతి సుకుమారియైన రాకుమారికున్న బలము, శక్తి ని చూసి, ఆమె మానవ కాంత కాదని, ఆమె శక్తిస్వరూపిణి అని గుర్తించెను. ఆ శివధనస్సుని విరిచిన శక్తిమంతుడికే ఇచ్చి పరిణయం చేయవలెనని నిర్ణయించుకొనెను. రాత్రంతా ఆలోచించి ఆమె కై చాటించిన స్వయంవరంలో శివధనస్సుని విరిచిన వారికే తన కూతురినొసంగెదనని ఒక ప్రత్యేక మార్పును ప్రవేశపెట్టెను.   ఇది తండ్రి హృదయానికి ఒక గొప్ప ఉదాహరణ. కొడుకుని తనంతటి వాడిని చెయ్యాలని, తన తరువాతి పేరుని కొడుకే నిలబెట్టాలని కొడుకు యందు కోరుకుంటే, కూతురుని ఆమె అందచందాలకు, శక్తియుక్తులకు సరిపోయినవాడిని, తలని మించి తాడిని తన్నేవాడిని ఇచ్చి పెండ్లి చెయ్యాలని, అత్తవారింట సుఖసౌఖ్యాలతో తులతూగాలని కోరుకుంటాడు. రామాయణం లోని ప్రతిఒక్క ఘట్టం, ప్రతి ఒక్క పాత్రకు ఉన్న విశిష్టత నిజ జీవితంలో ప్రతి ఒక్కరి పాత్రలో అద్దం పడుతూనే ఉంటుంది.

స్వయంవరానికేతించిన యోధులందరూ శివధనస్సుని విరుచుటలో విఫలులు అయ్యిరి. జనకునకు,ఇతర సభాసధులకు కలవరము మొదలయినది. చక్రవర్తులు, యోధులు అందరూ విఫలులు అయినారు. తన కూతురుని చేపట్టగలిగే శక్తివంతుడే లేకపోయెనా? దేశ నలుమాలలనుండి వచ్చిన వారందరునూ అయిపోయినారు. ఇంతలో విశ్వామిత్రుని రామ, లక్ష్మణుల తోడ శుభాగమనం.  అంత జనకమహారాజు లేచి పరమానందంతో ఎదురువెళ్ళి విశ్వామిత్రుని, రామ లక్ష్మణులని తోడ్కొని వచ్చి ఆసీనులంగావించెను. సీతాదేవి మొదటిసారిగా తల ఎత్తి చూసి మొదటి చూపులోనే ఇష్టపడిన మొదటి వ్యక్తి శ్రీరాముడు. ఆ శ్రీరాముడే శివధనస్సుని విరివగలవాడని తన అంతరాత్మ చెబుతుండగా వెయ్యి కళ్ళతో ఆశలు నింపుకుని ఆ అసమాన ఘట్టాన్ని చూడడానికి ఎదురుచూస్తున్నది.

విశ్వామిత్రుడు కనుసైగతో శివధనస్సుని విరువమని రాముని దీవించి పంపెను. జనకుడు ఒక రకమైన ఆశ్చర్యంతో నోటమాట రాక “ ఆహా!! విధి ఎంత బలీయమైనది, ఈ కుర్రవాడు ఇంకను పట్టాభిషిక్తుడుకూడా కాలేదు, మహా మహా రాజులు, రారాజులు, యోధులు విరివలేని శివధనస్సుని, ఈ ముక్కుపచ్చలారని వాడు ఆ  విరువగలడా?” అనుకొనెను…

ఆకాశాన ముక్కోటి దేవతలు శుభాశీస్సులను అందిస్తుండగా,  పూల వర్షం కురిపించుచుండగా రాముడు ఆసీనము పైనుండి లేచి శివధనస్సువైపు నడిచెను….ఆ పై సీతారాముల కళ్యాణము  జరిగెను.

సీతారాములకళ్యాణంచూతమురారండి!

చంద్రకాంతులు తేనెచుక్కలుగ మారి

దివి తారకలు గులాబీలుగ పేరి

మలయమారుతం సుగంధాలు వెదజల్లి

రంగరించిన రంగరింపు మా సీత

పన్నీటిజలకమాడి పుష్పాంజలి చేతబట్టి

స్వయంవరమునకరుదెంచె వరమాలతోడ

ఎందరో రారాజులు.. కాంచన సీతనుంగాంచి

మతిపోయి శ్రుతితప్పి శివధనుఁ విరువ తన్నలాడె

 

సీతమనస్సునెరింగిన శివధనస్సు వింటినారితో పలికె

ముదియ కోరిన మగడు శ్రీరాముడే రావలె ధనస్సు విరువ

వింటి నారి ధనస్సును కొంటెగా సైగ జేసి కిసుక్కున నవ్వి

రతీమన్మధులు సీతారాముల వైవాహిక సంభవానికి నాంది పలుక

ఎవ్వరు విరతురీ..శివధనస్సు..నా బోటి వింటినారినెక్కుబెట్టి

 

తలచినంతనే అరుదెంచె శ్రీరాముడు శివధనస్సు కడకు

క్రీగంట జూసె పూబాల సీతమ్మను వరమాలతోడ

చెయ్యిజాచి శివధనస్సును పేర్కొని శ్రీరాముడు ధనుర్భంగంగావించె

శ్రీరాముని చేతిస్పర్శకు వింటినారి ఒడలు పులకించె

 

ఆ ఉదుటున చిన్నారి సీత ఉల్లము ఊప్పొంగె

శ్రీరామునికి అంజలి ఘటించి వరమాల తో స్వయంవరించె

శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్య కేతెంచె..ఇక పెళ్ళి భోగొట్టా ఉరూరు వ్యాపించె

ఆ ఊరు, ఈ ఊరు ప్రతి ఊరు ముస్తాబించి పెళ్ళిపందిళ్ళు వేయించె

ఆణిముత్యాల తలంబ్రాల తో సీతారాముల మాంగల్యధారణ గావించె!

 

భారతంలో  అంబ, అంబిక, అంబాలికల స్వయంవరానికి భీష్ముడు వచ్చి, అక్కడి అందరితో యుద్దంచేసి తాను వివాహము చేసుకోవడానికి కాకుండా తన సోదరుడు విచిత్ర వీర్యుని కోసమై, ఈ ముగ్గురి అమ్మాయిలని లాక్కుని తీసుకుని పోయెను. ఆ తరువాతి కధ అందరికీ తెలిసినదే.

ఇక పోతే చారిత్రాత్మక ఉదాహరణలు తీసుకుంటే, 11 వ శతాబ్దంలో ఉత్తరప్రదేశంలోని కనౌజ్ రాజ్యాన్ని పరిపాలించే జయ్ చంద్ తన కూతురు సన్యోగితకు వివాహము చేయదలచి స్వయంవరం చాటించెను. సన్యోగిత తన శత్రు రాజు పౄధ్వీరాజ్ చౌహాన్ ప్రేమలో ఉన్నది. అతన్ని అవమానపరచుటకు పృధ్వీ విగ్రహాన్ని తయారుచేయించి ఒక ద్వారపాలకుని వలె అతని విగ్రహాన్ని స్వయంవరం లో ప్రవేశపెట్టించెను. సన్యోగిత తండ్రి మీద కోపంతో  స్వయవరంలో ఆ విగ్రహాన్ని వరించెను, పృధ్వీ అంతవరకు ఆ ప్రక్కనే దాక్కుని వెంటనే రాకుమారిని ఎత్తుకుని వెళ్ళిపోయెను (ఈ కధను వీకీపీడియానుండి గ్రహించబడెను)

ఈ స్వయంవర సాంప్రదాయం కేవలం హిందూ రాజ వంశస్థుల్లోనే కాకుండా, పర్షియా దేశస్తుల్లో కూడా ఉన్నట్లుగా దాఖలాలు ఉన్నాయి. కానిస్టంట్ నోపుల్ ని పరిపాలించే కైసర్ చక్రవర్తి కూతురు కితయూన్ తన స్వయంవరంలో ఒక ఇరానియన్ ని వరించినదని కూడా చెప్పబడుతుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *