May 6, 2024

కుపిత ధాత్రి

రచన: ఆచంట హైమవతి
Global-Warming-Burning-Earth-HD

అమ్మా …అవనీ   మాతా…

నిత్య సౌభాగ్య దాయినీ-

క్షమాధరిత్రివైన   నీవు-

కుపితవైతివేమమ్మా…?

 

ఆకాశాన్నంటే  అంతస్తుల్ని-

నచ్చని  బొమ్మల్ని విరిచినట్లు,

మట్టుపెట్టావా?  నీవు  కినుకతో…

మందలించగనెంచి….ఇటుల-

శిక్షించ  బూనినచో – ఇక మాకు

దిక్కెవరు  మేదినీ జననీ…?

 

ఎంత  చెడ్డ  సంతానమైననూ-

ఓర్మి  వహించే  జగద్ధాత్రివి  నీవు…

నీకంత  ఆగ్రహమేల  వచ్చెనమ్మ?

మాపైన  నీకు  బద్ధ  శత్రుత్వమా??

 

భూగర్భాన  నెలవై  యున్న ఖనిజ –

ఐశ్వర్యాలను  స్వార్ధాన  కొల్లగొడుతున్న-

మా  మనుజజాతిపై  నీకు  క్రోధమా?

అందుకే  ఇట్లు  దండింతువా?…..?

 

నరకాసురుని  ‘సత్యాదేవి’ వై

వధించిన యట్లు  నీవునూ…

దుష్టసంతతిని   నిగ్రహించగనెంచి-

ఈ  ఘోరప్రమాదమును కల్పించితివా?

 

జరగినది  వెనుతిరిగి  పోదుగాని…

నీవు  త్వరలో   స్వస్థతనొంది…

శాంతిరూప  సంస్థితవై…

సంతుష్టాంతరంగవై….

అనురాగ    స్రవంతివై…

మమ్ములను…మా తప్పులను,

క్షమియించి ,  దయచూపి  వేవేగ-

కరుణతో  కాపాడుము  భువనేశ్వరీ

కన్నతల్లి , కల్పవల్లి , మురిపాలవెల్లి!!

 

******

 

5 thoughts on “కుపిత ధాత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *