May 7, 2024

హ్యూమరథం – 5

అసలు పెళ్లిలో కొసరు పెళ్లి…

రచన: రావికొండలరావు ravikondala

ఆచంట దగ్గరలో ఒక గ్రామం. ఆ గ్రామంలో సినిమా షూటింగు. ఎపుడూ? సంవత్సరాల క్రితం. బ్లాక్ అండ్ వైట్ రోజులు. ఆ సినిమా పేరు గుర్తుకు రావడం లేదు. ఎంచేతంటే సినిమాకి నామకరణం చివరి దశలో జరుగుతుంది – మనుషులకి తొలి దశలో జరిగినట్టు కాకుండా. అంచేత, కొన్ని సినిమాల పేర్లు నోట్లో ఆడవు. అలాంటి సినిమాలు థియేటర్లలో కూడా ఆడవు. ఇంక పేరు గుర్తుండడం అనేది కల్ల. ఆ సినిమా డైరెక్టరు (పేరు చెప్పొచ్చా?…. చెబితే బావుండదేమో…. బావుండేదేమిటి? నిజమే కదా, ఆయనే కదా డైరక్టరు! జరిగిన విషయమే కదా.. కచ్చితంగా చెప్పొచ్చు… ఐనా ఎందుకులే.. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, గోప్యంగా వుంచుదాం)నిర్మాత కూడా. అది వాళ్ళ వూరే గనక, చాలా విషయాలు కలిసి వస్తాయని అక్కడే షూటింగ్ ప్లాన్ చేశారు.

ఆ సినిమాలో పెళ్ళి దృశ్యం వుంది. బాగా తియ్యాలని దర్శకుడికీ వుంది. ఆలోచించగా, ఆ వూళ్ళో ఒక పెద్దమనిషి గారి అమ్మాయిగారికి పెళ్ళి. ఆ పెళ్ళిలోనే మన షూటింగు కూడా పెట్టేస్తే, ఎంతోమంది పెళ్ళి పెద్దలు, పట్టు చీరలు కట్టుకుని స్ట్రీలు సమూహలు, భోజనాలు, హడావుడి… బ్యాండుమేళం, సన్నాయి మేళం ఖర్చులు కూడా వుండవు. పురోహితులు కూడా అక్కర్లేదు. వాళ్ళే వుంటారు. ఏముంది? ఆ పీటల మీదనే హీరో హీరోయిన్లకు పెళ్ళి చేయించేస్తే సరి! ఈ అద్భుతమైన ఊహకి రెక్కలొచ్చి, ఆ రెక్కలు వెళ్ళి ఆ పెళ్ళి పెద్దమనిషికి, విషయం వివరించి అనుమతి అడిగాయి. “పెళ్ళిలో షూటింగా? గందరగోళం అవుతుందేమో!” అని పెద్దాయన సందేహం వెలిబుచ్చితే, చిన్నవాళ్ళు “చాలా బావుంటుంది నానా. మనమందరం ఆ సినిమాలో కనిపిస్తాం. మేం కెమెరాకి దగ్గర్లో వుంటాం. పైగా మన పెళ్ళి అంతా సినిమాలో చూడవచ్చు. (అప్పటికి వీడియో రాలేదు మరి) ఒప్పుకో నాన్నా ఒప్పుకో” అని గోల చేశారు. పెద్దాయన ఒప్పుకున్నాడు. వెంటనే దర్శకుడు తప్పుకున్నాడు. తన బృందంతో విషయం చెప్పుకున్నాడు. పెళ్ళి పెద్దాయన్ని తన వేపుకి తిప్పుకున్నాడు.

పెళ్ళిరోజొచ్చింది. సందడే సందడి. అసలే పెళ్ళి సందడి. అందులో షూటింగు సందడి. దానికి తోడు ఊళ్ళో వున్న వాళ్ళు, పక్క గ్రామాల వాళ్ళూ కూడా హాజరై పోయారు.

సూర్యోదయంతో పాటు. పెళ్ళి చూడ్డానికి వచ్చినవాళ్ళు, షూటింగు చూడ్డానికి వచ్చినవాళ్ళూ మమేకం అయిపోయారు. కొంతమంది ‘అనతిథులు’ టిఫిన్లు తినేస్తుంటే పెళ్ళివారు పసికట్టి, వాళ్ళ చేతుల్లోని ప్లేట్లు లాగేసుకుని దూరంగా పంపించేశారు. కొంత రభస, కొంత గొడవా కూడా జరిగింది.

దర్శక నిర్మాత, ఎలాగూ పెళ్ళి దగ్గరికి వెళ్తున్నాం గనక, ప్రొడక్షన్ టిఫిన్లు తెప్పించలేదు. లైట్‌మెన్‌నీ, తక్కిన బృందాన్నీ అక్కడే తినమన్నారు. వాళ్ళు తినడానికి వెళ్తే, వడ్డించేవాళ్ళు తిరస్కరించారు-మీరెవరో మాకు తెలీదన్నారు. దాంతో వాళ్ళు ఇన్‌సల్ట్ ఫీలయి వెళ్ళిపోతే, ప్రొడక్షన్ మేనేజరు వెళ్ళి బతిమాలి తీసుకొచ్చి “వీళ్ళంతా మా షూటింగు బృందం బాబూ-, బాగా టిఫిన్లు పెట్టండి. మీమీద కూడా మంచి లైట్లు వేస్తారు; బొమ్మలో అందంగా కనిపిస్తారు-హీరో హీరోయిన్లకంటే…” లాంటి కబుర్లు చెప్పి రెండేసి ప్లేట్ల టిఫిన్లు పెట్టించాడు.

అంతలో ఒ అమ్మాయి వాళ్ళ దగ్గరకొచ్చి కాఫీ అందిస్తూ “లైట్‌మాన్ గారూ! లైట్‌మాన్‌గారూ! నా మీద బాగా లైటింగ్ వెయ్యరూ-అందంగా పడతాను” అంది. వాళ్ళంతా మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళు. తెలుగు రాదు. “సరిదా” అనేశాడు ఒకతను నవ్వుకుంటూ.

షూటింగ్ మొదలెట్టాలన్నారు దర్శకుడు, చాయాగ్రాహకుడూ. పెళ్ళి బట్టలతో హీరో హీరోయిన్లు రడీ అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు, తక్కిన పాత్రధారులూ మేకప్‌లు అవుతున్నారు. పెద్ద పెళ్ళిపందిరి. దాన్నిండా జనం. ఆ పందిట్లోనే ఒక మూల మేకప్‌లు జరుగుతుంటే, పెళ్ళ్లి వారంతా అక్కడ చేరి వింతగా చూడ్డం మొదలెట్టారు. అసలు పెళ్ళిలోనూ హడావుడిగానే వుంది. పురోహితులు తతంగం మొదలుపెట్టారు “ఒరెయ్ చిన్న శాస్తుల్లూ! కొబ్బరికాయ అందుకో” అని పెద్ద పురోహితుడు కేకపెడితే-ఏడీ! చిన్న శాస్తుల్లు మేకప్ చూస్తూ మురిసిపోతున్నాడు.

పెళ్ళికొడుకు తల్లి తండ్రి పీటల మీద కూచున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతూన్నాడు. కెమెరా వాళ్ళకి ఎదురుగా పెట్టారు. దీపాలు వెలిగిస్తున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడేగాని, ధ్యాసంతా ఆ దీపాలమీద, కెమెరా మీద వుంది. పెళ్ళి కొడుకు తల్లీ తండ్రీ తాము కెమెరాలో పడిపోతాం కాబోలని వెర్రిగా చూస్తున్నారు. తల్లి తన ముఖానికి పట్టు చీరచెంగు అడ్డువేసింది. అంతలో హీరో తల్లిదండ్రులు మేకప్‌లయి దుస్తులు వేసుకుని షాట్‌కు సిద్ధమయ్యారు.

“వాళ్ళిద్దర్నీ పీటల మీదనుంచి లెమ్మంటే మావాళ్ళిద్దరూ కూచుంటారు. మీరు అవే మంత్రాలు చదవండి. షాటు తీసుకుంటాను” అన్నాడు డైరక్టరు పురోహితుడితో. “ఇంకా ఈ తతంగం పూర్తికాలేదే” అని పురోహితుడు, “పర్వాలేదు. మళ్ళీ కంటిన్యూ చేదురుగాని. మాకు షూటింగ్‌కి ఆలస్యమవుతుంది” అని దర్శకుడూ వాదులాడుకున్నారు. ఈ గొడవల్లో పీటల మీదనుంచి అసలు వాళ్ళు లేచిపోవటం, యాక్టర్లు కూచోడం జరిగిపోయింది.

“మీకేం డైలాగుల్లేవ్. ఆయన మంత్రాలు చెబుతూ వుంటారు. ఆయన ఎలా చెప్తే అలా చెయ్యండి. ఆయనే డైరెక్టరు ఈ షాటుకి” అన్నాడు డైరక్టరు. పురోహితుడిని మంత్రాలు చెప్పమన్నారు. మళ్ళీ చెప్పాలంటే దీనికి సంభావన ఎవరిస్తారంటాడు పురోహితుడు.

“మేమిస్తాం కానీండి” అన్నారు ప్రొడక్షన్ వాళ్ళు. “లైట్స్…” అని ఓ కేక వినిపించగా, పురోహితుడు మంత్రాలు మొదలు పెట్టాడు. “ఆగండి.. నేను చెప్తాను. ఇప్పుడు చెప్పండి” అన్నాడు డైరక్టరు. దీపాలు వెలుగుతూవుంటే, ఎక్కడెక్కడ వున్నవాళ్ళూ దగ్గరకొచ్చేసి పీటల పక్కన నించున్నారు. కొందరు పురోహితుడి చుట్టూ మూగిపోయి కెమెరా చూస్తున్నారు.

“నేను కనబణ్ణా ఏమిటి… తప్పుకోండి” అని పురోహితుడూ, “తప్పుకోండి” అని అసిస్టెంటు డైరక్టరూ అరుస్తున్నారు. వెనకాల వున్న జనం అంతా పీటల మీద కూచున్న నటుల మీద పడిపోతున్నారు. “తోసుకోకండయ్యా బాబూ. మేం నలిగిపోతాం” అని హీరో తండ్రి గోలపెట్టాడు.

“ఆవిడెవరు సార్… మీ పక్కన కూచున్నారు?” అని ఒకడు ఆ సందులోనే అడిగాడు.

“నా భార్య వేషం!”

“పేరు?”

“ఉండవయ్య బాబూ.. షాట్ తియ్యాల్లి.. సైలెన్స్” అని డైరెక్టరు అరిచాడు. “తియ్యండి… తియ్యండి.. రెడీ టేక్” అన్నాడు డైరెక్టరు. పురోహితుడు మంత్రాలు మొదలెట్టాడు. “స్టార్ట్” అన్నాడు డైరెక్టరు. చాయాగ్రాహకుడు కెమెరాలోంచి చూసి, “సర్ అందరూ కెమెరాలోకి చూస్తున్నారు సార్…

ఎలా తియ్యడం” అన్నాడు జాలిగా.

“ఎవరూ కెమెరా వేపు చూడకండి. పురోహితుడి వేపు చూడండి..” అన్నాడు డైరక్టరు.

“ఆడి పక్క చూస్తే మా ముఖమేటి తెలుస్తాది? అని ఓ యువకరత్నం గొణిగింది. మొత్తానికి షాట్ పూర్తయింది.

ఈలోగా, కెమెరామెన్ పెళ్ళిపందిరి, జనం, బాజాలూ అన్ని షాట్స్ తీశాడు. శుభముహూర్తానికి వేళయింది. నిజం పెళ్ళికూతురుని గంపలో తీసుకొచ్చాడు. “ఆగండి ఓసారి ఆ గంప ఇవ్వండి బాబూ… మా పెళ్ళి కూతుర్ని కూడా తీసుకోచ్చేస్తాం” అని అసిస్టెంటు డైరెక్టరు అడిగితే, ఆ గంప ఇవ్వకూడదన్నారు వధూవరులు ఇద్దరూ కూచున్నారు. మధ్యలో తెర పట్టారు. “ఈ షాటు మనం కూడా తియ్యాలి కదు సార్” అని సహాయ దర్శకుడు గుర్తు చేశాడు. “అక్కర్లేదు. ఇదే తీసుకుందాం. పెళ్ళ్లికొడుకు వెనక్కి తిరిగివున్నాడు. అవే తెల్ల బట్టలు. తెరవెనుక పెళ్ళి కూతురు కూచుంది. తెలీదు” అని కెమెరామాన్‌కి చెప్పి షాట్ తీయించాడు డైరక్టరు – ఆనందపడిపోతూ.

“తాళికట్టు శుభవేళా…” అని పాడినట్టు ఆ శుభవేళ వచ్చేసింది. అందరికీ అక్షింతలు ఇచ్చారు. “పెళ్ళి కొడుకు తాళి కట్టేయగానే మన షాటు తీసుకుందాం రెడీ. హీరో హీరోయిన్లు ఇక్కడ వున్నారా” అన్నాడు దర్శకుడు.

అంతలో అసిస్టెంటు, డైరెక్టరు చెవిలో గొణిగాడు. “సార్ మనవాళ్ళు మంగళ సూత్రాలు తేవడం మరిచిపోయారు!”

“ఆఁ” అని కోపంగా అని, మళ్ళీ సర్దుకుని “పర్వాలేదులే వాళ్ళ మంగళసూత్రాలు అడుగుదాం. మళ్ళీ ఇచ్చేద్దాం” అన్నాడు డైరెక్టరు “ఫ్లాష్” తట్టినందుకు ఆనందపడిపోతూ.

“డైరక్టోరియల్ టచ్ అంటారు ఇదేనా గురూ?” అని సహాయకుడు అడిగాడు. “ఇదే” అన్నాడు డైరెక్టరు. పెళ్ళ్లి పెద్ద్దగారిని కలిసి మంగళసూత్రాలు ఓసారి ఇమ్మన్నారు దర్శకుడు. “అదెలా ఇస్తాం! ముందు మీరు మీ హీరోయిన్ మెడలో కడితే, అది మా అమ్మాయికి పనికిరాదు. పెళ్ళికొడుకు కట్టిన తర్వాత ఆ ముడి విప్పకూడదు అన్నాడు పెళ్ళి పెద్ద. ఈ చిక్కుముడి ఎలా విప్పడమో డైరెక్టరుకి అర్థం కాలేదు. టోపీ తీసి తల గోక్కున్నాడు.

సన్నాయి మెళం తారాస్థాయిలో వుంది. “మాంగల్యం తంతునానేనా” అంటున్నారు పురోహితులు. పెళ్ళికొడుకు తాళి కడుతున్నాడు. “ఎందుకేనా మంచిది! ఇదే షాటు తియ్యి….” అని డైరక్టరు, షాటు తీయించాడు అందరూ అక్షింతలు చల్లారు. “మనవాళ్లంతా ఎందుకు చల్లారయ్యా ? మన షాటుకి అక్షింతలుండవు” అని అరిచాడు డైరెక్టరు.

“వాళ్ళని లెమ్మనండి. మావాళ్ళు పీటల మీద కూచుంటారు పురోహితుడుగారూ” అన్నాడు డైరెక్టరు. “అలా లేవకూడదంటాడు. ఇంకా చాలావుంది. చదివింపులున్నాయి” అంటాడు పురోహితుడు.

వధూవరులు తలంబ్రాలు పోసుకుంటుంటే, అదీ షూట్‌చేశారు-వాళ్ళ భాషలో “సేఫ్టీ”కి. కెమెరామాన్ హీరో హీరోయిన్ల ముఖాలు షాట్‌లో తెలియాలి గనక, తాళికట్టడం కావాలంటాడు. క్లోజప్స్  తియ్యాలంటాడు.  తాళి లేదు! ఎవర్ని విప్పి ఇవ్వమంటే ఎవరిస్తారు?- అని ఘర్షణ. సప్తపది అవీ వున్నాయి, ఆ లైట్లూ గట్రా తీసి దూరం పెట్టమంటున్నారు పెళ్ళ్లివారు. డైరక్టరుకి విసుగొచ్చేసింది.. “చిన్న పెళ్ళిమంటపం సెట్టు వేసుకుని మద్రాసులో తాళికట్టేది తీసుకుందాం” అన్నాడూ. “తాళి కట్టిన తర్వాత పెద్ద సీనుంది. దానికి జనం వుండాలి. పెళ్ళి పందిరి కంటిన్యుటీ అవుతుందా? అంటున్నారు కెమెరామాన్, అసిస్టెంటూ. “చూదాంలెండయ్యా – సీను మార్చుదాం. ఘర్షణ సీను శోభనంలో పెట్టుకుందాం ప్రస్తుతానికి పేకప్ చెయ్యండి” అన్నాడు దర్శక నిర్మాత – విసిగిపోయి.

ఆ విధంగా “రసాభాసోపాఖ్యానం” ముగిసింది. “పెళ్ళీ సరిగా జరగలేదు, షూటింగూ సరిగ్గా జరగలేదు” అనుకున్నారు ఉభయ పార్టీలవారూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *