May 10, 2024

భార్యాభర్తలు – 3 (వెండితెర నవల)

రచన: ముళ్లపూడి వెంకటరమణ

హాసం ప్రచురణలు

హైదరాబాదు

Barya_Bhartalu

పద్మాక్షిలో ఎక్సరే అంశ కొంత ఉండి ఉండాలి. మనుషుల్ని కాకపోతే, మాటల్ని, నవ్వుల్ని ఎక్సరే తీయిస్తాయి ఆ కళ్ళు. “అబ్బే ఇప్పుడే ఎండలో వచ్చాను గదూ – మొహం అంతా అసహ్యంగా ఉంది. ఒక్కసారి బాత్‌రూంకెళ్ళి-” అంటూ గడుసుగా,  చొరవగా అటువేపు అడుగు వేసింది.

“ఓ ఓ బాత్‌రూమ్!” అన్నాడు ఆనంద్ ఎగిరి గంతువేసి అడ్డు నిలబడి.

“టాయిలెట్టయి వచ్చేస్తాను” అని వాక్యం పూర్తి చేసింది పద్మ ఏమీ ఎరగనట్టు.

“వద్దు వద్దు. నీ మొహం అసహ్యమేమిటి నీ మొహం అద్భుతంగా ఉంటే.”

“ఒక్క నిముషం.”

“ఒద్దు నా మాట విను.”

“కొంచెం” అంటూ ఆ పిల్ల ముందడుగేసింది.

“అయ్యయో! డేంజరు” అని ఘోషించింది ఆనంద్ హృదయం.

“అదికాదు నువ్వు అలా పక్కన నిలుచుంటే నాకెంత బాగుంటుందనుకున్నావు మరి” అన్నాడు మరిపిస్తూ.

“సరే” అని పద్మ.

“ఒరే! అన్నట్టు ధాటిగా కారు హారన్ మోగింది బయట. చచ్చాం ఎవరో దయచేస్తున్నట్టున్నారు.

“పద్మా నువ్వు బాత్‌రూమ్ కెళ్ళాన్నావుగా రా రా” అన్నాడు ఆనంద్ హఠాత్తుగా ఆమె చెయ్యి పట్టుకు లాగుతూ.

“వద్దులేండి నా ముఖం బాగుందన్నారుగా.”

“బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొద్దూ? ఫేస్ వాష్ చేసుకొంటే బ్యూటివుల్‌గా ఉంటుంది. పద” అంటూ ఆమెను అటుకేసి తోశాడు ఆనంద్.

“అబ్బ కాసేపుకూచుని మాట్లాడుకుందామండీ.”

“అమ్మయ్యో. తరువాత మాట్లాడుకుందాం పద  అయ్యో నడవమంటే!”

ఆనంద్‌కి మతిపోతోంది, అవతల జోడు చప్పుడు బరువుగా భయంకరంగా వినిపిస్తోంది. ఈసారి ఆడజోడు కాదు మొగజోడులాగే ఉంది. స్వగతంగా అనుకునే మాటలూ ప్రకాశంగా అనాల్సినవీ కలగాపులగం అయిపోయాయి.

వద్దు వద్దు అంటోంది పద్మ.

“అయ్యయ్యో డేంజరు పదపదా. సెంటు రాసుకురా” అంటూ తలుపు తీసి ఆమెను లోపలికితోసి, తలుపు మూసి హమ్మయ్య అనబోయి వీధిగుమ్మం కేసి చూసి కెవ్వుమనబోయి తమాయించుకొని “ఇదేమిటి మామయ్యా ఇలా సడన్‌గా వచ్చేసావు. ఒక ఉత్తరంరాస్తే నేనే స్టేషనుకే వచ్చేవాడివిగా. ఆ” అన్నాడు కంగారుగా.

“నీవు ఒక్క పని చేశావట్రా” అన్నాడు గుమ్మంలో నిల్చున్న మావయ్య నిష్టూరంగా.

“కూర్చో.”

మావయ్య కూర్చునేలా లేదు.  ” ఆ విషయాలన్నీ తరవాత మాట్లాడుకుందాంగాని-”

“ఊఁ-”

“రైల్లో దుమ్మంతా నా వంటి మీదే ఉంది”

“ఊఁ-”

“ముందు స్నానం చెయ్యాలి”

“స్నానమా?” అన్నాడు ఆనంద్ అదరిపడి.

“ఊఁ-” స్నానం- బాత్‌రూమ్ ఎక్కడా?’

ఆనంద్ గుండెలో రైళ్ళు పరుగెట్టాయి. మనసు మాట అంతా దుమ్ముకొట్టాయి. మావయ్య కంట్లో కూడా కాస్త కొట్టక తప్పదు.

“ఊ బాత్‌రూం.. మరీ ఈ రూములో ఉదయంనించి పంపులో నీళ్ళులేవు మావయ్యా” అన్నాడు.

“ఆ” అన్నాడు మావయ్య పరధ్యానంగా.

“ఇది సిటీ అన్నామాటే గాని వాటరే వుండదు” అని ఇంగ్లీషులో కూడా చెప్పిచూశాడు ఆనంద్.

“సరే అయితే కిందకెళ్ళి బావిదగ్గర స్నానం చేస్తా-”

ఆనంద్ పరమానందభరితుడైపోయి “అలాగే అలాగే పద.” అంటూ వీడ్కోలు ఉపన్యాసం ఆరంభించాడు. కాని బాత్‌రూమ్‌లో ప్రజలు – ముఖ్యంగా చెంబులు, గిన్నెలు మావయ్య కోసం ఆర్తనాదాలు ఆరంభించినట్లున్నాయి.

తక్షణం ఆనంద్ హాచ్ హచ్ అని తుమ్ములు ప్రకటించాడు.

“ఆఁ- ఈ తుమ్ములేమిట్రా” అన్నాడు మావఁయ్య.

“తుమ్ములు జలుబు-”

బాత్‌రూములో కలకల ధ్వనులు.. వీటి దుంపతెగా

“హాచ్ మావయ్యా హాచ్!”

ఎంత జలుబైనా తుమ్ములు ఎన్నిరకాలున్నా, వాటిలో గిన్నెలు బాల్చీలు కొట్టుకొన్నట్టు చప్పుడు చేసే తుమ్ములు ఎప్పుడూ వినలేదు మావయ్య. సిటీ తుమ్ములు ఆయన బాగా ఎరగడు.

“ఆ చప్పుడేమిటి” అన్నాడు నాటుగా.

“ఆ చప్పుడూ ఆ చప్పుడూ – పందికొక్కులు మామయ్య.”

“పట్టపగలు పందికొక్కులేమిట్రా” అన్నాడు మామయ్య అదొరకంగా చూసి.

“పందికొక్కులకి పగలేమిటి రాత్రేమిటి మావఁయ్యా!”

“ఆఁ!”

“అందులోనూ ఈ పట్టణం పందికొక్కులున్నాయే – మనం కాస్త పరధ్యానంగా ఉంటే నెత్తినెక్కి నాట్యం చేస్తాయ్!-హచ్.”

“ఊఁ-అయితే అట్లాగునే వెళ్ళి ఆ పందికొక్కులు సమాచారం” అంటూ, అదేదో చూడబోయాడు మావఁయ్య.

మేనల్లుడు చెంగున గంతేసి అడ్డుపడ్డాడు.

ఆ పందికొక్కుల సమచారం మావయ్య చూడవలసింది. చూడగలిగింది కాదు. ముందర వెళ్ళిన శాల్తీ, తరువాత తోయబడిన శాల్తీ  ఢీకొట్టుకొన్నాయి – హలోహలో అనుకోకుండానే. ఆ తరువాత కూడా ఇష్టాగోష్ఠి చర్చలు సాఫీగా జరగలేదు. ఇష్టం వచ్చినట్టు మాటలు విసురుకున్నాయి. అవి కలవలేదు. అందుకని చేతులు కలిశాయి. క్షణంలో కరచాలనాల ఘట్టం శృతి మించి, పరస్పర శిరశ్చాలనాలు (అచ్చ తెలుగులో ఒకరిజుట్టును ఒకరు పట్టుకొని గుంజడం) ఆరంభమయ్యాయి.

“వద్దు మావఁయా – ఆ పందికొక్కులు నేను చూసుకొంటాను గాని, నువ్వెళ్ళి స్నానం చేసిరా మావఁయ్యా” అన్నాడు ఆనంద్ దీనంగా.

“పర్వాలేదు” అన్నాడు మావఁయ్య సాహసంతో.

“నా మాట విను మావఁయ్యా – ఊరుకో, నేను చెప్పిన మాట విను.”

వెంకటరత్నం మావఁయ్యకి ఓపికపోయింది. కుతూహలం రెచ్చిపోయింది. “ఉండరా” అంటూ మేనల్లుడిని ఒక్క తోపు తోసి తలుపు తీశాడు.

“నా మాట విను మావఁయ్యా ! అయ్యయ్యయ్యో, చూడకూడదు మావఁయ్యా” అని ఆర్తనాధాలు చేశాడు ఆనంద్.

వద్దన్నపని చేసిన మావఁయ్య కూడా ఉత్తర క్షణంలో మేనల్లుడితో శృతి కలిపాడు అయ్యయ్యో అంటూ.

తలుపు తీసేసరికి ఒకసారిగా “పందికొక్కులు” రెండు శిఖపట్ల గోత్రాలు వర్ణించుకుంటూ – మరీ మనోహరం అనతగని రీతిలో ప్రవేశించాయి. కొంచెం అర్జెంటుగా రావడం వల్ల రెండూ మావయ్య కాళ్ళదగ్గిర పడి దొర్లసాగాయి.

“గోవిందా” అన్నాడు ఆనంద్ – భగవన్నామం తరచు తలచుకునేవాడు కాకపోయినా.

ఈ భక్తిరసం చూసి ఇంకో సమయంలో అయితే మావయ్య సంతోషించేవాడే గాని ఇది వేళగాని వేళ. “నీ పందికొక్కులు ఇవట్రా?” అన్నాడు.

“ఊఁ”

“ఆఁ!”

“ఊఁ”

ఈ అక్షరాభ్యాసం ఇలా సాగుతూనే వుంటుందని పెద్దాయన కొత్తపంథా తొక్కి “చూస్తారేం, అదండి అవతలకి” అని గద్దించాడు “పందికొక్కుల్ని.”

అమ్మాయిలిద్దరూ అయిష్టాగోష్టి వాయిదావేసి, లేచి చకచక బయటకి నడిచారు.

“లలితా!” అన్నాడు ఆనంద్.

ప్రణయ కలహాలు వచ్చి తను అలిగి వెళ్ళిపోతున్నప్పుడు అలాగే పిలిచేవాడు, లలిత వెనక్కి చూడగానే నీ హృదయం మరచిపోయావు అనేవాడు. తాను కిలకిల నవ్వుతూ వెనక్కిపరుగెత్తి అతని ఒడిలో వాలిపోయేది. అలాటి పిలుపేనని వెనక్కి తిరిగి “ఊఁ?” అంది లలిత.

“చెప్పులు” అన్నాడు ఆనంద్ నేలమీది ఆడజోడు చూపిస్తూ.

“ఇదట్రా నీవు చేసున్న పని?” అంది మావఁయ్య కంఠం.

ఆనంద్ జవాబివ్వలేదు. ఇంతకన్న కఠినమైన ప్రశ్నలు వస్తాయి. వాటికి సిద్ధపడాలి.

“ఇంతకూ హేమలత ఎవరు?”

“హేమలతా?- అబ్బే నాకేం తెలియదే?”

మేనమామ, దగ్గరకు వచ్చి భుజం తట్టాడు. “ఒరేయ్ అమ్మ పుట్టిల్లు మేనమావఁ దగ్గరట్రా? నాకంతా తెలుసు ఆ అమ్మాయి వ్రాసిన ఉత్తరం.”

డామిట్! అన్నంతపనీ చేసిందన్నమాట హేమ. “ఊఁ! చచ్చాం” అని గొణుక్కుని అది లాక్కొని మానేసి “అదంతా నమ్మొద్దు మావఁయ్యా, అబద్ధం!” అన్నాడు ఆనంద్.

“నీ మాట నిజమని మాత్రం నమ్మకం ఏమిటోయ్! వెంటనే పెట్టే బేడా సర్దు ఇంటికెళ్దాం. నేను వెళ్ళి హేమలత సమాచారం తెలుసుకొని వస్తాను” అన్నాడు మావఁయ్య కండువా భుజాన వేసుకుంటూ.

ఆనంద్ గుండె గుభేలుమంది. చదువో? కాలేజీయో? తన పాలిటి కామధేనువులు అవేం కాను. అవి లేకపోతే తనేం కాను! చదువు లేకపొతే తను బతకగలడా?

“మావయ్య మరి చదువో !” అని చూశాడు నీరసంగా.

“చదివింది చాల్లేరా…”

“అదికాదు మావయ్యా”

“ఏదికాదు? అక్కడ మీ నాన్న చిందులేస్తున్నాడు.. రెడీగా ఉండు. ఇప్పుడేవస్తాను… ” అంటూ బయటకు వెళ్ళిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *