May 12, 2024

ఏం బంధాలివి!!?? (తండ్రి – కూతురు)

రచన: పి.యస్.యమ్. లక్ష్మి
కిటికీలోంచి బయటకి చూస్తున్న వనజకు మూసివున్న ఎదుటి ఇంటి తలుపులు, కిటికీలు ఎప్పటిలాగే దర్శనమిచ్చాయి.  ఈ ఇంట్లోకొచ్చిన దగ్గరనుంచీ ఎదురింటి గురించే కుతూహలంగా వుంది తనకి.  ఆ ఇంట్లో  మనుషులు తిరుగుతున్నా, తాళం వేసివున్నా అంత పట్టించుకునేది కాదేమో.  ఇంట్లో  మనుషులున్నారు. ఆ ఇంట్లో తండ్రీ, కూతురూ వుంటారని చెప్తారు. కానీ ఎప్పుడూ తలుపులు తియ్యరు.  సొంత ఇల్లు.  ఇంటిగలవాళ్ళ గోల లేదు.  పాల మనిషీ, పని మనిషీ .. అసలు ఎవరూ ఆ ఇంటివైపు రారు.  అంత వీధి మొహం చూడకుండా కూతురేం చేస్తుందో ఎప్పుడూ ఇంట్లో వుండి.  ఎందుకనోగానీ పేపర్లో చదువుతున్న అనేక ఘాతకాలు వనజ మెదడులో కందిరీగల్లా రొద పెట్టేవి ఎప్పుడు ఆ ఇంటిని చూసినా.     కానీ తనే  సర్ది చెప్పుకునేది.  మనుషులు కనబడనంతమాత్రాన అన్ని కేసులూ అలాంటివే వుంటాయా అని.
తామా ఇంట్లోకొచ్చి ఆరు నెలలు దాటుతోంది.  ఇప్పటిదాకా ఆ ఇంట్లో ఎవరూ కనబడలేదు.  ఆ తలుపులు ఏ సమయంలోనూ తీసిలేవు.  ఎప్పుడన్నా ఒకాయన మాత్రం బయటకి వెళ్ళి ఏవో తెస్తూ కనిపిస్తాడు.  బహుశా ఇంట్లోకి అవసరమైన సరుకులేమో.  బక్క చిక్కి, కళ్ళల్లో ప్రాణాలున్నట్లున్న ఆయన్ని చూస్తే ఆయనా కూతురూ  ఆ ఇంట్లో, ఎవరి మొహాలూ చూడకుండా, ముఖ్యంగా ఎవరితోనూ మాట్లాడకుండా ఎలా వుంటారో అని తలచుకున్నప్పుడల్లా వనజకి తన తండ్రి, తమ చిన్నతనం గుర్తొస్తాయి.
సంఘజీవి అన్న మాటకి సరైన నిర్వచనం వనజ.  తన ఇల్లు, తన బాధ్యతలు, పనులు అయ్యాక ఇరుగు పొరుగుని పలకరించటం, అవసరమైతే సహాయం చెయ్యటం, అడిగితే సలహా చెప్పటం, కాస్తో కూస్తో సంఘ సేవ, ఇలా కాలక్షేపం చేస్తుంది.  ఇంక చేసే పనేమున్నది.  పిల్లలు చిన్నప్పుడే వెంకట్ తనచే ఉద్యోగం మాన్పించేశాడు.  డబ్బుకోసం నువ్వు ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదుగనుక ఇంట్లో పిల్లల్ని చూసుకో, మనముండి వాళ్ళని ఆయాలమీదా, క్రెచ్ లోనూ వదిలెయ్యటం నీకూ ఇష్టం వుండదుకదా.  వాళ్ళని చూసుకుంటూ నీ కాలక్షేపానికి నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను అడ్డు చెప్పను అన్నాడు.
వెంకట్ మాటలను కాదనే అవసరం, అవకాశం తనకు లేవు.  అలా అలా గతంలోకి తిరుగుతూ వెళ్తున్న చక్రాలు తన చిన్నతనంలోకి వెళ్ళాయి.   తల్లి దండ్రులకి ముగ్గురు సంతానం. తన పదో ఏటనే తల్లి పోయింది. తనే పెద్దదికావటంతో, తమని చూసేందుకు వేరెవరూ లేకపోవటంతో, పదేళ్ళకే  ఇద్దరు చెల్లెళ్ళకి తల్లిగా మారింది.  వారి ఆలనా పాలనా చూడటమేగాక వాళ్ళ సహాయంతో వంట కూడా చేసేది.  తండ్రి లాయర్.  ఒక్క కేసు లేకపోయినా పోజులకి మాత్రం తక్కువ లేదు.  ఎప్పుడూ స్నేహితులతో పేకాట.  ఒకే ఒక్క సుగుణం ఏమిటంటే ముందు రూమ్ వదిలి ఎవరూ లోపలకొచ్చేవాళ్ళు కాదు.  తండ్రి మాత్రం సరిగ్గా భోజనం టైముకి ఇంట్లోకొచ్చేవాడు.  వండిన దాంట్లో పిల్లలకి వుందో లేదో కూడా చూసుకోకుండా తనకి కావాల్సింది తిని మళ్ళీ ముందు గదిలోకి వెళ్ళిపోయేవాడు.  ఇంట్లో అత్యవసరమైన సరుకులు నెలకోసారి తెచ్చి పెట్టేవాడు.  అంతే.  అదే తల్లిలేని పిల్లల గురించి  తండ్రిగా ఆయన తీసుకున్న బాధ్యత.  ఈ లోపల ఇంట్లో సరుకులు వున్నా, అయిపోయినా, పిల్లలు ఏం తిన్నా, అసలు తినకపోయినా ఆయనకి పట్టలేదు.   ఆ పరిస్ధితుల్లో అంత చిన్న వయసులోనే ఆరిందాలయిపోయారు తనూ, తన చెల్లెళ్ళు.
చెల్లెళ్ళిద్దరూ ఇంకా చిన్నవాళ్ళు.  స్కూలు చదువుల్లోనే వున్నారు.  తనుకూడా పరిస్ధితులను గమనించి, టెన్త్ క్లాస్ అయ్యాక  పై చదువులనక, అన్నా తండ్రి చదివించడని తెలిసి, టైపు, షార్టుహేండ్ నేర్చుకుంది. అవి నేర్చుకుంటే ఉద్యోగం తొందరగా వస్తుందని కనుక్కుని మరీ చేర్పించాడు వాటిలో తన తండ్రి.  షార్టుహేండు  ప్రాక్టీస్ చెయ్యటానికి రూళ్ళ పేపర్లు తేవటానికి కూడా ఎంత తిట్టేవాడు.  అక్కడికీ పుస్తకాలు కొంటే ఖర్చు ఎక్కువవుతుందని రూళ్ళ పేపర్లు తెమ్మని వాటిని కట్ చేసి పుస్తకంలా కుట్టుకునేది.  షార్టుహేండ్ కి ఎంత ప్రాక్టీసు చేస్తే అంత మంచిదని మాష్టారు చెప్పేవారు.  ప్రాక్టీసు చెయ్యాలని తననుకున్నా కాయితాలు నాన్న తెచ్చేవారు కాదు.  అందుకే ఒకసారి రాసిన కాయితాలలో రాసింది చెరిపేసి, ఇంట్లో మళ్ళీ వాటిమీదే ప్రాక్టీసు చేసేది.
ఒకటా రెండా  ఎన్ని ఇబ్బందులు పెట్టాడు కన్నతండ్రి అయికూడా.  ఏ కొంచెం చికాకు వచ్చినా గొడ్డును బాదినట్లు బాదేవాడు తననీ, చెల్లెళ్ళనీ.  చెల్లెళ్ళని ఓదార్చటానికి తనుంది, తనని ఓదార్చటానికి…?  తండ్రంటే అమ్మ వున్నప్పుడు వున్న అభిమానం రాను రానూ తగ్గుతూ వచ్చింది.  అమ్మ వుండగా కూడా తండ్రలాగే వుండేవాడనీ, అమ్మే తమకా సంగతులేమీ తెలియకుండా సమర్ధించుకొచ్చిందనీ, జబ్బు చేస్తే మందుకూడా ఇప్పించకపోవటంవల్ల, అలాంటి భర్తతో భరించిన దిగుళ్ళవల్ల తమని తండ్రివున్న అనాధలను చేసి అమ్మ పై లోకాలకు వెళ్ళిపోయిందని తనకి ఊహ వచ్చిన కొద్దీ తెలియవచ్చింది.
అందుకే తనకి ఉద్యోగం వచ్చిందని తెలియగానే చాలా సంతోషం వేసింది.   ఇంకనుంచీ తనకీ నెలనెలా జీతం వస్తుంది.  తనూ, చెల్లెళ్ళూ మంచి బట్టలు కొనుక్కోవచ్చు. కావాల్సినవి తినచ్చు.  చెల్లెళ్ళు ఏం చదువుకుంటానంటే ఆ చదువు చెప్పించచ్చు.  అలా ఎన్నో ఊహలతో ఉక్కిరిబిక్కిరయింది తను.  ఆ ఊహలే అక్క చెల్లెళ్ళ ఊసులయి నెల గిర్రున తిరిగింది.
ఆ రోజు తనకి జీతం వచ్చే రోజు.  అక్క చెల్లెళ్ళు ముగ్గురూ ఎంతో మురిసిపోతున్నారు.  ముందు చెల్లెళ్ళకి మంచి స్వీట్ తెచ్చి పెట్టాలి.  ఒక పూట తను చేసిన పప్పో, కూరో, మజ్జిగ నీళ్ళు, రెండో పూట పచ్చడీ మజ్జిగ నీళ్ళు, అవీ తండ్రి మిగిల్చిన దానిలో సర్దుకు తినటం తప్పితే వేరే తిండి తెలియదు తమకు.  వివరాలు తమకి తెలియదుగానీ చుట్టాలెవరూ అమ్మ వున్నప్పుడు కూడా తమ ఇంటికి వచ్చేవాళ్ళుకాదు, తమని వాళ్ళిళ్ళకి పిలిచే వాళ్ళుకాదు.   పక్కింటావిడ పిల్లలవస్త పడుతున్నారని జాలిపడి ఎప్పుడన్నా చాటుగా ఏమైనా తినే పదార్ధాలిచ్చినా, ఎలా కనిబెట్టేవాడో, డేగలాగా వచ్చి, పిల్లలకుందా లేదా అని కూడా చూడకుండా తనక్కావాల్సింది తను తిని వెళ్ళేవాడు.  పెద్దవాళ్ళకే అంత తిండియావ వుంటే చిన్న పిల్లలకి వుండదా.  కానీ తమ తండ్రికోసం, తాము బతకటంకోసం ఎన్నో త్యాగాలు చేశారు తమ అక్క చెల్లెళ్ళు.
ముందు గదిలో ఎప్పుడూ తండ్రి, ఆయన స్నేహితులు వుంటారు గనుక స్కూలుకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడే తాము వీధి ముఖం చూసేది.  పిల్లల్ని తల్లి దండ్రులు స్కూలు దగ్గర దింపుతున్నప్పుడు, వాళ్ళ గురించి టీచర్లతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళని బుజ్జగిస్తున్నప్పుడు, వాళ్ళకి కావాల్సినవి కొని పెడుతున్నప్పుడు ఇలా ఎన్నోసార్లు తనూ, చెల్లెళ్ళూకూడా లేని తల్లినీ వున్న తండ్రినీ తల్చుకుని బాధ పడేవాళ్ళు.  అప్పటినుంచీ తనలో పెరిగిన ఆలోచన ఒక్కటే.  ఎలాగైనా తను బాగా చదివి, మంచి ఉద్యోగం చేసి, కనీసం చెల్లెళ్ళ విషయంలోనైనా వాళ్ళ కోర్కెలు తీర్చాలని.
అందుకే ఈ జీతంతో చెయ్యాల్సినవి ఎన్నో వున్నాయి.  కొండంత ఆశతో జీతం తీసుకుంది.  దోవలో చెల్లెళ్ళకి స్వీటు తీసుకుని ఇంటికొచ్చింది. తను రావటం చూడగానే ముందు గదిలోంచి తండ్రి లోపలకొచ్చాడు.
‘జీతమేది?’  చెయ్యిజాపుతూ అడిగాడు.  తనిది ఊహించలేదు.  తన జీతం నాన్న అడిగి తీసుకుంటాడనే ఆలోచనే తనకి రాలేదు.  ఎంత పొరపాటయింది.
‘నాన్నా, చెల్లెళ్ళకి బట్టలు కొనాలి.  చిరిగిన వాటితోనే స్కూలుకెళ్తున్నారు.  నేనూ రెండు చీరెలు కొనుక్కోవాలి.  రోజూ ఆఫీసుకెళ్ళాలికదా’…నసుగుతూనే చెప్పింది.
‘ఎప్పుడూ వుండే గోలలే ఇవి.  ఏం కొత్త చీరెల్లేకపోతే ఆఫీసుకెళ్ళలేవా?  ఇన్నాళ్ళూ మిమ్మల్నందర్నీ మేపటానికెంతయిందో తెలుసా?’  అరుస్తూ తన భుజాన వున్న హేండ్ బాగ్ ని లాక్కుని పరాపరా జిప్పులు తీసి డబ్బులు తీసుకుని వెళ్ళబోయాడు.  అడ్డుపడ్డ తననీ, చెల్లెళ్ళనీ ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.  ఎంతో ఆశగా ఎదురు చూసిన రోజున తాము ముగ్గురూ బాగా దెబ్బలు తిని ఏడుస్తూ పడుకున్నారు.  తండ్రి మాత్రం వంట చెయ్యలేదని చూసి, తను తెచ్చిన స్వీట్ తిని పడుకున్నాడు.  ఎలా తినబుధ్ధేసిందో!?
మర్నాడు ఈ దిగులుతోనే ఆఫీసుకి వెళ్ళింది.  కొలీగ్ స్నేహ కనిబెట్టింది తన ఉదాసీనతని.  నెమ్మదిగా లంచ్ టైమ్ లో మాట కలిపింది.  స్నేహలోని స్నేహశీలతకు తన మనసుకరిగి నీరై, కడుపు చించుకుని కాళ్ళమీద పడింది. అప్పటి దాకా ఎవరికీ చెప్పుకోని గుండెల్లో ఘోష కట్టలు తెగి ప్రవహించింది.  అంతా విన్న స్నేహ ఆశ్చర్యపోయింది.  ఆమెకి తండ్రి అంటే పిల్లల బాధ్యత తీసుకునేవాడు అనే తెలుసు.  ఇలాంటి తండ్రులుంటారని ఇప్పుడే విన్నది.  ముందు నమ్మలేకపోయింది.  కానీ వనజని చూస్తే నమ్మక తప్పలేదు.  ఏం చెప్పాలో తోచలేదు.  బయటవాళ్ళేదో చేస్తున్నారంటే చెంప పగలగొట్టు అని ఆవేశంతోనో, ఇంట్లోవాళ్ళకి చెప్పు అని ఆలోచనతోనో చెప్పేది.  కానీ కంచే చేను మేస్తే!!?
గుండెలో భారం దించుకుని తేలికపడిన మనసుతో తను, ఆలోచనల భారంతో స్నేహ, మౌనంగా వున్న సమయంలో వెంకట్, ఇంకొక కొలీగ్ వాళ్ళ దగ్గరకొచ్చాడు.  అతడు మంచివాడనే అభిప్రాయం వాళ్ళకేగాక ఆఫీసులో అందరికీ వుండటంవల్లా, వాళ్ళు వున్న పరిస్ధితులవల్లా వెంకట్ తన విషయం కల్పించుకుని మాట్లాడుతున్నా మౌనంగా వుండిపోయారు.
వెంకట్ తననడిగాడు. ‘ మీరు మీ చెల్లెళ్ళ జీవితాలు చక్కదిద్దాలనుకున్నారు కదా?’
కొత్త మనిషి తమ విషయాల్లో కల్పించుకుంటున్నాడనే భావం కూడా రాలేదు మనసులోకెందుకో.
‘అవునండీ’
‘అయితే ఒక పని చెయ్యండి.  మీ నాన్నగారి దగ్గరనుంచి విడిగా వచ్చెయ్యండి మీ చెల్లెళ్ళతో.  అప్పుడు మీ జీతంతో వాళ్ళ బాగోగులు చూడచ్చు.’
ఆ సలహా స్నేహకు, తనకూకూడా నచ్చింది.  అక్కడే వుంటే తమ బతుకులు అలాగే వుంటాయి.  చెల్లెళ్ళుకూడా ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చూసుకుని, జీతం తండ్రికిస్తూ తాము ఎన్నేళ్ళయినా అవస్తలు పడుతూండాలి.  అందుకనే వెంకట్ చెప్పిన ఆలోచన బాగుందనిపించింది.  కానీ ఇల్లు దొరకాలి.  పైగా ముగ్గురు ఆడపిల్లలు, అందులో తండ్రి ఏ సమయంలో వచ్చి గోల చేస్తాడో తెలియదు, అలాంటివారికి ఇల్లు ఎవరిస్తారనే తన అనుమానాన్నికూడా వెంకటే పోగొట్టాడు.
‘మీరు ప్రస్తుతం బయట ఇల్లు తీసుకోవటం అంత మంచిది కాదు.  మీరున్న పరిస్ధితుల్లో మీ నాన్నగారేమన్నా గోల చేస్తే ఇంటిగలవాళ్ళతో ఇబ్బంది అవ్వచ్చు.  అందుకని మీకు మా అక్కయ్యగారింట్లో ఒక గది ఇప్పిస్తాను.  మా బావగారు పోలీసు ఇన్స్పెక్టర్.   వాళ్ళు చాలా మంచి వాళ్ళు.  మీకు అండగా వుంటారు.  మీరు ధైర్యంగా వుండి అవసరమైనప్పుడు వాళ్ళ సహాయం తీసుకోండి మొహమాటపడకుండా.’
మర్నాడే నాన్నతో పోట్లాడి కట్టు బట్టలతో ఇంటి బయటకి వచ్చేశారు అక్కచెల్లెళ్ళు ముగ్గురూ.  తండ్రి మరి ఏమీ తీసుకు వెళ్ళనివ్వలేదు..కనీసం బట్టలుకూడా.  వెంకట్ అక్క సుధ, బావ మనోహర్ చాలా సహాయం చేశారు.  వాళ్ళ ఇంట్లోంచి వంట సామాగ్రి, స్టౌ, పప్పులు ఉప్పు, బియ్యంతో సహా అన్నీ రూమ్ లో రెడీగా వున్నాయి వీళ్ళు వెళ్ళేసరికి.  కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు అక్క చెల్లెళ్ళు మీ ఋణం ఎలా తీర్చుకోగలమంటూ.  మీరు మీ జీవితాల్లో బాగా అభివృధ్ధిలోకి రండి.  అప్పుడు మా ఋణం తీర్చేసినట్లే అన్నారు వారు.
అన్నట్లే వెంకట్, వాళ్ళ అక్క, బావ తమకి చాలా సహాయం చేశారు.  జీతాల రోజున వచ్చే తండ్రితో పోట్లాడి  బయటకి పంపించేవాళ్ళు.  తమని మాయ చేసి తెచ్చారని పోలీసు కంప్లైంట్ ఇస్తానన్న తండ్రిని మనోహర్ హడలుకొట్టాడు.  ‘మీ ఇద్దరు కూతుళ్ళు మేజర్లయ్యారు.  వాళ్ళ కంప్లైంటుతో మిమ్మల్ని జైల్లో పెట్టించానంటే మళ్ళీ బయటకి రాలేరు.  ఇప్పటిదాకా తండ్రిగా వాళ్ళ సంగతి మీకు వీలయినంత చూశారు.  ఇప్పుడు వాళ్ళ భారం మీకు తగ్గింది గనుక మీరు హాయిగా వుండండి’  అని కొంత నచ్చచెప్పి, కొంత భయపెట్టి ఇంటి ఛాయలకు రాకుండా చేశారు.
రాను రానూ వెంకట్ కీ తనకీ మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది.  చెల్లెళ్ళకోసం పెళ్ళే మానేద్దామనుకున్న తనకు వాళ్ళు నచ్చ చెప్పారు.
‘మీ చెల్లెళ్ళు అక్కా వాళ్ళింట్లోనే వుండచ్చు, వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేదాకా నీ జీతం వాళ్ళకే ఇచ్చెయ్యి’ అన్నారు.
ఇన్ని చెప్పినా తన మనసులో వున్న శంక బయట పెట్టింది వద్దనుకుంటూనే.  ‘పిల్లలు పుడితే వాళ్ళకి తండ్రిగా అన్ని బాధ్యతలూ తీసుకుంటారా?  వాళ్ళకి తండ్రి ప్రేమకి లోటు రాకుండా చూసుకుంటారా?’  అని.  మన పిల్లలకే కాదు, నీ చెల్లెళ్ళని కూడా నేను నా పిల్లలుగా చూసుకుంటానన్నాడు వెంకట్.  అన్నట్లే అన్ని బాధ్యతలూ తీసుకున్నాడు.  చెల్లెళ్ళు బాగా సెటిల్ అయ్యారు.  మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళూ చేశారు. నాలుగేళ్ళ క్రితం తండ్రి కాలం చేశాడు.  చివరి సమయంలో ఆయనకే లోటూ లేకుండా దగ్గరుండి చూసుకున్నారు తనూ, చెల్లెళ్ళూ.  ఎంతయినా తమకి జన్మ ఇచ్చిన తండ్రి.  ఆయనలో మాత్రం చివరిదాకా పశ్చాత్తాపంగానీ, తమ మీద ప్రేమగానీ పెద్దగా కనబడలేదు.  ఎవరికోసం చేస్తారన్నట్లే ప్రవర్తించాడు.  అందుకే తమ బాధ్యతని నెరవేర్చామన్న తృప్తి తప్పితే తండ్రి పోయాడనే బాధ లేదు.  ప్రస్తుతం జీవితం ఏ ఒడిదుడుకులూ లేకుండా హాయిగా గడుస్తోంది.
పని మనిషి మణెమ్మ పిలుపుకి గతస్మృతుల్లోంచి బయటకొచ్చి వాకిలి తలుపు తీసింది.  వస్తూనే హాల్లో చతికిలబడుతూ ‘అమ్మగారూ ఇది విన్నారా?’ అంటూ మొదలు పెట్టింది మణెమ్మ.  ఎప్పుడన్నా మణెమ్మకి కబుర్లు చెప్పాలనిపిస్తే అలాగే చతికిలబడుతుంది వస్తూనే.  లేకపోతే తనని నానా హడావిడీ పెట్టేసి పని చేసుకెళ్ళిపోతుంది.
తనూ సోఫాలో కూర్చుంది మణెమ్మ ఏం చెబుతుందోనని. ‘ అమ్మా కలికాలమంటే ఇదే గామోసునమ్మా.  ఎంత పోయేగాలమయితే మాత్తరం ఇట్టా ఎవురన్నా చేత్తారా?’
‘ఏమిటి మణెమ్మా ఏం జరిగిందో చెప్పకుండా అట్లా అడిగితే నేనేం చెప్పేది?’
‘అదేనమ్మా ఎదురింటి గోపాలరావు లేడూ.  పేద్ద పాపాలరావు.  ఆడి సంగతేనమ్మా’
‘ఏమయింది ఆయనకి?  ఆయనసలు ఎక్కువ కనబడను కూడా కనబడడు కదా.’
‘ఆయనేటి ఆయన!?  అట్టాంటి దగుల్బాజీ ఎదవలకి మర్యాదకూడానా?  నిలబెట్టి తగలెట్టేయాల.  చేసే నిర్వాకానికి బయట తలెత్తుకెట్టా తిరుగుతాడులే.. అందుకే కనబడడు’  రుస రుసలాడింది మణెమ్మ.
‘ఇంతకీ ఏమైంది మణెమ్మా?’
‘ఆ ఎదవ కన్న కూతురుతోనే సంసారం చేత్తన్నాడంట’
‘ఛీఛీ అవేం మాటలు మణెమ్మా..కాస్త ఆలోచించి మాట్లాడద్దూ.  ఎవరో ఏదో అన్నారని నువ్వట్లాగే మోసుకొచ్చేయటమేనా?’
‘ఇట్టాంటి ఇషయాలు ఊకే పెచారం చెయ్యటానికి నేనేం ఆడికి మల్లే దగుల్బాజీని కాదమ్మా.  నిన్న ఆడు ఆ అమ్మాయిని కడుపు తీయించటానికి నాకు తెలిసినావిడ ..  అదే పద్దమ్మ అని చెబతానే, దాని దగ్గరకే తీసుకెళ్ళాడు.  ఇదొరుకు కూడా నాలుగు సార్లు ఇట్టాగే తీయించాడుట’.  ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలుపెట్టింది.
‘పద్దమ్మేమన్నా సదువుకున్నాదా ఏమన్నానా?  ఏదో దానికి తెలిసిన పసరు మందులేత్తది.  అక్కడికీ చెప్పిందట..ఇన్ని సార్లు ఆ మందులాడితే పెద్ద పేనానికే ముప్పని..మాట్టాడలేదంట ఆ పెద్ద మడిసి.  ఆ పిల్లేమో మొదట్టో ఏడిసేదట ఇప్పుడేమో ఏడవటానికికూడా ఓపిక లేనట్టు కళ్ళల్లో పేనాలు పెట్టుకునుందట.  మా పద్దమ్మని సచ్చిపోటానికేదైనా మందెయ్యమందంట.  అసలా అమ్మాయి ఈ మాటు బతుకుతుందో లేదో కూడా అనుమానమేనని జెప్పింది మా పద్దమ్మ’.
తన భయం నిజమైనందుకు బాధ పడింది వనజ.  మీడియా వల్ల కూడా ఇట్లాంటివాటికి ప్రచారం ఎక్కువై ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటున్నారేమో.  అట్లాంటివాళ్ళని వూరికే వదలకూడదు. కఠినాతి కఠినమైన శిక్ష విధించి, వాడు చేసిన పాపం కన్నా ఆ శిక్షని ఇంకా ఎక్కువ ప్రచారం చెయ్యాలి..మిగతా వాళ్ళు అలాంటి ఆలోచనకే భయపడేటట్లు.   పాపం! ఆ అమ్మాయెంత నరకం అనుభవించిందో ఇప్పటిదాకా.  వింటుంటేనే కంపరంగా వుంది.  ఏమైనా సరే ఆ అమ్మాయినా నరకంనుంచి తప్పించాలి.
తండ్రితో తమనుభవించిందే నరకం అనుకుంటే ఆ అమ్మాయి అనుభవించే బాధకి నరకమనే పేరుకూడా సరిపోదు.  అసలిలాంటి బాధ్యతలు లేనివాళ్ళు మనుషులుగా బతకటానికికూడా అనర్హులు.  ధృఢ నిశ్చయంతో ఫోన్ తీసుకుంది మనోహర్ కి ఫోన్ చెయ్యటానికి.  తమ అక్క చెల్లెళ్ళ జీవితాలు తీర్చి దిద్దిన వాళ్ళు, పైగా ఇప్పుడు పోలీసు డిపార్టుమెంటులో మంచి పొజిషన్ లో వున్నవాడు, అన్నింటికన్నా మించి అన్యాయాన్ని సహించనివాడు, తప్పకుండా సహాయం చేస్తాడు అనే నమ్మకంతో.  మణెమ్మ చెప్పింది నిజమే అయితే,   ఏమైనా సరే ఎదురుకుండా పాపాలరావుకి శిక్ష పడేటట్లు చెయ్యాలి.    మనోహర్ తో మాట్లాడాక, తనతోబాటు మణెమ్మ కూడా  కంప్లైంటు ఇస్తే ఆ అమ్మాయిని తప్పకుండా రక్షించవచ్చని మణెమ్మకి వివరించటం మొదలు పెట్టింది వనజ. అన్యాయం ఎక్కడున్నా ఎదుర్కోవాల్సిందే మరి.

**********

విశ్లేషణ:

“ఏం బంధాలివి?”—-పి.యస్.యమ్.లక్ష్మి
సృష్టిలో కొన్ని జంతువులు తమపిల్లల్ని తామే చంపుకుంటాయి. ముఖ్యంగా గండుపిల్లులు.. అందుకే పిల్లి తనపిల్లల్ని ఏడిళ్లు తిప్పుతుందంటారు. ఆ విధంగా చెయ్యడం.. తండ్రి పిల్లి నుంచి తన పాపాయిలని రక్షించుకోడానికే. (ఒక తండ్రి పిల్లి తన కూనల్ని మెడదగ్గర కొరికి చంపెయ్యడం.. తరువాత ఆ తల్లి పిల్లి పడిన హృదయ విదారకమైన వేదన, పిల్లలకోసం వెతుక్కోడం.. నేను స్వయంగా చూశాను).
అదే మృగతృష్ణ కొందరు మనుషుల్లో కూడా ఉంటుంది. మృగం నుండే కదా మనిషి ఉద్భవించింది మరీ! తండ్రీ కూతుళ్ల బంధం ఎంత అపురూపమయిందో మృగం వంటి మనుషుల్లో అంతే నికృష్టమయింది కూడా. స్వార్ధంతో తన సుఖం కోసం, సున్నితంగా ఆప్యాయంగా చూసుకోవలసిన తమ ముద్దు పాపల్ని అష్టకష్టాల పాల్జేసిన తండ్రులు కనిపిస్తూనే ఉంటారు. అటువంటి గండు పిల్లిలాంటి తండ్రినుంచి తననీ, చెల్లెళ్లనీ కాపాడుకున్న ఒక ధీరోదాత్త ‘వనజ’. తల్లి లేని పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన తండ్రి పదేళ్ల పసిపిల్ల చేత అడ్డమైన చాకిరీ చేయిస్తూ, వారి తిండి కూడా తను తినేస్తూ ఏమైనా అడుగుతే గొడ్డును బాదినట్టు బాదుతూ ఉంటాడు. కష్టపడి ఉద్యోగం సంపాదించుకుని చెల్లెళ్లని చూసుకుందామనుకున్న వనజ ఆశల్ని నిర్దాక్షిణ్యంగా దునిమేస్తాడు.. కూతురి జీతం అంతా పట్టుకుపోయి, పేకాటలో తగలేస్తూ.
చివరికి తన సహోద్యోగుల సహాయంతో ఇంటినుంచి బైటికెళ్లిపోయి, చెల్లెళ్లని కూడా పైకి తీసుకొస్తుంది వనజ. అక్కా, బావల సహాయంతో తమని ఆదుకున్న మంచి వ్యక్తి వెంకట్ ని వివాహం చేసుకుని, పిల్లా పాపలతో జీవితాన్ని చక్కదిద్దుకుంటుంది.
తన బాధ వేదన అంతా మనసుపొరల్లోకి, వెళ్లిన కొన్నేళ్లకి, తన తండ్రే నయం అనిపించే ఎదురింటి మానవ మృగాన్ని చూసి, ఆ తండ్రి అనబడే నరరూప రాక్షసుడి గురించి విని నిర్ఘాంత పోయిన వనజ, తనకెందుకులే అని ఊరుకోకుండా.. ఒక మానవతా వాదిలా ప్రవర్తించాలనుకుని ఒక నిర్ణయానికి వస్తుంది.
శ్రీమహాలక్ష్మిగారు చాలా సంవత్సరాలుగా రచనా వ్యసంగంలో ఉన్నారు. వివిధపత్రికలలో వారి కథలు వచ్చాయి, వస్తున్నాయి. బ్లాగుని కూడా నిర్వహిస్తున్నారు. తన రాత ఇంతే అని కృంగి పోకూడదనీ.. తండ్రయినాసరే పేగు బధాన్ని తెంచుకుని బైట పడవలసిందేననీ సందేశమిచ్చారీ కథలో.

 

9 thoughts on “ఏం బంధాలివి!!?? (తండ్రి – కూతురు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *